శ్రీ గీతగోవింద కావ్యము
రచన, బొమ్మలు: డా. టి. సాయి కృష్ణ
పేజీలు: 700, వెల: రూ. 1100/-
ప్రతులకు: ప్రజాహిత పబ్లిషర్స్,
1-1-1/18/1, గోల్‌కొండ, క్రాస్ రోడ్స్
హైదరాబాద్- 500 020
కాఫీ టేబుల్ పుస్తకాలు అనే పద్ధతి తెలుగు ప్రచురణ రంగంలో ఇంచుమించు లేదు. పుస్తకాన్ని, ఉన్నచోటే ఉంచి, హాయిగా కాఫీ చప్పరిస్తూ, గంటల తరబడి ఆనందంగా చూచి (!) చదివే పుస్తకాలు ఈ రకం కిందకు వస్తాయి. పుస్తకానికి వంద రూపాయలంటేనే గుడ్లప్పగించే మనవారికి వెయ్యి రూపాయల పుస్తకం అంటే గుండె ఆగిపోతుందేమో? అందుకే ప్రసిద్ధ చిత్రకారులు సాయికృష్ణగారు ఈ పుస్తకాన్ని ఆంగ్ల, ఆంధ్రాలలో కలిసి వేయించి, మంచి ఆలోచనలగల పని చేశారు. డాక్టర్ సాయికృష్ణ గారు, వృక్షశాస్త్ర నిపుణులు, బోధకులు, పరిశోధకులు. కానీ, ఆయన పేరున్న చిత్రకారులుగానే పాఠకులకు, ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. అందమయిన బొమ్మలతో ఆయన ఎప్పుడో అందరినీ అలరించారు. ఒకే విషయం గురించి ఎక్కువ బొమ్మలు గీయాలనిపించింది ఆయనకు అది గీతగోవిందం ఎందుకు కాకూడదన్న ఆలోచన, అదే తన విషయమన్న నిర్ణయాలకు ఆయనను అభినందించాలి. ఎంతకాలం శ్రమించారో మరి, ఇదుగో ఈ సుందర దృశ్య కావ్యం మన ముందుకు వచ్చింది.
జయదేవకవి గీతగోవిందం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘సావిరహే తవదీనా’ కారణంగా అది తెలుగువారి ఇంట ప్రవేశించింది. నిజం చెప్పాలంటే ఈ 28 పాటల ‘కావ్యం’ అసలు సిసలయిన శృంగారం (అడల్ట్, ఎరోటిక్) వ్యవహారం. అర్థం పట్టించుకోనివారు, ప్రకృతి-పురుష తత్వంగా చూచేవారు, దీన్ని భక్తి సాహిత్యంలో చేరుస్తూ వచ్చారు. సాయికృష్ణగారు మాత్రం పాటపాటకే గాదు, పాటలోని ప్రతి చరణానికి మూర్తిమత్వాన్ని ఆపాదించి అందమయిన బొమ్మలు (రెండు వందల పైన) వేశారు. బొమ్మలు ఎంత బాగున్నాయో? ఎంత బాగున్నాయో? అంత బాగున్నాయి! అంత బాగున్నాయి.
ఈ పుస్తకంలోని బొమ్మలు కొన్ని కేవలం నలుపులు తెలుపు రేఖా చిత్రాలు. కొన్నింటికి ఒక రంగు మాత్రమే వేశారు. ఎక్కువ బొమ్మలు మాత్రం రంగుల్లో ఉన్నాయి. ముఖ పత్రం మీద డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అన్న మాటలున్నాయి. కానీ రంగుల బొమ్మలు కూడా కుంచెలతో రంగులద్దినవి కావు. వీటికంతా డిజిటల్‌గా, కంప్యూటర్‌తో రంగులు వేశారు. అయినా బొమ్మలు ఆకర్షణగలవిగా ఉన్నాయి. దశావతారాలు, మిగతా కొన్ని చిత్రాలలో స్థాపత్యం పద్ధతిలో అంగసౌష్టవం కనబడుతుంది. రాధామాధవుల చిత్రాలు, వారితో వచ్చే మిగతా వ్యక్తుల రూపాలు, ఫ్రీ హ్యాండ్‌గా కనబడతాయి. కాని వాటిలో సాయికృష్ణ కనబరిచిన పనితనం ముగ్ధమనోహరంగా ఉంది.
పనిలో పనిగా ఈ చిత్రకారులు గీతగోవిందం గురించి చాలా సమాచారం సేకరించారు. వ్యాఖ్యానాలను సేకరించారు. ప్రతి శ్లోకాన్ని, పాటను, నాగరిలిపితో బాటు ఇంగ్లీషు (ట్రాన్స్‌లిటరేషన్), తెలుగు భాషలలో కూడా పొందుపరిచారు. రచనకంతా ఇంగ్లీషు తెలుగు వ్యాఖ్యానాలు కూడా జత చేశారు. కనుక పుస్తకం సమగ్రమయింది. ఈ కార్యక్రమానికంతా పండితులు సాయం చేసినట్లు రాసుకున్నారు. ప్రవేశిక లాంటి వ్యాసాలు గానీ, వ్యాఖ్యానం గానీ, అకడమిక్‌గా లేకపోతే ఎవరూ ఎవరినీ తప్పుపట్టనవసరం లేదు.
గీతగోవిందం సంస్కృత రచన కదా? అది గీత్‌గోవింద్ ఎందుకయింది? సర్గల శీర్షికలోలోనే తేడాలున్నాయి. పాటలకు సూచించిన రాగతాళాల గురించి మరింత శ్రద్ధ అవసరం. మధ్యమావతి తాళం కాదు. ఒక శ్లోకాన్ని లేదా పాటను మూడు భాషల్లో అచ్చువేస్తే మూడు, మూడు దారుల్లో ఉన్నాయి. లెక్కలేనన్ని అచ్చుతప్పులున్నాయి. 275, 276 మరిన్ని పేజీల్లోని నాగరి అక్షరాలను ఎవరయినా పట్టించుకున్నారా? భారతీయ భాషలను ఇంగ్లీషులో రాయడానికి, అందరూ అంగీకరించిన పద్ధతులున్నాయి. వాటిని గురించి ఈ పుస్తకం పట్టించుకోలేదు. అ, ఆలకు పాటించిన పద్ధతిని ఇ, ఈలకు, ఉ, ఊలకు పాటించలేదు. ఇక మాటల విరుపు, (పదభంగం) గురించి ఎంత తక్కువ చెపితే అంత మేలు. నాగరిలో పాదమంతా ఒకటే పదం. తెలుగులో వీలుకొద్ది విరుపులు, ఇంగ్లీషు మేలు!
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంత అందంగా అచ్చు వేసిన పుస్తకంలోని ఈ స్ఖాలిత్యాలు, మనసుగల పాఠకుడిని కలతకు గురిచేస్తాయి. ఈ అందమయిన పుస్తకం తప్పకుండా మరోసారి అచ్చవుతుంది. అప్పుడు తగిన సంపాదకునికిచ్చి తప్పులు లేకుండా వేస్తే అది అర్థవంతంగా కూడా అవుతుంది.
Let us enjoy some good books!
^&**&^^&**&^
1 comment:
Post a Comment