Monday, September 5, 2011

On Taste!


ముక్కుందా?

మనకు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి శరీరంలో కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అవి చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ. ఇవిగాక వేడిమి, సమతూకం, నొప్పి, కాళ్ళు, చేతులు ఎక్కడున్నాయి? ఎంత వేగంగా కదులుతున్నాయన్న తెలివి, సమయం లాంటివి మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిని అంత సులభంగా మొదటి అయిదింట్లో ఒకదాని కిందకు లెక్కించడం కుదరదు. కనుక కాకున్నా కాసేపు వాటన్నింటినీ వదిలి వాసన, రుచుల సంగతి చూద్దాము. ఈ రెండు లక్షణాల గురించి కొన్ని నమ్మకాలున్నాయి.

రుచి సరిగ్గా తెలియాలంటే, తింటున్న వస్తువు వాసన కూడా తప్పకుండా తెలిసి ఉండాలంటారు. వాసన తెలియకుండా తింటే ఆపిల్, ఆలుగడ్డ, కారట్, చివరకు ఆనియన్ కూడా ఒకే రుచిగా ఉంటాయంటారు. ఇందుకు పూర్తిగా వ్యతిరేకమయిన వాదం ఇంకొకటి ఉంది. రుచికీ, వాసనకు అసలు సంబంధమే లేదు. వాసన తెలియకున్నా భోజనం అంతే రుచిగా ఉందంటుంది. ఈ రెండవ వాదం. ఇందులో ఏది నిజం? నిజానికి నిజం ఈ రెంటి మధ్యన ఎక్కడో ఉంది.
మొదటి నమ్మకాన్ని చాలా సులభంగానే పరీక్షించవచ్చు. నేనా ప్రయత్నం ఈ మధ్యనే చేసి చూచాను. ఒకావిడకను కళ్ళు, ముక్కు మూసుకొమ్మని, ఆపిల్, బంగాళాదుంప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి తినిపించాను. ఆవిడకు రుచి ఎంత తెలిసిందన్న సంగతి గురించి అంత ఖచ్చితంగా చెప్పలేను గానీ, రెంటి మధ్య తేడా మాత్రం సులభంగానే తెలిసిపోయింది. ఒకటి కొంచెం మెత్తన. రెండవది కసకస! ఇవి ఆవిడ చెప్పిన గుర్తింపు లక్షణాలు. మొత్తానికి రుచి మాత్రం పూర్తిగా తెలిసినట్లు లేదు. రుచి గురించి ఇంత గొడవ పడనవసరం లేదనిపిస్తుంది.

ఒక పదార్థాన్ని మనం నోట్లో వేసుకుంటాము. పళ్ళసాయంతో దాన్ని మెత్తగా నములుతాము. అప్పుడు మింగుతాము. ఆ జావలాంటి చిక్కని ద్రవం నాలుకమీదుగా పోతుంటే టేస్ట్ బడ్స్ అనే కణాలకు సంగతి తెలుస్తుంది. క్షణం లోపలే రుచి మెదడుకు తెలుస్తుంది. ఇది మన మనుకునే కథ. కానీ రుచి సంగతి అంత సులభం కాదంటున్నారు. మనిషి తల్లికడుపులో ఉండగా 14 వారాల వయసులోనే రుచి తెలియడం మొదలుతుందని కనుగొన్నారు. పిండం ఆ వయసులో ఉమ్మనీటిలో తేలుతూ ఉంటుంది. ఆ ద్రవం ఒక రకంగా పిండం నుంచి వచ్చే మూత్రం! ఆ నీటినిపిండం క్రమంగా పీల్చుకుంటూ ఉంటుంది. అందులో గ్లూకోజ్‌వల్ల తీపి, సోడియం కారణంగా ఉప్పు, మూత్రం కలిసినందుకు చేదు, రుచులు ఉంటాయి.

మామూలు మనుషులకు నాలుకమీద టేస్ట్ బడ్స్ అనే కణాలు ఉంటాయి. అవి కొన్ని నోట్లో మిగతా భాగాల్లో కూడా ఉంటాయి. మనకు ఉప్పు, తీపి, చేదు రుచులు తెలుస్తాయి. పరిశోధకులు ‘ఉమామి’ అనే మరో రుచి కూడా ఉందని ఈ మధ్యన అంగీకరించారు. కారం, పులుపులను కలిపే ఆస్ట్రింజెంట్ అనే మరో రుచి కూడా ఉందని మరోవాదం ఉంది. (మనవారు చెప్పే ఆరురుచుల సంగతి కొంచెం సేపు పక్కన పెడదాము). ఆస్ట్రింజెంట్‌లో వగరు కూడా చేరుతుందా?
మళ్ళా కథను ఒకసారి వెనకకు తిప్పితే రుచులు ఎన్నయినా, బాగా జలుబు చేసినప్పుడు తిండి రుచించదు. అంటే రుచిలో వాసనకు గట్టి స్థానమే ఉందని కదా అర్థం. ఈ సంగతిని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. జలుబుతో రుచి చెడుతుందన్నది నిజం మరి! మరెందుకు మనం, తిండిలోని వాసనను గురించి అంతగా పట్టించుకోవడం లేదు? మనకేమీ వందల రకాల వాసనలు గుర్తుంటాయి. వాసనతో దానికి సంబంధించిన సంగతులెన్నో గుర్తుకు వస్తాయి. అరిస్టాటిల్ మాత్రం రుచి ‘అంతగా తేడాలు చెప్పలేనని’ అని కొట్టిపడేశాడు. ప్రస్తుతం కూడా అందరూ నోరు, నాలుకల గురించి పాటలు పాడతారే గానీ, వాసన గురించి అంతగా పట్టించుకోరు. అనుకోకుండా శ్వాస ఆడుతున్నంత కాలం, ముక్కుందా? అన్న ప్రశ్నరాదు!

ఒక పదార్థం వాసన తెలియాలంటే, ఆ పదార్థంలోని కొన్ని అణువులు అందులోంచి, విడివడి గాలిలో తేలి, మన ముక్కులోనికి రావాలి. అదీ బాగా లోపల ఉండే ఆ ల్ఫాక్టరీ ఎపితీలియం దాకా రావాలి. అక్కడ యాభయి లక్షల న్యూరాన్లు ఉన్నాయి. వాటికి ఒక దానికి ఒక రకం రిసెప్టర్ మాత్రమే ఉంటుంది. కొన్ని న్యూరాన్లు కలిసి, కొన్ని రకాల వాసనలను పసిగడతాయి. బాగా ఊపిరి పీల్చుకుంటే బోలెడంత గాలి, లోపలికి పోతుంది. ఎక్కువ వాసన అణువులు ముక్కులోకి చేరుకుంటాయి. కొన్ని క్షణాలపాటు వాసన తెలుస్తుంది. తిన్న తర్వాత చాలాసేపటి వరకు నోట్లో రుచి నిలుస్తుంది. కానీ, వాసన మాత్రం క్షణాలపాటు మాత్రమే తెలుస్తుంది. వాసన అణువులు 30 రకాలంటున్నారు. అయినా మనకు వెయ్యి దాకా వేరువేరు వాసనలు తెలుస్తాయని కూడా చెపుతున్నారు. అవన్నీ ఈ 30 రకాల కలయికలతోనే వస్తాయని అర్థమయ్యే ఉంటుంది. ఇది వాసనభాష అనవచ్చు. శబ్దాలు కొన్నయినా, వాటిని రకరకాలుగా కలిపి, మనం భాష, మాటలు, పాటలు తెలుసుకుంటున్న పద్ధతి అన్నమాట.

రుచి కలిగిన తిండి ఘుమ ఘుమలు మెదడుకు అందాయంటే తిండిలోని కొంత భాగం మన శరీరంలోనికి ప్రవేశించినట్లే. అంటే వాసనతో ‘నానో తిండి’ మొదలయినట్లే. ఇంత చేసినా వాసన గురించి తెలిసింది మాత్రం తక్కువే. లిండాబక్, రిచర్డ్ ఆక్సెల్ అనే పరిశోధకులు వాసన గురించి చాలా పరిశోధించారు. వారికి 2004 నోబేల్ బహుమతినిచ్చారు. వీళ్ళిద్దరూ ఆశ్చర్యకరంగా వాసనకు సంబంధించిన వివరాలను మొత్తంగా మ్యాప్ చేశారు. వెయ్యి జన్యువులు సుమారు ఉండి, వెయ్యి వాసనలను తెలుపుతున్నాయన్నారు. ఎలుకల్లో వెయ్యి జన్యువులూ పని చేస్తాయి. మనుషుల్లో 350 మాత్రమే బాగా పని చేస్తాయి. మనుషుల్లో డిఎన్‌ఎలో మూడు శాతం వాసనతోనే కుస్తీ పడుతుంటాయి.

ఇంత జరిగిన తర్వాత తిండి రుచికి, వాసనకు సంబంధం ఉందా అంటే ఏమంటారు? ఉందంటారు? వాసనలేని పువ్వు గురించి పద్యం రాశారు. కానీ, మంచి వాసన లేవి తిండి గొప్పగా ఉండదన్నది తెలిసిన సంగతే. అది నిజం కూడా!

No comments: