Friday, January 23, 2026

మేఘమా మేఘమా - నా వ్యాసం : My Telugu article on Clouds in literature

మేఘమా మేఘమా....

నా వ్యాసం 

మేఘమా.. మేఘమా....

 

ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ఠ సానుం\

వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ

కాళిదాస మహాకవి తన కావ్యాన్ని ఆషాఢమేఘం గురించిన వర్ణనతోనే మొదలు పెట్టాడు. మేఘమంటే మనవారికి ఎంతటి గౌరవం. ఎంతటి ఆప్యాయత. ప్రేమ సందేశాలందించే సంధానకర్తగా మేఘాన్ని చూడ గలిగిన ఘనత మనవారికే చెల్లు!

మేఘాలు, వర్షాలు! ఇవి రెండు లేనిదే భరతవర్షం మొత్తం మీద హర్షం లేదు. మనవారు, వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా అన్నారే గానీ ఎప్పుడూ రెయిన్ రెయిన్ గో ఎవే అనలేదుగదా! వర్షం తోడిదే జీవనం. జీవనం అనే మాటకు అందుకే నీరు అనే అర్థం కూడా ఇచ్చుకున్నారు. ఇంతకూ కాళిదాసు ఆషాఢమేఘాన్ని దర్శించాడు. అతను ఉజ్జయిని వాడుగదా అదే దక్షిణానయితే, బరువయిన వర్ష మేఘాలు జ్యేష్ఠంలోనే మొదలవుతాయి. ఋతుపవనాలు దక్షిణాన ముందు వస్తాయిగదా!

కావ్యం అన్న తర్వాత ఋతు వర్ణనం లేకుండా ఉండగూడదు. అందరికీ హర్షాన్ని పంచే వర్షాన్ని గురించి, కవులు మరింత ఆసక్తితో పద్యాలు రాసుకున్నారు. ఒక్క కావ్యాలలోనే కాదు, చేతనయిన ప్రతిచోటా మేఘాలను గురించి చెప్పుకున్నారు. కాళిదాసుకు వర్షమేఘాలతో కూడిన సానువులు ఏనుగుల వలె కనిపించాయి. ఇంకొకరికి ఇంకొక లాగ కనిపించాయి.

వరాహపురాణంలో ఒకచోట మేఘాల ప్రసక్తి ఉంది. శివకేశవుల అభేదం చూపించాలి. వారిరువురి మధ్యనగల మైత్రిని నిరూపించాలి. రుద్రుడు నారాయణున్ని నాకు వాహనంగా ఉండగూడదా అన్నాడట. సరేనని విష్ణువు మేఘాల తేజిగా మారాడట. ఆ వాహనం ఎట్లున్నది?

ఘనగర్జల్ సకిలింత లాశ్రిత బలాకాల్ తెల్ల జల్లుల్ సకం

పన శంపాలతికల్ పసిండి సగతుల్ మాహేంద్ర చాపంబు మో

హన రత్నంబుల వాగెత్రాడు వడగండ్లా స్వస్రవత్ఫేనమై

తనరం దజ్జలదంబు కైరడిగముల్ ధారావిహారంబులన్

మేఘమనే గుర్రానికి గర్జనలే సకిలింతలు, మెరుపులు ఇంద్రధనుస్సులు జీను, కళ్లెం. వడగళ్లు నోటిలోని నురుగట.

మేఘం కేవలం ప్రేమ సందేశాలకు, మంచి ఉపమానాలకు మాత్రమే కాదు, శక్తికి, బలానికి కూడా ప్రతీక.

ఒక సమయమందు ప్రబల సంయుక్తి నెనసి, తీక్షణ శక్తులతో సముద్రిక్త విలయ

భీషణ శతఘ్నికా వినిర్ఘోష సదృశ సింహనాదంబొనర్చుచు, స్థిర నిరంత

వారిధారల గురియించు వైభవంబు నీ ప్రభావముగాదె, నీ నియతిగాదె

నీవు మహిత ప్రభా సమన్వితవు గాదె

ఈ కవనం ఎవరిదో కనుగొనగలరా? శ్రీరంగం శ్రీనివాసరావనే ‘శ్రీశ్రీ’ గారి పద్యమిది.

మరో రెండు వినండి.

భువనత్రయారాధ్యుడైన భానునంతటి భాస్వత్ప్రభావయుతుని

మరుగు పరుతు వనాయాస కర నిరూఢి

అంటూ ఆయన మేఘాన్ని పొగిడారు.

చంచల మనస్కత బరిభ్రమించు నేను నిన్ను బోలితి గాని యత్యున్నత ప్రభావ

సంపన్నరూఢ వైభవములందు నిన్నుబోలిన ధన్యుండనే...  అన్నారాయన.

మేఘం నుండి వర్షం. బయట చితచితగానున్నది, బయట లసలసగానున్నది అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకచోట. ఆ చితచిత వర్షాలెక్కడికి పోయినాయో తెలియదు. లేని చోట చుక్కకూడా లేదు. ఉన్న చోట వరదలు. ఎడతెరిపి లేకుండా పడే వానలెలాగుంటాయి?

 మిగుల జగంబు బగ్గడిల మించె దదుద్ధత వృష్ఠి యద్భుతం

బగుచు ఘనాఘనౌఘ సమదగ్ర నిరర్గళ ఘర్ఘరార్భటీ

లగన ఘనోచ్ఛల జ్జల ఝళంఝళ నిర్జర జర్జరీ భవ

న్నగ విగలచ్ఛిలా ఘనఘనాఘన ఘోషణ భీషణంబుగన్

 అర్థం మాట అటుంచి, ఈ పద్యం ఒక్క గుక్కలో చదివి పూర్తి చేస్తే, పెద్ద వర్షం కురిసి ఆగినట్టు లేదూ. వర్షం సన్నని తుంపరలతో మొదలవుతుంది. ఆ తరువాత మెరుపులు, ఉరుములు, జడివాన గగ్గోలయి, జగము బగ్గడిలుతుంది. ఏమయి పోయినాయీ వర్షాలు? ఎక్కడికి పోయినాయీ మేఘాలు? ఈ పద్యం వ్రాసిన ప్రాచీన కవి ఎవరో (నాకు) తెలియదు.

 గొడుగు లేకుండా బయలుదేరితే, తడిసి మోపెడవుతుంది. పొరపాటున గొడుగు తీసుకెళితే, మోత బరువవుతుంది, కృష్ణదేవరాయలు ఆనాటి వర్షం వల్ల వంటకు కష్టపడే ఇల్లాలి గురించి ఎంత కమ్మని పద్యం రాశాడు?

 ఇల్లిల్లు దిరిగి నొక్కింతబ్బు శిఖి, యబ్బెనేనింటిలో బూరియిడి విసరక రాజదు, 

రాజిన రవులుకోల్వాసాల గాని కల్గదు, మరిదాన గలిగెనేని, గూడగుట మందైన

బెన్పొప్ప సుఖభుక్తి సేకూరదా భుక్తి కిడనబ్రాగ్భోక్తలకె తీరు, బహునాన్నము, దీరనారులకొదవు బునఃప్రయత్న మాజ్యపట ముఖ్య లయమెన్న రాలయాంగ దారులయమెన్నరంతిక కారజనిక

పచన నాంధో గృహిణి రామి బడుక మరుడు వెడవెడనె యార్ప నొగిలి రజ్జడిని గృహులు

 ఆ (అజ్జడి) జడివాన మొదలయిందంటే, నిప్పులు దొరకవు. దొరికినా రాజుకోవు. రాజినా రగులుకునేవి ఆశలే గాని మంటలు కావు. వంటయినా సరే, పొగ వల్ల సుఖంగా భోంచేయడానికి ఉండదు. తిన్నా, ముందు తిన్నవారికే కూరలయి పోతాయి. ఇక ఆడవాళ్లు మరీ నూనెగుడ్డలు, ఇంటి వాసాలు పొయ్యిలో పెట్టి, నానా తంటాలు పడుతుంటే, తిని పడుకున్న గృహమేధి, ఇంకా రావేమిటంటాడు. రాయలవారు రాజభవనంలో ఉండి రాసిన కవితలా ఇవి? పల్లెటూరి జనజీవితంలోకి ఎంతగా దూసుకుపోతే, ఈ సంగతులన్నీ తెలియాలి! ఇప్పుడిలాగుంది కానీ, కొన్ని సంవత్సరాల క్రితం కూడా వాన పడిందంటే పల్లెలో, సంగతి అచ్చం రాయల వారి పద్యమే కదా!

 మనది వర్షాధార ఆర్థిక వ్యవస్థ. అందుకే అలనాటి నుండి మనవారు వర్షాలను, మేఘాలను అంతగా ఆదరిస్తున్నారు. మధ్యలో ఏం లోపమయిందో గానీ, మేఘాలకు మాత్రం మనమీద కనికరం లేకుండా పోతున్నది. 

 


Thursday, January 22, 2026

సాదత్ హసన్ మంటో 1 : On Sadat Hasan Manto : Article in Telugu

సాదత్ హసన్ మంటో  1

సాదత్‌ హసన్‌ మంటో

సాహితీ మిత్రులతో మాట్లాడుతూ ఉండగా రచయితల గురించి ప్రసక్తి వచ్చింది. పట్టించుకుని ప్రపంచానికి ఎత్తి చూపించవలసిన రచయితల గురించి చర్చ మొదలయింది. సాదత్‌ హసన్‌ మంటో ఉర్దూలో పెద్ద ఎత్తున కథలు రాసిన మహా

రచయిత. మామూలు పద్ధతికి ఎదురుతిరిగి తన కలం వాడితో వేడి పుట్టించిన రచయిత. ఆయన కథలు తెలుగులో వందకు పైగా వచ్చాయని మిత్రులు చెపితే, ఆశ్చర్యం కలిగింది. ఆ కథలు మంటోలాగే మనుషుల మధ్యన ఉండి కూడా మనుషులకు దూరమయినట్టు భావన కలిగింది. మంటో భారతీయుడు. స్వాతంత్రం తరువాత అప్పటి దారుణ పరిస్థితులను గురించి, దేశం

విడిపోవడం గురించి, మరీ బట్టబయలుగా కథలు రాసి సంచలనం సృష్టించాడు. కోర్టులపాలయ్యాడు. చివరికి దేశాన్ని వదిలి పాకిస్తాన్‌ పారిపోయాడు. మంటో మన దేశంలో ఉండకపోవడం ఒకరకంగా మనకు నష్టం.

మంటో పేరులో మాత్రమే అతని మతం కనిపిస్తుంది. అతని అభిమతం మాత్రం పూర్తిగా వేరు. సంస్కృతి అంతకన్నా వేరు. అది అతని రచనల్లో కొట్టవచ్చినట్టు కనిపించింది.ఇక్కడ కొట్టవచ్చినట్టు అన్నమాట అక్షరాలా నిజం. “ఖోలో” లాంటి కథలు ముఖంలో పిడిగుద్దు గుద్దినట్టు వచ్చి తగిలాయి. అందరికిలాగే “టోబా టేక్‌సింగ్‌' కూడా కలకాలం గుర్తుంటాడు. మంటో కథలు అన్నీ ఇంత మొరటుగాను, ఇంత మొనగలిగినవిగాను ఉండవు. కొన్ని మెత్తగానే, చెప్పవలసిన సంగతులను తలకెక్కిస్తాయి. ఈ రచయిత కథలు తెలుగులో వచ్చి ఉంటే, వాటి గురించి చర్చ జరగకపోవడం మాత్రం గొప్ప అన్యాయం. సమాజంలో ఉన్న కుళ్లు గురించి తెలియకుండానే బతుకులు సాగుతాయి. ఉన్న కుళ్లును ఏ రకంగా ఎత్తిచూపినా, దాని గురించి చర్చ మొదలుకావాలి. చాలామంది రచయితల బాధ ఇదే. ఎత్తి చూపని సమస్యలు చివరకు అన్నిరకాలా తెరమరుగవుతాయి. అది జరగకూడదనే రచయితలందరూ గొంతెత్తి ఘోషించారు. గోలచేశారు. బాధలను గమనించిన ఈ రచయితలు వాటిని మనసులో దాచుకోకుండా అందరికీ పంచి ఇచ్చారు. మంచి మాత్రమే పంచడం ఒక పద్ధతి అయితే, చెడును ఎత్తిచూపి మంచి దారులు ఉండాలని సూచించడం మరో ఎత్తు. పూలు, వెన్నెలలను గురించి పాటలు రాసుకుంటే అభ్యంతరం లేదు. కానీ, చీకటి గురించి చెప్పి చిరు దీపం అందించిన రచయితలను మనం మరింత ఎక్కువగా గుర్తుంచుకోవాలి.

సాదత్‌ హసన్‌ మంటోను పాకిస్తానీ రచయిత అంటున్నారు. అతను రాసిన ఉర్దూ ప్రస్తుతం మన దేశంలో వాడుకలో ఉన్న ఉర్దూ ఒకటి కాదు. కానీ, మంటో కాలంలో ఆ యాసభాష మన దగ్గర కూడా మాట్లాడుకున్చదే! చివరకు అప్పటి సినిమాల్లోనూ ఆ భాష ఉండేది. మంటో కథలను నాటకాలుగా మలిచి నసీరుద్దీన్‌ షా లాంటివాళ్లు ప్రదర్శిస్తున్నారు. అసలు కథలను చదివినా, ఆ భాషను విన్నా అది మన హిందుస్తానీకి చాలా దగ్గరగా ఉంటుందని సులభంగానే అర్థమవుతుంది.

అక్కడక్కడ మాత్రం మన సమాసాల వంటి కొన్ని మాటలు అందంగానే ఎదురువుతుంటాయి. అవి బహుశా ఈ కాలం అనువాదకులకు సులభంగా లొంగవు. మంటో భారతీయ రచయిత. భారతీయ సమస్యలను ఎత్తి భారతీయ పాఠకుల కొరకు భారతీయ భాషలోనే రాశాడని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. చెప్పవలసిన అవసరం ఉంది కూడా! మంటో కథలు మరిన్ని రావాలి. సంకలనాలు రావాలి. వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి.

మంటో మన దేశం వదిలి వెళ్లడానికి కారణాలు ఉన్నాయి. అలాగని ఆ మహారచయితను మనం వదిలివేసుకోవడానికి లేదు. పారిపోయేనాటికి మంటోకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అతను ఇప్పటి ముంబై, అప్పటి బాంబేలో ఉండేవాడు. దేశం విడిపోయిన తరువాత మాహీమ్‌, భేండీ బజార్లలో జరిగిన ఘాతుకాలను గురించి అతను కథలలో రాశాడు. నిజానికి ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే, ఇంకా ఇక్కడే మిగిలినవాళ్ల గురించి ఆలోచనలు మొదలవుతాయి.

మంటో ఎక్కువగా చదువుకున్నవాడు కాదు. అసలు అతనికి చదువు మీద పెద్ద పట్టింపులేదు. కాశ్మీర్‌కు చెందిన మంటో కుటుంబం కొంతకాలం అమృత్‌సర్‌లో కొనసాగింది.

తండ్రి గతించిన తరువాత మంటో పత్రికారంగంలో పని వెతుకుతూ బొంబాయి చేరుకున్నాడు. పత్రిక ఆఫీసుల్లోనే పడుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలలో కొంచెం పని దొరికింది. అయితే, సినిమాల్లో అతని రచనలు పేరు సంపాదించలేదు. నిలదొక్కుకోవడానికి చోటు అసలే దొరకలేదు. అతను రాసిన సినిమాలన్నీ భయంకరంగా కుప్పకూలాయి! విచిత్రంగా మహానటుడు అశోక్‌కుమార్‌ లాంటివారు మాత్రం అభిమానులుగా మిగిలిపోయారు. మంటో అప్పట్లో నిజంగా కుర్రవాడు. అయినా, బాబూరావ్‌ పటేల్‌ లాంటి పాత్రికేయులు అతడిని అభిమానించారు. అతని కథలను మెచ్చుకున్నారు. భారతదేశపు మౌపాసా అన్నారు.

అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులు మంటోకు మంచి కథా వస్తువులను అందించాయి. ఆ కథలలో భారతీయత నిండుగా కనిపించింది. కానీ, ఎంచుకున్న విషయాలు, వాటిని చెప్పిన తీరు మాత్రం కొంత కలకలానికి దారి తీశాయి. అతని

కథలు అద్భుతమయినవి. కానీ, అంతే అసాధారణమయినవి.

పాకిస్తాన్‌ భారతదేశం నుంచి విడిపోయింది. చాలామంది ఇక్కడ కొనసాగలేక పాకిస్తాన్‌కు పారిపోయారు. తమస్‌ లాంటి రచనలలో ఆ పరిస్థితులు మామూలు టీవీ (ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాయి. కానీ, మంటో రచనలలో కనిపించిన లోతు మరింత ఎక్కువ. మంటో తన రచనలలో ఏమాత్రం జంకకుండా తన మతం వారు చేస్తున్న ఘాతుకాలను కూడా వివరించాడు. నిరసించాడు. కథలు చదివినవారికి ఆ విషయం సులభంగానే అర్థమవుతుంది.

మంటో 1912లో పంజాబ్‌ రాష్ట్రంలో పుట్టాడు. తండ్రి పెద్ద పేరున్న బారిస్టర్‌. అతను మరీ మొరటుమనిషి మారుటి తల్లి మాత్రం మంచిది. మంటో రచనల మీద మొదట్లోనే ఆ తల్లిదండ్రుల ప్రభావం కూడా కనిపించింది. మంటోలోని తిరుగుబాటు పద్ధతి అక్కడే మొదలయింది అనవచ్చు. ఇక అమృత్‌సర్‌లో అప్పటి పరిస్థితులు దారుణమయిన వని వేరుగా చెప్పనవసరం లేదు. జలియావాలా బాగ్‌ గురించి చాలామందికి తెలుసు. అయినా, ఆ పరిస్థితిని మనసులో చిత్రీకరించుకున్న

వారు ఎక్కువగా లేరని అనాలి. ఏడేళ్ల వయసులోనే సాదత్‌, ఆ సంఘటనను అర్ధం చేసుకున్నాడు. అతనితోపాటు దేశంలో మరెంతమందో ఆ విషయాన్ని అర్ధంచేసుకున్నారు. జాతీయ ఉద్యమం బలం పుంజుకున్నది. అది మరింతగా ముందుకు సాగింది.

సరిగ్గా ఈ కాలంలోనే మంటో ఆలోచనలు కూడా స్థిరపడసాగాయి. కుర్ర వయసులోనే అతను తిరుగుబాటుదారు మనస్తత్వంలో స్థిరపడిపోయాడు. అనుభవం లేకున్నా ఎక్కడో చదివిన మాటలను అరువు తెచ్చుకుని ఆకర్షణగల మాటలతో పోస్టర్లు తయారుచేయడంలో పాలుపంచుకున్నాడు. ఆస్కార్‌ వైల్డ్‌ రచనల నుంచి నినాదాలను ఎత్తుకువచ్చాడని పరిశీలకులు తరువాత చెప్పారు. యూరోపియన్‌ సాహిత్యం ప్రభావం భారతీయ రచయితల మీద అప్పట్లో బాగా ఉండేదని వాళ్లు సిద్ధాంతం కూడా చేశారు.

అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలో అర్ధమనస్కంగా చదువుకుంటున్న రోజుల్లోనే మంటో ప్రోగ్రసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌లో చేరాడు. భారతీయ సాహిత్యమంతా రాజుల బూజు పద్ధతిలో సాగుతున్నదని దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని సంఘం వారు ప్రచారం చేస్తున్న భావనలకు మంటో తానూ భుజం కలిపాడు. అందరి పంథాలోనే తానూ రచనలు చేశాడు. అయినా, స్వంత ఆలోచనలు గల సాదత్‌ త్వరలోనే సంగతి అర్థంచేసుకున్నాడు. “బూ” అంటే వాసన అని అర్ధం. ఈ పేరుతో మంటో ఒక విచిత్రమయిన కథ రాశాడు. అది అతని అసలయిన రచనాక్రమానికి శంఖుస్థాపన రాయిగా గుర్తించదగిన కథ. ఈ కథ చదవనివారికి ఇప్పుడయినా గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. కథలో ఇద్దరే మనుషులు. రణ్‌ధీర్‌ అన్న ఒక ధనిక యువకుడు. మరొక నిమ్బవర్గపు అమ్మాయి. నిజానికి వారు మాట్లాడుకోరు. ఒక వర్షపురాత్రి ఆ అమ్మాయి రణ్‌ధీర్‌ ఇంట్లో ఆశ్రయం తీసుకోవలసి వస్తుంది. పరిస్థితులు వాళ్లు భౌతికంగా కలిసే వరకూ దారితీస్తాయి. వర్షంలో తడిసి లోపలికి వచ్చిన అమ్మాయి వణుకుతూ ఉంటుంది. మరే భావమూ లేకుండా, కేవలం జాలితో అబ్బాయి ఆమెకు పొడి బట్టలు ఇస్తాడు. అమ్మాయి వణుకుతూ తడి బట్టలను విప్పుకోవడంలో తడబడుతుంది. యువకుడు సాయంచేయడానికి వెళతాడు. అక్కడ మంటో కథను నడిపించిన తీరు మరొకరికి చేతగానిదిగా కనపడుతుంది. మొత్తానికి రణ్‌ధీర్‌కు ఆ అమ్మాయి వాసన మనసులో మిగిలిపోతుంది.

ఆ వాసన బాగుంటుంది, బాగుండదు. అది ఆమె బాహుమూలాల్లో, తల వెంట్రుకల్లో, ఎదలో, ఒళ్లంతా గుప్పుమన్నదని అతను అనుభవం చెపుతాడు. జరిగినదంతా ఒళ్లు తెలియని తమకంలో జరిగింది. తెలివిలోకి వచ్చిన తరువాత కూడా, ఆ వాసన అతగాణ్ణి వదలదు. అది అతనికి వర్షాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ రాత్రి అందిన అనుభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ చివరకు వస్తుంది. రణ్‌ధీర్‌ ఒక గొప్ప యింటి అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. ఆమె అన్నిరకాలా అతనికి తగిన జోడు. అయినా, అందరినీ ఆకర్షించిన ఆ నవవధువు నాయకునిలోని మగటిమిని మాత్రం ఆకర్షించలేకపోతుంది. సాదత్‌ హసన్‌ మంటో కథలు చాలా అదుపులేకుండా ఉంటాయి. అవి బండ బూతులని అన్నవాళ్లే ఎక్కువ. 


గడువు : ఆశారాజు తెలుగు కవిత

గడువు

ఆశారాజు తెలుగు కవిత

Wednesday, January 21, 2026

నాలుక తెగిన పిచుక - జపాన్ జానపద కథ : Tongue - cut - Sparrow

నాలుక తెగిన పిచుక

జపాన్ జానపద కథ

నాలుక తెగిన పిచుక

జపాన్ జానపద కథ

 

ఒకప్పుడు ఒక ముసలాయన ఒక ముసలావిడ ఉండేవారు. మంచి మనసున్న ముసలాయన, ఒక చిన్న పిచ్చుకని పెంచేవాడు, దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆ ముసలావిడ చాలా కోపిష్టి; ఒక రోజు, ఆ పిచ్చుక ఆవిడ బట్టలకి గంజి పెట్టడానికి తయారు చేసిన పిండి ముద్దను పొడిచి తినేసరికి, ఆవిడ చాలా కోపంతో, పిచ్చుక నాలుకని కోసేసి దానిని వదిలేసింది. ముసలాయన కొండల నుంచి ఇంటికి వచ్చినప్పుడు పిచ్చుక ఎగిరిపోయిందని తెలుసుకుని, దానికి ఏమి జరిగిందని అడిగాడు; అప్పుడు ముసలావిడ అతనికి తన పిండిముద్ద దొంగిలించినందుకు దాని నాలుక కోసి వదిలేసినట్లు చెప్పింది. ఆ సంగతి విని, ముసలాయన చాలా బాధపడ్డాడు, అయ్యో! నా పిచ్చుక ఎక్కడికి పోయింది? పాపం! నాలుక తెగిన చిన్న పిచ్చుక! నీ ఇల్లు ఇప్పుడు ఎక్కడ? అని అనుకొని, అతను తన పిట్ట కోసం దూర ప్రాంతాలు వెతుకుతూ, పిచుకా, నా పిచుకా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అని అరుస్తూ తిరిగాడు.


ఒక రోజు, ఒక కొండ పక్కన, ముసలాయనకి తప్పిపోయిన పిచ్చుక కనిపించింది; వారు ఒకరినొకరు క్షేమంగా ఉన్నందుకు పలకరించుకున్న తర్వాత, ఆ పిచ్చుక ముసలాయనని తన ఇంటికి తీసుకెళ్లి, తన భార్యాపిల్లలను పరిచయం చేసి, రకరకాల రుచికరమైన ఆహారాన్ని వడ్డించి, ఆతిథ్యం ఇచ్చింది.


"దయచేసి మా సాధారణ ఆహారాన్ని స్వీకరించండి," అని పిచ్చుక అన్నది "ఇది చాలా గొప్పగా లేకపోవచ్చుగానీ, మీరు చాలా తినితీరాలి అన్నది.

ఎంత మర్యాదగా ఉందీ పిచ్చుక!" అని అనుకుని ఆ సలాయన, చాలా రోజులపాటు పిచ్చుక దగ్గర ఉండి, ప్రతిరోజూ మంచి తిండి తింటూ గడిపాడు. చివరికి ముసలాయన తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని, ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్పాడు; ఆ పక్షి అతనికి రెండు వెదురు బుట్టలను అందించి, వీడ్కోలు బహుమతిగా వాటిని తీసుకెళ్లమని అన్నది. ఒక బుట్ట బరువుగా ఉంది, మరొకటి తేలికగా ఉంది కాబట్టి ముసలాయన, తాను బలహీనుడినని, వయసు మళ్లినవాణ్ణి కాబట్టి తేలికైన దానిని మాత్రమే తీసుకుంటానని చెప్పి, దానిని భుజాన వేసుకుని, ఇంటికి బయలుదేరాడు, అతని నుండి విడిపోవడం వలన పిచ్చుక కుటుంబం విచారంగా ఉండిపోయింది.


ముసలాయన ఇంటికి చేరుకున్నప్పుడు, వాళ్లావిడ చాలా కోపంగా అతడిని తిట్టడం మొదలుపెట్టింది, "సరే, మరి మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? మీ వయసులో ఇలా తిరగడం నిజంగా బాగుందంటారా" అంటూ కసిరింది.


అతను జవాబిచ్చాడు, " ఓ! నేను పిచ్చుకల వద్దకు వెళ్లాను. నేను వచ్చేటప్పుడు, వాళ్లు నాకు వీడ్కోలు బహుమతిగా ఈ వెదురు బుట్టని ఇచ్చారు, అన్నాడు ." అప్పుడు వాళ్లు లోపల ఏముందో చూడటానికి బుట్టని తెరిచారు, ఆశ్చర్యం! అది బంగారం, వెండి మరియు విలువైన వస్తువులతో నిండి ఉంది. ఆవిడ పిసినారి మరియు చిరచిరలాడే స్వభావం కలది, ఆమె ముందు ప్రదర్శించబడిన సంపదలన్నీ చూసినప్పుడు, ఆమె తిట్టే స్వరాన్ని మార్చి, ఆనందంతో తన్ను తాను అదుపు చేసుకోలేకపోయింది.


నేను కూడా పిచ్చుకలను కలవడానికి వెళ్తాను," అని "నేను వాటిని ఇక్కడికి కూడా పిలవడానికి వెళతాను," అని అంది, నాకూ ఒక అందమైన బహుమతి దొరక్క పోతుందా అన్నది కూడా." ఇక ఆమె ఆ ముసలాయన్ని పిచుకల ఇంటికి దారి అడిగి, బయలుదేరింది. అతని చెప్పిన ప్రకారం, ఆమె చివరికి నాలుక తెగిన పిచ్చుకని కలిసి, ఇలా అంది—


"భలే, భలే పిచుక గారూ, ఎంత సంతోషం. నిన్ను చూడాలని నేను ఎంతకాలంగాఎదురు చూస్తున్నాను" అన్నది. ఆమె మంచి మాటలతో పిచుకను పొగడటానికి, బుజ్జగించడానికి ప్రయత్నించింది.


ఆ పక్షి ఆవిడను తన ఇంటికి ఆహ్వానించక తప్పలేదు; కానీ అది ఆమెకు విందు చేయడానికి ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు, వీడ్కోలు బహుమతి గురించి ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ, ఆమె వెనక్కి తగ్గలేదు; కాబట్టి ఆమె తనకు వారి గుర్తుగా తీసుకెళ్ళడానికి ఏదైనా అడిగింది. అందుకు పక్షి మునుపటిలాగే రెండు బుట్టలు ఇచ్చింది, ముసలావిడ ఆశగా, రెండింటిలో బరువైన దాన్ని ఎంచుకుని, తీసుకెళ్ళింది. కానీ లోపల ఏముందో చూడటానికి ఆమె బుట్ట  తెరిచినప్పుడు, అన్ని రకాల దయ్యాలూ, భూతాలూ బయటకు దూకి, ఆమెను బాధించడం మొదలుపెట్టాయి.


ఆ ముసలాయన మాత్రం ఒక కొడుకును పెంచుకున్నాడు, ఎంత సంతోషంగా వాళ్లు కలకాలం బతికారు.