Saturday, July 25, 2026

లోకాభిరామం : నను పాలింప On Classical music


నను పాలింప

మా ఇంట్లో ఒక లామినేట్ చేసిన చిత్రపటం ఉంది. అందులో త్యాగరాజస్వామి భువనేశ్వరం ముందు కూచుని బహుశ: పాడుతూ ఉంటడు. (మా సంప్రదాయంలో దేవుని విగ్రహాలు ఉండే మంటపాన్ని భువనేశ్వరం అంటరు). అందమయిన ఆంజనేయస్వామి, మోకాళ్లమీద కూచుని పబ్బతి బట్టి (అంటే చేతులు జోడించుకుని) ఆనందంగ చూస్తుంటడు. త్యాగయ్య గారి భార్యామణి వంటింటి తలుపులో నిలబడి ఉంటుంది. అన్నిటికన్న ముఖ్యమైన విషయం రాముడు, సీత, తమ్ములతో అభయహస్తం పట్టి నిలబడి ఉంటడు. ఇది బొమ్మ తీరు. ఈ మధ్యన ఇదే బొమ్మ నాకు ఇంకొక చోట పుస్తకం కవరుపేజీగ కనిపించింది. ఫోటోషాప్ అని ఒకటి వచ్చింది గద! దాని సాయంతో రామయ్య చేతినుంచి వెలుగుపుట్టి త్యాగయ్య మీద ప్రసరిస్తున్నట్టు అక్కడ మార్చి పెట్టినరు. బొమ్మ బాగనే ఉన్నది. కానీ, నా బుర్రలో అనుమానాలు మొదలయినయి. రాముడంతటి వాడు, దార సోదరాదులతో దయచేసి వస్తే త్యాగయ్య లేచి నిలబడి ఉండాలె గద. వాళ్లావిడ కూడ పక్కనే ఉండాలె గద! ఆ నమస్సులు, ఆశీస్సులు అన్నీ అయినయి అనుకుందము. రామయ్య తాపీగ,  ఏమయ్యా! ఒక పాట పాడవచ్చు గదాఅన్నడే అనుకుందము. ఆయనను చాపవేసి కూచోబెట్టి, కమ్మగ కచేరీ చేయవచ్చు గద? నిలవెట్టి ఎందుకు ఆ పాట? అదీ నా అనుమానం.

ఇటువంటి మాటలు అంటుంటే వీనికి మరీ భయం, భక్తిలేకుండ పొయినయి అనే వాళ్లు చాలామంది ఉంటరు. నాకు తెలుసు! కానీ సందేహం రావడం మంచిదని మాకు ఒక పద్ధతి ఉంది. చొప్పదంటు ప్రశ్నలకే సమాధానాలు ఉండంగ లేనిది, నా ప్రశ్నకు ఎవరో జవాబు చెప్పకపోతరా? అని అడగడం. ‘సందేహమును తీర్చవయ్యా?’ అంటూ త్యాగయ్య నేరుగా రాముడిని ప్రశ్నలు అడిగినడు. త్యాగయ్య కీర్తనలలో చాలామటుకు ప్రశ్నలే పల్లవిగ ఉంటయి. ఆ ప్రశ్నలలో రకాలు, ప్రశ్న ముగిసిన చోటున వేరువేరు స్వరస్థానాలు ఉండడం గురించి పెద్దలు చర్చించడం విన్న. ‘ఎవరిచ్చిరిరా శర చాపములు?’ అని త్యాగయ్య తెగేసి అడగడం కూడా అందరూ ఎరిగినదే! అట్లా ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగినడు.

మళ్ల లామినేటెడ్ బొమ్మలోకి వద్దము. ఇక్కడ ఆయన ‘నను పాలింప నడచి వచ్చితివో’ అని పాడుతున్నడని నాకు అనిపించింది. ఈ పాట గురించి నిజానికి వేరే కథ ఉంది.త్యాగరాజస్వామి కూతురి పెళ్లి సందర్భంగ అనుకుంట, వాలాజపేట వేంకటరమణయ్య లేదా మరొక శిష్యుడు, రామ పట్టాభిషేకం చిత్తరువును బహుమతిగ (పోటీలో బహుమతి కాదులెండి!) తెచ్చిస్తే, చూచి త్యాగయ్య భక్తితో పాట పాడినట్టు చెపుతరు. ఉరమున ముత్యపు సరుల చయముతో అంటూ మొదలయి ఆ పాటలో రాముని వర్ణన మాత్రమే ఉంటుంది.

నా కోతి బుర్రకు ఇక్కడ మరొక సంగతి గుర్తుకు వస్తున్నది. ‘నిన్ను కోరి’ అనే మాటతో మొదలయే మోహనరాగ వర్ణం కర్ణాటక సంగీతంలో మంచి పాపులర్‌గ ఉంది. మన తెలుగు సినిమాలో ఒకచోట  ‘నిన్ను కోరీ వర్ణం’ అంటూ ఒక హిట్టు పాట పెట్టేశినరు. ఆ పాట వినేందుకు బాగుంటుంది. కానీ సంగీతంలోని వర్ణానికి, దానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అట్లాగే బుద్ధిమంతుడు అని ఏఎన్ఆర్ హిట్ సినిమా ఒకటి ఉంది. అందులో ‘నను పాలింపగ నడచీ వచ్చితివో’ అని ఒక పాట ఉంది. దానికీ, అసలు మోహనరాగ కృతికీ సంబంధమే లేదు. ఈ పాట పల్లవి, కర్ణాటక సంగీత ప్రపంచం నుంచి వచ్చిందని తెలియని ప్రేక్షకులు, శ్రోతలు చాలమంది ఉంటరు. శంకరాభరణం సినిమాలోని సామజ వరగమన సంగతి కూడా ఈ రకంగనే ఉంటుంది. సంస్కృతినీ, సంప్రదాయాన్నీ ఇష్టం వచ్చినట్టు వాడడం మనకు బాగ చేతనవుతుందని అనుమానం!

నాకు భయం, భక్తి లేవుగాక లేవు. కానీ, ఒంటి నిండ కుతూహలం ఉంది. సైన్సు చదివిన, చదువుతున్న. అర్థమయిన సంగతులను పదుగురితో పంచుకుంటున్న. అదే పద్ధతిలో వైష్ణవం గురించి బోలెడంత చదివినట్టున్న. దాని గురించి, రాసింది తక్కువ. కానీ మాట్లాడిన. తిరుపతి బ్రహ్మోత్సవాలు (తిరుమల అనాలి) ఏనాటికానాడు టీవీలో చూపించడంలో కీలకపాత్ర వహించిన. అదే పద్ధతిలో ఈ సంవత్సరం త్యాగరాజ ఆరాధనోత్సవాలకు తిరువయ్యారు పొయ్యిన. నాకు కర్ణాటక సంగీతం (హిందుస్తానీ కూడ) ఎందుకంత పట్టిందో అర్థం కాదు. ఉత్తర భారతదేశంలో సవాయి గంధర్వ ఉత్సవాలు, సంత్ రాయ్‌దాస్ ఉత్సవాలు జరుగుతయి. కానీ, త్యాగరాజ ఆరాధన లెవెల్లో జరగవని నా అనుమానం. కనుకనే సంగతి చూడాలని వెళ్లిన. నిజం చెపుతున్న. అక్కడ ఎవరిలోను భయం, భక్తి కనిపించలేదు.

తిరువయ్యారులో కనిపించిన ప్రత్యేకత అక్కడి క్రమశిక్షణ. పుస్తకంలో అచ్చువేసిన క్రమం ప్రకారం ఒకరి తరువాత ఒకరు వచ్చి పాడుతున్నరు. లేక వాయిద్యం వాయిస్తున్నరు. సన్మానాలు, పొగడ్తలు లేవు. పని ముగిసిన తరువాత ఎవరి దారిన వారు పోతున్నరు. పోయే ముందు త్యాగయ్య సమాధి ముందుకు వెళ్లి ఒక నమస్కారం చేస్తున్నరా? అంటే అనుమానమే. ఇంక జనం సంగతి. అంత పెద్ద పందిరిలో నిండా కిక్కిరిసి ఉన్నరు. వాళ్లలో ఎంత మందికి సంగీతం తెలుసంటే మళ్లీ అనుమానమే. అంతమంది ఉన్నాసరే తొక్కిసలాట, తోసుకోవడం లేవు. పోలీసులు చూస్తూ నిలవడి ఉన్నరంతే. అంతా జాతర లేదా తిరునాళ్ల వాతావరణం. సందుల నిండ అంగళ్లు. అన్నిరకాల వస్తువులు అమ్ముతు న్నరు. కొనేవాళ్లు కొంటున్నరు. సంగీత ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంత ఎత్తున నివాళి సమర్పించడం ప్రపంచంలో మరెక్కడ లేదు. కానీ అందులో త్యాగయ్య ప్రత్యక్షంగ కనిపించడం లేదు.

పంచమి రోజున ఉదయం తొమ్మిదినుంచి ఘనరాగ పంచరత్నాలు అందరూ కలిసి పాడతరు. అందులో పాల్గొనే కళాకారులకు విద్వాన్ పాస్ ఇస్తరు. నేను గాయకుడిని కాను. ఒక విఐపి పాస్ సంపాదించినరు నా కొరకు. నేను, నా తోటివారు ఉదయం ఆరున్నరకే పందిరి చేరుకున్నము. అప్పటికే సీనియర్ ఆర్టిస్టులు కూడ వచ్చి కూర్చున్నరంటే ఆశ్చర్యం! ఎంతమంది జనం వచ్చినరో? చాలామంది వీఐపీలు కూడ వచ్చినరు. వచ్చినది ఎవరయినా కానీ, ఆ ఇసుకలో చతికిల పడవలసిందే! కుర్చీ, స్టూలు ఒక్కటంటే ఒక్కటి లేదు. నేను వెతికి వెతికి ఒక టీవీ కెమెరా పక్కన కూచున్న. అట్లాగుంటే ఎవరికీ టీవీలో కనిపించే ప్రమాదం ఉండదు. వచ్చేవారిలో మళ్లీ భయం, భక్తి మచ్చుకు కనిపించలేదు. టిఫిన్లు తింటూ, కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తున్నరు. నాదస్వరాల బృందాలవారు ఒకరి తరువాత ఒకరు వాయిస్తు న్నరు. మిగతా వాద్యాలవారు, గాయకులు వచ్చి చేరుకుంటున్నరు. చిత్రంగా బాగా పేరున్న గాయకులు, వాద్యకారులు కనిపించింది తక్కువ. ముందు రాత్రి పాడినవారు కూడా వెళ్లిపొయినరు.

ఉత్సవాన్ని నిర్వహించే వాళ్ల బలం బాగ కనిపించింది. గుడికి వచ్చేవాళ్లను రమ్మనేవారు ఎవరు ఉండరు. నిజమే కానీ అక్కడ కూడ, ఓహో! వచ్చినరా! అనేవారు ఉంటరు. ఇక్కడ కొందరు అవసరంగ, అనవసరంగ మధ్యన తిరుగు తున్నరు. మమ్మల్ని చూడండి అన్నట్టుంది తీరు. వాళ్లు బహుశ: కొంత మందిని పట్టించుకోరు. కనుకనే అందరూ ఆ సందర్భానికి అక్కడికి రారు. వచ్చిన వారు కూడా ఎవరినీ పట్టించుకోకుండనే పని ముగించుకుని వెళ్లిపోతున్నరు. క్రమశిక్షణ మాత్రం పాటిస్తున్నరు.

ఝలక్: నేను మొదటిరోజు సాయంత్రం (గోష్టి గానానికి ముందు రోజు) స్టేజి వెనకకు వెళ్లి తెలిసిన వారిని పలకరించిన . చాలాసేపు అక్కడే ఉన్న. కొంతసేపటికి ఎందుకో బయటకి వచ్చిన. మళ్లీ లోపలికి పోతుంటే పోలీసు అడ్డుకున్నడు. అదేమిటి అక్కడనుంచే వచ్చిన గద అంటే, అదంతే అన్నడు.


 

No comments: