Monday, July 6, 2026

సిమెంట్ సంతతి : నగ్నముని విలోమ కథలు నుంచి.


సిమెంట్ సంతతి

నగ్నముని విలోమ కథలు నుంచి.

లోకంలో వయసు వచ్చిన అందరు ఆడపిల్లలకు మల్లెనే ఆ పిల్ల కూడా మొదట్లో మంచుతో నేసిన జలతారు ముసుగు, మొహం మీదకు లాక్కుని, రేకు విడవడానికి కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా ఉండేది. కాళ్లలో లేళ్లు గంతులేసేవి. కనురెప్పల్ని కలలు కమ్ముకునేవి. కాళ్లూ, చేతులూ, ప్రతి అవయవం యవ్వన పరిమళపు సెలయేళ్లుగా తుళ్లి పడేవి. పెదవుల మీద వెన్నెల ఒలికి, పలువరసను పలకరించి, ఒంటిలో ఇంకిపోయేది.

నడిస్తే, నడుస్తున్న హారతిలా ఉండేది.

ఆ పిల్ల తండ్రి కాళ్లూ, చేతులూ మెదడూ ఎప్పుడూ ఎక్కడో పన్జేస్తుండేవి. అర్ధ రాత్తుళ్లు బగ్గుమని చివరి మంట మండే లాంతర్లాంటి కళ్ళతో యింటికి చేరేవాడు. కుష్టువ్యాధి వ్యాపించిన వాడిలాగా దరిద్రంతో తీసుకుంటుండేవాడు. దరిద్రం క్రమంగా అతని అన్ని అవయవాల్ని తినేస్తోంది. నెమ్మదిగా నెమ్మదిగా ఇంటి గోడలకి, యింట్లోనే యితర వస్తువులకి, మనుషులకి వ్యాపిస్తోంది ఆ వ్యాధి.

తల్లి వంటింటి అలుగ్గుడ్డ. ఎడతెరిపి లేని దగ్గుగా మారి, చింకి చాప మీద ముణగదీసుకునుండేది. అర్ధరాత్రి మసిబారిన లాంతరు కళ్ళతో, సగం సగం అవయవాల్తో యింటికొచ్చే కట్టెతో కాపరం చేసేది.

వీధిలోని పెంటకుప్పకీ, యింటికీ పెద్ద తేడా లేదు. పెంటకుప్ప మీద గులాబీ మొక్కలాగా ఆ పిల్ల తనని తాను చూసుకునే లోపల ఎదిగిపోయింది.

అవయవాలన్నీ అందమైన పువ్వుల్లోకి మారిపోయినై. కుండీలో పెడతానని, మేకలు తినెయ్యకుండా కాపలా కాస్తానని, అంటుకట్టి మరిన్ని అందమైన రంగురంగుల పూలు పూయిస్తానని, పుస్తకాల్లోంచి, పక్క వీధిలోంచి ఎగిరేచ్చాడో కుర్రవాడు.

వాడి మాటల్లో మత్తు పానీయాలున్నాయ్.

వాడి కళ్ళలో గురితప్పని పూల బాణాలున్నాయ్.

వాడి నిట్టూర్పుల్లో మధురంగా బంధించే లతలున్నాయ్.

వాడి చొక్కాకి గలగలలాడే జేబుంది.

వాడి ఒంట్లో సలసల కాగే రక్త సరసుంది.

వాడి చేతిలో గుండెల్ని సుతిమెత్తగా తెరిచే రహస్య తాళం చెవి వుంది.

అనుమతివ్వాలో లేదో తేల్చుకోకముందే ఆమె గుండెను తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నాడు వాడు. రోజులు అగరొత్తులుగా వెలిగినయ్.

వాగ్దానాల ఊసులు దవనపు వాసనలైనై.

సెలవులయి పోయినయ్.

వొచ్చినంత వేగంతో తిరిగి దూరపు కాలేజీ పుస్తకాల్లోకి పారిపోయాడు వాడు.

వెళిపోయేప్పుడు కిటికీలు ముయ్యలేదు. తలుపు దగ్గరికయినా వెయ్యలేదు. కలలు కళ్ళని కమ్మేస్తే గుండెని బార్లా తెరిచి, గాయం చేసి వెళ్ళిపోయాడు.

గుమ్మం దగ్గరే మొక్కగా వుండగానే మానైపోయి వాడి కోసం రెప్పలు పీకేసిన కళ్ళతో వెతికింది ఆ పిల్ల.

ఆ తరువాత ఆ గుమ్మం దగ్గరకి రకరకాల తాళాల వ్యాపారులొచ్చారు. వాళ్లంతా తాళాల దొంగలే తప్ప గుండె చప్పుడు వినగలిగిన వాళ్ళు కాదు. కొందరు పాత తాళాలకి కొత్త తాళాలు అమ్మేవాళ్ళయితే మరికొందరు కొత్త తాళాల్ని త్వరితంగా తుప్పుతాళాలుగా మార్చేసేవాళ్లే. ఆ యినప వ్యాపారులందరికీ ఇనప బీరువాలు తెరవగలిగిన తాళాలు కావాలి. అంతే.

వాళ్లంతా అనేక జంతువులని వెంట తీసుకొచ్చేవారు. అవి మానవ భాషలో తెగ అరిచేవీ, కరిచేవీ. తండ్రీ కొడుకులూ, అన్నదమ్ములూ, మామ అల్లుళ్లు, బావ, బావమరుదులు, రకరకాలైన జంతువులొచ్చేవి. ఒకడు బొజ్జతో ఖద్దరు వాసన కొడతాడు. మరొకడు కాంట్రాక్టుల వాసన వేస్తాడు. ఒకడు కాసేపు దేహంలోకి వుమ్మూసి బస్సెక్కో, రిక్షా ఎక్కో పాపం చేసినవాళ్ళా పారిపోతాడు. మరొకడు రాత్రంతా కాండ్రించి వూసి తెలతెలవాడుతుండగా మళ్లీ మామూలు ముఖం తగిలించుకుని జారుకుంటాడు. అందరి చర్మపుభాషా ఒకటే. ఒక్కడూ గుండె చప్పుడు వినడు.

ఉమ్ముల దారిలో చర్మం బీటలు వారుతోంది. శరీర వృక్షం బెరడు, పెళ్లులుగా రాలుతోంది. అయినా ఆశ చావదు. వాడెప్పుడో యీ దారంట వస్తాడు. పశ్చాత్తాప్పడతాడు. మనసులో తిరిగి మరులు పూయిస్తాడు. ఇల్లూ, పిల్లలూ చల్లని సంసారంతో సన్నజాజి పందిరి వేస్తాడు. వాడి కోసం రోడ్డుమీద మొహాలు చూడ్డం, వీలున్నప్పుడల్లా వీధులంట తిరగడం, పార్కులో మూల కూర్చుని రావడం మానలేదు ఆమె.

ఒక రోజున పార్కులోనే చాలా రాత్రి అయిపోయింది. రెండ్రోజుల్నుంచీ తిండి లేదు. నీర్సంగా ఉంది. ఇంటికి పోదామని లేచేసరికి వర్షం మొదలయింది. పరుగెత్తుకెళ్ళి పార్కులోనే మూల షెడ్డు లాంటిదుంటే అందులోకి జేరింది. అప్పటికే ఒంటిమీద బట్ట లాంటిది తడిసింది. మెరుపుల్తో వాన పెరుగుతోంది. కింద నాపరాయి, పైన రేకులు, జల్లు మీదకి చిందడం లేదు, కాస్త పర్వాలేదని ముణగదీసుకుని మూలకు జేరబడింది. ఎవరూ దరిదాపులో లేరు. దూరపు గుడ్డి లైట్ వెల్తురు. వర్షం. తన పక్కనే మెరుపుల్లో చూస్తే ఎవడో ఒకడు పడుకున్నట్లు కనబడింది. పరకాయించి చూసింది. మళ్లీ మెరుపులో చూసినప్పుడు అంత విషాదంలోనూ నవ్వొచ్చింది.

అది ఆ వూరుని ఒకప్పుడు ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలిన ఒక గొప్ప రాజకీయ నాయకుడి విగ్రహం. బతికుండగా ఆయన అనేక పదవులు అలంకరించాడు. చేతికి ఎముకల్లేవన్నారు. శ్రీమహావిష్ణువే సాక్షాత్తు యీయన రూపంలో ప్రజాసేవ నిమిత్తం అవతరించా డన్నారు. పేదల పాలిటి పెన్నిధి అన్నారు. సంఘసంస్కర్త అన్నారు.ఒకప్పుడు పార్కు మధ్యన తిన్నె మీద రాజసంగా నుంచుని నీరాజనాలు అందుకున్నదా విగ్రహం. ఇప్పుడు ప్రత్యర్థులు పదవిలో కొచ్చాక షెడ్డులో పడుంది.

ఆ సిమెంట్ విగ్రహాన్ని ఆనుకుని గోడకి చేరగిలబడిందామె. ఎప్పుడు పట్టిందో నిద్ర. వర్షం పడుతూనే వుంది. శరీరం నేల మీద మూలకి ముణగదీసుకుని తుఫానులో చెట్టులాగా వాలిపోయింది. కమ్మటి నిద్ర పట్టేసింది. పాత కల.

నిద్రలోనే వాడితో గడిపిననాటి కల దుప్పటిగా కప్పుకుంది.

అమాయకపు జంతువు మొహంతో వాడు వచ్చాడు. తలుపు తట్టాడు.

పశ్చాత్తాప్పడ్డాడు. క్షమించమన్నాడు.

తిరిగి గుండె తాళం తెరిచాడు. బలంగా, బరువుగా మాటల మత్తు వాసనల్తో యింటి నిండా వసంతం నింపాడు. వాడి కౌగిట్లో కళ్ళు మూసింది. ఆవేశంలో కొట్టుకుపోయింది. అలిసిపోయి ఒడ్డుకుజేరి పడిపోయింది.

వర్షం పెద్దదైంది. గులకరాళ్ళతో బాధడం మొదలెట్టిందల్లా క్రమంగా ఆకాశంలోని బండరాళ్లని దొర్లిస్తున్నట్లు మారిపోయింది. కసిగా నీటి ఖడ్గం గాలిని కోస్తోంది. భూమిని తరుముతోంది. ఎక్కడో పిడుగు పడింది. ఆ పిడుగు ఆమె మూసిన కనురెప్పల మీద పడింది. ఆమె గుండెల్లో పడింది. ఆమె కల మీద పడింది. ఆమెకి చప్పున మెలకువొచ్చింది. వెల్లకిలా పడుకున్నదల్లా వెంటనే లేవాలని ప్రయత్నించింది. లేవలేకపోయింది. ఒంట్లో సత్తువనంతా కూడా తీసుకుని లేవాలని ప్రయత్నించింది. కానీ, లేవలేకపోయింది. తన మీద ఏదో బరువుగా పడుకునుంది. దుంగలా పడుంది. రాతిబండలా కదలనివ్వకుండా మెదలనివ్వకుండా పడివుంది. భూమిలోకి అదుముతున్నట్లనిపిస్తున్నది. ఒక్కసారి ఖణేల్మన్న మెరుపులో ఆమెకి తానెక్కడవుందో, తనమీద ఏమి పడివుందో కనబడింది. తన శరీరంలోని అణువుల శక్తినంతటినీ కూడదీసి బలంగా తనపైనున్న ఆ సిమెంటు శరీరాన్ని పక్కకు తోసేసి నిలబడింది. మరో మెరుపులో కిందకిచూసింది. సిమెంటు విగ్రహం. తనవంకే నవ్వుతూ చూస్తున్న రాజకీయ నాయకుడి విగ్రహం. తిరిగి సిమెంటు చేతులతో దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె వూడిపోయిన తన చీర ముక్కని ఒంటి చుట్టూ చుట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. తను కలలో జేరింది ఆ విగ్రహం కౌగిట్లోకా! విగ్రహం చేతులు వెకిలిగా నవ్వుతూ ఆమెను తిరిగి పొదుపుకోవడానికి ముందుకొస్తున్నయ్. ఆమెకి మతిబోయి, పరుగెత్తుకుంటూ వర్షంలోనే బయటికి వచ్చి పడింది! కంగారులో దారి తప్పింది. ఎప్పటికో యింటికి జేరింది.

నెల తప్పింది.

కడుపులో సిమెంట్ బలంతో మరో మొక్క దేహం రాళ్ల మధ్య వేళ్లూనింది. మొక్కని పీకెయ్యలేకపోయింది.

ఆకాశం పొట్టచిరిగి పేగులుబయట పడ్డట్లు మెరుపులు.

దేహంపై నిరంతరం కురిసే మురికి వాన. లోకపు స్మశానం నిండా కంకాళాల్లా పెరిగిపోతున్న తాళపు చెవులు. ముఖాల్లో అడవి జంతువుల హాహాకారాలు. అయినా, ఆమెలో ఆశ చావలేదు. వాడెప్పుడో వస్తాడు. గాయాలు కడుగుతాడు. గుండెదగ్గర తిరిగి ప్రేమ పిల్లనగ్రోవి నూగుతాడు.

మరో గులాబీ మొక్క పెంట పోగులు ఎదుగుతోంది. వెయ్యి రేకల్తో వికసించబోతోంది. సిమెంటు చేతుల్లోకి, కాళ్ళ కిందకి, ప్రతి మురికి అవయం కిందకీ జేరి అణిగిపోబోతోంది.

రాజకీయ నాయక జంతువులు బతికి వున్నప్పుడే గాక, చచ్చి విగ్రహాలుగా మారి కూడా ప్రజల భవిష్యత్తుని విషయిస్తూనే వుంటారు. తమ సంతతిని పెంచుకుంటూనే వుంటారు.

సృష్టికి సిగ్గు లేదు.

 

 


 

No comments: