సూర్యుని తరుముతూ పరుగు
ఛేజింగ్ సన్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని
చూసినప్పుడల్లా ఒక అనుమానం ఎదురవుతుంది. డు ము వు లు ప్రథమ అనే సూత్రం ప్రకారం
సూర్యుడు అంటే ఒక మగ మనిషి. రామః రాముడు అవుతాడు. కృష్ణః కృష్ణుడు అవుతాడు. అదే
పద్ధతిలో సూర్యః పోయి సూర్యుడు అవుతాడు. వీళ్లంతా దేవుళ్ళు. మగవాళ్లు. అయినా
రాముడు. కృష్ణులకు మీసాలు ఉండవు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి ఒక ఊరు. అక్కడ సూర్యుని
గుడి ఉంటుంది. అందులోని దేవునికి మీసాలు ఉంటాయి. ఆ గుడిని చాలా కష్టపడి కట్టారు.
సంవత్సరంలో ఒకనాడు ఆకాశంలోని సూర్యుని కిరణాలు (ఈ సూర్యుని గురించి రాయవలసిన చోట
సూర్య గోళం అని రాయడం అలవాటయింది.) గుడిలోని సూర్యుని మీద నేరుగా పడే విధంగా
దాన్ని కట్టారు. గాలిగోపురంలో అందుకు అనువుగా కిటికీల్లాంటివి ఉన్నాయి మరి. గుడిలో
దేవుడు మగ దేవుడు. చిత్రంగా ఆడదేవతలు ఉంటారు. ఆలుమగలు ఉంటారు. ఆ సంగతులు ఇక్కడ
అవసరంలేవు.. మరి దేవుడు అంటే సూర్యుడు మగవాడా అవునంటున్నారు మరి పెద్దలు. ఆయనకు
రథం ఉంటుంది. దానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే తొడలు లేని సారథి ఉంటాడు.
చిన్నప్పటి నుంచి ఎటువంటి సంగతులు మాకు చెప్పి చెప్పి తలకెక్కించారు. ఆకాశంలోని
సూర్యుడు మండే వాయువుల ముద్ద అని కూడా చెప్పారు. బడిలో ఎక్కడ అటువంటి పాఠం చదివిన
గుర్తు లేదు.. ఆ సంగతులు మరేదో మార్గంలో తెలిశాయి. ఆలోచన గల ఎవరికయినా తికమక
మొదలవుతుంది. ఆకాశంలోని సూర్యునికి రథం ఉంటే కనిపించాలి కదా! అది ఎన్నడూ
కనిపించలేదు మరి!
మండే వాయువుల ముద్దకు రథం ఎందుకు గుర్రాలు ఎందుకు
సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో 90 శాతం, ఇంకా ఎక్కువ మంది అవును అంటారు. ఈ మధ్యన కొంత మంది, పిల్లలు మాత్రమే ధైర్యంగా కాదు
అనగలుగుతున్నారు. సూర్యుడు ఒకచోట ఉంటాడు. కదిలిన మనకు తెలిసే విధంగా కదలడు, అన్నారు ఆ పిల్లలు. భూమి సూర్య గోళ్లను
చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంతో పాటు అది బొంగరం లాగా తన చుట్టూ తాను
తిరుగుతుంది. కనుక మనకు సూర్యుడు ఉదయించిన భావం కలుగుతుంది, అని పిల్లలకు అర్థమైంది అన్నమాట.
సన్ (ఎస్ యు ఎన్) అంటే సూర్యుడు. సన్ (ఎస్ ఓ ఎన్) అంటే
కొడుకు. ఎంత బాగుందీ పద్ధతి నా కొడుకు నాకు ఆకాశంలో సూర్యుని వలె వెలుగుతూ
కనబడతాడు. అందరు పిల్లలు అలాగే కనబడతారు. సూర్యుడు, చంద్రుడు విరాట్ పురుషునికి రెండు కళ్ళు అన్నారు, వెనకటివారు. ఆరింటికి పోలికే లేదు. అని
ఎంతమందికి అర్థమయింది
మనిషి దేవుళ్లను సృష్టించాడు. వారికి తనలాగే రెండు
చేతులు, రెండు కాళ్లు
ఉన్నట్టు ఊహించాడు. అంతకన్నా మరొకరకంగా ఊహించడం అమాయకం మనిషికి చేతకాలేదు. విరాట్
పురుషునికి 1000 కళ్ళు, 1000 కాళ్లు ఉన్నాయి అన్నారు. అది ఎట్లా
వీలవుతుంది అని ఆలోచన కలిగినట్లు లేదు. ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు గనుక
వదిలేద్దాం.
విజ్ఞాన సర్వస్వంలో చూస్తే ఆకాశంలో సూర్యుడు ఎల్లో
డ్వార్ఫ్ రకం నక్షత్రం అని రాసి ఉంది. దాని ద్రవ్యరాశి 1,909 X 10 10 (అంటే ఒకటి పక్కన
పది సున్నలు పెట్టాలన్నమాట) కిలో గ్రాములు. డయామీటర్ అంటే చుట్టుకొలత 1,392,000 కిలోమీటర్లు అని కూడా ఉంది అక్కడ. అది
భూమి నుంచి తొమ్మిది కోట్ల 30 లక్షల మైళ్ళ
దూరంలో ఉంది. మరీ సరిగా చెబితే.92,955,887.6 మైళ్ళ దూరంలో
ఉంది. అంత దూరాన్ని కుదించి 9 కోట్ల 30000 అంటే కొంపేమీ మునగదు. సూర్యుడు అంటే
నక్షత్రం. అది చిన్న నక్షత్రం. అది పుట్టినప్పుడు కొంత పదార్థం దూరంగా చిమ్మింది.
ఆ పదార్థం ముద్దలు కట్టి గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. భూమి పదార్థంలో కొంత
భాగం దూరం పోయి చంద్రగోళం తయారయింది. అది భూమి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు, చంద్రుడు మధ్య పోలిక లేదని
తెలిసిపోయింది. సూర్య గోళం మండుతుంది కనుక వెలుగునిస్తుంది. చంద్ర గోళానికి స్వంత
కాంతి లేదు. ఈ అక్షరాలను మీరు పగలు చదువుతున్నారంటే, అందుకు అవసరమైన వెలుగు సూర్య గోళం మంట నుంచి వస్తున్నది.
ఆదిత్యాయ, సోమాయ అంటూ
మనవాళ్లు గ్రహాలకు దండం పెడతారు. బడిలో మాత్రం సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు
తిరుగుతుంటాయి, అని చెప్పారు.
ఇప్పుడు పాత లెక్క తప్పు, లుతో గ్రహం
కాదు. ఉన్న గ్రహాలు ఎనిమిది మాత్రమే అంటున్నారు. మన సంప్రదాయంలో రాహుకేతువులను
గ్రహాలు అన్నారు. వాళ్ళిద్దరూ సూర్యుని, చంద్రుని మింగితే గ్రహణం వస్తుంది అని మాకు చిన్నప్పుడు చెప్పారు. ఇప్పటి
పిల్లలకు గ్రహణం గురించి బాగా తెలుసు.
ఒక విషయం గురించి రకరకాలుగా చెబితే ఎవరికైనా తికమక, అనుమానం తప్పదు. చంద్రుడు మగ (మనిషి
కాదు సుమా!), నక్షత్రాలు ఆయన
భార్యలు అన్నారు. సూర్యుడు, (సూర్య గోళం) ఒక
నక్షత్రం. దాని చుట్టూ తిరిగే భూమి నక్షత్రం కాదు. సూర్యుని కన్నా చాలా చిన్నది
అది. ఆ భూగోళం చుట్టూ తిరిగే బుజ్జి గోళం చంద్రుడు. లేదా చంద్రగోళం. ఆయనకు
నక్షత్రాలు భార్యలు అంటే అది పొసగని సంగతి.
సంప్రదాయంలో చెప్పే సంగతులు వేరు. ప్రత్యక్షంగా మనం
చూసేది వేరు అని ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. తికమక అవసరం లేదు. ఎవరినీ తప్పు
అనడం అంతకన్నా అవసరం లేదు. పడమటి దేశాల వారు చంద్రుడిని స్త్రీగా భావిస్తారని
ఎవరికైనా తెలుసునా కానీ అది నిజం.
ఋగ్వేదంలో ఒక మాట ఉంది. కాంతిగల, కాంతి కలిగించే కాంతి వెలిగితేనే, మొత్తం విశ్వమంతా వెలుగుతుంది, అని అక్కడ చెప్పారు. పాశ్చాత్య
నాగరికతలో సూర్యునికి అపోలో అని పేరు. అపోలో అంతరిక్ష నౌకలు సూర్యుని దగ్గరకు
వెళ్లే ప్రయత్నం చేయలేదు. అవి చంద్రగోళ మీద దిగాయి కూడా.
అన్నింటికీ మించి గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. సూర్య
గోళం నుంచి భూగోళం వరకు గల దూరం ఎంతో విచిత్రమయినది. అంతకన్నా దగ్గరగా, లేక దూరంగా ఉన్న గ్రహాల మీద జీవం లేదు.
ఇన్నర్ ప్లానెట్స్ అనే దగ్గర గ్రహాలు మండిపోతుంటాయి. దూరం గ్రహాలు చెప్పరానంత
చల్లగా ఉంటాయి. భూగోళం మీద మాత్రమే నీరు ఉంది. అది ఆవిరి, నీరు, మంచు అనే మూడు స్థితులలో ఉండగలుగుతుంది. కనుకనే ఇక్కడ జీవం ఉంది. నీటిని, సూర్యుని వెలుగును వాడి జీవం పిండి
పదార్థం అనే తిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నది. జీవుల మనుగడకు సూర్యుడే
ఆధారం. వానలు కురిసి అంతా బురద అయిన తర్వాత మళ్లీ ఎండకాస్తే, పరిస్థితి మామూలు అవుతుంది. భూమి మనకు
తగిన విధంగా పొడిబారుతుంది. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదు. పగలు, రాత్రులు లేవు. రుతువులుండవు. వర్షాలు
కురవవు!
ఇంతకూ సూర్యుడు అనాలా సూర్య గోళం అనాలా ఎవరైనా చెపితే
బాగుంటుంది!
No comments:
Post a Comment