సైన్స్ - ఆసక్తి
సైన్స్ అంటే ఏమిటి? అని కొంతమందిని అడిగి చూడండి. అదేదో ఉంది గానీ, ఆ సంగతి మనకు ఎందుకు? అంటారు చాలామంది. సైన్స్ అంటే అది మన గురించి అన్న ఆలోచన ఇంకా చాలమందికి రాలేదని అర్థమవుతుంది. సైన్స్ అంటే మన గురించిన సంగతులే. అయితే వాటిని చెప్పే తీరు కారణంగ వాటితో మనకు సంబంధం లేదు అనిపించింది. అయినా అందరూ తెలిసి తెలియక సైన్సును వాడుకుంటారు.
తెల్లవారుతుంది. పొద్దుమూకుతుంది. రాత్రి అయితే చీకటి
వస్తుంది. వెన్నెల ఉంటే రాత్రి కూడా వెలుగు ఉంటుంది. కనుక చుక్కలు ఒకటి రెండు
మాత్రమే కనబడతయి. ఆలోచించి చూస్తే ఇదంతా సైన్సే గదా? వానలు,
ఎండలు, మళ్లీ ఒక పద్ధతిలో వస్తయి. పంటలు ఒక
పద్ధతిలో పండుతయి. పూలు ఒక పద్ధతిలో పూస్తయి. పూలు అందమైన రంగులలో ఉంటయి. పూలు,
పంటలకు ఆ పద్ధతులు, రంగులు ఎందుకు అవసరం అన్నది ఎవరికి
తోచదు. ఎందుకట్ల? కొంతమందికి మెదడులో ప్రశ్నలు
పుడతయి. ఆ సంగతుల గురించి పరిశీలన, ప్రయోగాలు మొదలవుతయి. కొన్ని
సంగతులు అందరికీ అర్థమయ్యే పద్ధతిలో తెలుస్తయి. పూలు అందంగ, ఆకర్షణ ఉండవు అనుకునే వాండ్లు ఉంటరా?
చూచే వారిని బట్టి అందం ఉంటుందని ఒక మాట ఉంది. అయినా పూలు
అందరికీ అందంగనే కనవడతయి. ఆ రంగుల అవసరాన్ని, తీరును గురించి పట్టించుకుని
పరిశీలించే వారిని సైంటిస్ట్ లు అంటున్నరు.
ఒక సంగతి వెనుక లోతయిన కారణాలు ఉంటయి. అవి తెలియనంత సేపు ఆ
సంగతులు అర్థం కానట్టే ఉంటుంది. కొంచెం ప్రయత్నం చేస్తే ఏ సంగతి అయినా
అర్థమవుతుంది. ఎండాకాలంలో బట్టలు ఎందుకు తొందరగ ఎండుతయి?
పట్టించుకోలేదు అంటే ప్రశ్న అట్లనే మిగులుతుంది. కొంచెం
ఆలోచిస్తే సంగతి తెలుస్తుంది. గాలిలో తేమ తక్కువగ ఉండడం అందుకు కారణం! ఆశ్చర్యం
లేదు!! ఈపాటి ఆలోచన ఉంటే ఏ సంగతి అయినా అర్థమవుతుంది. అట్ల అర్థమయిన సంగతులను
సైన్స్ అంటరు. అన్నింటిని గమనించాలె. కొంచెం ఆలోచించాలె. అంతమాత్రాన అందరూ
సైంటిస్టులు కావాలని లేదు. ఆ సంగతి అర్థమయితే చాలుగదా!
ఈ అర్థం చేసుకునే తీరు గురించి ఒక ఉదాహరణ తీసుకుందము.
సాయంత్రం వాన కురిసి వెలిసింది. కొంత ఎండ వచ్చింది. అప్పుడు ఆకాశంలో తూర్పు
దిక్కున ఇంద్రధనుస్సు కనబడుతుంది. ఇంద్రధనుస్సు అందంగ ఉంటుంది. నిజమే! కానీ అది
ఎందుకు కనబడింది అన్న సంగతి చెపితే విషయంలో మజా పెరుగుతుంది. కాదు,
తరుగుతుంది అన్నరు కొందరు. కీట్స్ అని ఒక కవి. న్యూటన్
పరిశీలన తరువాత ఇంద్రధనస్సు రంగుల వివరం చెప్పినడు. ఈయన ఎవరో వచ్చి అందం గురించిన
భావనను అంతం చేసినడు! అన్నడు ఆ కవి. నిజంగ సైన్సును అర్థం చేసుకోని ఆలోచిస్తే
ఇంద్రధనుస్సు రహస్యం తెలిసి ఆనందం కలుగుతుంది గదా!
వానలు ఇంద్రుని వలన కురుస్తయని మనవారు నమ్మినరు. కనుక ఆయన
బాణం అక్కడ కనిపించింది, అనుకుంటే అది అమాయకత్వం. ఇంద్రుడు
లేడు, రాలేదు. ఆయన ఆయుధం విల్లు,
అమ్ములు అనే కాదు. ఇంద్ర ధనుస్సు అనే అందం అన్నది, చూచే వాండ్ల
కండ్లలో ఉంది గానీ, అసలు అక్కడ చేతితో తాకి చూడగలిగిన
పదార్థం లేనేలేదు. అది పుట్టలో పుట్టింది అని మనవాండ్లు కథలు చెప్పినరు. సింగిడి
అనే వంకర వెలుగు ఎందులోనూ పుట్టలేదు. అది అందరికి కనబ డుతుంది. అయితే ఎవరి సింగిడి
వారిదే. ఒక్కొక్కరు నిలబడిన చోటును బట్టి ఇంద్రధనస్సు కనబడుతుంది. అక్కడ అది
ధనుస్సు ఆకారంలో ఉండదు. వృత్తంలో పైభాగం వలె గుండ్రముగ ఉంటుంది.
సైన్స్ గురించి చెప్పే ప్రయత్నంలో గొప్ప సైంటిస్టులు,
రచయితలు, కార్ల్ సేగన్,
రిచర్డ్ డాకిన్స్, జిమ్ అల్ ఖలీలీ,
అందరు సింగిడినే ఉదాహరణగ చెప్పినరు. ఈ ఇంద్రధనస్సు రావాలంటే
ఎండ ఉండాలె. వాన గూడ ఉండాలె. ఎండ, వాన కలిసి ఉంటే పిట్ట పెండ్లి అని
మా చిన్నప్పుడు చెప్పినరు. పిట్టలకు పెండ్లి జరగదు. కనుక మనము సైన్సు దారిలో
ఆలోచనను ముందుకు సాగించే ప్రయత్నం చేతము. ఈ సైన్స్ ఆలోచన ఇంద్రధనస్సు కంటే అందముగ
ఉంటుంది. సింగిడి సాయంత్రమే కనబడుతుంది. సూర్యుని వెలుగు పడమటి దిక్కు నుంచి
పడుతుంటుంది. మధ్యలో ఆకాశంలో వాతావరణంలో లక్షల నీటి చుక్కలు ఉంటయి. వెలుగు వాటిలో
నుంచి దూరి, విడిపోయి అవతల తూర్పు ఆకాశంలో ఒక
వరుసలో కనబడతుంది. అదే, మధ్యాహ్నం వాన తరువాతే ఎండ వస్తే,
నడి నెత్తిన ఉన్న సూర్యుని చుట్టు,
అసలయిన వృత్తముగ రంగులు కనబడతయి. దాన్ని వరదగూడు అంటరు. అది
అంత తరచుగ కనిపించే సంగతి కాదు.
వెలుగు అద్దం మీద పడితే వెనుకకు వస్తుంది. అది పరావర్తనము.
నీటి మీద, పట్టకము మీద పడితే వక్రీభవనము
చెందుతుంది. అంటే దాని దారి మారుతుంది. నీటి బొట్టులో నుంచి దూరిన వెలుగు,
ఆ బొట్టు అవతలి దిక్కు నుంచి బయటపడే సమయంలో రంగులు
విడిపోతయి. అదే సింగిడిగ, ఇంద్రధనస్సుగ మనకు కనబడుతుంది. ఆ
రంగు కిరణాలు నలభయి నుంచి నలభయిరెండు డిగ్రీల కోణంలో బయటికి వస్తయి గనుక,
రంగులు ఒకదాని తరువాత ఒకటి వరుసగ కనబడతయి. ఎక్కువ వంగిన
వయోలెట్ రంగు అన్నింటికన్న కింద, ఆ తరువాత ఇండిగో,
నీలం, ఆకుపచ్చ,
పసుపు, ఆరెంజ్,
చివరకు పై అంచున ఎరుపు కనబడతయి.
సూర్యకాంతిలో ఈ రంగులన్నీ కలగలిసి ఉంటయని రకరకాల ప్రయోగాలతో
ఋజువు చేసినరు. మనం భూమి మీద నుంచి చూస్తము గనుక వృత్తంలో పైసగం మాత్రమే
చూడగలుగుతము. ఇందులో ధనుస్సును తాకలేము! అందులో ఉండేది వెలుగు మాత్రమే! పదార్థం
కాదు. సహజ వాతావరణం, మనిషి మెదడు కలిస్తేనే అది
కనబడుతుంది. ఇంత చెప్పినా ఇది ఒక రకం ఇంద్రధనస్సు గురించి మాత్రమే. యాభయి,
యాభయిమూడు డిగ్రీలు వంగిన రంగు కిరణాలతో తిరగబడిన రంగుల
ధనుస్సు కూడా కనబడుతుంది. అంటే ఒకేసారి రెండు సింగిడిలు పడుతయి.
ఆలోచన చేసేందుకు ఓపిక ఉంటే, ఇది ఒకటే కాదు,
ఈ ప్రపంచంలోనే అన్ని సంగతులు అర్థం చేసుకోవచ్చు. మనిషి
మొదటి నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నడు. తెలిసిన ఎన్నో సంగతులు,
వర్గీకరణకు గురయి, భౌతిక,
రాసాయనిక, జీవ, భూగోళ వంటి శాస్త్ర
విభాగాలు పుట్టినయి. ఆ తరువాతనే, సైన్సు మనకు కాదు అన్న భావన మొదలయింది.
సైన్స్ అంటే మనం, మన ప్రపంచం,
పరిసరాల గురించిన తెలివి. ఇది సత్యం!
No comments:
Post a Comment