అమ్మ - ఆ తరం
సైజ్ జీరో
అన్నం తినమంటే పరోపకారం
చేస్తున్నమన్నట్టు బాధగ మొగాలు వేలాడేస్తున్నరు ఇవాళటి ఆడపిల్లలు. ఇంటిపనులు
చేయమని, చదువు వయసు పిల్లలకు చెప్పే ధయిర్యం ఏ తల్లిదండ్రులకన్న ఉందేమో తెలియదు.
గుమ్మిలో గింజలు గుమ్మిలోనే ఉండాలె. పిల్లలు మాత్రం పందికొక్కుల వోలె (లాగ) ఉండాలె, అని
ఒక మాట ఉన్నది. తిండి తినగూడదు. పని, వ్యాయామం చెయ్యగూడదు. కాని మనుషులు
మాత్రం ఆరోగ్యంగ ఉండవలెనంటే ఏ రకంగ వీలవుతుందో తెలియదు. ఈ పిల్లలకు తమ బతుకులు
తాము బతికే సత్తా, ఆరోగ్యం కూడా లేదని నా అనుమానం. స్నానం గదిలో, ఇంటినిండా
కనిపించే ఊడిన తల వెంట్రుకలు చూస్తుంటే నా గుండె గొంతుకలోకి వస్తుంది. అనుక్షణం
అమ్మ గుర్తుకు వస్తుంది.
అమ్మ అసలే చిన్న ఆకారం. చీమలాగ క్షణం
తీరిక లేకుండ పని చేసేది. ఆమెకు తీవ్రమయిన అనారోగ్యం కలగడం నాకు గుర్తులేదు. ఆమె
శరీరంలో అదనంగ ఒక గ్రాము కొవ్వు నాకు కనిపించలేదు. గాలిలాగ, లేగదూడలాగ
కదలాడిన అమ్మ నాకు గుర్తుంది. ముసలితనం వచ్చిన తరువాత కూడా తానొక్కతే ఉండి
వండుకుని తిని స్వతంత్రంగ బతికింది ఆ తల్లి. ఆమె చేసినంత శరీర శ్రమ, పరోపకారము
మరెవరన్న చేసినట్టయితే పుణ్యం సంగతి పక్కనపెట్టి, సైజ్
జీరో శరీరం కోసం అంగలారుస్తరే, పిల్లలు, అది
వద్దన్నా వస్తుంది.
అమ్మకు, ఒక
అమ్మకు కావాల్సిన పనులన్నీ వచ్చు. వాటికి మించి మరెన్నో పనులు వచ్చు. పాటలు వచ్చు.
మరేవేవో వచ్చు. మా అమ్మ వంట బాగ చేసేదని నేను, ఇవాళ
చెపితే అదెట్లాగుంటుందో చెప్పడానికి నాకు ఉదాహరణ కూడా తోచలేదు. పండుగ గానీ, పర్వంగానీ, మరోటి
గానీ ఒంటిచేతి మీద వంట చేసి అవతల పెట్టేది ఆ తల్లి. అమ్మవల్ల రుచిగ తినడం మాకందరికి
అలవాటయింది. అమ్మకు సాయం పేరున వంట చూచినందుకు వంట కూడ అలవాటయింది. అమ్మ చింతపండు
నీళ్లలో పిసికి, ఇంత ఉప్పు, పసుపు వేసి తిరగమోత వేస్తే అది
అమృతంలాగ వుండేది. రుచికరమైన వంట అంటే, ఖరీదైనవని
అన్న అర్ధం ఏనాడు లేదు. గరిక పచ్చడి, తవుడు తొక్కు, రేగుపండ్ల
తొక్కు, గునుగ్గూర పప్పు, బొంతకాకర
పులుసు! అమ్మ ఏం చేసినా అది రుచిగ ఉండి తీరాల్సిందే. అరటి కాయ బజ్జీలు, ఆలు
బజ్జీలు మాకు తెలియనే తెలియవు. ఎన్నపూస అలం ఆకులు, నిత్యమల్లె
ఆకులు తెచ్చి వాటిని కలిపి బజ్జీలు చేస్తే...(ఛా! తప్పు చేస్తున్న అవన్నీ గుర్తు
చేసుకోని! ఎక్కడ దొరకాలె ఆ రుచులు!) అప్పడాలు, వడియాలు, ఉప్పొరుగులు, అటుకులు, ఏపుడు
బియ్యం, ప్యాలపిండి, పాలపిండి
అన్ని ఇంట్లోనే సిద్ధం! రుచికి రుచి, ఆచారానికి ఆచారం, ఆరోగ్యానికి
ఆరోగ్యం! అమ్మ పచ్చజొన్న రొట్టెలు కాల్చి పొయ్యి చుట్టూ సెగకు నిలబెట్టి తరువాత
జల్లబుట్టిలో పేర్చి పెడితే వాటి బొరుగు (కరకర) ముందు బిస్కట్లు ఎందుకు పనికి
రావుగద! తపిలంటు, దిబ్బణాలు అసలైన పల్లెటూరి చిరుదిండ్లు. ఇక పిండి వంటల
గురించిన ప్రసక్తి ఎత్తనే గూడదు. అమ్మ చేసిన నూవుల కర్జెకాయలు తలచుకుంటే బతుకు
ఇట్ల ఎందుకు మారిందని బాధ అనిపిస్తుంది. ఇన్ని మాటలు చెపుతుంటే అమ్మకు చేతనయింది
వంట ఒక్కటేనేమో అని అనుమానం రావచ్చు. అందుకనే ఆపేసి ముందుకు పోత!
ఆకులు, దొప్పల
సంగతి : మధ్యాహ్నమయిన తరువాత కమ్మలకత్తి తీసుకుని పొలాల వెంట అమ్మతోబాటు
పోయేవాడ్ని. మర్రి ఆకులు, మోదుగాకులు సేకరించుకురావడం మా
పని. తెచ్చిన వాటితోటి ఇస్తరాకులు (విస్తర్లు), దొప్పలు
కుట్టాలె. ఆ కుట్టేటందుకు జొన్న చొప్పను చీరి పుల్లలు తయారు చేసుకోవాలె. ఆకులు
కుడితే ఆ కుట్టు ముత్యాలు జాలువోసినట్టు ఉన్నది, అని
వర్ణించే వారు అప్పట్లో. అమ్మ కొడుకును గద, నాకూ
ఆ విద్య అబ్బింది. దొప్ప (దొన్నె) కుట్టి, అంతదూరం
ఇగ్గితే(విసిరితే) అది బోర్ల పడకుండ నిలబడాలె. అది నాణ్యతకు గుర్తు. ఈ విద్యలో
నాకు అదనంగ పక్కింటి తాతగారి కోచింగ్ కూడ ఉంది! విస్తర్లు కుట్టడం గూడ ఒక విద్యేనా
అని నాకూ అనిపించేది అప్పుడప్పుడు. కాని అది విద్యనే.
మట్టి పొయ్యిలు గట్టడంలో అమ్మకు పోటీలేదు.
ఆ పొయ్యిలో కట్టెలుపెట్టి వంట చెయ్యాలెగద! మట్టి పొయ్యి నిర్మాణం ఒక హస్తకళ అ నాకు
అప్పట్లోనే అర్థమయింది. ఊళ్లో కొంతమంది అమ్మను గౌరవంగ వెంట తీసుకునిపోయి, ఆమె
పర్యవేక్షణలో పొయ్యిలు కట్టుకోవడం నేనెరుగుదును. మరీ చిన్న పిల్లల పోషణ, బాలింతరాలి
ఆరోగ్యం విషయంలో అమ్మ ఎంతో మందికి సలహాదారు, సహాయకురాలు. ఈ పని నెనెందుకు చెయ్యాలె, అని
ప్రశ్న అడగకుండ, ఆమె మైళ్లు నడిచిపోయి అందరికీ సహాయం చేసింది. ఆమె
పేరెత్తితే చాలు ఇప్పటికీ అందరూ చేతులెత్తి దండం పెడతరు! అవును, ఆమె మా అమ్మ!
కాటుక తయారుచేయడం ఎంతమందికి తెలుసు? అమ్మ
అందులో ఎక్స్పర్ట్. ఆ కార్యక్రమానికి ఒక దినమంతా ప్రత్యేకంగ కేటాయించేవారు.
అందుకు అవసరమైన సంబారాలను ముందే సమ కూర్చుకునేవారు. మేకపెంటికలు సప్లై మాత్రం మా
వంటివారికి అందిన ప్రివిలెజ్. కాటుక వండే చోట ఎవరూ మాట్లాడరు. పిల్లలకు అక్కడికి
అసలే ప్రవేశం లేదు. శుభ్రయిన దూదిలో, దినుసులు ఏవో చేర్చి లావుపాటి
వొత్తి తయారుచేస్తరు. మట్టి మూకుడులో నాణ్యతగల నూనె ఏదో పోసి, ఈ
వొత్తిని వెలిగిస్తరు. దాని మసి పట్టేందుకు ఒక స్తాంబాళం (పళ్లెం) ఏర్పాటు
చేస్తరు. నాకు తెలియని వివరాలు మరేవో ఇక్కడ మిగిలినయని నా అనుమానం. చివరికి, మసికి
నెయ్యి చేర్చి, కాటుక ముద్దగా తీసి, వెండి
భరిణెలో నింపేవారు. కాటుక నలుపు పక్కనపెడితే అందులోంచి పచ్చ కర్పూరం లాంటి మంచి
వాసనలేవో వచ్చేవి. నాకు బాగ గుర్తుంది. ఒక్కోసారి, ఈసారి
కాటుక సరిగా పడలేదు!’ అని తతంగం మరోరోజు మళ్లీ మొదలు పెట్టేవారు.
తల నూనె తయారు చేసేందుకు ఇటువంటిదే మరొక
తతంగం. అమ్మనుంచి నేర్చిన విద్య. బావంచలు, గంధ
కచూరాలు, గౌడలు, తుంగ ముస్తెలు, వరిప్యాలాలు
లాంటివన్నీ నూనెలో చేరుతయి. అప్పట్లో ఆహారంగానీ, ఔషధం
గానీ, మరొకటి
గానీ అన్నీ ఇంట్లోనే తయారవు తుండేవి. వడ్లు అనే వరి ధాన్యాన్ని ఉడికించి, వేపి, రోట్లో
వేసి, రోకళ్లతో
వేటు వేసినప్పుడు వచ్చిన ఆ విచిత్రమైన ధ్వని నాకు ఇవాళటికీ చెవుల్లో సుడులు
తిరుగుతుంది. ఆ సువాసన ఈ నాటి అటుకుల్లో అడుక్కున్నా దొరకదు. పుట్నాల పప్పు
అప్పట్లో కొని తెచ్చుకుంటే అనాచారం. మంగలం అనే మట్టి మూకుడులో పుట్నాలు
తయారుచేయడంలో నేనూ పాల్గొన్నాను కదా! ఆ బతుకు రుచిగలది. ఆ రుచి ఇవాళ రాదు!
ఆ కాలంలో టెయిలర్లు ఎక్కడ. లేడీస్
టెయిలర్లు అసలే కనిపించేవారు కాదు. అమ్మ తనకు అక్కకు, చెల్లికి, మరి
కొందరికి తానే బ్లౌజులు, లంగాలు, పావడాలు
అన్నీ కుట్టేది. నిజంగా ప్రొఫెషనల్గ వుండే కత్తెరయినా కనీసంగ, అమ్మకు
అందుబాటులో లేదని నా అనుమానం. కానీ అమ్మ కుట్టినవి, అమ్మదగ్గర
నేర్చుకున్నవాళ్లు కుట్టినవీ, ఏవయినా, నాసిగా, వికారంగ
వుండలేదని చెప్పగలను. ఆమె కొలతలు ఆమెకు తెలుసు. ఆమె పద్ధతి ఆమెకు తెలుసు. ఆ కాలంలో
చాలామంది అమ్మలు అట్లాగే ఉండేవారని నా నమ్మకం. ఇంటిపని, పాడిపని, పంటపని, వంట
పని, అమ్మలకు
చేతినిండ పని. వీటన్నిటినీ గురించి నిజానికి విడివిడిగా వివరంగ వేరుగ
చెప్పుకోవాలె. అప్పటి పద్ధతులు, కొన్నాళ్లయితే ఎవరికి ఊహకు కూడ
రావేమో!
అమ్మ ఓ సమాచార కేంద్రం, సంక్షేమ
కేంద్రం, శిక్షణ కేంద్రం. అమ్మలు, అమ్మాయిలు
అందరూ ఆమె నీడకు చేరేవారు. కోటకొండ ముసలాయన నేరుగ అమ్మను వెతుకుతూ వచ్చేవాడు.
కోటకొండ అప్పట్లో చేనేత కేంద్రం. ముదురు రంగులలో చీరలు, ఒల్లెలు, రయిక
కణుములు (అనగా బ్లవుజ్ పీస్‌లు) తెచ్చే ఆ ముసలాయన ముసల్మాను. చిత్రమయిన తెలుగు
మాట్లాడేవాడు. ఆడపిల్లలందరూ చుట్టు చేరి ఆయనను ఆటపట్టించేవారు. ‘దబదబ
నెత్తికొట్టురీయమ్మా!’ అనేవాడు ముసలాయన నవ్వుతూ. బేరసారాలు మా అరుగుమీదే సాగేవి.
అమ్మ ఆయనకు అక్కడే అన్నం పెట్టేది. అట్లాగని ఎన్నడూ ఆయన దగ్గర ఏదీ ఉచి తంగా
తీసుకోలేదు. ఆయన వచ్చిపోయిన మరురోజు నుంచీ కుట్టుపనులు మొదలయ్యేవి.
ఇస్తర్లు కుట్టడం, బట్టలు
కుట్టడం, సేవెలు (సేమియాలు) చేయడం, ఏదో
ఒకటి, ఇంట్లో
ఎప్పటికీ సందడిగనే ఉండేది. అందరూ ఆక్టివ్గనే వుండేవారు. పగటిపూట పడుకునేంత తీరిక
ఎవరికీ వుండేది కాదు. బోలెడు పని, కనుక ఆకలి, ఆరోగ్యం, అయినా
జీరోసైజు అనుకోకుండనే వుండేవి!
అమ్మ సంగతే వేరు! అప్పటి అమ్మలే వేరు!
అటువంటి అమ్మలు మళ్లీ రారు! రావాలి! రాకుంటే ఎట్ల?
No comments:
Post a Comment