నా చూపు రేపటి వైపు - సినారె కవితా సంకలనం : నా సమీక్ష
నా
చూపు రేపటి వైపు (కవితా సంకలనం) రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి
సమీక్ష - గోపాలం కె.బి.
పద్మభూషణులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి కవితా కృషీవలులు. ఆయన
జీవితమే కవిత. ఒక విశ్వంభర, కర్పూర వసంత రాయలు లాంటి కావ్యాలను వెలయించినంత
తీవ్రతతోనే, ఆయన సినీ గేయాన్ని కూడా రాస్తారు. ఆయన ఆలోచనే
కవితగా సాగుతుంది. అందుకే ప్రతి జన్మదినానికి ఒక కొత్త కవితా సంపుటి కూడా
పుడుతుంది. 80 వసంతాలు గడిచిన పండుగనాడు ఈ సంకలనం వచ్చింది.
ఇందులో కవితలు 80 మాత్రమే. వీటన్నింటిలోనూ ఒక తలపండిన
తాత్వికుడుగా సినారె మనలను పలకరిస్తారు. కవికి మనసు మాత్రమే ఉంటుంది. వయసు ఉండదు.
తల పండింది అన్న భావం తలపులలో రాదు. అందుకే ఎదుట నిలిచే సుదూర గమ్యం అన్న కవితలో
ఆయన గిరిశిఖరాలపై నుంచి దూకే జలపాతాలు. మోకాళ్లు విరిగిపోతాయేమోనని శంకించవు
అంటారు. అంతటి ఉత్సాహంతో మస్తకంలోని ఆలోచనలను పుస్తకంగా మన ముందు పరిచారాయన.
శీర్షిక - నా చూపు రేపటి వైపు - అని. ఇందులో
వయసు వాసన ఏమైనా కనబడుతుందా?
గతం నిష్క్రమించింది, అమూల్య జ్ఞాపకాల నిధులను నాకు మిగిలించి అది నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. -
అంటారు మొదట్లో. కానీ వెంటనే వర్తమానం నాతో చేయి కలిపి నడుస్తున్నది - అంటారు. అక్కడ నుంచి కవి ముళ్ళబాటలో నడిచి, భవిష్యత్తును చేరుకుంటే, అధ్యయన పాదాల ముందు వాలుతుంది!
ఈ శీర్షిక కవితను 85వ పేజీలో వేశారు. అక్కడ దాని భారం బాగా పడుతుందని కావచ్చు. జ్ఞాపకాల నిధులు
సాధారణంగా, ఎవరినైనా నాస్టాల్జియాలోకి లాక్కుపోతాయి. కానీ
ఆలోచనాశీలులైన ఈ కవి, మొదటి కవితలోనే ఆలోచనలకు పదును పెడుతూ
కూర్చున్నాను అని ప్రకటించారు. సినారె లోని కవి తత్వం, ఆ ఒక్క మాటతో ఆవిష్కరింపబడుతుంది. మొదటి కవితలోనే (సృజన యానం) ఈ మాట రావడం
యాదృచ్ఛికమా? పథకం ప్రకారం వచ్చిందా?
శీర్షికకు అనుగుణంగా, రేపటి వైపు చూపులు సంకలనం అంతటా కనిపిస్తాయి. బలమయిన ఆశాభావం అడుగడుగునా
ఎదురవుతుంది.
చాలా కవితల్లో కాలగమనం గురించిన ప్రసక్తి ఉంది.
ఇలా ఎంతకాలం అవిశ్రాంతంగా సాగిపోతావు అని కవి, గడియారాన్ని అడిగారు ఒకచోట. (కాలసూచిక). ఎగిరిపోయిన జ్ఞాపకం అన్న కవితలో
ముందుకు సాగిపోతున్న జలధార, వెనక వైపు తిరిగి చూస్తుందా? - అంటారు. నీ ప్రయాణం ఎంత కాలమని? అంటూ జీవితాన్నే ప్రశ్నిస్తారు ఒకచోట. వయసు వాలి
పోతున్నా, మనిషి నిటారుగా నిల్చోవాలి అంటారు మరొకచోట.
సంకలనంలోని కవితల్లో ముఖ్యంగా కనిపించే మరో అంశం
స్మృతులు. అయినా ఎక్కడో గాని, వాటిని గురించిన బాధ కనిపించదు. స్మృతులలో నుంచి, బలమయిన గమ్యాలు బయటపడతాయి. తలుపులు మూసుకుని కలగన్నది కలలోని సన్నివేశాలను
నెమరు వేసుకుంటూ తలుపులు తెరుస్తుంది.
ఇన్ని కవితల్లోనూ మనుషులు కనిపించరు. పక్షులు, చెట్లు, కొండలు, కళ్ళు, చెవులు, ముక్కు లాంటివి ఎక్కువగా భావాలకు ఆలంబనాలయి ముందుకు నడిపిస్తాయి. ఆలోచనలకు
పదును పెడుతూ కూర్చున్న కవికి, ఒంటరితనంలోనూ, చూపులు రేపటి వైపే. కానీ గమనించవలసిన మరో అంశం, అక్కడక్కడ మరణం, శూన్యం లాంటి బలమైన భావాలు! శూన్యాన్ని వెళ్లి కలిసినప్పుడు, అది నాలో కలిసిపో అని పిలిచిందట. కవి మాత్రం మానవాళికి దూరమయి, అస్తిత్వాన్ని కోల్పోవడం కుదరదంటారు. చదువుతూ ముందుకు సాగితే చివరకు ఏకాంతం
గురించి కవిత రానే వచ్చింది.
కాలం గీసిన రేఖ, ఈ పూట, నడుస్తూ నడిపించే కాలం, కాలజ్ఞత, తిరిగి చూసుకుంటే, ఇవన్నీ చివరి భాగంలో ఇంచుమించు వరుసగా వచ్చిన కవితలు. అలా సాగుతూనే ఒకచోట
సూర్యోదయం సరియయిన సమయానికే జరిగిందని సంతృప్తి కనపడుతుంది. సత్తా ఉన్నంత మాత్రాన
విత్తనాలన్నీ మొలకెత్తవు. అంటూ సాగే కవిత ప్రశ్నల ఆంతర్యం కవి గారు తమను తాను
అడుగుతున్న ప్రశ్నలకు నికషోపలం!
జాగ్రత్త! ప్రాసలు కనబడవు. మాటకారితనం కనబడదు.
కాలం గడిచింది కదా! పాత సినారె కనబడరు! ఈయన మరెవరో తలపండిన తాత్వికుడు!
కవితే తన చిరునామా అన్న ఈ కవి గారి మరో సంకలనం
కొరకు ఎదురు చూద్దాం!
గోపాలం కె.బి.
No comments:
Post a Comment