Sunday, November 30, 2025

Lokabhiramam Gauli anaga Balli లోకాభిరామం - గౌళి అనగా బల్లి

లోకాభిరామం

గౌళి అనగా బల్లి


పల్లి పసాదం
నగరేషు కాంచీ అన్నారట. నగరాలలోకి నగరం కాంచీపురమేనని భావం. కాంచీపురం, కాంచీ అయింది. మరింత కుంచించి కంచి అయింది. అది నిజానికి కొంచెం చిన్న నగరమే. కానీ, ఒకే ఊళ్లో అన్ని గుడులు. మళ్లీ కుంభకోణంలోనే అనుకుంటాను, ఉండడం. ఈ రెండు చోట్లా అడుగడుగున గుడి ఉంది. (అందరిలో గుడి ఉందా? ఉండే ఉంటుంది. ఈ మాటలతో ఒక సినిమా పాట ఉండేదని మనవి!) ఎన్ని గుళ్లున్నా కంచిలో అందరూ వెళ్లేది మాత్రం మీనాక్షి అమ్మవారి దగ్గరికి. అంతకన్నా ఎక్కువగా వరదరాజ స్వామి గుడికి.
గుడి - గుడులు - గుళ్లు ఒక మాట! గుండు - గుండ్లు - గుళ్లు మరో మాట. ఈ రెండు రకాల గుళ్లకు తేడా ఉంది. తిరుపతి - తిరుమలల్లో గుడులు, గుళ్లు ఉంటాయి. తిరిగి వచ్చేటప్పుడు గుండ్లు, గుళ్లు ఉంటాయి. కంచి గుడులలో గుండు కొట్టుకునే ఆచారమేమీ లేదు. కానీ అక్కడ యాత్రలలో గుండ్లు, గుళ్లు కనపడతాయి. తిరుపతి నుంచి కంచికి చాలా తక్కువే దూరం. యాత్రలకు బయలుదేరిన వారు సాధారణం తిరుపతి నుంచి కంచికి పోతారు. అక్కడ నుంచి శ్రీరంగం, మరో క్షేత్రం.
కాంచీపురంలో ఒక చివరన అమ్మవార్లు కామాక్షమ్మ కొలువుతీరి ఉంటే, మరో చివరన వరదులుంటారు. ఆయన నిజమయిన పేరు దేవాధిరాజ పెరుమాళ్‌. ఆయన ఉత్సవంలో తుపాకులు, వందిమాగదులు వంటి రాజోపచారాలు ఎక్కువగా ఉంటాయి. కంచిలో శివకంచి, విష్ణు కంచి అని విభాగాలుండేవట. అట్లాంటి పేర్లు నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ, వరదుల కోవెలకు దారి తీసే నగర భాగం పేరు చిన్నకంచి! ఆ గుడిలోకి వెళ్లిన తరువాత అడుగడుగునా తెలుగు. ఈ కాలం బోర్డుల సంగతి పక్కనబెట్టండి. మెట్టుమెట్టునా, గోడలలో తెలుగు పేర్లు మాటలు చెక్కి ఉన్నాయి.
వరదరాజ స్వామి గుడి మనం ఊహించిన గుడివలె ఉండదు. మరీ పెద్ద ఆవరణం. ఎన్నో మండపాలు. ఒక పెద్ద కోనేరు. మరీ పెద్ద తోట కూడా ఉంటాయక్కడ. దేవుడు కొన్ని రోజులపాటు వెళ్లి తోట లోని మండపంలో ఉంటాడు. అక్కడ తోట ఉత్సవం (తోటోత్సవం) జరుగుతుంది.
ప్రవేశించగానే ఉండే పెద్ద ఆవరణలో ఒక పక్కన ఒక చిన్న మండపం ఉంది. అక్కడ నుంచి ఒకాయన కొన్ని తినుబండారాల పేరు చెప్పి ‘పల్లి పసాదం దీస్కో!’ అంటూ అరుస్తున్నాడు. ఇక్కడ వేరుశనగ కాయలు, పల్లీ లేదా ఫల్లీలు ప్రసాదంగా పెడతారేమోనను కున్నాను. కానీ అట్లాగేమీ కనిపించలేదు. పులిహోర, చక్ర పొంగలితోబాటు, లడ్డు, చక్కిలాలు, అతిరసం లాంటివి ఉన్నాయి. కొందరికి అరిసెలుగా తెలిసిన అతిరసాలు ఇక్కడ ఉన్నంత రుచిగా మరెక్కడా ఉండవని అనుభవం మీద తెలుసుకున్నాను. అనుకోకుండా దొరికిన మైసూర్‌పాకు ప్రసాదం కూడా మహా రుచిగా ఉంది. అన్నింటికన్నా స్పెషల్‌ కొడల ఇడ్లీ. అరటి మానులాగ గుండ్రంగా, మూరెడంత పొడుగుంది ఒక ఇడ్లీ. ఒకరిద్దరే ఉంటే దాన్ని కొన్నా తినలేరు. అరడజను మందికి ఒక పూట అది ఆహారంగా సరిపోతుంది. ఈ రకం ఇడ్లీ కంచిలో మాత్రమే దొరుకుతుంది. అక్కడి హోటేళ్లలో కూడా, కొన్ని (చాలా తక్కువ, ఒకటి రెండు) చోట్ల మాత్రం దొరుకుతుందది. అక్కడయితే ఒకరికి సరిపడేంత యిస్తారు. నేనడిగిన చోటే, ‘బుధవారమయితే ఉంటుంది’ అన్నారు. గుళ్లో, నా వేషం కారణంగా దొరికిన చిన్న ముక్కతోనే సంతృప్తి పడవలసి వచ్చింది.
పల్లి అన్న మాట ముందు వచ్చింది. మధ్యలో వచ్చింది. సంగతి మాత్రం రాలేదు. గుర్తుంది. గుడిలోకి ప్రవేశించాము అనుకుని దూరితే అక్కడ నరసింహస్వామి ఎదురవుతాడు. బయటకు వచ్చి మరింత ముందుకు పోతే అందరూ ఒకపక్కన మెట్లెక్కుతుంటారు. బోర్డు ఉంది గానీ, చూడకుండా వెళ్లిన వారికి, అక్కడ పెరుందేవీ తాయారు అనే అమ్మవారు చిరునవ్వుతూ దర్శనమిస్తారు. మేము మొదటిసారి వెళ్లినపుడు, అమ్మవారి గోపురం మీద బంగారు తాపడం లాంటి ఏదో జరుగుతున్నదని ఉత్సవమూర్తిని మాత్రం మరో పక్కన ఉంచారు. అక్కడే దర్శనం. మరింతకూ అసలు స్వామి, వరదరాజు, లేదా దేవాధిరాజ పెరుమాళ్‌ ఏరీ? ఆయన వెతుక్కుంటూ వెళితేగాని దొరకడు. సరయిన తోవచూపే బోర్డులు కూడా లేవు. చుట్టూ తిరిగి ఆవరణలో పూర్తి వెనక్కు వెళ్లాలి. అక్కడ ఒక మూల మెట్లుంటాయి, తెలుగక్షరాలతో సహా. ఎక్కి, తొక్కి ముందుకు, పైకి చేరాలి. తలుపులో ప్రవేశిస్తే, మరో బోలెడన్ని మెట్లుంటాయి. కీళ్ల నొప్పులుగల వారికి ఈ స్వామి పరీక్ష పెడతాడు. ఇంకొంచెం లోపలికి వెళితే, అదిగో స్వామి అంటారు. అక్కడ మళ్లీ మెట్లు! ఆ మీద నిజంగా, నిలువెత్తుకన్నా పెద్ద స్వామి. గాలి సరిగా ఆడని ఆ గుడిలో మనం ఉండేది కొంచెం సేపే! అయినా దేవుడు కనిపిస్తాడు.
దేవాధిరాజ స్వామిని చూచిన తరువాత, అసలు సంగతి నాకు అర్థమయింది. అక్కడ పక్కనే బంగారు బల్లి ఉంటుంది. స్వామిని చూడటానికి టికెట్‌ లేదు. బల్లిని తాకడానికి రెండు రూపాయలు. మరింత ముందుకు వెళ్లి కుడికి తిరిగితే కర్ర మెట్లు ఎక్కాలి. కీళ్లనొప్పులా? ఆపైన పై కప్పులో బంగారు బల్లి, బారెడు పొడుగున తాపి ఉంటుంది. పైకి ఎక్కితేనే అందుతుంది. పిల్లలయితే ఎవరయినా ఎత్తుకోవాలి. బల్లిని ఆ చివర నుంచి ఈ చివర దాకా నిమరాలి. మెట్లు, మరోపక్క దిగి, మరిన్ని మెట్లు, మరికొన్ని మెట్లు దిగి బయటకు రావాలి. ఈ బల్లిని, బల్లిని తాకిన వారిని, తాకిన తర్వాత, బతికున్న బల్లిని ముట్టుకున్నా బాధ లేదని మనవారి నమ్మకం!
ఎన్నిసార్లు చూచినా ఈ గుడిలో నాకు తెలుగు వాళ్లే ఎక్కువగా కనిపించారు. మన వారికి వెంకన్న, ఎంకన్న తెలుసుగానీ, ఈ వరదయ్య గురించి అంతగా పట్టినట్లు లేదు. అందరూ ఈ గుడికి బల్లి కొరకే వస్తారు. దారిలో ‘బల్లి ఎక్కడ?’ అని అడిగిన తెలుగు వారికి, ‘ముందు దేవుడిని చూడాలి. అప్పుడు బల్లి కనిపిస్తుంది’ అని చెప్పాను. అసలు సంగతి వారికి తరువాత అర్థమయి ఉంటుంది. అందరూ వచ్చేది బల్లి కొరకయితే, అక్కడ ప్రసాదం కూడా బల్లి ప్రసాదమే కావాలి గదా? తమిళంలో బల్లిని పల్లి అంటారేమో? అనుమానం లేదు తమిళంలో పల్లి అంటే బల్లి. ఇక తీసుకోండి అనాలని అర్థంకాని ఆ అయ్యవారు ‘పల్లి పసాదం దీస్కో!’ అని అరుస్తున్నాడు. కానీ ఎవరూ ప్రసాదం తీసుకోవడం లేదు. పైసలు లేందే ప్రసాదం లేదు గద మరి!
బల్లిని ముట్టుకుంటే, అది పైన బడితే ఏదో జరుగుతుందని ఎవరన్నారో మరి? బల్లిపాటు ఫలితాల గురించి, అంటే శరీరంలో ఏయే భాగం మీద బల్లి పడితే ఏమవుతుందని చెప్పే పట్టిక ఒకటి ఉంటుంది. శిరస్సున పడితే కలహంతో మొదలయి, గుహ్యం - మరణం అని ఆ లిస్టు అంతమవుతుంది. వెతికి వెతికి బల్లి ముడ్డి మీద ఎప్పుడు, ఎట్లా పడేను? పడదు. వీలు లేదు. పడినా ఎవరూ చావరు!
మన వారికి ఇటువంటి నమ్మకాలు కావలసినన్ని తెలుసు. వాటి వెనుకనున్న సంగతి తెలుసుకోవాలని మాత్రం ఎవరూ ప్రయత్నించరు. కనుకనే వరదయ్య కన్నా ఆయన వెనుకనున్న బల్లికి గొప్ప పేరన్నమాట. వరదయ్య ప్రసాదం బల్లి ప్రసాదంగా మారింది. బల్లి కావాలే కాని దాని ప్రసాదం ఎవరికి కావాలి? పట్టదు గాక పట్టదు.
***
మంత్ర బియ్యం: చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో విన్న ఈ మాట ఈ మధ్యన గుర్తుకు వచ్చింది. దొంగతనం జరుగుతుంది. లేదంటే ఒక పొరపాటు పని జరిగినట్టు తెలుస్తుంది. అది ఎవరు చేసిందీ బయటపడదు. తెలిస్తే గద శిక్ష! అప్పుడు మంత్ర బియ్యం (సమాసం బాగుండలేదు. మంత్రం బియ్యం అనాలి) ప్రయోగిస్తారు. ఆ బియ్యాన్ని ఎవరు మంత్రించి ఇచ్చేవారో గుర్తులేదు. మొత్తానికి అక్షతల వంటి బియ్యం వస్తాయి. అందరికీ కొంచెం కొంచెంగా పెడతారు. ఏ తప్పూ చేయని వారు వాటిని శుభ్రంగా నమిలి తింటారు. తప్పు చేసిన వారు ఆ బియ్యం తింటే ఏదో అవుతుందని ఒక భయం. ఒక పిల్లవాడు బియ్యం తిని వాంతి చేసుకున్నాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు. బియ్యంలో మంత్రం లేదు గానీ, బోలెడు సైకాలజీ ఉందని తరువాత అర్థమయింది. భయం మనిషిని పట్టి ఇస్తుంది.
***
కోదండం: పిల్లవానికి తీవ్రమయిన శిక్ష అంటే ఆ కాలంలో కోదండం వేసేవారు. కోదండం అంటే నిజానికి రాముని బాణం. కానీ ఇక్కడ మాత్రం రెండు చేతులకు కలిపి తాడు పట్టించి, ఆ తాటి నుంచి వాడు పై కప్పులోని కొండి నుంచి వేలాడుతుంటాడు. కింద కంప (ముళ్లుండే కొమ్మలు) ఉంటే మరింత గట్టి శిక్ష! తాడు వదిలి కింద పడలేక, వేలాడలేక, వాడు పడే బాధ వర్ణనకు అందదు. పశ్చాత్తాపానికి దారి తీస్తుందేమో కూడా!

No comments: