Tuesday, August 23, 2016

The Sign of Four - Sherlock Holmes in Telugu

Sherlock Homes Novel, The Sign of Four ion Telugu.

Translation by Yours Truely, K B Gopalam @ Vijayagopal.
I have also translated A Study in Scarlet, and Adventures of Sherlock Holmes in two Volumes.


Excerpts from the book!

షెర్లక్‌ హోమ్స్‌ ఉత్సాహంగా అరచేతులు రుద్దుకుంటూ నా వయిపు మళ్లాడు. ‘‘వాట్సన్‌, మనకిక  అరగంట సమయం ఉంది. దాన్ని చక్కగా వాడుకుందాం. నేను చెప్పాను గదా. నా కేస్‌ ఇంచుమించు పూర్తి అయింది. కానీ మరీ నమ్మకంగా ఉంటే పొరపాటు జరుగుతుంది. కేస్‌ చాలా సింపుల్‌గా కనపడినా, అందులో మరేవో లోతులు ఉండవచ్చు’’ అన్నాడు అతను.
‘‘సింపుల్‌గా కనపడుతున్నదా?’’ నేను గట్టిగా అడిగాను.
‘‘మరింక ఏమిటి?’’ అన్నాడు అతను ఒక అనుభవజ్ఞుడయిన ప్రొఫెసర్‌ క్లాసులో పాఠం చెపుతున్న పద్దతిలో. ‘‘వెళ్లి ఆ మూలన కూర్చో. లేకుంటే నీ కాలిగుర్తులు కూడా గజిబిజి చేస్తాయి. ఇక పనిలోకి దిగుతా. మొదటి ప్రశ్న అసలీ మనుషులు లోపలికి ఎలా వచ్చారు? తిరిగి ఎట్లా వెళ్లారు అని. ద్వారాన్ని రాత్రి నుంచి తెరిచింది లేదు. మరి కిటికీ సంగతి?’’ అతను దీపాన్ని కిటికీ దగ్గరికి తీసుకువెళ్లాడు. తనలో తానే మాట్లాడుతున్నట్టు తన పరిశీన గురించి ఏవేవో అంటున్నాడు.
‘‘కిటికీ లోపలినుంచి గడియ వేసి ఉంది. ఫ్రేమ్‌ బలంగా ఉంది. తెరిచి చూస్తే సరి. పక్కన ఒక నీటి గొట్టం కూడా లేదు. పై కప్పు అందేటంత దూరంలో లేదు. కానీ కిటికీ పక్కన ఎవరో నిబడ్డారు. గడచినరాత్రి వాన కురిసింది. కిటికీలో మనిషి కాలిగుర్తు ఉంది. పక్కన బురదగా ఒక గుండ్రని గుర్తు ఉంది. తరువాత అవే గుర్తు ఫ్లోర్‌ మీద ఉన్నాయి. బల్ల పక్కనా అవే గుర్తులు. వాట్సన్‌! అంతా చక్కగా తెలిసిపోతున్నది.’’
నేను గుండ్రంగా పడిన ఆ బురద గుర్తువేపు చూచాను.
‘‘ఇది కాలిగుర్తు కాదు’’ అన్నాను.
‘‘అంతకంటే చాలా విలువయినది. ఇది కర్రగుర్తు. కిటికీలో బూటు గుర్తు ఉంది చూచావా? పెద్ద బూటు అది. లోహం మడమ వెడల్పుగా ఉంది. పక్కన ఉన్నది కర్రకాలి గుర్తు.’’
‘‘ఓ, కర్రకాలు మనిషి!’’
‘‘అదే. కానీ అతనితో మరొకరు కూడా ఉన్నారు. అతనికి సాయంగా మరొకరు వచ్చారు. గోడ ఎక్కగలవా, డాక్టర్‌?’’
తెరిచిన కిటికీలోంచి నేను బయటికి చూచాను. ఇంటిలోని ఆ భాగం మీదికి వెన్నెల బాగా పడుతున్నది. నేల నుంచి మేము అరవయి అడుగుల ఎత్తున ఉన్నాము. అంటే నేను ఎక్కడ ఉంటానో గమనిస్తున్నానని అర్థం. అక్కడ నిలబడడానికి పెద్ద ఆధారం ఏదీ లేదు. ఇటుక గోడలో సందులు కూడా లేవు.
‘‘వీలు పడేట్టు లేదు’’ జవాబు ఇచ్చాను.
‘‘సాయం లేకుంటే అంతే మరి. కానీ మరొక తోడు ఉండి, పైనుంచి, ఇదుగో ఇక్కడ కనపడుతున్నదే ఈ తాటిని కిందికి వదిలాడు అనుకో. తాడు పైన గట్టిగా కట్టి ఉంటుంది. ఇక నీవు అయినా మరొక చురుకుమనిషి అయినా, కర్రకాలు ఉన్నా సరే సులభంగా పైకి పాకవచ్చు. హాయిగా పైకి ఎక్కడం, తాటిని పైకి లాగడం వెళ్లేటప్పుడు అదే పద్ధతిలో వెళ్లిపోవడం. చిన్న విషయమయినా దీన్ని నోట్‌ చేసుకోవాలి.  అయితే, తాటిని గమనిస్తే ఒక్క సంగతిమాత్రం అర్థమవుతున్నది. మన కర్రకాలు మిత్రుడు గోడలు బాగా ఎక్కగలిగాడు. కానీ దిగడం మాత్రం చేతకాలేదు. పైగా, అతని చేతులు మెత్తవి కూడాను. తాటి చివరన రక్తం మరకలు ఉన్నాయి. అంటే కిందకు జారుతూ అతను చివరలో వేగంగా కిందికి వెళ్లాడు. చేతుల్లో చర్మం ఊడింది కూడా’’ అన్నాడు అతను తాటిని పరిశీలిస్తూ.
‘‘అంతా బాగానే ఉంది. నాకు మాత్రం వ్యవహారం రానురాను చిక్కుగా కనపడుతున్నది. ఈ అర్థంకాని తోడు ఎవరు? అతను గదిలోకి ఎలా వచ్చాడు?’’ అడిగాను.
‘‘అవును, తోడు. అతను నిజంగా చిత్రమయినవాడని అనిపిస్తున్నది. దీనితో కేస్‌ మామూలు కాకుండా పోతున్నది. మన దేశపు నేరచరిత్రలోనే ఒక కొత్తమలుపుగా  కనపడుతున్నది. ఇటువంటి సందర్భాలు భారత దేశంలో, నాకు గుర్తున్నంత వరకూ సెనెగాంబియాలో ఎదురయినాయి’’ అన్నాడు అతను నిర్లిప్తంగా.
‘‘ఇంతకు అతను ఎలా వచ్చాడు? తలుపు వేసి ఉంది. కిటికీ అందదు. మరి చిమ్నీలోంచి వచ్చాడా?’’ మళ్లీ అడిగాను.
‘‘చిమ్నీ గొట్టం అంత పెద్దదిగా లేదు. ఈ సంగతి ముందే అనుకుని గమనించాను’’ అతను జవాబిచ్చాడు.
‘‘మరెలా వచ్చాడు?’’ పట్టుదగా అడిగాను.
అతను తల ఆడిస్తూ చెప్పసాగాడు. ‘‘నీకు నా పద్ధతులు అర్థం గావట్లేదు. అసాధ్యాలు అనుకున్న వాటిని పక్కన పెడితే ఇక మిగిలేది, ఎంతటి దుస్సాధ్యమయినా, అదే నిజం కావాలి గదా? అతను ద్వారంలో నుంచి, కిటికీలో నుంచి రాలేదని అనుకున్నాం. చిమ్నీలోనుంచి కూడా రాలేదు. గదిలో దాగి ఉండే ఆస్కారం లేదు. ఈ గదిలో ఎవ్వరూ దాగి ఉండటానికి చోటు లేదు. అప్పుడు అతను ఎలా వచ్చినట్టు?’’
‘‘పైకప్పులోని రంధ్రం గుండా వచ్చాడు!’’ గట్టిగా అరిచాను.
‘‘ఇప్పుడు దొరికింది. అలాగే వచ్చి ఉంటాడు. ఏదీ, కొంచెం దీపం ఎత్తి పట్టు. గదిలోని పై భాగాన్ని కొంచెం పరిశీలిద్దాము. నిధి దాచిన గది అక్కడే గదా ఉన్నది’’
అతను నిచ్చెన ఎక్కాడు. వాసాను చేతుతో పట్టుకుని ఒక్కసారి ఎగిరి అటకలోకి ఎక్కాడు. కిందకు వంగి దీపం అందుకున్నాడు. నేను కూడా అతని వెంటే ఎక్కాను. మేము చేరిన గది అటు పది అడుగులు, ఇటు ఆరు ఉంది. నే మీద వాసాలు పరిచి ఉన్నాయి. వాటి మధ్యన ప్లాస్టర్‌ నింపి ఉంది. నడవదలుచుకుంటే వాసాల మీదే అడుగు పెట్టాలి. ఈ అటక ఇంటి పైకప్పు, గదుల మధ్య ఉందని అర్థం. అందులో మరే సామానూ లేదు. సంవత్సరాలుగా పేరుకున్న దుమ్ము మాత్రం ఉంది.
‘‘ఇక్కడ చూడు, ఇక్కడ ఒక చిన్న తలుపు ఉంది. పైకప్పు మీదికి ఇదే దారి. తెరిస్తే ఇదుగో, పైకప్పు కొంచెం వాలుగా ఉంది. మన నంబర్‌ వన్‌, ఈ దారిలోనే వచ్చాడు. అతని గుర్తు ఇంకేవయినా కనిపిస్తాయేమో ఒకసారి చూద్దామా?’’ అన్నాడు షెర్లక్‌ హోమ్స్‌ దారితీస్తూ.
దీపం వెలుతురులో అతను నేను పరీక్షిస్తున్నాడు. అతని ముఖం మీద ఆశ్చర్యపు ఛాయలు ఆ రాత్రి రెండవసారి కనిపించడం చూచాను. నాకు మాత్రం అక్కడ ఒళ్లంతా చల్లబడ సాగింది. పైకప్పు మీద దుమ్ములో చక్కగా కని పిస్తూ, బలంగా పడిన అడుగుజాడలు చాలా ఉన్నాయి. అయితే చిత్రంగా అవి మామూలు మనుషుల కాళ్లతో పోలిస్తే సగం సైజులో మాత్రమే ఉన్నాయి.
‘‘హోమ్స్‌, ఈ భయంకరమయిన నేరమంతా ఒక పిల్లవాడు చేశాడంటావా?’’ గుసగుసగా అడిగాను.
అతను ఒక్క క్షణంలో తేరుకున్నాడు.
‘‘నేను ఒక్క క్షణం ఎక్కడికో వెళ్లిపోయాను. కానీ అంతా అర్థమయింది. నాకు ముందు జ్ఞాపకం రాలేదు. అసలు గుర్తుకు వచ్చి ఉంటే, ముందే చెప్పగలిగి ఉండేవాడిని. ఇక ఇక్కడ తెలుసుకోవసినది ఏమీ లేదు. పద, కిందకు వెళదాం’’ అన్నాడు అతను.
‘‘ఇంతకు ఏం సిద్ధాంతం చేశావు, ఈ కాలిగుర్తు గురించి?’’ కింద గదిలోకి వచ్చిన తరువాత ఆత్రంగా అడిగాను.
‘‘మైడియర్‌ వాట్సన్‌, నీవే కొంచెం ఆలోచించి చూడు. నా పద్ధతు నీకు తొసు. వాటిని ఆచరణలో పెట్టు. ఇద్దరి ఫలితాను పోల్చి చూస్తే ఒక పాఠం దొరుకుతుంది’’ అన్నాడు అతను కొంచెం అసహనంగా.
‘‘నాకు ఈ సందర్భంలో ఏమీ తోచడం లేదు’’ జవాబిచ్చాను.
‘‘సులభంగానే తోస్తుంది. ఇక ఇక్కడ ముఖ్యమయిన సంగతులు ఏమీ లేవు. అయినా సరే ఒకసారి చూస్తాను’’ అన్నాడు పట్టించుకోకుండా.
అతను భూతద్దాన్ని, కొలత టేపును తీసుకుని గదిలో మోకాళ్లమీద ఒంగి తీవ్రంగా పరిశీనలు చేయసాగాడు. అతని పొడుగాటి సన్ననిముక్కు నేకు తగిలేంత దగ్గరికి వస్తున్నది. పూసవంటి కళ్లు పక్షి కళ్లలాగా కదలాడుతున్నాయి. అతని కదలికలు నిశ్శబ్దంగా, వేగంగా ఒకదాని వెంట ఒకటి జరగడం  గమనిస్తూ ఉంటే, వాసన పసిగడుతున్న కుక్క గుర్తుకు రాక తప్పలేదు. అతను నేర పరిశోధకుడు కాక  నిజంగా నేరాలు చేసేవాడే అయి ఉంటే, చట్టాన్ని ఎన్ని తిప్పలు పెట్టేవాడో అనిపించింది. పరిశీనలలో మునిగి అతను ఏవో గొణుగుతున్నాడు. చివరకు ఒక్కసారిగా సంతోషంగా, ఒక చప్పుడు చేశాడు.
‘‘మన అదృష్టం బాగుంది. మనకు కష్టం తక్కువే మిగిలింది. ఇదుగో, నెంబర్‌ వన్‌ ఇక్కడ క్రియోసోట్‌లో కాలు వేశాడు. అతని కాలిగుర్తు పక్కనే పడి ఉంది. ఈ కార్బాయ్‌ పగిలింది. అందులో నుంచి రసాయనం బయటకు వచ్చింది.’’
‘‘అయితే ఏమిటి?’’ అడిగాను.
‘‘ఏముంది? అతను దొరికాడు, అంతే.’’
‘‘వాసనలను ప్రపంచం అంచుదాకా పసిగట్టే కుక్క ఒకటి నాకు తెలుసు. మామూలు కుక్కలే వాసనలు పసిగడుతుంటే, శిక్షణపొందిన ఈ కుక్క, ఇంత ఘాటువాసనను ఎంతదూరమయినా తెలుసుకుంటుంది. నాకు లెక్క అర్థమయిపోయింది. తొందరలోనే సంగతి.... హలో! చట్టం చుట్టాలు వస్తున్నట్టున్నారు.’’
కిందనుంచి భారంగా అడుగు చప్పుడు, పెద్దగా మాటు వినవచ్చాయి. హాలు తలుపు మూసిన చప్పుడు అయింది.
‘‘వాళ్లు వచ్చేలోగా, ఇదుగో పాపం, ఈ అమాయకం ప్రాణి చెయ్యి ఒకసారి ముట్టుకుని చూడు.  కాలుకూడా. నీకు ఏమనిపిస్తుంది?’’
‘‘కండరాలు చెక్కలాగా బిగుసుకుపోయాయి’’ అన్నాను.
‘‘కదూ? అవి వీలయినంత బిగుసుకు పోయాయి. రిగర్‌ మార్టిస్‌ ప్రభావం ఇలాగ ఉండదు. ఇక ముఖంలోని ఆ భావాలు చూడు. నీకు ఏమనిపిస్తున్నది?’’
‘‘బలమయిన ఆల్కలాయిడ్ విషం కారణంగా చనిపోయాడు ఇతను. స్ట్రిక్నీన్‌ లాంటి రసాయనం ప్రభావాలు ఇట్లాగే ఉంటాయి’’ జవాబు ఇచ్చాను.
‘‘ముఖం మీద బిగుసుకుపోయిన ఆ కండరాలను చూడగానే నాకు ఈ ఆలోచనే వచ్చింది. గదిలోకి రాగానే, అతని శరీరంలోకి విషయం ప్రవేశించిన పద్ధతి గురించి పరీక్షించాను. ఎక్కువ బలం ఉపయోగించకుండానే అతని శరీరంలోకి దిగిన ముల్లు చూడనే చూచానుగదా! ఆ ముల్లు ఇంటి పైకప్పు  వేపు నుంచి వచ్చిందని, ఈ మనిషి అప్పుడు కుర్చీలో నిటారుగా కూర్చుని ఉంటాడని సులభంగానే చెప్పవచ్చు. ఒక్కసారి ముల్లును గమనించు.’’
నేను దాన్ని అనుమానంగానే తీసుకుని లాంతరు వెలుగులో పరీక్షించాను. నల్లని ఆ ముల్లు పొడుగ్గా, వాడిగా ఉంది. ఒక చివరలో ఎండిన జిగురులాంటి పదార్థం ఇంకా కొంచెం అంటి ఉంది. మరొక చివర కత్తితో తెంచినట్లు మొండిగా ఉంది.
‘‘ఇది ఇంగ్లీషు దేశపు ముల్లేనా?’’ అతను అడిగాడు.
‘‘కాదుగాక కాదు.’’
‘‘ఇన్ని సంగతులు తెలిసిన తరువాత నీకు ఏదో తోచి ఉండాలి. కానీ ఈలోగా అసలు బలగం వస్తున్నారు.  మనలాంటి రెండవరకం పక్కకి తప్పుకోవాలి.’’
అతను ఆ మాటలు అంటూ ఉండగా బయట కాళ్ల చప్పుడు దగ్గరగా వచ్చింది. సూటు వేసుకున్న లావుపాటి పెద్దమనిషి, ఒకతను గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎర్రగా ఉంది. ఉబ్బిన కళ్లు మెరుస్తున్నాయి. అతని వెనుక యూనిఫామ్‌లో ఉన్న ఒక ఇన్‌స్పెక్టర్‌ ఉన్నాడు. వణుకుతూ తాడియస్‌ షోల్టో కూడా వెనకే వచ్చాడు.
‘‘పని దొరికింది, చేతినిండా పని దొరికింది! వీళ్లంతా ఎవరు? ఈ ఇల్లు కుందేళ్ల గూడులా ఉంది ఏమిటి?’’ అతను బొంగురు గొంతుతో అరవసాగాడు.
‘‘నన్ను గుర్తు తెచ్చుకోగలరా, మిస్టర్‌ ఎతెల్నీ జోన్స్‌’’ అన్నాడు హోమ్స్‌ నెమ్మదిగా.

Go to Kinige.com for the book.
Those in India and Hderabad can contact Creative links Publishers,Hyderabad.
Mobile Numbers:
98480 65658,  98485 06964

No comments: