Thursday, July 28, 2011

Damerla Rama Rao - A Book

Here is a book review written by me and appeared in the Akshara page of daily paper Andhra Bhoomi.

దామెర్ల రామారావు 1897 - 1925 (నవ్యాంధ్ర చిత్రకళా వైతాళికుడు)
రచన: వి. కలికావతారం
పేజీలు: 97, వెల: రూ. 95/-
ప్రతులకు: సి.పి. బ్రౌన్ అకాడమీ
53, నాగార్జున హిల్స్
పంజగుట్ట, హైదరాబాద్ - 82
ఫోన్ నెం. 040-23423188, 23430448-50

ఎంటీ రామారావంటే తెలుసు. ఎమ్మెస్ రామారావంటే కొందరికి తెలుసు. ఇంతకూ ఎవరీ దామెర్ల రామారావు? పేరెక్కడో విన్నట్లుందండీ అంటారు. కొందరు ఆయన బొమ్మలు వేసేవాడు అంటే అవునవునంటారు. ఆ బొమ్మలు ఎట్లుండేవో ఎవరికీ తెలియదు. అందుకే బ్రౌన్ అకాడమీ వారు ఈ చిన్న పుస్తకాన్నయినా వేసి మంచి పని చేశారు. గొప్ప కళాకారుల చిత్రాలన్నీ ఒక్కచోట చేర్చి, ఫోర్ట్ ఫోలియోలు, కాఫీ టేబుల్ బుక్స్‌గా అచ్చు వేయడం ప్రపంచమంతటా జరుగుతుంది. మనవారికి మాత్రం కథ, నవల, కవిత, కబుర్లు గురించి మాత్రమే పుస్తకాలు వేయాలని ఒక నమ్మకం లాగుంది. వాటిని మానేయాలని ఎవరూ అనరు గానీ, చరిత్ర, సంస్కృతి, భాష, కళల, కళాకారుల గురించి పుస్తకాలు వేయడం మనకు ఇంకా అలవాటు కాలేదు.

దామెర్ల రామారావు వాసనలు యింకా రాజమండ్రిలో మిగిలాయంటారు. ఆయన బతికింది 1897 నుంచి 1925 వరకు మాత్రమే. అంత తక్కువ వయసులోనే కలకాలం గుర్తుండవలసిన కళాఖండాలను ఆవిష్కరించాడతను. కానీ వాటిని జాగ్రత్తగా కాపాడడం మనవారికి ముందు తోచలేదు. తరువాత చేతగాలేదు. దామెర్ల కళాఖండాలన్నీ కాలానికి, వాతావరణానికి బలయ్యాయి. కలికావతారం లాంటి వారు మిగిలిన కొన్ని బొమ్మలను డిజిటల్ రూపంలో తెచ్చి వీలయినంత వరకు శుభ్రం చేసి అందరి ముందూ ఉంచారు. అప్పటికీ ఆయన గురించి ఎవరికీ పట్టనే లేదు. కనుకనే అకాడమీ వారు, కలికావతారం చేతనే, ఉన్న కొద్ది సమాచారాన్ని చిన్న పుస్తకరూపంలో తెప్పించారు. 100 పేజీల ఈ పుస్తకంలో 35కు పైగా పేజీల్లో బొమ్మలు, స్కెచెస్ ఉండడం ఎంతో ఉచితంగా ఉంది. ఆ బొమ్మలను చూస్తుంటే, మనం పోగొట్టుకున్న సంపద గురించి అర్థమవుతుంది. కళ్ళు చెమ్మగిల్లుతాయి.

ఎందుకు వేశారో తెలియదు గానీ, రెండవ అధ్యాయంగా శుభరాయ మహారాజ్‌గా మారిన ఒకానొక సుబ్బారావుగారి గురించి కొంచెంగా వివరాలిచ్చారు. రథంమీద అంటించిన కాయితాల మీద ‘శుభరామ్’ వేసిన బొమ్మలు అద్భుతంగా ఉంటాయి. ఈ పుస్తకంలో ఆయన గురించి రాసిన చోటే ఒక బొమ్మయినా అచ్చు వేసి ఉంటే ఎంతో బాగుండేది.
దామెర్ల గొప్ప కళాకారుడుగా రూపు పొందడానికి కారకుడయిన ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే గురించి ముందు చెప్పి తరువాత అసలు విషయంలోకి వచ్చిన తీరు కూడా ఎంతో బాగుంది. కూల్డ్రే లాంటి గురువులు అరుదుగా దొరుకుతారు. దామెర్ల, అడవి బాపిరాజు, వరదా వెంకటరత్నం లాంటి శిష్యులు కూడా అరుదుగానే ఉంటారు. శిష్యుని బాధ్యతనే గాదు, అతడిని భుజాలమీద మోసి అజంతా గుహలను చూపించి, కూల్డ్రే అతని బరువును కూడా ఎత్తుకున్నాడంటే ఎంత ఆశ్చర్యం!

కూల్డ్రేను, గుడులలోకీ, పెళ్ళిళ్లలోకీ రానివ్వలేదు. అది గతశతాబ్దం తొలి రోజుల మాట. ఛాదస్తం నిలువెత్తుగా నిలబడిన రోజులవి. కానీ, అతను మాత్రం తన శిష్యులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. బాపిరాజు నవలలు, కథలు తెలిసినంత, ఆయన బొమ్మలు మనకు తెలియవు. ఈ సంగతి గురించి కూడా పట్టించుకోవలసిన అవసరం ఉంది. వరదావారి శిష్యులు, శీలా వీర్రాజుగారు, కవి, రచయిత, చిత్రకారులు. వారిచేత గతం గురించి అప్పటి పద్ధతులను గురించి రాయించాలి.

ఇక పుస్తకంలోని అస లు విషయం దామెర్ల రామారావు, జీవితం, కళ ఇంతకు ముందే అనుకున్నట్లు అందులో వాసి ఉంది. రాశి లేదు. ఎన్నిసార్లు చెప్పినా కొనే్న సంగతులు కానీ, చిత్రకళ గురించి అంత ఆసక్తి లేని వారయినా, ఈ పుస్తకాన్ని ముందు ఉంచుకుని, ఒక్కొక్క బొమ్మనూ జాగ్రత్తగా పరిశీలించాలి. చదవడం గురించి చెప్పనవసరం లేదు. రామారావు భార్య సత్యవాణి కూడా చిత్రకారిణి కావడం ఒక విచిత్రం. ఆమె గురించి నాలుగు మాటలు, ఆమె గీసిన బొమ్మలు పుస్తకంలో ఉన్నాయి. భర్తను, పురిటి కందు బిడ్డను పోగొట్టుకుని సత్యవాణి చిత్రలేఖనానికి దూరంగా మారింది.

పుస్తకం గురించి కాదు, పుస్తకం చదవండి. బ్రౌన్ అకాడమీ వారు. ఈ ఒరవడిలో మరిన్ని మంచి విషయాల గురించి మంచి పుస్తకాలు తేవాలి. దామెర్ల గురించిన వ్యాసం, చిత్రాలు, 1930 దశకంలోనే నేషనల్ జియోగ్రాఫిక్‌లో వచ్చాయంటే ఆశ్చర్యం. ఆయనను ప్రపంచం అప్పుడే గుర్తించింది. మనమే మరిచి పోయాం!

దామెర్ల రామారావు వంటివారు అరుదు. వారిని ‘ఎవరు?’ అనగూడదు. ప్రశ్నకు జవాబు అందించిన కలికావతారం అభినందనీయులు.

Let us enjoy good books!
&&&&&

1 comment:

మాగంటి వంశీ మోహన్ said...

Thank you sir...Infact a big one - for letting us know the details of the book....