16 February 2000
మనిషికి తన స్వంతముగ తెలివని ఉన్నచో, అది ఏదో ఒకనాడు గుర్తింపు పొందక తప్పదు.
ప్రయత్నించి తిరస్కరించవలెననుకున్నవారుగూడ, సరియగు సమయము వచ్చినపుడు, విలువను గుర్తించక తప్పదు. విజయము విలువకేగాను ఇతరములకు గాదు.
విషయ విజ్ఞానము, తర్కించు నైజగుణము, సదసద్వివేకము, స్వార్థరాహిత్యము మున్నగు విశేషములకు ధారణయను మరియొక శక్తి తోడయిన తర్వాత అట్టి మనిషిని ప్రయత్నించియు తోసిరాజనుట సాధ్యముగాదు.
పనిచేయుటయందొక ఆనందమున్నది.
ఆ పనియందు మన ప్రమేయము ప్రభావము ఉండినచో
ఆనందము మరింత ఎక్కువగనుండును.
ప్రమేయ ప్రభావములు ఫలితములనిచ్చినచో ఆనందము తలవరకు వచ్చును.
అప్పుడిక పని మదిర వలె పనిచేసి, మనిషిని మభ్యపెట్టును.
అందుకే అందరును అధికారము కొరకు పాకులాడుచుందురు.
రాణి ఈగ గొప్పది.
పనిచేయు ఈగలకు కృషి తప్ప,
ప్రమేయ ప్రభావముల గురించి ఆలోచించు హక్కుగూడ ఉండదు.
నిర్ణయాధికారము పంచుకొనుటకు ప్రభువులు అంగీకరింపరు.
కేవలము పని మాత్రము చేయువారలకు ఆ భావము బలపడినచో,
పనియందు రుచి తగ్గును.
అప్పుడు వాతావరణము చెడిపోవును.
ఉత్తమ నాయకత్వమన్నచో అది ప్రభుతగా గాక,
బరిలో ముందు నడుచుటయను తీరుండును.
అట్టి నాయకుడు అందరికిని ప్రీతి పాత్రుడగును.
No comments:
Post a Comment