Pelli Dustulu - A Story from Marakesh in Telugu
పెళ్లి దుస్తులు - మరాకష్ జానపద
కథ
అలీ తన భార్య ఇద్దరూ షేఖ్ హమీద్‌తో పాటు ప్రయాణం చేస్తున్నారు.
ప్రయాణంలో శ్రమ తెలియకూడదని వాళ్లు కథలు మొదలుపెట్టారు. అలీకి కథలు వినడం చాలా
ఇష్టం. ఇక షేఖ్ హమీద్ చరిత్రకథలు చెప్పడంలో చాలా గొప్పవాడని పేరున్న మనిషి. ఆయన
చెపుతున్న కథను అలీ చాలా ధ్యాసతో వింటున్నాడు. ఒక్కసారి అతని చూపు పక్కకు
కదిలింది. ఇసుకలో ఏదో ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. వెళ్లి ఆ వస్తువు ఏమిటో
చూడాలని అలీకి బలంగానే కోరిక కలిగింది. కానీ బాబాయి కథను వినకుండా మధ్యలో పక్కకు
పోతే అది మర్యాద కాదని అనుకుని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన జేబులో ఉన్న
గింజలను అతను బయటకు తీశాడు. దారివెంట వాటిని వరుసగా పడవేయసాగాడు.
చివరికి వాళ్లు తమ గూడానికి తిరిగి వచ్చారు.
షేఖ్ హమీద్ తన గుడారం లోకి వెళ్లిపోయాడు. కానీ అలీమాత్రం గుర్రంమీదనుంచి
దిగనేలేదు. తల్లితో అతను తన గురించి ఎవరయినా అడిగితే పడుకున్నాడని చెప్పమన్నాడు.
గుర్రాన్ని వెనుకకు తిప్పి అతను వచ్చినదారిలోనే మళ్లీ పోసాగాడు. దారివెంట తాను
జారవిడిచిన విత్తనాలను గమనిస్తూ సరయిన చోటికి తిరిగివచ్చాడు. అక్కడ దిగి చూస్తే
ధగధగలాడుతూ ఒక బంగారు చేతికడియం కనిపించింది. దానిమీద ముత్యాలు పొదిగి ఉన్నాయి.
పనితనం చాలా గొప్పగా ఉంది. అది తప్పకుండా ఎవరో ఉన్నతవంశురాలయిన అమ్మాయి కడియం
అనుకున్నాడు అలీ.
అతను కడియాన్ని తీసుకుని తిరిగి వచ్చాడు.
ఇంటికి వచ్చిన అలీకి వాళ్ల అమ్మ, మీ బాబాయి
రెండుసార్లు నీగురించి అడిగాడు, అని చెప్పింది. అలీ
కడియం కూడా తీసుకుని షేఖ్ హమీద్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ చాలామంది కూర్చుని
ఉన్నారు. ఆ సంగతి, ఈ సంగతి మాట్లాడుతున్నారు. అలీ కడియాన్ని షేఖ్
హమీద్ చేతికి ఇచ్చాడు. ఆయన కడియాన్ని అటుఇటూ తిప్పుతూ చాలా జాగ్రత్తగా చూచాడు.
‘ఇది తప్పకుండా చాలా మంచి పనితనంగల కంసాలి చేతిలో తయారయ్యింది. నీకు ఎక్కడ
దొరికింది?’ అంటూ అడిగాడు.
అలీ వివరమంతా చెప్పాడు.
‘ఈ కడియం సొంతదారు మామూలు వ్యక్తికాదు. వెళ్లి
వెతుకుదాం పద’ అన్నాడు షేఖ్ హమీద్.
వాళ్లు గూడెంలోని దాయిని పిలిపించారు.
కడియాన్ని ఆమె చేతికి ఇచ్చారు. మొత్తంలో గూడెమంతా వెతికి ఈ కడియం ఎవరిదో
తెలుసుకురావాలని ఆమెకు పనిపెట్టారు. బహుశా వేరే గూడెంలోని మనిషి అయి ఉండవచ్చు.
మొత్తానికి నీవు సంగతి తెలుసుకు రావాలన్నారు.
దాయి కడియం తీసుకుని వెతుకులాట కొరకు
బయలుదేరింది. ఒక గుడారం నుంచి మరొక గుడారానికి తిరగసాగింది. చాలాచోట్ల ఆ పద్ధతిగా
అడుగుతూ పోయింది. ఆమె ఆ రకంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ప్రాంతానికి చేరేసరికి అక్కడ
గుడారాలన్నీ నల్లని గుడ్డతో వేసిఉండడం కనిపించింది. అందులోనూ ఒక గుడారం మరీ
పెద్దది. ఎనిమిది వాసాలమీద దాన్ని నిలిపి ఉంచారు. అక్కడ ఒక యువతి దాయికి స్వాగతం
చెప్పి లోనికి పిలిచింది. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె శరీరం అద్దంలాగ నిగారింపుతో
మెరుస్తున్నది. ఆమె ముఖంకూడా చంద్రునికన్నా బాగా వెలిగిపోతున్నది.
దాయి కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నది.
మంచినీళ్లు తాగింది. అప్పుడిక రుమాలులోనుంచి కడియాన్ని బయటకు తీసి చూపించింది.
గుడారంలో అమ్మాయి కడియాన్ని చేతికి తీసుకుని అటు ఇటూ తిప్పి చూచింది. ఈ కడియం
నాదేనంటూ తన పెట్టెలోనుంచి దాని జతకడియాన్ని కూడా తెచ్చి దాయికి చూపించింది.
రెంటిలోను ఎంతమాత్రమూ తేడాలేదు. ‘ఈ కడియం తప్పకుండా నీదే. కనుక రెండూ నీవే తీసుకో’
అన్నది దాయి.
‘అమ్మా, మీరు చాలా
శ్రమపడ్డారు. కనుక మీరే ఈ రెండు కడియాలను తీసుకోండి. ఒకటి లేకుంటే మరొకటి ఎందుకూ
పనికిరావు అవి’ అన్నది ఆ అమ్మాయి. ఇక దాయి వాళ్ల గూడెం వివరాలు, అమ్మాయి పేరు, మిగతా అవసరమయిన
విశేషాలన్నీ అడిగి తెలుసుకున్నది. ఇక తిరిగి తమ గూడానికి వచ్చి చేరింది.
ఆమె షేఖ్ హమీద్ గుడారానికి తిరిగి వచ్చింది.
అక్కడ వాళ్లంత దాయి కొరకే ఎదురుచూస్తున్నారు. దాయి రెండు కడియాలు బయటకు తీసి
చూపింది. అమ్మాయి గురించి పొగుడుతూ ఎంతో చెప్పింది. అమ్మాయి నిజంగా ఉదారతగల మనిషి,
అంత అందమయిన మనిషి అంటే మామూలు వంశం మనిషి కావడానికి
వీల్లేదు అనుకున్నాడు షేఖ్ హమీద్. ఆ అమ్మాయి తప్పకుండా చాలా ప్రత్యేకమయిన
వ్యక్తి అని అతనికి తోచింది. తన గూడెంలోని కొంతమంది పెద్ద మనుషులను, అలీని కూడా వెంటతీసుకుని గుర్రాలమీద బయలుదేరాడు. నల్లని
గుడారాల ప్రాంతానికి వాళ్లంతా చేరుకున్నారు.
నల్ల గుడారాలలో వారికి గొప్ప స్వాగతం
ఎదురయింది. మొదలు గుర్రాలకు మేత దొరికింది. లోపల చక్కని మర్యాదలు జరిగాయి. చాపలు
పరిచి కూర్చోబెట్టారు. గొర్రెలు, ఒంటెల పిల్లల
మాంసంతో మంచి విందు కూడా జరిగింది. మూడు రోజులపాటు విందులు కొనసాగాయి. ఇక
నాల్గవనాడు ఆ అమ్మాయి తండ్రి అయిన అమీర్ అతిథులుగా వచ్చినవారి పనిగురించి
అడిగాడు. షేఖ్ హమీద్ కడియాలగురించి వివరం చెప్పాడు. ‘ఈ కడియాల సొంతదారు చాలా
ఉదారస్వభావంగల మనిషి. చాలా అందమయిన మనిషి కూడా అయి ఉంటుందని నాకు తోచింది. ఆమె
గొప్ప వ్యక్తిత్వంగల మనిషి అనుకున్నాను. ఆమెతో నా వివాహం జరిగితే బాగుంటుందని నా
ఆలోచన’ అన్నాడు హమీద్.
అమ్మాయి తండ్రి ఒక్కసారి బరువుగా నిట్టూర్చాడు.
కోరిక కలగడం చాలా సులభంగానే జరుగుతుందన్నాడు. అయితే ఒక తండ్రికి తన కూతురు
అన్నిటికన్నా విలువయినది అన్నాడు. ‘కానీ మీరు అతిథులుగా వచ్చారు. అతిథులను
నిరాశపరచడం అరబ్బుల సాంప్రదాయంలో లేదు. ఇక మీవంటి గొప్పఇంటి అతిథుల విషయం మరింత
ప్రత్యేకం. నా తలను మీముందు వంచుతున్నాను’ అన్నాడతను.
అమ్మాయిని పెళ్లికూతురుగా అలంకరించారు. డెబ్బయి
ఒంటెలు, తివాచీలు, దుప్పట్లు, తలగడలు మరెన్నో సరంజామాను వాటిమీద ఎక్కించారు.
ఒక సేవకురాలిని, ఒక బానిసనుకూడా అమ్మాయితోబాటు అప్పగించారు.
వాళ్లు బయలుదేరుతుండగా అమ్మాయి తండ్రి షేఖ్
హమీద్‌తో ‘దేవుని దయతో పెళ్లికూతురు వల్ల మీకు మంచి జరుగుగాక’ అన్నాడు.
షేఖ్ హమీద్ తమ గూడానికి తిరిగి వచ్చాడు.
అక్కడి వారంతా డెబ్భయి ఒంటెలు, కొత్త
పెళ్లికూతురిని చూచి సంతోషించారు. పెళ్లిపాటలు పాడసాగారు. ఇక షేఖ్ హమీద్ అలీని
ముందుకు పిలిచాడు. ‘నీ పెళ్లికూతురు, పెళ్లి గుడారంలో
ఉంది. కంట్లో కాటుక పెట్టుకుని నీకోసం ఎదురుచూస్తున్నది’ అన్నాడు.
‘అదెలా కుదురుతుంది? అమ్మాయిని మీరు వెతికారు. ఆమె తండ్రితో మీరు మాట్లాడి పెళ్లి నిర్ణయించారు’
అన్నాడు అలీ.
షేఖ్ హమీద్ ఒక్కమాట కూడా పట్టించుకోలేదు.
పెళ్లి దుస్తులను అలీకి అప్పగించాడు. ‘కడియం నీకు దొరికింది. పెళ్లికూతురు కూడా
నీకే చెందవలసి ఉంది. ఇక ఆలస్యం చేయకు. ఆమె దగ్గరకు వెళ్లి చేరు’ అన్నాడు ఆయన.
అలీ పెళ్లి గుడారం వేపు బయలుదేరాడు. కొంతదూరం
కూడా నడవక ముందే ఒక వ్యక్తి వచ్చి అతని కాళ్లమీద పడ్డాడు. కాళ్లను
ముద్దుపెట్టుకుంటూ ‘నన్ను ఒక అతిథిగా గుర్తించి దయచూపండి షేఖ్ హమీద్!’ అన్నాడు.
పెళ్లి దుస్తుల కారణంగా అతను అలీని చూచి షేఖ్
హమీద్ అనుకున్నాడు.
ఇంతకూ నీవు ఎవరని అలీ వివరం అడిగాడు. ఎక్కడి
నుంచి వచ్చావని కూడా అడిగాడు.
‘మీరు పెళ్లి చేసుకుని తెచ్చుకున్న అమ్మాయి నాకు
బాబాయి కూతురు’ అన్నాడు ఆ యువకుడు. ‘ఆమెతో నా పెళ్లి నిశ్చయమయింది. మీరేమో ఒక
అతిథిగా మా బాబాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం ప్రస్తావించారు. ఆయన మిమ్మల్ని
కాదనలేకపోయాడు’ యువకుడు వివరించాడు.
అలీ వెంటనే తన పినతండ్రి తనకు అందజేసిన పెళ్లి
దుస్తులను తీసి యువకుడికి కట్టబెట్టాడు. ‘యువకుడా, ఆ అమ్మాయి మీద అన్నిరకాల నీవే హక్కు కలిగి ఉన్నాయి. పెళ్లికూతురు నీకే
చెందుతుంది.’ అన్నాడు.
మరుసటి రోజు అలీ మామూలు దుస్తులలో తిరుగుతూ
ఉండడం షేఖ్ హమీద్ గమనించాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. విషయం ఏమిటని ఆయన అలీని
అడిగాడు. ‘మరి నీవు పెళ్లికొడుకు దుస్తులలో ఉండాలి కదా?’ అన్నాడు.
అలీ తనకు కలిసిన నవయువకుని గురించి వివరం
చెప్పాడు. విషయం విన్న షేఖ్ హమీద్ ఎంతో సంతోషించాడు. బుద్ధిమంతుని లక్షణం అంటే
ఇదే అని కూడా అన్నాడు.
పెళ్లికూతురితో వచ్చిన డెబ్భయి ఒంటెలతో మరొక
డెబ్భయి ఒంటెలను కూడా కలిపి షేఖ్ హమీద్ పెళ్లిజంటకు మరెన్నో విలువయిన బహుమతులను
కూడా ఇప్పించాడు. యువకుడు అతని భార్య చాలాసంతోషంగా వీడ్కోలు చెప్పి తమదారిన
పోయారు.
(మరాకష్ దేశపు జానపద కథ)
No comments:
Post a Comment