Tuesday, August 19, 2025

లోకాభిరామం - పద్యంవిద్య - Lokabhiramam - Padyamvidya

లోకాభిరామం - పద్యంవిద్య



నా పుస్తకం నుంచి మరో వ్యాసం - మీ కోసం

పద్యంవిద్య

రాస్తారా అన్నప్పుడు,

చూస్తానంటే తప్పని, రాస్తానన్నా!

రాస్తే ఏమవుతుందో,

చూస్తాననుకున్నానూ, రాస్తున్నాను!

- ఇది కంద పద్యమేనా? ఏమో? నాకు తెలియదు. రాశాను, అంతే.

నాకు పద్యం రాయడం వచ్చునని చెప్పడానికి కాదు, ఈ పద్యం రాసింది. పద్యం గురించి రాయాలని అనుకుంటుంటే, పద్యం వచ్చింది. నండూరి రామకృష్ణమాచార్యుల వారు మంచి మిత్రులు. ఆయనకు మాట్లాడినంత సులభంగా పద్యం చెప్పడం వచ్చునంటే అతిశయోక్తి కాదు. వచనం (కథ, నవల, వ్యాసం) రాయడం గాల్లో విమానం నడపడం లాంటిదనీ, పాట రాయడం, రోడ్డు మీద కారు నడపడం లాంటిదనీ అన్నారాయన. ఇక పద్యం, పట్టాల మీద రైలు నడక అన్నారు కూడా. కొంచెం పట్టుంటే, వెళ్లవలసిన చోటికి అదే వెళుతుంది! అన్నారాయన. ఏ పనయినా అంతే, చేతనయిన వారికి, చాలా సులభంగానే కనపడుతుంది. మిగతా వాళ్లకది చెక్కల బావిలో మోటార్‌ సైకిల్‌ నడిపినట్లుంటుంది.

చెక్కలతో బావి కట్టి, అందులో గోడల మీద, సైకిల్‌, మోటార్‌ సైకిలూ, నడిపిన గురుభిక్‌సింగ్‌ ప్రదర్శన నాకు ఇన్నేళ్లయినా గుర్తుంది. ఆయనకదే బతుకు. (బహుశ: దాని అంతం కూడా!) ఎట్లా నడుపుతారు, అంటే, ‘ఓస్‌! సులభం’ అంటారని నా అనుమానం. పద్యం రాయడంలో మొత్తానికి ప్రమాదం మాత్రం లేదు. కనుక, నాతో మొదలు ఎవరయినా ప్రయత్నించవచ్చు. జారిపడినా దెబ్బలు తగలవు!

చిన్నప్పుడు, అదెందుకో, ఏమిటో తెలియకుండానే, శతకాలకు శతకాలు భట్టీయం (ఇది నోటికి నేర్చుకునే విద్య!) వేయించేవారు. ఇది పక్కనే పెడితే, మా ఊరి బడి ఒక సెంటర్‌ స్కూలట. సెంట్రల్‌ కాదని మనవి. చుట్టుండే అయిదారు పల్లెలకు అది కేంద్రమని అర్థం! ఆ బడులలో పంతుళ్లు వచ్చి ఒక ‘సెంటర్‌ క్లాస్‌’ అనే కార్యక్రమంలో ‘మాదిరి తరగతి’ అనే మాడల్‌ క్లాసులు నిర్వహిస్తుండేవారు. ఇది కూడా పక్కనబెడితే, ఈ బడులన్నింటికీ కలిపి ఆటల పోటీలు కూడా పెట్టేవారు. అంతటితో ఊరుకుంటే పోదూ? నాలాంటి ఆటలు చేతగాని మొద్దబ్బాయిల కోసం, పద్యాల పోటీ పెట్టారు. అమాయకులు, కొందరు అందులో పాల్గొంటామని పేర్లు ఇచ్చారు కూడా. మన సంగతి తెలియదులాగుంది. వాళ్లంతా, నట్టుతూ, ముక్కుతూ మూడు నాలుగు పద్యాలు చదివి, అలసి ఆగిపోయారు. నేను మాత్రం, వద్దన్నా ఆపకుండా, మొత్తం శతకం ఒకటి చదివినట్టున్నాను. అది మూడవ, నాలుగవ తరగతిలో ఉన్నప్పటి మాట!

సినిమా పద్ధతిలో సీన్‌ కట్‌ చేస్తే, ఎనిమిదవ తరగతిలో తేలుతుంది. యాదగిరాచార్లు గారు తెలుగు చెపుతారు. చాలా బాగా చెపుతారు. శ్రావ్యంగా పద్యం చదువుతారు. పద విశ్లేషణ, అంటే పదాలను విడగొట్టి చూపడం, తరువాతి అంచె. అర్థం చెప్పడం, సమన్వయం, ఆ తరువాత జరుగుతాయి. పద్యాన్ని మరో సారి చదువుతారు. అప్పుడు పిల్లలను చదవమంటారు. అందరూ వరుస తరువాత వరుసగా, ఒక క్రమంలో కూచుంటారు గదా! రెండు బెంచీలు మాత్రం కుడి పక్కన గోడ వెంట ఉండేవి. అందులో మొదట్లోనే నేను ఉండేవాణ్ని! అందరికంటే ముందు లేచి పుస్తకం అవసరం లేకుండానే, ఆ పద్యం చదివేవాణ్ని! అట్లా నడుస్తూనే ఉంది. మరీ చాలాకాలం నడిస్తే ఎందుకు గుర్తుంటుంది సంగతి? క్లాసులో ఉండే ఆడపిల్లలలో ఇద్దరు, ఇదంతా నచ్చలేదనుకున్నారు. ‘మీరు ఏ పద్యం చెప్పబోతున్నారో ముందే వాడికి చెపుతారు. వాడది ఇంట్లో నేర్చుకుని వస్తాడు! బడాయి!’ అన్నారు. ఆచార్లు గారికి నేనంటే, ఆనాటికీ, ఈనాటికీ అభిమానమే. ‘ఎందుకు ఉడుక్కుంటారు? నేను చెప్పినంత సేపు, అతను పద్యం మనసులో మననం చేసుకుంటాడు. మీరు చేయరు. అంతే!’ అన్నారు. సిలబస్‌లో లేని పాఠం ఒకటి తీసి అందులో పద్యం చెప్పడం మొదలుపెట్టారు. అలవాటు కొద్దీ, వంతు రాగానే, నేను పద్యం అప్పజెప్పాను. పుస్తకం లేకుండానే! ఆ తరువాత ఏమయిందో నాకు గుర్తులేదు.

బడిలో నాతోబాటు పద్యాల పోటీలో పాల్గొన్న మిత్రుడు, బంధువు విష్ణు, చెప్పా పెట్టకుండా మిలిటరీలోకి వెళ్లిపోయాడు. వాళ్లకు ఉత్తరాలు రాసే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మొత్తం చిరునామా ఎవరికీ ఇవ్వరు. పేరుతోబాటు ఒక నంబరేమయినా ఉండేదేమో? గుర్తు లేదు. ఫలానా శర్మ, కేరాఫ్‌ 56, ఎ.పి.ఓ. అని రాస్తే చాలు, ఉత్తరం వెళ్లిపోతుంది. ఏపీఓ అంటే ఆర్మీ పోస్ట్‌ ఆఫీస్‌ అని తరువాత తెలిసింది. (తెలిసిందా?) 56 అంటే విష్ణు ఉండే చోటయి ఉంటుంది. ఈ సంగతంతా పక్కన పెడితే, ఒకసారి ఉగాదికో, సంక్రాంతికో వాడికి ఇన్‌లాండ్‌ లెటర్‌ నిండా పద్యాలతో ఉత్తరం రాశాను. ఒక కాపీ ఉంచుకోవాలని తోచలేదు. వాడి దగ్గర గానీ, ఉందేమో ఉత్తరం, అడగాలి!

చిన్నాయనగారు కొంతకాలం పాతకాలం పద్ధతిలో ‘వసుచరిత్ర’ పాఠం చెప్పారు. ఇంట్లో, సంధులు, సమాసాలు, అలంకారాలు, పద్యవిద్య ఎన్నెన్నో పరోక్షంగా నేర్పించే పద్ధతి అది. బడిలో కూడా ఇట్లా చెప్పాలనే అనుకుంటారు కానీ, ఎందుకో అది కుదరదు. దేనికదే వేరువేరుగా ఉండిపోతయి. మొత్తానికి వసుచరిత్ర, మనుచరిత్ర, ఆశ్వాసాల మీద ఆశ్వాసాలు నోటికి వచ్చేవి. ‘అన విను, గృహస్థ రత్నంబ! లంబమాన రవిరథతురగ..’ అంటూ వచనమంతా ఒక్క పట్టున అప్పజెబితే అదొక ఆనందం. అమరకోశం, శబ్దమంజరి లాంటివి అంతకు ముందు నుంచే అభ్యాసంలో ఉండేవి. అప్పుడే అప్పకవీయం పరిచయమయింది. పద్యాల లక్షణాలను పద్యాల రూపంలో చెప్పే పుస్తకమది. నిడుదలు, జడ్డక్కరములు, పిరుందకడ యూదిన యక్కరముల్‌ గురువులు. కానివి లఘువులు. ఈ గురు లఘువుల కాంబినేషన్‌తో గణములు, గణముల కాంబినేషన్స్‌తో వృత్తములు, పద్యములు. తరువాత డి.ఎన్‌.ఏ. గురించి చదువుతుంటే నాకిదంతా గుర్తుకు వస్తుండేది. ‘జరల్‌ జరల్‌ జగంబుకూడి సన్నుతిన్‌ రచింపగా, పరాజితార ధీరవీర పంచచామరంబగున్‌!’ పంచచామరం అనే పద్యం లక్షణం పంచచామరంలో!

రేడియోలో నౌకరీ కొరకు ఇంటర్‌వ్యూహము. ‘రామాండెమంటే, సామాండెమా? గొల్లేశమంత కథ!’ అని ఒక మాట. రామాయణం సామాన్యం కాదు! బయలాటలో వచ్చే గొల్లవేషమంత ఉంటుందని, అన్న మనిషి భావం! ఈ ఇంటర్‌వ్యూహము కూడా గొల్ల వేషమంత కథ. ప్రస్తుతం పద్యంలో ఉన్నాము గనుక, అందుకు సంబంధించిన ప్రసక్తి ఉంది గనుక అది గుర్తొచ్చింది. ఉద్యోగం సైన్సుకు సంబంధించింది. ముగ్గురు నిపుణులు నా బుర్ర తిన్నారు. చేతయినంత వరకు నేనూ వారి బుర్ర తిన్నాను. కైసర్‌ కలందర్‌ గారని ఒక అందమయిన పెద్దాయన, కమిటీ అధ్యక్షులు. ‘సైన్సు సరే! హాబీలేమిటి?’ అని అడిగారు. ‘తిండి, అమ్మాయిల’ గురించి చెబితే కుదరదు. కనుక ‘సంగీతం, సాహిత్యం’ అన్నాను. ‘ఒక పద్యం చెప్పగలవా?’ అన్నారాయన. ‘కలడుల్లోక మహా మహోగ్ర’ అంటూ వసుచరిత్రలోని పద్యం చదివాను. అందులో కలడు అని మొదట్లో, ఇలన్‌ అని చివర తప్పితే మిగతా మొత్తం ఒకే ఒక్క సంస్కృత సమాసం మరి! ‘అర్థం చెప్పగలవా?’ అన్నారాయన. ‘ఓ యస్‌’ అన్నాను. భయపడ్డారేమో, ‘వద్దులే’ అని మరేదో అడిగారు. నాకా ఉద్యోగం ఇస్తారని అక్కడే అర్థమయింది. అది మరో గొల్లవేషం కథ!

మళ్లీ మొదటికి వస్తే, రామకృష్ణమాచార్యుల వారికి, ఆలోచన ఏదయినా వస్తే వెంటనే ఒక కార్డు ముక్క రాయడం అలవాటు. నేనూ జవాబుగా ఒక కార్డు రాసేవాణ్ని. ఒకసారి ఆయన రాయవలసిందేదో రాసి, కార్డు వెనుక చిరునామా రాసేచోట పక్కన ఖాళీలో రెండు పద్య పాదాలు రాశారు. ‘శాంతి సంగరంబు, స్వాతంత్య్ర సమరాన, సగము కాలినట్టి సమిధ నేను’ అని మాత్రం రాశారాయన. జవాబుగా రాసిన కార్డు వెనుక నేనూ అదే పద్ధతిలో ‘కడమ సగముగాల్చి కవితా ప్రపంచాన, కారు చీకట్లను పారద్రోలె!’ అని రాసి పంపాను. నమ్ముతారో లేదో? కార్డు అందిన మరుక్షణం ఆయన ఆఘమేఘాల మీద వచ్చారు. నన్ను కౌగిలించుకున్నారు. ‘తెలుగు పద్యం’ గురించి నేను వేస్తున్న పుస్తకంలో, నీ పద్యం ఉండాలి!’ అన్నారు. పద్యం లేదు. అదే వేరే సంగతి!


No comments: