Navvali Mari
Article from my column and book Lokabhiramam
నవ్వాలి మరి!!
ఒకడు మాడినరొట్టె తిని కడుపునొప్పి తెచ్చుకొనగా వైద్యుడాతని కంటికి మందు
వేసెను` చమత్కారచంద్రిక అనే చాలా పాత పుస్తకంలోని ఒక జోకు.
---
‘ఆసుపత్రికి దారి చెప్పగలరా?’ అంటే ‘గలను!’ అని వెళ్లిపోయాడొకతను.
ముళ్లపూడివారి నవ్వితే నవ్వండిలోని ఒక జోకు. వారి జోకును మరింత ముందుకులాగి
నవ్విస్తారు.
---
పెళ్లాన్నేంచేస్తావురా బాళప్పా?’ ప్రశ్న. ‘గొంతుపిసికి బాయిలో ఏస్తాను!’ జవాబు.
చీనన్న మా ప్రసాదుకు ఆ ప్రశ్న అడిగితే ఆ జవాబు చెప్పడం నేర్పించాడు. ఈ మాటలు
ఎక్కడివి? అన్న అనుమానం అప్పట్లో నాకు రాలేదు. తరువాత మాత్రం చాలాకాలంగా అనుమానం
తొలుస్తూనే ఉన్నది. ఇంతకూ అది జోకా? దానికి నవ్వాలా? నవ్వాలి మరి! చీనన్న అంటే మా ఒకానొక
చిన్నాయనగారి కుమారుడు. హాస్యప్రియుడు. ఒకరోజు అతను భోజనం ముందు
ముగించినట్టున్నాడు. తరువాత తిన్నవారికి చారులో
ఉప్పులేదని అర్థమయింది. ‘అదేమి చీనూ! చెప్పనేలేదు?’ అన్నది అమ్మ. ‘అది
ఒక రుచి అనుకున్నాను పెద్దమ్మా!’ చీనన్న జవాబు. చీనన్న నిజంగా మంచివాడు. అమాయకుడు
అనాలేమో. కానీ రుచి గురించి మాత్రం దశాబ్దాల తరువాత కూడా మా యింట్లో జోకుగా
చెప్పుకుంటాము. ఒకసారి బంధువుల ఇంటికి పోతే వాణి(డి)కి ఇడ్లీలు పెట్టినట్లున్నారు.
ఇంటికి వచ్చిన తరువాత, తిండి పట్టదు అన్నడు. ఎందుకంటే ‘ఉప్పిండి ఉంటలు
(ఉండలు) తిన్న!’ అని జవాబు. ఇదీ మాకు ఒక జోకుగా మిగిలింది. ఉండ అంటే గుండ్రంగా
ముద్ద కట్టినది అనేనా అర్థం? దాన్ని మేము ‘ఉంట’ అంటాము. మా బావమరిది మరో
చీనన్న. ఈయన అంతకన్నా హాస్యప్రియుడు. చేసిన లడ్డూలు మరురోజున ఉంటే ఉంటలు, లేకుంటే ఉండలు అన్నాడు.
ఉండను అనే మాటకు అర్థం తెలుసుకదా. ఈ ఇద్దరూ ఇప్పుడు లేరు. ఒకరు ప్రయత్నించి, మరొకరు నిజంగా
అప్రయత్నంగా పైలోకాలకు చేరుకు న్నారు. బతుకులో వెలుగు నీడలకు వీళ్లే ఉదాహరణలు.
గణపతి అని ఒక నాటకం. అది హాస్యం కింద లెక్క. విజయవాడ రేడియోవాళ్లు దాన్ని
రేడియో నాటకంగానూ మలిచారు, చాలా యేళ్ల క్రితమే. నేను పుస్తకం చదివాను.
రేడియో డ్రామా విన్నాను. అప్పట్లో నా రియాక్షన్ ఏమిటో నిజంగా గుర్తులేదు.
శ్రీరఘురామ, చారుతులసీదళధామా అన్న పద్యానికి ఆ నాటకంలో ఒక పంతులుగారు, రాములవారు
చారుగాచుకున్నారు, కరియాపాకు లేకుంటే తులసి వేశారు అని వ్యాఖ్యానం
చెబుతారు. అది మాత్రం తప్పకుండా నవ్వించింది. కొంచెం తెలివి వచ్చిం తరువాత (ఆహా?!) నాటకం వింటే, అరికాల్లోనుంచి మంటపుట్టింది. అది ఏమాత్రమూ
నవ్వవలసిన అంశం కాదు. గణపతి ఒక
మొద్దబ్బాయి. ఎవరయినా మొద్దబ్బాయిగా పుడితే తప్పు తల్లిదండ్రులది. వానిది ఎంత
మాత్రమూ కాదు. ఆ మొద్దబ్బాయిని తల్లి అమితంగా ప్రేమిస్తుంది. తల్లులకు మామూలు వారి
కన్నా, బలహీనులు, బుద్ధిహీనులపట్ల కించిత్తు ఎక్కువ ప్రేమ సహజంకదా. ఈ విషయాన్ని హాస్యంగా వాడు
కుంటే అంతకంటే క్రూరత్వం ఇంకొకటి ఉంటుందా? ఆలోచించాలి. అలాంటివారిపట్ల సానుభూతి
కలుగుతుంది. నవ్వు పుట్టదు, పుట్టగూడదు.
ప్రతి మనిషిలోనూ పరిణామక్రమ ప్రభావంతో, ఒక అడవి మనిషి, మంచి చెడు చూడలేని మొరటు మనిషి దాగి ఉండడం
సహజం. ఒకరెవరో జారి పడతారు, లేదా కట్టుకున్న గుడ్డ ఊడుతుంది. అందరూ ముందు నవ్వుతారు. అదుగో! ఆ మొరటు మనిషి
పైకి వచ్చి నవ్వించినట్టు లెక్క. ఆ తరువాత సభ్యమానవుడు మేలుకుని సానుభూతిని కూడా
పంచడం తెలుసు.
పుట్టపర్తి నాగపద్మిని గారు కొన్ని పుస్తకాలు, గోపాలకృష్ణ అన్నయ్యగారికి ఇమ్మని, ఒక అబ్బాయికి
అప్పజెప్పారు. అతను, నేనే గోపాల‘కృష్ణ’ అనుకుని నాకు తెచ్చి
ఇచ్చాడు. నిమిషాల్లో తిరిగి వచ్చి మళ్లీ పట్టుకుపోయి, అసలు చిరునామాలో
అందజేశాడు. ఈ మధ్య నిమిషాలలో నాకొక ‘యురేకా!’ క్షణం దొరికింది. ప్రసిద్ధ కన్నడ
రచయిత ‘బీచి’ (వివరాలు మరోసారి). ఆయన నవల ‘సరస్వతీసంహారము’. దాన్ని పుట్టపర్తి
నారాయణాచార్యులవారు తెలిగించారు. ‘పెళ్లాన్ని ఏంచేస్తావురా?’ డైలాగుతో ఆ
పుస్తకం మొదల వుతుంది. నేను స్నానం చేస్తూ పుస్తకం చూడలేదు. లేకుంటే నా యురేకా, మరో జోకయి ఉండేది.
పద్మిని గారిని ఫోన్ ద్వారా పుస్తకం కొరకు అభ్యర్థించాను. ఆమె దయతో మొదటి
సంహారంలోని (సంహారం అంటే సమాహారమని, అంటే ఒక సేకరణ, గుంపు, కూడిక అనే అర్థముంది!) అన్నీ కాకున్నా, కొన్ని పుస్తకాలను
నాకు పంపించారు. వారికి ధన్యవాదాలు చెప్పాను. రుతుసంహారము అన్న కావ్యానికి రుతువుల
వరుస అని అర్థం. మరి ఈ సరస్వతీ సంహారము ఏమిటన్నది నా కుతూహలం. ఆచార్యులవారి రచనలు, వారి గురించిన
రచనలు ఉన్న ‘త్రిపుటి’ని కూడా పక్కనపెట్టి ముందు ఈ చిన్న నవల చదివేశాను. దానికోసం మీరు వెతికితే దొరకదు. అచ్చులో అది
ఇప్పుడు దొరకడం లేదు. పద్మిని నాకు, మా అన్న గోపాలకృష్ణకు ఇచ్చినది ఫోటో కాపీప్రతి!
ఈ పుస్తకంలోని నాయకుడు బాళప్ప అను బాలప్ప. వాడు గణపతికన్నా మరింత మొద్దబ్బాయి.
వానికి ఆదర్శ మహిళలకు ఆదర్శంగా ఒక అక్కగారు. ఆమె భర్త పండితుడు, తాత్వికుడు. వారి
సంతానమయిన సరస్వతి, అపర సరస్వతి. అందగత్తె, మూర్తీభవించిన
మంచితనం. మనకు మేనరికం హక్కు అనేది ఒకటి ఏడిచిందిగదా. కనుక సరస్వతిని బాలప్పకిచ్చి
పెళ్లి చేశారు. (ఇంకా నయం, గణపతి కథ ఇంతదూరం సాగదు!) ‘బాయిలో ఏస్తాను’ అదీ
‘గొంతు పిసికి’ అని చిన్నప్పుడు చెప్పిన మాటలను నిజం చేస్తాడు ఈ నాయకుడు. నిజంగా
అది సరస్వతీ సంహారమే. పుస్తకం చదివిన తరువాత నా మనసు కలతపడింది. ఎన్నిసార్లు, ఎంతకాలం దాన్ని
గురించి ఆలోచించానో? ఇది హాస్యమా? దీనికి నవ్వెట్లా వచ్చింది? ఒక అమాయకప్రాణి, ఖర్మగాలి మూర్ఖు
డయితే, అది నవ్వుపుట్టిస్తుందా? మనం మనుషుల మయినట్లా? లేక ఇంకా పశువులుగా
మిగిలి ఉన్నామా?
మొక్కపాటివారు బారిస్టర్ పార్వతీశము ఒక రచనను మనకు అందించారు. అందులోని
సన్నివేశాలు అన్ని మనలను నవ్విస్తాయి. దాన్ని సిచ్యుయేషనల్ కామెడీ అంటారు.
అందులోనూ ఎక్కడో కొంత అమాయకత్వం నక్కి ఉంటుంది. కానీ మొరటు హాస్యం కాదది.
సందర్భంగా ఒక విషయం. మొక్కపాటి వారికి బహుశ బోదకాలు ఉండేదేమో. ఆయన ఎవరో గురుపాదులు
అన్నారట. ఇది మళ్లీ గణపతి, బాళప్పలను తలపించే హాస్యం.
చిలకమర్తివారి హాస్యములు అనే ఒక పుస్తకం రెండవచేతి (అదే సెకండ్‌హ్యాండ్)
పుస్తకాలలో కనపడితే కొన్నాను. చదవడం మొదలుపెడితే, ముందుకు కదలలేదు. అందులోనూ మొరటు హాస్యమే.
బ్రామ్మల గురించి జోకులు వేసి నవ్వడం మనకు బాగా అలవాటు. మాయాబజారులో శర్మ, శాస్త్రి మొదలు, కోడిని చూస్తే
తినాలనిపిస్తోంది అనే సినిమా, ఆ తరువాత నిరసనలు, నినాదాలకూ కారణమయిన
మరో సినిమా దాకా, అంతటా ఇదేకదా, (అప)హాస్యానికి ప్రాతిపదిక. పోలీసులను, బాపనవారిని గురించి
జోకులు వేస్తే అడిగేవారు లేరనా? తెలంగాణా యాస మరో హాస్యం!
దేవుళ్లను గురించి జోకులు, కార్టూన్లు వేయడం మనకు మరీ మరీ బాగా చేతవును.
గణపతి చవితి వచ్చిందంటే, పత్రికలన్నింటిలోనూ అవే కార్టూన్లు. ఆయన
బొమ్మను మురికిగుంటలో ముంచింది చాలక, దాన్ని గురించి జోకు చేయడం!
చిన్నప్పుడు ఊళ్లో బోగమాట ఆడేవారు. అక్కడ బోగంవారు ఎవరూ లేరు. అది వీధి నాటకం.
తెల్లవార్లూ జరుగుతుంది. మధ్యలో కొంచెం తెరిపి, రిలీఫ్ కావాలి. ఒకాయన ‘మంచి మంచి పద్యాలు
చెపుతాను వినండి’ అని మొదలుపెట్టి ‘చూడుము నీ సంసారపు నడకలు, దేవా ఈ ప్రజలు, ఎంతో మారిరి
మానవులు’ అని పాటపాడేవాడు. ‘దేఖ్ తెరీ సంసార్‌కి హాలత్ క్యా హోగయా భగవాన్, కిత్‌నా బదల్‌గయా
ఇన్‌సాన్’ అన్న సినిమా పాటకు అది స్వేచ్ఛానుకరణ. ఆయన అప్పట్లో చేసిన ఒక
ట్రిక్కును నేను ఇవాళటికీ మేనేజ్‌మెంట్
ట్రయినింగ్‌లలో వాడుతున్నాను. ‘మిమ్మల్నందరినీ నా వెనుకకు తెప్పిస్తాను, కళ్లు మూసుకోండి!’
అని మంత్రం చదువుతాడు. మనం కళ్లు తెరవగానే అతను అటువేపు తిరిగి మళ్ళడం కనపడుతుంది. ఎంత బాగుంది. జోకంటే అది!
నవ్వండి. కానీ, ఎందుకు నవ్వామో ఆలోచిం చండి. ఒకోసారి కళ్లు
చమర్చుతాయి. ఇది నా బాధ.
---
‘అట్లు తింటారా?’ ప్రశ్న! ‘అట్లే కానిండు!’ జవాబు. అది మాటకారి
తనం.
No comments:
Post a Comment