కర్తార్ సింగ్ దుగ్గల్ - కథ
చిన్న లైన్ - చిన్న స్టేషన్
ఉర్దూ మూలం : కర్తార్ సింగ్ దుగ్గల్
తెలుగు : భవదీయుడు గోపాలం
రైలు ఆగింది. ముందే చిన్న లైను. అందులోనూ అది చిన్న
స్టేషన్. అయిదు నిమిషాలు గడిచాయి. పది నిమిషాలు, పదిహేను నిమిషాలు, రైలు కదిలే రకంగా కనిపించలేదు. నేను వెళ్లి
గార్డ్‌తో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆ చిన్న రైలులో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్
కంపార్ట్‌మెంట్ ఉంది. అందులో మరెవరూ లేరు. నేను ఒక్కడినే ఉన్నాను. నేనేమో మరి
ముందుకు వెళ్లి మరో రైలు అందుకోవాలి. రేపు ఉదయానికి దిల్లీ చేరుకోవాలి. అక్కడ ఒక
ముఖ్యమయిన మీటింగులో తప్పకుండా ఉండాలి. ఈ మాటలన్నీ గార్డ్‌కు చెప్పాలని నా ఆలోచన.
అంతలోనే అటువేపు నుంచి మరొక రైలు వచ్చింది. అది కూడా స్టేషన్‌లో ఆగిపోయింది. చిన్న
లైన్ మీద ఉండే చిన్న స్టేషన్‌లో అది ఆగింది.
ఒక చిన్నబండి, దాంతో మరో చిన్న బండి.
రెండూ ఆగిపోయాయి.
బహుశా ఈ రైలు కోసమే మా రైలును ఆపి ఉంటారని నేను కొంతసేపు
అనుకున్నాను. త్వరలోనే కదులుతుంది అన్న ధీమాతో న్యూస్‌పేపర్ చేతికి అందుకున్నాను.
పేపర్‌లో ఈ మధ్యన ఒక విచిత్రమయిన కేసు గురించి చాలా వివరంగా
రాస్తున్నారు. ఒక భారతదేశపు కుర్ర ఆఫీసరు. ఏదో పనిమీద విదేశాలకు వెళ్లాడు. అక్కడ
అప్సరసలలాగ కనిపించే అమ్మాయిల్లోనుంచి ఒకరిని ఎంచుకొని పెళ్లి కూడా చేసుకుని
వచ్చాడు. భార్యభర్తలిద్దరూ ఆనందంగా బతుకుతున్నారు. ఒక బాబు, మరొక బాబు, ఒకరి తరువాత ఒకరు పుట్టేశారు కూడా. పిల్లలు చాలా ముద్దుగా బొద్దుగా
ఉన్నారు. తల్లి భారతీయ వనితలలాగే పిల్లలమీద బోలెడంత ప్రేమ కురిపిస్తుంది. తన భర్త
ఉద్యోగం పేరున నెలల తరబడి ఎక్కడికో వెళ్లిపోతాడు. తల్లి, పిల్లలు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉండిపోతారు. బతుకు అలా గడిచిపోతూ
ఉంది. అంతలో ఆ ఊళ్లోకి ఒక వ్యాపారవేత్త రావడం మొదలయింది. అతను తిరగడం అలవాటు లేని
మనిషి. ఎలా పరిచయం కుదిరింది తెలియదు కానీ, ఈ విదేశీ అమ్మాయితో అతను
స్నేహం పెంచుకున్నాడు. ఒకసారి, రెండుమార్లు, ఎన్నోమార్లు. ఆమె భర్త మాత్రం వచ్చినప్పుడల్లా కొంతకాలం ఉంటాడు కానీ, ఆరారు నెలలపాటు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇంగ్లీషు అమ్మాయి ఒంటరితనంలో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. పట్నం నుంచి వచ్చిన వ్యాపారి ఆ అమ్మాయి బతుకును
కొంచెం మారుస్తున్నట్టు కనిపించింది. కొన్నాళ్లకు భారతీయ ఆఫీసరు ఇంటికి వచ్చాడు.
తన భార్య తీరు కొంత మారిపోయినట్టు గమనించాడు. మనసు మారిందో లేదో తెలియదు. మనిషి
మాత్రం కొంత మారింది. తాను మనసులో ఏదీ దాచుకోకుండా వ్యవహారమంతా భర్తముందు విప్పి
చెప్పింది.
ఒక పాపం జరుగుతుంది, దాన్ని
కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పి మరో పాపం చేయడం ఆ విదేశీ అమ్మాయికి
చేతనయినట్టు లేదు.
ఇక ఆఫీసరుకు కాళ్లకింద నేల కదిలిపోయిన భావం కలిగింది.
కృంగిపోతున్నట్టు భావించుకున్నాడు. తన పిల్లల తల్లి తన జీవితాన్ని సుఖమయం
చేస్తున్నది. అలాగే కలకాలం కొనసాగుతుంది అనుకున్నాడు. కానీ ఆమె మోసం చేసింది.
కోపంలో తనను తాను మరిచిన ఆ అధికారి పట్నం వ్యాపారిని పట్టుకున్నాడు. ఒక్క
రివాల్వర్ గుండుతో అతని కథను ముగించేశాడు. తన ప్రపంచాన్ని తననుంచి లాక్కున్న
మనిషి అతను. ఆ మనిషి జీవితాన్ని తాను లాక్కున్నాడు.
ట్రెయిన్ ఇంకా కదలడం లేదు. పేపర్‌మీద నుంచి దృష్టి పక్కకు
కదిలించి అటుఇటూ వెతికినట్టు చూచాను. అటు నిలబడ్డ రైలు. అందులోని ఒక కిటికి. ఆ
రైలు అప్పుడప్పుడే వచ్చి ఆగింది కదా. ఆ కిటికిలో కనిపిస్తున్న ఒక ముఖం మీద నా చూపు
నిలబడింది. ఆ ముఖం పండిన రేగుపండు లాగ ఉన్నది. సన్నని చిరునవ్వు కూడా ఆ ముఖంలో
కనబడుతున్నది. ఎవరో పల్లెటూరి అమ్మాయి పట్నం వెళుతున్నదని నేను మనసులోనే
అనుకున్నాను. మొత్తం కిటికీ నిండా తానే కనిపిస్తూ కూచున్నది. చక్కని ఫొటోకు
చిక్కని ఫ్రేమ్ వేసినట్టు ఆ దృశ్యం అందంగా కనిపిస్తున్నది. ఒక్కసారి మా చూపులు
కలిశాయి. ఆ అమ్మాయి గలగల నవ్వేసింది. నువ్వు నన్ను చూస్తావని నాకు తెలుసులే
అన్నట్టుంది ఆ నవ్వు. పల్లెటూరి అమ్మాయి ఇంతగా నవ్వదు మరి. ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో
ఒక్కడివే ఉన్నావు. నేనేమో ఇక్కడ ఇంతమంది మధ్యన ఇరికి ఉన్నాను. అందరూ ఒకరిమీద ఒకరు
పడుతున్నారు అన్నట్టు ఉంది ఆమె తీరు.
కిటికి అద్దాలలోనుంచి ఎండ బలంగా పడుతున్నది. నేను
కూచున్నానా,
పడుకున్నానా చెప్పరాని ఒక పరిస్థితిలో చేరబడి పత్రిక
చదువుతున్నాను. మీలాంటి వాళ్లు అంతేనయ్యా! అన్నట్టు ఆ అమ్మాయి గలగలా నవ్వింది.
నాకు ఆమె కొంగులో మూటకట్టుకున్న మల్లెమొగ్గలు ఒక్కసారిగా చల్లినట్టు తోచింది.
నేను మళ్లీ పేపర్ చదవడం మొదలుపెట్టాను. భారతీయ అధికారి కథ
ఇంకా పూర్తి కాలేదు. ఇంగ్లీషు అమ్మాయి న్యాయాధికారి ముందు వచ్చి నిలబడింది. ఉన్న
విషయాన్ని వివరంగా చెప్పింది. ఈ వ్యాపారస్తుడి ముందు నా మనసు బలహీన పడిపోయింది.
అతను నన్ను కారులో ఎక్కించుకుని ఎక్కడెక్కడో తిప్పేవాడు. మంచి మంచి హోటళ్లకు
తీసుకు వెళ్లాడు. నా భర్తగారు ఆరు మాసాల పాటు ఇంటికి తిరిగి వచ్చేవారు కాదు.
చలికాలం రాత్రులలో నాకు మరీ సంకటంగా ఉండేది. మా ఆయన ఉద్యోగం పేరున ఇలా తిరగకుండా
ఉంటే బాగుండేది అనుకునే దాన్ని. మా ఆయన దేవుడు లాంటి వాడు. కనీసం గొంతు పెద్దది
చేసి అరవడం కూడా తెలియదు. ఇక వచ్చిన ఆ మనిషి ఉన్నాడే, అతను న్యాయం లేనివాడు. ప్రతిసారి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెపుతాడు. ఏదో
రకంగా మాటలలో పెట్టి తిరిగి పిల్లల దగ్గర తెచ్చి వదిలేస్తాడు. మాట నిలబెట్టుకోడు.
ఒక్కసారి కళ్లు పైకెత్తి మళ్లీ చూచాను. కిటికి దగ్గర
కూచున్న ఆమె అదే పనిగా నావేపు చూస్తున్నది. జాగ్రత్తగా చూస్తే ఆవిడ తలమీద
కప్పుకున్న కొంగు జారిపోయింది. జుట్టు నల్లగా ఉంది. చక్కని నూనె పట్టించి
దువ్వినట్టు ఉంది. చెవుల వెనుక ఒక చిత్రమయిన క్లిప్‌తో వెంట్రుకలను బిగించింది. ఆ
క్లిప్ బహుశా బంగారమేమో. కనీసం ఇత్తడి అయినా అయి ఉంటుంది. అమ్మాయి క్లిప్‌లను
తీసేసింది. జుట్టంతా చెదిరి ముఖం మీద కూడా పడింది. ఈ అమ్మాయి పల్లెటూరి మనిషి
కానేకాదు అని మనసులోనే అనుకున్నాను. పల్లెటూరి అమ్మాయి కావడానికి వీలేలేదు. ఈమెకు
తాను అందగత్తెనన్న విషయం కొంచెం ఎక్కువగానే తెలిసినట్టుంది. ఉంగరాలు తిరిగిన జట్టు
పాములాగ ఆమె బుగ్గలమీద కదలాడుతున్నది. ఎర్రని బుగ్గలమీద నల్లని జుట్టు. దట్టంగా
ఉన్న జుట్టును ఆమె ఒక్క ఊపుతో భుజం మీదుగా ముందుకు వచ్చేట్టు విసిరింది. ఎంత
పొడుగు, ఎంత మెత్తదనం... ఎంత అందంగా ఉంది ఆమె జుట్టు! ఆమె జుట్టుతో ఆడుకుంటున్నది.
దాన్ని కట్టుకునే ప్రయత్నంలో ఉంది.
నేను మళ్లీ పత్రిక చదవసాగాను. ప్రజలంతా కేసు గురించి
పిచ్చెత్తుతున్నారు. కోర్టు బయట గుంపులు గుంపులుగా వచ్చి చేరుకుంటారు. భారతీయభర్త
వస్తున్న కారు మీద వాళ్లు పూలు చల్లుతారు. కోర్టు ముందు ఉండే పార్కులో కాలేజి
పిల్లలంతా చేరి బైబిల్,
భగవద్గీత పారాయణం చేస్తారు. చేతులు జోడించి దేవున్ని
ప్రార్థిస్తారు. ఆ మనిషి శిక్ష పడకుండా బయటపడాలి అనుకుంటారు. యువ వయస్సు
అమ్మాయిలంతా ఆఫీసరుకు ఉత్తరాలు రాస్తారు. తమ ఫొటోలు కూడా పంపిస్తారు. అందరూ
అతగాడిని పెళ్లి చేసుకోవాలి అనుకునే వారే. అతను దారి వెంట వస్తే చాలు, గంటల తరబడి వేచి చూస్తున్న ఆడవాళ్లందరూ అతనిమీద ముద్దుల వర్షాలు కురిపిస్తారు.
అతని బొమ్మలు అచ్చువేసిన పత్రికలకు మరోసారి మరిన్ని కాపీలు అచ్చువేయవలసి వస్తుంది.
మొత్తం దేశంలోని పత్రికలలోనూ ఈ వ్యవహారం గురించే ఎక్కువగా రాస్తున్నారు.
పత్రిక చదివే వాళ్లలో కొందరు కేసు గురించి పందేలు కూడా
వేసుకుంటున్నారు. ఉరి తప్పదని కొందరంటారు, శిక్ష మాత్రమే ఉంటుందని
మరికొందరంటారు,
వదిలేస్తారని ఇంకొందరంటారు.
ట్రెయిన్ ఇంకా కదలనే లేదు. గజిబిజి పడుతూ నా చూపు
దినపత్రిక నుంచి కదిలింది. ఎదురుగా కిటికిలో చిరునవ్వులు చిందించే ముఖం ఎప్పటిలాగే
కనిపించింది. ఈసారి ఆమె చేతిలో ఒక బాబు ఉన్నాడు. బొమ్మలాగ బొద్దుగా ఉన్నాడు.
వెన్నముద్దలాగ ఉన్నాడు. తల్లి రంగు గోధుమ కలిసి ఉంటే, కుర్రవాడు మాత్రం తెల్లని తెలుపు. మళ్లీ ఒకసారి మా చూపులు కలిశాయి. అమ్మాయి
ఒక్కసారిగా అటువేపు తిరిగింది. బ్లౌజ్ హుక్‌లు తొలగించి విప్పడం మొదలుపెట్టింది.
ఒక్కసారిగా ఆమె వక్షం బయటపడిరది. స్తనాన్ని బాబు నోటికి అందించి పాలు ఇచ్చే
ప్రయత్నంలో పడింది ఆమె. పిల్లవాడికి ఆకలిగా ఉన్నట్టు లేదు. అటుయిటూ కదులుతాడు.
తలతో తల్లి ఎదను పొడుస్తాడు. స్తనాన్ని నోట్లోకి తీసుకుంటాడు, మళ్లీ వదిలేస్తాడు. ఆ ఆడ మనిషి పిల్లవాడి చేష్టలను చూసి ప్రేమగా నవ్వుతున్నది.
ప్రేమ నిండిన కళ్లతో బిడ్డవేపు చూస్తున్నది. తాను వంగి బాబుకు స్తనం అందిస్తుంది.
లేదంటే బాబును పైకెత్తి పాలు తాగడానికి వీలు కలిగిస్తుంది. పిల్లవాడు మాత్రం పాలు
తాగడం తక్కువగా,
ఆట ఎక్కువగా గడుపుతున్నాడు. ఆమె ఒక్కసారి మళ్లీ నావేపు
చూచింది. ‘నా బాబు తీరు చూచారా? పైలెట్‌ల పిల్లలందరూ
ఇలాగే ఉంటారేమో! నాకేమో పాలు నిండుతున్నాయి, వీడు పాలు తాగడం లేదు.
ఇక్కడ నేను నా పాలను ఏం చేయగలను....!’
నేను పరాయి ఆడమనిషి శరీరాన్ని చూస్తున్నాను. చటుక్కున చూపు
మరల్చి పత్రికలోకి తలదూర్చాను. కేసు గురించిన వివరాలు ఇంకా పూర్తికాలేదు.
భారతదేశపు అధికారి, పై అధికారి కూడా వచ్చాడు. ఇతను మరొక మనిషిని చంపిన మాట
వాస్తవమే కానీ మాకున్న ఆఫీసర్‌లలో అందరికన్నా మంచివాడు, క్రమశిక్షణ కలవాడు,
పని బాగా తెలిసినవాడు అని వివరించాడు ఆయన. ఇతని గురించి
ఏనాడూ ఎలాంటి ఫిర్యాదూ రాలేదు అన్నాడు. మంచితనం, కష్టించి పని చేయడం,
మంచి ప్రవర్తన అన్నింటికీ ఇతను ఉదాహరణ అన్నాడు. ఇక డాక్టర్
వచ్చాడు. గాయం తీరు చూస్తే ఎవరో దొంగచాటుగా పేల్చినట్టు కనిపించడం లేదు. దాడి
ఎదురుగా జరిగింది అని చెప్పాడు.
ట్రెయిన్ కూత వేసింది. అది కదలడం మొదలుపెట్టింది. ఇంతకూ ఏ
ట్రెయిన్ కదులుతున్నది. నేను కూచున్న బండి కదిలిందా లేక ఎదురు బండా? మళ్లీ నేను తలెత్తి చూచాను. కళ్లకు ఎదురుగా ఉన్న కిటికి కనిపించింది. అది ఇంకా
ఎదురుగానే ఉంది. కళ్లు పైకెత్తినప్పుడల్లా చూపు అక్కడే నిలుస్తున్నది. ఆ ఆడమనిషి
అలాగే గలగలా నవ్వుతున్నది. పిల్లవాడిని కిటికిలో నిలబెట్టి ఉచ్చపోయించే ప్రయత్నం
చేస్తున్నది. వాడి మూత్రం ఇంచుమించు మా బండిదాకా వచ్చి పడుతున్నది
‘వీడు మరింత గట్టిగా చిమ్మితే ఉచ్చ ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్ మీద
పడుతుంది’ అన్నట్టు ఉన్నాయి ఆమె చూపులు. ‘ఆ పని చేయించమంటావా? మొత్తం పెట్టెనిండా ఒక్కడే కూచున్నావు. హాయిగా కూచుని పత్రిక కూడా
చదువుతున్నావు’ అంటున్నాయి ఆ కళ్లు.
అంతలో ఆ ఎదుటి రైలు బయలుదేరింది. పిల్లవాడు ఉచ్చపోయడం ఇంకా
పూర్తికాలేదు. బండి మాత్రం కదిలిపోయింది.
ఆ రైలు వెళ్లిపోయింది. నేను కిటికిలోనుంచి బయటకు చూచే
ప్రయత్నం చేశాను. నిజంగానే ఆ దుర్మార్గుడి మూత్రం మా డబ్బా దాకా చిమ్మింది. బండి
కదిలింది కనుక అక్కడ నుంచి మొదలు ధార ఒకగీత గీసినట్టు ముందుకు కదిలింది.
ఇక మా ట్రెయిన్ కూడా వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. బయట
ఒక కర్రవాడు అరుస్తూ దినపత్రిక అమ్ముతున్నాడు. ‘తాజా సమాచారం. హత్యకేసు వ్యవహారం
పూర్తయింది’ అంటున్నాడు.
ఇక నాకు వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతమాత్రం లేదు.
ఎంతసేపు ఎదురుగా గలగలా నవ్వుతున్న ఆమె అందమయిన కళ్లు మాత్రమే. అంతలేసి పొడుగున్న
పట్టులాంటి ఆమె జుట్టు. పొంకమయిన ఎద తీరు. వెన్నముద్దలాంటి పిల్లవాడు. గీతగా పడిన
వాడి మూత్రం.... ఇవన్నీ నా కళ్లముందు తిరుగుతున్నాయి, తిరుగుతున్నాయి,
తిరుగున్నాయి.
(భగవాన్ హై కీ నహీ, సంకలనం నుంచి)
మంచి కథలను ఆదరించండి..
No comments:
Post a Comment