Sunday, August 7, 2011

Chankyas Chant - A Review

Here is a review in Telugu about an English Novel.


చాణక్యాస్ ఛాంట్ (నవల)
రచన: అశ్విన్ సంఘీ,  ప్రచురణ::వెస్ట్‌లాండ్ లిమిటెడ్
పేజీలు: 450, వెల: రూ. 195/-
ప్రతులకు: అన్ని పెద్ద అంగళ్లు, ఇంటర్‌నెట్!

చరిత్ర విషయంగా నవలలు, అన్ని భాషలలోనూ చాలా వచ్చాయి. చరిత్ర మరి గతంలోనే కాక, ప్రస్తుతం కూడా నడుస్తుంది. చరిత్ర పునరావృతమవుతుంది కూడా! ఈ రెండు సంగతులను గమనించిన ఈయన రచయిత గతం, వర్తమానాలను సమాంతరంగా కలుపుతూ ఒక నవలను మనకందించాడు. ఇంగ్లీషులో పెద్దపేరున్న రచయిత నవలకే దిక్కులేదు. కానీ ఈ మధ్యన మన దేశంలో అనుకోని వర్గాల నుంచి కొత్త రచయితలు వచ్చి, నవలలు, మిగతా రచనలతో దుమారం రేపుతున్నారు. వారిలో ఈ అశ్విన్ ఒకడు. ఇతను ఇంతకు ముందు ఒక నవల రాశాడు. స్వంత పేరుతో దాన్ని ప్రపంచం ముందుంచడానికి భయపడ్డాడు. అది మొదటి రచనయినా పేలింది! ఆ ధైర్యంతో అశ్విన్ ఈ తన రెండవ నవలను స్వంత పేరుతోనే అందించాడు.

చాణక్యుని అసలు పేరు విష్ణుగుప్తుడు. అతని గురించి, అతనికి జరిగిన అవమానం గురించి మనం చదువుతూనే వచ్చాం. ఈ పుస్తకం చాణిక్యుని తండ్రి మరణంతో మొదలవుతుంది. కథ బలంగా ముందుకు సాగుతుంది. ఒక అధ్యాయం ముగుస్తుంది. రెండవ అధ్యాయం ‘ప్రస్తుత కాలం’ అంటూ మొదలవుతుంది. అది చాణక్యుని కథ కాదు. అది ఒక అపర చాణక్యుని కథ. అతని పేరు గంగాసాగర్ మిశ్రా. లక్నోకు చెందిన బీద బాపనయ్య అతడు. చాణక్యుడు తన కుటిల రాజనీతినంతా ఉపయోగించి, చంద్రగుప్తుడిని రాజుగా చేసిన వృత్తాంతం బేసి అధ్యాయాలలో, సరిగ్గా అదే పద్ధతిలో చాందినీ గుప్త అనే అమ్మాయిని భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయడంలో మిశ్రా ప్రదర్శించిన రాజనీతి సరసంఖ్య అధ్యాయాలలో సాగుతుంది ఈ నవల. ఈ నవలను ఎంతో పరిశోధించి రాశానంటాడు రచయిత. పుస్తకం చివరలో అయిదారు పేజీల రిఫరెన్సులు కూడా ఇచ్చాడు. గత చరిత్ర గురించి చదవడం అలవాటయిన వారికీ, ప్రస్తుత రాజకీయాలలోని ఆంతర్యం ఎరిగిన వారికీ ఈ నవల ‘ఫరవాలేదు’ అనిపిస్తుంది. కానీ, ఈ రెండు అంశాల గురించి ఏమాత్రం క్లూ లేనివారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఇది ‘ఆహా!’ లేదా ‘వావ్!’ లెవెల్లో నచ్చుతుంది. మంచి రేసీ ప్రోజ్ కనుక చదవడమూ సుఖంగా సాగుతుంది. ఇందులో గొట్టు ఇంగ్లీషు లేదు మరి!

చాణక్యుడు, గంగాసాగర్ పాత్రలు ఆకట్టుకునే రకంగా ఉన్నాయి. కానీ, వాటిలో అన్ని రకాలుగా పోలికలు మాత్రం లేవు. గమ్యం ఒకటే! తాను అనుకున్న పనిని సాధించి తీరాలి! అందుకు వారి పద్ధతులు వేరుగా కనబడతాయి. కాలం, మనుషులు వేరుగదా! ఇంతకూ ఈ ఛాంట్ అంటే మంత్రం ఎక్కడ నుంచి వచ్చింది. చాణక్యుని ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది. ఆమె అతనికి చేరువ కాలేకపోయింది. ఆమె గురించి ఇంకా చెబితే కథ బయటకు వస్తుంది. ఆమె, చాణక్యుని విజయం కోసం ఒక మంత్రాన్ని జపిస్తుంది. చాణక్యుడు ఈ మంత్రాన్ని జపించినట్లు ఎక్కడా కనబడదు. మంత్రం, మన ప్రస్తుతపు చాణక్యునికి దొరుకుతుంది. (అందుకు అలవిమాలిన పూర్వరంగం ఉంది!) ఒక అమ్మాయి అభివృద్ధి కొరకు ఆ మంత్రాన్ని జపిస్తే అది తిరుగు లేకుండా పని చేస్తుందని పాత కథలో అమ్మాయి చెపుతుంది. అక్కడ చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇద్దరూ అబ్బాయిలే. ఇక్కడ మాత్రం చాందినీ గుప్త మంత్ర బలంతో ప్రధాన మంత్రి అవుతుంది. మరి మిశ్రా బుద్ధిబలం కూడా మంత్ర బలంతోనే వచ్చిందా?

టీవీలో చంద్రప్రకాశ్ తీసిన చాణక్య అందరినీ కుదిపింది. ఈ నవల చదవడానికి ఎంత బాగున్నా, అంత కుదిపే బలం మాత్రం లేదు. ఇందులో లూజ్ ఎండ్స్ చాలా ఉన్నాయి. పాత్రలు వచ్చి పోతుంటాయి. ప్రధాన పాత్రలకు కూడా ఒక సరయిన రూపం ఏర్పడదు. చంద్రగుప్తునిలో నంగిరి పింగిరితనం తప్ప శౌర్యం కనబడదు. చాందినీ కొంత ఎదుగుతున్నట్లు కనబడినా పీ.ఎం. లెవెల్ కనబడదు. నవలను చదువుతూ వెనుక జరుగుతుండే కుట్రలు, పన్నాగాలు, ప్లానులు, స్ట్రాటజీలను స్టడీ చేయదలుచుకుంటే మాత్రం ప్రశ్నలు మిగులుతాయి.
చాణక్యుడు జుట్టుముడి వేసుకోలేదని ఒక కథ ఉంది. భోజన పంక్తిలో అవమానం, జుట్టు ఈ రచనలో కనిపించవు. వీటిని వెదకనవసరం లేదు. రచయిత దీన్ని ఒక నవలగా రాశాడు. పాత్రలకు ఎవరెవరినో మాటల అంటగట్టానని అతనే వివరాలిచ్చాడు. పుస్తకంలో హాయిగా చదివించే శక్తి ఉంది. కనుక చదవడమే! ప్రస్తుత రాజకీయాల గురించి మరీ పాఠం చెపుతున్నట్లు తోచినచోట పేజీ తిరగేయడమే. కొంపమునగదు!

1 comment:

మాగంటి వంశీ మోహన్ said...

"పుస్తకంలో హాయిగా చదివించే శక్తి ఉంది. కనుక చదవడమే! ప్రస్తుత రాజకీయాల గురించి మరీ పాఠం చెపుతున్నట్లు తోచినచోట పేజీ తిరగేయడమే. కొంపమునగదు!"

అవునండి.....చదివించే శక్తి ఉందేమో అని పుస్తకం మొదట చేతిలోకొచ్చినప్పుడు అనిపించింది కానీ, చదువుతుంటే ఆ "ఇది" కోల్పోయిందేమో అనిపించింది నాకైతే.....

"పాఠం చెపుతున్నట్టు " - అవును, ఒక ఇరవై పేజీలన్నా తిప్పేసుంటాను.... :)