Saturday, October 24, 2026

తిండి పిండి ఎన్నో సంగతులు 2


తిండి పిండి ఎన్నో సంగతులు 2

1688 లో లండన్‌ లోని రాయల్‌ సొసైటీ లో ఒక సమావేశం జరిగింది. అక్కడ ఎడ్మండ్‌ హేలీ ఒక చిత్రమైన విషయాన్ని అందరిముందు ప్రకటించినడు. చెల్సీ అనే చోట తోట ఉంది. మామూలుగనే అక్కడ ఒక తోటమాలి ఉన్నడు. అతను అందరిలాంటి వాడు కాదు. అనవసరంగ అన్ని విషయాలను పరిశీలిస్తుంటడు. ఈ కాలం పద్ధతిలో చెప్పాలంటే సైన్స్‌ చూపు కలవాడు. పెద్ద మాటల్లో చెప్పాలంటే వైజ్ఞానిక దృక్పథం కలవాడు. ఆ తోటమాలి హేలీకి ఒక సంగతి చెప్పినడు. ఎండ తగలకుండ పెట్టిన మొక్కలు కొంత కాలానికి పాలిపోతయి, అన్నడు అతను. కొంత కాలానికి అవి వాడి చచ్చిపోతయి అని కూడ చెప్పినడు.ఈ సంగతులు అతను ఊహించి చెప్పలేదు. సైన్స్‌కు ఆధారమైన పరిశీలన, ప్రయోగాల ఆధారంగా ఆ సంగతులను అతను చెప్పగలిగినడు. హేలీ అంత కన్నా కొంచెం ఎక్కువ సైన్సు దృష్టితో ఆలోచించే  మనిషి. అప్పటికే ఎన్నో సంగతులను గమనించి అందరికీ చెప్పినడు. తోటమాలి చెప్పిన సంగతి అతనికి సత్యంగ తోచింది. దాన్ని అతను కూడ తప్పకుండ పరిశీలించి ఉంటడు. అప్పుడు అతనికి ధైర్యం కలిగింది. వెజిటబుల్‌ లైఫ్‌ అంటే మొక్కలు. అది కొనసాగాలంటే మొక్కలకు ఎండ తగిలేట్టు ఏర్పాటు చేయాలె అని అతను ధైర్యంగ రాయల్‌ సొసైటీలో ప్రకటించినడు.

ఎడ్మండ్‌ హేలీ ఖగోళ శాస్త్రం, అంటే ఆకాశంలోని, అంతరిక్షంలోని సంగతులను గురించి పరిశీలించేవాడు. అతను వచ్చి మొక్కలగురించి ఒక సంగతి చెపితే ఎవరన్న వింటరా? మనిషి ఎప్పుడు ఒకే రకంగ ఉంటడు. నాటికి నేటికి మనిషి తీరులో తేడా లేదు. కొత్త సంగతి చెప్పిన వారి మీద విరుచుకుపడేది మనిషికి అలవాటు. తరువాత అనుమానించేది మనిషి స్వభావంలో భాగం. అంతేకానీ తాము విన్నది నిజం అయి ఉండవచ్చు, అన్న భావన చాలా తక్కువ మందికి కలుగుతుంది. ఎడ్మండ్‌ హేలీ అంటే సైన్స్‌ రుచి అప్పటికే అనుభవించిన మనిషి. కొత్తగ ఆ రుచిని అనుభవించిన తోటమాలి ఆలోచనలను అతను సులభంగ అందుకోగలిగినడు. అందర అంత సులభంగ ఆ సంగతులను అందుకునేది, నాటికి, నేటికీ అనుమానంగనే ఉంటుంది. అందులో ఆశ్చర్యం లేదు. తెలిసిన ఆరు రుచులకు జతగ ఉమామీ అనే మరొకరు వచ్చి ఉందని, అది ఇంచుమించు వగరు వంటిదని కొన్ని సంవత్సరాలుగ పరిశోధకులు చెబుతున్నరు. కాని ఇప్పటికీ ఈ సంగతి ప్రజల్లోకి రాలేదు. నిజంగా ఉన్న ఒక రుచి పరిస్థితి ఈ రకంగ ఉంటే, కేవలం ఆలోచనలలో అనుభవించవలసిన సైన్స్‌ రుచి అంత సులభంగ అందుతుందా? అందదు అని వేరుగ చెప్పాలెనా?

సైన్స్‌ లో నాటికీ నేటికీ, అడుగడుగున ఎదురయ్యే అనుమానాలను గురించి మనం సానుభూతితో తెలుసుకోవాలె! అనుమానం రకరకాలుగ ఉండవచ్చు. అవునేమో అనుకోవడం ఒక రకం అయితే, కాదేమో అనడం బలం గల మరో రకం! మానవునికి అలవాటు ప్రకారం ఏ సంగతి చెప్పినా, ముందు వ్యతిరేకించాలె! అదొక సరదా! అందుట్లో, వారికి బహుశా ఒక రకమైన రుచి దొరకవచ్చు! కానీ అవునేమో అనుకుని అందిన సమాచారాన్ని విశ్లేషించేందుకు పూనుకుంటే మరొక రకమైన రుచి దొరుకుతుంది! విజ్ఞాన విషయాలకు సంబంధించి ఆలోచిస్తే సైన్స్‌ రుచి దొరుకుతుంది!

జొనాతన్‌ స్విఫ్ట్‌ అనే రచయిత గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. గలివర్‌ అన్న పేరు మాత్రం చాలా మంది వినే ఉంటారు. ఆ పాత్రను సృష్టించింది ఈ రచయితనే! ఆ పాత్ర ద్వారా అతను ఎన్నో వింత విషయాలను మనుషుల అవగాహనకు తెచ్చే ప్రయత్నం చేసినడు. ఇప్పుడు ఆయన ప్రసక్తి రావడానికి కొంత కారణం ఉంది. జోనాతన్‌ స్విఫ్ట్‌ కొంచెంగా సైన్స్‌ రుచి తెలిసిన మనిషి లాగ ఉన్నాడు. అతను కొంటె మాటలతో తన రచనలను సాగిస్తడు. దాన్ని పెద్ద భాషలో చెప్పాలంటే వ్యంగ్య రచయిత అంటారు. 1726 లో అతను ఒక పుస్తకం రాసినడు. అందులో దోసకాయలోనుంచి ఎండను బయటకు లాగే ప్రయత్నం జరుగుతున్నది, అని అతను వ్యంగ్యంగ రాసినడు. అతను రాసినది చమత్కారం, అనే సరదా కోసం మాత్రమే అయినా, దోసకాయలు ఎండ ఆధారంగ పెరిగినయి, కనుక వాటిలో ఎండ ఉంటుంది, అన్న సైన్స్‌ అవగాహన అక్కడ వెనుక నుంచి తొంగి చూస్తూ ఉండడం, మనం అర్ధం చేసుకోవాలె! సైన్స్‌ రుచి అట్ల ఉంటుంది!

ఆ తరువాత మరో 50 సంవత్సరాలకు వియెన్నాలోని ఒక వైద్యుడు కొన్ని ప్రయోగాలు చేశాడు. ఆ కాలంలో వైద్యుడు అంటే వైద్యుడుగనే మిగిలే వాడు కాదు. వైద్యులు అంటే తెలివిగలవారు. కనుక వారు ఏమయినా చేస్తరు. ఎన్నో రకాల ప్రయోగాలు, కనీసం కాలక్షేపం కొరకు అయినా చేస్తరు. ఈ వైద్యుని పేరు ఇంజన్‌ హౌస్‌! వాళ్ళ అమ్మానాన్నలు, వంశంలో వాళ్లు సైన్సు రుచి బాగా తెలిసిన వారు అన్న సంగతి మనకు సులభంగనే అర్ధం అవుతుంది. అది ఇంటిపేరు! ఇక ఈ మనిషికి పెట్టిన పేరు జాన్‌! అందరికీ తెలిసిన నాలుగు అక్షరాల జాన్‌ కాదు. జనవరి నెలకు మొదటి మూడు అక్షరాలతో మాత్రమే ముద్దుగా పెట్టుకునే పేరు అది. ఈ మొదటి నెల పేరుగల డాక్టర్‌ గారు తన పరిశోధన ఫలితాలను 1779లో ప్రకటించినడు. అందులో అతను మొక్కల పెరుగుదలకు వెలుతురు ప్రాముఖ్యాన్ని అనుమానం లేకుండ ప్రకటించినడు.  అంతేకాకుండ ఎండ వేడిమిలో మొక్కలు ఒక విష వాయువును పీల్చుకుంటయి. మనకు ఎంతో ఉపకరించే మరొక వాయువును బయటకు వదులుతయి అని కూడా తాను గమనించినట్టు ప్రకటించినడు. ఇవాళ ఈ సంగతి చిన్న పిల్లలు కూడా చెప్పగలుగుతరు. రాత్రిపూట ఈ వ్యవహారం కొంతవరకు తలకిందులు అవుతుంది, అన్న సంగతి చాల మందికి తెలిసి ఉండక పోవచ్చు. మొక్కలు కార్బన్‌ డై ఆక్సైడ్‌ అనే వాయువులు పీల్చుకుంటయి. ఆక్సిజన్‌ లేదా ప్రాణవాయువు అనే వాయువును బయటికి వదులుతయి. అది మిగతా జీవులకు ప్రాణం పోస్తుంది.

ఈ రకంగ చూస్తే ఇంజన్‌ హౌస్‌ అనే ఈ వైద్యుడు ఈ ప్రపంచం మనుగడకు కారణమైన రసాయనిక చర్యను కనుగొన్న గొప్ప పరిశోధకుడుగ మన ముందు నిలిచినడు అని అర్ధం. తన పని తాను చేసుకుని చప్పుడు కాకుండ ఈ డాక్టర్‌ పండుకోని ఉంటే, కిరణజన్య సంయోగ క్రియ అనే ఫొటోసింథసిస్‌, అనే తిండి, పిండి పదార్థం తయారయ్యే పద్ధతి గురించి తెలిసేందుకు మరి కొంత కాలం పట్టి ఉ౦డేది.

ఆ తరువాత నెమ్మదిగ మొక్కలు పిండి పదార్థం తయారుచేసే కార్యక్రమం గురించి అర్ధం చేసుకున్నరు. కర్బన ద్వి ఆమ్ల జనిదము అని మాకు చిన్నప్పటి లో చెప్పిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను వాతావరణం నుంచి గ్రహించి మొక్కలు సూర్యరశ్మి ఆధారంగ చక్కెర పదార్థాలను తయారు చేస్తయి. ఇందులో నీటికి కూడా ప్రధానమయిన పాత్ర ఉంది.

చక్కెర అనంగనే మనకు చెరుకు నుంచి తయారుచేసిన చక్కెర ఒక్కటే గుర్తుకు వస్తుంది. చాలాచోట్ల బీట్‌ దుంపల నుండి కూడా చక్కెర తయారు చేస్తరు. ఆ సంగతి మన వాండ్లకు ఎక్కువగ తెలియదు. ఈ చక్కెర ఒక రకం. దాన్ని సుక్రోజ్‌ అంటరు. ఇది చాలా మందికి తెలియదు. గ్లూకోజ్‌ అన్నమాట మాత్రం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ గ్లూకోస్ ఆధారంగనే మనకు తెలిసిన పిండిపదార్థాలు అన్ని తయారవుతయి. మొక్కలలో ఆకులలో కూడా స్టార్చ్‌ అనే పిండి పదార్థం తయారవుతుంది. అందరికీ తెలియవలసిన విషయాలు కొన్ని ఎవరికీ పట్టకుండ ఉండిపోతే జీవితంలో కొంత రుచి కోల్పోయినట్టు లెక్క. కానీ అదేపనిగ ఈ విషయాలనే పట్టించుకుంటే మరికొన్ని రకాల రుచులు దూరమవుతయి.

పాట విన్నట్టే, సినిమా చూసినట్టే, మిగతా సరదాలు అన్నింటినీ పట్టించుకున్నట్టే, అప్పుడప్పుడు సైన్సు గురించి కూడా పట్టించుకుంటే జీవితంలో పస పెరుగుతుంది. ఆసక్తికరమైన అంశాలను ఆధారంగా సైన్స్‌ రుచిని పెంచుకోవాలె. దాన్ని అందరితోటి పంచుకోవాలె.


 

No comments: