పరిశోధన - పద్ధతులు
తీరు
ఒకటే
చాలామంది
చదువు అయిపోయింతరువాత పరిశోధన చేసి పిఎచ్.డి అని ఒక డిగ్రీ సంపాయించుకుంటారు.
పరిశోధన సయిన్సులో గానీ, సామాజిక శాస్త్రంలో గానీ, మరో అంశంలో గానీ, పద్ధతి ఒకేలాగ ఉంటుంది. మార్గదర్శనం
చేయడానికి ముందు ఒక గురువు, ఆ గురువు సాయంతో పరిశోధనకు ఒక చక్కని
సమస్య ఎంపిక చేసుకోవాలి. ఆ సమస్య గురించి ముందు వీలయినంత సమాచారం, ఇప్పటికి జరిగిన పరిశోధనల ఫలితాలు సేకరించాలి. ఆ తరువాత మన ఆలోచన గురించి
ప్రయోగాలు, విశ్లేషణలు సాగుతాయి. సామాజిక విషయాలలో
ఈ పనంతా, మెదడు, కాగితాల ఆధారంగా జరిగితే, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఒక పరిశోధనశాల అవసరమవుతుంది.
దారి
మారుతుంది: సైన్సులో మెటీరియల్స్, మెథడ్స్ రెండూ అనుకున్నంత సులభం కావు.
గొట్టాలు, గిన్నెలు మొదలు ఎన్నో రకాల పరికరాలు, యంత్రాలు, రసాయనాలు అవసరమవుతాయి. అవన్నీ ముందు
నుంచే అమరి ఉంటాయని ఎక్కడా లేదు. నేను రక్తంలోని ప్రొటీనులు, వాటిలోని జన్యు వైవిధ్యం గురించి పరిశోధించాను. ఈ పని నాకంటే ముందు ఎవరూ
చేయలేదు అని చెప్పలేను గాని, నేను పరిశీలించిన అంశాలలో కొన్ని ఈ
దేశంలో, ఈ ఖండంలోనే ఎవరికీ తెలియవు! పెద్ద
పరిశోధన సంస్థలలో, పరికరాలు మిగతా సరంజామా కూర్చడానికి
సదుపాయాలుంటాయి. ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాలలో సదుపాయాలే కరువు. అందునా కొత్త
రకాలు ఏం కావాలన్నా సమస్యే! మా గురువు గారు రామచంద్రరావుగారు మాత్రం, ధైర్యం ఇస్తూ వెనక ఉండి మమ్మల్ని బాగా
ప్రోత్సహించేవారు. పొరపాట్లు, ప్రమాదాలు జరుగుతాయని అనుమాన పడితే
పనులు జరగవన్న తత్వం మాకంతా అలవాటయింది. ప్రత్యేకంగా నాకు మరీ ఎక్కువగా!
ప్రయత్నం:
యూనివర్సిటీలలో చిత్తశుద్ధిగా పరిశోధన చేసిన వారికి, సమస్యలను
విశ్లేషించడం, అన్ని పనులు స్వయంగా చేసుకోవడం లాంటి
లక్షణాలు బాగా అలవడతాయని నమ్మకంగా చెప్పగలను. మనిషి రక్తంతో సాగే మా పరిశోధనలో
పరిశుభ్రతకు పెద్ద పీట. ప్యాంటు పైకి లాగి, ల్యాబ్
అంతా రసాయనాలతో శుభ్రం చేయడం మాకు అలవాటు. ఇక నిత్యం వాడే గాజు సామాన్లు, ఎంత బాగా కడిగి, ఆరబెట్టుకుంటే అంత బాగా ఫలితాలుంటాయి. ఏ
కొంచెం కంటామినేషన్ వచ్చినా ఫలితాలు తప్పవుతాయి. ఈ శుభ్రత ముందు ఇంట్లో, అంట్లు కడగడం ఆటగా కనిపిస్తుంది! పరిశోధనలో ముందు చాలాకాలం, వాడబోయే సాంకేతిక పద్ధతులను, అందులో వాడబోయే రసాయనాలు సరంజామాను
ప్రామాణీకరించడానికే పోతుంది. అది సమంగా కుదిరిందంటే అసలు ప్రయోగాలు సులభంగానే
సాగుతాయి. ఎలెక్ట్రోఫోరెసిస్ అనే ప్రక్రియలో రకరకాల పద్ధతులను నేను బాగా
మధించాను. వాటిలో ఒకదాంట్లో మెలుకువలు నేర్వడానికి కొంతకాలం కలకత్తాలోని ఇండియన్
స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండి వచ్చాను. అక్కడి వారికీ, నాకూ దోస్తీ
కుదిరింది.
ప్రయోగం:
ఇక్కడ ఎదురయ్యే సమస్యలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. స్టార్చ్ జెల్ తయారీ కొరకు
నాకు గాలిని పీల్చి ఖాళీ ఏర్పరిచే వ్యాక్యూం పంప్ అవసరమయింది. గురువుగారికి ఆ మాట
చెప్పాను. ‘దాందేముంది? కొనిపించు!’ అనేశారాయన. కొన్ని
పరికరాలను డిపార్టుమెంటు వారు కొంటారు. కొన్నింటిని మా ల్యాబ్ గ్రాంటు నుంచి
తెస్తాము. కొనిపించు, అంటే మొదటి పద్ధతి. వెళ్లి స్టోర్
కీపర్ గోపాలరెడ్డికి విషయం చెప్పాను. ‘మన దగ్గర అటువంటి పంపు ఒకటి ఉంది. దాన్ని
వాడింది లేదు. నీవు పరీక్షిస్తానంటే ఇస్తానన్నాడు’ రెడ్డి. చూస్తే పంపు కొత్తది!
నిజంగానే దాన్నెవరూ వాడింది లేదు. ఎత్తుకుని ల్యాబ్‌కు తెచ్చాను. కనెక్ట్ చేసి
స్విచ్ వేస్తే, తిరగడం మొదలయింది. కానీ, గాలిని పీల్చడం మాత్రం లేదు. ఇలాంటి వాటిని గురించి ఎవరినో అడిగేంత ఓపిక లేదు.
స్పానర్ సెట్ తీసి యంత్రాన్ని ఎక్కడికక్కడ విడదీశాను. అన్ని భాగాలను బాగా శుభ్రం
చేసి తిరిగి బిగించాను. ఈసారి మరింత బాగా తిరిగింది. కానీ గాలిని మాత్రం పీల్చదు.
లోపల నేను మరీ శుభ్రం చేశానని అనుమానం వచ్చింది. యూనివర్సిటీ వర్క్‌షాప్‌కు వెళ్లి
అక్కడ మిత్రులతో చర్చించాను. ‘ఇంతకూ ఆయిల్ పోసినవా?’ ఒకతను
అడిగాడు. లైటు వెలిగింది. నేను విప్పినప్పుడు, ఒకానొక
భాగంలో కొంత జిగట పదార్థం ఉంది. ఆయిల్ మాత్రం కాదు! అంటే ఆయిల్ ఆరిపోయింది.
వెంటనే రాణీగంజ్ చలో! ఆయిల్ తెచ్చి పోశాను. ఈసారి గొట్టం వేలికి అతుక్కుంది.
గురువుగారిని పిలిచి, ఆయన వేలికి గొట్టం పెట్టి ఆన్ చేసింది
తడవు ఆశ్చర్యంగా అది వేలికి అతుక్కుంది! ‘అసాధ్యుడవు! పైసలు మిగిలించినవు కూడ!’
మెచ్చుకున్నారాయన. మామూలు మొదలు చాలా వెలగల యంత్రాల దాకా, అన్నింటినీ విప్పడం అలవాటయి పోయింది! పక్క డిపార్టుమెంట్ల వారు కూడా, నా కోసం వచ్చేదాకా వెళ్లింది పరిస్థితి! స్వయం ప్రతిపత్తి అట్లాంటిది!
మరో
తీరు: ఎస్టరేజ్-డి అనే ఎంజైమ్ విశ్లేషణ ఈ ఖండంలోనే ఎక్కడా జరగలేదు. అందుకు
అవసరమయిన పరికరాలు, పద్ధతులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక
రసాయనం మాత్రం లేదు. అది అవసరమయేది మిల్లిగ్రాములలో. కానీ, అసలు దొరికినప్పుడు గద! రసాయనాలు ఏ దేశంలో దొరికితే, అక్కడి నుంచి తెప్పించడం మాకు అలవాటే! ఎన్ ఐ ఎన్, ఆర్ ఆర్ ల్యాబ్స్ లాంటి చోట్ల లైబ్రరీలన్నింటా రకరకాల కంపెనీల
కేటలాగులన్నీ పరిశోధించాను. అప్పట్లో ఇంటర్‌నెట్ లేదు మరి! నాకు కావలసిన రసాయనం
ఎక్కడా లేదు. చివరకు ఉస్మానియాలోనే బయోకెమిస్ట్రీ డిపార్టుమెంట్‌లో ఒక పాత కేటలాగులో
రసాయనం పేరు కనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. రోష్ అనే యూరపు కంపెనీ వారి
దగ్గర రసాయనం ఉండేది. ఇటలీయా? మరో దేశమా? వారికి ప్రేమగా ఉత్తరం రాశాను. నెల తిరిగే లోపల నాకొక పార్సిల్ వచ్చింది.
అందులో ఒక ఉత్తరం ఉంది. ‘మీరు అడిగిన రసాయనం మేమిప్పుడు తయారుచేయడం లేదు. చేసినా
అది అవసరమయ్యేది మిల్లిగ్రాములలోనే కదా. చిత్రంగా మా స్టోర్‌లో ఒకటి రెండు సీసాలు
కనిపించాయి. అందులో ఒకదాన్ని మీకు గిఫ్ట్‌గా పంపుతున్నాము. అది మీకు పనికివస్తే, అంతకంటే కావలిసింది లేదు’ అన్నారు వారు. వెతికినా దొరకని రసాయనం ఊరికే వంద
గ్రాములు దొరికింది! విశ్లేషణ మొదలుపెట్టాను. మొదటిసారే అది బ్రహ్మాండంగా పని
చేసింది! మా ల్యాబ్‌లో ఆ విధానమూ, ఆ రసాయనమూ రెండూ నా కృషి ఫలితాలు. నాకు
పనికి వచ్చాయి. తరువాతి వారు వాడుకుంటే నేనెందుకు కుళ్లుకోవాలి?
వార్త:
ఎస్టరేజ్ డి గురించి పేపర్ ప్రకటించామనుకుంటాను. అందరూ ఆశ్చర్యపోయారు. కలకత్తా
మిత్రులు నాకు ఉత్తరం రాసి, రసాయనం మాకు కొంచెం ఇవ్వగలవా? అని అడిగారు. నేను స్వయంగా సంపాయించింది అయినా, అది
ల్యాబ్ ఉమ్మడి ఆస్తి అని భావన. అయినా పంపించాను. వారు పేపర్ ప్రకటిస్తే, అందులో నాకు ధన్యవాదాలు చెప్పే ప్రమాదం ఉంది. ఏమయిందో నాకు గుర్తు లేదు. మనం
వెళ్లి మరొకరి దగ్గర ఏవో నేర్చుకున్నట్టే, మన
దగ్గర నేర్చుకునేందుకు ఎవరో వస్తుంటారు. ఇక్కడ స్వార్థం అన్న లక్షణం, రహస్యం అన్న భావన అసలు లేవు. ఈ రకంగా నేను చాలా కొత్త టెక్నిక్స్
ప్రారంభించాను. తోటి వారికి నేర్పించాను. వారు వాడుతుంటే గర్వించాను!
సింకో
కెమిస్ట్రీ: బయోకెమిస్ట్రీ లాంటి రంగంలో వేలు లక్షల విలువచేసే రసాయనాలు, రీఏజెంట్లను వాడి, కడిగి కాలువలో పోయడం మామూలే. ఆ పోసే
వాష్ బేసిన్ పెద్దది. దాన్ని సింక్ అంటారు. మా తీరు నచ్చని మిగతా పొదుపరి శాఖల
వారు మమ్మల్ని ‘సింకో కెమిస్ట్రీ’ అనేవారు. అయినా పరిశోధనలన్నీ మెదడుతో మాత్రమే
జరగాలంటే కుదరదు గదా!
అదేమో
గానీ, సైన్సు పరిశోధనలో ఉన్న వారికి, అంట్లు తోమడం మొదలు, కంప్యూటర్, ఫొటోగ్రఫీ దాకా ఎన్నెన్నో సంగతులు నేర్చుకోవలసిన అవసరం, అవకాశం వస్తాయి. నాకెందుకులే, ఎవరినో అడగ వచ్చు ననుకుంటే చెప్పలేను గానీ, నేను మాత్రం ఎదురయిన ప్రతి అవకాశాన్నీ అంది పుచ్చుకున్నాను. డాక్టర్ ఆఫ్
ఫిలాసఫీ అనే డిగ్రీ వచ్చింది. నేను దాన్ని వాడటం లేదు. కానీ బతుకుకు ఒక ఫిలాసఫీ
దొరికింది. ఇవాళటికీ నా పనులన్నీ వీలయినంత వరకు నేనే చేసుకోవాలనుకుంటాను. కనుక
ఎన్నో నేర్చుకున్నాను. పనులు చేసుకుంటున్నాను. అందులోని ఆనందమే వేరు!
కొసరు
ముచ్చట: ఉస్మానియా యూనివర్సిటీలో నా పరిశోధన కాలం గురించి తలుచుకుంటే, అందరికన్న ముందు స్వీపర్ ముసలమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె రాక ముందే నేను
ల్యాబ్‌లో పనిలో ఉండేవాణ్ణి. ఊడవాలి గనుక ‘పంకలు బందుజెయ్!’ అనేది ముసలమ్మ. ‘నీవు
చేయొచ్చు గదా?’ అని నా ప్రశ్న. ‘షాక్‌గొట్టి చచ్చిపోతే?’ ఆమె జవాబు. ‘నాకు గొట్టదా? నేను చస్తే ఫర్వాలేదా?’ అంటాను నేను నవ్వుతూ! ‘నీవు బాస జదివినవు గద. నీకు షాకు గొట్టదు!’ ఆమె జవాబు!
No comments:
Post a Comment