చెట్లు, మొక్కలకు నొప్పి తెలుస్తుందా?
మనుషులకు
మిగతా జంతువులకు నొప్పి తెలుస్తుందని కొత్తగా చెప్పనవసరం లేదు. ఇక మొక్కలు,
చెట్లు కూడా జీవం గలవి కనుక వాటికి
కూడా నొప్పి తెలుస్తుందా అన్న అనుమానం రావడం సహజం.
ఆంకీ
స్టెప్పూన్ అనే పరిశోధకురాలు ఈ ప్రశ్నకు జవాబు రాశారు. మనుషులకు జంతువులకు లాగా
మొక్కలకు నొప్పి తెలియదు అంటారావిడ. ఆమె బెర్లిన్ లోని ఫ్రీ యూనివర్సిటీలో
మాలిక్యులర్ ఈకాలజీ రంగంలో పని చేస్తున్న వ్యక్తి. మనం నొప్పి అంటున్న ఈ భావం నాడీ
మండలానికి సంబంధించినది గదా, అంటారావిడ. చెయ్యి వేడి వస్తువుకు
దగ్గరగా వెళ్ళినప్పుడు, చేతిలోనే నాడీ కణాలు మెదడుకు వెంటనే సంకేతం అందజేస్తాయి. ఆ
సంకేతాన్ని నొప్పికి సూచనగా, మెదడు అర్థం చేసుకుని చెబుతుంది. చేతికి నిజంగా ఏదో
హాని జరగక ముందే దాన్ని వెనక్కు లాగేట్టు అక్కడికి ఒక సంకేతాన్ని కూడా
పంపిస్తుంది. మరి మొక్కలకు, నాడులు కానీ మెదడు కానీ లేవు. కనుకనే మనలాగా వాటికి
నొప్పి తెలియదు. అంత మాత్రాన అసలు వాటికి నొప్పి లేదా ప్రమాదం గురించి తెలియదు
అంటే మాత్రం తప్పు. హాని జరుగుతున్నది అని తెలిస్తే వెంటనే అవి మనలాగా కాకున్నా
ఏదోరకంగా ప్రతిక్రియ చేస్తాయి. మొక్కలలో అటువంటి ఏర్పాట్లు ఉన్నాయి.
మొక్కలు
చిన్నవి అయితే వాటిని ఏ జంతువులో తిని వేయడం అసలైన ఆపద. కనుకనే చాలా మొక్కలకు
ముండ్లు లేదా సన్నని నూగు వంటివి ఉంటాయి. అందరికీ తెలిసిన ఉదాహరణ గులాబి మొక్కకు
ఉండే ముళ్ళు. అదే పద్ధతిలో చాలా చెట్లకు ముండ్లు ఉంటాయి.
మరికొన్ని
మొక్కలు అపాయం ఏర్పడినప్పుడు రుచి కటువుగా ఉండే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ
రసాయ నాలలో కొన్ని విషాలుగా కూడా పనిచేసే అవకాశం ఉంది. ఇక జంతువులకు ఆ సంగతి అర్థం
అవుతుంది. అవి ఆ మొక్కలను తినడానికి ప్రయత్నించవు.
చేదు గల
తీపి అనే పరిస్థితిని ఇంగ్లీషులో బిట్టర్ స్వీట్ అంటారు. నైట్ షేడ్ అనే ఒక మొక్క
ముఖ్యంగా, అది వాడే పద్ధతి ప్రకారం బిట్టర్ స్వీట్ నైట్ షేడ్ అనే పేరును
సంపాదించుకున్నది. ఈ సంగతిని స్టెప్పూన్ గారే గమనించారు. ఒక పురుగు ఏదో వచ్చి ఆ
మొక్కను తొలుస్తూ ఉంటే అక్కడ ఏర్పడిన గాయం అంచుల నుంచి ఒక రకమైన రసం ఊరుతుంది.
మనకు గాయం అయితే రక్తం కారినట్టే, ఆ మొక్కకు గాయం అయితే ఈ రసం ఊరుతుంది. ఆ రసం
చాలా తీపిగా ఉంటుంది. చీమలు దాన్ని తినడానికి చాలా ఇష్టపడతాయి. కనుక వెంటనే అవి ఆ
మొక్క మీదకు వచ్చేసి, తమ దారిలో ఎదురయిన దేన్నయినా నాశనం చేస్తాయి. మొక్కకు హాని
చేస్తున్న పురుగులను కూడా అవి తినేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే,
పురుగు మొక్క మీదకు దాడి చేస్తుంది.
మొక్క తన సైన్యాన్ని పిలిపిస్తుంది. అవి వచ్చి పురుగును తినేస్తాయి. దాడి చేసిన
పురుగు యొక్క శత్రువులను, ఈ మొక్క మిత్రులుగా, సైన్యంగా వాడుకుంటుంది అని అర్థం.
ఇక,
తీపి పదార్థాలే కాకుండా,
మరికొన్ని రకాల రసాయనాల ఆధారంగా,
మొక్కలు తమకు రక్షణ ఏర్పాటు చేసు కుంటాయి.
ఏదో ప్రాణి వచ్చి మొక్కలను తింటూ ఉంటే, అవి కొన్ని రకాల రసాయనాలను గాలిలోకి
వెదజల్లుతాయి. మనుషులకు ఈ రసాయనాల గురించి, వాటి వాసన గురించి తెలియదు. కానీ
కందిరీగలకు ఆ వాసన పెద్ద ఆకర్షణ. వాటి దృష్టిలో, మొక్క ఏడుస్తున్నది అని అర్థం. ఘాతుకం
జరుగుతున్న చోటికి కందిరీగలు గుంపులుగా చేరుకుంటాయి. వచ్చి దాడి చేసిన పురుగు మీద
అవి గుడ్లు పెడతాయి. కనుక పురుగులు నాశనమవుతాయి.
మామూలుగా
చూస్తే జరుగుతున్న దాడులను, మొక్కలు మౌనంగా భరిస్తాయి, అనిపిస్తుంది. కానీ కొన్ని
రకాల మొక్కలకు సాయం పిలిపించుకునే వీలు ఉందని పరిశోధకులు గమనించారు.
No comments:
Post a Comment