ఒక సాయంత్రం
అరబీ రచయిత వాలిద్ ఇఖ్లాసీ కథకు నా తెలుగు అనువాదం
ఒక సాయంత్రం
వాలిద్ ఇఖ్‌లాసీ అరబిక్ సిరియా
గోడ గడియారం ఐదు గంటలు కొట్టింది. ఆ ధ్వని ఇల్లంతా నిండింది.
నేను కిటికీ లోనుంచి పక్షులను చూస్తున్నాను. వేల పక్షులు, నల్లని చుక్కల లాగా ఆకాశంలో కదులుతున్నాయి.
ఈ లోపల సాయంత్రం ఒక కొత్తదినం లో తన చోటు ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నది.
‘దేవుడు మేలుచేయ గాక’, ప్రార్ధన ముగించిన నానమ్మతో నేను అన్నాను.
‘మధ్యాహ్నం ప్రార్ధన ఆలస్యమైంది’, ఆమె భారంగా అన్నది. ‘పరవాలేదు. మరెన్నో మధ్యాహ్నాలు వస్తాయి, నాన్న మన మాట వినలేదు.’
కిటికీ అద్దం మీద అటు పక్కన ఒక పెద్ద పురుగు కూర్చుని ఉండడం చూశాను. అది నన్ను ధిక్కరిస్తున్నట్లు తోచింది. నా ముక్కుకు అంత దగ్గరగా కూర్చున్నది మరి.
‘ఈ పురుగు దినమంతా చికాకు పెట్టింది. దాన్ని చంపలేక పోయాను’, అన్నాను.
నానమ్మ ఏమీ అనలేదు. మళ్లీ ప్రార్థన మొదలు పెట్టింది.
కాలం గడుస్తున్నది అన్న సంగతి నాకు తోచలేదు. ఆ పురుగే కాలాన్నిఅంతా ఆక్రమించింది. అద్దంమీద కొట్టి నేను దాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాను. అది కదలలేదు. నా గోళ్లను గమనిస్తే, అవి బాగా పెరిగి ఉన్నట్టు తోచింది. ఓ కత్తెర తెచ్చి వాటిని నరకడం మొదలుపెట్టాను.
ఆకాశాన్ని మెత్తని చీకటి ఆవరిస్తున్నది. జింకతోలు కుర్చీలో కూర్చున్న నాయనమ్మ ప్రార్ధనల చప్పుడుతో బాటు మరేదైనా శబ్దం ఉంటే, అది గడియారం కొట్టిన ఆరు గంటలు.
పక్క గదిలో నుంచి చెల్లి వచ్చింది.
‘ఇవాళ ఆక్రోట్ వేసిన ఖునాఫా తినబోతున్నాం’ ఆమె ప్రకటించింది.
నాకు అది నచ్చదు.
చెల్లి నవ్వింది. ‘పొద్దున్నేమో ఖునాఫా కావాలి’ అన్నావు.
నాకది అస్సలు నచ్చదు.
మళ్లీ కిటికీ వైపు వెళ్లి, అక్కడ పురుగు అట్లాగే నిద్రలో ఉండడం చూచి ఆశ్చర్యానికి గురయ్యాను.
నానమ్మ చెల్లిని దగ్గరగా తీసుకుని తల నిమురుతూ ఉన్నది.
‘రేడియో పెట్టు ఫేరూజ్ పాట విందాం’ అన్నది నానమ్మ.
‘మధ్యాహ్నమే కదా విన్నాం’, నేను గట్టిగా అన్నాను. బయట చీకటి నన్ను పక్షులను చూడకుండా అడ్డుకుంటున్నది. అయినా, నాకు ఫేరూజ్ గొంతు ఇష్టం.
‘ఆమె పాట మళ్ళి విందాం’ అన్నది నానమ్మ.
నేను బదులివ్వలేదు. పడుకున్న పురుగును చూస్తున్నాను.
నాకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. నేను పడుకున్నప్పుడు అది నన్ను చూస్తే.
సాయంత్రం మాకు పాడే పక్షి కథ చెప్పమని చెల్లి నానమ్మను అడగడం వినిపించింది. నిన్ననే కదా ముగించాము నానమ్మ అన్నది.
పాపాయి మొండి పట్టుగా అరుస్తున్నది.
‘నిన్ననా, మరి నిన్న ఇప్పుడు లేదుగా’
పాడే పక్షి కథ మరోసారి వినేది లేదు. నాలో నేను చెప్పుకున్నాను. ఎందుకో దుఃఖం నిండినట్టు ఉంది. ‘ఇవాళ కొత్త కథ చెబుతాను’ అన్నది నానమ్మ.
‘మాకు కొత్త కథ అనవసరం’ అన్నది చెల్లి. పాత కథ మరి అయిపోయిందిగా.
‘అదేమీ అయిపోలేదు!’ చెల్లి అరిచింది.
చెల్లిని క్షమించాలని ప్రయత్నించాను. ఆమె నానమ్మ ఒడిలో నుంచి దూకి బయటకు వెళ్లింది. నా కది చికాకుగానే ఉంది. ‘నాకు పాత కథే కావాలి’.
కొంతసేపు తరువాత నానమ్మ అడిగినట్టే రేడియో ఆన్ చేశాను. స్టేషన్ కలుపుతున్నాను. గడియారం ఏడు గంటలు కొడుతుండగా స్టేషన్ దొరికింది.
ఇది అలెప్పో.
గొంతు మీద నిశ్శబ్దం తెరను కప్పేశాను. ‘వార్తలు విందాము’ ప్రతిఘటిస్తూ అన్నది నానమ్మ. ఆమె ఉదయం వచ్చిన దినపత్రికను తిరగేస్తున్నది. ‘సద్ది వార్తలు’ అన్నాను నేను.
‘కొత్త సంగతులు జరుగుతాయి నాయనా’, ముసలమ్మ అన్నది. ఆమెకు ఒక్కసారిగా తన వయసు గుర్తుకు వచ్చినట్టుంది.
నేను పెద్ద అక్షరాల వార్తలు చదవడం మొదలు పెట్టాను. వాటిని మధ్యాహ్నమే చదివాను. కనుక ప్రభావం కనిపించలేదు.
ఒక్కసారిగా నాకు గదిలో నుంచి వెళ్లిపోవాలి అనిపించింది. అయితే వెళ్లడానికి మరొకచోట లేదు. మనసు మార్చుకుని ఉన్నచోటే ఉండిపోయాను.
చిన్నారి చెల్లెలు పెద్ద ఆట బొమ్మతో వచ్చింది.
‘బొమ్మకు ఒక కథ చెబుతావా?’ ఆమె అడిగింది. నాయనమ్మ వైపు చాలెంజ్ చేస్తున్నట్లు కళ్లు పెట్టి మరీ అడిగింది. ముసలమ్మ నవ్వింది.
నేను తిరిగి కిటికీ వద్దకు వెళ్లాను. ఆకాశం అంతటా చీకటి నిండిపోయింది.
పడుకున్న పురుగును నా మీదకు రాకుండా తరమాలి అన్న కోరిక బలంగా పుట్టింది. దాని పట్ల ఏవగింపు మాత్రం ఇప్పుడు లేదు. దాని మొండితనం గురించి మరిచిపోయాను.
‘సుసాన్ కు కొత్త కథ చెప్పు!’ అడిగింది చెల్లి. నిజానికి నాకు కథలేవి రావు. అంతలో మధ్యాహ్నం రేడియోలో విన్న కథ గుర్తుకు వచ్చింది.
‘ఎలుగుబంటి - తేనె కథ చెబుతాను’ జవాబిచ్చాను.
‘అది పాత కథ!’ చెల్లి గట్టిగా అరిచింది.
తికమక పడి నేను తిరిగి పురుగును చూడడానికి వెళ్ళిపోయాను.
నేను కిటికీ పక్కన కూర్చోబోతుంటే చెల్లి వచ్చి ‘ఏమిటి అది?’ అని అడిగింది.
‘పురుగు. పడుకున్నది’.
‘నిద్రించే పురుగా?’ కనుబొమ్మలు ముడివేసి అడిగింది చెల్లి.
‘అది అలసిపోయింది. పడుకున్నది’
‘మరి ఆ సంగతి సూసన్ కు చెబుతావా?’ ఆమె అన్నది
చెల్లి దగ్గరగా వచ్చి దర్పంగా అడిగింది.
‘అలాగే చెబుతాను’.
‘పురుగును చూస్తున్నాను’.
ఆమె కుర్చీ మీద ఎక్కి పురుగును తేరిపార చూసింది. కీచుగొంతుతో ఒక ప్రకటన చేసింది. ‘అదీ చచ్చిపోయింది!’
ఒక్కసారిగా నా అంత ఎత్తుగా కనిపించిన చెల్లిని చూస్తూ కాస్త కలవరపడ్డారు.
‘కాదు నిద్రపోతున్నది’.
‘అదేం లేదు. అది చచ్చింది’. అన్నది చెల్లి. నా మూర్ఖత్వానికి ఆశ్చర్యపడుతూ. నేను జాగ్రత్తగా కిటికీ తెరిచాను. పురుగు మీదకు ఊదాను. అది కాగితం ముక్కలాగా కింద పడ్డది.
అది నా చుట్టూ ఎగరడం గుర్తుంది. నేను దాన్ని ఏవగించుకోవడం గుర్తుకు వచ్చింది. దాన్ని ఇష్టపడడం కూడా గుర్తుకు వచ్చింది.
‘సూసన్ కు నిద్రించే పురుగు కథ చెప్పవూ?’ అన్నది చెల్లి.
నేను జవాబు ఇవ్వలేదు. గడియారం గంట ఇంట్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. నేను వింటున్నాను
No intention of any infringment of copyrights.
This is being shared just for entertainment.