Sunday, July 31, 2016

Meghama.... Meghama.... - An Article

An old article I wrote about clouds.
There are verses written by many poets including SriSri (Srirangam Srinivasa Rao)

మేఘమా... మేఘమా...

(The photograph is by Your's sincerely. It is really big. Use it as wall paper if you like it!)

ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ఠ సానుం
వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ

కాళిదాస మహాకవి తన కావ్యాన్ని ఆషాఢమేఘం గురించిన వర్ణనతోనే మొదలు పెట్టాడు. మేఘమంటే మనవారికి ఎంతటి గౌరవం. ఎంతటి ఆప్యాయత. ప్రేమ సందేశాలందించే సంధానకర్తగా మేఘాన్ని చూడ గలిగిన ఘనత మనవారికే చెల్లు!

మేఘాలు, వర్షాలుఇవి రెండు లేనిదే భరతవర్షం మొత్తం మీద హర్షం లేదు. మనవారు, వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా అన్నారే గానీ ఎప్పుడూ రెయిన్ రెయిన్ గో ఎవే అనలేదుగదా! వర్షం తోడిదే జీవనం. జీవనం అనే మాటకు అందుకే నీరు అనే అర్థం కూడా ఇచ్చుకున్నారు. ఇంతకూ కాళిదాసు ఆషాఢమేఘాన్ని దర్శించాడు. అతను ఉజ్జయిని వాడుగదా అదే దక్షిణానయితే, బరువయిన వర్ష మేఘాలు జ్యేష్ఠంలోనే మొదలవుతాయి. ఋతుపవనాలు దక్షిణాన ముందు వస్తాయిగదా!

కావ్యం అన్న తర్వాత ఋతు వర్ణనం లేకుండా ఉండగూడదు. అందరికీ హర్షాన్ని పంచే వర్షాన్ని గురించి, కవులు మరింత ఆసక్తితో పద్యాలు రాసుకున్నారు. ఒక్క కావ్యాలలోనే కాదు, చేతనయిన ప్రతిచోటా మేఘాలను గురించి చెప్పుకున్నారు. కాళిదాసుకు వర్షమేఘాలతో కూడిన సానువులు ఏనుగుల వలె కనిపించాయి. ఇంకొకరికి ఇంకొక లాగ కనిపించాయి.

వరాహపురాణంలో ఒకచోట మేఘాల ప్రసక్తి ఉంది. శివకేశవుల అభేదం చూపించాలి. వారిరువురి మధ్యనగల మైత్రిని నిరూపించాలి. రుద్రుడు నారాయణున్ని నాకు వాహనంగా ఉండగూడదా అన్నాడట. సరేనని విష్ణువు మేఘాల తేజిగా మారాడట. ఆ వాహనం ఎట్లున్నది?

ఘనగర్జల్ సకిలింత లాశ్రిత బలాకాల్ తెల్ల జల్లుల్ సకం
పన శంపాలతికల్ పసిండి సగతుల్ మాహేంద్ర చాపంబు మో
హన రత్నంబుల వాగెత్రాడు వడగండ్లా స్వస్రవత్ఫేనమై
తనరం దజ్జలదంబు కైరడిగముల్ ధారావిహారంబులన్

మేఘమనే గుర్రానికి గర్జనలే సకిలింతలు, మెరుపులు ఇంద్రధనుస్సులు జీను, కళ్లెం. వడగళ్లు నోటిలోని నురుగట.

మేఘం కేవలం ప్రేమ సందేశాలకు, మంచి ఉపమానాలకు మాత్రమే కాదు, శక్తికి, బలానికి కూడా ప్రతీక.

ఒక సమయమందు ప్రబల సంయుక్తి నెనసి,
తీక్షణ శక్తులతో సముద్రిక్త విలయ
భీషణ శతఘ్నికా వినిర్ఘోష సదృశ
సింహనాదంబొనర్చుచు, స్థిర నిరంత
వారిధారల గురియించు వైభవంబు
నీ ప్రభావముగాదె, నీ నియతిగాదె
నీవు మహిత ప్రభా సమన్వితవు గాదె

ఈ కవనం ఎవరిదో కనుగొనగలరా? శ్రీరంగం శ్రీనివాసరావనే శ్రీశ్రీ గారి పద్యాలివి.

భువనత్రయారాధ్యుడైన
భానునంతటి భాస్వత్ప్రభావయుతుని
మరుగు పరుతు వనాయాస కర నిరూఢి

అంటూ ఆయన మేఘాన్ని పొగిడారు.

చంచల మనస్కత బరిభ్రమించు నేను
నిన్ను బోలితి గాని యత్యున్నత ప్రభావ
సంపన్నరూఢ వైభవములందు
నిన్నుబోలిన ధన్యుండనే...  అన్నారాయన.

మేఘం నుండి వర్షం. బయట చితచితగానున్నది, బయట లసలసగానున్నది అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకచోట. ఆ చితచిత వర్షాలెక్కడికి పోయినాయో తెలియదు. లేని చోట చుక్కకూడా లేదు. ఉన్న చోట వరదలు. ఎడతెరిపి లేకుండా పడే వానలెలాగుంటాయి?

మిగుల జగంబు బగ్గడిల మించె దదుద్ధత వృష్ఠి యద్భుతం
బగుచు ఘనాఘనౌఘ సమదగ్ర నిరర్గళ ఘర్ఘరార్భటీ
లగన ఘనోచ్ఛల జ్జల ఝళంఝళ నిర్జర జర్జరీ భవ
న్నగ విగలచ్ఛిలా ఘనఘనాఘన ఘోషణ భీషణంబుగన్

అర్థం మాట అటుంచి, ఈ పద్యం ఒక్క గుక్కలో చదివి పూర్తి చేస్తే, పెద్ద వర్షం కురిసి ఆగినట్టు లేదూ. వర్షం సన్నని తుంపరలతో మొదలవుతుంది. ఆ తరువాత మెరుపులు, ఉరుములు, జడివాన గగ్గోలయి, జగము బగ్గడిలుతుంది. ఏమయి పోయినాయీ వర్షాలు? ఎక్కడికి పోయినాయీ మేఘాలు? ఈ పద్యం వ్రాసిన ప్రాచీన కవి ఎవరో (నాకు) తెలియదు.

గొడుగు లేకుండా బయలుదేరితే, తడిసి మోపెడవుతుంది. పొరపాటున గొడుగు తీసుకెళితే, మోత బరువవుతుంది, కృష్ణదేవరాయలు ఆనాటి వర్షం వల్ల వంటకు కష్టపడే ఇల్లాలి గురించి ఎంత కమ్మని పద్యం రాశాడు?

ఇల్లిల్లు దిరిగ నొక్కింతబ్బు శిఖి, యబ్బెనేనింటిలో బూరియిడి విసరక
రాజదు, రాజిన రవులుకో ల్వాసాల గాని కల్గదు, మరిదాన గలిగె
నేని, గూడగుట మందైన బెన్పొప్ప సుఖభుక్తి సేకూరదా భుక్తి కిడన
బ్రాగ్భోక్తలకె తీరు, బహునాన్నము, దీరనారులకొదవు బునఃప్రయత్న
మాజ్యపట ముఖ్య లయమెన్న రాలయాంగ
దారులయమెన్న రంతిక కారజనిక
పచన నాంధో గృహిణి రామి బడుక మరుడు
వెడవెడనె యార్ప నొగిలి రజ్జడిని గృహులు

ఆ జడి (అజ్జడి) వాన మొదలయిందంటే, నిప్పులు దొరకవు. దొరికినా రాజుకోవు. రాజినా రగులుకునేవి ఆశలే గాని మంటలు కావు. వంటయినా సరే, పొగ వల్ల సుఖంగా భోంచేయడానికి ఉండదు. తిన్నా, ముందు తిన్నవారికే కూరలయి పోతాయి. ఇక ఆడవాళ్లు మరీ నూనెగుడ్డలు, ఇంటి వాసాలు పొయ్యిలో పెట్టి, నానా తంటాలు పడుతుంటే, తిని పడుకున్న గృహమేధి, ఇంకా రావేమిటంటాడు.
రాయలవారు రాజభవనంలో ఉండి రాసిన కవితలా ఇవి? పల్లెటూరి జనజీవితంలోకి ఎంతగా దూసుకుపోతే, ఈ సంగతులన్నీ తెలియాలి!
ఇప్పుడిలాగుంది కానీ, కొన్ని సంవత్సరాల క్రితం కూడా వాన పడిందంటే పల్లెలో, సంగతి అచ్చం రాయల వారి పద్యమే కదా!

మనది వర్షాధార ఆర్థిక వ్యవస్థ. అందుకే అలనాటి నుండి మనవారు వర్షాలను, మేఘాలను అంతగా ఆదరిస్తున్నారు. మధ్యలో ఏం లోపమయిందో గానీ, మేఘాలకు మాత్రం మనమీద కనికరం లేకుండా పోతున్నది. 

No comments: