Tuesday, October 21, 2014

బీభత్స, వినోదాల మధ్యనే కదా జీవితం!


An article I wrote long back.

జీవితం కష్టసుఖాలు కలగలసిన కాలక్రమం. మనుషులుగా మనం మాత్రం ప్రతినిత్యం ఈ సత్యాన్ని మరిచిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ ప్రకృతి మాత్రం తన ప్రకృతిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ‘‘ఈ ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం, అనుభవించడం వీలుగాదు’’ అన్నాడు డేవిడ్‌ థోరో. అలా అనుకోవడం తప్పులాగుంది. అందుకే ప్రకృతి తన తీరును మన ముందు ఉంచుతూ ఉంటుంది.

భూమి రకరకాలుగా మారి ఈనాటి రూపం పొందింది. దానిమీద వాతావరణం తయారయింది. నిప్పుదొరికి మన బతుకులను మార్చేసింది. నీరు మన ఉనికికే ఆధారంగా నిలబడి ఉంది. ఇలా మనల్ని, అంటే మానవజాతిని ముందుకు నడుపుతున్న ఈ శక్తులే ఒక్కోసారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. భూమి, దాన్ని ఆవరించుకుని ఉన్న తత్వాలు ఇలా విలయతాండవం చేసినప్పుడు మనుషులు ఒకసారి విస్తుపోయి ‘‘అవునుగదా!’’ అనుకుంటారు.

చరిత్రలో, కథల్లో, సాహిత్యంలో వైపరీత్యాల గురించి లెక్కలేనన్ని విశేషాలున్నాయి. అయినా అవన్నీ ఒకక్షణం పక్కన బెట్టి మనమంతా సరదాగా, మరో రోజు గురించి, సంవత్సరం గురించి ఆలోచిస్తాం. అది సహజం. జీవితంలోని ఈ నాటకీయత, ఈ సంబరాలు, భయాలు అన్నీ కలిస్తేనే అది అసలు సిసలయిన సత్యమవుతుంది.

చావు తప్పదు. అయినా దాన్ని గురించి ఆలోచించడమే తప్పనుకుంటాం. అపాయాలు, ఆపదలు తప్పవు. అయినా వాటి గురించి అనుకోకుండా ఉండడం అలావాటు చేసుకుంటాం.

గుజరాత్‌లో పొద్దున్నే జెండాకు దండం పెట్టడానికి బయలుదేరిన ఎంతోమంది పిల్లలు ఇంటికి తిరిగి రాలేదు. రావడానికి ఇల్లూ మిగలలేదు. వాళ్ళూ మిగలలేదు. జెండా పుణ్యమా అని కొందరు బ్రతికి బయటపడినవారు ఉన్నారు. ఇళ్ళు మాత్రం ఇసకలో కట్టిన పిచికగూళ్ళలా కుప్పకూలాయి.

టీవీలో మధ్యాహ్నం దాకా సంబరాలు చూసినవారు, ఆ తర్వాత సర్వనాశనమయిన పట్టణాలను, బతుకులనూ చూశారు. అప్పటిదాకా దేశభక్తి, క్రమశిక్షణలతో ఉప్పొంగిన గుండెలు, ఒక్కసారిగా బరువెక్కాయి. అందరి మనసుల్లోనూ ఒకటే భావం! ఆ కూలిన ఇంటి ముందు నిలబడి, దిగులుగా చూసే పరిస్థితి నాకే వచ్చి ఉంటే? గుండె మరింత బరువవుతుంది.

ఆపదలు చెప్పిరావు, ప్రకృతి వైపరీత్యాలు అర్థం కావు. మానవులంతా బతుకుదెరువు పేరుతో అపాయాల్లోకి నడిచివస్తున్నారు. అందరూ ఒకే చోట గుమికూడుతున్నారు. గుజరాత్‌ భూకంపం మరీ పెద్దది. అందుకే పల్లెల్ని కూడా అది నేలమట్టం చేసింది. గుడిసె, చిన్న ఇల్లు కూలితే అందులో ప్రమాదం తక్కువ. అందులో చిక్కుకున్న వాళ్ళను రక్షించడమూ సులభం! ఆరేడు అంతస్తులుగా ఇళ్ళు కట్టుకుని నగరాల్లో బ్రతుకుతున్నవారే ఈ భూకంపంలో ఎక్కువగా మరణించారు, నష్టపోయారన్నది మాత్రం నిజం.
మన దేశంలో రాజధానితో సహా ఎన్నో నగరాలు, భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని తెలుసు. తుపానులు, వరదలు మొదలయిన బీభత్సాలకు నగరాలు, జనావాసాలు గురవుతూనే ఉన్నాయి. అలాగని అందరూ ఆయా ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతున్నారా? కనీసం భయపడుతున్నారా?

ఇక్కడ నష్టం జరిగే వీలుందని తెలిసి కూడా, చింతించకుండా ఉండిపోవడం రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి, తప్పని పరిస్థితుల్లో, అంతకంటే మంచి అవకాశం లేకుంటే అక్కడే ఉండడం మంచిది. అపాయం వచ్చిననాడు చూడవచ్చు! రెండవది, ఒక రకమయిన మొరటుబారిన బ్రతుకుతీరు. ‘‘మనకు గతం మంచి పాఠాలు నేర్చుకునే అలవాటులేదు’’ అంటారు గోల్డెన్‌.
ప్రమాదం జరిగితే వెంటనే పుట్టే ప్రశ్న ‘‘ఎందుకిలా జరిగిందీ?’’ అని. వైజ్ఞానికులు చాలా రకాల ప్రమాదాలకు కారణాలు చెప్పగలుగుతున్నారు. కొన్నింటిని ముందుగా సూచించగలుగుతున్నారు కూడా!

ఒకప్పుడు ప్రమాదాలు జరిగితే, వివరాలు అంతగా తెలిసేవి కావు. సమాచారప్రసార సాధనాలు బాగా పరిణతి చెందిన ఈ రోజుల్లో ప్రమాదం తాలూకు వివరాలు క్షణాల మీద మన ముందు దర్శనమిస్తున్నాయి. ఒక్క క్షణం విస్తుపోయినా దూరం నుంచి చూసిన వారు మళ్ళీ రోజువారీ కార్యక్రమంలో మునిగిపోతారు. వార్తల ఛానల్స్‌ భూకంపం భీభత్సాన్ని చూపుతుంటే, మిగతా ఛానల్స్‌ వినోదాన్ని చేటలతో చెరుగుతూనే ఉన్నాయి. జీవితమూ అంతే! మనం, మనవారు కానంతవరకు ఫర్వాలేదు. అయితే ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన వారికి మాత్రం, వెంటనే కొంత, తర్వాత మరికొంత, శాశ్వత ప్రాతిపదిక మీద ఇంకొంత సాయం అవసరం.


పట్టించుకోనివారు ఉన్నట్లే, చేతనయినంత సాయం చేసేవారు కూడా ఉండడం గమనించదగింది. కాలం గడిస్తే 26 జనవరి భూకంపం చరిత్ర అవుతుంది. కొందరికి మాత్రం అది వ్యక్తి చరిత్రలో భాగమవుతుంది. వారి కోసం మనమేమి చేయగలం?

No comments: