Sunday, August 11, 2013

Lokabiramam.- From net to print!

Usually people transfer material published in print medium to net at a later day!
Interestingly my writings under the title Lokabhiramama, in this and my other blog in Telugu gave an idea to my friends at Bhoomi daily that this should be a column in their Sunday Supplement.
So, here is the third incarnation of Lokabhiramam, now in print!ఊదవలసిన శంఖం

* ‘నేను చెప్పే మాటలు ఎవరికీ పట్టవని నాకు తెలుసు. అయినా చెపుతాను. ఈ మాటలు, నేను చెప్పకుంటే మరెవరూ చెప్పరు. చెప్పలేరు’ అంటాడొక చైనా తాత్వికుడు.

‘ఊదర సంగై ఊది వెచ్చాల్, విడియుం బోదు, విడియాట్టుం’ అని ఒక తమిళ సామెత. ఊదే శంఖాన్ని ఊదేస్తే, తెల్లవారేటప్పుడు తెల్లవారనీ, అని అర్థం.

* కనీ పెంచీ, కనిపించిన దేవతలు అమ్మా, నాన్నా! బతుకుకు, చదువుకు గురువు, తరువాత హితుడు, స్నేహితుడు నాన్న! (నేను నాన్నగారు, స్నేహితులు అనలేదని ఎవరూ బాధ పడనవసరం లేదు! మా తీరే అంత!) ఈ పని ఈ రకంగా చేయండి, అని నాన్న ఏనాడూ చెప్పింది లేదు. అయినా అన్నింటికీ ఆయనే గురువు. నాన్న సైకిలు పెట్టే చోట, గోడలో ఒక చిన్న చెక్క తలుపు అల్మారా ఉండేది. నేనూ, తమ్ముడూ పొద్దునే్న ముఖం కడుక్కుని వచ్చి అక్కడ నిలబడి, ‘ఎలుకా! మాకేమయినా యియ్యవా?’ అని అడగాలి. కళ్లు మూసుకుని అడగాలి. అల్మారాలో ఎలుక ఉంటుంది. అది మాకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుంది. ఇప్పటిలాగ చారెడు, బారెడు చాకొలేట్లు లేవప్పుడు. ప్యారీ, దకన్, రావల్‌గావ్ అంటూ రెండు వేపుల చెవులు మెలేసిన చాక్లేట్లవి. బుద్ధిగా పిడక బూడిదతో పళ్లు తోముకుని, ముఖం కడుక్కుని వచ్చి నిలబడడమంటే, ఎలుక కొరకేనా?

నాన్న ఆ ఊళ్లోనే, అంటే మా ఊళ్లోనే బడిలో టీచరు. ఆయన సిద్ధమయి, ధోవతీ కట్టుకుని, తాంబూలం వేసుకుని, సైకిలు తీసుకుని ఠీవిగా బయలుదేరితే దారిలో ఎవరూ అడ్డువచ్చేవారు కాదు. కానీ, అదంతా చూచే ఓపిక ఎక్కడిది! ఉడుతలా పరుగెత్తి బడికి చేరుకునే వాణ్ని. పుస్తకాలు లేవు. కనీసం పలక లేదు. నాకసలు బడిలో అడ్మిషనే లేదు. ప్రార్థన అయింతర్వాత చెప్రాసీ (బంట్రోతు) శాంతయ్య, నన్ను ఇంట్లో దింపుతాడు. అతను భుజం మీద ఎత్తుకుని ఇంటికి తెస్తుంటే, నచ్చక, ఒకనాడు, అతని చెవి కొరికినట్టు జ్ఞాపకం! శాంతయ్య తలకు రుమాలు కట్టుకునేవాడు. మరి చెవి ఎట్లా కొరకడం కుదిరింది? ఇప్పుడు అనుమానం వస్తుంది. పెద్దవాణ్ని అయింతర్వాత శాంతయ్య ఎప్పుడూ ఆ సంగతులు చెప్పి మురిసిపోతుండేవాడు.

నేనూ బడిలో చేరాను. అక్షరాలు దిద్దే అవసరం లేకుండా, ఏకంగా పుస్తకం పట్టుకున్నానట. ఒకనాడు అందరినీ నిలబెట్టి నాన్న డిక్టేషన్ చెపుతున్నాడు. నేను మెడలిక్కించి ముందున్నవాడి పలకలోకి తొంగి చూచాను. తల మీద ఠపీమని దెబ్బ పడింది. తిరిగి చూస్తే నాన్న! పలక కింద పడేసి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయాను. పలకను నాన్న ఇంటికి తెచ్చాడు. ఆయన చెప్పిన మాట, అప్పటికే నేను రాసి ఉంచానన్న సంగతి ఆ పలక ప్రకటించింది! నాన్న గట్టిగా నవ్వాడు! నేనూ గర్వంగా నవ్వాను.

క్రమశిక్షణంటే నాన్న తర్వాతే ఎవరయినా! ఆయన్ను చూచి గడియారం తత్తరపడేదేమో? చివరి వరకూ ఆయన అదే పద్ధతిగా బతికారు.

ఇంట్లో తాతయ్య పుస్తకాలు ఒక పెద్ద అల్మారా నిండా ఉండేవి. వాల్మీకం మొదలు ఆనంద రామాయణం దాకా, ఎన్ని రామాయణాలున్నా ఆశ్చర్యం లేదు. ఆరోగ్యం, వైద్యం, యాత్రా చరిత్రలు, గారడీ విద్య, మొదలయిన పుస్తకాలన్నీ తాతయ్య కొని చదివారంటే భుజాలు పొంగిపోతాయి. ఆ పుస్తకాలను తరచు దులిపి, నిర్వహించడం నా డ్యూటీ. ఆ పుస్తకాలు నావి, అది గర్వం!

నాన్న బాగా చదువుకున్న మనిషి. కానీ సర్ట్ఫికేట్లు లేని చదువది. ఏదో ఒక చిన్న ట్రెయినింగ్ పొంది, ప్రైమరీ స్కూల్ పంతులుగా సెటిలయ్యారాయన. అందులోని ఆనందం గురించి తర్వాతెప్పుడో చెప్పాడాయన మాతో! ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. నాకు అక్షరాలతో పరిచయం ‘చందమామ’తో మొదలయింది. మూడవ తరగతిలో ఉన్నప్పుడు చందమామ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవడం అలవాటయిపోయింది. అందులో వచ్చే వ్యాపార ప్రకటనలు కూడా గుర్తున్నాయి. నాన్న తాను చదివిన నవల, పత్రిక ఏదయినా సరే తరువాత నా ఒళ్లో పడేయడం అలవాటయింది. కోడిగుడ్డు దీపం పెట్టుకుని, అయిపోయిందాక అపరాధ పరిశోధక నవల చదివి,ఆ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే, భయంగా పడుకోవడం గుర్తుంది! ‘ఈ ప్రపంచంలో పనికిరాని పుస్తకమని ఏదీ లేదు’ అని నాన్న అనుకున్నాడనిపిస్తుంది. అంగట్లో పప్పు కట్టిచ్చిన కాయితం కూడా చదవందే పడేయకపోవడం, అప్పుడే అలవాటయింది.

సెలవులు వచ్చినయంటే, ఏ లైబ్రరీ నుంచో సంచెడు పుస్తకాలు ఇంటికి వస్తాయి. నిదానంగా చదివితే నాలుగు రాళ్లు కాలం గడుస్తుంది. కానీ, అంత ఓపిక ఏదీ? పిచ్చెత్తినట్టు అన్నీ చదివేసి, మరో బ్యాచ్ కొరకు ఎదురుచూడడమే!
అది పరీక్షకు చదవవలసిన ‘సిలబస్’ పుస్తకం గానీ, సరదాగా చదివే నవల గానీ, చదువు కాని చదువుగా చదివే మరో పుస్తకం గానీ, పుస్తకమంటే, నాన్నలాగే మిత్రుడు, ఆప్తుడు! కష్టపడి చదవడం, సరదాగా చదవడమన్న తేడా లేదు! అన్నీ యిష్టంగానే చదవడం అలవాటయింది. వరుసబెట్టి రెండు క్లాసిక్సు, రెండు నవలలు చదివి, అదే ఊపులో ‘సిలబస్’ కూడా చదివితే, అన్నీ ఒకే రకంగా, సినిమాలాగ గుర్తుకు వచ్చేవి.

మా ఊరి బడిలో అయిదవ తరగతి వరకే ఉండేది. తరువాత, పక్కనున్న పాలమూరులో చదువు. చిత్రంగా నాన్నకు, తిరిగి మా బడికే బదిలీ అయింది. చివరి పీరియడ్ జరుగుతుండగా, (మామూలుగా అది ఆటల పీరియడ్) నన్ను వెతికి, ‘ఇంటికి పరుగెత్తకు;’ అని ఒక మాట చెప్పి వెళతాడు నాన్న! అంటే ఆనాడు సినిమా చూసే కార్యక్రమం ఉందని అర్థం. సినిమాలు చూడడమే కాదు, వాటిని గురించి చర్చించడం కూడా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నమ్మండి, నమ్మకపొండి, జరదా పాన్ తినడం, నాన్న దగ్గర నేర్చుకున్నాను!

జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చెయ్యాలన్నది నాన్న ఫిలాసఫీ. పట్నంలో పడి, నన్ను నేను వెదుక్కుంటూ బతికే రోజుల్లో పండగకు ఇంటికి వెళతాను. సాపాట్లు (భోజనాలు) అయింతరువాత నాన్న పాన్ వేసుకుని, ఆ అందమైన పెట్టెను నా ముందుకు తోస్తారు అది అలవాటు. ఒకసారి, నేను ‘మానేశాను వద్దు’ అన్నాను. ‘నాన్నా! టీ, కాఫీ తాగవు. మరే అలవాట్లూ లేవు. ఉన్న ఈ ఒక్క సరదా (అదే జరదా) మానేసి ఏం చేస్తవయ్యా?’ అన్నారాయన

తినే తిండిని ఆనందంగా అనుభవించాలని, ఆదరా బాదరాగా తినగూడదని మాకు తెలియకుండానే అలవాటయింది. నాన్న బడిపంతులు! స్థితిపరులం కాదనే చెప్పాలి! కానీ తిండి సంగతిలో మాత్రం, ఎప్పుడూ లోటు లేదు. నాన్న వంటకు ఉపక్రమిస్తే, ఇక పండగే. ఒకసారి అమ్మ ఊళ్లో లేనప్పుడు, నూగులు, కొత్తిమీర, పచ్చిమిర్చిలతో నాన్న చేసిన పచ్చడి నాకు ఇవాళటికీ గుర్తుందంటే నమ్మండి. మాకంతా, ‘వంటొచ్చిన మగవాళ్లు’ అని పేరుంది! ఇక్కడ, ఎక్కువ తినడం గురించి కాదు సంగతి. ఇష్టంగా తినడం గురించి.

యూనివర్సిటీ రోజుల్లో ననుకుంటాను. ఎవరో నన్ను, నీకిష్టమయిన విషయాలు ఏమిటి? అని అడిగారు. ‘అమ్మాయిలు, స్వీట్లు, పుస్తకాలు, శాస్ర్తియ సంగీతం’ అన్నాను. ‘నాట్ నెససరిలీ ఇన్ దట్ ఆర్డర్’ అని కూడా అన్నాను. వరుస అదే కానవసరం లేదని భావం! ‘జిహ్వోపస్థ పరిత్యాగీ’ అని మొదలుపెట్టి నాన్న ఒక శ్లోకం చెప్పారు. నా యిష్టాలలో మొదటి రెండింటి మీద ఆసక్తి లేని వాడి బతుకు దండగ అని శ్లోక భావం మాత్రం గుర్తుంది. నేను పెళ్లి చేసుకోను దేశాన్ని ఉద్ధరిస్తాను! అన్నప్పుడు ఈ సంగతి చెప్పినట్లు నా అనుమానం. సందర్భం సరిగా గుర్తు రావడంలేదు.

నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. నేను దాన్ని ‘సన్నవిల్లలాగ’ (చంటిపాపలాగ) చంకనేసుకుని తిరుగుతానని అందరూ అనేవారు. రకరకాల కార్యక్రమాలు వింటూ కాలం గడపడం అలవాటయింది. సిలోన్, వివిధ భారతి స్టేషన్ల నుంచి వచ్చే హిందీ సినిమా పాటలు పిచ్చిగా వినడం అలవాటయింది. తెలుగు పాటలు వారానికి రెండు అరగంటలూ, సాయంత్రం సిలోన్‌లో కొన్నీ వినిపించేవి అంతే. మా ప్రాంతంలో శాస్ర్తియ సంగీతం వినడం నిజానికి ఎవరికీ అలవాటు లేదు. నాన్న మాత్రం గద్వాల సంస్థానంలో బాల్యం, ఆ తరువాత కూడా చదువుకున్నారు. అక్కడ నాటకం, సాహిత్యం, సంగీతం లాంటి రుచులన్నీ ఆయనకు తగిలాయి. అప్పుడప్పుడు పాత పద్ధతిలో ఆయన పాడుతూ ఉండేవారు కూడా! నన్నొకసారి పిలిచి ‘నాన్నా! ఊరికే అస్తమానం ఆ సినిమా పాటలు వింటున్నావు. అప్పుడో ఇప్పుడో సంగీతం (శాస్ర్తియం) విని చూడగూడదా?’ అన్నారు. నిజం చెపుతున్నాను. ఆయన మాత్రం ప్రయత్నంగా సంగీతం విన్నట్లు నాకు గుర్తులేదు.

నాన్న ఈ మాటలన్నది నవంబరు, డిసెంబరు రోజులనుకుంటాను. రేడియో సంగీత్ సమ్మేళన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కచ్చేరీలు వచ్చేవి. మద్రాసు ‘సంగీతోత్సవం’ కచేరీలను హైదరాబాద్ రేడియో వారు కూడా ‘రిలే’ చేసేవారు. (తమిళంలో అనౌన్స్‌మెంట్లు వస్తాయని మానేశారట!) మొత్తానికి కారుకురుచ్చి అరుణాచలం, టి.ఆర్.మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మహామహుల సంగీతం విన్నాను. ‘సంగీతమంటే ఇది గదా!’ అన్న భావం ఒకటి బలంగా నాటుకుపోయింది.

నాకు ఇష్టమని చెప్పుకున్న విషయాల్లో మొదటి రెండింటి మీద, అంత ప్రేమ లేదు! నిజం! పుస్తకం, సంగీతం లేనిదే రోజు గడవదు. ఇది అంతకన్నా నిజం!

* ‘అత్త పత్తెమయితే, ఇల్లల్ల పత్తెమ’ని మాకొక మాట ఉన్నది. ఇక్కడ పత్తెమంటే, పథ్యం. తిండిలో నిబంధన. నాకు ఇష్టమయిన సంగతులు, అందరికీ ఇష్టముండాలని ఎక్కడా లేదు. కానీ, బతుకంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు, ఉండగూడదని నా నమ్మకం. అమ్మ, నాన్న నాకు బతుకు నేర్పించినట్లే, బతుకు మీద ప్రేమ నేర్పించి, వారి దారిన వారు వెళ్లిపోయారు. అమ్మా, నాన్నా పెద్దవాళ్లయి, పోవడం సహజం! అయినా, వాళ్లు ఉన్నారనుకునే బతుకుతున్నాను. మన వాళ్లందరూ, అనుక్షణం మన కళ్ల ముందు ఉన్నారు గనుకనా?
* మాత, పిత, గురుదేవులు, హితులు - వీళ్లే దేవుళ్లనుకుంటే ఎంత బాగుంటుంది? అంతా కనిపించే దేవుళ్లు! కనిపిస్తారు, పలకరిస్తారు, కనికరిస్తారు!

* కోతి రాగమ్మ - చింతకాయ తొక్కు

‘కోతి రాగమ్మ చింతకాయ తొక్కు’ అన్న మాట వినగానే మీకేమయినా తోచి ఉండాలి. చాలామందికి తోచదు. కొన్ని మాటలు, జోకులు, కథలు, ఒకో ప్రాంతం, వర్గంలో మాత్రమే ప్రచారంలో ఉంటాయి. రాఘవులు, రాగడవుతాడు.. రాఘవమ్మ రాగమ్మవుతుంది. దంచడం, తొక్కడం, నూరడం సమానార్థకాలు కాకున్నా ఇంచుమించు ఒకే పనిని సూచిస్తాయి. పచ్చడి అని కొందరనే పదార్థాన్ని మేము ‘తొక్కు’ అంటాము. తొక్కింది తొక్కు. చింతకాయలు అందరికీ తెలిసినవే. ఇంత తెలిసినా, శీర్షిక అర్థం మాత్రం తెలియదు.

రాగమ్మ ముందే కోతివంట మనిషి. పనులను తన పద్ధతిలో చేసుకుంటుంది. ఆమె చింతకాయ తొక్కు పెట్టడానికి ఉద్యమించింది. పెట్టడమంటే, నిలువతొక్కు తయారుచేసి కాగు (బాన) నింపడమని భావం. ఎవరికో పెట్టడం కాదు. సరే, చింతకాయలు దంచి, నారలు కొంతవరకు తీసి పడేయాలి. పసుపు, మెంతుల పొడి, జిలకర మొదలయినవి కలపాలి. ఇక పచ్చిమిర్చి, ఉప్పు ముఖ్యంగా చేర్చాలి. అంతా అయింతర్వాత రుచి చూస్తే, కారం ఎక్కువయింది. కనుక కొంత ఉప్పు చేర్చింది. ఈసారి రుచి చూస్తే ఉప్పు మరీ ఎక్కువయింది. కనుక ఈసారి మరిన్ని చింతకాయలు దంచి కలిపింది రాగవ్వ! రుచి చూస్తే ఉప్పు తక్కువయింది. మళ్లీ సర్దుబాటు చర్యలు!
మొత్తానికి ఒక్క కాగు అనుకోని మొదలుపెట్టిన తొక్కు మూడు కాగులయింది.

అదీ కథ! అందుకే, ఎవరన్నా పనులను ఈ పద్ధతిలో సర్దడానికి ప్రయత్నిస్తే కోతి రాగమ్మ చింతకాయ తొక్కు అంటారు మా వాళ్లు!

* జొన్న చేనుకు పోయి, సొగసుకత్తెను చూచి, నిన్న మాపటి నుంచి నిద్ర లేదు. దాన్ని నన్ను గూర్చి దయ చేయి మాధవా! పొన్న పూలతోటి పూజసేతు!

పద్యం హృద్యంగా ఉంది కదూ! ఈ పద్యాన్ని మాకు సంగతేమిటో అర్థంకాని చిన్న వయసులోనే నేర్పించారు. నాట్యం పేరున చిన్నచిన్న పిల్లలు, ‘రాడాయెనే స్వామి’ అనీ, ‘స్వామిరార!’ అనీ గుప్పిగంతులు వేస్తుంటే నాకు ఈ పద్యం గుర్తుకు వస్తుంది.

* బూతుల్లోనూ అందమయినవి కొన్ని, అసహ్యమయినవి కొన్ని ఉంటాయి. సంస్కృత భాషలో ఉన్నంత మాత్రాన మాటలన్నీ ఒక పరిష్కారం గలవి కావు. ‘సుతా సురత సౌందర్యం, జామాతా వేత్తి, నో పితా!’ అని ఒక మాట ఉంది. ‘అమ్మాయి రతి సౌందర్యము, అల్లునికి తెలుస్తుంది, తండ్రికి కాదు!’ అని భావం. నిజమే, కానీ ఎంత చీదరగా ఉంది ఈ మాట! బాగలేదు!

* ఇతి శం! కోతి రాగమ్మ చింతకాయ తొక్కు, ఇక ఆగును!

This is the text of articles that appeared in Andhra Bhoomi Daily Sunday book.
I was and am reluctant to write about em and my experiences. Mr Sastry, the editor  and Mr Vedula almost prevailed and convinced me that I should do so!
Here I am!
I assure myself that the column would not be so much self centred after the introduction!

1 comment:

bharathi ram Kistampally said...

నరసింహాచారి సారు ఫోటో చూస్తుంటే నాన్న గారు జ్ఞాపకం వచ్చారు . చిన్నప్పటి ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తుకి వచ్చాయి . ఒక్క రకమైన బాధ కూడా కలి గింది . వాళ్లు పోయి ఏళ్ళు గడిచినా వాళ్ళ ప్రేమ ఆప్యాయత , స్పర్శ ఇంకా మనల్ని స్పృశిస్తూనే ఉన్నాయి. సారు వంట్లో బాగాలేనప్పుడు నేను పలకరించడానికి వెడితే నన్ను చూస్తూనే డాక్టరు గారు వచ్చారు , నా స్నేహితుడు వచ్చాడు అని ఆయన అన్న మాటలు ఇంకా నాకు స్మ్రుతి పధం లో మెదులుతూనే ఉన్నాయి. వీళ్ళంతా చిరంజీవులు కాదంటారా . బేసిక్ స్కూల్ లో జొన్న చేను కొయ్యడం, మేమంతా బెండ నారు నాటడం అన్నలంటా కబడ్డీ ఆడుతుంటే వాళ్ళ పుస్తకాలకి కాపలాగా కూర్చోడం మీ బ్లాగ్ చదువుతుంటే నాకు ఎన్నెన్నో జ్ఞాపకాలు మళ్లీ పలకరిస్తున్నయి. ధన్యవాదాలు