Showing posts with label comment. Show all posts
Showing posts with label comment. Show all posts

Friday, August 28, 2026

లోకాభిరామం : మాదదయో (ఇప్పుడే కాదు) On Kurosawa Movie Madadayo


 

ఇప్పుడే కాదు..

Published originally on Saturday, 13 April 2019 - Andhrabhoomi daily Sunday Magazine

ఎవరికీ నమ్మకంగా తెలియని విషయం గురించి మనకు అసలు అనుమానం ఉండనే కూడదు - ఆన్ వార్డ్ రాడ్ క్లిఫ్ (రచయిత)

* * *
ఒక మనిషికి జీవితకాలంలో తినడానికి కొంత తిండి కోటా ఉంటుంది అంటారు. బతుకు ముగియకముందే అంత తిండి తినేస్తే ఆ తర్వాతి కాలంలో వారికి తిండి ప్రాప్తం ఉండదు, అంటారు. బహుశా సినిమాల విషయంలో నాకు ఇటువంటి పరిస్థితి ఎదురయినట్టు అనిపిస్తుంది. చిన్నప్పుడు సినిమాలు తెగ చూసేవాడిని. డబ్బులు ఉన్నాయని కాదు, మిత్రులు, అన్నయ్య కలిసి సినిమాలు చూడడానికి మంచి వెసులుబాటు కలిగించేవారు. 'పరీక్షలు వచ్చే సంవత్సరం కూడా రాయవచ్చు. కానీ సినిమా మళ్లీ వస్తుందో రాదో, కనుక సినిమా చూడడమే మేలు' అని, నాన్న ఒక సందర్భంలో అన్నాడు. అది నా గురించి కాదు అని అనుమానం. కానీ విషయం మాత్రం నిజమే. సినిమాలు అంతగానూ చూచాను. కనుక ప్రస్తుతం నాకు సినిమాలు చూడడానికి ఓపిక లేకుండా ఉంది. అరగంట సేపు చూస్తే చాలు అలసట, అసహ్యం లాంటి లక్షణాలు అన్నీ మొదలయ్యి ఇక సినిమా చాలు అనిపిస్తుంది.
అక్కడో ఇక్కడో అరకొర సినిమాలు నచ్చినవి కూడా ఉన్నాయి. అంటే వాటిని ఇంచుమించు పూర్తిగా చూడగలిగాను అని అర్థం. అలాంటి వాటిలో అన్నిటికన్నా ముందు 'క్షణక్షణం' గురించి చెప్పాలి. బహుశా ఈ మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉంటాను. అయినా మరోసారి చెప్పడానికి సందేహం లేదు. ఆ సినిమా అయిదు నిమిషాలు చూచిన తరువాత, అదేదో కాపీ వ్యవహారం అని అర్థం అయిపోయింది. కానీ శ్రీదేవి అమాయకత్వం, వెంకటేష్ ఏదీ పట్టి లేదు అన్నట్టు ప్రవర్తించడం, విలన్ తీరు, ఇలాంటివన్నీ కలిసి సినిమా చాలా నచ్చింది. మూసగా అందులో ప్రేమలో పాటలు అలాంటివి ఏమీ లేవు. ఏదో ఒక చిన్న సంగతిని పట్టుకుని సినిమా మొత్తం నడుస్తుంది. హిందీ విలన్ పాత్ర చాలా ఆకర్షణీయంగా ఉంది. కనుక ఆ సినిమాను ఇంచుమించు పూర్తిగా చూచాను. రెండోసారి, మూడోసారి, పన్నండోసారి చూసినప్పుడు ఆ సినిమాను నేను ఎప్పుడూ పూర్తిగా చూడలేదు అని అర్థమయింది.
నిజం చెప్పాలంటే నా దగ్గర చాలా సినిమాలు ఉన్నాయి. వాటిని నేను ఇంట్లోనే అంచెలంచెలుగా చూస్తుంటాను. ఇక ఇంటర్నెట్‌లో అయినా సరే సినిమా చూడడానికి అదే పద్ధతి. నాకు సినిమా చూడడానికి ఓపిక లేదు అన్న మాట వాస్తవమే కానీ, నేను సినిమాలు చూడను అంటే మాత్రం అబద్ధం అవుతుంది. అయితే తెలివిగల మనుషులలోకి నన్ను కూడా లెక్క వేసుకుంటాను కనుక, కొన్ని తిక్క పనులు చేయాలి. అందరూ చూసే సినిమాలు చూస్తే మనం తెలివిగల వాళ్లు కింద లెక్క కాదు. ఎవరికీ తెలియని కొన్ని సినిమాలు, కొంతమంది డైరెక్టర్లు, మరి కొంతమంది నటులు వగైరాలను గురించి మాట్లాడుతూ ఉండాలి. అది ఫ్యాషన్ మరి. అందుకే ప్రయత్నించి అరుదైన సినిమాలు చూడడం నేర్చుకున్నాను. ఆ క్రమంలోనే అకిరా కురొసావా గురించి కూడా తెలుసుకున్నాను. నాకు తెలియకుండానే ఈ పెద్ద మనిషి తీసిన ఒకటి రెండు సినిమాలు చూశాను.
పెళ్లయిన కొత్తలోనే, అమాయకురాలు మా ఆవిడని కూడా వెంటబెట్టుకుని వెళ్లి కగేముషఅనే ఒక సినిమా చూశాను. అది ఒక సమురాయ్ వీరునికి సంబంధించిన కథ. నిజం చెబుతున్నాను. సినిమా నాకు ముక్క అర్థం కాలేదు. మా ఆవిడకు అంతకన్నా అర్థం కాలేదు. ఆ తరువాతో, అంతకు ముందో ఎప్పుడో గానీ సెవెన్ సమురాయి అనే సినిమా కూడా చూశాను. ఇది నలుపు - తెలుపు సినిమా. అంటే చాలా ముందు తీసింది అని అర్థం. అందులో గూండాల బాధలు ఎదుర్కోవడానికి ఊరి వాళ్లు పైనుంచి వీరులను అరువు తెచ్చుకోవడం అసలు కథ. నిజానికి మన దేశంలో సూపర్ డూపర్ హిట్‌గా వచ్చిన షోలేఅనే సినిమాకు ఆధారాలు కురొసావా సినిమాలో ఉన్నాయి అంటారు. కిరాయి వీరులు అన్న మాట ఒకటి తప్పిస్తే రెండు సినిమాలలో పోలిక లేనే లేదు. మళ్లీ ఒకసారి చెబుతున్నాను, ఆ సినిమా కూడ నాకు అర్థం కాలేదు.
సినిమా చూస్తే పోతుంది కదా? అందులో అర్థం కావడానికి ఏముంది? అనుకోవచ్చు కూడా. అట్లాగే అనుకుని అకిరా కురొసావా సినిమాగా తీసిన రషోమన్ అని ఒక కథను నాటకంగా చూశాను. దాన్ని లలిత కళాతోరణంలో ఎమ్మెస్ సత్యు లాంటి కొన్ని పెద్ద పేర్ల ప్రభావం కింద ప్రదర్శించారు. నాకు ముక్క అర్థం కాలేదు. ఆ తరువాత కొంచెం తెలివి తెలిసినప్పుడు, అకుటగవ అనే రచయిత సంకలనాన్ని సంపాదించి ఆ కథ మొత్తం చదివాను. కథ వేరు, నాటకం, సినిమా వేరు. వెర్రి కాకపోతే నాకు ఎందుకని ఈ డైరెక్టర్ల సినిమాలు చూడాలని యావ? ఫ్యాషన్ మరి.
అకిరా కురొసావా చాలా సినిమాలు తీశాడు. నేను వాటిలో చాలా చూచినట్టు కూడా ఉన్నాను. అతని వయసు పెరిగిన కొద్దీ, సినిమాలు, కథలు, తీసిన తీరు అన్నింటిలోనూ మార్పు కనబడింది. కురొసావా చివరిగా తీసిన చిత్రం మాదదయో!ఇది ఒక ప్రశ్నకు జవాబు! 30వ సినిమాగా తీశారు కాబట్టి, అప్పటికి కురొసావా రిటైర్మెంట్ మూడ్‌లో ఉన్నట్టున్నాడు. కనుక రిటైర్మెంట్ గురించి బొమ్మ తీశాడు. ఈ సినిమా మాత్రం నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది.
మాదదయోనాకు అంతగా నచ్చడానికి బహుశా కొన్ని కారణాలు ఉన్నాయి. సినిమా తీసిన కురొసావా వృద్ధాప్యంలో ఉన్నాడు. నేను కూడా 60 ఏళ్లు దాటిన వాడిని. సినిమాలో నాయకుడైన సెంసయ్ అంటే గురువుగారు అప్పటివరకు తాను చేసిన అధ్యాపక వృత్తికి వీడ్కోలు చెప్పి, పుస్తకాలు రాస్తూ సుఖంగా బతుకుతాను అంటాడు. అందుకు అనువుగా ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనకు భార్య ఉంది. ఆమె కూడా భర్తను గురువుగారు అంటుంది. పిల్లలు మాత్రం లేరు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన వద్ద జర్మన్ నేర్చుకున్న కుర్రవాళ్లు అంతా, ఇప్పుడు పెద్దవాళ్లయి మంచి పొజిషన్లలో ఉన్నారు. వాళ్లంతా ఆయన పిల్లలుగా ఉంటారు. ఏటా ఆయన పుట్టినరోజు జరుపుతారు. సినిమా మొత్తంలోకి ఈ పుట్టినరోజు పార్టీలు ప్రత్యేక ఆకర్షణలు. విద్యార్థులు కుటుంబాలతో సహా ఒకచోట చేరుతారు. సెన్సయ్ గారిని ఘనంగా సన్మానిస్తారు. అదేమి ఆచారమో తెలియదుగానీ, ఒక పేద్ద గ్లాసు నిండి బియర్ పోసి ఆయన గారికి తాగడానికి ఇస్తారు. ఆయన ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేస్తాడు. అప్పుడు సినిమా పేరు వినిపిస్తుంది. విద్యార్థులంతా కలిసి 'మాదకై' అని అడుగుతారు. గురువుగారు 'మాదదయో' అంటాడు. మాదకై అంటే 'సమయం వచ్చిందా?' అని అర్థం. మాదదయో అంటే 'అప్పుడే రాలేదు!' అని అర్థమట. గురువుగారిని ఇక జీవితం నుండి సెలవు తీసుకుంటావా? అని పిల్లలు అడగడం, ఆయన ఇప్పుడే కాదు మరింత కాలం బతుకుతాను అనడం, ఇంచుమించు అదే వయసులో ఉన్న నాకు బాగా నచ్చింది అంటే ఆశ్చర్యమేముంది?
విద్యార్థులు గురువుగారి గురించి పట్టించుకున్న తీరు కంటతడి పెట్టిస్తుంది. రిటైర్ అయిన తరువాత భార్యా భర్తలు ఇద్దరూ బతుకుతున్న ఇంట్లో రక్షణ ఎంతగా ఉందో చూడాలని, ఇద్దరు విద్యార్థులు రాత్రిపూట ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తారు. 'దొంగలకు దారి' అన్న బోర్డు ఎదురవుతుంది. ఆ సన్నివేశం నిజంగా చాలా బాగుంటుంది. మొత్తానికి రక్షణ బాగుంది, అని తెలుస్తుంది. ఎదురు గోడ మీద మూత్రం పోయడం గురించి రాసి ఉంటుంది. స్వంతదారు ఆ పొలాన్ని మరెవరికో అమ్మడంతో గురువుగారు అక్కడి నుండి కదలవలసి వస్తుంది. విద్యార్థులంతా కలిసి ఆయనకు ఒక గుడిసె ఏర్పాటు చేస్తారు. ఆ గుడిసెకు ద్వారం ఉండదు. మిగతా సౌకర్యాలు అన్నీ ఉంటాయి. చుట్టుపక్కల ఎట్లున్నా అసలైన జపాను పద్ధతిలో కాగితాలతో పరదాలు మొదలయినవి ఏర్పాటు చేసిన ఆ గుడిసె మాత్రం చాలా బాగుంటుంది. విద్యార్థులు ప్రతి నిత్యం అక్కడికి వస్తుంటారు. ఎవరిలోనూ అది కేవలం ఒక చిన్న గుడిసె అన్న భావన కనిపించదు.
సినిమాలో పుట్టినరోజు పార్టీలు మళ్లీమళ్లీ వస్తాయి. వాటికన్నా ముఖ్యంగా చెప్పుకోవలసింది, పిల్లి గురించిన విషయం.
గురువుగారికి ఒక పిల్లి దొరుకుతుంది. దాన్ని ఇంచుమించు సొంత బిడ్డలా పెంచుకుంటారు. మధ్యలో ఆ పిల్లి కనిపించకుండా పోతే వెదకడంతో సినిమా ఎంతో ముందుకు సాగుతుంది. అక్కడ కొంచెం విసుగు కలిగిన భావన కనిపించవచ్చు కానీ, అది కూడా సినిమా నిర్మాణంలో భాగం ఏమో అనిపించింది.
జీవితం పట్ల, అందులో తనకు కావలసిన సౌకర్యాలు, సంగతుల పట్ల, పెద్ద వయసులో కూడా ఒక మనిషికి ఉండే ఆసక్తి గురించి కురొసావా తీసిన సినిమా, నాకు మాత్రం అద్భుతంగా కనిపించింది. నిజానికి సినిమా మొత్తం ఈ ఒక్క విషయం మీదనే ఆధారపడి ఉంటుంది అనవచ్చు. అందరికీ నచ్చిన ఒక పెద్ద మనిషి, తన జీవితాన్ని తాను ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. అప్పుడే అందులో నుంచి బయటపడాలి అని అనుకోవడానికి కూడా వీలు లేనంతగా, తను జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. నాకు నిజానికి జీవితం మీద అంత గట్టి ప్రేమ లేదు. అయినా సరే సినిమాలో ప్రొఫెసర్ కనబరిచిన తీరు, నాకు చాలా నచ్చింది.
సినిమాలో నిజానికి ఎక్కడా కూడా గోల గందరగోళం కనిపించదు. వినిపించదు కూడా. అంతా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. కురొసావా అందుకు తగినట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో పాశ్చాత్య శాస్ర్తియ సంగీతాన్ని వినిపించాడు. పార్టీలో కూడా అటువంటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం, మనిషి మీద ఒక ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కెమెరా కదలికలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. పరుగులు ఫైట్లు లాంటివి ఊహించడానికి కూడా ఈ సినిమాలో ఉండవు. ఉన్నది చిన్న గుడిసె అయినా, అది గుడిసెలాగా కనిపించదు. అందంగా ఉంటుంది. వచ్చిన విద్యార్థులు నిజానికి విద్యార్థులు కాదు. వాళ్లంతా పెద్దపెద్ద ఉద్యోగాల్లో చేరిన వాళ్లు. నగరంలో నాయకులుగా చెలామణి అవుతున్న వారు కూడా. ఈ సంగతి పార్టీ సందర్భంగా బయటపడుతుంది.
సినిమాలో ప్రొఫెసర్ లాగే మొత్తం సినిమా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది ఈ సినిమా ప్రత్యేకత. ఆ ప్రొఫెసర్ మన వంటి ప్రేక్షకులను కూడా తన పద్ధతిలోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాడు. అది అతను నేరుగా చేయడు. అప్రయత్నంగా అది జరిగిపోతూ ఉంటుంది. స్వార్థం ఏ మాత్రం కనిపించని తీరు, మనసును తాకుతుంది. సింప్లిసిటీ అనే ఒక లక్షణం, మనం కూడా నేర్చుకుంటే బాగుండును, అనిపిస్తుంది.
మనకు సినిమా అంటే కేవలం ఒక సరదా. సినిమాలలో జరిగే విషయాలు మామూలు జీవితాలలో అసలు కనిపించవు. అట్లా కనిపించాలని మనం ఎప్పుడూ అనుకోము. అటువంటి మనకు, ఇప్పుడే కాదు, అన్న ఈ సినిమా చూస్తే, అది విచిత్రంగా కనిపిస్తుంది అనడంలో సందేహం మాత్రం లేదు. ఈ సినిమా యూట్యూబ్‌లో దొరుకుతున్నది. నిజంగా ఆసక్తి గలవారు దాన్ని చూడడానికి ప్రయత్నించండి. కొంచెం ఓపికగా చూడండి. నాకు సినిమాల గురించి రాసినప్పుడు మ్యూజిక్‌తో మూడు గంటలు పద్ధతిలో మొత్తం కథ చెప్పడం అలవాటు లేదు. ఇక్కడ కూడా కథ చెప్పను. చివరకు ఏమవుతుంది అన్న సంగతి అసలే చెప్పను. అప్పుడుగాని ఆరుగురు అయినా సినిమాను చూస్తారు ఏమో అని నా అనుమానం. అకిరా కురొసావా గొప్ప దర్శకుడు. నేను చెప్పవలసిన అవసరం లేదు. మీరు కూడా నాలాగా ఆ విషయాన్ని మీ అనుభవం ప్రకారం తెలుసుకుంటారేమో అని నా ఆశ.

 

Friday, June 12, 2026

Tuesday, May 19, 2026

Friday, April 3, 2026

Wednesday, March 18, 2026

Thursday, February 26, 2026

ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో గురించి నా వ్యాసం 2వ భాగం


ఉర్దూ రచయిత సాదత్  హసన్  మంటో 

గురించి నా వ్యాసం 2వ భాగం


2

ఇస్మత్ చుగ్తాయి లాగే మంటో కూడా సంచలనాలకు కారణమయి కోర్టు దాకా వెళ్లాడు. అయినా, ఇద్దరిదీ ఒకటే పద్ధతి. నిజాన్ని ఉన్నది ఉన్నట్టు ఎత్తి చూపడం మా ధర్మం అంటారు ఇద్దరు.

            మంటో బతుకుకూడా అదుపులేకుండానే జరిగింది. అతను తెగ తాగేవాడంటారు. ఒక వ్యాసంలో అతనే రోజుకు  ఒక సీసా మాత్రమే తాగానని రాసుకున్నాడు. ఒక కథలో మాత్రం ఒకేనాడు పదిహేను కాయలు లాగించినట్టు కూడా రాస్తాడు. బతుకు, రచనలు అతడిని భయపెట్టిన జాడలు కనిపించవు. ‘అవలక్షణాలు, అనారోగ్యాలు, అపభ్రంశాలు అన్నీ  కలగలసి ఉన్న నా పాత్రలను నేను నావిగా అంగీకరిస్తున్నాను’ అంటాడు మంటో. అతను 42 సంవత్సరాల వయసులోనే  వెళిపోయాడు. అయినా, ఇవాళటి వరకూ అందరినీ తన గురించి ఆలోచించే రకంగా రచనలను వదిలి వెళ్లాడు. చదువుకున్నది అంతంతే అయినా, ఇంగ్లీష్ మీద వల్లమాలిన అభిమానం చూపించాడు. ఫ్రెంచ్, రష్యన్ సాహిత్యాన్ని కూడా అంత అభిమానంగానూ చదివాడు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే, రైల్వే స్టేషన్‌లో బుక్‌స్టాల్ నుంచి పుస్తకాలను దొంగిలించాడు కూడా! విక్టర్ హ్యూగో, ఆస్కార్ వైల్డ్, ఆంటన్ చెహోవ్ రచనలను అనువదించాడు కూడా. ఆ తరువాత అతనికి వాళ్లలాగ తాను కూడా రాయవచ్చును అనిపించినట్టు ఉంది. ఇక ఆగకుండా 24 సంవత్సరాలపాటు 22 కథా సంకలనాలు, 5 రేడియో నాటకాల సంకలనాలు, 3 వ్యాస సంకలనాలు ప్రచురించాడు. బొమ్మలు కూడా గీశాడు. ఒక నవల రాశాడు. ఏడు, ఎనిమిది సినిమాలకు కథ, మాటలు రాశాడు. అంత తక్కువ కాలంలో అన్ని రచనలు చేశాడంటే,  అతనికి అడుగడుగునా కథావస్తువు కనిపించి ఉంటుంది. సమాజంలో అంతటా కుళ్లు ఉండనే ఉన్నది. దాన్ని గురించి అంత విస్తృతంగానూ, వివరంగానూ రాయగలగడం అసలు గొప్ప! ఆ పని చేశాడు గనుకనే, మంటో రచనలను వదలకుండా  చదువుతున్నారు. వాటి గురించి చర్చిస్తున్నారు.

            ఉర్దూ కథా సాహిత్యంలో సాదత్ హసన్ మంటో స్థానం గురించి వర్ణించడం సులభం కాదు. మంటోతో సమానంగా ప్రభావం చూపిన రచయితలు మరెవరూ కనిపించరు. సాహిత్యంలో అతని తిరుగుబాటు పద్ధతి మరెవరికీ చేతకాలేదు.  అతను రాసిన భాష, అతని పేరు తప్ప అతడిని ఒక మతానికి పరిమితం చేయడానికి ఆధారాలు కనిపించవు. నిజానికి ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదు. అది సైనికుల అవసరాలకోసం పుట్టిన ఆధునిక భాష. అందులో అభివ్యక్తి అందుకే సులభంగా వీలయింది! ఆ భాషను వాడుకుని మంటో అన్ని మతాలలోని నమ్మకాలను కడిగే ప్రయత్నం చేశాడు.  అతనికి మతమంటూ ఉంటే అది మానవత్వం మాత్రమే. బడుగు మనుషులు అతనికి దగ్గరివాళ్లు. బాధలు అతను ఎత్తి చూపిన సత్యాలు. మంటో దేశ విభజనను ఒక మతం దృష్టి నుంచి చూడలేదు. ఒక భాష దృష్టి నుంచి అంతకన్నా చూడ లేదు. కేవలం విభజనను ఒక బాధాకర సంఘటనగా మాత్రమే చిత్రించాడు. అప్పుడు జరిగిన దుండగాలు, రక్తపాతాలు,  మానభంగాలు, నగరాల నాశనాలు, అతడిని భూకంపంలా కదిలించాయి. అదే కాలంలో అప్పటి పరిస్థితులను గురించి  కిషన్ చందర్, రాజిందర్ సింగ్ బేదీ, అహ్మద్ నదీమ్ ఖాస్మీ, ఇస్మత్ చుగ్తాయి లాంటివాళ్లు చాలా రచనలు చేశారు. అయినా, అప్పటి పరిస్థితులు మంటో రచనలలో కనిపించినంత స్ఫుటంగా మరెవరి రచనల్లోనూ రాలేదు. మతం పేరిట  మనుషులను విడదీయడం మంటోకు నచ్చలేదు. సంస్కృతిని, నాగరికతను, కళలను, మాట, ఆట, పాటలను పంచుకోవడం కుదరదన్నది అతని వాదన. ఆ విషయాలనే తన పద్ధతిలో చెప్పాడు. ‘టోబా టేక్‌సింగ్’ అన్న కథను ఇవాళటి వరకు ప్రపంచం మరవలేకపోతున్నది.

            మంటో కథలన్నీ ఇంటర్‌నెట్‌లో దొరకుతున్నాయంటే, అతని ప్రభావం గురించి, అది నేటి వరకూ కొనసాగుతున్న తీరు గురించి అర్థమవుతుంది. మంటో మాత్రం ఈ ప్రభావాలను గురించి ఆలోచించనే లేదు. తాను నమ్మిన విషయం గురించి దేవునితోనయినా తలపడేందుకు సిద్ధమేనన్నాడు. ‘లక్షమంది ముస్లింలు, లక్షమంది హిందువులు ఆ సమయంలో హతులయ్యారు అనకండి. రెండు లక్షలమంది మానవులు పోయారు అనండి’ అంటాడు అతను ఒకచోట. దేశం విడిపోయి నప్పుడు అంతమంది చావవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. అందునా, ఏ సంబంధమూ లేని అమాయకులు చావడం అంతకన్నా అర్థంకాదు. ఒక మతం వారిని చంపిన మరొక మతం వారు, ఆ మతాన్నే చంపిన భావంతో సంబరం చేసుకున్నారేమో! కానీ, మతాన్ని తుపాకులతో చంపడం వీలయ్యే పనికాదు అని కూడా మంటో అంటాడు.

            మంటో మాటలు సూటిగా ఉంటాయి. అక్కడ తెరలు, పొరలకు చోటు లేదు. చెప్పవలసిన మాట చెప్పవలసిన బలంతో చెప్పడమే అతని రచనలలోని బలం! ఉదాహరణగా చెప్పడానికి లెక్కలేనని కథలు ఉన్నాయి. ఆ కథల గురించి  ఎంత చర్చ జరిగినా తక్కువే. ‘దేఖ్ కబీరా రోయా’ (చూచి, కబీర్ ఏడ్చాడు) అన్న కథ నభూతో నభవిష్యతి. కథలో కబీర్ లక్ష్మి విగ్రహాన్ని చూచి ఏడుస్తాడు. కాలే కడుపులతో కూడా సైనికులు ఆజ్ఞలను పాటించవలసి వచ్చింది, అని కూడా ఏడుస్తాడు.

            అతని కథలు అప్పట్లో చాలామందికి అర్థం కాలేదన్న అనుమానం పుడుతుంది. ప్రభుత్వంవారు మాత్రం బూతులు అంటూ ప్రతిబంధకాలు వేశారు. అటు రచయితకు, ఇటు పాఠకునికి అనవసరంగా కాలయాపన అన్నారు. కోర్టు కేసులు  చాలాకాలం నడిచాయి. ఇస్మత్ కూడా లాహోర్ వెళ్లి మంటోతోబాటు అక్కడే తన కేసు గెలిచింది. మంటోకు పెద్ద జుర్మానా వేశారు. జుర్మ్ అంటే నేరం. నేను నేరం చేయలేదంటూ మంటో మళ్లీ కోర్టుకెక్కాడు. ఆ కేసు నిర్ణయించవలసిన  జడ్జ్ మంటో మతానికి చెందినవాడే. సముద్రంగా చేరిన రక్తంలో నుంచి పశ్చాత్తాపం అనే ముత్యాలు కనీసం బయటికి రావాలన్నాడు మంటో. ఆ మాట ప్రజలకు పట్టలేదు. మొత్తానికి జడ్జ్ కేసును కొట్టివేశాడు. లేకుంటే, ఒక గడ్డం వాడు నాకు  శిక్ష వేశాడని మంటో ఒక కథ రాస్తాడు అంటూ, ఆ జడ్జ్ చమత్కరించాడు.

            1955లో మంటో మరణించాడు. అంతకు కొంతకాలం ముందే అతను ‘పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లు తనను మెచ్చి  తన శవపేటిక మీద ఒక మెడల్ పెడతారంటూ, అది తనకు అవమానంగా నిలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం అంతపనీ చేసింది! మంటో శతజయంతి సంవత్సరంలో అతనికి ‘నిషాన్``ఇమ్‌తియాజ్’  అనే బిరుదుతో పతకాన్ని ఇవ్వనే ఇచ్చింది.         మంటో భారతీయుడు కాడంటే అన్యాయం. అతను పాకిస్తానీ అన్నా అన్యాయమే. మంటోకు ఒక దేశం లేదు. ఒక మతం లేదు. మానవత్వమే అతని మతం. మంచి అన్నదే అతని తీరు.

            ఈ ప్రపంచంనిండా సమస్యలు మాత్రమే కాదు, కుళ్లు నిండుకుని ఉన్నది. దాన్ని ఎత్తి చూపించకుంటే, అది ఎవరికి పట్టకుండా కొనసాగుతుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా, ఎవరూ దాన్ని గురించి మాట్లాడరు. రచనలు అంతకన్నా చేయరు. ఏవో మంచి మాటలతో కాలక్షేపం చేస్తారు. వివాదాలను సృష్టించి, సమాజాన్ని నిద్ర నుంచి మేల్కొల్పాలి, అనుకునే రచయితలు అరుదుగా మాత్రమే కనపడతారు. అక్కడక్కడ కొందరు రచయితలు ధైర్యం చేసినా, విషయాన్ని  కొన్ని సమస్యలకే పరిమితం చేస్తారు. సమాజంలో అట్టడుగువర్గాలుగా ఉన్న పనివాళ్లు, సానివాళ్లు, దురలవాట్లకు లోనయి కుళ్లుతున్నవాళ్లు కథా వస్తువులుగా కనిపించడం అరుదే! యమకూపం అనే పేరుతో తెలుగులో వచ్చిన రష్యన్ నవల ‘యామా`ద పిట్’ వంటి రచనలకు మన సాహిత్యంలో చోటు ఉందా? సాదత్ హసన్ మంటో కథలలో కొన్నింటిని గురించి చర్చించే ధైర్యం మనకు మిగలి ఉందా? మంటో రచనలలో అందమయిన మనుషులకు చోటు లేదు. కథ ఎంత అందంగా నడిచినా, అందులో విషయం ఆనందకరంగా మాత్రం ఉండదు. మంటో రచనలలో సెక్స్ మరీ బాహాటంగా కనిపిస్తుంది. ఆడవాళ్ల వర్ణనలు కూడా కనిపిస్తాయి. కానీ, చదవరికి అవి గిలిగింతలు పెట్టవుకాక పెట్టవు. పైగా, అసహ్యం కలిగిస్తాయి! ఆలోచనలేని పాఠకునికి మంటో వెకిలి రచయితగా కనిపించవచ్చు. కానీ, మంటో మనసులోని బాధ అందితే మాత్రం, ఆ తరువాత కొంత కాలం అది దెయ్యంలా వెంటాడుతుంది.             మంటో గొప్ప కథలు తెలుగులో సంకలనాలుగా వచ్చినట్టున్నాయి. రాకుంటే మాత్రం ఆ దిశగా ప్రయత్నం జరగాలి. ఆయన రచనల్లో అందరూ చదివి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి మీద గట్టి చర్చలు జరగాలి. ఆ లోగా మంటో తీరు గురించి పరిచయం చేసుకోవడం సాహిత్యాభిమానుల, మానవతావాదుల కనీస కర్తవ్యం.

 




 

Tuesday, February 24, 2026

లోకాభిరామం : మాటా - మంతీ On languages and speaking.


లోకాభిరామం : మాటా - మంతీ 

On languages and speaking.


మాటా - మంతి

మాట అంటే ఏమిటో తెలుసు. మంతి అంటే ఏమిటో తెలియదు. ప్రాసగా ఉంటుందని బహుశా మాటతోబాటు మంతి అని చేర్చి ఉంటారు. బాపుగారు వేసిన ఒక కార్టూన్‌ గుర్తుకు వస్తుంది. ఒక పెద్దాయన చేతికి కట్టుగట్టుకుని దీనంగా ఉంటాడు. అతని మిత్రుడు ఏమిటి? అన్నట్టు చూస్తుంటాడు. “కూర ఏమిటి అన్నాను. మా ఆవిడ కంద అంది. ప్రాస కుదిరింది కదా అని నీ బొంద అన్నాను” అన్న అక్షరాలు బుడగలో ఉంటాయి. మీకు ఈ మాటలు అర్థమయ్యాయి, నవ్వు కూడా వచ్చిందని నమ్మకంగా ఉంది.
ఇంతకూ, మీకు ఏమి అర్థమయింది? ఎందుకు అర్థమయింది? తరువాత నవ్వు వచ్చి, గిచ్చి ఉంటే ఎందుకు వచ్చి చచ్చింది? పుచ్చు ప్రశ్న అనకండి. చదువుతూ పొండి. అంటే వింటూ పొండి. మెచ్చుకోవడం గురించి తరువాత ఆలోచిద్దాం.
మీరేదో చప్పుడు చేస్తారు. ఎదురుగా ఉన్నవాళ్లు అర్థమయినట్టు ఏదో చేస్తారు. మీరు చేసిన అన్ని ధ్వనులూ అందరికి
అర్థమవుతున్నయా? కొన్ని ధ్వనులను, అర్థం ఉండే ధ్వనులను అంటే, మాటలను మాత్రమే మీ పక్కనున్న వారు అర్ధం చేసుకుంటున్నారా? ఆలోచించండి. బుర్రను చించండి.
మనిషి శరీరంలో, ప్రత్యేకంగా గొంతులో ధ్వనులను పుట్టించే వీలున్నది. మాట అన్నది ఉన్నదన్న సంగతి తెలియనినాడు మనిషి అన్నవాడు తన భావాలను సైగలతోనే చెప్పుకుని ఉంటాడు. ఆ తరువాత మూలుగులు, కేకలు, మొదలయి ఉంటాయి. జంట అక్షరాలు, మరిన్ని పెద్ద పదాలు పుట్టి ఉంటాయి. క్షమించండి, నాకు భాష పుట్టుక గురించి ముక్క తెలియదు. ఆలోచించడం, ఊహించడం కొంత చేతనవుతుంది. కనుక, ఏదేదో చెప్పేస్తున్నాను. పాత మానవుడుగాని, ఇక మీరు అనే కొత్త మానవుడుగాని మాట్లాడి ఎదుటివారు అర్ధంచేసుకోవాలని అనుకుంటే, ఒక మాటకు మీరనుకున్న అర్థమే ఎదుటి మనిషి మెదడులోని నిఘంటువులో కూడా ఉండి తీరాలి. సూటిగా ఒక్కమాటలో చెప్పాలంటే, ఇద్దరికీ ఒక భాష, ఒకే భాష తెలిసి ఉండాలి. ఒకే భాషలో ఒకే మాటకు రకరకాల అర్థాలు ఉండే పరిస్థితి దాకా ఇప్పుడు మనం పోనవసరం లేదు. భాష అంటే మాటలకు అర్థాలు ఒకేరకంగా తోచే ధ్వనుల పద్ధతి అనవచ్చా? నేనయితే అంటున్నాను.
అర్థం అని సులభంగానే ఉంటున్నాము గాని, అభివృద్ధిచెందిన భాషలలో కూడా ఒకే అర్ధం ఉన్న మాటకు బోలెడు అర్థాలు ఇవాళిటికీ తోస్తున్నాయి. అంటే, భాష అన్నది చేతికి అందే ఒక పదార్థం కాదు. ఏ చెట్టు మీదా కాయడం లేదు. అంతరిక్షంలో అంతకన్నా లేదు. ఎవరో 'చెప్పు' అన్నారనుకుందాము. ఆ రెండు అక్షరాలు ఒక పదార్థం. అవి రెండూ కలిసి గాలిలో అలలను పుట్టించాయి. అలలు వచ్చి వినేవాళ్ల చెవులకు తగిలాయి. అక్కడ అణువులు కదిలాయి. నాడులు పనిచేశాయి. మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. విన్నది ఎవరన్నదాన్ని బట్టి, మాట అర్థం వేరు వేరుగా తోస్తుంది. సైంటిస్ట్‌కు మొట్టమొదలు ఆ రెండు అక్షరాలు ఒక ధ్వనిగా తోస్తాయి. అది పుట్టిన చోటు తెలుస్తుంది. కదిలిన తీరు తెలుస్తుంది. అలల నిడివి పట్టి ఆడ, మగ గొంతు తేడా తెలుస్తుంది. వయసు తేడా తెలుస్తుంది. వీటన్నిటిలో టార్చ్‌ వేసి వెతికినా, మాట అర్ధం మాత్రం తెలియదు.
చెప్పు” అన్న ఈ శబ్దానికి అర్ధం కూడా ఉండి తీరాలి. ఉంది మరి. అర్ధం ధ్వనిలో లేదని అర్థమయింది. ఆ పరమార్థం
మరెక్కడో ఉంది. అది మెదడులో ఉంది. అర్థమయ్యే తీరునుబట్టి ‘ఏం చెప్పమంటావు?' అన్న జవాబు రావచ్చు. “ఒకటా రెండా? చెప్పు ఏమిటి? జత ఉండాలికాని!' అన్న జవాబు కూడా రావచ్చు. జవాబు రాకుండానే జయలలిత గారి చెప్పుల దృశ్యం మనసులో మెదిలి ఉండవచ్చుకూడ. బాటకాని బాటావాని అంగడి గుర్తుకు వచ్చి ఉండవచ్చు కూడా. దారి పక్కన కూర్చుని తన పని తాను చేసుకుంటున్న ముసలి మోచీ తాత గుర్తుకు రావచ్చు కూడా! అన్నది ఒక్క మాట. కానీ ఎన్నెన్నో దృశ్యాలు, ఎన్నెన్నో ఆలోచనలు!
పుట్టిన దృశ్యాలు, ఆలోచనలు అన్ని కలిసి తెలుగులోనే తిరుగుతున్నాయి. ఇక మరొక భాష గురించి కూడా ఆలోచిస్తేఏమవుతుందో చెప్పలేము. చెప్పు అన్న మాటకు ప్రపంచభాషలలో మరెక్కడయినా వేరు అర్థాలు ఉన్నాయేమో వెతకాలి. వెతకడం చేతగావాలేగాని తప్పకుండా ఉండే ఉంటాయి. గొప్ప వైవిధ్యం వీలవుతుందనుకున్న మనిషి గొంతు కూడా పుట్టించగలిగేది కొన్ని మాటలను మాత్రమే. కనుక దేశ కాలాలనుబట్టి ప్రపంచంలో మూలలలో ఎక్కడో ఈ మాటకు మరొక అర్థం ఉండనే ఉంటుంది. కనీసం ఇలాగే వినిపించే మాటలు కొన్ని ఉండే ఉంటాయి. వాటన్నింటికి అర్ధం మనకు తెలియక పోవచ్చు.
స్వాప్‌” అని ఒక మాట ఉంది. ఇంకో మాట ఏదో ఉంది. వీటికి అర్ధం తెలియదంటే మన చెవులు సరిగా పని చేయడం లేదని మాత్రం అర్ధం కానేకాదు. చెవులకు తెలిసేది ధ్వని మాత్రమే. అది భౌతికమయిన విషయం. ఆ మాటలను వేరు వేరు రకాలుగా అన్నా సరే, వినబడి తీరుతుంది. మరి వాటికి ఉండే అర్ధం లేదా అర్థాలు మాత్రం చేతికి అందే సంగతులు కావుకదా?
తెలియని భాషలో ఎవరయినా ఒక ప్రశ్న అడిగితే, వినిపించినా సరే వినిపించనట్టు బేల ముఖం వేయడం తప్ప మనం చేయగలిగింది మరొకటి ఉండదు. దాస్‌ తో కలకత్తా వీధులలో తిరుగుతున్నాను. దూరంగా ఎత్తయిన భవనం మీద ఒక హోర్డింగ్‌ కనిపించింది. అందులో తాటికాయలను, తలకాయలను తలదన్నే రీతిలో కారు సైజు కాదంటే గుడిసె సైజులో పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. “సాధనా షధాలయ్‌' అని గట్టిగానే చదివాను. దాస్‌ ఎగిరిపడినంత పనిచేశాడు. “నీకు బెంగాలీ వచ్చా?” అని అడిగాడు. అడిగింది మాత్రం బెంగాలీలో కాదని మనవి. నాకు బెంగాలీ రాదు. ఖంగాళీ అంతకన్నా రాదు. అంతోకొంతో హిందీ వచ్చు. కనుక నాగరి అక్షరాలు తెలుసు. బెంగాలీ అక్షరాలు నాగరిలోలాగే ఉన్నాయి. ఇంతకూ దాస్‌ నన్ను ఏ భాషలో ప్రశ్న అడిగి ఉంటాడు? ఆలోచించండి చూద్దాం! అది కలకత్తా అని చెప్పి పూర్వ రంగం వేశాను. మనిషికి దాస్‌ అని పేరు పెట్టి మరింత బెంగాలీ రంగు పూశాను. ఆ బెంగాలీ మనిషికి నా మాతృభాష అయిన తెలుగు వచ్చి ఉండే అవకాశం చాలా తక్కువ. వస్తే గిస్తే మా ఇద్దరికీ కలిసి ఇంగిలీషు లేదంటే హిందీ వచ్చి ఉంటాయి. దాస్‌ తప్పకుండా ఈ రెంటిలోనూ ఏదో ఒక భాషలో అడిగి ఉంటాడు అని సులభంగానే ఊహించవచ్చు.
నేను పిల్లిని సంచీలోనుంచి బయటకు వదిలేశాను. అంటే, రహస్యమేదో చెప్పేశాను. పిల్లిని సంచీలోనుంచి వదలడం అంటే రహస్యం చెప్పడం అని అర్థం వచ్చే తీరు తెలుగు భాషలో లేదు. అది ఇంగ్లీషులో మాత్రమే ఉంది. ఇంగ్లీషు ప్రభావంతో ఇటువంటి మాటలు మనం కూడా నేర్చుకుని వాడేసుకుంటున్నాము. మంచి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికమీద చేస్తున్నాము. వార్‌ ఫూటింగ్‌ అన్న మాట అసలు సిసలు ఇంగ్లీషు పద్ధతి. ఎక్సర్‌సైజ్‌ కూడా ఇంగ్లీషు మాటే. దానికి ఒక పని లేదా ప్రయత్నం అని అర్ధం. మాటకు ఉన్న నానార్థాలలో వ్యాయామం, కసరత్తు అనేవి కూడా ఉన్నాయి. బహుమతికి ఒక వ్యక్తిని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలయింది అని వాక్యం రాస్తున్నారు. ఇక్కడ రాసిన వాళ్లు ఎక్సర్‌సైజ్‌ అనే మాటకు కసరత్తు అన్న అర్థాన్ని అసందర్భంగా వాడుకుంటున్నారని వేరే చెప్పాలా? ఇంతకు మనం అనగా నేను, తరువాత మీరు కొమ్మలు దూకినట్టున్నాము. అనగా శాఖాచంక్రమణము చేసితిమని అర్థము. అనగా అసలు విషయము వదిలి ఎక్కడో పక్కకు కదిలితిమని అర్ధము. కావున, అనగా, అనగా తిరిగి పాతకొమ్మకు చేరుదము గాక!




 

Wednesday, February 11, 2026

లోకాభిరామం - సత్యం - అసత్యం

 


https://youtu.be/2eIzFBKAJ0E

Link for the video

సత్యం - అసత్యం

ఒకసారి సంక్రాంతి పండుగకు నల్లగొండలో ఉన్నాను. అప్పటికి నేను రేడియోలో పనిచేస్తున్నాను. ఆ సంవత్సరం పండగ ఏనాడు జరుపుకోవాలి అన్న అనుమానం చాలా మందికి వచ్చింది. ప్రభుత్వం వారు ఒక సంగతి నిర్ణయించారు. కానీ సాంప్రదాయ పరులు మాత్రం మరొక మాటగా నిర్ణయించుకున్నారు. రేడియో అన్నది ప్రభుత్వం వారి బాకా కనుక నేను వారు చేసిన నిర్ణయం ప్రకారం పండుగ పలానా నాడు అని వివరాలను ప్రకటించాను. వ్యక్తిగతంగా మాత్రం పాత పద్ధతులను పాటిస్తున్నాను కనుక పండుగ నేను ప్రభుత్వం చెప్పిననాడు చేసుకోవడం లేదు. పక్కింట్లో ఒక అక్కయ్య ఉండేది. ఆమె ఆదరాబాదరాగా వచ్చింది. మా ఆవిడను నిలదీసి పండుగ ఇవ్వాలంట కదా, రేడియోలో చెబుతున్నారు, అని అడుగుతున్నది. నేను ఆమెను పిలిచాను. అమ్మా, ఎవరు చెబుతున్నారు అని అడిగాను. ఒక క్షణం ఆలోచించి ఆమె, అయ్యో అది మీ గొంతు, అన్నది. తరువాత వాళ్ళు పండుగ ఏనాడు చేసుకున్నారో నాకు తెలియదు. ఈ ప్రపంచంలో సత్యాలు అలా ఉంటాయి. రచయితగా కొనసాగుతున్నాను. కథలు కాక సత్యాలు రాస్తున్నాను అనుకుంటున్నాను. కనుక ఏ రెండు అక్షరం ముక్కలు కాగితం మీద పెట్టినా వాటిలోని సత్యాసత్యాలను గురించి గట్టిగా ఆలోచించాలి అన్న ఒక పద్ధతి మెదడులో గట్టిగా పాతుకుపోయింది. ఏదో రాస్తాము. సందర్భానికి తగినట్టుగా బహుశా రాసి ఉంటాము. కొంతకాలం తరువాత ఆ పరిస్థితులు మారుతాయి. అప్పుడు మనం రాసిన సంగతులు సత్యం కాకుండా పోతాయి. ఎవరో వచ్చి అప్పటి రాతల గురించి అడుగుతారు. చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది.

సత్యాలు లక్షల కొద్దీ ఒకచోట చేర్చినా వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని ఎక్కడో రాసి ఉండటం చదివాను. ఇంగ్లీషులో ట్రీవియా అని ఒక మాట ఉంది. అవి సత్యాలే. కానీ ఎవరికి పనికి వస్తాయో తెలియదు. వాటిని తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఉందా లేదా కూడా తెలియదు. అయినా అవి సత్యాలు. బహుశా సరదాగా ఉంటాయి. కానీ ప్రపంచం మొత్తం దీనికి విపరీతమైన పద్ధతిలో జరుగుతున్నది.

పొద్దున్నే వార్తాపత్రిక వస్తుంది. అందులో రకరకాల సంగతులు రాసి ఉంటాయి. ఆ వార్తా పత్రిక కలకాలం ఉండిపోతుంది. కానీ అందులో రాసిన సంగతులు కొన్ని సత్యాలు కావు అని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఒక ప్రమాదం జరుగుతుంది. అందులో హతులైన వారి సంఖ్యను ఏ రెండు పత్రికలు సమానంగా చూపించవు. ఆ తేడా ఎందుకు వస్తుంది నాకు అర్ధం కాలేదు. ఎవరికి అనుకూలంగా ఉండే విషయం, అందుబాటులో ఉండే విషయాన్ని వారు చెబుతారు అని నా అనుమానం. రోడ్డు మీద ఒక సంఘటన జరుగుతుంది. దాన్ని అందరూ చూస్తారు. మరునాడు దాన్ని గురించి పేపర్లో వస్తుంది. అక్కడ జరిగింది ఒకటయితే, దాన్ని గురించి రాసిన తీరు మరొకటిగా ఉంటుంది. పరిస్థితి అలాగ ఉందని ముందుకు వచ్చి ప్రశ్నించే వారు ఉండరు.

నేను ఒక బిల్లింగ్‌ లో,నా ఇంట్లోనే ఉన్నాను. ఆ బిల్డింగ్‌ లో కింద ఖాళీగా ఉండవలసిన ప్రాంతాన్ని యజమాని తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. మునిసిపాలిటీ వాళ్ళు వచ్చారు. గోడలో 4 ఇటుకలు పడగొట్టారు. ఆలోగా యజమాని వచ్చి వారి పద్ధతిని మార్చే ప్రయత్నం ఏదో చేసినట్టు ఉన్నాడు. గోడ సలక్షణంగా అలాగే ఉండిపోయింది. మరు రోజు పత్రికలో కింద సెల్లార్‌ పూర్తిగా పడగొట్టినట్టు వార్త వచ్చింది. గోడలు పడగొట్టే బాధ్యతగల మున్సిపాలిటీ వారు అటువంటి వార్తలు పత్రికకు అందజేశారు. వారు సత్యాసత్యాలను తెలుసుకోకుండా ప్రచురించారు. నేను ప్రయత్నించి ఆ పత్రికకు ఫోన్‌ చేశాను. అక్కడి వారు నన్ను దుర్భాషలాడారు కానీ, అసలు విషయం వినడానికి కూడా ప్రయత్నించలేదు. పత్రిక శాశ్వతంగా నిలబడిపోతుంది. అందులోని అబద్ధం శాశ్వతంగా నిలబడిపోతుంది. కూలినట్టు రాసిన ఆ గోడ కూడా శాశ్వతంగా నిలబడి ఉంది. ఇది ఈనాటి సత్యం.

సత్యం వెనుక ఒక తత్వం ఉంటుంది. పత్రికలో వచ్చింది తెలుసా? అనే మాట నేను చాలా సార్లు విన్నాను. అంటే పత్రికల్లో వచ్చేవి అన్ని సత్యాలు కావు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని కదా అర్థం! ఇక విషయానికి వస్తే, అవి పత్రికల కన్నా వేరుగా ఉంటాయి అని నేను అనుకోను. చాలా విషయాలు ఇట్లాగే అరకొరగా పుస్తకాలలోకి చేరుకుంటాయి. అవి శాశ్వతంగా నిలబడతాయి. తర్వాతి ప్రపంచాన్ని మోసపుచ్చుతాయి. జరిగిన విషయాలను జరగనట్టు, జరగని విషయాలను జరిగినట్టు చరిత్ర చెబుతూ ఉంటుంది. కనుక చరిత్రను నమ్మడానికి లేదు. చరిత్ర అన్నది నిజంగా సత్యం అయితే ప్రపంచం ఇలాగే ఉండేది కాదు. చరిత్ర ఎవరు చెప్పారు? ఏ ప్రయోజనం కొరకు చెప్పారు అన్న దాన్ని బట్టి అందులోని సత్యాసత్యాల నిగ్గు తేలవలసి ఉంటుంది. బ్రిటిష్‌ వారు భారతదేశపు చరిత్రను తమకు అనుకూలంగా రాసుకున్నారు అన్న వాదం బలంగా ఉంది. అసలు చరిత్రను గురించి చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉన్నట్టు కనిపించదు. కనుక ఎవరు చెప్పినది అయినా మొత్తానికి ఒక చరిత్ర చలామణి అవుతూ ఉంటుంది.

పాశ్చాత్య దేశాలలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల వారు భారతదేశపు చరిత్రను విస్తృతంగా రాయించి పుస్తకాలుగా వేశారు.

వాటన్నిటినీ కాకున్నా కొన్నిటిని చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో అక్కడక్కడ తేడాలు కనిపిస్తాయి. ఆ తేడాలను గురించి ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, అర్ధం కాదు. చరిత్రలో మధ్యన ఖాళీలు కనిపిస్తాయి. వాటికి కారణం మాత్రం ఎవరు చెప్పరు. వెండీ డోనిగర్‌ అనే ఆవిడ భారతదేశపు గతం గురించి ఒక పుస్తకం రాసింది. అది నాకు చాలా పక్షపాత దృష్టితో రాసినట్టు కనిపించింది. అట్లా రాయవలసిన అవసరం ఏమిటో తెలియదు. అలాగే ఇర్ఫాన్‌ హబీబ్‌, రొమిల్లా థాపర్‌, మరొక ప్రసిద్ధ బెంగాలీ చరిత్రకారుడు మొదలైన వారి పుస్తకాలన్నీ అవి ఇంకొక ధోరణిలో ఉంటాయి. అన్ని చదువుతూ ఉంటే అసలు సంగతి ఏమిటి అన్న అనుమానం మొదలవుతుంది. కొన్ని సత్యాలు, అసత్యాలుగా రుజువయ్యే వరకు మాత్రమే నిలబడి ఉంటాయి అన్న పద్ధతి ఒకటి ఉంది. సైన్స్‌ లో ముఖ్యంగా శాశ్వత సత్యాలు ఉండవు అంటారు. సైన్స్‌ అంటే సత్యాల పరంపర అని కూడా వాళ్లే అంటారు. సూచించిన పరిస్థితులలో మాత్రమే, ఈ విషయాలు సత్యాలు అన్న ఒక రైడర్‌ ప్రతి సత్యం మీద ఉంటుంది. నీరు నూరు డిగ్రీల వద్ద మరుగుతుంది, అన్నది ఒక సత్యం. కానీ

ఆ స్థలంలో వాతావరణ ఒత్తిడి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఈ సత్యం మారుతూ ఉంటుంది. అంటే అది శాశ్వత సత్యం కాదు. మరొక విధంగా రుజువయ్యే వరకు మాత్రమే సత్యాలు అనేవి మరికొన్ని ఉన్నాయి. ఐన్‌స్టెన్‌ ఒక సిద్ధాంతం చేశాడు. అందరూ అవును అంటూ ఆశ్చర్యపోయారు. కొంతకాలానికి మరొక పరిశోధకుడు వచ్చి, ఆయన చెప్పింది నిజం కాదు తెలుసా అంటాడు. అప్పుడు అందరూ అంగీకరిస్తారు. చరిత్ర విషయంలో కూడా ఇటువంటి పద్ధతిని పాటించవచ్చు అంటే కొంచెం చిక్కులు వస్తాయి కొంచెం చిక్కులు.

కొన్ని సంగతులు అందరికీ తెలిసి ఉంటాయి. కానీ ఎవరూ ముందుకు వచ్చి ఇది అసలు నిజం అని చెప్పడానికి సిద్ధం కారు. అందుకు సామాజిక కారణాలు, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఆ విషయం గురించి సత్యాన్ని నిరూపించవలసిన అవసరం కూడా అందరికీ ఒకే రకంగా ఉండదు. అందరికీ తెలిసిన ఆ సత్యం అలాగే బయటపడకుండా నిలబడిపోతుంది.

వ్యక్తిగతమైన అంశాలలో ఇటువంటి పరిస్థితి మరీ ఎక్కువగా వస్తుంది. నా విషయంలోనే నాకు కొన్ని సంగతులు తెలుసు. నేను వాటిని ఎవరికీ చెప్ప వలసిన అవసరం లేదు. చెప్పనందుకు ఎవరికీ అపకారం కూడా జరగదు. కనుక నేను వాటిని బయటకు చెప్పను. ఒకవేళ చెపితే అది కొంతమందికి ఆసక్తికరంగా ఉండవచ్చు. మరికొంతమందికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయినా నేను కొన్ని సంగతులు బయట పెట్టను. ఆ సత్యం నాలోనే మిగిలిపోతుంది. నాకు చాలా రోజులుగా కథలు నవలలలో ఎదురైన కొన్ని సంగతులను గురించి మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేదిలో దయానిధికి, కోమలికి మధ్యన శరీరపరంగా ఎటువంటి సంబంధం లేదు. మానసికంగా ఏమి ఉందో ఎవరికి అర్థం కాదు. అమృతంతో ఏం జరిగింది అన్నది బయటపడదు. ఇదే రకంగా ప్రపంచ విఖ్యాత రచయిత ఆల్బర్ట్‌ కామూ నవలలో కూడా చిత్రమైన పరిస్థితులు పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. నాయకుడు అమాయకుడు అని పాఠకునికి తెలుసు. కథలోని వారికి మాత్రం తెలియదు. కనుక కథ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. అందరూ అతడిని అసహ్యించుకుంటారు. మనకు అసలు సత్యం తెలుసు గనుక, ఆ అసహ్యించుకునే వారి మీద కోపం పుడుతుంది. రచనకు రూపం పోయడంలో ఇంత కన్నా గొప్ప పద్ధతి మరొకటి ఉండదు అనిపిస్తుంది. ఇటువంటి ఉదాహరణలు చాలా చెప్పగలను. కనుకనే నాకు సత్యం గురించి గట్టి ఆలోచనలు పుడుతుంటాయి.

తెలుగు సినిమాలలో, బహుశా ఇతర భాషలలో కూడా, ఒక వ్యక్తి ఒక సత్యం చెప్పనందుకు మొత్తం సినిమా నడుస్తుంది. అవి నేను బనారస్‌ లో చదువుకుంటున్న రోజులు, అంటూ ముఖం మీద రింగులు చూపించి అసలు సత్యం బయట పెడతారు. అప్పుడు కథ ముగుస్తుంది. సత్యాలు నిజంగా ఉంటాయా అన్న అనుమానం నాకు కలుగుతుంది. పదుగురాడుమాట పాటియై ధర చెల్లు అని ఒక మాట ఉంది. అందరూ కలిసి అదేపనిగా ఒక సత్యాన్ని లేదా అసత్యాన్ని బలంగా నమ్మి ప్రచారం చేయడం మొదలుపెడతారు. అప్పుడు సత్యంగా మిగిలిపోతుంది. కలియుగమున శక్తి మొత్తం సంఘము లోనే ఉన్నది అని అర్ధం వచ్చే ఆర్యోక్తి ఒకటి మనకు ఉండనే ఉంది. అంటే ఈ సంఘం అనే విషయాన్ని సత్యం గా ముందుకు తీసుకుపో దలుస్తుందో దాన్ని మాత్రమే సత్యంగా గ్రహించ వలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు ఉన్నాడు అనఉన్నాకా ఇటువంటి సత్యానికి మొదటి ఉదాహరణ అని నా అభిప్రాయం. దేవుడు అంటే దేవులాట అనే పనిచేయడం. అంటే వెతకడం. దేవుడు అంటే వెతకడం అని అర్థం. ఇక్కడ మార్గమే గమ్యం. ఆ దేవులాట ముగిసి దేవుడు దొరికితే ఆ తర్వాత ఏం చేయాలి? అది సమస్య! కనుక కలకాలం దేవులాట సాగాలి.

ఒకరికి సత్యంగా తోచింది మరొకరికి అసత్యంగా తో చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరు వాదించుకుంటున్నారు. మూడవ మనిషి వచ్చాడు. మీ మధ్యన మూడు సత్యాలు ఉన్నాయి. మీరిద్దరూ ఎవరికి వారు నమ్ముతున్నవి రెండు అయితే మీరు కలిసి చేరవలసిన అసలు సత్యం మూడవది అన్నాడు ఆ మూడో మనిషి. అతనికి కూడా 3 సత్యాలలో ఏదీ తెలియదు. వీళ్లు తమ తమ రెండు సత్యాలను చెప్పినప్పటికీ అతని బుద్ధి ప్రకారం వాటిలో ఒకదానిని ఎంచుకో గలదేమో కానీ, అసలైన మూడవ సత్యం ఉంది అని అన్నప్పటికీ దాన్ని అతను చూడగలుగుతాడా? అన్నది అసలు ప్రశ్న. అన్ని విషయాలు, అన్ని సత్యాలు నూటికి నూరుపాళ్లు సత్యం కావడానికి వీలు లేదు. కొన్ని మాత్రమే పూర్తి సత్యాలు కలుగుతాయి. మరికొన్ని పాక్షిక సత్యాలు గా ఉంటాయి. కల్తీ కలిసినప్పుడు ఒక సత్యం, సత్యం గా నిలబడడం కష్టమవుతుంది.

అందరికీ అనుకూలంగా వినిపించని ఒక విషయం చెబుతాను. ఈ మధ్యన యూరోపు దేశాల నుంచి వచ్చిన ఒక అపరాధ పరిశోధక నవల చదివాను. మొదటినుంచి నాకు మెదడు లో ఈ విషయం గురించి ఆలోచన ఉన్న దాన్ని మరీ ముందుకు తీసుకు పోలేదు. విషయం చెప్పిన తరువాత మీకే అర్ధం అవుతుంది. ఒక వ్యక్తికి తల్లి ఎవరు. అన్న సంగతి నూటికి నూరు శాతం నిజంగా తెలిసి ఉంటుంది. అందులో ఏమాత్రం తేడా రావడానికి అవకాశం లేదు. కానీ ఆ వ్యక్తికి తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం సాంఘిక మర్యాద ప్రకారం అంగీకరించవలసినదే కానీ ఆ తల్లి నోరు విప్పి చెప్పే దాకా అసలు విషయం బయటకు రాదు. ఈ ప్రపంచంలో ఆడవాళ్ల అందరిని నేను అనుమానించడం లేదు. కానీ చాలా మంది ఈ రకమైన పరిస్థితులకు గురి అయినట్లు నాకు గట్టి అనుమానం. వ్యవస్థలో ఎంతటి గట్టిదనం ఉన్నప్పటికీ మనుషుల మెదడులో మాత్రం అది ప్రతిబింబించదు. ఆడ మగ ఆనాటి నుండి ఈనాటి వరకు తమ ఇష్ట ప్రకారం లైంగిక జీవితాలు గడుపుతున్నారు. సమాజంలోని సమస్యలకు సగం వరకు లైంగిక సంబంధాలే కారణం అని మానసిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. పురాణకాలం నుంచి మొదలు ఇవాళ టి వరకు ఇటువంటి పరిస్థితులను గురించి మనకు కావలసిన అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. సినిమాల గురించి నేను చేసిన ప్రసక్తి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక భాగంగా నిలబడుతుంది. సత్యం అన్నది సంపూర్ణ సత్యమా, సాపేక్ష సత్యమా, అన్న ప్రశ్న వచ్చిన తరువాత అది సత్యమే కాదు.