Showing posts with label Life. Show all posts
Showing posts with label Life. Show all posts

Monday, June 15, 2026

పడుచుదనం Japanese Folk tale Retold in Telugu


పడుచుదనం 

Japanese Folk tale Retold in Telugu

అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కొండల మధ్యన ఒక కట్టెలు కొట్టే మనిషి తన భార్యతోపాటు ఉండేవాడు. వాళ్లు నిజానికి చాలా ముసలివాళ్లు. కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళతాడు. కట్టెలు కొట్టి తెస్తాడు. పెళ్లాం ఇంటిపట్టునే ఉంటుంది. నేతపని చేస్తుంది.
ఒకరోజున ముసలతను అడవిలో అలవాటు కన్నా ఎక్కువలోతుకు వెళ్లాడు. ఒక ప్రత్యేకమయిన కర్ర కోసం చూస్తూ అతను అలా వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా అనుకోకుండా ఒక చక్కని నీటిబుగ్గ కనిపించింది. దాన్ని అతను అంతకుముందెన్నడూ చూచి ఎరుగడు. బుగ్గలోనుండి చిమ్ముకువస్తున్న నీరు చిత్రంగా చాలా బాగుంది. చల్లగా కూడా ఉంది. అప్పటికే అతనికి బాగా దప్పిగా ఉంది. ఆనాడు ఎండ బాగా కాస్తున్నది. అతను కష్టించి పనిచేశాడు. కనుక వెంటనే ముసలాయన తన గడ్డిటోపీ పక్కన పెట్టాడు. మోకాళ్లమీద కూచుని ముందుకు వంగాడు. కావలసినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు చాలా బాగనిపించాయి. అవి మామూలుగా లేవు, అనిపించాయి. నీటిలో ముసలతనికి తన ముఖం కనిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. అది నిజంగా తన ముఖమే. కానీ పాత అద్దంలో ఇంటిదగ్గర ప్రతినిత్యం కనిపించే ముఖం మాత్రం కాదు. అందులో ఒక అందమయిన యువకుడు కనిపిస్తున్నాడు. ముసలాయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
అతను రెండు చేతులను ఎత్తి తలమీద పెట్టుకున్నాడు. ఒక క్షణం కిందవరకు అది బట్టతల. దానిమీద వెంట్రుకలు లేనేలేవు. ఇప్పుడు మాత్రం నల్లని, చిక్కని జుట్టు చేతికి తగిలింది. ముఖం కూడా చిన్నపిల్లవాని ముఖంవలె నునుపుగా తాకింది. ముదుసలి ముడతలన్నీ మాయమయ్యాయి.
అదే సమయంలో అతనికి ఒంట్లో గొప్ప శక్తికూడా వచ్చినట్టు తోచింది. ఆశ్చర్యంగా తన కాళ్లు, చేతులవేపు అతను చూచుకున్నాడు. అంతకుముందు వరకు అవి ముసలితనానికి గుర్తులుగా ఉండేవి. ఇప్పుడు మాత్రం నిండుగా కండరాలు తేలి కనబడుతున్నాయి. అనుకోకుండానే అతను పడుచుదనం బుగ్గ నుండి నీరు తాగాడు. పడుచువాడు అయ్యాడు. నీళ్లు అతనిని మార్చివేశాయి.
విషయం అర్థం అయింది. వెంటనే అతను సంతోషంతో ఒక కేక వేశాడు. గాలిలోకి ఎగిరాడు కూడా. వీలయినంత వేగంగా అంతకుముందు ఎన్నడూ లేనంత వేగంగా ముసలతను ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లోకి కాలుపెడితే ఎదురయిన పెళ్లాం భయంతో వెనుకకు తగ్గింది. ఎవరో కొత్త మనిషి వచ్చాడని ఆమె జడుసుకున్నది. కానీ జరిగిన ఆశ్చర్యాన్ని అతను వివరించాడు. ఆమె నిజానికి నమ్మలేకపోయింది.
కొంతసేపటికిగానీ అతను భార్యను తాను తానే అని నమ్మించలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన మొగుడేనని ఆమె నమ్మిన తరువాత పడుచుదనం నీటిబుగ్గ గురించి కూడా అతను చెప్పాడు. ఆమెను వెళ్లి ఆ నీరు తాగమన్నాడు.
‘‘నీవు పడుచువాడివి అయ్యావు. అందగానివి అయ్యావు. ఇక మరి నా వంటి ముసలి మనిషిని ప్రేమించలేవు. కనుక నేను కూడా ఆ నీటిని వెంటనే తాగక తప్పదు. అయితే ఇల్లు వదిలి ఇద్దరం ఒకేసారి వెళ్లడం అంత మంచిది కాదు. నేను వెళ్లివస్తాను. నీవు ఇక్కడే ఉండు’’ అన్నది ముసలామె. ఆమె పరుగు పెడుతూ అడవిలోకి వెళ్లిపోయింది.
ముసలమ్మకు నీటిబుగ్గ కనిపించింది. ఆమె కూడా దాని పక్కన మోకరిల్లి నీళ్లు తాగసాగింది. ఆహా!, నీళ్లు ఎంత చల్లగా, ఎంత కమ్మగా ఉన్నాయి! ఆమె అదే పనిగా తాగసాగింది. మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకున్నది. మళ్లీ నీళ్లు తాగ సాగింది.  
ఇక ఇంట్లో అటు ఆమె భర్త ఓపిక లేకుండా ఎదురు చూస్తున్నాడు. అందంగా పడుచు పిల్లగా మారి తన పెళ్లాం తిరిగి రావాలని చూస్తున్నాడు. ఎంతసేపయినా ఆమె రానేలేదు. అతనికి ఆత్రం పెరిగింది. ఇంటి తలుపు మూశాడు. పెళ్లాన్ని వెతుకుతూ బయలుదేరాడు. పడుచుదనం నీటిబుగ్గ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఆడమనిషి జాడ కనిపించలేదు. ఇక నిరాశగా అతను వెనుతిరిగాడు. అప్పుడే అతనికి గడ్డిలోనుండి సన్నని గొంతుక ఏడుస్తున్నట్టు వినిపించింది. అతను వెళ్లి వెతికాడు. అక్కడ తన భార్య దుస్తులయితే ఉన్నాయి గానీ, వాటిలో ఒక చిన్నపాప ఉంది. ఆ పాప నిజంగా చిన్నది. బహుశా ఆరు మాసాల వయసు ఉంటుందేమో!
ముసలమ్మ పడుచుదనం నీటిని మరీ ఎక్కువగా తాగింది. యవ్వనం కంటే ఎక్కువగా వయసు తగ్గేటట్టు తాగేసింది. కనుకనే మాటలు రాని పసిపాపగా మారిపోయింది.
చేసేది లేక పడుచు మనిషి తన పెళ్లాం పాపను చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతనివేపు ఆశ్చర్యంగానూ,
దు:ఖంగానూ చూచింది. ఏదో గొణుగుతూ అతను పాపను ఇంటికి తీసుకువచ్చాడు. హాయిగా పెంచుకున్నాడు.
 

Sunday, June 14, 2026

లోకాభిరామం - బ్యాడల పుళి (On languages and me)


లోకాభిరామం - బ్యాడల పుళి 


బ్యాడల పుళి

నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్‌నగర్ వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె. అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే చోట్ల కన్నడంలో హకారం వస్తుంది.  హాలు అంటే పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె. పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది. శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది. బొమ్మల్లో, విగ్రహాల్లో మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము. ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి పక్కనా? కుడి అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ, కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను. పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది. ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది. ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా, పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’ పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు. సంప్రదాయమంటే, అదేమిటి అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్‌రైస్‌లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె) కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్ హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్‌లో ఉరుదూ ప్రభావం బాగ ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్‌గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమిఅన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు) అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ! ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో, ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది. మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని అనుకుంటున్న. జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్‌కు నా మీద కావలసినంత అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు కన్నడములో, లేదా తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి? అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు.  అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ, మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి విన్నవించుకుంట.


 

Friday, May 1, 2026

చక్కని దోస్తీ : ఒక చక్కని కథ - A short little story about truth.


చక్కని దోస్తీ

ఒకానొకప్పుడు ఒక అందమైన ఆవిడ ఉండేది. ఆమె నగరంలో అంతటా తిరుగుతూ ఉండేది. వెళ్లిన చోట ప్రతి వాళ్లు ఆమెను గమనిస్తూ ఉండేవారు. అందరూ ఆమెతో మాట్లాడాలి అనుకునే వారే. ఆమె మాటలు వినదలుచుకున్న వారే. ఆమెను ఏదో అడగదలుచుకున్న వారే. ఏదో ఒక రకంగా ఆమెతో కలిసి కాలం గడపాలని అందరూ అనుకుంటారు. అదే నగరంలో ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె బీదమనిషి. తగిన దుస్తులు లేనిది. అయితే ఆమె కూడా చాలా అందంగా ఉండేది.అయినప్పటికీ ఎవరూ ఆమెను పట్టించుకునే వాళ్ళు కాదు. కనుక బహుశా ఆ అమ్మాయి ఒంటరిగా, దుఃఖంగా ఉండేదేమో. ఆమె కూడా అందమైన ఆవిడను చూస్తుంది. ఆమెను అందరూ పట్టించుకునే తీరు గమనిస్తుంది. తనను కూడా అందరూ పట్టించుకుంటే బాగుంటుంది కదా, అనుకుంటుంది. తన మనసులోని మాటలను అందరికీ చెప్పాలని ఆమెకు చాలా కోరిక. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోరు.

ఒకనాడు చింకి దుస్తులలో ఉన్న బీద అమ్మాయి, ఏదోరకంగా ధైర్యం తెచ్చుకుంది. వెలగల దుస్తులు వేసుకున్న అందమైన అమ్మాయి తో మాట్లాడడానికి ధైర్యం చేసింది. ఏమండీ, నన్ను మీరు క్షమించాలి. మిమ్మల్ని ఒక సహాయం అడగవచ్చునా?’ అన్నది ఆ అమ్మాయి. ధనికురాలయిన మహిళ నిజానికి చాలా మంచి మనిషి. చాలా దయగల మనిషి. కనుక వెంటనే బీద అమ్మాయి మాటలు విన్నది.

అదేమన్న మాట! ఏం అడగదలుచుకున్నావు చెప్పు మరి!, అన్నది ఆమె బీద అమ్మాయితో.

ఏం లేదండీ, ధైర్యం చేసి బీద అమ్మాయి మాట్లాడ సాగింది. మీరు చాలా అందంగా ఉన్నారు. అందుకు తగినట్టే మంచి దుస్తులు కూడా వేసుకుంటారు. అందుకని అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు. నేనేమో బీద దాన్ని. నా దగ్గర మంచి దుస్తులు లేవు. కనుక ఎవరూ నన్ను పట్టించుకోరు. కనీసం ఒక్కరోజు, మీ దుస్తులు వేసుకుని, మీ వెంట తిరగాలని ఉంది. మిమ్మల్ని చూసిన వాళ్లంతా, నన్ను కూడా చూస్తారు. వాళ్ళందరికీ చెప్పడానికి నా దగ్గర ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతి ఇప్పుడు వాళ్లకు తెలియదు మరి! అని, ఆ అమ్మాయి వినయంగా నిలబడింది.

అందమయిన ఆవిడ చాలా సులభంగా అమ్మాయి కోరికకు అంగీకరించింది. మరుసటి రోజు ఉదయాన ఆమె తన దుస్తులు బీద అమ్మాయికి వేసింది. తనతో పాటు వెంటబెట్టుకుని నగరంలో తిరగసాగింది. మామూలుగానే, అందరూ వాళ్ళకి ఎదురుగా వచ్చారు. పక్కన ఉన్న అమ్మాయిని కూడా వాళ్లంతా చూడగలిగారు. ఇద్దరూ కలిసి నడుస్తూ చాలా సంగతులు మాట్లాడుకున్నారు. బీద అమ్మాయిని ప్రశ్నలు అడిగి అందమైన అమ్మాయి ఎన్నో సంగతులు విన్నది. ఆమె గురించి తెలుసుకున్నది. అమ్మాయి చెప్పిన సంగతులు ఎంతో బాగున్నాయని అర్థం చేసుకున్నది. బీద అమ్మాయి తెలివిగలది, అని ఆమెకు సులభంగానే అర్థమైంది. వాళ్ళిద్దరూ నేస్తాలయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరుగుతు న్నారు. అందరితోనూ మాట్లాడుతున్నారు.

వాళ్ళ పేర్లు ఏమిటి? అని ఎవరికి ఇప్పటివరకు అనుమానం రాలేదా?

అందమైన ఆవిడ పేరు, కథ. ఆమెతో నేస్తం కట్టిన బీద అమ్మాయి పేరు, నిజం.


 

Saturday, April 25, 2026

అవ్వ - నువ్వుగింజ - పాతకాలపు కథ


అవ్వ - నువ్వుగింజ  

పాతకాలపు కథ


 అవ్వ - నువ్వుగింజ

ఉండంగుండంగుండంగ ఒగ ఊరుండె.

ఆ ఊర్లె ఒగ అవ్వ ఉండె.

ఒగనాడు అవ్వకు నూలగింజ దొరికింది.

నూలగింజను సేతుల వట్టుకోని అవ్వ ఆలోచన జెయ్యసాగింది.

ఈనూలగింజను గొండవొయ్యి నాటువెట్టి నీల్లువోస్త.

చెట్టువెరిగి చారెడు నూలొస్తయి.

చారెడు నూలెల్ల నాటువెడితె సోలెడు నూలొస్తయి.

పొలం కౌలుకు దీస్కోని సోలెడు నూలు నాటువెడితె,

సంచులకొద్ది నూలు వండుతయి.

ఇగేమున్నది? నూలన్ని పట్నానికిగొండవొయ్యి అమ్ముకుంటెనా?

కావల్సినన్ని దుడ్లొస్తయి!

పెద్ద ఇల్లు గట్టుకోవొచ్చు.

ఇంటిచుట్టు చెట్లు వెట్టుకోవొచ్చు.

కావల్సినన్ని పసురాల వెంచుకోవొచ్చు.

పాలువిండుకోవొచ్చు. పండ్లుదెంపుకోవొచ్చు.

అట్లంటని తిని పండుకుంటె అయినట్లెనా

కరువుకాలం దీరిపాయె గనుక

మనుమనికి మంచి పిల్లను జూసి పెండ్లిజేయాలె.

వానికి పెండ్లమొస్తె ఆపిల్లకు తీర్లతీర్ల శీరలు దేవాలె.

సింగారాలు జెయ్యించాలె. రామసక్కటి రయికెలుగుట్టించాలె.

తోటలకెల్లి పూలు దెంపుకొచ్చి పిల్ల సిగెనిండ వెట్టుకుంటది.

అంతట్లనె పిల్లకు కడుపాయెనంటరు.

పూలు ముడిపియ్యాలెనంటరు.

సీమంతం జెయ్యాలె. పిల్ల సిగ్గువడుతది.

శీతమ్మకంటె సక్కగుంటది.

అట్లంటని పండుగజెయ్యకుండ ఉంటమా?

పదిమందికి జెప్పకుండ ఉంటమా?

తొమ్మిది నెలలయి కానుపయితది.

బుడుమకాయెలాగ బుడ్డటి మునిమనుమరాలు వుడ్తది.

ఆ పిల్లకు సక్కటి తొట్లె గట్టిపియ్యాలె.

దానిమీద అస్మానుగిరి వెట్టిపియ్యాలె.

మునిమనుమరాలు కిలకిల నవ్వుతది.

ఇల్లంత ఎన్నెల ఒంపినట్టే ఉంటది.

మునిమనుమరాలు దోగాడుతది.

శిన్న కిష్నుడు కదిలొచ్చినట్టే ఉంటది.

మునిమనుమరాలు అవ్వా అంటది.

పానం లేసొస్తది.

పిల్లకు తీర్ల తీర్ల సోకులుజెయ్యాలె.

ఉగ్గువెట్టాలె. ఎన్న వెట్టాలె. ఎన్నన్న సరే అడిగిందల్ల దెచ్చియ్యాలె.

అంతట్లనె పిల్ల పెద్దగవుతది.

సదువుకెయ్యాలంటరు.

సాలెకు వంపాలంటరు.

సాలెకువొయ్యొచ్చిన పిల్లకు దిష్టే దగిలెనో, గాలే దగిలెనో

ఇంటికి రాంగనే ఉప్పురాళ్లు దిప్పెయ్యాలె.

శిటపటమంటయి.

పిల్ల జరసేపు పండుకుంటది. నిద్రవడితె పెయ్యి నెమ్మదయితది.

మల్ల లేసి దెగ్గరికొస్తది. నెత్తిన శెయ్యివెట్టి గోకుతుంటది.

అవ్వా నొవ్వనే అంటది.

యాడబిడ్డా అంట

నెత్తిలనే అంటది.

ముందర గూసుండవెట్టి నెత్తిన సూతును గదా!

పిల్ల నెత్తి నిండ పేలు!

సాలెల సదువు సంగతేమొగాని పేలు మాత్రమొచ్చినయి!

శిటుక్కున ఒగ పేనును గుక్కుత.

అనుకుంటనే అవ్వ నిజంగనే ఏందో కుక్కింది.

ఆలోచన తెగింది.

సూస్తేమున్నది?

శేతులున్న నూలగింజ నుగ్గు నుగ్గు అయింది!

అంటేమన్నట్టు?

పగటి కలలు పనికిరావు అన్నట్లు!

అవ్వ - నువ్వుగింజ

ఉండంగుండంగుండంగ ఒగ ఊరుండె.

ఆ ఊర్లె ఒగ అవ్వ ఉండె.

ఒగనాడు అవ్వకు నూలగింజ దొరికింది.

నూలగింజను సేతుల వట్టుకోని అవ్వ ఆలోచన జెయ్యసాగింది.

ఈనూలగింజను గొండవొయ్యి నాటువెట్టి నీల్లువోస్త.

చెట్టువెరిగి చారెడు నూలొస్తయి.

చారెడు నూలెల్ల నాటువెడితె సోలెడు నూలొస్తయి.

పొలం కౌలుకు దీస్కోని సోలెడు నూలు నాటువెడితె,

సంచులకొద్ది నూలు వండుతయి.

ఇగేమున్నది? నూలన్ని పట్నానికిగొండవొయ్యి అమ్ముకుంటెనా?

కావల్సినన్ని దుడ్లొస్తయి!

పెద్ద ఇల్లు గట్టుకోవొచ్చు.

ఇంటిచుట్టు చెట్లు వెట్టుకోవొచ్చు.

కావల్సినన్ని పసురాల వెంచుకోవొచ్చు.

పాలువిండుకోవొచ్చు. పండ్లుదెంపుకోవొచ్చు.

అట్లంటని తిని పండుకుంటె అయినట్లెనా

కరువుకాలం దీరిపాయె గనుక

మనుమనికి మంచి పిల్లను జూసి పెండ్లిజేయాలె.

వానికి పెండ్లమొస్తె ఆపిల్లకు తీర్లతీర్ల శీరలు దేవాలె.

సింగారాలు జెయ్యించాలె. రామసక్కటి రయికెలుగుట్టించాలె.

తోటలకెల్లి పూలు దెంపుకొచ్చి పిల్ల సిగెనిండ వెట్టుకుంటది.

అంతట్లనె పిల్లకు కడుపాయెనంటరు.

పూలు ముడిపియ్యాలెనంటరు.

సీమంతం జెయ్యాలె. పిల్ల సిగ్గువడుతది.

శీతమ్మకంటె సక్కగుంటది.

అట్లంటని పండుగజెయ్యకుండ ఉంటమా?

పదిమందికి జెప్పకుండ ఉంటమా?

తొమ్మిది నెలలయి కానుపయితది.

బుడుమకాయెలాగ బుడ్డటి మునిమనుమరాలు వుడ్తది.

ఆ పిల్లకు సక్కటి తొట్లె గట్టిపియ్యాలె.

దానిమీద అస్మానుగిరి వెట్టిపియ్యాలె.

మునిమనుమరాలు కిలకిల నవ్వుతది.

ఇల్లంత ఎన్నెల ఒంపినట్టే ఉంటది.

మునిమనుమరాలు దోగాడుతది.

శిన్న కిష్నుడు కదిలొచ్చినట్టే ఉంటది.

మునిమనుమరాలు అవ్వా అంటది.

పానం లేసొస్తది.

పిల్లకు తీర్ల తీర్ల సోకులుజెయ్యాలె.

ఉగ్గువెట్టాలె. ఎన్న వెట్టాలె. ఎన్నన్న సరే అడిగిందల్ల దెచ్చియ్యాలె.

అంతట్లనె పిల్ల పెద్దగవుతది.

సదువుకెయ్యాలంటరు.

సాలెకు వంపాలంటరు.

సాలెకువొయ్యొచ్చిన పిల్లకు దిష్టే దగిలెనో, గాలే దగిలెనో

ఇంటికి రాంగనే ఉప్పురాళ్లు దిప్పెయ్యాలె.

శిటపటమంటయి.

పిల్ల జరసేపు పండుకుంటది. నిద్రవడితె పెయ్యి నెమ్మదయితది.

మల్ల లేసి దెగ్గరికొస్తది. నెత్తిన శెయ్యివెట్టి గోకుతుంటది.

అవ్వా నొవ్వనే అంటది.

యాడబిడ్డా అంట

నెత్తిలనే అంటది.

ముందర గూసుండవెట్టి నెత్తిన సూతును గదా!

పిల్ల నెత్తి నిండ పేలు!

సాలెల సదువు సంగతేమొగాని పేలు మాత్రమొచ్చినయి!

శిటుక్కున ఒగ పేనును గుక్కుత.

అనుకుంటనే అవ్వ నిజంగనే ఏందో కుక్కింది.

ఆలోచన తెగింది.

సూస్తేమున్నది?

శేతులున్న నూలగింజ నుగ్గు నుగ్గు అయింది!

అంటేమన్నట్టు?

పగటి కలలు పనికిరావు అన్నట్లు!

Friday, April 24, 2026

లోకాభిరామం : పరిశోధన - పద్ధతులు On Research and skills



పరిశోధన - పద్ధతులు

తీరు ఒకటే

చాలామంది చదువు అయిపోయింతరువాత పరిశోధన చేసి పిఎచ్‌.డి అని ఒక డిగ్రీ సంపాయించుకుంటారు. పరిశోధన సయిన్సులో గానీ, సామాజిక శాస్త్రంలో గానీ, మరో అంశంలో గానీ, పద్ధతి ఒకేలాగ ఉంటుంది. మార్గదర్శనం చేయడానికి ముందు ఒక గురువు, ఆ గురువు సాయంతో పరిశోధనకు ఒక చక్కని సమస్య ఎంపిక చేసుకోవాలి. ఆ సమస్య గురించి ముందు వీలయినంత సమాచారం, ఇప్పటికి జరిగిన పరిశోధనల ఫలితాలు సేకరించాలి. ఆ తరువాత మన ఆలోచన గురించి ప్రయోగాలు, విశ్లేషణలు సాగుతాయి. సామాజిక విషయాలలో ఈ పనంతా, మెదడు, కాగితాల ఆధారంగా జరిగితే, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఒక పరిశోధనశాల అవసరమవుతుంది.

దారి మారుతుంది: సైన్సులో మెటీరియల్స్‌, మెథడ్స్‌ రెండూ అనుకున్నంత సులభం కావు. గొట్టాలు, గిన్నెలు మొదలు ఎన్నో రకాల పరికరాలు, యంత్రాలు, రసాయనాలు అవసరమవుతాయి. అవన్నీ ముందు నుంచే అమరి ఉంటాయని ఎక్కడా లేదు. నేను రక్తంలోని ప్రొటీనులు, వాటిలోని జన్యు వైవిధ్యం గురించి పరిశోధించాను. ఈ పని నాకంటే ముందు ఎవరూ చేయలేదు అని చెప్పలేను గాని, నేను పరిశీలించిన అంశాలలో కొన్ని ఈ దేశంలో, ఈ ఖండంలోనే ఎవరికీ తెలియవు! పెద్ద పరిశోధన సంస్థలలో, పరికరాలు మిగతా సరంజామా కూర్చడానికి సదుపాయాలుంటాయి. ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాలలో సదుపాయాలే కరువు. అందునా కొత్త రకాలు ఏం కావాలన్నా సమస్యే! మా గురువు గారు రామచంద్రరావుగారు మాత్రం, ధైర్యం ఇస్తూ వెనక ఉండి మమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు. పొరపాట్లు, ప్రమాదాలు జరుగుతాయని అనుమాన పడితే పనులు జరగవన్న తత్వం మాకంతా అలవాటయింది. ప్రత్యేకంగా నాకు మరీ ఎక్కువగా!

ప్రయత్నం: యూనివర్సిటీలలో చిత్తశుద్ధిగా పరిశోధన చేసిన వారికి, సమస్యలను విశ్లేషించడం, అన్ని పనులు స్వయంగా చేసుకోవడం లాంటి లక్షణాలు బాగా అలవడతాయని నమ్మకంగా చెప్పగలను. మనిషి రక్తంతో సాగే మా పరిశోధనలో పరిశుభ్రతకు పెద్ద పీట. ప్యాంటు పైకి లాగి, ల్యాబ్‌ అంతా రసాయనాలతో శుభ్రం చేయడం మాకు అలవాటు. ఇక నిత్యం వాడే గాజు సామాన్లు, ఎంత బాగా కడిగి, ఆరబెట్టుకుంటే అంత బాగా ఫలితాలుంటాయి. ఏ కొంచెం కంటామినేషన్‌ వచ్చినా ఫలితాలు తప్పవుతాయి. ఈ శుభ్రత ముందు ఇంట్లో, అంట్లు కడగడం ఆటగా కనిపిస్తుంది! పరిశోధనలో ముందు చాలాకాలం, వాడబోయే సాంకేతిక పద్ధతులను, అందులో వాడబోయే రసాయనాలు సరంజామాను ప్రామాణీకరించడానికే పోతుంది. అది సమంగా కుదిరిందంటే అసలు ప్రయోగాలు సులభంగానే సాగుతాయి. ఎలెక్ట్రోఫోరెసిస్‌ అనే ప్రక్రియలో రకరకాల పద్ధతులను నేను బాగా మధించాను. వాటిలో ఒకదాంట్లో మెలుకువలు నేర్వడానికి కొంతకాలం కలకత్తాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండి వచ్చాను. అక్కడి వారికీ, నాకూ దోస్తీ కుదిరింది.

ప్రయోగం: ఇక్కడ ఎదురయ్యే సమస్యలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. స్టార్చ్‌ జెల్‌ తయారీ కొరకు నాకు గాలిని పీల్చి ఖాళీ ఏర్పరిచే వ్యాక్యూం పంప్‌ అవసరమయింది. గురువుగారికి ఆ మాట చెప్పాను. ‘దాందేముంది? కొనిపించు!’ అనేశారాయన. కొన్ని పరికరాలను డిపార్టుమెంటు వారు కొంటారు. కొన్నింటిని మా ల్యాబ్‌ గ్రాంటు నుంచి తెస్తాము. కొనిపించు, అంటే మొదటి పద్ధతి. వెళ్లి స్టోర్‌ కీపర్‌ గోపాలరెడ్డికి విషయం చెప్పాను. ‘మన దగ్గర అటువంటి పంపు ఒకటి ఉంది. దాన్ని వాడింది లేదు. నీవు పరీక్షిస్తానంటే ఇస్తానన్నాడు’ రెడ్డి. చూస్తే పంపు కొత్తది! నిజంగానే దాన్నెవరూ వాడింది లేదు. ఎత్తుకుని ల్యాబ్‌కు తెచ్చాను. కనెక్ట్‌ చేసి స్విచ్‌ వేస్తే, తిరగడం మొదలయింది. కానీ, గాలిని పీల్చడం మాత్రం లేదు. ఇలాంటి వాటిని గురించి ఎవరినో అడిగేంత ఓపిక లేదు. స్పానర్‌ సెట్‌ తీసి యంత్రాన్ని ఎక్కడికక్కడ విడదీశాను. అన్ని భాగాలను బాగా శుభ్రం చేసి తిరిగి బిగించాను. ఈసారి మరింత బాగా తిరిగింది. కానీ గాలిని మాత్రం పీల్చదు. లోపల నేను మరీ శుభ్రం చేశానని అనుమానం వచ్చింది. యూనివర్సిటీ వర్క్‌షాప్‌కు వెళ్లి అక్కడ మిత్రులతో చర్చించాను. ‘ఇంతకూ ఆయిల్‌ పోసినవా?’ ఒకతను అడిగాడు. లైటు వెలిగింది. నేను విప్పినప్పుడు, ఒకానొక భాగంలో కొంత జిగట పదార్థం ఉంది. ఆయిల్‌ మాత్రం కాదు! అంటే ఆయిల్‌ ఆరిపోయింది. వెంటనే రాణీగంజ్‌ చలో! ఆయిల్‌ తెచ్చి పోశాను. ఈసారి గొట్టం వేలికి అతుక్కుంది. గురువుగారిని పిలిచి, ఆయన వేలికి గొట్టం పెట్టి ఆన్‌ చేసింది తడవు ఆశ్చర్యంగా అది వేలికి అతుక్కుంది! ‘అసాధ్యుడవు! పైసలు మిగిలించినవు కూడ!’ మెచ్చుకున్నారాయన. మామూలు మొదలు చాలా వెలగల యంత్రాల దాకా, అన్నింటినీ విప్పడం అలవాటయి పోయింది! పక్క డిపార్టుమెంట్ల వారు కూడా, నా కోసం వచ్చేదాకా వెళ్లింది పరిస్థితి! స్వయం ప్రతిపత్తి అట్లాంటిది!

మరో తీరు: ఎస్టరేజ్‌-డి అనే ఎంజైమ్‌ విశ్లేషణ ఈ ఖండంలోనే ఎక్కడా జరగలేదు. అందుకు అవసరమయిన పరికరాలు, పద్ధతులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక రసాయనం మాత్రం లేదు. అది అవసరమయేది మిల్లిగ్రాములలో. కానీ, అసలు దొరికినప్పుడు గద! రసాయనాలు ఏ దేశంలో దొరికితే, అక్కడి నుంచి తెప్పించడం మాకు అలవాటే! ఎన్‌ ఐ ఎన్‌, ఆర్‌ ఆర్‌ ల్యాబ్స్‌ లాంటి చోట్ల లైబ్రరీలన్నింటా రకరకాల కంపెనీల కేటలాగులన్నీ పరిశోధించాను. అప్పట్లో ఇంటర్‌నెట్‌ లేదు మరి! నాకు కావలసిన రసాయనం ఎక్కడా లేదు. చివరకు ఉస్మానియాలోనే బయోకెమిస్ట్రీ డిపార్టుమెంట్‌లో ఒక పాత కేటలాగులో రసాయనం పేరు కనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. రోష్‌ అనే యూరపు కంపెనీ వారి దగ్గర రసాయనం ఉండేది. ఇటలీయా? మరో దేశమా? వారికి ప్రేమగా ఉత్తరం రాశాను. నెల తిరిగే లోపల నాకొక పార్సిల్‌ వచ్చింది. అందులో ఒక ఉత్తరం ఉంది. ‘మీరు అడిగిన రసాయనం మేమిప్పుడు తయారుచేయడం లేదు. చేసినా అది అవసరమయ్యేది మిల్లిగ్రాములలోనే కదా. చిత్రంగా మా స్టోర్‌లో ఒకటి రెండు సీసాలు కనిపించాయి. అందులో ఒకదాన్ని మీకు గిఫ్ట్‌గా పంపుతున్నాము. అది మీకు పనికివస్తే, అంతకంటే కావలిసింది లేదు’ అన్నారు వారు. వెతికినా దొరకని రసాయనం ఊరికే వంద గ్రాములు దొరికింది! విశ్లేషణ మొదలుపెట్టాను. మొదటిసారే అది బ్రహ్మాండంగా పని చేసింది! మా ల్యాబ్‌లో ఆ విధానమూ, ఆ రసాయనమూ రెండూ నా కృషి ఫలితాలు. నాకు పనికి వచ్చాయి. తరువాతి వారు వాడుకుంటే నేనెందుకు కుళ్లుకోవాలి?

వార్త: ఎస్టరేజ్‌ డి గురించి పేపర్‌ ప్రకటించామనుకుంటాను. అందరూ ఆశ్చర్యపోయారు. కలకత్తా మిత్రులు నాకు ఉత్తరం రాసి, రసాయనం మాకు కొంచెం ఇవ్వగలవా? అని అడిగారు. నేను స్వయంగా సంపాయించింది అయినా, అది ల్యాబ్‌ ఉమ్మడి ఆస్తి అని భావన. అయినా పంపించాను. వారు పేపర్‌ ప్రకటిస్తే, అందులో నాకు ధన్యవాదాలు చెప్పే ప్రమాదం ఉంది. ఏమయిందో నాకు గుర్తు లేదు. మనం వెళ్లి మరొకరి దగ్గర ఏవో నేర్చుకున్నట్టే, మన దగ్గర నేర్చుకునేందుకు ఎవరో వస్తుంటారు. ఇక్కడ స్వార్థం అన్న లక్షణం, రహస్యం అన్న భావన అసలు లేవు. ఈ రకంగా నేను చాలా కొత్త టెక్నిక్స్‌ ప్రారంభించాను. తోటి వారికి నేర్పించాను. వారు వాడుతుంటే గర్వించాను!

సింకో కెమిస్ట్రీ: బయోకెమిస్ట్రీ లాంటి రంగంలో వేలు లక్షల విలువచేసే రసాయనాలు, రీఏజెంట్లను వాడి, కడిగి కాలువలో పోయడం మామూలే. ఆ పోసే వాష్‌ బేసిన్‌ పెద్దది. దాన్ని సింక్‌ అంటారు. మా తీరు నచ్చని మిగతా పొదుపరి శాఖల వారు మమ్మల్ని ‘సింకో కెమిస్ట్రీ’ అనేవారు. అయినా పరిశోధనలన్నీ మెదడుతో మాత్రమే జరగాలంటే కుదరదు గదా!

అదేమో గానీ, సైన్సు పరిశోధనలో ఉన్న వారికి, అంట్లు తోమడం మొదలు, కంప్యూటర్‌, ఫొటోగ్రఫీ దాకా ఎన్నెన్నో సంగతులు నేర్చుకోవలసిన అవసరం, అవకాశం వస్తాయి. నాకెందుకులే, ఎవరినో అడగ వచ్చు ననుకుంటే చెప్పలేను గానీ, నేను మాత్రం ఎదురయిన ప్రతి అవకాశాన్నీ అంది పుచ్చుకున్నాను. డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ అనే డిగ్రీ వచ్చింది. నేను దాన్ని వాడటం లేదు. కానీ బతుకుకు ఒక ఫిలాసఫీ దొరికింది. ఇవాళటికీ నా పనులన్నీ వీలయినంత వరకు నేనే చేసుకోవాలనుకుంటాను. కనుక ఎన్నో నేర్చుకున్నాను. పనులు చేసుకుంటున్నాను. అందులోని ఆనందమే వేరు!

కొసరు ముచ్చట: ఉస్మానియా యూనివర్సిటీలో నా పరిశోధన కాలం గురించి తలుచుకుంటే, అందరికన్న ముందు స్వీపర్‌ ముసలమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె రాక ముందే నేను ల్యాబ్‌లో పనిలో ఉండేవాణ్ణి. ఊడవాలి గనుక ‘పంకలు బందుజెయ్‌!’ అనేది ముసలమ్మ. ‘నీవు చేయొచ్చు గదా?’ అని నా ప్రశ్న. ‘షాక్‌గొట్టి చచ్చిపోతే?’ ఆమె జవాబు. ‘నాకు గొట్టదా? నేను చస్తే ఫర్వాలేదా?’ అంటాను నేను నవ్వుతూ! ‘నీవు బాస జదివినవు గద. నీకు షాకు గొట్టదు!’ ఆమె జవాబు!