Showing posts with label article. Show all posts
Showing posts with label article. Show all posts

Saturday, July 25, 2026

లోకాభిరామం : నను పాలింప On Classical music


నను పాలింప

మా ఇంట్లో ఒక లామినేట్ చేసిన చిత్రపటం ఉంది. అందులో త్యాగరాజస్వామి భువనేశ్వరం ముందు కూచుని బహుశ: పాడుతూ ఉంటడు. (మా సంప్రదాయంలో దేవుని విగ్రహాలు ఉండే మంటపాన్ని భువనేశ్వరం అంటరు). అందమయిన ఆంజనేయస్వామి, మోకాళ్లమీద కూచుని పబ్బతి బట్టి (అంటే చేతులు జోడించుకుని) ఆనందంగ చూస్తుంటడు. త్యాగయ్య గారి భార్యామణి వంటింటి తలుపులో నిలబడి ఉంటుంది. అన్నిటికన్న ముఖ్యమైన విషయం రాముడు, సీత, తమ్ములతో అభయహస్తం పట్టి నిలబడి ఉంటడు. ఇది బొమ్మ తీరు. ఈ మధ్యన ఇదే బొమ్మ నాకు ఇంకొక చోట పుస్తకం కవరుపేజీగ కనిపించింది. ఫోటోషాప్ అని ఒకటి వచ్చింది గద! దాని సాయంతో రామయ్య చేతినుంచి వెలుగుపుట్టి త్యాగయ్య మీద ప్రసరిస్తున్నట్టు అక్కడ మార్చి పెట్టినరు. బొమ్మ బాగనే ఉన్నది. కానీ, నా బుర్రలో అనుమానాలు మొదలయినయి. రాముడంతటి వాడు, దార సోదరాదులతో దయచేసి వస్తే త్యాగయ్య లేచి నిలబడి ఉండాలె గద. వాళ్లావిడ కూడ పక్కనే ఉండాలె గద! ఆ నమస్సులు, ఆశీస్సులు అన్నీ అయినయి అనుకుందము. రామయ్య తాపీగ,  ఏమయ్యా! ఒక పాట పాడవచ్చు గదాఅన్నడే అనుకుందము. ఆయనను చాపవేసి కూచోబెట్టి, కమ్మగ కచేరీ చేయవచ్చు గద? నిలవెట్టి ఎందుకు ఆ పాట? అదీ నా అనుమానం.

ఇటువంటి మాటలు అంటుంటే వీనికి మరీ భయం, భక్తిలేకుండ పొయినయి అనే వాళ్లు చాలామంది ఉంటరు. నాకు తెలుసు! కానీ సందేహం రావడం మంచిదని మాకు ఒక పద్ధతి ఉంది. చొప్పదంటు ప్రశ్నలకే సమాధానాలు ఉండంగ లేనిది, నా ప్రశ్నకు ఎవరో జవాబు చెప్పకపోతరా? అని అడగడం. ‘సందేహమును తీర్చవయ్యా?’ అంటూ త్యాగయ్య నేరుగా రాముడిని ప్రశ్నలు అడిగినడు. త్యాగయ్య కీర్తనలలో చాలామటుకు ప్రశ్నలే పల్లవిగ ఉంటయి. ఆ ప్రశ్నలలో రకాలు, ప్రశ్న ముగిసిన చోటున వేరువేరు స్వరస్థానాలు ఉండడం గురించి పెద్దలు చర్చించడం విన్న. ‘ఎవరిచ్చిరిరా శర చాపములు?’ అని త్యాగయ్య తెగేసి అడగడం కూడా అందరూ ఎరిగినదే! అట్లా ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగినడు.

మళ్ల లామినేటెడ్ బొమ్మలోకి వద్దము. ఇక్కడ ఆయన ‘నను పాలింప నడచి వచ్చితివో’ అని పాడుతున్నడని నాకు అనిపించింది. ఈ పాట గురించి నిజానికి వేరే కథ ఉంది.త్యాగరాజస్వామి కూతురి పెళ్లి సందర్భంగ అనుకుంట, వాలాజపేట వేంకటరమణయ్య లేదా మరొక శిష్యుడు, రామ పట్టాభిషేకం చిత్తరువును బహుమతిగ (పోటీలో బహుమతి కాదులెండి!) తెచ్చిస్తే, చూచి త్యాగయ్య భక్తితో పాట పాడినట్టు చెపుతరు. ఉరమున ముత్యపు సరుల చయముతో అంటూ మొదలయి ఆ పాటలో రాముని వర్ణన మాత్రమే ఉంటుంది.

నా కోతి బుర్రకు ఇక్కడ మరొక సంగతి గుర్తుకు వస్తున్నది. ‘నిన్ను కోరి’ అనే మాటతో మొదలయే మోహనరాగ వర్ణం కర్ణాటక సంగీతంలో మంచి పాపులర్‌గ ఉంది. మన తెలుగు సినిమాలో ఒకచోట  ‘నిన్ను కోరీ వర్ణం’ అంటూ ఒక హిట్టు పాట పెట్టేశినరు. ఆ పాట వినేందుకు బాగుంటుంది. కానీ సంగీతంలోని వర్ణానికి, దానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అట్లాగే బుద్ధిమంతుడు అని ఏఎన్ఆర్ హిట్ సినిమా ఒకటి ఉంది. అందులో ‘నను పాలింపగ నడచీ వచ్చితివో’ అని ఒక పాట ఉంది. దానికీ, అసలు మోహనరాగ కృతికీ సంబంధమే లేదు. ఈ పాట పల్లవి, కర్ణాటక సంగీత ప్రపంచం నుంచి వచ్చిందని తెలియని ప్రేక్షకులు, శ్రోతలు చాలమంది ఉంటరు. శంకరాభరణం సినిమాలోని సామజ వరగమన సంగతి కూడా ఈ రకంగనే ఉంటుంది. సంస్కృతినీ, సంప్రదాయాన్నీ ఇష్టం వచ్చినట్టు వాడడం మనకు బాగ చేతనవుతుందని అనుమానం!

నాకు భయం, భక్తి లేవుగాక లేవు. కానీ, ఒంటి నిండ కుతూహలం ఉంది. సైన్సు చదివిన, చదువుతున్న. అర్థమయిన సంగతులను పదుగురితో పంచుకుంటున్న. అదే పద్ధతిలో వైష్ణవం గురించి బోలెడంత చదివినట్టున్న. దాని గురించి, రాసింది తక్కువ. కానీ మాట్లాడిన. తిరుపతి బ్రహ్మోత్సవాలు (తిరుమల అనాలి) ఏనాటికానాడు టీవీలో చూపించడంలో కీలకపాత్ర వహించిన. అదే పద్ధతిలో ఈ సంవత్సరం త్యాగరాజ ఆరాధనోత్సవాలకు తిరువయ్యారు పొయ్యిన. నాకు కర్ణాటక సంగీతం (హిందుస్తానీ కూడ) ఎందుకంత పట్టిందో అర్థం కాదు. ఉత్తర భారతదేశంలో సవాయి గంధర్వ ఉత్సవాలు, సంత్ రాయ్‌దాస్ ఉత్సవాలు జరుగుతయి. కానీ, త్యాగరాజ ఆరాధన లెవెల్లో జరగవని నా అనుమానం. కనుకనే సంగతి చూడాలని వెళ్లిన. నిజం చెపుతున్న. అక్కడ ఎవరిలోను భయం, భక్తి కనిపించలేదు.

తిరువయ్యారులో కనిపించిన ప్రత్యేకత అక్కడి క్రమశిక్షణ. పుస్తకంలో అచ్చువేసిన క్రమం ప్రకారం ఒకరి తరువాత ఒకరు వచ్చి పాడుతున్నరు. లేక వాయిద్యం వాయిస్తున్నరు. సన్మానాలు, పొగడ్తలు లేవు. పని ముగిసిన తరువాత ఎవరి దారిన వారు పోతున్నరు. పోయే ముందు త్యాగయ్య సమాధి ముందుకు వెళ్లి ఒక నమస్కారం చేస్తున్నరా? అంటే అనుమానమే. ఇంక జనం సంగతి. అంత పెద్ద పందిరిలో నిండా కిక్కిరిసి ఉన్నరు. వాళ్లలో ఎంత మందికి సంగీతం తెలుసంటే మళ్లీ అనుమానమే. అంతమంది ఉన్నాసరే తొక్కిసలాట, తోసుకోవడం లేవు. పోలీసులు చూస్తూ నిలవడి ఉన్నరంతే. అంతా జాతర లేదా తిరునాళ్ల వాతావరణం. సందుల నిండ అంగళ్లు. అన్నిరకాల వస్తువులు అమ్ముతు న్నరు. కొనేవాళ్లు కొంటున్నరు. సంగీత ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంత ఎత్తున నివాళి సమర్పించడం ప్రపంచంలో మరెక్కడ లేదు. కానీ అందులో త్యాగయ్య ప్రత్యక్షంగ కనిపించడం లేదు.

పంచమి రోజున ఉదయం తొమ్మిదినుంచి ఘనరాగ పంచరత్నాలు అందరూ కలిసి పాడతరు. అందులో పాల్గొనే కళాకారులకు విద్వాన్ పాస్ ఇస్తరు. నేను గాయకుడిని కాను. ఒక విఐపి పాస్ సంపాదించినరు నా కొరకు. నేను, నా తోటివారు ఉదయం ఆరున్నరకే పందిరి చేరుకున్నము. అప్పటికే సీనియర్ ఆర్టిస్టులు కూడ వచ్చి కూర్చున్నరంటే ఆశ్చర్యం! ఎంతమంది జనం వచ్చినరో? చాలామంది వీఐపీలు కూడ వచ్చినరు. వచ్చినది ఎవరయినా కానీ, ఆ ఇసుకలో చతికిల పడవలసిందే! కుర్చీ, స్టూలు ఒక్కటంటే ఒక్కటి లేదు. నేను వెతికి వెతికి ఒక టీవీ కెమెరా పక్కన కూచున్న. అట్లాగుంటే ఎవరికీ టీవీలో కనిపించే ప్రమాదం ఉండదు. వచ్చేవారిలో మళ్లీ భయం, భక్తి మచ్చుకు కనిపించలేదు. టిఫిన్లు తింటూ, కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తున్నరు. నాదస్వరాల బృందాలవారు ఒకరి తరువాత ఒకరు వాయిస్తు న్నరు. మిగతా వాద్యాలవారు, గాయకులు వచ్చి చేరుకుంటున్నరు. చిత్రంగా బాగా పేరున్న గాయకులు, వాద్యకారులు కనిపించింది తక్కువ. ముందు రాత్రి పాడినవారు కూడా వెళ్లిపొయినరు.

ఉత్సవాన్ని నిర్వహించే వాళ్ల బలం బాగ కనిపించింది. గుడికి వచ్చేవాళ్లను రమ్మనేవారు ఎవరు ఉండరు. నిజమే కానీ అక్కడ కూడ, ఓహో! వచ్చినరా! అనేవారు ఉంటరు. ఇక్కడ కొందరు అవసరంగ, అనవసరంగ మధ్యన తిరుగు తున్నరు. మమ్మల్ని చూడండి అన్నట్టుంది తీరు. వాళ్లు బహుశ: కొంత మందిని పట్టించుకోరు. కనుకనే అందరూ ఆ సందర్భానికి అక్కడికి రారు. వచ్చిన వారు కూడా ఎవరినీ పట్టించుకోకుండనే పని ముగించుకుని వెళ్లిపోతున్నరు. క్రమశిక్షణ మాత్రం పాటిస్తున్నరు.

ఝలక్: నేను మొదటిరోజు సాయంత్రం (గోష్టి గానానికి ముందు రోజు) స్టేజి వెనకకు వెళ్లి తెలిసిన వారిని పలకరించిన . చాలాసేపు అక్కడే ఉన్న. కొంతసేపటికి ఎందుకో బయటకి వచ్చిన. మళ్లీ లోపలికి పోతుంటే పోలీసు అడ్డుకున్నడు. అదేమిటి అక్కడనుంచే వచ్చిన గద అంటే, అదంతే అన్నడు.


 

Monday, July 20, 2026

పువ్వులకు రంగులు ఎందుకు?


వువ్వులకు రంగులు ఎందుకు?

ఒక్క గులాబీలే లెక్కలేనన్ని రంగుల్లో ఉండడం చాలామందికి తెలియకపోవచ్చు. నల్లని గులాబీలు కూడా ఉన్నాయి. నెదర్లాండ్స్‌ వంటి యూరప్‌ దేశాలలో పనిగట్టుకుని ట్యూలిప్‌ పువ్వులను రకరకాల రంగులలో పోటీపడి తయారు చేస్తుంటారు. కొత్త రంగులు తయారు చేయడానికి సంకరకరణం అనే పద్ధతిని వాడుకుంటారు.

ఈ ప్రపంచంలో ఎన్ని రకాల, ఎన్ని రంగుల పువ్వులు ఉన్నాయన్నది ఊహకందని ప్రశ్న. ఆ రంగుల అవసరం మాత్రం ఒకే ఒక్కటి. అది పునరుత్పత్తి. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ తమ జాతి కొనసాగవలెనన్నది ఏకైక కార్యక్రమం. మొక్కలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. మొక్కలు కదలజాలవు. తమ పువ్వులలోని పరాగం మరొక పువ్వులోకి చేరాలి. అప్పుడే పళ్లు వస్తాయి. విత్తనాలు మరిన్ని పద్ధతులతో విస్తరిస్తాయి. మొత్తానికి కొత్తమొక్కలు పుడతాయి. తాము కదిలి వెళ్లడానికి వీలులేని మొక్కలు తమ పరాగం మరొకచోటికి చేరాలంటే కీటకాలు, పక్షుల మీద ఆధారపడాలి. కనుకనే వాటిని ఆకర్షించడానికి పువ్వులకు అన్ని రకాల రంగులు ఉంటాయి.

పువ్వులు ఎరుపు, పసుపు రంగుల్లో ఎక్కువగా ఉండడం సులభంగానే గమనించవచ్చు. నీలం రంగులు పువ్వులు మాత్రం చాలా అరుదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పువ్వులలో నీలంరంగు రావాలంటే వాటికి అందే రసాయనాలు ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం వస్తుంది. గులాబీలలో కూడా ఇప్పటివరకు నీలం రకం రాలేదనే చెప్పాలి. పువ్వులకు నీలంరంగు రావాలంటే రకరకాల పరిస్థితులు ఏర్పడాలి. అవన్నీ కలిసి పనిచేయాలి. వాటిలోని ఆమ్లత, క్షారత అనే లక్షణాలు సరిగా ఉంటే గానీ నీలం పువ్వులు రావు. రంగులకు అవసరం అయ్యే పిగ్మెంట్స్‌ అనే రసాయనాలు కొన్ని ప్రత్యేకమయిన లోహాలను కలిగి ఉండాలి.

హైడ్రాంజియాస్‌ అనే మొక్కలు పెరుగుతున్న నేలలో తగిన మోతాదులో అల్యూమినం ఉంటేగానీ నీలం పువ్వులు పెరగవు. పువ్వులలో నీలం రకాలు ఎక్కువగా లేకపోవడానికి పరిణామపరమయిన కారణాలు కూడా ఉన్నాయంటారు పరిశోధకులు. పక్షులు సులభంగా ఎర్రని పువ్వుల మీదకు వెళ్లిపోతాయి. కొన్నిరకాల కీటకాలు లేతరంగులను చూడ గలుగుతాయి. తేనెటీగ జాతులకు ఎరుపురంగు కనిపించదు. అవి తెలుపు, పసుపు రంగులున్న పువ్వుల మీదకు ఎక్కువగా వెళతాయి. చెట్ల ఆకులు నీలంగా ఉంటాయన్నది తెలుసు. ఆ ఆకుల మధ్యన తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగుల పువ్వులుంటే అవి బాగా కనపడతాయి. ఆకుపచ్చని ఆకుల మధ్యన నీలం పువ్వులు కనిపించకపోవచ్చు. కనుకనే పువ్వులు సులభంగా కనిపించే రంగులలో ఎక్కువగా ఉంటాయి.

జంతువులయినా, మొక్కలయినా మనుగడ కొరకు తమ శరీరాలలో, బతుకుతీరులో రకరకాల పద్ధతులను ఏర్పాటు చేసుకుంటాయి. మొక్కలకు పువ్వులు ఉండడం, కొత్తతరం పుట్టడానికి జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే. వాటి రంగులు కూడా ఆ కార్యక్రమం కోసమే. చివరికి పండ్లు కూడా పునరుత్పత్తి కొరకే. మనం రకరకాల పువ్వులను, రకరకాల జీవులను చూచి ఆనందిస్తాము. మొక్కలను, జంతువులను ఆహారంగా వాడుకుంటాము. అంటే వాటి పునరుత్పత్తికి స్వార్ధంకొద్దీ మనం అన్యాయం చేస్తున్నామని అర్థం.

 

 

మరిన్ని విశేషాలు

హార్స్‌ చెస్ట్‌నట్‌ అనే పువ్వులలో  పుప్పొడి అవసరం ఇక లేదనుకుంటే పువ్వుల మీద మరకలు మొదలవుతాయి. అంటే ఇక పురుగులను, పక్షులను ఆకర్షించవలసిన అవసరం లేదన్నమాట. అవసరం ఉన్నంతకాలం మంచి రంగును కనబరిచిన పూలు ఆ అవసరం తీరిన తరువాత మారిపోవడం కూడా కొన్ని రకాలలో కనిపిస్తుంది.

 

మరిన్ని విశేషాలు

పెద్ద మొక్కలు పరాగవ్యాప్తి కొరకు పురుగులు, వక్షుల మీద ఆధారపడతాయి. అయితే కొన్ని మొక్కలకు ఈ అవసరం లేదు. గడ్డిజాతి మొక్కలకు వరపరాగ నంపర్కం గాలి ఆధారంగానే జరుగుతుంది. అందుకే రకం మొక్కలలో వువ్వులు

ఉన్నప్పటికీ వాటికి ఆకర్షణీయమయిన రంగులు ఉండవు. నేలబారున పెరుగుతున్న చిన్న మొక్కల పూలన్నీ తెలుపుగానే ఉంటాయి. కొంచెం ఎదిగిన మొక్కలన్నింటి పూలు రకరకాల రంగుల్లో ఉంటాయి.


 

Friday, July 17, 2026

లోకాభిరామం : ఏకాంతమూ - ప్రశాంతమూ


ఏకాంతమూ... ప్రశాంతమూ...

ఈ ప్రశాంత ఏకాంత సాయంత్రంలో నిదురించు జహాపనా అంటాడు కవి. సాయంత్రం బాగుందట. అంత చక్కటి సాయంత్రంలో ఏకాంతం కూడా దొరికిందట. అయితే మరి అప్పుడు పడుకోవడంలో అర్ధం ఏమిటి? నాకు అర్ధం కాలేదు. ఏకాంతంలో మన వ్యక్తిత్వం నిస్సందేహంగా బయట పడుతుంది అంటాడు తాత్వికుడు. గాలిబ్‌ తన కవితలో ఒక చోట, దిక్కు తెలియని ఏదో ఒక చోటి నుంచి కొత్త ఆలోచన వచ్చేస్తుంది, గాలిబ్‌ కేవలం ఆ భావనలను కాగితం మీద పెడతాడు, అంటాడు. అంటే ఆలోచనలు తమవి కావు అంటున్నాడు అతను. ఏకాంతంలో ఉంటే మనిషి మనసు రెండు అంతస్తుల్లో పనిచేస్తుంది. ఒకటి మనకు తెలియకుండానే కొత్త ఎత్తులకు ఎదుగుతుంది. నాకు ప్రతినిత్యం రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర రాదు. ఏదో ఒక  అంశాన్నితీసుకుని ఆలోచన మొదలవుతుంది. చాలా సందర్భాలలో అది ఉపన్యాసంగా మారుతుంది. నాకు నేనే ఉపన్యాసం చేసుకుంటాను. అందులో అనుకోకుండా కొన్ని కొత్త ఆలోచనలు కనబడతాయి. చటుక్కున లేచి, లైట్‌ వేసి, మాటలు కాగితం మీద రాసి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాలిబ్‌ అనుభవమే ఇక్కడ నాకు కూడా కలుగుతున్నట్టు అర్ధం కదా. తన కవితలకు కావలసిన భావనలు ఒంటరితనంలో వచ్చాయని ఆయన భావించాడు. అంతుపట్టని సృజనాత్మకతలోనుంచి, ఆలోచనలోనుంచి, అవి కొత్తగా తలెత్తాయి. రచయితలకు చాలామందికి రాతకు కూర్చునే ముందు కొన్ని పరిస్థితులు అవసరం అనుకుంటారు. నాకు కూడా కొంతవరకు అవసరాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఏకాంతం కావాలి. కనీసం నిశ్శబ్దం కావాలి.

చిన్నప్పటి నుంచి నేను రాస్తుంటే, మా ఇంట్లో వాళ్ళు గోల చేయకుండా ఉండడం నాకు మొదటి నుంచి అలవాటు. పిల్లలకు కూడా నా సంగతి అర్థమయింది. ఏకాంతం కావాలి నిజమే. కానీ అది అనుకుంటే దొరికేది కాదు. దొరికినప్పుడు దాన్ని అనుభవించడం కూడా వీలు కాదు. మనిషి సంఘజీవి అని చాలా సులభంగా చెప్పేస్తారు. కానీ ఈ సంఘం మనిషిని తన మానాన తాను ఉండనివ్వదు. అందరూ కలిసి అర్ధం లేని కొన్ని ఆచారాలను తయారుచేసి అందరి తలకు చుట్టూ చుడతారు. కనుకనే అంత గోలలోనూ కవి, రచయిత ఏకాంతాన్ని కోరుకుంటాడు. గాలిబ్‌ కు ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయి? అందరికీ అది వీలవుతుందా?

నేను రేడియోలో ఉద్యోగం చేశాను. అక్కడ సమయాన్ని బట్టి తప్పకుండా రాయవలిసిందే. కార్యక్రమాలు చేయవలసిందే. నాకు మూడ్‌ లేదు, ఏకాంతం అంతకంటే లేదు, కనుక నేను రాయలేను, అని కూర్చుంటే ఉద్యోగం ఉట్టికి ఎక్కుతుంది. కనుక అవసరం కొద్దీ రాయడం అలవాటయింది. అయితే ఆ రాత వ్యక్తిగతంగా ఉండదు. అంత గొప్పగా కూడా ఉండనే ఉండదు. అక్కడి పరిస్థితులకు అది సరిపోతుంది. అంతేగాని నిజమైన భావుకతలో నుంచి, నిజమైన సృజనాత్మకత లోనించి, నిజమైన మార్మికత లోనుంచి మాటలు పలకాలంటే ఏకాంతం చాలా అవసరం.

ఒంటరితనాన్ని ఎవరికి వాళ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇరువురము కలిసి ఒంటరిగా నడుచుచు సాగితిమి అన్న పద్ధతిలో అందరి మధ్యలోను ఏకాంతాన్ని అనుభవించగలగాలి. అప్పుడు గాలిబ్‌ తీరుగానే కలం పట్టుకున్న ఎవరికైనా కాస్తంత తెలివి సులభంగా ముందుకు సాగుతుంది. కనుకనే ఏకాంతం రచయితలకు అసలైన అవసరం అంటాడు ఒక మహానుభావుడు. ఆయన అనుభవం కొద్ది ఆ మాట చెప్పినట్టు ఉన్నాడు చాలామందికి ఒంటరితనం నచ్చదు. నాకు ఒంటరితనం నచ్చుతుంది కానీ మరీ ఒంటరిగా ఉంటే అదేదో ఒక రకమయిన ఒంటరితనం మొదలవుతుంది. మనుషులు ఉండాలి. నా దగ్గర ఉండకూడదు. మనుషులు ఉండాలి, వాళ్లు మాట్లాడకూడదు. మనుషులు నన్ను పలకరించ కూడదు. నేను కూడా వాళ్ళను పలకరించను. మనుషులు ఉండాలి. తలుపులు అన్నీ మూసుకున్నా సరే ఏదో ఒక కిటికీ తెరిచి ఉంచు. ప్రపంచాన్ని నీ దగ్గరకు వస్తానంటే ఆపకు. అంటూ ఎప్పుడో ఒకసారి కవిత రాసుకున్నాను. బతుకంతా ఒంటరిగా ఉండనవసరం లేదు. దినంలో కనీసం కొన్ని గంటలు ఏకాకిగా ఉండగలగాలి. నాకు ఉద్యోగం చేసుకున్నంత కాలం ఈ అవకాశం కలగలేదు. కావాలనే ఉద్యోగం మానుకున్నాను. ఆ తరువాత ఒంటరితనమే ఒంటరితనం. ఇంట్లో వాళ్ళంతా పొద్దున్నే ఎవరి దారిన వాళ్లు పోతారు. పనిలేని వాడిని కనుక నేను ఇంట్లో మిగులుతాను. బూజులు చూస్తూ, పగుళ్లు లెక్కిస్తూ, ఆవులింతలు తీస్తూ రోజులు గడపవలసిన అవసరం లేదు. అందరూ వెళ్ళిపోయిన మరుక్షణం నా ప్రపంచం పరుచుకుంటుంది. నా పుస్తకాలు బయటికి వస్తాయి. నా కాగితం, కలాలు నాట్యం చేస్తాయి. నా చేత పిల్లి మొగ్గలు వేస్తాయి. రకరకాల రచనలు బయట పడతాయి. కనుకనే చూస్తుండగానే నేను రాసిన పుస్తకాలు తామరతంపరగా సెరిగి మూడంకెలకు చేరుకునే పరిస్థితి వచ్చింది.

అందరికీ ఏకాంతం ఇంత సులభంగా దొరకదు. చాలామందికి ప్రయత్నించినా సరే ఒంటరితనం దొరకదు. ఈ సంగతి నాకు తెలుసు. ఇంటికి తాళం వేయాలని నాకు కోపంగా వుండేది. తిరిగి వచ్చిన తర్వాత తాళం తీయాలని పిచ్చి కోపం వచ్చేది. కానీ సంవత్సరం దాకా ఇంటికి తాళం వేయవలసిన అవసరం లేకుండా పోయినప్పుడు నాకు తాళం గురించి, ఒంటరి తనం గురించి, అందులోని సౌకర్యం గురించి అర్ధం అయింది. అయితే అందరూ నాలాగే ఏకాంతం కోరుకునే వారు కారని కూడా నాకు అర్ధం అయింది. ఏకాంతం మనిషిని మార్చేస్తుంది. మనిషికి కొత్త దారులు చూపిస్తుంది. నేను టైనింగ్‌ క్లాసులో ఒక కథ చెబుతూ ఉండేవాడిని.

ఇద్దరు మిత్రులు ఒంటరితనం గురించి పందెం వేసుకున్నారు. వారిలో ఒకతను ధనికుడు. రెండో మనిషి మామూలు వాడు. మామూలు మనిషి, నేను ఎంతకాలమైనా ప్రపంచంతో పనిలేకుండా ఫోన్‌ లు టీవీలు లేకుండా, పత్రికలు కూడా లేకుండా గడపగలను, తిండి ఉంటే చాలు, అన్నాడు. ధనికుడు ఊరి బయట నాకు ఒక ఇల్లు ఉంది. అందులో నీకు వసతి ఏర్పాటు చేస్తాను. కిటికీలో నుంచి ఎప్పటికప్పుడు నీకు తిండి నీళ్ళు అందుతాయి. అంతేతప్ప మనుషుల అలికిడి కూడా వినిపించదు. ఆరు నెలలు నీవు కనుక ఆ పద్ధతిలో మా ఇంట్లో ఒంటరిగా ఉన్నావంటే నా ఆస్తి సగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. బీద మనిషి సరే అన్నాడు. ముహూర్తం నిశ్చయమైంది. అతడిని ఇంట్లో పెట్టి తాళం వేశారు. తిండి అందుతున్నది కాలం సాగుతున్నది. ఎక్కడ ఏ తేడా రాలేదు. ఐదున్నర నెలలు గడిచాయి. ధనవంతునికి వణుకు మొదలైంది. సగం ఆస్తికి కాలం చెల్లింది అనుకున్నాడు. ఐదు రోజులు మిగిలాయి. అతను కావలసిన కాగితాలు తయారు చేయించాడు. మిత్రుడు ఇంతకాలంగా గడిపిన ఇంటి దగ్గరికి వెళ్లి దూరం నుంచి చూచి వచ్చాడు. ఎక్కడ ఏ తేడా లేదు. బయట ఒక వాచ్‌ మన్‌ ఉంటాడు. లోపలి మనిషి వచ్చి పిలిస్తే గనుక తలుపు తీయాలి అని అతనికి ఆదేశాలున్నాయి. బయటి వారి పేరున మాత్రం తాళాలు తీయకూడదు. చివరి రోజు వచ్చింది.

మరుసటి నాటి ఉదయం వెళ్లి చూస్తే తాళాలు వేసినవి వేసినట్టు కనుక ఉంటే, ఆ మనిషి లోపలే ఉంటే అస్తి సగం అతనికి అందించాలి. కాగితాలతో సహా పంతం వేసిన మిత్రుడు ఉదయం అక్కడికి చేరాడు. ఆశ్చర్యంగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే మిత్రుడు లేడు. వాచ్‌మన్ తో వాకబు చేస్తే అయ్యా, ఆయన తెల్లవారుజామున తలుపు తీయమన్నాడు. నేను తలుపు తీశాను. ఆయన ముఖంలో గొప్ప వెలుగు కనిపించింది. గడ్డం కూడా పెరిగి ఉంది. జుట్టంతా పెరిగి ఉంది. ఆయన మారు మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను తప్పు చేయలేదు కదా అన్నాడు అతను. లోపలికి వెళ్ళి వెతికారు. పందెం వేసిన మిత్రుడు ఉన్న గదిలో ఒక కాగితం దొరికింది.

ఇన్నాళ్లు ఏకాంతంగా ఉండి నాకు ప్రపంచం గురించి ఆలోచించే అవకాశం అందించావు. భవిష్యత్తు గురించి నాకు గొప్ప ప్రణాళికలు దొరికాయి. నీ డబ్బుతో నాకు పనిలేదు.నా మార్గాన వెళ్ళిపోతున్నాను. మిత్రమా, నీకు ధన్యవాదాలు, అని రాసి ఉంది. మనిషి మీద ఒంటరితనం ప్రభావం అలాగుంటుంది.

ఈ పెద్ద మనిషికి ఏకాంతంలో తన గురించి తనకు తెలిసిపోయింది. నిజానికి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త మాట పుట్టాలంటే మనసులో కావలసినంత ఏకాంతం ఉండాలి. మన మెదడులో కోట్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. అవి అనుక్షణం మిగతావాటితో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాయి. కనుక మెదడులో పెద్ద గోల ఉంటుంది. ఆ గోలలో ఒక కొత్త ఆలోచన వచ్చినా సరే కలగలిసి పోతుంది. జాతరలోని గందరగోళంలో కూడా ఎవరో మన పేరు పిలిస్తే వినిపించి నట్టు, మెదడులోని గందర గోళంలో కొత్త ఆలోచన బయటకు రావడానికి కొంత దారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఏకాంతం. ఇది సూర్యకాంతం, అయస్కాంతం కాదు. అసలు సిసలైన ఒంటరితనం. అందరి మధ్యనా కూడా అలవాటు చేసుకోవలసిన ఒంటరితనం. నాకు కుదిరింది అని అనిపిస్తున్నది. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? లేకుంటే చించి చూడండి!


 

Friday, July 10, 2026

సూక్ష్మప్రపంచం - మన శరీరం లోపల పైన సూక్ష్మజీవుల గురించి


సూక్ష్మప్రపంచం

            ఈ విశ్వం చాలా విశాలమయినది. దాని పొడవు, వెడల్పుల కొలతలు మన ఊహలకు కూడా అందవు. అందులో ఉన్న గెలాక్సీల సంఖ్య ఆలోచనలకు అందదు. లెక్కలేని ఆ గెలాక్సీలలో ఒక్కొక్క దాంట్లో లెక్కలేన్నని చుక్కలు అంటే నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో సూర్యుడు కూడా ఒకటి. ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో భూమి ఒకటి. ఆ భూమి మీద బిలియన్‌ల సంఖ్యలో జనం ఉన్నారు. అందులో మనం ఉన్నాము. ఈ లెక్కన చూస్తే విశ్వంలో మనం సూక్ష్మజీవులం. ఇక మన శరీరం మీద ట్రిలియన్‌ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయని విషయం తెలిసినవారు చెబుతున్నారు. అంటే అవి ఎంత చిన్నవో మనం ఊహించలేము అని అర్థం. వాటిని పట్టించుకునేవాళ్లు చాలా కాలంగానే కొందరు ఉన్నారు. లూయి పాశ్చర్ అనే పెద్దమనిషి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. సూక్ష్మజీవులను పరిశీలించడం అన్న విషయాన్ని ఒక ప్రత్యేకరంగంగా నిలబెట్టిన ఘనత అతనిది అనవచ్చు. ఒక భూతద్దం చేత పట్టుకుని కనిపించిన ప్రతి వస్తువును పరిశీలించేవాడట. తిండి పెడితే తినడంకన్నా పరిశీలన ముఖ్యం అనుకునే వాడు. పక్కింటి వాళ్లు భోజనానికి పిలిస్తే భూతద్దం పట్టుకుని వెళ్లే వాడు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు పిలవడం మానేశారు.

            సూక్ష్మజీవులు కనిపించవు, కనుక అవి లేవు, అనుకుంటే మనకన్నా అమాయకులు మరెవరూ ఉండరు. అవి మన మీద, చుట్టుపక్కల, ఎటుచూస్తే అటు, ఆలోచనకు అందని సంఖ్యలో అంతటా నిండి ఉన్నాయి. మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. సబ్బుపెట్టి వళ్లంతా తెగ తోముకొని వుండవచ్చు. మన వంటిమీద గుంపులు గుంపులుగా సెంటిమీటర్ చర్మానికి లక్షల సంఖ్యలో బాక్టీరియా ఉండనే ఉంటుంది. మన వంటినుంచి అంటే చర్మం నుంచి ప్రతి నిత్యం బిలియన్‌ల సంఖ్యలో పొలుసులు ఊడి పడుతుంటాయి. పాశ్చర్ లాగా బూతద్ధం పెట్టి చూచినా అవి కనిపించవు. కనిపిస్తే మన పడక మనకు నరకం లాగ కనిపిస్తుంది. ఈ పొలుసులను తింటూ సూక్ష్మజీవులు మన మీద కాపురం ఉంటాయి. అక్కడ వాటికి మనం వదిలిన పొట్టు మాత్రమే కాక రుచికరమయిన నూనెలు, లవణాలు, ఖనిజాలు కూడా దొరుకుతాయి. వాటికి కనుక రుచి తెలిసే పద్దతి ఉంటే మన వంటిమీద మంచి విందు దొరుకుతున్నది అని అర్థం. వంటినిండా రంధ్రాలు ఉన్నాయి. కావలసిన్నని పగుళ్లు ఉన్నాయి. వాటిలోనుంచి సూక్ష్మజీవులకు తిండి సరఫరా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మనకు తిండి అప్ప్పుడప్ప్పుడు దొరుకుతుంది. వాటికి మాత్రం ఎప్ప్పుడూ దొరుకుతుంది.

            విందు తింటూ బ్రతికే సూక్ష్మజీవులు చర్మంమీద మాత్రమే కాదు, శరీరం మొత్తంలో, లోపల, బయట కూడా అదే పద్దతిలో అంటే లెక్కించలేని సంఖ్యలో ఉన్నాయి. పేగుల్లోకి వెళితే పెద్ద సంఖ్యలో ఉండే బాక్టీరియా లేకుండా మనకు తిండి అరగదు, అన్నది మనం అత్యవసరంగా తెలుసుకోవలనిన సత్యం. ముక్కులోపల కావలసిన్నని సూక్ష్మజీవులు ఉన్నాయి. కనుగుడ్డు మీద ఉండే తేమలో అవి ఈదుతూ ఉంటాయి. దంతాలమీది పింగాణీ పొరలో రంధ్రాలు వేస్తూ ఉంటాయి.

            మనిషి జీర్ణాశయంలో వంద ట్రిలియన్‌లకు పైబడి బాక్టీరియా ఉన్నాయని లెక్క తేలింది. అందులో కనీసం నాలుగు వందల రకాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని చక్కెరలను అరిగిస్తాయి. కొన్ని పిండి పదార్థాలను పట్టించుకుంటాయి. మరికొన్ని మిగతా సూక్ష్మజీవుల మీద దాడి చేస్తాయి. కడుపులో అంటే పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ యించుమించు మనకు సాయం చేసేవే. అయితే ఏమి పని చేస్తాయని తెలుసుకోవడానికి వీలు కుదరని రకాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. అవి పేగుల్లో అలా మనకు తెలియకుండానే కలకాలం కాపురం ఉంటాయి. వాటికి అలా ఉండడం అనుకూలంగా ఉంటుంది.

            మానవుని శరీరంలో సుమారు పది క్వాడ్రిలియన్ కణాలు ఉంటాయని లెక్క తేల్చారు. ఇక తరువాతి వాక్యం వినాలంటే గుండె గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉండాలి. సగటు మానవుని శరీరంలో బాక్టీరియాల సంఖ్య  వంద క్వాడ్రిలియన్‌ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైక్రోబయాలజీ రంగంవారు మనిషిని, మనిషి అనే కన్నా మరేదో అంటే బాగుంటుంది అంటారు. మనిషిలో మనిషి కణాలకన్నా మైక్రోబ్స్ కణాలు పదిరెట్లు ఎక్కువ ఉన్నాయి మరి. మనిషిమీద సూక్ష్మజీవులు బతుకుతున్నాయా లేక వాటిమీద మనిషి బతుకుతున్నాడా? ఇటువంటి ప్రశ్నలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, విషయంగా తెలుసుకోవడానికి మనకు, కొంచెం ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అసలు విషయం ఒప్ప్పుకోవాలంటే, మన శరీరంలో శరీరంకన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి మధ్యన మనం కూడా ఉన్నాము.

            బాక్టీరియా అనగానే రోగాలు కలిగిస్తాయని అందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. చాలా తెలివిగా వాటిని మట్టు పెట్టడానికి మనం సబ్బులు, ఆంటీయోటిక్స్ వంటివి క£నుగొని, మనలను మనం కాపాడుకుంటున్నామని భ్రమ పడుతున్నాము. వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులను తొలగించుకుంటున్నాము అన్నది, నిజం. కానీ అంతకన్నా పెద్ద సంఖ్యలో బాక్టీరియాలను పెంచి పోషించుకుంటున్నాము అన్నది, అంతకన్నా పచ్చి నిజం. ఈ మాట కూడా కొంతవరకు నిజం కాదేమో అని అనుమానం. బాక్టీరియాలకు సమాజాలు లేవు. ఊళ్లు, నగరాలు £ట్టుకోవాలన్న ఆశ అంతకన్నా లేదు. అయినా అవి మన సౌరమండలం కొనసాగినంత కాలం ఉండి తీరతాయి. భూగ్రహం నిజానికి వాటి స్వంతం. అవి మన పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అంటే మనిషి జాతికన్నా ముందు ఉన్నాయి. ఈ మనిషిజాతి కనిపించకుండా పోయిన తర్వాత కూడా అవి ఉండి తీరతాయి. అవి దయతలచి మనలను ఉండనిస్తున్నాయి, కనుక కొంతకాలం ఇక్కడ మనం కూడా ఉంటాము. బిలియన్‌ల సంవత్సరాలుగా భూమిమీద రకరకాల సూక్ష్మజీవులు కొనసాగాయి. మన తరువాత కూడా మనిషి లేకున్నా, అవి ఉండి తీరతాయి. ఇక్కడ మనం ఒక్క విషయం లెక్కలోకి తీసుకోవాలి. మనం లేనప్పుడు సూక్ష్మజీవులు ఉన్నాయి, కానీ సూక్ష్మజీవులు లేనిదే, మనం అనే మనుషులం, ఒక్క రోజు కూడా బతకజాలము. మనం వదిలిన మురికిని వదిలించడానికి సూక్ష్మజీవుల మీద ఆధారపడుతున్నాము అన్న సంగతి చాలా మందికి తోచకపోవచ్చు. పడేసిన వస్తువులు, అది పాచి అన్నం కావచ్చు, పశువులు, జంతువుల శరీరాలు కావచ్చు. కుళ్లడం బాక్టీరియాల వల్లనే జరుగుతున్నది. కుళ్లకుంటే వ్యర్థ పదార్థాలన్నీ అలాగే ఉండి పోతాయి. కుళ్లితేనే అవి మట్టిìలో క£లుస్తాయి. ఆ రకంగా మట్టిసారం పెరుగుతుంది. మనకు తెలిసిన, తెలియని జీవులను, మొక్కలను కుళ్లించడం ద్వారా సూక్ష్మజీవులు పైమట్టిని హ్యూమస్‌గా మారుస్తున్నాయి. అట్లా మారినందుకే మట్టిలోకి పోషకపదార్థాలు మళ్లీ చేరుతున్నాయి. కనుకనే అదే పొలంలో అయినా మళ్లీ పంటలు పండుతున్నాయి.

            మంచినీళ్లు శుభ్రంగా ఉండాలని మనం రకరకాలుగా ఏర్పాట్లు చేస్తుంటాము. బాక్టీరియా కారణంగా నీటి నాణ్యత తగ్గుతుంది. కానీ బాక్టీరియా కారణంగానే మరొక పరిస్థితిలో పెద్ద ఎత్తున నీళ్లు పరిశుభ్రం అవుతున్నాయి కూడా. నీటిలో చేరిన వ్యర్థపదార్థాలను కుళ్లించినందుకే ఆ మకిలి అడుగుకు చేరుతుంది. పైన తేటనీళ్లను మనం త్రాగగలుగుతాము.

            పేగుల్లో ఉండే బాక్టీరియా మనకు అవసరమయిన వైటమిన్‌లను తయారు చేస్తాయి. మందుబిళ్లలు తెచ్చి మింగనవసరం లేకుండానే మనకు అవసరమయిన పోషకపదార్థాలు సూక్ష్మజీవుల వలన అందుతాయి అన్నమాట. మనం తిన్న తిండిని చక్కెరలుగా మాÂర్చేది సూక్ష్మజీవులే. బయటినుంచి వచ్చిన బాక్టీరియామీద లోపల ఉన్న రకాలు తెల్ల రక్తకణాలకన్నా ముందే పోరాటాన్ని మొదలు పెడతాయి. తిండి అరగడం, ఆరోగ్యం నిలబడడం సూక్ష్మజీవుల వల్ల జరుగుతున్నది. అంటే అవి మనకు ఎంత అవసరం అన్నది అర్థం అవుతుంది.

            వాతావరణంలో సూక్ష్మజీవుల పాత్ర గురించి చెప్పుకోవాలంటే, ఆశ్చర్యరకమయిన వివరాలను అంగీకరించడా నికి సిధ్ధంగా ఉండాలి. మనకు తెలిసి, మనచుట్టూ ఉన్న గాలిలో ఎక్కువగా ఉండే భాగం నత్రజని అనే వాయువు. సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని వాడుకొని, మాంసకృత్తులకు ఆధారమయిన అమైనో ఆమ్లాలను తయారు చేస్తాయి. డిఎన్ఏలో ఉండే భాగాలను కూడా సూక్ష్మజీవులే తయారుచేస్తాయి. ఇది మనకు నిజానికి అర్థంకాని అద్భుతం. అపార్థానికి గురయిన అమాయక జీవులు తెలియకుండానే మనకు చేస్తున్న పకారం ఇది. పరిశ్రమలో నత్రజని ఎరువులను తయారుచేయడానికి అయిదువందల డిగ్రీల సెల్సియస్ వేడిమి అవసరం అవుతుంది. ఒత్తిడికూడా చాలా ఎక్కువగా వాడవలసి ఉండుంది. సూక్ష్మజీవులు మాత్రం ఈ చిక్కులేవీ లేకుండానే, మనకు కావలసిన పదార్థాలను తయారు చేసిపెడతాయి. కంటికి కనపడకుండా జరుగుతున్న ఈ ఉత్పత్తి కార్యక్రమం వల్లనే చిన్ననుండి పెద్ద జీవులన్నీ బతుకు కొనసాగించ గలుగుతున్నాయి.

            విశ్వంలో మానవులనే మనం ఉండి, మనకు మనం కూడా ఉపకారం చేసుకోలేక పోతున్నాము. మెదడు అంటూ ఒకటి ఉంది కనుక, మనం ఎందుకు ఉన్నాము, అని ప్రశ్నలు అడుగుతున్నాము. జవాబు దొరకక అసంతృప్తితో బ్రతుకు కొనసాగిస్తున్నాము. మనం రాకముందే భూమిమీద మనుగడ కొనసాగిస్తున్న సూక్ష్మజీవులు మాత్రం, కొత్తగా వచ్చిన మనలను ఈసడించకుండా ఉపకారం చేయడం నేర్చుకున్నాయి. ఎందుకు అని ప్రశ్న వేసుకోలేదు. చేతనయింది కనుక తమకు తెలిసిన పనిని చేస్తున్నాయి. మనకు మాత్రం మంచితనం మనసులోకి కూడా రాదు. ఒకవేలు ఎత్తి ఒకరిని అనేముందు, మిగతా మూడువేళ్ల గురించి పట్టించుకోవలసిన పరిస్థితి సూక్ష్మజీవుల విషయంలో ముమ్మాటికి నిజం.