I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Tuesday, February 24, 2026
లోకాభిరామం : మాటా - మంతీ On languages and speaking.
లోకాభిరామం : మాటా - మంతీ
On languages and speaking.
మాటా - మంతి
మాట అంటే ఏమిటో తెలుసు. మంతి అంటే ఏమిటో తెలియదు. ప్రాసగా
ఉంటుందని బహుశా మాటతోబాటు మంతి అని చేర్చి ఉంటారు. బాపుగారు వేసిన ఒక కార్టూన్ గుర్తుకు
వస్తుంది. ఒక పెద్దాయన చేతికి కట్టుగట్టుకుని దీనంగా ఉంటాడు. అతనిమిత్రుడు ఏమిటి?
అన్నట్టు చూస్తుంటాడు. “కూర ఏమిటి అన్నాను. మా ఆవిడ కంద
అంది. ప్రాస కుదిరింది కదా అని నీ బొందఅన్నాను” అన్న అక్షరాలు బుడగలో ఉంటాయి. మీకు ఈ మాటలు
అర్థమయ్యాయి, నవ్వు కూడా వచ్చిందని నమ్మకంగా
ఉంది. ఇంతకూ, మీకు ఏమి అర్థమయింది?
ఎందుకు అర్థమయింది? తరువాత నవ్వు వచ్చి,
గిచ్చి ఉంటే ఎందుకు వచ్చి చచ్చింది?
పుచ్చు ప్రశ్న అనకండి. చదువుతూ పొండి. అంటే వింటూ పొండి. మెచ్చుకోవడం
గురించి తరువాత ఆలోచిద్దాం. మీరేదో చప్పుడు చేస్తారు. ఎదురుగా ఉన్నవాళ్లు అర్థమయినట్టు
ఏదో చేస్తారు. మీరు చేసిన అన్ని ధ్వనులూ అందరికి అర్థమవుతున్నయా? కొన్ని ధ్వనులను,
అర్థం ఉండే ధ్వనులను అంటే, మాటలను మాత్రమే మీ
పక్కనున్న వారు అర్ధం చేసుకుంటున్నారా? ఆలోచించండి. బుర్రను చించండి. మనిషి శరీరంలో, ప్రత్యేకంగా గొంతులో ధ్వనులను
పుట్టించే వీలున్నది. మాట అన్నది ఉన్నదన్న సంగతి తెలియనినాడు మనిషి అన్నవాడు తన భావాలను సైగలతోనే చెప్పుకుని ఉంటాడు. ఆ
తరువాత మూలుగులు, కేకలు,
మొదలయి ఉంటాయి. జంట అక్షరాలు, మరిన్ని పెద్ద పదాలు
పుట్టి ఉంటాయి. క్షమించండి, నాకు భాష పుట్టుక గురించి ముక్క
తెలియదు. ఆలోచించడం,ఊహించడం కొంత చేతనవుతుంది. కనుక,
ఏదేదో చెప్పేస్తున్నాను. పాత మానవుడుగాని,
ఇక మీరు అనే కొత్త మానవుడుగాని మాట్లాడి ఎదుటివారు
అర్ధంచేసుకోవాలని అనుకుంటే, ఒక మాటకు మీరనుకున్న అర్థమే ఎదుటి
మనిషి మెదడులోని నిఘంటువులో కూడా ఉండి తీరాలి. సూటిగా ఒక్కమాటలో చెప్పాలంటే,
ఇద్దరికీ ఒక భాష, ఒకే భాష తెలిసి ఉండాలి. ఒకే భాషలో ఒకే
మాటకు రకరకాల అర్థాలు ఉండే పరిస్థితి దాకా ఇప్పుడు మనం పోనవసరం లేదు. భాష అంటే
మాటలకు అర్థాలు ఒకేరకంగా తోచే ధ్వనుల పద్ధతి అనవచ్చా?
నేనయితే అంటున్నాను. అర్థం అని సులభంగానే ఉంటున్నాము గాని,
అభివృద్ధిచెందిన భాషలలో కూడా ఒకే అర్ధం ఉన్న మాటకు బోలెడు
అర్థాలు ఇవాళిటికీ తోస్తున్నాయి. అంటే,
భాష అన్నది చేతికి అందే ఒక పదార్థం కాదు. ఏ చెట్టు మీదా
కాయడం లేదు. అంతరిక్షంలో అంతకన్నా లేదు. ఎవరో 'చెప్పు'
అన్నారనుకుందాము. ఆ రెండు అక్షరాలు ఒక పదార్థం. అవి రెండూ
కలిసి గాలిలో అలలను పుట్టించాయి. అలలు వచ్చి వినేవాళ్ల చెవులకు తగిలాయి. అక్కడ
అణువులు కదిలాయి. నాడులు పనిచేశాయి. మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. విన్నది
ఎవరన్నదాన్ని బట్టి, మాట అర్థం వేరు వేరుగా తోస్తుంది.
సైంటిస్ట్‌కు మొట్టమొదలు ఆ రెండు అక్షరాలు ఒక ధ్వనిగా తోస్తాయి. అది పుట్టిన చోటు
తెలుస్తుంది. కదిలిన తీరు తెలుస్తుంది. అలల నిడివి పట్టి ఆడ,
మగ గొంతు తేడా తెలుస్తుంది. వయసు తేడా తెలుస్తుంది.
వీటన్నిటిలో టార్చ్ వేసి వెతికినా, మాట అర్ధం మాత్రం తెలియదు. “చెప్పు” అన్న ఈ శబ్దానికి అర్ధం
కూడా ఉండి తీరాలి. ఉంది మరి. అర్ధం ధ్వనిలో లేదని అర్థమయింది. ఆ పరమార్థం మరెక్కడో ఉంది. అది మెదడులో ఉంది. అర్థమయ్యే తీరునుబట్టి ‘ఏంచెప్పమంటావు?'
అన్న జవాబు రావచ్చు. “ఒకటా రెండా?చెప్పు ఏమిటి?
జత ఉండాలికాని!' అన్న జవాబు కూడా రావచ్చు. జవాబు
రాకుండానే జయలలిత గారి చెప్పుల దృశ్యం మనసులో మెదిలి ఉండవచ్చుకూడ. బాటకాని
బాటావాని అంగడి గుర్తుకు వచ్చి ఉండవచ్చు కూడా. దారి పక్కన కూర్చుని తన పని తాను చేసుకుంటున్న
ముసలి మోచీ తాత గుర్తుకు రావచ్చు కూడా! అన్నది ఒక్క మాట. కానీ ఎన్నెన్నో దృశ్యాలు,
ఎన్నెన్నో ఆలోచనలు! పుట్టిన దృశ్యాలు, ఆలోచనలు అన్ని కలిసి తెలుగులోనే
తిరుగుతున్నాయి. ఇక మరొక భాష గురించి కూడా ఆలోచిస్తే, ఏమవుతుందో చెప్పలేము. చెప్పు అన్న మాటకు ప్రపంచభాషలలో
మరెక్కడయినా వేరు అర్థాలు ఉన్నాయేమో వెతకాలి. వెతకడం చేతగావాలేగాని తప్పకుండా ఉండే ఉంటాయి.
గొప్ప వైవిధ్యం వీలవుతుందనుకున్న మనిషి గొంతు కూడా పుట్టించగలిగేది కొన్ని మాటలను
మాత్రమే. కనుక దేశ కాలాలనుబట్టి ప్రపంచంలో మూలలలో ఎక్కడో ఈ మాటకు మరొక అర్థం ఉండనే
ఉంటుంది. కనీసం ఇలాగే వినిపించే మాటలు కొన్ని ఉండే ఉంటాయి. వాటన్నింటికి అర్ధం
మనకు తెలియక పోవచ్చు. “స్వాప్” అని ఒక మాట ఉంది. ఇంకో మాట
ఏదో ఉంది. వీటికి అర్ధం తెలియదంటే మన చెవులు సరిగా పని చేయడం లేదని మాత్రం అర్ధం కానేకాదు. చెవులకు తెలిసేది
ధ్వని మాత్రమే. అది భౌతికమయిన విషయం. ఆ మాటలను వేరు వేరు రకాలుగా అన్నా సరే,
వినబడి తీరుతుంది. మరి వాటికి ఉండే అర్ధం లేదా అర్థాలు
మాత్రం చేతికి అందే సంగతులు కావుకదా? తెలియని భాషలో ఎవరయినా ఒక ప్రశ్న అడిగితే,
వినిపించినా సరే వినిపించనట్టు బేల ముఖం వేయడం తప్ప మనంచేయగలిగింది మరొకటి ఉండదు. దాస్ తో కలకత్తా వీధులలో
తిరుగుతున్నాను. దూరంగా ఎత్తయిన భవనం మీద ఒక హోర్డింగ్ కనిపించింది. అందులో తాటికాయలను,
తలకాయలను తలదన్నే రీతిలో కారు సైజు కాదంటే గుడిసె సైజులో
పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. “సాధనా ఔషధాలయ్'
అని గట్టిగానే చదివాను. దాస్ ఎగిరిపడినంత పనిచేశాడు. “నీకు
బెంగాలీ వచ్చా?” అని అడిగాడు. అడిగింది మాత్రం బెంగాలీలో
కాదని మనవి. నాకు బెంగాలీ రాదు. ఖంగాళీ అంతకన్నా రాదు. అంతోకొంతో హిందీ వచ్చు.
కనుక నాగరి అక్షరాలు తెలుసు. బెంగాలీ అక్షరాలు నాగరిలోలాగే ఉన్నాయి. ఇంతకూ దాస్
నన్ను ఏ భాషలో ప్రశ్న అడిగి ఉంటాడు? ఆలోచించండి చూద్దాం! అది కలకత్తా
అని చెప్పి పూర్వ రంగం వేశాను. మనిషికి దాస్ అని పేరు పెట్టి మరింత బెంగాలీ రంగు పూశాను.
ఆ బెంగాలీ మనిషికి నా మాతృభాష అయిన తెలుగు వచ్చి ఉండే అవకాశం చాలా తక్కువ. వస్తే
గిస్తే మా ఇద్దరికీ కలిసి ఇంగిలీషు లేదంటే హిందీ వచ్చి ఉంటాయి. దాస్ తప్పకుండా ఈ
రెంటిలోనూ ఏదో ఒక భాషలో అడిగి ఉంటాడు అని సులభంగానే ఊహించవచ్చు. నేను పిల్లిని సంచీలోనుంచి బయటకు వదిలేశాను. అంటే,
రహస్యమేదో చెప్పేశాను. పిల్లిని సంచీలోనుంచి వదలడం అంటే రహస్యం చెప్పడం అని అర్థం వచ్చే తీరు తెలుగు భాషలో లేదు.
అది ఇంగ్లీషులో మాత్రమే ఉంది. ఇంగ్లీషు ప్రభావంతో ఇటువంటి మాటలు మనం కూడా
నేర్చుకుని వాడేసుకుంటున్నాము. మంచి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికమీద
చేస్తున్నాము. వార్ ఫూటింగ్ అన్న మాట అసలు సిసలు ఇంగ్లీషు పద్ధతి. ఎక్సర్‌సైజ్
కూడా ఇంగ్లీషు మాటే. దానికి ఒక పని లేదా ప్రయత్నం అని అర్ధం. మాటకు ఉన్న
నానార్థాలలో వ్యాయామం, కసరత్తు అనేవి కూడా ఉన్నాయి.
బహుమతికి ఒక వ్యక్తిని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలయింది అని వాక్యం
రాస్తున్నారు. ఇక్కడ రాసిన వాళ్లు ఎక్సర్‌సైజ్ అనే మాటకు కసరత్తు అన్న అర్థాన్ని అసందర్భంగా
వాడుకుంటున్నారని వేరే చెప్పాలా? ఇంతకు మనం అనగా నేను,
తరువాత మీరు కొమ్మలు దూకినట్టున్నాము. అనగా శాఖాచంక్రమణము
చేసితిమని అర్థము. అనగా అసలు విషయము వదిలి ఎక్కడో పక్కకు కదిలితిమని అర్ధము. కావున,అనగా, అనగా తిరిగి
పాతకొమ్మకు చేరుదము గాక!
No comments:
Post a Comment