Showing posts with label lesson. Show all posts
Showing posts with label lesson. Show all posts

Friday, May 1, 2026

చక్కని దోస్తీ : ఒక చక్కని కథ - A short little story about truth.


చక్కని దోస్తీ

ఒకానొకప్పుడు ఒక అందమైన ఆవిడ ఉండేది. ఆమె నగరంలో అంతటా తిరుగుతూ ఉండేది. వెళ్లిన చోట ప్రతి వాళ్లు ఆమెను గమనిస్తూ ఉండేవారు. అందరూ ఆమెతో మాట్లాడాలి అనుకునే వారే. ఆమె మాటలు వినదలుచుకున్న వారే. ఆమెను ఏదో అడగదలుచుకున్న వారే. ఏదో ఒక రకంగా ఆమెతో కలిసి కాలం గడపాలని అందరూ అనుకుంటారు. అదే నగరంలో ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె బీదమనిషి. తగిన దుస్తులు లేనిది. అయితే ఆమె కూడా చాలా అందంగా ఉండేది.అయినప్పటికీ ఎవరూ ఆమెను పట్టించుకునే వాళ్ళు కాదు. కనుక బహుశా ఆ అమ్మాయి ఒంటరిగా, దుఃఖంగా ఉండేదేమో. ఆమె కూడా అందమైన ఆవిడను చూస్తుంది. ఆమెను అందరూ పట్టించుకునే తీరు గమనిస్తుంది. తనను కూడా అందరూ పట్టించుకుంటే బాగుంటుంది కదా, అనుకుంటుంది. తన మనసులోని మాటలను అందరికీ చెప్పాలని ఆమెకు చాలా కోరిక. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోరు.

ఒకనాడు చింకి దుస్తులలో ఉన్న బీద అమ్మాయి, ఏదోరకంగా ధైర్యం తెచ్చుకుంది. వెలగల దుస్తులు వేసుకున్న అందమైన అమ్మాయి తో మాట్లాడడానికి ధైర్యం చేసింది. ఏమండీ, నన్ను మీరు క్షమించాలి. మిమ్మల్ని ఒక సహాయం అడగవచ్చునా?’ అన్నది ఆ అమ్మాయి. ధనికురాలయిన మహిళ నిజానికి చాలా మంచి మనిషి. చాలా దయగల మనిషి. కనుక వెంటనే బీద అమ్మాయి మాటలు విన్నది.

అదేమన్న మాట! ఏం అడగదలుచుకున్నావు చెప్పు మరి!, అన్నది ఆమె బీద అమ్మాయితో.

ఏం లేదండీ, ధైర్యం చేసి బీద అమ్మాయి మాట్లాడ సాగింది. మీరు చాలా అందంగా ఉన్నారు. అందుకు తగినట్టే మంచి దుస్తులు కూడా వేసుకుంటారు. అందుకని అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు. నేనేమో బీద దాన్ని. నా దగ్గర మంచి దుస్తులు లేవు. కనుక ఎవరూ నన్ను పట్టించుకోరు. కనీసం ఒక్కరోజు, మీ దుస్తులు వేసుకుని, మీ వెంట తిరగాలని ఉంది. మిమ్మల్ని చూసిన వాళ్లంతా, నన్ను కూడా చూస్తారు. వాళ్ళందరికీ చెప్పడానికి నా దగ్గర ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతి ఇప్పుడు వాళ్లకు తెలియదు మరి! అని, ఆ అమ్మాయి వినయంగా నిలబడింది.

అందమయిన ఆవిడ చాలా సులభంగా అమ్మాయి కోరికకు అంగీకరించింది. మరుసటి రోజు ఉదయాన ఆమె తన దుస్తులు బీద అమ్మాయికి వేసింది. తనతో పాటు వెంటబెట్టుకుని నగరంలో తిరగసాగింది. మామూలుగానే, అందరూ వాళ్ళకి ఎదురుగా వచ్చారు. పక్కన ఉన్న అమ్మాయిని కూడా వాళ్లంతా చూడగలిగారు. ఇద్దరూ కలిసి నడుస్తూ చాలా సంగతులు మాట్లాడుకున్నారు. బీద అమ్మాయిని ప్రశ్నలు అడిగి అందమైన అమ్మాయి ఎన్నో సంగతులు విన్నది. ఆమె గురించి తెలుసుకున్నది. అమ్మాయి చెప్పిన సంగతులు ఎంతో బాగున్నాయని అర్థం చేసుకున్నది. బీద అమ్మాయి తెలివిగలది, అని ఆమెకు సులభంగానే అర్థమైంది. వాళ్ళిద్దరూ నేస్తాలయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరుగుతు న్నారు. అందరితోనూ మాట్లాడుతున్నారు.

వాళ్ళ పేర్లు ఏమిటి? అని ఎవరికి ఇప్పటివరకు అనుమానం రాలేదా?

అందమైన ఆవిడ పేరు, కథ. ఆమెతో నేస్తం కట్టిన బీద అమ్మాయి పేరు, నిజం.


 

Friday, April 24, 2026

లోకాభిరామం : పరిశోధన - పద్ధతులు On Research and skills



పరిశోధన - పద్ధతులు

తీరు ఒకటే

చాలామంది చదువు అయిపోయింతరువాత పరిశోధన చేసి పిఎచ్‌.డి అని ఒక డిగ్రీ సంపాయించుకుంటారు. పరిశోధన సయిన్సులో గానీ, సామాజిక శాస్త్రంలో గానీ, మరో అంశంలో గానీ, పద్ధతి ఒకేలాగ ఉంటుంది. మార్గదర్శనం చేయడానికి ముందు ఒక గురువు, ఆ గురువు సాయంతో పరిశోధనకు ఒక చక్కని సమస్య ఎంపిక చేసుకోవాలి. ఆ సమస్య గురించి ముందు వీలయినంత సమాచారం, ఇప్పటికి జరిగిన పరిశోధనల ఫలితాలు సేకరించాలి. ఆ తరువాత మన ఆలోచన గురించి ప్రయోగాలు, విశ్లేషణలు సాగుతాయి. సామాజిక విషయాలలో ఈ పనంతా, మెదడు, కాగితాల ఆధారంగా జరిగితే, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఒక పరిశోధనశాల అవసరమవుతుంది.

దారి మారుతుంది: సైన్సులో మెటీరియల్స్‌, మెథడ్స్‌ రెండూ అనుకున్నంత సులభం కావు. గొట్టాలు, గిన్నెలు మొదలు ఎన్నో రకాల పరికరాలు, యంత్రాలు, రసాయనాలు అవసరమవుతాయి. అవన్నీ ముందు నుంచే అమరి ఉంటాయని ఎక్కడా లేదు. నేను రక్తంలోని ప్రొటీనులు, వాటిలోని జన్యు వైవిధ్యం గురించి పరిశోధించాను. ఈ పని నాకంటే ముందు ఎవరూ చేయలేదు అని చెప్పలేను గాని, నేను పరిశీలించిన అంశాలలో కొన్ని ఈ దేశంలో, ఈ ఖండంలోనే ఎవరికీ తెలియవు! పెద్ద పరిశోధన సంస్థలలో, పరికరాలు మిగతా సరంజామా కూర్చడానికి సదుపాయాలుంటాయి. ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాలలో సదుపాయాలే కరువు. అందునా కొత్త రకాలు ఏం కావాలన్నా సమస్యే! మా గురువు గారు రామచంద్రరావుగారు మాత్రం, ధైర్యం ఇస్తూ వెనక ఉండి మమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు. పొరపాట్లు, ప్రమాదాలు జరుగుతాయని అనుమాన పడితే పనులు జరగవన్న తత్వం మాకంతా అలవాటయింది. ప్రత్యేకంగా నాకు మరీ ఎక్కువగా!

ప్రయత్నం: యూనివర్సిటీలలో చిత్తశుద్ధిగా పరిశోధన చేసిన వారికి, సమస్యలను విశ్లేషించడం, అన్ని పనులు స్వయంగా చేసుకోవడం లాంటి లక్షణాలు బాగా అలవడతాయని నమ్మకంగా చెప్పగలను. మనిషి రక్తంతో సాగే మా పరిశోధనలో పరిశుభ్రతకు పెద్ద పీట. ప్యాంటు పైకి లాగి, ల్యాబ్‌ అంతా రసాయనాలతో శుభ్రం చేయడం మాకు అలవాటు. ఇక నిత్యం వాడే గాజు సామాన్లు, ఎంత బాగా కడిగి, ఆరబెట్టుకుంటే అంత బాగా ఫలితాలుంటాయి. ఏ కొంచెం కంటామినేషన్‌ వచ్చినా ఫలితాలు తప్పవుతాయి. ఈ శుభ్రత ముందు ఇంట్లో, అంట్లు కడగడం ఆటగా కనిపిస్తుంది! పరిశోధనలో ముందు చాలాకాలం, వాడబోయే సాంకేతిక పద్ధతులను, అందులో వాడబోయే రసాయనాలు సరంజామాను ప్రామాణీకరించడానికే పోతుంది. అది సమంగా కుదిరిందంటే అసలు ప్రయోగాలు సులభంగానే సాగుతాయి. ఎలెక్ట్రోఫోరెసిస్‌ అనే ప్రక్రియలో రకరకాల పద్ధతులను నేను బాగా మధించాను. వాటిలో ఒకదాంట్లో మెలుకువలు నేర్వడానికి కొంతకాలం కలకత్తాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండి వచ్చాను. అక్కడి వారికీ, నాకూ దోస్తీ కుదిరింది.

ప్రయోగం: ఇక్కడ ఎదురయ్యే సమస్యలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. స్టార్చ్‌ జెల్‌ తయారీ కొరకు నాకు గాలిని పీల్చి ఖాళీ ఏర్పరిచే వ్యాక్యూం పంప్‌ అవసరమయింది. గురువుగారికి ఆ మాట చెప్పాను. ‘దాందేముంది? కొనిపించు!’ అనేశారాయన. కొన్ని పరికరాలను డిపార్టుమెంటు వారు కొంటారు. కొన్నింటిని మా ల్యాబ్‌ గ్రాంటు నుంచి తెస్తాము. కొనిపించు, అంటే మొదటి పద్ధతి. వెళ్లి స్టోర్‌ కీపర్‌ గోపాలరెడ్డికి విషయం చెప్పాను. ‘మన దగ్గర అటువంటి పంపు ఒకటి ఉంది. దాన్ని వాడింది లేదు. నీవు పరీక్షిస్తానంటే ఇస్తానన్నాడు’ రెడ్డి. చూస్తే పంపు కొత్తది! నిజంగానే దాన్నెవరూ వాడింది లేదు. ఎత్తుకుని ల్యాబ్‌కు తెచ్చాను. కనెక్ట్‌ చేసి స్విచ్‌ వేస్తే, తిరగడం మొదలయింది. కానీ, గాలిని పీల్చడం మాత్రం లేదు. ఇలాంటి వాటిని గురించి ఎవరినో అడిగేంత ఓపిక లేదు. స్పానర్‌ సెట్‌ తీసి యంత్రాన్ని ఎక్కడికక్కడ విడదీశాను. అన్ని భాగాలను బాగా శుభ్రం చేసి తిరిగి బిగించాను. ఈసారి మరింత బాగా తిరిగింది. కానీ గాలిని మాత్రం పీల్చదు. లోపల నేను మరీ శుభ్రం చేశానని అనుమానం వచ్చింది. యూనివర్సిటీ వర్క్‌షాప్‌కు వెళ్లి అక్కడ మిత్రులతో చర్చించాను. ‘ఇంతకూ ఆయిల్‌ పోసినవా?’ ఒకతను అడిగాడు. లైటు వెలిగింది. నేను విప్పినప్పుడు, ఒకానొక భాగంలో కొంత జిగట పదార్థం ఉంది. ఆయిల్‌ మాత్రం కాదు! అంటే ఆయిల్‌ ఆరిపోయింది. వెంటనే రాణీగంజ్‌ చలో! ఆయిల్‌ తెచ్చి పోశాను. ఈసారి గొట్టం వేలికి అతుక్కుంది. గురువుగారిని పిలిచి, ఆయన వేలికి గొట్టం పెట్టి ఆన్‌ చేసింది తడవు ఆశ్చర్యంగా అది వేలికి అతుక్కుంది! ‘అసాధ్యుడవు! పైసలు మిగిలించినవు కూడ!’ మెచ్చుకున్నారాయన. మామూలు మొదలు చాలా వెలగల యంత్రాల దాకా, అన్నింటినీ విప్పడం అలవాటయి పోయింది! పక్క డిపార్టుమెంట్ల వారు కూడా, నా కోసం వచ్చేదాకా వెళ్లింది పరిస్థితి! స్వయం ప్రతిపత్తి అట్లాంటిది!

మరో తీరు: ఎస్టరేజ్‌-డి అనే ఎంజైమ్‌ విశ్లేషణ ఈ ఖండంలోనే ఎక్కడా జరగలేదు. అందుకు అవసరమయిన పరికరాలు, పద్ధతులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక రసాయనం మాత్రం లేదు. అది అవసరమయేది మిల్లిగ్రాములలో. కానీ, అసలు దొరికినప్పుడు గద! రసాయనాలు ఏ దేశంలో దొరికితే, అక్కడి నుంచి తెప్పించడం మాకు అలవాటే! ఎన్‌ ఐ ఎన్‌, ఆర్‌ ఆర్‌ ల్యాబ్స్‌ లాంటి చోట్ల లైబ్రరీలన్నింటా రకరకాల కంపెనీల కేటలాగులన్నీ పరిశోధించాను. అప్పట్లో ఇంటర్‌నెట్‌ లేదు మరి! నాకు కావలసిన రసాయనం ఎక్కడా లేదు. చివరకు ఉస్మానియాలోనే బయోకెమిస్ట్రీ డిపార్టుమెంట్‌లో ఒక పాత కేటలాగులో రసాయనం పేరు కనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. రోష్‌ అనే యూరపు కంపెనీ వారి దగ్గర రసాయనం ఉండేది. ఇటలీయా? మరో దేశమా? వారికి ప్రేమగా ఉత్తరం రాశాను. నెల తిరిగే లోపల నాకొక పార్సిల్‌ వచ్చింది. అందులో ఒక ఉత్తరం ఉంది. ‘మీరు అడిగిన రసాయనం మేమిప్పుడు తయారుచేయడం లేదు. చేసినా అది అవసరమయ్యేది మిల్లిగ్రాములలోనే కదా. చిత్రంగా మా స్టోర్‌లో ఒకటి రెండు సీసాలు కనిపించాయి. అందులో ఒకదాన్ని మీకు గిఫ్ట్‌గా పంపుతున్నాము. అది మీకు పనికివస్తే, అంతకంటే కావలిసింది లేదు’ అన్నారు వారు. వెతికినా దొరకని రసాయనం ఊరికే వంద గ్రాములు దొరికింది! విశ్లేషణ మొదలుపెట్టాను. మొదటిసారే అది బ్రహ్మాండంగా పని చేసింది! మా ల్యాబ్‌లో ఆ విధానమూ, ఆ రసాయనమూ రెండూ నా కృషి ఫలితాలు. నాకు పనికి వచ్చాయి. తరువాతి వారు వాడుకుంటే నేనెందుకు కుళ్లుకోవాలి?

వార్త: ఎస్టరేజ్‌ డి గురించి పేపర్‌ ప్రకటించామనుకుంటాను. అందరూ ఆశ్చర్యపోయారు. కలకత్తా మిత్రులు నాకు ఉత్తరం రాసి, రసాయనం మాకు కొంచెం ఇవ్వగలవా? అని అడిగారు. నేను స్వయంగా సంపాయించింది అయినా, అది ల్యాబ్‌ ఉమ్మడి ఆస్తి అని భావన. అయినా పంపించాను. వారు పేపర్‌ ప్రకటిస్తే, అందులో నాకు ధన్యవాదాలు చెప్పే ప్రమాదం ఉంది. ఏమయిందో నాకు గుర్తు లేదు. మనం వెళ్లి మరొకరి దగ్గర ఏవో నేర్చుకున్నట్టే, మన దగ్గర నేర్చుకునేందుకు ఎవరో వస్తుంటారు. ఇక్కడ స్వార్థం అన్న లక్షణం, రహస్యం అన్న భావన అసలు లేవు. ఈ రకంగా నేను చాలా కొత్త టెక్నిక్స్‌ ప్రారంభించాను. తోటి వారికి నేర్పించాను. వారు వాడుతుంటే గర్వించాను!

సింకో కెమిస్ట్రీ: బయోకెమిస్ట్రీ లాంటి రంగంలో వేలు లక్షల విలువచేసే రసాయనాలు, రీఏజెంట్లను వాడి, కడిగి కాలువలో పోయడం మామూలే. ఆ పోసే వాష్‌ బేసిన్‌ పెద్దది. దాన్ని సింక్‌ అంటారు. మా తీరు నచ్చని మిగతా పొదుపరి శాఖల వారు మమ్మల్ని ‘సింకో కెమిస్ట్రీ’ అనేవారు. అయినా పరిశోధనలన్నీ మెదడుతో మాత్రమే జరగాలంటే కుదరదు గదా!

అదేమో గానీ, సైన్సు పరిశోధనలో ఉన్న వారికి, అంట్లు తోమడం మొదలు, కంప్యూటర్‌, ఫొటోగ్రఫీ దాకా ఎన్నెన్నో సంగతులు నేర్చుకోవలసిన అవసరం, అవకాశం వస్తాయి. నాకెందుకులే, ఎవరినో అడగ వచ్చు ననుకుంటే చెప్పలేను గానీ, నేను మాత్రం ఎదురయిన ప్రతి అవకాశాన్నీ అంది పుచ్చుకున్నాను. డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ అనే డిగ్రీ వచ్చింది. నేను దాన్ని వాడటం లేదు. కానీ బతుకుకు ఒక ఫిలాసఫీ దొరికింది. ఇవాళటికీ నా పనులన్నీ వీలయినంత వరకు నేనే చేసుకోవాలనుకుంటాను. కనుక ఎన్నో నేర్చుకున్నాను. పనులు చేసుకుంటున్నాను. అందులోని ఆనందమే వేరు!

కొసరు ముచ్చట: ఉస్మానియా యూనివర్సిటీలో నా పరిశోధన కాలం గురించి తలుచుకుంటే, అందరికన్న ముందు స్వీపర్‌ ముసలమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె రాక ముందే నేను ల్యాబ్‌లో పనిలో ఉండేవాణ్ణి. ఊడవాలి గనుక ‘పంకలు బందుజెయ్‌!’ అనేది ముసలమ్మ. ‘నీవు చేయొచ్చు గదా?’ అని నా ప్రశ్న. ‘షాక్‌గొట్టి చచ్చిపోతే?’ ఆమె జవాబు. ‘నాకు గొట్టదా? నేను చస్తే ఫర్వాలేదా?’ అంటాను నేను నవ్వుతూ! ‘నీవు బాస జదివినవు గద. నీకు షాకు గొట్టదు!’ ఆమె జవాబు!


 

Thursday, January 22, 2026

Tuesday, January 6, 2026

జాతక కథలు 113 రహస్యంగా : Jataka Tales - Sheela vimamsana Jatakam...

జాతక కథలు 113 రహస్యంగా

శీల విమంషణ జాతకం

జేతవనంలో ఉండగా బుద్ధుడు శీల నియంత్రణ గురించిన ఈ కథను చెప్పాడు.

ఒకానొక రాత్రి అప్పుడప్పుడే దీక్ష పొందిన 500 మంది భిక్కులు తీవ్రంగా ఆలోచనలో పడి తిరిగి మామూలు జీవితంలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వారిని కాపాడే ఉద్దేశంతో బుద్ధుడు ఆనందుని పిలిచి ఆ బిక్కులందరినీ జేతవనంలో సమావేశపరచమన్నాడు. అందరూ వచ్చారు. బుద్ధుడు వారిని సంబోధిస్తూ భిక్షువులారా గతంలో ఒకసారి ఒక బుద్ధిగల మానవుడు తప్పు చేయడాన్ని ఏ రకంగానూ దాచలేము అని అర్థం చేసుకొని తప్పులు చేయకుండా బతకగలిగాడు, అంటూ ఒక కథ వారికి చెప్పాడు.

పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చదువుకోవడానికి సరైన సమయం వచ్చిన తరువాత ఆ బాబును ఒక పేరుగల గురువు వద్ద చేర్చారు. ఆ గురువుగారి వద్ద 500 మంది శిష్యులు ఉండేవారు.

ఆ గురువుగారికి అందమైన ఒక కూతురు ఉండేది. ఆమె పెళ్లి వయసుకు వచ్చింది. తగిన భర్తను వెతకాలని గురువుగారు ప్రయత్నంలో పడ్డారు. నా వద్ద గల యోగ్యులైన శిష్యులలో ఒకరిని ఎంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు.

ఒకనాడు ఆయన శిష్యులందరినీ ఒకచోట చేర్చి ఒక ప్రకటన చేశారు. శిష్యులారా! నాకు పెళ్లి ఈడుకు వచ్చిన ఒక కూతురు ఉన్నది. ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మరి అంతకుముందు ఆమెకు తగిన దుస్తులు, నగలు అన్ని ఏర్పాటు చేయాలి కదా అటువంటి వస్తువులను మీరు దొంగిలించి తేవాలని నా నిర్ణయం. వెలగల వస్తువులు ఏవైనా సరే, కానీ ముఖ్యంగా, వాటిని మీరు పూర్తి రహస్యంగా ఎవరూ చూడకుండా దొంగిలించాలి. మీరు ఆ వస్తువు దొంగిలించినట్టు ఎవరైనా చూసినట్లయితే అటువంటి వస్తువు నాకు అవసరం లేదు. దొంగిలించిన వస్తువులను నేరుగా నా వద్దకు తీసుకురండి. వివరం చెప్పండి. అయితే ఎవరూ చూడకుండా వాటిని సేకరించాలి అన్నారు ఆ గురువుగారు.

శిష్యులు గురువు చెప్పిన నిబంధనను అంగీకరించి తమ ప్రయత్నంలో పడ్డారు. పోటీలో నిజంగా గెలిస్తే తమకు ఒక చక్కని భార్య దొరుకుతుంది అని వారి ఆనందం. ఇక రాత్రి, పగలు, వారు నగరంలో దొంగ చాటుగా వెళ్లి దుస్తులు, నగలు, ఇతర వెలగల సామాన్లు దొంగలించుకు వచ్చారు. ఒకరి తరువాత ఒకరు ఆ వస్తువులన్నింటినీ గురువుగారికి చేర్చారు. గురువుగారు వాటన్నింటినీ వివరంగా దొంగిలించిన వారి పేర్లతో పాటు ఒక పట్టికలో నమోదు చేసుకున్నారు.

గురువుగారు అందుకు ఏర్పాటు చేసిన గది నిండిపోయింది. అప్పుడు ఆయన శిష్యులందరినీ పిలిపించారు. అందులో ఒక శిష్యుడిని ముందుకు పిలిచి, “నీవు ఒక్కడవు నాకోసం ఏమీ తేనేలేదు, అన్నారు.

నిజమేనండీ, గురువుగారూ, అన్నాడు ఆ శిష్యుడు.

ఏం? ఎందుకని?” గురువుగారు ప్రశ్నించారు.

గురువుగారూ, మీరు ఈ దొంగతనాలన్నింటినీ మేము అతి రహస్యంగా చేయాలని కదా చెప్పారు. తప్పు చేసే తీరును రహస్యంగా ఉంచడం కుదరదని నాకు అనిపించింది. దుర్మార్గంగా చేసే ఏ పనీ రహస్యంగా ఉండదు. తెలివి తక్కువవారు తాము చాలా తెలివిగానే దొంగిలించాము అనుకోవచ్చు. కానీ ఎవరో ఒకరు ఆ సంగతిని గమనించే ఉంటారు. కనుక నేను ఏ వస్తువు తేలేదు, అన్నాడు శిష్యుడు.

ఆ మాటలతో గురువుగారు ఎంతో సంతృప్తి చెందారు. మిగతా శిష్యులతో వారు దొంగలించిన వస్తువులను ఎవరివి వారికి అప్పగించి క్షమాపణలు చెప్పమన్నారు.

అల్లుడు కాబోతున్న శిష్యుడిని పిలిచి యువకుడా, నా వద్ద కావాలసినంత ఆస్తి ఉన్నది. నా కుమార్తె పెళ్లి కొరకు ఎటువంటి వస్తువులకు నాకు లోటు లేదు. నేను నిజానికి ఒక గుణవంతుడైన యువకుని వెతకాలని మాత్రమే ప్రయత్నించాను. కనుక మీకు అందరికీ ఇదొక పరీక్షగా పెట్టాను. అందరిలోకి మా అమ్మాయి చేయి పట్టడానికి నీ ఒక్కడివే యోగ్యుడైన వాడవని తేలింది, అన్నారు.

చిరకాలంలోనే అమ్మాయిని తగిన దుస్తులు, నగలతో అలంకరించి ఆ శిష్యుడితో ఆమెకు పెళ్లి జరిపించారు.

ఈ కథ చెప్పి బుద్ధుడు, “భిక్షువులారా! తెలివిలేని శిష్యులు మూర్ఖంగా ప్రవర్తించి పెళ్లి చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తెలివిగల ఒక శిష్యుడు మాత్రం తన నీతివంతమైన ప్రవర్తనతో చక్కని భార్యను పొంది గురువు అభిమానానికి పాత్రుడయ్యాడు. కథ విన్నారు కదా?” అన్నాడు.

ఆ తరువాత ఆ 500 మంది బిక్షువులు సన్మార్గంలో విద్య గడించి అర్హతులయ్యారు.

బుద్ధుడు కథ గురించి చెబుతూ సారీపుత్త ఆ కథలోని గురువు, ఇక నేను ఆ తెలివీ, నీతీ గల శిష్యుడను అని విషయం వివరించాడు.