ఆదివారం 11
ఫిబ్రవరి 2001 ఆంధ్రభూమి దినపత్రిక
చింపిరి
జుట్టు పరిశోధన
పరిశోధన, సైంటిస్టు
అనగానే మనకంతా చింపిరి జుట్టు, గడ్డం, పాతకాలం తరహా దుస్తులు వేసుకున్న ఒక
పిచ్చి మారాజు మనసులో మెదులుతాడు. పరీక్షనాళికలో రంగురంగుల ద్రవాలను కలిపి సక్సెస్
అని కేకలేస్తాడతను. సినిమాలు, నవలల పుణ్యమా
అని మనకు ఇలాంటి ఆలోచనలు స్థిరపడతాయి. అటు సైన్స్ అంచులను తాకుతూ, ఇటు సాంఘికశాస్త్రం గురించి కూడా
పట్టించుకుంటూ ఆంత్రపాలజీ అనే శాస్త్రం ఒకటి ఉంది. దాన్ని అచ్చంగా అనువదించాలంటే
మానవశాస్త్రం అనాల్సి ఉంటుంది. మానవుల తీరుతెన్నులు, జీవన విధానాలను వర్ణించే శాస్త్రం అది. అందులో ముక్కులు కొలవడం మొదలు, మునుపటి వారి విశేషాలను సేకరించడం దాకా
ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. అసాధారణంగా జీవిస్తున్న జాతులను పట్టించుకోవడం ఈ రంగం
వారి ప్రస్తుత ప్రత్యేక కార్యక్రమం.
ఆదిలాబాద్ లోని గోండులను గురించి పరిశోధించడానికి
జర్మనీ నుంచి హేమిండార్ఫ్ దంపతులు వచ్చి మర్లవాయి అనే ఊళ్లో గోండ్లతోనే కలిసి
జీవించారు. శ్రీమతి హేమిండార్ఫ్ సమాధి అక్కడే ఉంది ఇంకా. ఈ దంపతులు గోండులు
అయిపోయారన్నా అతిశయోక్తి లేదు. పరిశోధన శాలలు, పరికరాలు, సమావేశాలు, అందుకు తగిన ఆధునిక కాలం హంగులు ఏవి
అవసరం లేకుండా ఈ రకం పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. మిచిగన్ యూనివర్సిటీ
మానవశాస్త్ర పరిశోధకుడు టామ్ ఫ్రిక్ రెండు సంవత్సరాలకు పైగా కాల్ ఆఫ్ అనే
మధ్యతరగతి కుటుంబీకుడితో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్లు ఉండేది ఒక
నిజమైన పల్లె. అక్కడ సౌకర్యాలు అంతగా లేవు. అటువంటి ప్రాంతాల్లో బతుకుతున్న వారి
జీవితాలను పరిశోధించడమే ఫ్రిక్ పెట్టుకున్న పని. అందుకు వారి మధ్య వారిలో, ఒకడుగా
బతకడం కన్నా మంచి మార్గం లేదు. తాను పరిశోధకుడనే విషయాన్ని పక్కనపెట్టి ఫ్రిక్ తన
యజమానితో కలిసి వారి పొలాల్లో పని చేస్తుంటాడు. పశువులను కాస్తుంటాడు. ఈ పేరుతో
బీద రైతుల పనితీరును, పరిశోధకుడు స్వయంగా నేర్చుకుంటున్నాడు. ఆయా విషయాలను గురించి
ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుంటున్నాడు. అతను మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఆగి, అప్పుడు విరామం దొరికినప్పుడు ఆ రోజు
సేకరించిన వివరాలు అన్నింటిని ఒక పుస్తకంలో రాసుకుంటాడు. మారుతున్న మధ్యతరగతి
జీవితాలు, వారి
పనితీరులన్నీ త్వరలోనే ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నంలో ఇదొక భాగం!
కాలువ గట్టు మీద నిలబడి, కర్రతో గుచ్చి, రాయి వేసి, లోతు గురించి, ప్రవాహం గురించి తెలుసుకోవచ్చు. నేరుగా
అందులోకి దిగి సంగతులను మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రిక్ పాటిస్తున్నది ఈ
రెండవ మార్గం. దీన్ని పనిలోనే పరిశీలన అనవచ్చు. పరిశోధనకు వస్తువైన వారికి
అనవసరంగా కాలయాపన జరుగుతున్నది అన్న భావం ఉండదు. పరిశోధకులకు వివరాలు అనుమానం
లేకుండా అర్థమవుతాయి. ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగింది. ఏ విషయాలయితే, ఈ మధ్య తరగతి
రైతు కుటుంబాలు, సమస్యలుగా
గుర్తించి చర్చిస్తున్నారు అన్నది గమనించి ఈ పరిశోధకుడు వాటిని
పట్టించుకుంటున్నాడు. మారిపోతున్న ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడికక్కడ ఉండిపోయే
వీలు లేదు. రైతులకు సమాచారం కావాలి. వారి ఫలసాయం పైచోట్లకు అందాలి. కొత్త కొత్త
పద్ధతులు అన్ని రంగాల్లోనూ వస్తుంటే పట్టించుకోకుండా ఉండలేరు. అవి కాక మానవ
సంబంధాల విషయంగా వచ్చే మార్పులు మరోవైపు ఉన్నాయి.
మన పరిస్థితులు మారుతున్నాయని మనకి ఎవరూ ప్రత్యేకంగా
చెప్పనవసరం లేదు. కానీ దేశమంతా మారుతున్న పరిస్థితులలో తేడాలు, పోలికలు, అందుకు కారణాలు కూడా తెలిస్తే కొన్ని
సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. జనజీవనం గురించి పట్టించుకోవడం పరిశోధన. అదే
చింపిరి జుట్టు పరిశోధన!
No comments:
Post a Comment