Showing posts with label thinking. Show all posts
Showing posts with label thinking. Show all posts

Saturday, February 28, 2026

కలలు - వాటి తీరుతెన్నులు


కలలు - వాటి తీరుతెన్నులు 


కలలు

కలలు కనండి. అప్పుడే అవి నిజమవుతాయి." అన్నారట ఆవుల్‌ పకీర్‌ జైనులాబుదీన్‌ అబ్దుల్‌ కలాం గారు.
ఆయనెవరని ఎవరికయినా అనుమానం వచ్చిన పక్షంలో పూచీ మొత్తం ఆ అనుమానం వచ్చిన వాళ్లదే. భారత రత్న బిరుదం పొందిన ఒకానొక శాస్తవేత్త గురించి తెలియక పోవడం గురించి ఏమనడానికీ లేదు. ఇంతకూ విషయం కలల గురించి. కలాం గురించి కాదు.
కానీ కలల గురించి ఆయనగారన్న మాటలు కలకాలం మననం చేసుకోదగినవి. వాస్తవం గురించి అంతగా ఆలోచించడానికి ఉండదు. అది మన ఎదుటనే ఉంటుంది. లేని దాన్ని గురించీ, వాస్తవం కన్నా మరింత గొప్పగా ఉండే దాన్ని గురించీ ఆలోచించాలి. ఊహిం౦చాలి. కలలుగనాలి. అప్పుడవి నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచన లేకుంటే ప్రయత్నం దాకా పరిస్థితి పోనే పోదు. కలాం గారు అందుకే కలలు కనమన్నారు. కానీ ఆయన చెప్పింది పగటి కలల గురించి మాత్రం కాదు.


పగటి కలలు గాలిమేడలు ఒకటేనని వెనకటనే పెద్దలు చెప్పారు. మౌలుకువగా ఉన్నప్పుడు రావలసినవి ఆలోచనలు. కలలు కానే కాదు. పగలే కలలు కంటున్నారంటే పని చేయవలసిన సమయంలో పడుకుని నిద్ర పోతున్నారనయినా అనుకోవాలి. లేదంటే అలవిమాలిన ఆలోచనలు చేస్తున్నారనయినా అనుకోవాలి. ఈ రెంటి వలనా (ప్రయోజనం ఉండదని వేరే చెప్పాలా? అలా కాకుండా గుండె నిండా ఒక విషయాన్ని నింపుకుని తెలిసీ తెలియకుండా కూడా దాన్ని గురించే ఆలోచనలు సాగితే ఏదో ఒకనాడు ఆ సంగతి కలలోకి కూడా వచ్చేస్తుంది. అది కలలోకి వచ్చిందంటే దాన్ని గురించి అంతగా ఆలోచన జరుగుతు న్నదని అర్థం. కొన్ని సంగతులను గురించి ఆలోచనలు మనకు తెలియకుండానే మనసు లోతుల్లో జరుగుతుంటాయని చాలా మందికి తెలియక పోవచ్చు. నిజానికి ఇటువంటి విషయాలే నిద్రలో కూడా మనసులోకి వచ్చి కలలవుతాయి. కలాం గారు కలలు కనమన్నారంటే గట్టి ఆలోచన ఏదో చెయ్యమ న్నారని అర్థం. జాయిగా నిద్రపోయి కలలు కనమని మాత్రం కాదు. ఆయన చెప్పిన దాంట్లో మరొక చిత్రం ఉంది. ఊరికే కలగని వదిలేస్తే చాలదు. అది నిజమయ్యే దాకా కష్టపడి పని చేయాలి. అలాగంటే నిద్ర పోకూడదని కూడా అర్థమేమో. చెప్పినమాట, వినడానికి ఒక అర్థాన్ని సూచిస్తే బాగా ఆలోచించిన మీదట మరో అర్థాన్ని సూచించింది. అదే పెద్దల మాటల్లో ఉండే గొప్పదనం.
ఒక రాజు ఉండే వాడు. ఆయన దగ్గర మామూలుగానే మంది మార్బలమూ ఉన్నారు. వారిలో ఒక పహరాదారు కూడా ఉన్నాడు. అతనొక రోజు రాజుతో అయ్యా! మీరివాళ తోటలోకి పోకండి. అక్కడ మీ కోసం ఆపద ఎదురు చూస్తూ ఉన్నది" అని చెప్పాడు. రాజు చూద్దామనుకుని తగు జాగ్రత్తలతో తోటలోకి వెల్లాడు. అక్కడ నిజంగానే ఆపద ఎదురయింది. జాగ్రత్తగా ఉన్నాడుగనుక రాజు తప్పించుకు వచ్చాడు. మరుసటిరోజు కూడా పహరాదారు అటువంటిదే మరో హెచ్చరిక చేశాడు. అదీ నిజమయింది. ఇంతకూ నీకీ ఆపదల గురించి ముందే ఎట్లా తెలిసిందని రాజు పహరా మనిషిని అడిగాడు. నాకా సంగతులు కలలో తెలిశాయని చెప్పి రాజును రక్షించినందుకు తనకేదో గొప్ప బహుమానం దొరుకుతుందని ఆశగా చూచాడతను. రాజు మాత్రం కోపగించుకుని  రాత్రిపూట కాపలా కాయమంటే హాయిగా నిద్రపోయి కలలు గంటున్నావా నాయనా? అసలు నీ వల్ల నాకు ఎక్కువ ఆపద ఉండేట్టుంది!” అంటూ అతడిని ఉద్యోగంలోంచి తీసేశాడట.
ఇది వినడానికి ఏదో చిన్న పిల్లల కథలాగున్నా ఇందులో గొప్ప కిటుకుంది. మెలుకువగా ఉండవలసిన వాళ్లు నిద్రపోతే కుదరదు. అందరికీ నిద్రపోయి హాయిగా కలలు గనే అవకాశమే ఉండదు. జీవితంలో కష్టాలూ కడగండ్లూ మొదలయితే నిద్ర రాదు. ఇక కలల గురించి ఆలోచనే అవసరం లేదు. ఖర్మ గాలి నిద్ర వచ్చినా కలలో కూడా కష్టాలే ఎదురయ్యి భయ పెడతాయి. పీడకలలంటే అవే మరి!
కల వస్తుంది. భయమయినా మెలుకువవుతుంది. బాగున్నా మెలుకువవుతు౦ది. సాధారణంగా కల సాంతంగా జ్ఞాపకముండదు. ఏదో కొంత మాత్రమే చూచాయగా గుర్తొస్తుంది. మెలుకువయిన వెంటనే కల గురించి బాగా ఆలోచిస్తే బాగా గుర్తొస్తుందట. ఈలోపల మరే సంగతిమీదికి ధ్యాస పోయినా ఇక అక్కడికి కల అయిపోయినట్టే, కుక్కలగురించి ఒక విచిత్రమయిన సంగతి చెపుతారు. అదెంతవరకు నిజమో అసలు నిజమవునో కాదో కూడా తెలియదు. కుక్కకు ఫలానా ఇంట్లో లేదా ఫలానా చోట తినడానికేదో ఉందని కల వస్తుందట. అది లేచి చెవులు ఝాడించకుండా బయలుదేరిందంటే ఆ పూటకు కడుపు నిండినట్లే లెక్క. లేచిన తర్వాత చెవులు ఝాడిస్తే మాత్రం కలలో కనబడిన సంగతులన్నీ కడిగేసినట్లు మెదడులోంచి మాయమవుతాయంటారు. "వింటాడు. వెంటనే చెవులు ఝాడిస్తాడు" అనే మాట ఈ ధారణలోంచే పుట్టిందట. సైన్సులో కలల గురించి చాలా చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఈ చెవులు ఝాడించడం
గురించి మాత్రం ఎక్కడా చదివిన గుర్తు లేదు. ఎలకలు కలలు గంటాయని వాటికి కలల కారణంగా తెలివి పెరుగుతుందని ఈ మధ్యన ఒక పరిశోధకుడు వెల్లడించాడు. కొత్తగా నేర్చుకున్న సంగతులు కలలద్వారా మనసులో మననమయ్యి గట్టిగా గుర్తుండిపోతాయని మరొక సిద్ధాంతం వచ్చింది.
డిఎన్‌ఏ నిర్మాణాన్ని కనుగొన్న ప్రొఫెసర్‌ వాట్సన్ ఆ తర్వాత తన పరిశోధనలను కలల వేపు మళ్లించాడంటే మనిషి జీవితంలో కలలకు౦డే ప్రాముఖ్యం అర్థమవుతుంది. కల ఎంత కాలం కొనసాగు తుందన్నది మరో చిక్కుప్రశ్న. అది చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటుంది. ఆ కొద్దీ సేపట్లోనే చాలా కాలం గడిచిన భావాన్ని కలిగిస్తుందని చెపుతారు. కల కాలగమనంలో మనలను వెనుకకు తీసుకు పోతుంది. అప్పుడప్పుడు ముందుకు కూడా తీసుకు పోతుంది. ఆ పోయినచోట కథ ఎంతకాలం నడుస్తుందో ఎప్పుడయినా గమనించారా? నా మటుకు నాకు ఒకే రోజు కలలో కొన్ని సంవత్సరాలు గడిచిన అనుభవం కలుగలేదు.
ఒకరోజు ఒక సంఘటన మాత్రమే కలగా రావడం అలవాటు. లవణరాజు కల గురించి కథలు వచ్చాయి. ఆయన పేరుకే గాదు. నిజంగానే రాజు. భోగభాగ్యాలతో బతుకుతుంటాడు. ఒకనాడు ఆయన సభకు ఒక ఐంద్రజాలికుడు వస్తాడు. అతను
రాజుమీద మచ్చు జల్లుతాడు. ఆ దెబ్బతో రాజు కలగంటాడు. ఆ కలలో డెబ్బయి ఏళ్లు గడుస్తాయి. రాజుకు పిల్లలు పుడతారు. అతను బీదవాడవుతాడు. పిల్లలు తమకు వేడి మాంసం కావాలంటారు. రాజు అగ్ని ప్రవేశం చేస్తాడు. అప్పుడు కల ముగుస్తుంది. మెలుకువయిన తర్వాత తనకు క్షణాలలో అంతటి అనుభవమూ, ఆత్మవివేచనమూ కలిగించిన కలగురించి ఆలోచిస్తాడు.
జీవితం ముందుకే సాగుతుంది. కల మాత్రం అటూ ఇటూ ఎటయినా పోతుంది. కానీ ఈ నిడివి గురించిన సంగతి మాత్రం అంత సులభంగా తలకెక్కదు. ఒకే రకమయిన సంఘటన పదేపదే కలగా రావడమూ ఉంది. ఈ రకంగా మళ్లీ మళ్లీ వచ్చే కలల గురించి శాస్త్రవేత్తలు భాష్యాలు చెపుతుంటారు. అవి మనసులోతులలో నిలిచి భావాలకు ప్రతీకలుగా ఉంటాయంటారు. అసలు ఏ ఇబ్బందీ లేని కలలు కొన్ని ఉన్నాయి. అవి సినిమాలో హీరో హీరోయిన్‌లకు వచ్చేస్తుంటాయి. వాళ్లకు కల వచ్చిందంటే చాలు. అదంతా అచ్చమయిన సినిమా ఇంద్రలోకంలా ఉంటుంది. సినిమా జంటలకు మరోపని ఉండదు. ఘాటుగా ప్రేమించడం పాటలు పాడడంతప్ప. ఆ పాటలు మరీ అందంగా ఉండాలంటే వారు కలలు కనేస్తారు.
ఆ కలలలోకంలో కిందనుంచి పొగలొస్తుంటాయి. మిగతా లోకంలో పొగ గాలితో మీదకు కదిలితే ఈ సినిమా కల పొగ మాత్రం నేలబారుగానే పోతుంది. ఆ లోకంలో గాల్లో చెమ్కీలు ఎగురుతుంటాయి. బాల్కనీలో అట్ట చంద్రుడుంటాడు. వాళ్లు పున్నమి అని పాడుతున్నాసరే చందుడు మాత్రం పూర్తిగా ఉండడు. 

ఇటువంటి కలలు కనడం మేలా? కలాం గారు చెప్పిన కలలు కనడం మేలా?


కె.బి.గోపాలం




 

Wednesday, February 25, 2026

అత్తగారు - లుయిజీ పిరాండెల్లో ఇటాలియన్ కథ


అత్తగారు

లుయిజీ పిరాండెల్లో ఇటాలియన్ కథ


అత్తగారు
లుయిజీ పిరాండెలో
నిజం చెప్పాలంటే వాళ్లగురించి ఎక్కువగా ఆలోచించిన కొద్దీ అంటే మిస్టర్‌ పోన్‌జా, ఆయన అత్తగారి గురించి ఆలోచిస్తే వాళ్లిద్దరిలో ఎవరు వెర్రివాళ్లన్న సంగతి  అంత తక్కువగా అర్థమవుతున్నది.
వాళ్ల ఇద్దరిలో ఒకరికి తప్పకుండా పిచ్చి. వల్‌డానాలో అందరూ ఈ సంగతి ఒప్పుకుంటారు. అయితే ఇద్దరిలో ఎవరికి? అసలు సంగతేమిటంటే...
కానీ నేను ముందుగా ఒక విషయం చెప్పాలి. వల్‌డానా మనుషులలో నేను పూర్తిగా కొత్తవాడిని. కొత్తగా ఆ మనుషులిద్దరూ ప్రశాంతంగా సాధారణంగా ఆనందంగా ఉన్న ఈ చిన్న పట్టణంలోకి వచ్చినప్పుడు వీళ్లు పడ్డ చికాకు గురించి నాకు సానుభూతి తప్ప మరో భావం కలగలేదు. నేను వాళ్ల పట్ల సానుభూతి కలిగి ఉంటాను. ఎందుకో చెపుతాను. వాళ్లిద్దరిలో ఒకరినొకరు బుర్రలేనివారుగా మారిపోయే తీరుగురించి నాకు సంబంధం లేదు. కానీ వాళ్లిద్దరూ ఒక మొత్తం నగరాన్ని సస్పెన్స్‌లోను బాధలోను పెట్టి అలా ప్రవర్తించడం సరైంది కాదని నేను అనుకుంటాను. వాళ్లిద్దరిలో ఎవరు నిజం చెపుతున్నారు? ఎవరు భ్రమల ప్రభావంలో ఉన్నారు అన్నది అంతు పట్టకుండా చేస్తున్నారు. మేము వాళ్లను ప్రతినిత్యం వీధిలో కలుస్తామంటే మీరు నమ్మగలరా? (వల్‌డానాలో ఉండేది ఒకటే ప్రధాన వీధి. అక్కడే అందరమూ కలుస్తాం) వాళ్లిద్దరిలో ఒకరికి పిచ్చి అని తెలుసు. వాళ్ల ముఖాలను పరీక్షించి స్థూలంగా ఎవరికి పిచ్చి పట్టిందని తేల్చడం కుదరడంలేదు. ఒక్కోసారి ఎవరికి వారే ` అదిగో ఆవిడకు ` అనుకుంటారు. కానీ ఆ తరువాత వెంటనే అందుకు వ్యతిరేకం ఏమో అనుకుంటారు. నాకు పోలీసులతో ఏ కొంచెం ప్రమేయం ఉన్నా ఆ ఇద్దరినీ ఊరు వదిలి వెళ్లిపొమ్మని ఆర్డర్‌ జారీ చేస్తాను.
కానీ నేను పోలీసును కాను. ఇక జరిగింది ఇది. మూడు మాసాల క్రితం సిన్యోర్‌ పోంజా అనే గవర్నమెంట్‌ ఉద్యోగంగల ఆయన రోమ్‌నుంచి పంపబడి వల్‌డానాలో దిగాడు. వెంటనే ‘తేనెపట్టు (ద బీహైవ్‌)’ అనే సరికొత్త పెద్దభవంతి అయిదవ ఫ్లోర్‌లో చిన్న ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. భవంతి నగరం అంచుల్లో ఉంటుంది. పెద్ద బాల్కనీ నుంచి చూస్తే పొలాలు కనిపిస్తాయి. ఇక మిగతా మూడు చిన్న కిటికీలు పెరట్లోకి తెరుచుకుంటాయి. ఈ కిటికీల్లో ఒకానొక దానిముందు ఒక పలుచని తాటికి కట్టిన ఒక బుట్ట వేలాడుతూ ఉంటుంది. ఆ బుట్టను కిందకు దించి వ్యాపారులు అందించే చిన్న పొట్లాలు, మిగతా సరుకులను పైకి చేదుకోవచ్చు. ఇక అన్ని మెట్లు ఎక్కడమనే శ్రమ తగ్గుతుంది.
కానీ సిన్యోర్‌ పోంజా మరొక ఫ్లాట్‌ను కూడా అద్దెకు తీసుకున్నాడు. ఈసారి అది పట్నం మధ్యభాగానికి దగ్గరగా ఉంది. అందులో సిన్యోరా ఫ్రోలా అనే తన అత్తగారు ఉంటారని ఆయన అన్నాడు.
దీంతో వల్‌డానా ప్రజలు ఆశ్చర్యంలో పడిపోయారు. రెండు ఫ్లాట్‌లు ఎందుకు? ఒక తల్లి తన పెళ్లయిన కూతురితో ఉండలేకపోతే వెళ్లి తన అల్లుడితో ఉంటుంది. కానీ ప్రస్తుత కేసులో వలె ఆమె తన కూతురి వెంటపడి అదే నగరానికి వచ్చింది. అయినా వేరే ఫ్లాట్‌లో ఉండాలని నిర్ణయించింది. ఆ కుటుంబంలో ఏదో ఉందన్న సంగతి శుభ్రంగా బయటపడుతున్నది. ‘ఆ మనిషి మొరటురకం అయి ఉంటాడు’ వల్‌డానాలోని అందరూ అలాగే అనుకున్నారు. ఇక అందరూ ఆ ఆడమనిషి పట్ల అనుకోకుండానే సానుభూతి చూపించసాగారు. కానీ, ఆమెలో కూడా ఏవో లోపాలు ఉండవచ్చు, అని వారన్నారు. అయినప్పటికీ గౌరవంగల పెద్దమనిషి ఎవరయినా అత్తగారు తన ఫ్లాట్‌లో ఉండకూడదని అంటాడా? పోతే సిన్యోర్‌ పోంజా కనిపించే తీరు అదోరకంగా ఉంటుంది. పొట్టి, కొంచెం లావు ఇంచుమించు ఆఫ్రికన్‌ల వంటి నల్లని చాయ, ఉంగరాల జుట్టు, దళసరి కనుబొమ్మలు, భయ పెడుతున్నట్టు బుర్రమీసాలు, మొత్తానికి మొట్టమొదటిసారి చూచినవారికి వెంటనే అతనిపట్ల సానుభూతి కలగదన్నది మాత్రం తప్పనిసరి వాస్తవం. ఇక అందుకు వ్యతిరేకంగా ఆ చిన్న మధ్యవయస్సు తెల్లజుట్టు ఆడమనిషి మరీ పీలగా ఉంది. దు:ఖంగా కనబడుతోంది. ఆమెను చూస్తే దయాదాక్షిణ్యాలకు రూపం అనిపిస్తుంది. అటువంటి మనిషితో ఆమె భయంకరమయిన అసంతోషానికి గురయి ఉంటుందని అందరూ అనుకుంటారు. అతడు ఆమెను కూతురు ఫ్లాట్‌లోకి రానివ్వడని కూడా అందరూ కనుగొన్నారు.
అయితే వ్యవహారం మరింత విచిత్రంగా మారేటట్టు ఆ ముసలావిడ ఒక్కసారి కూడా అల్లునికి వ్యతిరేకంగా ఒక్కమాట అనడం ఎవరూ వినలేదు. పైగా ఆయన గురించి ఎవరయినా తప్పుగా అనుకుంటారన్న ఆలోచనతోనే ఆమెకు బాధ కలుగుతుంది. అల్లుడు తన కూతురికి చాలా మంచి భర్త, తనకు అతను, అంకితమయిన కుమారుడు లాంటివాడు, అని చెప్పడానికి ఆమె ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. అవును, అతను అంకితమయిన అబ్బాయే. విపరీతమయిన మంచి మనసుగల కొడుకు. ఉన్న లోపం అంతా ` అది లోపమయితే ` ఒకే ఒక్కటి. అతనికి తన భార్యపట్ల గల ప్రేమ బహుశా మరీ విపరీతం. కానీ ఆమె వెంటనే అంటుంది, ఒక భర్త తన భార్య తనకే సొంతం కావాలనుకుంటే, ఆ విషయంలో భార్య తల్లిపట్ల అసూయ కలిగి ఉంటే అందులో తప్పేముంది, అని. అసూయా కాదు, అది అలాంటి ఇలాంటి మామూలు అసూయ కాదు. అది పూర్తిగా వేరొకభావం. అది తీవ్రమయిన ప్రేమభావం. దాన్ని లోపం అనడానికే లేదు. అయితే అది మరి స్వార్థమా, అసలు కాదు. ఒక మనిషి తన భార్యకు సంపూర్తిగా అంకితమయి ఉంటే దాన్ని స్వార్థమనవచ్చా? లేదు అతను ఆ స్త్రీ చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అందులోకి ఆమె తల్లిని కూడా దూసుకుని రానివ్వడు. అందుకే మరి ఆమె కూతురి నుంచి దూరంగా ఉండాలని తేల్చేసుకున్నది. ప్రతిరోజు ఒకసారి వాళ్ల పెరట్లోకి వచ్చి అక్కడి నుంచే కాసేపు మాట్లాడితే చాలు అనుకున్నది.
ఇవాళ ఎలాగున్నావు, టిల్డీనా?’
బాగున్నాను, అమ్మా, మరి నీవు?’
ఎక్స్‌లెంట్‌ డార్లింగ్‌. ఇక మరి బుట్ట కిందకు దింపు.’
ఇక ఆ చిన్నబుట్ట ఆనాటి వార్తగల నోట్‌ను మోస్తూ కిందకు వస్తుంది. వాళ్ల మీటింగ్‌ అంతటితో ముగుస్తుంది. నాలుగు సంవత్సరాలు ఇలాగే కొనసాగింది. ప్రతినిత్యం ఆ ముసలావిడ రావడం, బుట్టలో అందిన కాగితాన్ని తీసుకుపోవడం, కూతురుకు గుడ్‌బై చెప్పడం, వీధి చివరలో మాయం కావడం, సంతృప్తిగా అంగీకరించడం.
అయితే వల్‌డానాలో ఎవరూ ఈ వింత కథను నమ్మలేకపోతున్నారు. నగరంలోని మహిళలు (ముఖ్యంగా ఆమె అల్లుని తోటి ఉద్యోగుల భార్యలు) సిన్యోరా ఫ్రోలా ఇంటికి వెళ్లారు. కబుర్లు మొదలు పెట్టారు. చివరకు మాటల సంగతి సిన్యోర్‌ పోంజా దాకా వెళ్లింది. అతని గురించి ఒక ముఖ్యమయిన వెల్లడింపు బయటపడుతుందని వాళ్లంతా భయపడ్డారు. తన అత్తగారితో మరీ నేస్తంగా ఉన్నట్టు తెలిసిన మహిళలకు ఆయన కబురు పంపించాడు. వాళ్లను కలుస్తానన్నాడు. అతను భావావేశంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అతని కళ్లు మరింత లోతుగా మరింత బాధతో కనిపించాయి. పట్టిన చెమటను తుడుచుకోవడానికి అతని చేతిలో ఒక తెల్లని కర్చీఫ్‌ను పట్టుకున్నాడు. ఒక రహస్యాన్ని కాపాడాలి అంటూ ఆడవాళ్లను వేడుకున్నాడు. అది ఎంతో ముఖ్యమయిన రహస్యం అన్నాడు. వీలయితే దాన్ని తనలోనే దాచుకోవాలని అనుకున్నాడు గానీ, ఇప్పుడు బయట పెట్టవలసిన పరిస్థితి బలవంతం చేస్తున్నది. తన అత్తగారికి, పిచ్చిపట్టిందని ఆయన చెప్పాడు. ఆమె నాలుగు సంవత్సరాల క్రితం పిచ్చిదిగా మారింది. తన కూతురు పోయిందన్న వార్త తెలిసిన తరువాత అది జరిగింది. ఆమెకు కలిగిన షాక్‌ చాలా గొప్పది. ఆనాటినుంచి తన కూతురు శాశ్వతంగా పోయిందన్న విషయాన్ని నమ్మడానికి ఆమె ఒప్పుకోదు. కూతురు బతికే ఉందని గట్టిగా అంటుంది. ఆమెకు నచ్చచెప్పడం అసలు కుదరడం లేదు. బాధలో ఉన్న ఒక తల్లికి సాయం చేయాలన్న మంచి ఉద్దేశ్యంతో ఆమె భ్రమలను అలాగే కొనసాగించడమే తెలివిగల పని అతను అనుకున్నాడు. తన మొదటి భార్య ఇంకా బతికే ఉందని ఆ తల్లి అనుకున్నా ఫరవాలేదన్నాడు. ఇప్పుడు తనతో ఉంటున్న రెండవ భార్య ఆమె కూతురు కానేకాదని అతను వివరించాడు. ఈ రెండవ భార్య ముసలావిడ మీద జాలికొద్దీ ప్రతినిత్యం కిటికీ దగ్గర కనిపించడానికి, చిన్న నోటు రాయడానికి అంగీకరించింది. విషయం బయటపడకుండా తనను తాను ఫ్లాట్‌లోనే బంధించుకోవడానికి కూడా సిద్ధమయింది. ‘ఇది అసలు నిజం’ కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అతను ముగించాడు.
నగరంలోని మహిళలంతా విస్తుపోయారు. వారిలో చాలామంది తమ ఆవేశాన్ని దాచుకోలేకపోయారు. అందరూ సిన్యోర్‌ పోంజా పట్ల సానుభూతి చూపించారు. రహస్యాన్ని తమలోనే దాచుకుంటామని మరీమరీ మాట ఇచ్చారు. వాళ్ల మంచి మాటలతో కొంత ఉపశమనం కలిగి సిన్యోర్‌ పోంజా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అతనలా వెళ్లాడో లేదో సిన్యోరా ఫ్రోలా ప్రవేశించింది.
ఆమె దగ్గరా ఒక రహస్యం ఉంది, ఒక గొప్ప రహస్యం. వాళ్లు తమ పెదవులను కట్టి ఉంచుతామని ఒట్టు పెట్టుకోవాలి. లేకుంటే, ప్రపంచంలో తనకు అందరికన్నా ఇష్టమయిన మనిషి నాశనమయిపోతాడు. అతను తన అల్లుడే. ‘సంగతి బయట తెలిస్తే అతని బ్రతుకు బహుశా సర్వనాశనం అవుతుంది’ అన్నది ఆమె బాధగా. ఇక ఆ రహస్యం ఏమిటంటే, సిన్యోర్‌ పోంజా ` కష్టపడి పనిచేసే, ప్రశాంత స్వభావంగల ప్రభుత్వ అధికారి ` పిచ్చివాడు. నాలుగు సంవత్సరాల క్రితం అతని మెదడులోకి తన భార్య చనిపోయిందన్న ఆలోచన దూరింది. అప్పటినుంచి అతను పిచ్చివాడయ్యాడు. అతనికి కలిగిన బాధ చాలా గొప్పది. ఆనాటి నుంచి అతను అందరికీ తన భార్య పోయిందని, ఆమె మరణం కారణంగా అత్తగారు పిచ్చిదయిందని చెపుతూ ఉంటారు. ‘పాపం తన భార్య నర్సింగ్‌హోమ్‌కు పోయింది, అక్కడి నుంచి తిరిగి రానేలేద’ని అతనికి గట్టి నమ్మకం. ఆమె ఏడుస్తూ ఈ మాట చెప్పింది. ‘ఆ మాట అతని మనసులో నాటుకుపోయింది. ఆమె నిజానికి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు బంధువులు, మిత్రులను పిలిచి మరో పెళ్లి చేయవలసి వచ్చింది. తాను ఈ మధ్యనే మరొక అమ్మాయిని నిజంగా పెళ్లి చేసుకున్నాడని అతనికి నమ్మకం కలిగింద’ని అంటూ సిన్యోరా ఫ్లోరా కథ ముగించింది. పట్టలేక ఆమె మరింత చెప్పసాగింది. ‘పరిస్థితి మరీ దిగజారింది. అతను మళ్లీ తేరుకున్నాడని, తన భార్య అంటే మొదటి భార్యే అని అనుకుంటున్నాడని నేను నమ్మాను. కానీ అతని అసూయ మరీ దూరం పోయింది. ఎవరిని భార్య దగ్గరికి రానివ్వడు. చివరకు వాళ్ల అమ్మను కూడా. ఆ అమ్మాయిని ఫ్లాట్‌లో ఒంటరిగా బంధించాడు. లేకుంటే ప్రస్తుతం తన భార్యకు తల్లి కాని ఒక అత్తగారి మీద అతను చూపే దయకు అర్థం లేదు. అయితే ఈలోగా మరో దురదృష్టకరమయిన విషయం జరిగింది’ నిట్టూరుస్తూ కొనసాగించింది ఆమె. ‘నా కూతురు తను తానే కాదంటూ అందరినీ ఒప్పించాలి. ఇక నేను పిచ్చిదాన్నని అందరినీ ఒప్పించాలి. నా కూతురు బతికి ఉంది అన్నందుకు నేను పిచ్చిదాన్ని. ఒక తల్లిగా తన కూతురిని కిటికీలోంచి మాత్రమే చూచి సంతృప్తిపడే ఒక తల్లి దుర్భర పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలరా? నేనిక నా అల్లుడితో ఉన్నది మరెవరో ఆడమనిషి అని ఆయనకు నమ్మకం కలిగించాలి. అయినా నాకు ఇంకో మార్గం తోచలేదు. ఇక మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. నాకు పిచ్చిదని పేరు పెట్టారు. నిజంగా పిచ్చిపట్టిన వారి కొరకు నేను పిచ్చిదానిగా బతకాలి. అర్థమయిందా మీకంతా?’
అవును మరి, ఆ మహిళలకు ఏమీ అర్థం కాలేదు. ఎవరికీ ఏమీ అర్థంకాలేదు. ఈ సమస్యను విడదీయాలని ఎంత ప్రయత్నించినాగానీ నాకు కూడా అర్థం కాలేదు. వెళ్లి ఆ అమ్మాయిని అడగవచ్చుగదా అని మీరు అంటారేమో. నిజమే, కానీ ఆమె తాను రెండవ భార్యనని అందరికీ చెపుతుండగా ఆమె మాటలను నమ్మడమెలాగ? ఆమె కూడా భర్తలాగే భ్రమలో పడిపోయిందేమో? అయినా ఆమె ఇంటి తలుపు తెరవనని భీష్మించుకు కూచుంటే ఎవరు మాత్రం ఆమె దగ్గరకు వెళ్లగలుగుతారు. ఆ మనిషి సిన్యోరా ఫ్రోలా అంటే తనకు భయమంటున్నదాయె!
ఈలోగా సిన్యోర్‌ పోన్‌జా కూడా తన భావాలను వెల్లడించసాగాడు. ‘త్యాగం, కేవలం త్యాగం’ అంటున్నాడాయన. కానీ ఆయనకు నిజంగా పిచ్చేమో. పట్నంలోని వారందరికీ పరిస్థితి గురించి తెలుసుకోవాలని పట్టుదల. వాళ్లిద్దరూ ఒకరిమీద ఒకరు అంత మంచితనం కనబరుస్తూ అంత సఖ్యంగా ఉంటున్నారు. ఇక వారిలో ఒకరికి పిచ్చి ఉందని ఎవరూ అనుకోవడానికి లేదు. లేక ఇద్దరికీ పిచ్చిపట్టిందా ఏమి?
సిన్యోరా ఫ్రోలా తరచుగా సిన్యోర్‌ పోన్‌జా ఆఫీస్‌కు వెళుతుంది. ఇద్దరూ కలిసి షాపింగ్‌కు లేదా వాక్‌కు వెళ్లిపోతారు. వాళ్లిద్దరూ చాలా హాయిగా కలిసి ఉన్నారు. ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్నారు. ఒకరిమీద ఒకరికి సానుభూతి ఉన్నప్పుడు మాత్రమే వీలయ్యే పద్ధతిలో చక్కని మర్యాదలు పాటిస్తున్నారు. నడుస్తూ ఆమె అలిసిపోతే, ఆయన చేతిని పట్టుకుంటుంది. అతనిమీద వాలుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు. వందల కళ్లు తికమకగా, ఆశ్చర్యంగా వాళ్లను చూస్తూ ఉంటారు. వీరిలో పిచ్చి ఎవరికి? ఇందులో నిజం ఎక్కడుంది? నీడ ఎక్కడుంది? లేక ఇందులో ఒకటికాక ఎక్కువ నిజాలున్నాయా? జవాబు చెప్పాలంటే ముందుగా మరో జవాబు వెతకాలి. పిచ్చి పట్టింది పోంజాగారికా, వాళ్ల అత్తగారికా? సాధారణంగా ప్రశాంతంగాను, సంతోషంగాను ఉండే వల్డానా పట్టణంలో ఈ సమస్య అందరినీ ఇంకా తికమక పెడుతూనే ఉన్నది.


 

Monday, February 23, 2026

ఆలోచన - అవసరం వ్యాసం


ఆలోచన - అవసరం వ్యాసం


ఆలోచన

తెలివి తెలిసి తెలియక ముందే బడిలో పడేస్తరు. పంతులు చెప్పిందే చదువు అన్న పద్ధతి అక్కడనే మొదలవుతుంది. భాషలు నేర్పుతరు. రాత, చదువు రావాలంటే అదే కదా మరి ఆధారము! లెక్కలు కొంతవరకు నేర్పుతరు. ఇంకా సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలైన పాత సంగతులు చెబుతరు. అన్నింటికి మించి చెప్పింది గుర్తుంచుకోవాలె అన్నది మొదటి పాఠం. వాటిని పరీక్షలో అప్పచెపితే మార్కులు వస్తయి. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత గొప్ప లెక్క. ఈ గొప్ప వాండ్ల బతుకులు తరువాత ఎంత బాగ సాగుతున్నయి అన్న సంగతి ఎవరికి పట్టదు. మొత్తం మీద ప్రశ్న అడుగగూడదు. లేనివి ఊహించగూడదు. ఆలోచన అసలే కూడదు. ఈ స్వంత ఆలోచన అన్న పద్ధతి ఏ బడిలోనన్న, ఏ కోర్సులోనన్న నేర్పుతున్నరా? అనుమానమే.

యద్భావం తద్భవతి అని ఒక మాట ఉన్నది. ఏది భావించితే అదే జరుగుతుంది. నీకోసం ఆలోచనే లేకపోతే ఆ సంగతి మరి వాస్తవము అయ్యే మార్గమేమి?

సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము అన్ని తమంతతాము వచ్చి మన ఎదురుగ నిలిచినయా? అన్ని మనిషి అనుభవములో నుంచి వచ్చినవే గదా? వాటికి ఆధారమైన ఆ పద్ధతులు ఎంతమంది వాడుకుంటున్నరు? మొట్టమొదట పరిశీలన. ఎవరంతకు వారు గాక, కొంతమంది మనుషులు ఒకచోట కలిసి ఉంటే, తంటాలు పుడతయి. అందరూ ఒకే రకంగ అర్థం చేసుకోరు. అందరూ ఒకే రకంగ ఆలోచించరు. కనుక ప్రతి సంగతి గురించి వేరువేరు అభిప్రాయాలు పుడతయి. వాటిలో అనుకూలమైనవి, అనుసరించదగినవి ఏవి అనే నిర్ణయము ఆలోచనతో మాత్రమే వీలవుతుంది. ఎక్కువమంది అవునన్నది శాస్త్రము అవుతుంది. ఆ పద్ధతిని మార్చవలసిన పరిస్థితి వస్తే, మళ్ల ఆలోచన మొదటికి చేరుతుంది. సైన్స్ అయినా, మతం అయినా అంతే!

మనిషి మొదటి నుంచి, పరిశీలన, ప్రయోగము, చర్చ, నిష్కర్ష, అనే పద్ధతులతో ఎంతో తెలివిని జమ చేసుకున్నడు. రాను రాను బతుకు మారింది. అనుభవం పెరిగింది. పొద్దు పొడిస్తే వెలుతురవుతుంది. రాత్రి అయితే చీకటవుతుంది. ఈ సంగతిని మొదట్లో గమనించిన మనుషుల భావములను గురించి ఆలోచించండి. నిన్న మొన్నటి వరకు సూర్యోదయము, అస్తమానము గురించి అందరికీ ఒకే ఆలోచన. ఈమధ్య పిల్లలకు సూర్యోదయము అబద్ధము. మనమే భూమితో పాటు తిరుగుతము. వెలుగులోకి మరొకసారి వస్తము అన్న సంగతి అర్థమయింది. భూగోళము బొంగరమువలె తన చుట్టూ తాను తిరుగుతున్నది. అంటే, ఇవాళటికి అందరికీ నమ్మకము కలుగదు. మరి మనమెందుకు తిరుగుతు లేము? అని అడిగినవారు కొంత తెలివిని వాడినట్టు లెక్క. ప్రశ్నలు మరింత ముందుకు సాగితే మరెన్నో సంగతులు తెలుస్తయి. అవునా? అవునుగదా? అనిపిస్తుంది. ఆనందం అది సాటిలేనిది. అనుమానాలు, ప్రయోగాలు, ప్రశ్నలు, పరిశీలనలు, నిర్ణయాలు జరుగుతయి. కొత్త సంగతులు ఎన్నో అర్థమవుతయి.

కొంతమంది, మరింత తెలివిగ ఆలోచించి, మరింత ముందుకు నడిచి, ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తరు. వారికి కలిగే భావనలు, మొత్తం ప్రపంచాన్ని ముందుకు నడపగలుగుతయి. ప్రపంచం మారుతుంది. కొత్త అనుభవాలు తోడవుతయి. మళ్ళా ప్రశ్న, ప్రయోగం, ప్రయత్నం కొత్త భావనల వరుస! ఈ రకంగనే కదా! ఇవాళ ప్రపంచం ఈ పరిస్థితికి చేరింది?

ఒక్కసారి వెనుక తిరిగి చూడగలిగితే కథ మరింత ఆసక్తికరమవుతుంది. నూరేండ్లనాటి, అంతకు ముందునాటి, పోనీ 1900ల సంవత్సరము నాటివరకు పోదాము చాలు! అప్పటి దినపత్రిక ఒకటి దొరికింది, దొరికించు కుందము. అందులో రేడియో అనే మాట కనబడదు. ఇప్పటి పేపర్లో రేడియో గురించి ఉండదు. మధ్యలో రేడియో వచ్చింది. అందరికీ సమాచారం, విద్య, అందం పంచింది. దాని రూపు ఇప్పుడు మారిపోయింది. ప్రతి ఫోన్ లో పాటలే, మాటలే, వార్తలే, విశేషాలే.

అలనాటి పత్రికలో సినిమా, మూవీ అనే మాట కనిపించదు. రేడియో, సినిమా, టీవీ అన్ని 1920 తరువాత ఎప్పుడోగాని రాలేదు. వాటిని, వాటి పనితీరును గురించి ఆలోచన గలవారు ఎంతెంతో భావించినందుకు, వాటి తీరు నమ్మరానంత మారింది. సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఉంటే, ప్రపంచమంత జేబులో ఇమిడిపోతుంది, ఇవాళ. కొందరు భావించిన సంగతులు అందరికీ అనుభవంలోకి వచ్చినయి. అనుభవించే వారికంత ఒకనాడయినా, ఏ రకంగా వీలైంది అని అనుమానం, ప్రశ్న వచ్చిందా? రాలేదు. మన చదువు తీరు వలన కలిగిన స్తబ్ధత. ఆనాటి పత్రికలో అప్పుడప్పుడే ఆటోమొబైల్ గురించి ప్రసక్తి వస్తున్నది. ఇవాళ మనిషి వేరు గ్రహాలకు, సౌర మండలం అవతలకు నౌకలను పంపగలుగుతున్నడు. అంటే అంతా, ప్రశ్న, ఆలోచన, భావనల వలననే గదా?

అందరికీ, ఆలోచించే మనసు ఉండాలె. ప్రశ్నలు వాడి సంగతులు అర్థం చేసుకోవాలె. అప్పుడుగాని, ఉన్న అద్భుతాల గురించి అర్థం అవుతుంది. ఓహో! కదా! అనిపిస్తుంది.

1863 లో జూల్స్ వెర్న్ అనే రచయిత ఆలోచించి ఒక నవల రాసినడు. ప్యారిస్ ఇన్ ద ట్వెంటియత్ సెంచురీ, అన్ననవలలో రానున్న కాలంలో పారిస్ నగరంలో ఉండగల అద్భుత జీవితాలను గురించి రాసినడు. కానీ ఆ నవల 130 సంవత్సరాలు మరుగున పడి ఉండిపోయింది. అది 1994లో అచ్చయింది.

రచయిత ఆ నవల రాసిన కాలంలో రాజులు, రాజ్యాలు ఏలుతుండేవారు. రైతులు శ్రమపడి తిండి పండించే వారు. అటు యూఎస్ లోలోపల యుద్ధాలు జరుగుతున్నయి. రచయిత మాత్రం 1960లో పారిస్ నగరంలో ఆకాశాన్ని తాకే, అందాల, అద్దాల భవనాలు ఉన్నట్టు ఊహించుకున్నడు. ఎయిర్ కండిషనింగ్, టెలివిజన్, లిఫ్ట్ లు, రయిళ్లు, పెట్రోల్ వాహనాలు, ఇంచుమించు ఇంటర్నెట్ లాంటి వ్యవస్థ అన్నింటినీ ఊహించినడు. అతని భావనలన్నీ, పూర్తిగా నిజమయినయి. అంతా అతను అనుకున్నట్టే, పుస్తకం ప్రచురించిన నాటికి ప్రపంచం సాగుతున్నది. అదేదో అనుకోకుండా జరిగిన సంగతి కాదు. వెర్న్ తన నవల ఆలోచన కొరకు ఎంతో మందితో మాట్లాడి, ఎంతో సమాచారం సేకరించి, ఆ తర్వాత మాత్రమే రాసినడు.

అతను, మానవుడు చంద్రగోళం మీదకు దిగినట్టు మరొక నవల రాసినడు. ఆ సంగతి నూరేళ్ల తరువాత నిజమయింది. అయితే వెర్న్ తుపాకి మందును ఇంధనంగ వాడుకునే రాకెట్ గురించి రాసినడు. ద్రవ ఇంధనం రాకెట్ అతనికి తోచలేదు. అది మరో డెబ్భయి యేళ్లకు నిజమయింది.

మొత్తానికి కావలసింది ఆలోచన! భావన! కలగంటే అది నిజమవుతుంది!

 

 

 

 

 




 

Thursday, February 19, 2026

గౌతముడు - గణితం : Buddha and Mathematics


గౌతముడు - గణితం

Buddha and Mathematics


గౌతముడు - గణితం

యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ నంబర్స్ అని ఒక పుస్తకం. రచయిత పేరు జార్జెస్ ఇఫ్రా. అందులో గౌతముడు (తరువాత గౌతమ బుద్ధుడు) చూపిన గణిత నైపుణ్యం గురించి ఒక కథ. కథలలిత విస్తార సూత్రఅనే పుస్తకంలోనుంచి తీసినదట.

గౌతముడు గోప అనే అమ్మాయి కోసం మిగతా యువకులతో పోటీ పడ్డాడని కథలో చెప్పారు. కానీ అది మనకు ఇక్కడ అంత ముఖ్యం కాదు. సిద్ధార్థుడు, అంటే గౌతముడు అర్జునుడు అనే లెక్కల నిపుణునితో పోటీ పడ్డాడు. పోటీలో ఏమి చెయవలె? ‘ఒక పెద్ద అంకెను, ఒక మరీమరీ చిన్న అంకెను గణించి చెప్పవలె!’ ‘ పని అంత కష్టమాఅని ప్రశ్న. ఒక యోజనాన్ని విభజిస్తూ పోయి చివరకు అణువు పరిమాణం వరకు చెప్పడం కష్టమే!

యోజనం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు కూడా మరో ఇంగ్లీషు పుస్తకంలో జవాబు దొరికింది. పుస్తకంపేరుహియర్ ఈజ్ లుకింగ్ అట్ యూక్లిడ్. రచయిత అలెక్స్ బెలోస్. యోజనమన్నది పాతకాలంలోని నిడివి కొలత అని, అది సుమారు పది కిలోమీటర్లకు సమం అవుతుందని బెలోస్ చెప్పాడు. ఇప్ప్పుడు అసలు ప్రశ్నపది కిలోమీటర్లలో ఎన్ని అణువులను పరచవచ్చు?’ అని వస్తుంది.

ప్రశ్నకు గౌతముడు ఇచ్చిన జవాబు. (ఇది బహుశః సంస్కృత శ్లోకాలలో ఉండి ఉంటుంది.కానీ ఆంగ్లరూపం మాత్రమే దొరికింది.)

యోజనములో నాలుగు క్రోశములు

క్రోశములో వెయ్యి చాపములు,

చాపములో నాలుగు మూరలు

మూరలో రెండు జానలు

జానలో పన్నెండు కణుపులు

కణుపులో ఏడు గింజలు

గింజలో ఏడు ఆవగింజలు

ఆవగింజలో ఏడు గోధూళి కణాలు

గోధూళి కణంలో ఏడు గొర్రెదుమ్ము కణాలు

గొర్రెదుమ్ము కణంలో ఏడు కుందేటి దుమ్ము కణాలు

కుందేటి దుమ్ము కణంలో ఏడు గాలిలో తేలే దుమ్ము కణాలు

దుమ్ము కణంలో ఏడు మరింత చిన్న దుమ్ము కణాలు.

అందులో ఏడు మరింత సూక్ష్మమయిన ధూళి కణాలు, అందులో ఏడు అణువులు!

లెక్కన చూస్తే గౌతముడు అణువు పరిమాణాన్ని చాలా దగ్గరగా అంటే, ప్రస్తుతం మనకు తెలిసిన అణువు పరిమాణానికి దగ్గరగా సూచించాడని రచయితలు అభిప్రాయపడ్డారు. వాళ్లకు లెక్కలోని మొదటి కొలతల కన్నా వేలి కణుపుల తర్వాతి భాగం సులభంగా అర్థమయ్యింది. ‘ఒక వేలు నాలుగు సెంటి మీటర్లు పొడుగు ఉంది అనుకుందాం. నాలుగు సెంటి మీటర్లను 7తో పదిసార్లు విభజించాలి. అంటే 0.04 మీ I 7 టు పవర్ ఆఫ్ మైనస్ 10. లెక్క తీస్తే ఒక విలువ 0.000 000 000 01416 మీటర్లు. ఇది ఇంచుమించు కార్బన్ అణువు పరిమాణానికి సమానం! లెక్కను గణిత నిపుణులే తేల్చారు.

గౌతమునికి ఆధ్యాత్మిక దృష్టితో బాటు అంతకన్నా నిశితంగా ప్రపంచ దృష్టి, శాస్త్ర దృష్టి ఉండేదన్నమాట. కథ, లెక్క, ఎక్కడయినా మన పుస్తకాల్లో వచ్చిందా, అన్న అనుమానం మాత్రం ఇంకా మిగిలే ఉంది. పాశ్చాత్యుల దృష్టిలో, ఆనాటి భారతదేశానికి రకమయిన లెక్కల గురించి ధ్యాసే లేదని కద! భారతీయులంతా అంతర్ముఖులయి, తత్వం గురించి మాత్రమే పట్టించుకున్నారని ప్రపంచానికి ఒక ధారణ ఉంది. కానీ వారు పదార్థ ప్రపంచ తత్వం గురించి కూడా ఇంతగా ఆలోచించారన్నది, పాశ్చాత్యులకే కాదు మనకూ ఆశ్చర్యం లగజేస్తుంది.

ఇంత గణితం చెప్పిన సంస్కృతి నుంచి బౌద్ధం వంటి సిద్ధాంతం కూడా రావడం అసలు గుర్తించవలసిన విషయం. కథలో, లెక్కలో పాశ్చాత్యులను గొప్పగా ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. సూక్ష్మాన్ని కేవలంసూక్ష్మంఅని చెప్పి వదలక, దాన్ని రకరకాల కొలతలలో చెప్పడం నిజంగా మనకూ ఆశ్చర్యం కలిగించే అంశమే. గోధూళి, మేష ధూళి, శశక ధూళి అనే కొలతలు ఎంతమందికి తెలుసు? ఇందులో గణితంతోబాటు ఒక రకమయిన కవితా ధోరణి కనబడుతుంది. విభజన గణితంలో గొప్ప మిస్టరీ ఉంది. గొప్ప అందం ఉంది.

నాటి రసాయన శాస్త్రంలో కూడా మరీ చిన్న పరిమాణంగా క్వార్కు గురించి చెపుతుంటారు. పేరుజేమ్స్ జాయ్స్అనే రచయిత నుంచి వచ్చిందని ఎంత మందికి తెలుసు?