Showing posts with label practice. Show all posts
Showing posts with label practice. Show all posts

Sunday, December 28, 2025

కరబావోల కథ - వియెత్నాం జానపద కథ : Vietnamese Folk Story

కరబావోల కథ

వియెత్నాం జానపద కథ

కరబావోల కథ

వియెత్నాంలో కరబావో అనే నీటి దున్నలను వరి పొలాలలో పనిచేయడానికి వాడుకుంటారు. దున్నలు ఎలాగుంటాయో అందరికీ తెలుసు. అయితే కరబావో మూపురం పెద్దగా ఉంటుంది. దాని రంగు నీలం కలిసిన బూడిదగా ఉంటుంది. కొమ్ములు వెనక్కు మళ్లి చదునుగా ఉంటాయి. అవి మెడవెంట వంపు తిరిగి ఉంటాయి. కరబావో బురదలో పడి దొర్లడం ఇష్టపడుతుంది. రెండు కరబావోలను నిలిపి వాటి భుజాల మీద ఒక కాడి పెడతారు. దానికి నాగలి కడతారు. దున్నలు సులభంగా బురదలో దున్నుతూ ముందుకు కదులుతాయి.

చాలా సంవత్సరాల క్రితం కరబావోలు కూడా అడవులలో అన్ని అడవి జంతువులతో పాటు కలిసి బతికేవి. అయితే అవి బద్ధకం గల ప్రాణులు. మిగతా జంతువులు తిరిగిన దారులలో అవి కూడా తిరిగేవి. మిగతా జంతువులు వెతికిన గడ్డిని తినేసేవి. నీళ్లను తాగేసేవి. అప్పట్లో దున్నలు నీళ్లను తాగేవి మాత్రమే. అందులో దిగి బురదలో దొర్లడం వాటికి అసలు తెలియదు. నిజానికి అప్పుడు వాటికి తడి కావడం ఇష్టం లేదు. వానకాలంలో అవి తడికాకుండా తప్పించుకోవడానికి నీడలలోకి వెళ్లిపోయేవి. బురదలో అసలు తిరిగేవి కావు. ఇక కరబావోలు కంపు కొట్టేవి అంటే వింతగా వినిపించదు మరి. అయినాసరే అవి అందమయిన జంతువులు. అప్పట్లో వాటి కొమ్ములు కూడా అన్ని జంతువుల కొమ్ములలాగే పొడుగ్గా, పదునుగా పైకి మళ్లి ఉండేవి. శరీరాలు నునుపుగా కండలు దేలి ఉండేవి.

కరబావోలకు కావలసినంత బలం ఉండేది. అవి కంపు కూడా కొట్టేవి. కనుక మిగతా జంతువులు వాటి దగ్గరకు వచ్చేవికావు. ఒకనాడు జంతువులన్నీ అలవాటు ప్రకారం నెలసరి సమావేశం జరుపుకుంటున్నాయి. ఆ సమావేశంలో ఎవరో కరబావోలను గురించి ఫిర్యాదు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏనుగు తొండం ఎత్తి ఫీుంకరించింది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడది చెప్పసాగింది. ‘‘ఈ ప్రాణులను గురించి ఏదో చేయవలసిన సమయం వచ్చినట్టే ఉంది. ఎవరయినా సలహాలు ఇవ్వగలరా?’’ అన్నది ఏనుగు. ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు బయటకు వచ్చాయి. అయితే జింక చెప్పినది మాత్రం చాలా మంచి పథకం అనిపించింది. ‘‘మనలోని ఒక బలంగల సభ్యుడిని మన ప్రతినిధిగా ఎంచుకుందాము. అందుకు బహుశా పులిగారు తగిన ప్రాణి. ఆయన మన సందేశాన్ని కరబావోలకు వినిపిస్తాడు. వాటిని స్నానం చేయమంటాడు. మన తిండి, నీళ్లను దొంగిలించకూడదని హెచ్చరిస్తాడు. అందరిలాగే పనిలోకి వచ్చి సాయం చేయాలని సలహా ఇస్తాడు. వాళ్లు వింటే సరేసరి. కాదంటే మాత్రం అందరము కలిసి మన దేశంనుండి వాటిని తరిమేద్దాము’’ జింక చెప్పిన మాటలు ఇవి.

ఇక పులి బయలుదేరింది. కరబావోల కోసం వెతికింది. అవి కనిపించాయి. అప్పుడు పులి ఒక చెట్టు ఎక్కింది. ఆ తరువాత మాత్రమే వాటిని పిలిచింది. ‘‘ఓహోయ్‌ కరబావోలూ! వినిపిస్తున్నదా నా మాట?’’ అన్నది. ఆ జంతువులు ఆశ్చర్యంలో మునిగాయి. తల ఎత్తి అటు ఇటూ చూచాయి. వాటిలోనుంచి బలంగా ఉన్న ఒక దున్న మాట్లాడింది. ‘‘అవునవును, వినిపిస్తున్నది. ఇంతకూ తమరెవరు? ఏం కావాలి?’’ చెట్టుమీద నుంచి పులి నెమ్మదిగా జవాబు ఇచ్చింది. ‘‘అడవిలోని జంతువులన్నీ సమావేశం చేశాయి. అక్కడినుంచి మీకు ఒక సందేశం పంపాయి. వినండి. మీరంతా మాతోబాటే కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. గడ్డి సేకరించడంలో మీరు సాయంగా ఉండాలి. అంతకన్నా ముందు మీరు స్నానం చేయడం మొదలుపెట్టాలి. జంతు ప్రపంచానికి మీవల్ల చెడ్డపేరు వస్తున్నది అని మా భావన.’’ బలిసిన దున్న అంతే బలిసిన పద్ధతిలో పట్టించుకోకుండా జవాబిచ్చింది. ‘‘పో పోవయ్యా, ఇక్కడ మీకు నచ్చకపోతే అందరూ కలిసి మరెక్కడికయినా వెళ్లిపోండి. వెళ్లి మీ నేస్తాలకు ఈ మాట చెప్పు. మేమేమీ మామూలు జంతువులం కాము. చాలా బలంగల ప్రాణులము. మా బతుకు మాకు తెలుసు. మాకు చెప్పగలవారు ఎవరు లేరు. మళ్లీ మమ్మల్ని చికాకు పెట్టారంటే అందరినీ మేము నాశనం చేస్తాము.’’

పులి తిరిగి వచ్చేసింది. మళ్లీ సమావేశం పెట్టి తన నివేదిక తెలియజేసింది. జంతు సంఘం సభ్యులకు గొప్ప ఆత్రం పుట్టింది. అన్నీ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టాయి. ఏనుగుగారు మళ్లీ తొండం ఎత్తి ఫీుంకరించి అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్నారు. అప్పుడు ఇలా మాట్లాడారు. ‘‘మిత్రులారా, మనం మార్గం చెప్పమని పై వాడిని అడుగుదాము. అందరమూ ప్రార్థన చేద్దాము.’’ ఆ సలహా ప్రకారం అందరూ ప్రార్థన చేశారు. అది కూడా ముగిసింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు అశరీరవాణి పలికింది. ‘‘జంతువులారా! మీ భావన సరయినదే. కరబావోలు చాలాకాలం పాటు కంగాళీగా బతుకుతున్నాయి. తమ దారిని మార్చుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. వాటికి శిక్ష తప్పదు. పులులన్నీ కలిసి వాటి గుంపుమీద దాడి చేయండి’’ అది సందేశం.

ఇక పులులన్నీ కలిసి సందేశం ప్రకారం కరబావోల వేటకు బయలుదేరాయి. త్వరలోనే వాటి గుంపు కనిపించింది. జాగ్రత్తగా ప్రణాళిక వేసి దాడి మొదలు పెట్టాయి. యుద్ధం ముగిసింది. ఒక్క పులికి కూడా గాయాలు కలగలేదు. కరబావోలు మాత్రం అన్యాయంగా మిగిలిపోయాయి. వాటిని చూస్తే ఎవరికయినా జాలి వేస్తుంది. వాటి కొమ్ములన్నీ వెనక్కు అదుముకు పోయాయి. ఒంటినిండా గాయాలయ్యాయి. చావకుండా మిగిలిన కరబావోలు పక్కనే ఉన్న ఒక ప్రవాహం లోకి దిగాయి. అక్కడే లోతులేని నీటిలో మునిగి ఉండి తమ గాయాలకు చికిత్స చేసుకున్నాయి. కొంతకాలానికి వాటికి నయం అయింది. కొంచెం బలం పుంజుకున్న తరువాత కరబావోలు కూడా సమావేశం పెట్టుకున్నాయి. చేయవలసిన పనులను గురించి ఆలోచించాయి. అనుభవంగల పెద్ద జంతువులు ముందుకు వచ్చి సలహా ఇచ్చాయి. ఆ ప్రాంతంనుండి తరలిపోతే మంచిది అన్నాయి. కుర్ర కరబావోలు మాత్రం అక్కడే ఉండి మిగతా జంతువులతో యుద్ధం చేయాలి అన్నాయి. వాదన కొనసాగింది. గోల జరుగుతుండగా ఒక కొత్త గొంతు వినిపించింది. జంతువులకు సలహా ఇచ్చిన అశరీరవాణి ఇక్కడ కూడా మళ్లీ ఏదో చెపుతున్నది. ‘‘కరబావోలూ, మీ పద్ధతికి తగినట్టుగా శిక్ష జరిగింది. అయితే ఇంతటితో ముగియలేదు. ఇక మీదట మీరు బద్ధకంగా ఉండడం కుదరదు. కష్టించి పనిచేయనిదే మీకు తిండి దొరకదు. అందంగా ఉన్నామని గర్వపడ్డారు కనుక అనాకారులుగా మారారు. ఇక బురదలో పడి దొర్లుతూ ఉంటారు. మురికిగా ఉండడం మీకు ఇష్టం కదా! కనుక మీరు వెంటనే దగ్గరలోని పల్లెకు వెళ్లండి. అక్కడ రైతులను ఆశ్రయించండి. బురద వరి పొలాలలో వాళ్ల నాగళ్లు లాగండి. కలకాలం ఆ బురదలోనే బతకండి’’ అది సందేశం.

కనుకనే నీటి దున్నలు అనే కరబావోలు మూపురం గల వెన్నుతో వెనుకకు మళ్లిన పనికిరాని కొమ్ములతో ఈనాటికీ కనబడతాయి. అవి ఈనాటికీ వరిపొలాలలో నాగళ్లు లాగుతూ బురదలో బతుకుతుంటాయి.



Saturday, December 27, 2025

నిద్ర – మెలుకువ - సైన్స్ ప్రకారం అవగాహన

నిద్ర – మెలుకువ


నిద్ర – మెలుకువ

మా పక్కింటాయన నేను నిద్రలేచే సమయానికి చక్కగా స్నానం ముగించుకొని మరికొన్ని పనులు కూడా చేసి ఆనాటి పనికి సిద్ధంగా ఉంటాడు. అసలు మొదటినుంచి త్వరగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున్నే త్వరగా లేచే వాళ్ళు, ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారు అని అన్ని భాషల్లో రకరకాలుగా చెప్పేవారు. అయితే అందరికి ఆ రకంగా ఉండడం వీలు కాదు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్, అని కూడా ఒకమాట ఉంది. అంటే త్వరగా నిద్రలేస్తే పని బాగా జరుగుతుంది అని భావం. కనుకనే అందరూ త్వరగా నిద్రలేవాలి అనుకుంటారు.

కానీ కొంతమంది మాత్రం, రాత్రి చాలా సేపు వరకు పనిచేసి, ఉదయాన కొంచెం నెమ్మదిగా నిద్ర లేస్తారు. ఈ రకం తేడాలను పరిశోధకులు క్రోనోటైప్స్ అని గుర్తిస్తుంటారు. వారు మాత్రం త్వరగా నిద్రలేచేవారు గొప్పవారు, మిగతావారు కారు అన్న విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు.

అన్నిటికన్నా ముందు గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. కనీసం 60% మంది అటు రాత్రి పని చెయ్యరు, ఇటు ఉదయాన త్వరగా లేవరు. వాళ్ళ పద్ధతి రెండు పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన నిద్రలేవడం అన్ని లక్షణాల మీదనే ఆధారపడి లేదు అంటున్నారు పరిశోధకులు. రాత్రి పనిచేసే వాళ్లను గుడ్లగూబలు అంటారు. త్వరగా నిద్రలేచే వాళ్ళను భరత పక్షులు అంటారు. అది ఇంగ్లీష్ లో అని వేరుగా చెప్పనవసరం లేదు. ఈ తేడాలకు రకరకాల కారణాలు ఉంటాయి అని కూడా వారు చెబుతున్నారు. కొన్ని ఉద్యోగాలలో రాత్రి పని చేయవలసి వస్తుంది. కొంత మందికి అవసరం ఉండదు.

పరిశోధకులు చెబుతున్న ప్రకారం సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్లు ఎక్కువగా ఉదయాన త్వరగా లేస్తారు అనే అర్థం అవుతున్నది. ఈ తేడాలకు మరొక కారణంగా వయసు కూడా ఉంది. కుర్రవాళ్లు గబ్బిలాలుగా రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉంటారట. వయసు పెరుగుతున్న కొద్దీ, త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటు అవుతుందట.

ఇంతకూ నిద్ర మెలకువల కారణంగా ఆనందంగా బతకడం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఉదయాన త్వరగా లేచేవారు దినమంతా హుషారుగా, సాధారణంగా ఆనందంగా ఉంటారు అని తెలిసింది. టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో ఈ మధ్యన పెద్ద ఎత్తున ఒక పరిశోధన జరిగింది. అక్కడ కూడా త్వరగా నిద్ర లేచేవాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు ఫలితాలు కనిపించాయి. విద్యార్థులు త్వరగా నిద్రలేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారు అని కూడా తెలిసింది.

ముఖ్యంగా విద్యార్థులలో 26.6% మంది గబ్బిలాలు అంటే రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. అటువంటి వారికి ఆనందం తక్కువగా ఉందట. భరత పక్షులు అనిపించుకున్న పిల్లలు చురుకుగా ఉన్నారట. అంతేకాదు సంతోషంగా కూడా ఉన్నారట. ఇక జర్మనీలో లైప్చిష్ యూనివర్సిటీలో కూడా ఈ మధ్య ఇటువంటి పరిశోధన జరిగింది. త్వరగా నిద్రలేచే వాళ్ళకు జీవితాలలో మంచి సంతృప్తి ఉంటుంది అని తెలిసింది. ఇక రాత్రి ఎక్కువ కాలం మెలుకువ ఉండేవారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరి కొన్ని మానసిక సమస్యలు, మత్తుపదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి.

విషయం అనుకున్నంత సజావుగా లేదు. రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉన్నవాళ్లు, అసలు తక్కువ కాలం నిద్రపోతున్నట్టు తెలుస్తున్నది. త్వరగా నిద్రలేవడం కన్నా నిద్ర సమయం ఎక్కువ సమస్యగా ఉంటున్నది. త్వరగా నిద్రలేచే వారికి తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు కూడా కనిపించింది.

ఈ విషయాలన్నీ గమనిస్తుంటే ముఖ్యమైన ప్రశ్న మరొకటి ముందుకు వచ్చింది. నిద్రలో ఈ తేడాలు అసలు ఏ కారణంగా మొదలవుతాయి అన్నది ఆ ప్రశ్న. సహజంగా ఉన్న ఈ పరిస్థితిని ప్రయత్నించి మార్చడానికి వీలు కుదురుతుందా అన్నది మరో ప్రశ్న. ఈ అంశం గురించి వార్విక్ విశ్వవిద్యాలయంలో వివరంగా పరిశోధనలు జరిగాయి. అక్కడ వారికి ఈ క్రోనోటైప్స్ అంటే నిద్ర పద్ధతికి, మనిషి వ్యక్తిత్వానికి మధ్య సంబంధాలు ఉన్నట్లు కనిపించింది. తమను తాము చక్కని క్రమశిక్షణతో నియంత్రించుకోగలవారు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు, అని గమనించారు. అసలు వ్యక్తిత్వంలో స్వయం నియంత్రణ, చక్కని క్రమపద్ధతి, ఆశా భావం ఉంటే నిద్ర వారి నియంత్రణలో ఉంటుంది అని గమనించారు. ఇక సులభంగా మనసును బయటపెట్టి గలగలా మాట్లాడేవారు, రహస్యాలు దాచుకోకుండా ఉండేవారు రాత్రి ఎక్కువ కాలం మెలుకువగా ఉంటున్నారని గమనించారు. జన్యు పరంగా వ్యక్తిత్వ లక్షణాలు వచ్చేవారు, దాని ఆధారంగా నిద్ర విషయంగా కూడా తేడాలు కనబరుస్తారని తెలిసింది.

అన్నిటికి మించి మరొక్క విషయం గుర్తించాలి. క్రోనోటైప్స్ అంటే గుడ్లగూబలు (రాత్రి పని చేసేవారు), భరత పక్షులు (త్వరగా నిద్రలేచేవారు) అన్న లక్షణాలు, శిలాక్షరాలుగా గట్టిగా నిలిచి ఉండవు అంటున్నారు. ఈ పరిస్థితి జన్యుపరంగా కాక మరెన్నో లక్షణాల కారణంగా స్థిరమవుతుంది, అని పరిశోధకులు గమనించారు. కుటుంబంలోని అలవాట్లు, ఉద్యోగం ప్రకారం వచ్చే అవసరాలు, మామూలుగా బతుకు తీరు ఆధారంగా కూడా ఈ నిద్ర పరిస్థితులు నిర్ణయమవుతాయి, అంటున్నారు పరిశోధకులు. కేవలం జన్యు కారణాల వల్లనే కాక నిద్ర తీరు మీద మరెన్నో ప్రభావాలు ఉన్నాయి అన్న అంశం గట్టిగా తేలింది. కనుక ఈ లక్షణాలు కొంత ప్రయత్నిస్తే మార్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా వార్విక్ విశ్వవిద్యాలయంలో ఈ మార్పు గురించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరగా నిద్ర లేవదలుచుకున్నవారు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది, అంటున్నారు పరిశోధకులు. ఉదయాన త్వరగా నిద్రలేచినందుకు చక్కని బహుమతి కూడా ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలి, అని వారి సలహా. నిద్ర లేవగానే హాయిగా వేడి వేడి కాఫీ తాగడం కూడా అటువంటి బహుమతులలో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా లేచినందుకు హాయిగా వాకింగ్ వెళ్లి రావచ్చు. తమ కోసం ప్రత్యేకంగా మరొక రకంగా కాలం గడపవచ్చు.

వార్సా యూనివర్సిటీ లో ఈ అంశం గురించి మరికొన్ని పరిశోధనలు జరిగాయి. రుతువుల ప్రకారం కూడా ఈ విషయంలో మార్పులు వస్తాయి అని అక్కడ గమనించారు.

మొత్తానికి త్వరగా నిద్రలేచినందుకు, బతుకు ఆనందంగా గడుస్తుంది అన్న గ్యారంటీ మాత్రం లేదు, అని అర్థమయింది. నిద్ర లేచినందుకు బతుకులో హాయి, బతుకులో హాయిగా ఉన్నందుకు నిద్ర లేచే తీరూ, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా ప్రభావాలు చూపుతాయి. ఫలితంగా సంతృప్తి కలుగుతుంది, అని కూడా అంటున్నారు. దినమంతా చురుకుగా పని చేయాలి, బ్రతుకులో మంచి గమ్యాలు ఉండాలి, అప్పుడు సమయానికి నిద్ర వస్తుంది. కావాలనుకున్నప్పుడు మెలకువ కూడా వస్తుంది. అది చివరగా అర్థం చేసుకోవాల్సిన సూత్రం.

Thursday, December 11, 2025

ప్రశ్న ప్రాముఖ్యం In Telugu - Importance of Question

ప్రశ్న   ప్రాముఖ్యం


ప్రశ్న - ప్రాముఖ్యం

కే బి గోపాలం

 

ఒక అమ్మాయి మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్ళింది. అక్కడ ఆమెను ఇక్కడి నుంచి చంద్రుడి వరకు గల దూరం ఎంత అని ప్రశ్న అడిగారు. సార్! మనం మందులు చంద్రుడి మీద కూడా అమ్ముతామా? అని ఎదురు ప్రశ్న వేసింది అమ్మాయి.

సరైన ప్రశ్న అడగగలిగిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ప్రశ్నలు అడిగినందుకే ప్రపంచం పరిస్థితి మారింది. వ్యక్తిగా అయినా, సమూహంగా అయినా ప్రశ్న అడగ గలగాలి. ఎవరూ ప్రశ్న అడగకుంటే జరగవలసిన మంచి చెడు జరుగుతూనే ఉంటాయి. ప్రశ్న అడిగితే బహుశా వాటి దారి మారవచ్చు.

తొలినాటి నుంచి మనిషి ప్రపంచం గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు కనుకనే ఇవాళ ప్రపంచం ఈ పద్ధతిలో ఉంది. ఒక విషయం తెలిసిన వెంటనే మనిషి మనసులో ఆ సంగతి గురించి వంద ప్రశ్నలు పుడుతాయి. పుట్టాలి కూడా. కానీ చాలామంది ప్రశ్న అడగరు. ప్రతి విషయం గురించి ప్రశ్న అడిగితే అడిగిన మనిషికి ఏమీ తెలియదు అనుకుంటారేమో అని అనుమానం. ఒక ప్రశ్న అడిగారు. దానికి జవాబు వచ్చింది. జవాబు మీద మరొక ప్రశ్న పుడుతుంది. ఒకటే కాదు ఎన్నో ప్రశ్నలు పుడతాయి. ఈ రకంగానే మనకు గాని మరొకరికి గాని కొత్త, పాత విషయాలు అన్నీ తెలుస్తాయి.

ప్రశ్నలు అడిగిన కొద్ది వ్యవహారం రకరకాల దిక్కుల్లోకి విస్తరిస్తుంది. అంటే కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. అర్థమవుతాయి. ప్రశ్నల ఆధారంగా పెరిగే తెలివి ఒకే దారిలో నడవదు. వంద మార్గాలను వీలు చేస్తుంది.

వానకాలం అన్నారు. కానీ వానలు లేవు. ఎక్కడ కురుస్తున్నాయో తెలియదు. ఎండాకాలంలో ఎండలు మాత్రం మండుతాయి. చలికాలం గురించి మనం పట్టించుకోము. మరి ఈ కాలాల పరిస్థితి ఒకప్పుడు ఉన్నట్టు, ఒకప్పుడు అనుకున్నట్టు ఎందుకు ముందుకు సాగడం లేదు? మీ మనసులో ఈ ప్రశ్నకు పుట్టి ఉంటే, ప్రపంచం మీద మనిషి ప్రభావం గురించి ఎన్నో ప్రశ్నలు పుడతాయి.

మనం ఉన్నాము అంటే మన చుట్టూ ప్రపంచం, ప్రకృతి ఉన్నాయి కనుక కొనసాగుతున్నాము. అవేవీ లేకుండా కేవలం మంచు, నీరు, భూమి మాత్రమే ఉన్నచోట మనం ఉన్నట్టు ఊహించండి. అక్కడ మనం కాక మరేమీ లేనట్టు ఊహించండి. మన బతుకు ముందుకు సాగుతుందా? అనుమానం వచ్చి ఉంటుంది. అన్ని విషయాల గురించి ఆలోచన అవసరం లేదు. అవి అట్లాగే ఉంటాయి కనుక ఉంటాయి.. మనం పట్టించుకునే అవసరం లేదు, అనుకుంటే బతుకు సాగుతుంది. కానీ అందులో రుచి ఉండదు. ఏం జరుగుతున్నది తెలుసుకుంటే అనుకూలమైన విషయాలను కొనసాగించి, కానీ వాటిని ఆపగలిగే పరిస్థితి అందుబాటులోకి రావచ్చు. ప్రకృతిని పరిశీలించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా బ్రతకడం అంటే బండగా బతకడం అని అర్థం. ప్రకృతి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారికి మరింత ముందుకు సాగడానికి అనువుగా వందలాది ప్రశ్నలు వందలాది మార్గాలు కనబడుతుంటాయి. పరిశీలించే వారిది వెలుగులో జరిగే బతుకు. ఆ గుణం లేని వారిది మసక చీకటిలో బతుకు. ఉల్లిగడ్డలో ఎన్ని పొరలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకోవలసిన విషయాలు కూడా అదే పద్ధతిలో పొరలు పొరలుగా దాగి ఉంటాయి. తెలుసుకుంటే కలిగే ఆనందం వేరు. తెలియకుండా బతకడం అది మరో తీరు.

ప్రశ్న అడిగాము, జవాబు కూడా దొరికింది. కొన్నిసార్లు ఒకే ప్రశ్నకు రకరకాల జవాబులు దొరుకుతాయి. అందులో మరి ఏ జవాబును అంగీకరించాలి, ఏ జవాబు గురించి మరింత లోతుగా పరిశీలించాలి అన్నది అసలైన చిక్కు. వచ్చిన జవాబు నిక్కచ్చితనం గురించి తెలుసుకోగలగడం, అసలు సిసలైన తెలివి. తగిన సాక్ష్యాలను, ఆధారాలను వెతికి అర్థం చేసుకోవడం చాలా గొప్ప తెలివి. ప్రతి విషయం గురించి అనుమాన పడుతుంటే అది సరైన పరిస్థితి కాదేమో అని అనుమానం రావచ్చు. కానీ ఎదురైన విషయాలను అన్నింటిని తలవంచి అంగీకరించడం మాత్రం తగిన పద్ధతి కానే కాదు. ఈ రకంగా ముందుకు సాగడం బహుశా అనుకొన్నంత సులభం కాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రశ్నలకు జవాబు దొరకకపోవచ్చు. అలాగని ప్రశ్నలు అడగకుండా ఉండడం మాత్రం తగిన పద్ధతి కాదు.

ప్రపంచం గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్న విషయాలనే వాటి లక్షణాలను బట్టి రకరకాల శాఖలుగా విభజించి మొత్తాన్ని కలిపి సైన్స్ అన్నారని ఇప్పటికైనా అర్థం అయితే మనం మరింత ముందుకు సాగవచ్చు. సైన్స్ కానిది ఏదీ లేదు. ఏం ఉన్నా, ఏం జరిగినా, జరగబోతున్నా అంతా ఒక అవగాహన ప్రకారం జరుగుతుంది.. ఆ అవగాహనకే సైన్స్ అని పేరు. మనిషి మొదటి నాటి నుంచి గాలి గురించి, నీరు గురించి, నేల గురించి మరిన్నింటినో గురించి మహత్తరమైన సమాచారాన్ని సేకరిస్తూ సాగాడు. ఆ మొత్తం సమాచారం క్షణంలో మనకర్థం కావాలంటే కుదిరే పద్ధతి కాదు. అలాగని అది అవసరం లేదు అనుకుంటే కూడా కుదరదు. ప్రతి అంశం గురించి ప్రతి ఒక్కరికి కొంతైనా తెలిసి ఉండాలి. అప్పుడు కొన్ని అంశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా అర్థమవుతాయి. ఆకాశం వేరు, నేల వేరు. కానీ వాటి మధ్య సంబంధం మాత్రం తప్పకుండా ఉంది. ఆ రెంటికి మధ్యన ఎన్నో అంశాలు ఉన్నాయి. వాతావరణం అంటే చుట్టూ ఉన్న గాలి అని సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ వాతావరణం అంత సులభమైన విషయం కాదు. దానిమీద నేల ప్రభావం, సుదూరంగా ఉన్న సూర్యుని ప్రభావం, నక్షత్రాల ప్రభావం, మరెన్నో ప్రభావాలు ఉంటాయి. ఒక్కసారి ఈ విషయం గురించి లోతుగా ఆలోచిస్తే సైన్స్ విస్తరణ సులభంగా అర్థమవుతుంది.

ప్రపంచమంతా, విశ్వమంతా రసాయనాల మయం. ఆ రసాయనాలు రకరకాల రూపాలలో ఉంటాయి. ఒకదానితో ఒకటి రకరకాలుగా కలుస్తుంటాయి. మారుతుంటాయి. మార్చుతుంటాయి. ఈ జరిగే చర్యకు ఒక పద్ధతి ఉంటుంది.

ఏదో ఒక్క విషయాన్ని ఎంచుకున్నా సరే దాన్ని గురించి లోతుగా తెలుసుకోవడానికి జీవితకాలం పడుతుంది. అటువంటిది ఉన్న ఇన్ని రకాల సంగతులను గురించి తెలుసుకోవడం సులభంగా వీలవుతుందా? కాదు అని వేరుగా చెప్పనవసరం లేదు. కనుక ఏదో కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకుందాము అంటే కూడా అది పద్ధతి కాదు.

సైన్స్ నిజానికి మ్యాజిక్ లాగా కనపడవచ్చు. కొన్ని మార్పులు అనుకోకుండా జరుగుతాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి. వాటి గురించి అడిగితే సైన్సును పట్టించుకునే వాళ్ళు సంతోషంగా వివరాలను అందజేస్తారు. అదే మాంత్రికుడిని రూపాయలు ఎలా సృష్టించావు అని అడిగితే నవ్వి ఊరుకుంటాడు తప్ప జవాబు చెప్పడు. అంటే అక్కడ ఏదో అర్థం కాని అంశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అతను వివరించేపితే మరునాడు అతని ప్రదర్శన ఎవరూ చూడరు. అందులో మన కంటికి కనిపించని కిటుకు ఏదో ఉంటేనే అది ఇంద్రజాలం అనే మ్యాజిక్. సైన్స్ లో మాత్రం కనిపించినా, కనిపించకుండా కనీసం అవగాహనకు రాగలిగిన పద్ధతులు మాత్రమే ఉంటాయి.. ఈ తేడా మనం తెలుసుకోవాలి.

నాకైతే మరి మ్యాజిక్ లో సైన్స్ ఉందా అన్న ప్రశ్న కూడా పుట్టింది. తప్పకుండా ఉండి ఉంటుంది అని కూడా తోచింది. ఆ సంగతి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మ్యాజిక్ రహస్యం బయటపడుతుంది. పట్టించుకోకుండా ఉన్నంతవరకు అది మంత్రజాలం. వివరం తెలుసుకుంటే చేతి ఒడుపు, కనుకట్టు. అంటే లేనిది కనిపించేట్టు చేసే ఒక పద్ధతి. ఉన్నది మరొక రకంగా కనిపించేట్టు చేసే పద్ధతి. ఆ పద్ధతి వాళ్ళ దగ్గరే ఉంటుంది.

సైన్స్ మాత్రం అందరి దగ్గర ఉంటుంది. ప్రశ్నిస్తే జవాబు రూపంలో అది మన దగ్గర ఉంటుంది.



Thursday, December 4, 2025

Prapanchatantram ప్రపంచతంత్రం - ఒక పరిశీలన

 ప్రపంచతంత్రం - ఒక పరిశీలన


ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం. అన్ని హంగులూ వాడుకుంటున్నాం. అయితే, ప్రపంచం గురించి,  హంగుల గురించి ఆలోచన మాత్రం తక్కువయినట్లు కనపడుతుంది. గేదె ఉంటుందని తెలియదు. పేడ వేస్తుందని తెలియదు. పాలు ఇస్తుందని తెలియదు. తెల్లవారేసరికి తలుపు ముందర పాలప్యాకెట్లు మాత్రం ఉండాలి. పల్లెలలో కూడా కొంతమంది పరిస్థితి ఇట్లాగే ఉంది. పల్లెలకు, పట్నాలకు తేడా కనిపించడం లేదు. నీళ్లు ఇక్కడా లేవు, అక్కడా లేవు. కార్లూ, టెలివిజన్‌లు, సెల్‌ఫోన్‌లు అంతటా ఉన్నాయి. అవి లేనిదే కాలం గడవడంలేదు. కరెంటు లేకున్నాసరే యంత్రాలను పనిచేయించేందుకు, జనరేటర్లు, ఇన్‌వర్టర్లు ఎక్కడచూచినా కనపడుతున్నాయి.

          మొదటినుంచి మనిషి బాధంతా సౌకర్యం కొరకే. ఆ సౌకర్యం ఎట్లా అమరుతున్నది అన్న ప్రశ్న అందరి మెదళ్లలోనూ పుట్టదు. నాడి చూచి, కుప్పె అరగదీసి మందు నాకించే కాలం పోయింది. జలుబయింది అన్నా సరే బోలెడన్ని పరీక్షలు జరగాలి. స్కాన్‌లు, గందరగోళం జరగాలి.

          ఒక్కసారి తలపైకెత్తి చూస్తే అంతులేని ఆకాశం కనపడుతుంది. ఇంకా లోతుకు పోతే అనంతమయిన అంతరిక్షం ఉందట, అదంతా కలిసి విశ్వం అంటారట. కొంతమంది చాలా తెలుసు అన్నట్టు ఈ విషయాలను గోలగోలగా చెప్తుంటారు. లక్షలు, కోట్ల సంవత్సరాలకు ముందు పేలుడు జరిగిందంటారు. కొత్త పరిశోధకులు వచ్చి అదేమీ లేదంటారు. రాబోయే లక్షల సంవత్సరాల గురించి ఏదేదో చెప్పి భయపెడుతుంటారు. ఈ విశ్వం ఒక పెద్ద పేలుడు జరిగినందుకు మొదలయిందా? ఎవరు చెప్పాలి? లేదంటున్నారు కూడా! అది ఎప్పుడూ ఉన్నదే అంటున్నారు.

          మన గురించి, మన ఉనికి గురించి, మన పరిసరాలను గురించి కొంతమంది గట్టిగానే ఆలోచించారు. బోలెడంత సమాచారాన్ని ఒకచోట చేర్చారు. అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సిద్ధాంతాలను, సూత్రాలను తయారు చేశారు. కొంతకాలానికి ఇవన్నీ కలిసి సైన్స్‌ అనే ఒక అర్థంకాని జ్ఞానభాండాగారం పుట్టింది. అర్థంచేసుకోగలిగినవారికి కూడా అందులో విషయాలు, వైవిధ్యం అడ్డుతగులుతున్నాయి. ఇక వాటి గురించి పట్టించుకోకుండా, తన బతుకంటే సైన్స్‌ అని తెలియకుండా బతుకుతున్నవారికి సైన్స్‌కన్నా గందరగోళం మరొకటి లేదు అనిపించే పరిస్థితి వచ్చింది.

          సైన్స్‌ అంటే ఇంతకుముందు అన్నట్టు సమాచారం కుప్పగా కూడిన ఒక లైబ్రరీయా? అందులోకి తొంగిచూచేందుకు అందరికీ అవకాశం ఉండదా? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? అడిగినవారికి జవాబులు ఎవరు అందించాలి? సైన్స్‌ అన్నది  అంతంలేని ఒక అన్వేషణ. ఒక కార్యక్రమం. ఒక ప్రక్రియ. ప్రశ్నల పరంపర. అర్థం అయినవాటి గురించి, కానివాటి గురించీ, అనుమానాలను పెంచుకుని, ఎందుకు? ఎట్లా? అని ప్రశ్నలు అడగాలి. వాటికి జవాబులు వెతకాలి. అదే సైన్స్‌.  ఒకప్పుడు సైన్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ప్రపంచాన్ని పరిశీలించినవారే మనిషి ఆలోచనలను కూడా పరిశీలించారు.  అంటే, సైన్స్‌కు సైకాలజీకి అప్పట్లో తేడా లేదు. ప్రశ్నల సంఖ్య పెరిగింది. వాటికి జవాబులు కుప్పతిప్పలుగా ఎదురయ్యాయి.  చర్చ మొదలయింది. శాఖలు మొదలయ్యాయి. ఒక్కొక్కరకం ప్రశ్నలకు సైన్స్‌లోనే ఒక్కొక్కశాఖ మొదలయింది. కొంతకాలానికి ప్రశ్న అడిగినవారికి కూడా అర్థంకాని జవాబులు, అంశాలు ఎదురయ్యాయి. మొదటవచ్చిన ప్రశ్న మరీ అమాయకంగా కనిపించింది. ఆ రంగంలో లోతు ఎక్కువయింది. ఆ లోతులోకి దిగినవారికి మిగతా లోతుల అంతు అసలు ఉందని కూడా తోచని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మామూలు మనిసికి, సైన్స్‌కూ మధ్య ఒక అగాధం ఏర్పడింది.  సైన్స్‌ అనే ప్రపంచం మనది కాదన్న భావం మొదలయింది.

          ప్రశ్నలకు జవాబులు కనుగొనే ఆనందంలో సైంటిస్టులు కూడా తాము మామూలు మనుషులమన్న మాట మరచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నలకే జవాబులు వెతికారు. తమ బతుకులలోనే మరిన్ని ప్రశ్నలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వెతుకుతున్నారు కనుక సమాధానం దొరుకుతుంది. సమాధానంతో సంతృప్తి మాత్రం కలగదు. ఈ సమాధానం నిజమని తేల్చుకునేది ఎట్లాగ? అన్నది మరొక గొప్ప ప్రశ్నగా ఎదురవుతుంది. ఒకసారి ఒక ప్రశ్నతోనే తలబద్దలు కొట్టుకోవాలి. అన్ని ప్రశ్నలూ అడిగితే, గజిబిజి తప్ప మరేమీ మిగలదు. ఆ క్రమంలో ప్రశ్నలు వచ్చాయి, జవాబులు వచ్చాయి. బతుకు కొంత అర్థమయింది. సైన్స్‌ మరింత అర్థమయింది. అది తెలిసినవాళ్లకు ఇది పట్టకుండా ఉంది. సైన్స్‌ అర్థమయినవాళ్లకు మిగతా ప్రపంచం పట్టకుండా ఉంది. లైబ్రరీలు మరీ పెద్దవయిపోయాయి. పుస్తకాలు ఉన్నాయని తెలుసు. ఏ పుస్తకం ఎక్కడ ఉందో వెతకడమే ఒక పెద్ద సమస్య. ఆ పుస్తకంలో ఉన్న సంగతిని పట్టించుకుని అర్ధం చేసుకోవడం అంతకన్నా పెద్ద సమస్య.

          దినపత్రికలు చదవడం అలవాటున్నవాళ్లకు ఆ మధ్యన అందరూ దైవకణం గురించి గోల చేయడం గుర్తు ఉండే ఉంటుంది. అంతకుముందు కొంతకాలం ఎయిడ్స్‌ గురించి గొడవ గొడవగా చెప్పుకున్నారు. అప్పుడప్పుడు సైన్స్‌లో ఏదో  ఒక సంచలనాత్మక విషయం తలెత్తుతుంది. అప్పుడు మొత్తం ప్రపంచం అటువేపు మళ్లి ‘సైన్స్‌ ఉంది’ అనుకుంటారు. భూకంపం వచ్చినప్పుడు అందరికీ హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గుర్తుకు వస్తుంది. మామూలు పరిస్థితిలో అది ఉందని కూడా ఎవరికీ గుర్తుండదు. అక్కడ పనిచేసేవాళ్లకు తప్ప!

          ఎవరు ఏ విషయం పట్టించుకున్నా, పట్టించుకోకున్నా బతుకులు కొనసాగుతాయి. బతుకంటే సైన్స్‌ కనుక సైన్స్‌ కూడా కొనసాగుతుంది. బతుకులో సంగతులను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించినవాళ్లకు సైన్స్‌ ఉందన్న భావం అప్పుడప్పుడు కలుగుతుంది. న్యూటన్‌ తలమీద ఆపిల్‌ పడితే, ఆయన ఒక దారిని చూపించి అవగాహన కలిగించాడు. డార్విన్‌కు ప్రపంచమంతా పరిణామక్రమంగానే కనిపించింది. జీవులలో లక్షణాలు వంశక్రమంలో వస్తాయని మరొకాయన చెప్పాడు. ఆవిరితో ఇంజన్‌ నడుపుతానన్నాడు మరొక పెద్ద మనిషి. స్థలం, కాలం వంపు తిరిగాయి అన్నాడు ఇంకొకాయన. ఇవన్నీ వాళ్లు కాకుంటే, మరొకరు ఎవరో ఎప్పుడో కనుగొని ఉండేవారే. కానీ, చాలా విషయాలను చాలామంది కనుగొన్నారు.  కొంతమంది కొత్తదారులు వేశారు. కొంతమంది ఆ దారులలో నడిచారు. దారులు వేసినవారు మన జ్ఞాపకాల నుంచి మరుగున పడి ఉండవచ్చు. కొంతమంది మాత్రం వద్దన్నా, గుర్తుకు వస్తుంటారు.

          విద్యుత్తు వాడుతున్నాం. లైట్‌ బల్బులు వాడుతున్నాం. సెల్‌ఫోన్‌ వాడుతున్నాం. మరెన్నో సదుపాయాలను వాడుకుని  బతుకులను సుఖమయం చేసుకున్నాం. అందిన సుఖాలకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత చెపుదామంటే, ఎవరికి చెప్పాలి?  ఏ ఒక్క సదుపాయమూ మంత్రం వేసినట్టు ఒక్క క్షణంలో ప్రత్యక్షం కాలేదు. రేడియోతరంగాలు ఉన్నాయని కనుగొన్నారు.  సమాచారాన్ని తరంగాలుగా మార్చవచ్చునని మరొకచోట కనుగొన్నారు. అందుకు కావలసిన హంగులను ఇంకెక్కడో కనుగొన్నారు. సెల్‌ఫోన్లో మాటా, పాటా మాత్రమే కాక, బొమ్మలను కూడా పంపగలుగుతున్నాం. ఇవాళ మన జేబులో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ చేయగలిగిన పనిని నాలుగు దశాబ్దాల క్రితం ఒక పెద్ద గదినిండా పరిచిన కంప్యూటర్‌కూడా చేయగలిగేది కాదు. అంటే, ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రానిక్స్‌ అని ఒక రంగం వచ్చింది. అందులో పరికరాలు రాను రాను చిన్నవిగా మారుతున్నాయి. సర్క్యూట్లు, బ్యాటరీలు, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఇవన్నీ నిజానికి పూర్తి వేరు వేరు రంగాలు. అవన్నీ కలిసి సైల్‌ఫోన్‌గా మనముందుకు వచ్చి మురిపిస్తున్నాయి. ఎవరయినా ఒకప్పటి వేలితో తిప్పే పాత టెలిఫోన్‌ను గురించి ఆలోచిస్తున్నారా? ఇవాళ వేలితో ఫోన్‌ తెరమీద మనం చేస్తున్న విన్యాసాలు, జానపదం సినిమాలో మాంత్రికుని ‘హాం ఫట్‌’ కన్నా ఆశ్చర్యకరంగా ఉన్నాయని అనుకుంటున్నారా?

          అది సైన్స్‌ గొప్పదనం! సైన్స్‌ ఆధారంగా పెరిగిన సాంకేతికశాస్త్రం గొప్పదనం! వాటి గురించి ఎంత తెలుసుకుంటే, అంతగా ఆనందం, ఆశ్చర్యాలు సొంతమవుతాయి. వాడుతున్న సౌకర్యం వెనుకనున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే, కుదరదు. కానీ, వారి కృషి గురించి అర్థంచేసుకోవడం మాత్రం కొంతవరకయినా వీలవుతుంది.

          ప్రశ్నలు అడిగితే, జవాబులు దొరుకుతాయి. ప్రశ్నలను సైన్స్‌ పద్ధతిలో అడిగితే, సైన్స్‌ పద్ధతిలో జవాబులు కూడా దొరుకుతాయి.  ప్రశ్న అడగడానికి ముందు పరిశీలను అవసరం. ఆ పరిశీలనలోనుంచి అనుభవం వస్తుంది. అందులోనుంచి  అనుమానాలు వస్తాయి. చాలామందికి ఈ అనుమానాలు రాలేదన్న భావం ఉంటుంది. ప్రశ్నలు అడిగే స్వభావాన్ని మనమంతా  ప్రయత్నించి అణగదొక్కుతున్నాం. అడగడానికి లక్షల ప్రశ్నలు ఉన్నాయి. అడిగితే, ఆశ్చర్యకరమయిన సమాధానాలు      ఉన్నాయి. సమాధానాలతోబాటు ప్రపంచం గురించిన మన అవగాహనలు విస్తరిస్తాయి. మరిన్ని ప్రశ్నలు పుడతాయి. మరిన్ని సంగతులు తెలుస్తాయి. సంగతులు తెలిసినకొద్దీ ప్రపంచం మనకు మరింత తెలిసిందిగాను, అర్థమయినట్టుగానూ కనబడడం మొదలవుతుంది. కొన్ని విషయాలు కొత్తగా అర్థమయినప్పుడు మనమేదో కనుగొన్నామన్న ఆనందం కూడా కలుగుతుంది. ఈ రకంగా సైన్స్‌తో పరిచయం పెంచుకోవడానికి మనము సైంటిస్టులను కానవసరం లేదు. ఆ పద్ధతిలో ఆలోచించడం నేర్చుకుంటే సరిపోతుంది.