I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Tuesday, December 23, 2025
Monday, December 22, 2025
Friday, December 19, 2025
Thursday, December 4, 2025
Prapanchatantram ప్రపంచతంత్రం - ఒక పరిశీలన
ప్రపంచతంత్రం - ఒక పరిశీలన
ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం. అన్ని హంగులూ
వాడుకుంటున్నాం. అయితే, ప్రపంచం గురించి, హంగుల గురించి
ఆలోచన మాత్రం తక్కువయినట్లు కనపడుతుంది. గేదె ఉంటుందని తెలియదు. పేడ వేస్తుందని
తెలియదు. పాలు ఇస్తుందని తెలియదు. తెల్లవారేసరికి తలుపు ముందర పాలప్యాకెట్లు
మాత్రం ఉండాలి. పల్లెలలో కూడా కొంతమంది పరిస్థితి ఇట్లాగే ఉంది. పల్లెలకు, పట్నాలకు తేడా కనిపించడం లేదు. నీళ్లు ఇక్కడా లేవు, అక్కడా లేవు. కార్లూ, టెలివిజన్‌లు, సెల్‌ఫోన్‌లు అంతటా ఉన్నాయి. అవి లేనిదే కాలం
గడవడంలేదు. కరెంటు లేకున్నాసరే యంత్రాలను పనిచేయించేందుకు, జనరేటర్లు, ఇన్‌వర్టర్లు ఎక్కడచూచినా కనపడుతున్నాయి.
మొదటినుంచి
మనిషి బాధంతా సౌకర్యం కొరకే. ఆ సౌకర్యం ఎట్లా అమరుతున్నది అన్న ప్రశ్న అందరి
మెదళ్లలోనూ పుట్టదు. నాడి చూచి, కుప్పె అరగదీసి
మందు నాకించే కాలం పోయింది. జలుబయింది అన్నా సరే బోలెడన్ని పరీక్షలు జరగాలి.
స్కాన్‌లు, గందరగోళం జరగాలి.
ఒక్కసారి
తలపైకెత్తి చూస్తే అంతులేని ఆకాశం కనపడుతుంది. ఇంకా లోతుకు పోతే అనంతమయిన
అంతరిక్షం ఉందట, అదంతా కలిసి విశ్వం అంటారట. కొంతమంది చాలా
తెలుసు అన్నట్టు ఈ విషయాలను గోలగోలగా చెప్తుంటారు. లక్షలు, కోట్ల సంవత్సరాలకు ముందు పేలుడు జరిగిందంటారు. కొత్త పరిశోధకులు వచ్చి అదేమీ
లేదంటారు. రాబోయే లక్షల సంవత్సరాల గురించి ఏదేదో చెప్పి భయపెడుతుంటారు. ఈ విశ్వం
ఒక పెద్ద పేలుడు జరిగినందుకు మొదలయిందా? ఎవరు చెప్పాలి?
లేదంటున్నారు కూడా! అది ఎప్పుడూ ఉన్నదే అంటున్నారు.
మన
గురించి, మన ఉనికి గురించి, మన పరిసరాలను గురించి కొంతమంది గట్టిగానే ఆలోచించారు. బోలెడంత సమాచారాన్ని
ఒకచోట చేర్చారు. అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సిద్ధాంతాలను, సూత్రాలను తయారు చేశారు. కొంతకాలానికి ఇవన్నీ కలిసి సైన్స్
అనే ఒక అర్థంకాని జ్ఞానభాండాగారం పుట్టింది. అర్థంచేసుకోగలిగినవారికి కూడా అందులో
విషయాలు, వైవిధ్యం అడ్డుతగులుతున్నాయి. ఇక వాటి గురించి
పట్టించుకోకుండా, తన బతుకంటే సైన్స్ అని తెలియకుండా
బతుకుతున్నవారికి సైన్స్‌కన్నా గందరగోళం మరొకటి లేదు అనిపించే పరిస్థితి వచ్చింది.
సైన్స్
అంటే ఇంతకుముందు అన్నట్టు సమాచారం కుప్పగా కూడిన ఒక లైబ్రరీయా? అందులోకి తొంగిచూచేందుకు అందరికీ అవకాశం ఉండదా? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? అడిగినవారికి జవాబులు ఎవరు అందించాలి? సైన్స్
అన్నది అంతంలేని ఒక అన్వేషణ. ఒక
కార్యక్రమం. ఒక ప్రక్రియ. ప్రశ్నల పరంపర. అర్థం అయినవాటి గురించి, కానివాటి గురించీ, అనుమానాలను
పెంచుకుని, ఎందుకు? ఎట్లా? అని ప్రశ్నలు అడగాలి. వాటికి జవాబులు వెతకాలి.
అదే సైన్స్. ఒకప్పుడు సైన్స్ అంటూ
ప్రత్యేకంగా ఏదీ లేదు. ప్రపంచాన్ని పరిశీలించినవారే మనిషి ఆలోచనలను కూడా
పరిశీలించారు. అంటే, సైన్స్‌కు సైకాలజీకి అప్పట్లో తేడా లేదు. ప్రశ్నల సంఖ్య
పెరిగింది. వాటికి జవాబులు కుప్పతిప్పలుగా ఎదురయ్యాయి. చర్చ మొదలయింది. శాఖలు మొదలయ్యాయి. ఒక్కొక్కరకం
ప్రశ్నలకు సైన్స్‌లోనే ఒక్కొక్కశాఖ మొదలయింది. కొంతకాలానికి ప్రశ్న అడిగినవారికి
కూడా అర్థంకాని జవాబులు, అంశాలు ఎదురయ్యాయి.
మొదటవచ్చిన ప్రశ్న మరీ అమాయకంగా కనిపించింది. ఆ రంగంలో లోతు ఎక్కువయింది. ఆ
లోతులోకి దిగినవారికి మిగతా లోతుల అంతు అసలు ఉందని కూడా తోచని పరిస్థితి
వచ్చేసింది. అప్పుడు మామూలు మనిసికి, సైన్స్‌కూ మధ్య ఒక
అగాధం ఏర్పడింది. సైన్స్ అనే ప్రపంచం
మనది కాదన్న భావం మొదలయింది.
ప్రశ్నలకు
జవాబులు కనుగొనే ఆనందంలో సైంటిస్టులు కూడా తాము మామూలు మనుషులమన్న మాట మరచిపోయారు.
ఎదురయిన సైన్స్ ప్రశ్నలకే జవాబులు వెతికారు. తమ బతుకులలోనే మరిన్ని ప్రశ్నలు
ఉన్నాయన్న సంగతి మరిచిపోయారు. ఎదురయిన సైన్స్ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
వెతుకుతున్నారు కనుక సమాధానం దొరుకుతుంది. సమాధానంతో సంతృప్తి
మాత్రం కలగదు. ఈ సమాధానం నిజమని తేల్చుకునేది ఎట్లాగ? అన్నది మరొక గొప్ప ప్రశ్నగా ఎదురవుతుంది. ఒకసారి ఒక ప్రశ్నతోనే తలబద్దలు
కొట్టుకోవాలి. అన్ని ప్రశ్నలూ అడిగితే, గజిబిజి తప్ప మరేమీ
మిగలదు. ఆ క్రమంలో ప్రశ్నలు వచ్చాయి, జవాబులు వచ్చాయి.
బతుకు కొంత అర్థమయింది. సైన్స్ మరింత అర్థమయింది. అది తెలిసినవాళ్లకు ఇది
పట్టకుండా ఉంది. సైన్స్ అర్థమయినవాళ్లకు మిగతా ప్రపంచం పట్టకుండా ఉంది.
లైబ్రరీలు మరీ పెద్దవయిపోయాయి. పుస్తకాలు ఉన్నాయని తెలుసు. ఏ పుస్తకం ఎక్కడ ఉందో
వెతకడమే ఒక పెద్ద సమస్య. ఆ పుస్తకంలో ఉన్న సంగతిని పట్టించుకుని అర్ధం చేసుకోవడం
అంతకన్నా పెద్ద సమస్య.
దినపత్రికలు
చదవడం అలవాటున్నవాళ్లకు ఆ మధ్యన అందరూ దైవకణం గురించి గోల చేయడం గుర్తు ఉండే
ఉంటుంది. అంతకుముందు కొంతకాలం ఎయిడ్స్ గురించి గొడవ గొడవగా చెప్పుకున్నారు.
అప్పుడప్పుడు సైన్స్‌లో ఏదో ఒక సంచలనాత్మక
విషయం తలెత్తుతుంది. అప్పుడు మొత్తం ప్రపంచం అటువేపు మళ్లి ‘సైన్స్ ఉంది’
అనుకుంటారు. భూకంపం వచ్చినప్పుడు అందరికీ హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్
రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గుర్తుకు వస్తుంది. మామూలు పరిస్థితిలో అది ఉందని కూడా
ఎవరికీ గుర్తుండదు. అక్కడ పనిచేసేవాళ్లకు తప్ప!
ఎవరు
ఏ విషయం పట్టించుకున్నా, పట్టించుకోకున్నా
బతుకులు కొనసాగుతాయి. బతుకంటే సైన్స్ కనుక సైన్స్ కూడా కొనసాగుతుంది. బతుకులో
సంగతులను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించినవాళ్లకు సైన్స్ ఉందన్న భావం
అప్పుడప్పుడు కలుగుతుంది. న్యూటన్ తలమీద ఆపిల్ పడితే, ఆయన ఒక దారిని చూపించి అవగాహన కలిగించాడు. డార్విన్‌కు ప్రపంచమంతా
పరిణామక్రమంగానే కనిపించింది. జీవులలో లక్షణాలు వంశక్రమంలో వస్తాయని మరొకాయన
చెప్పాడు. ఆవిరితో ఇంజన్ నడుపుతానన్నాడు మరొక పెద్ద మనిషి. స్థలం, కాలం వంపు తిరిగాయి అన్నాడు ఇంకొకాయన. ఇవన్నీ వాళ్లు
కాకుంటే, మరొకరు ఎవరో ఎప్పుడో కనుగొని ఉండేవారే. కానీ,
చాలా విషయాలను చాలామంది కనుగొన్నారు. కొంతమంది కొత్తదారులు వేశారు. కొంతమంది ఆ
దారులలో నడిచారు. దారులు వేసినవారు మన జ్ఞాపకాల నుంచి మరుగున పడి ఉండవచ్చు.
కొంతమంది మాత్రం వద్దన్నా, గుర్తుకు
వస్తుంటారు.
విద్యుత్తు
వాడుతున్నాం. లైట్ బల్బులు వాడుతున్నాం. సెల్‌ఫోన్ వాడుతున్నాం. మరెన్నో
సదుపాయాలను వాడుకుని బతుకులను సుఖమయం
చేసుకున్నాం. అందిన సుఖాలకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత చెపుదామంటే, ఎవరికి చెప్పాలి?
ఏ ఒక్క సదుపాయమూ మంత్రం వేసినట్టు ఒక్క క్షణంలో
ప్రత్యక్షం కాలేదు. రేడియోతరంగాలు ఉన్నాయని కనుగొన్నారు. సమాచారాన్ని తరంగాలుగా మార్చవచ్చునని మరొకచోట
కనుగొన్నారు. అందుకు కావలసిన హంగులను ఇంకెక్కడో కనుగొన్నారు. సెల్‌ఫోన్లో మాటా,
పాటా మాత్రమే కాక, బొమ్మలను కూడా
పంపగలుగుతున్నాం. ఇవాళ మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ చేయగలిగిన పనిని నాలుగు
దశాబ్దాల క్రితం ఒక పెద్ద గదినిండా పరిచిన కంప్యూటర్‌కూడా చేయగలిగేది కాదు. అంటే,
ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రానిక్స్ అని ఒక రంగం వచ్చింది.
అందులో పరికరాలు రాను రాను చిన్నవిగా మారుతున్నాయి. సర్క్యూట్లు, బ్యాటరీలు, సిగ్నల్
ప్రాసెసింగ్ ఇవన్నీ నిజానికి పూర్తి వేరు వేరు రంగాలు. అవన్నీ కలిసి సైల్‌ఫోన్‌గా
మనముందుకు వచ్చి మురిపిస్తున్నాయి. ఎవరయినా ఒకప్పటి వేలితో తిప్పే పాత టెలిఫోన్‌ను
గురించి ఆలోచిస్తున్నారా? ఇవాళ వేలితో ఫోన్
తెరమీద మనం చేస్తున్న విన్యాసాలు, జానపదం సినిమాలో
మాంత్రికుని ‘హాం ఫట్’ కన్నా ఆశ్చర్యకరంగా ఉన్నాయని అనుకుంటున్నారా?
అది
సైన్స్ గొప్పదనం! సైన్స్ ఆధారంగా పెరిగిన సాంకేతికశాస్త్రం గొప్పదనం! వాటి
గురించి ఎంత తెలుసుకుంటే, అంతగా ఆనందం,
ఆశ్చర్యాలు సొంతమవుతాయి. వాడుతున్న సౌకర్యం
వెనుకనున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే, కుదరదు. కానీ, వారి కృషి గురించి అర్థంచేసుకోవడం మాత్రం
కొంతవరకయినా వీలవుతుంది.
ప్రశ్నలు
అడిగితే, జవాబులు దొరుకుతాయి. ప్రశ్నలను సైన్స్
పద్ధతిలో అడిగితే, సైన్స్ పద్ధతిలో జవాబులు కూడా
దొరుకుతాయి. ప్రశ్న అడగడానికి ముందు
పరిశీలను అవసరం. ఆ పరిశీలనలోనుంచి అనుభవం వస్తుంది. అందులోనుంచి అనుమానాలు వస్తాయి. చాలామందికి ఈ అనుమానాలు
రాలేదన్న భావం ఉంటుంది. ప్రశ్నలు అడిగే స్వభావాన్ని మనమంతా ప్రయత్నించి అణగదొక్కుతున్నాం. అడగడానికి లక్షల
ప్రశ్నలు ఉన్నాయి. అడిగితే, ఆశ్చర్యకరమయిన
సమాధానాలు ఉన్నాయి. సమాధానాలతోబాటు
ప్రపంచం గురించిన మన అవగాహనలు విస్తరిస్తాయి. మరిన్ని ప్రశ్నలు పుడతాయి. మరిన్ని
సంగతులు తెలుస్తాయి. సంగతులు తెలిసినకొద్దీ ప్రపంచం మనకు మరింత తెలిసిందిగాను,
అర్థమయినట్టుగానూ కనబడడం మొదలవుతుంది. కొన్ని విషయాలు
కొత్తగా అర్థమయినప్పుడు మనమేదో కనుగొన్నామన్న ఆనందం కూడా కలుగుతుంది. ఈ రకంగా
సైన్స్‌తో పరిచయం పెంచుకోవడానికి మనము సైంటిస్టులను కానవసరం లేదు. ఆ పద్ధతిలో
ఆలోచించడం నేర్చుకుంటే సరిపోతుంది.
Sunday, November 30, 2025
Lokabhiramam Gauli anaga Balli లోకాభిరామం - గౌళి అనగా బల్లి
లోకాభిరామం
గౌళి అనగా బల్లి
పల్లి పసాదం
నగరేషు కాంచీ అన్నారట. నగరాలలోకి నగరం
కాంచీపురమేనని భావం. కాంచీపురం, కాంచీ అయింది.
మరింత కుంచించి కంచి అయింది. అది నిజానికి కొంచెం చిన్న నగరమే. కానీ, ఒకే ఊళ్లో అన్ని గుడులు. మళ్లీ కుంభకోణంలోనే అనుకుంటాను,
ఉండడం. ఈ రెండు చోట్లా అడుగడుగున గుడి ఉంది. (అందరిలో గుడి
ఉందా? ఉండే ఉంటుంది. ఈ మాటలతో ఒక సినిమా పాట ఉండేదని
మనవి!) ఎన్ని గుళ్లున్నా కంచిలో అందరూ వెళ్లేది మాత్రం మీనాక్షి అమ్మవారి
దగ్గరికి. అంతకన్నా ఎక్కువగా వరదరాజ స్వామి గుడికి.
గుడి - గుడులు - గుళ్లు ఒక మాట! గుండు -
గుండ్లు - గుళ్లు మరో మాట. ఈ రెండు రకాల గుళ్లకు తేడా ఉంది. తిరుపతి - తిరుమలల్లో
గుడులు, గుళ్లు ఉంటాయి. తిరిగి వచ్చేటప్పుడు గుండ్లు,
గుళ్లు ఉంటాయి. కంచి గుడులలో గుండు కొట్టుకునే ఆచారమేమీ
లేదు. కానీ అక్కడ యాత్రలలో గుండ్లు, గుళ్లు కనపడతాయి.
తిరుపతి నుంచి కంచికి చాలా తక్కువే దూరం. యాత్రలకు బయలుదేరిన వారు సాధారణం తిరుపతి
నుంచి కంచికి పోతారు. అక్కడ నుంచి శ్రీరంగం, మరో క్షేత్రం.
కాంచీపురంలో ఒక చివరన అమ్మవార్లు కామాక్షమ్మ
కొలువుతీరి ఉంటే, మరో చివరన వరదులుంటారు. ఆయన నిజమయిన పేరు
దేవాధిరాజ పెరుమాళ్. ఆయన ఉత్సవంలో తుపాకులు, వందిమాగదులు వంటి రాజోపచారాలు ఎక్కువగా ఉంటాయి. కంచిలో శివకంచి, విష్ణు కంచి అని విభాగాలుండేవట. అట్లాంటి పేర్లు నాకు
ఎక్కడా కనిపించలేదు. కానీ, వరదుల కోవెలకు దారి
తీసే నగర భాగం పేరు చిన్నకంచి! ఆ గుడిలోకి వెళ్లిన తరువాత అడుగడుగునా తెలుగు. ఈ
కాలం బోర్డుల సంగతి పక్కనబెట్టండి. మెట్టుమెట్టునా, గోడలలో తెలుగు పేర్లు మాటలు చెక్కి ఉన్నాయి.
వరదరాజ స్వామి గుడి మనం ఊహించిన గుడివలె ఉండదు.
మరీ పెద్ద ఆవరణం. ఎన్నో మండపాలు. ఒక పెద్ద కోనేరు. మరీ పెద్ద తోట కూడా ఉంటాయక్కడ.
దేవుడు కొన్ని రోజులపాటు వెళ్లి తోట లోని మండపంలో ఉంటాడు. అక్కడ తోట ఉత్సవం
(తోటోత్సవం) జరుగుతుంది.
ప్రవేశించగానే ఉండే పెద్ద ఆవరణలో ఒక పక్కన ఒక
చిన్న మండపం ఉంది. అక్కడ నుంచి ఒకాయన కొన్ని తినుబండారాల పేరు చెప్పి ‘పల్లి పసాదం
దీస్కో!’ అంటూ అరుస్తున్నాడు. ఇక్కడ వేరుశనగ కాయలు, పల్లీ లేదా ఫల్లీలు ప్రసాదంగా పెడతారేమోనను కున్నాను. కానీ అట్లాగేమీ
కనిపించలేదు. పులిహోర, చక్ర పొంగలితోబాటు, లడ్డు, చక్కిలాలు, అతిరసం లాంటివి ఉన్నాయి. కొందరికి అరిసెలుగా తెలిసిన అతిరసాలు ఇక్కడ ఉన్నంత
రుచిగా మరెక్కడా ఉండవని అనుభవం మీద తెలుసుకున్నాను. అనుకోకుండా దొరికిన మైసూర్‌పాకు
ప్రసాదం కూడా మహా రుచిగా ఉంది. అన్నింటికన్నా స్పెషల్ కొడల ఇడ్లీ. అరటి మానులాగ
గుండ్రంగా, మూరెడంత పొడుగుంది ఒక ఇడ్లీ. ఒకరిద్దరే ఉంటే
దాన్ని కొన్నా తినలేరు. అరడజను మందికి ఒక పూట అది ఆహారంగా సరిపోతుంది. ఈ రకం ఇడ్లీ
కంచిలో మాత్రమే దొరుకుతుంది. అక్కడి హోటేళ్లలో కూడా, కొన్ని (చాలా తక్కువ, ఒకటి రెండు) చోట్ల
మాత్రం దొరుకుతుందది. అక్కడయితే ఒకరికి సరిపడేంత యిస్తారు. నేనడిగిన చోటే,
‘బుధవారమయితే ఉంటుంది’ అన్నారు. గుళ్లో, నా వేషం కారణంగా దొరికిన చిన్న ముక్కతోనే సంతృప్తి పడవలసి
వచ్చింది.
పల్లి అన్న మాట ముందు వచ్చింది. మధ్యలో
వచ్చింది. సంగతి మాత్రం రాలేదు. గుర్తుంది. గుడిలోకి ప్రవేశించాము అనుకుని దూరితే
అక్కడ నరసింహస్వామి ఎదురవుతాడు. బయటకు వచ్చి మరింత ముందుకు పోతే అందరూ ఒకపక్కన
మెట్లెక్కుతుంటారు. బోర్డు ఉంది గానీ, చూడకుండా వెళ్లిన
వారికి, అక్కడ పెరుందేవీ తాయారు అనే అమ్మవారు
చిరునవ్వుతూ దర్శనమిస్తారు. మేము మొదటిసారి వెళ్లినపుడు, అమ్మవారి గోపురం మీద బంగారు తాపడం లాంటి ఏదో జరుగుతున్నదని ఉత్సవమూర్తిని
మాత్రం మరో పక్కన ఉంచారు. అక్కడే దర్శనం. మరింతకూ అసలు స్వామి, వరదరాజు, లేదా దేవాధిరాజ
పెరుమాళ్ ఏరీ? ఆయన వెతుక్కుంటూ వెళితేగాని దొరకడు. సరయిన
తోవచూపే బోర్డులు కూడా లేవు. చుట్టూ తిరిగి ఆవరణలో పూర్తి వెనక్కు వెళ్లాలి. అక్కడ
ఒక మూల మెట్లుంటాయి, తెలుగక్షరాలతో సహా. ఎక్కి, తొక్కి ముందుకు, పైకి చేరాలి.
తలుపులో ప్రవేశిస్తే, మరో బోలెడన్ని మెట్లుంటాయి. కీళ్ల నొప్పులుగల
వారికి ఈ స్వామి పరీక్ష పెడతాడు. ఇంకొంచెం లోపలికి వెళితే, అదిగో స్వామి అంటారు. అక్కడ మళ్లీ మెట్లు! ఆ మీద నిజంగా, నిలువెత్తుకన్నా పెద్ద స్వామి. గాలి సరిగా ఆడని ఆ గుడిలో
మనం ఉండేది కొంచెం సేపే! అయినా దేవుడు కనిపిస్తాడు.
దేవాధిరాజ స్వామిని చూచిన తరువాత, అసలు సంగతి నాకు అర్థమయింది. అక్కడ పక్కనే బంగారు బల్లి
ఉంటుంది. స్వామిని చూడటానికి టికెట్ లేదు. బల్లిని తాకడానికి రెండు రూపాయలు.
మరింత ముందుకు వెళ్లి కుడికి తిరిగితే కర్ర మెట్లు ఎక్కాలి. కీళ్లనొప్పులా?
ఆపైన పై కప్పులో బంగారు బల్లి, బారెడు పొడుగున తాపి ఉంటుంది. పైకి ఎక్కితేనే అందుతుంది. పిల్లలయితే ఎవరయినా
ఎత్తుకోవాలి. బల్లిని ఆ చివర నుంచి ఈ చివర దాకా నిమరాలి. మెట్లు, మరోపక్క దిగి, మరిన్ని మెట్లు,
మరికొన్ని మెట్లు దిగి బయటకు రావాలి. ఈ బల్లిని, బల్లిని తాకిన వారిని, తాకిన తర్వాత, బతికున్న బల్లిని ముట్టుకున్నా బాధ లేదని
మనవారి నమ్మకం!
ఎన్నిసార్లు చూచినా ఈ గుడిలో నాకు తెలుగు
వాళ్లే ఎక్కువగా కనిపించారు. మన వారికి వెంకన్న, ఎంకన్న తెలుసుగానీ, ఈ వరదయ్య గురించి అంతగా పట్టినట్లు లేదు. అందరూ
ఈ గుడికి బల్లి కొరకే వస్తారు. దారిలో ‘బల్లి ఎక్కడ?’ అని అడిగిన తెలుగు వారికి, ‘ముందు దేవుడిని
చూడాలి. అప్పుడు బల్లి కనిపిస్తుంది’ అని చెప్పాను. అసలు సంగతి వారికి తరువాత
అర్థమయి ఉంటుంది. అందరూ వచ్చేది బల్లి కొరకయితే, అక్కడ ప్రసాదం కూడా బల్లి ప్రసాదమే కావాలి గదా? తమిళంలో బల్లిని పల్లి అంటారేమో? అనుమానం లేదు
తమిళంలో పల్లి అంటే బల్లి. ఇక తీసుకోండి అనాలని అర్థంకాని ఆ అయ్యవారు ‘పల్లి పసాదం
దీస్కో!’ అని అరుస్తున్నాడు. కానీ ఎవరూ ప్రసాదం తీసుకోవడం లేదు. పైసలు లేందే
ప్రసాదం లేదు గద మరి!
బల్లిని ముట్టుకుంటే, అది పైన బడితే ఏదో జరుగుతుందని ఎవరన్నారో మరి? బల్లిపాటు ఫలితాల గురించి, అంటే శరీరంలో ఏయే
భాగం మీద బల్లి పడితే ఏమవుతుందని చెప్పే పట్టిక ఒకటి ఉంటుంది. శిరస్సున పడితే
కలహంతో మొదలయి, గుహ్యం - మరణం అని ఆ లిస్టు అంతమవుతుంది.
వెతికి వెతికి బల్లి ముడ్డి మీద ఎప్పుడు, ఎట్లా పడేను?
పడదు. వీలు లేదు. పడినా ఎవరూ చావరు!
మన వారికి ఇటువంటి నమ్మకాలు కావలసినన్ని
తెలుసు. వాటి వెనుకనున్న సంగతి తెలుసుకోవాలని మాత్రం ఎవరూ ప్రయత్నించరు. కనుకనే
వరదయ్య కన్నా ఆయన వెనుకనున్న బల్లికి గొప్ప పేరన్నమాట. వరదయ్య ప్రసాదం బల్లి
ప్రసాదంగా మారింది. బల్లి కావాలే కాని దాని ప్రసాదం ఎవరికి కావాలి? పట్టదు గాక పట్టదు.
***
మంత్ర బియ్యం: చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో
చదువుతున్న రోజుల్లో విన్న ఈ మాట ఈ మధ్యన గుర్తుకు వచ్చింది. దొంగతనం జరుగుతుంది.
లేదంటే ఒక పొరపాటు పని జరిగినట్టు తెలుస్తుంది. అది ఎవరు చేసిందీ బయటపడదు.
తెలిస్తే గద శిక్ష! అప్పుడు మంత్ర బియ్యం (సమాసం బాగుండలేదు. మంత్రం బియ్యం అనాలి)
ప్రయోగిస్తారు. ఆ బియ్యాన్ని ఎవరు మంత్రించి ఇచ్చేవారో గుర్తులేదు. మొత్తానికి
అక్షతల వంటి బియ్యం వస్తాయి. అందరికీ కొంచెం కొంచెంగా పెడతారు. ఏ తప్పూ చేయని వారు
వాటిని శుభ్రంగా నమిలి తింటారు. తప్పు చేసిన వారు ఆ బియ్యం తింటే ఏదో అవుతుందని ఒక
భయం. ఒక పిల్లవాడు బియ్యం తిని వాంతి చేసుకున్నాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు.
బియ్యంలో మంత్రం లేదు గానీ, బోలెడు సైకాలజీ
ఉందని తరువాత అర్థమయింది. భయం మనిషిని పట్టి ఇస్తుంది.
***
కోదండం: పిల్లవానికి తీవ్రమయిన శిక్ష అంటే ఆ
కాలంలో కోదండం వేసేవారు. కోదండం అంటే నిజానికి రాముని బాణం. కానీ ఇక్కడ మాత్రం
రెండు చేతులకు కలిపి తాడు పట్టించి, ఆ తాటి నుంచి వాడు
పై కప్పులోని కొండి నుంచి వేలాడుతుంటాడు. కింద కంప (ముళ్లుండే కొమ్మలు) ఉంటే మరింత
గట్టి శిక్ష! తాడు వదిలి కింద పడలేక, వేలాడలేక, వాడు పడే బాధ వర్ణనకు అందదు. పశ్చాత్తాపానికి దారి
తీస్తుందేమో కూడా!
Wednesday, November 5, 2025
Manishi : My Telugu version of Vaikkom Mohammaed Bashir Story
Manishi
Vaikkom Mohammaed Bashir Story
Tuesday, November 4, 2025
Loka 14 Katha cheputanu Ookodatava (కథ చెపుతాను ఊ కొడతావా?
Katha cheputanu Ookodatava
(కథ చెపుతాను ఊ కొడతావా?)
వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే
వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. ` ఎవరన్నారో తెలియదు.
---









