Showing posts with label fun. Show all posts
Showing posts with label fun. Show all posts

Saturday, August 1, 2026

లోకాభిరామం - వానొచ్చె వరదొచ్చె : On rain and then Sambaru


వానొచ్చె వరదొచ్చె

పొటుకు - పొట్కు- టపక్‌

ఇల్లంత టపక్‌ పెడ్తున్నాది. పెద్దా పుస్కం తడ్సీ పోతుంది’ అని ఎర్రని గుడ్డలో చుట్టిన ఒక లావుపాటి పుస్తకాన్ని తెచ్చింది బువ్వమ్మ. ఆ పెద్ద పుస్కం పవిత్ర గ్రంథం ఖురాన్‌. తెచ్చిందేమో నిప్పులు కడిగే ఆచార్లవారి ఇంటికి. వాన కాలమంతా ఆ పుస్తకం ఆచార్లవారి ఇంట్లో గూట్లో సురక్షితంగా ఉంటుంది. అక్కడి మిగతా పుస్తకాలు అన్నింటితోబాటు! బువ్వమ్మ ఇల్లు పూరి గుడిసె అనుకుంటాను. ఆచార్ల వారిది మట్టిమిద్దె. అప్పటికి రాతిగోడలు వచ్చినయి కానీ, సిమెంటు కప్పులు రాలేదు.

మట్టిమిద్దె అంటే గోడలు కూడా మట్టివయి, ఆ మీద కప్పు ఉంటుంది. రాతిగోడల మీద కూడా మట్టిమిద్దె ఉంటుంది. దూలాలు లావుగ ఉంటయి. వాటిమీదనుంచి గోడల మీదకు కొంచెం సన్నటి వాట్లు ఉంటయి. (ఈ మాటంటే వేట్లు? అని అడిగాడు నా కొడుకు! మీకు అర్ధమయితే సరే, కాకుంటే వదిలేయండి.) ఆ వాట్లమీద చిలుక చెక్క పరిచి ఉంటుంది. కలిగిన వారయితే పలకలుగా తీర్చిన చిలుకు చెక్కలను, మధ్య ఖాళీలు లేకుండా పరిపిస్తరు. లేదంటే పొయ్యిలోకి కొట్టిన కట్టెలను పేర్చి, మీద గడ్డి పరిచి, ఆ మీద మట్టి వరస వేస్తరు. మట్టిమిద్దెలో ఎండలకు పగుళ్లు వస్తయి. గడ్డి, చిన్న మొక్కలు పెరుగుతయి. చుట్టు గోడలను మిద్దెకన్న కొంచెం ఎక్కువ ఎత్తు వరకు కడతరు. వాటిని కుంబిగోడలు అంటరు. వాటిమీద కూడా పగుళ్లు, గడ్డి మొక్కలు ఉంటయి. వానలు రాబోతున్నయంటే, మొక్క లన్నింటినీ పీకి, చవిటి మన్ను తెప్పించి మిద్దె నిండ పరిపించాలె. మొదటి వానలకే మట్టి తడిసి పరుచుకుంటుంది. దిమ్మిస పీటతో కొట్టి దాన్నంత చదును చేయాలె. వాలు సరిగ్గ వుండేట్లు సరిచేయాలె. ఇదంతా సక్రమంగ జరిగితే పడిన వాననీరు గూనలలోంచి కిందకు పడుతుంది. ఈ పనులు వీలవుతయి, కావు. కుదురుతయి, కుదరవు! ఇంక వాన వచ్చిందంటే చాలు పొటుకు మొదలవుతుంది.

వాతావరణం మారిపోతున్నదని చెప్పడానికి పరిశోధకుల దాక పోనవసరం లేదు. గతంలో వాన కాలమంటే  ప్రతినిత్యం ఉదయం, అస్తమానం వాన కురవవలసిందే. ముసుర్లు పట్టుకుంటే అయిదారు రోజులు ఏకాకారంగా వాన కొనసాగేది. గోనెసంచీ, గొంగడీ కప్పుకుని, అంత దూరం బడికిపోతే ‘సెలవు! వెళ్లిపొండి!’ అనేవారు. ఇంటి కంటే బడి మరింత అధ్వాన్నం. అందునా, మా బడి పక్కనే పెద్ద చెరువు కూడ ఉంది. నీళ్లు గదుల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతటి వానలో ఇల్లు, పూరి గుడిసె అయినా, మట్టిమిద్దె అయినా పొటుకు తప్పదు. పగుళ్లు, మొక్కల వేళ్లుంటే, ఎక్కువగ, లేదంటే, అక్కడా ఇక్కడా మిద్దెలోంచి నీరు ఇంకి చుక్కచుక్కగ పడుతుంది. అదే పొటుకు. మా ఇల్లు నిజంగ తాతల కాలం నాటిది. రకరకాల పాత్రలను ఆ పొటుకు పడుతున్న చోట పెట్టి, నేలన్న తడి కాకుండ జాగ్రత్తపడి, మిగిలిన చోట పండుకోవాలె. పొటుకు మరీ ఎక్కువగా ఉంటె, వానలోనే జాగ్రత్తగ మిద్దె ఎక్కి ఆ భాగంలో తొక్కాలె. చవిటి మన్ను జారుడుగ ఉంటుంది. కాలు జారితే ప్రమాదం! మట్టిమిద్దెలు పోయినయి! పొటుకు మాత్రం మిగిలింది. ఎవరన్నా ఒకేపని గురించి, సంగతి గురించి, తెరిపిలేకుండ అడుగుతూ (నస!) కష్టపెడుతున్నరనుకోండి. దాన్ని పొట్కు-పొటుకు పెడుతున్న రని వర్ణించేవారు. ఆర్‌సీసీ మిద్దెల్లో కూడా లీకులున్నయి. పొటుకుల ఉండే ఉంటయి. ఎండను తట్టుకోవాలని వేసే కూల్‌హోమ్‌ కారణంగ పగుళ్లు వస్తయని చెప్పినరు ఒకరు. మరేమి, అట్లాంటివి జరిగితే పొటుకు తప్పదు!

బల్లి సాంబారు: ఉల్లి సాంబారు అని వేరుగ ఏదయినా ఉంటుందా? సాంబారు వెంగాయం అని చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయని తెలుసు. వాటిని అట్లాగే వేసి సాంబారు వండుతారనుకుంటాను. ‘బిసి బేళె హుళి అన్న’ అంటే వేడి పప్పుపులుసు అన్నం అని అర్ధం. అందులో వెంగాయం అంటే ఉల్లి పాయలు పెద్ద ముక్కలు వేయడం చూచాను. (నిజమే, నాకు తిండి గురించిన చింత ఎక్కువ. ఎర్రోనికి ఏమి చింత? అంటే ఎప్పటికి తిండిమీదనే చింత’ అని ఒక మాట ఉంది. ఈ ఏర్రోడు వెర్రివాడా లేక ఎర్రని వాడా? శివరాజు సుబ్బారావు అనే బుచ్చిబాబుగారు, వరంగల్‌ నవీన్‌గారి పద్ధతిలో పోతున్నది రాత. నా పేరులోనూ ‘బుచ్చి’ ఉంది. వరంగల్లు మీద కావలసినంత ప్రేమ ఉన్నది! అక్కడికే పోవాలె మనం ఇప్పుడు. వరంగల్‌లో ఎమ్‌ఎస్‌సి చదువుతున్నము. మధ్యాహ్నం పూట మొదటి పంక్తి భోజనాలు అయిపోయినవి. అమ్మాయిల హాస్టలు చిన్నది. అక్కడికి కూడా తిండి ఈ హాస్టల్‌నుంచే పోతుంది. అక్కడ కూడ అందరూ తిన్నరు. ఆలస్యమయి రెండవ పంక్తికి వచ్చిన వారు తింటుంటే సాంబారులో బల్లి పడిందని తెలిసింది! అసహ్యం అన్న మాట పక్కనపెడితే తెలియకుండ తిన్నవారికి, రెండవ పంక్తిలోని వారికీ, ఎవరికీ ఏమి కాలేదు! అంతా ఆరోగ్యంగ ఉన్నరు. సంగతి తెలిసిన తరువాత ‘కడుపులో తిరుగుతున్నది!’ అని కొందరు హెల్త్‌ సెంటర్‌కు పరిగెత్తినరు. పరిగెత్తినరంటే ఆరోగ్యంగ ఉన్నరనే గదా అర్థం. డాక్టర్‌ రెడ్డిగారు వాండ్లను పరీక్షించి డైజీన్‌ లాంటి మాత్ర ఏదో ఇచ్చి పంపించినరు. బల్లిని ఉడికించి తింటేనే ఏం కాలేదు. అది మీద పడితే ఏమవుతుంది! ఆ బల్లి అనారోగ్యంగ ఉండి, దాన్ని ద్వారా క్రిములేమైన సోకితే ఏమన్న అవుతుందేమో?ఏమో?

ఉల్లి సాంబారు: మేము (ఇంట్లో) ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనపకాయ లాంటివి తినము. ఛాదస్తమే! అయినా తినము. ఎక్కడన్న ఉల్లిపాయల వంట తిన్నమంటే, తరువాత వాసన తెలుస్తుంది. మాకుండే ఛాదస్తం వెనక కొన్ని పద్ధతులున్నయని చెప్పంగ విన్న. కొన్ని పదార్థాలు చూడడానికి బాగుండవు. కొన్నింటి వాసన బాగుండదు. కొన్ని అర్ధం లేని చాదస్తం! క్యాబేజ్‌ కొత్తగ వచ్చినపుడు నాన్న అడ్వెంచరస్‌ గనుక కొని తెచ్చినడు. అది భయంకరమయిన వాసన.అప్పటి క్యాబేజీతో పోలిస్తే ఇప్పటిది ఎంత మేలో చెప్పలేము. అప్పట్లో పురుగుమందులు ఇంతగ లేవు కనుక ఆకుల మధ్యన పురుగులు కూడ ఉండేవి! ‘కన్న మన్ను తెచ్చి వండమంటరు!’ అని అమ్మ గులుగుడు (గొణుగుడు) నాకు గుర్తుంది. ‘మెప్పులకై కన్నతావు అప్పు వడక’ అన్నారు త్యాగయ్యవారు. కన్న అంటే కనిన అంటే చూచిన అని అర్ధం. అంతేగానీ ప్రసవంతో సంబంధం లేదు. బిడ్డను చూస్తము గనుక అది కానుపు! ‘నిను కన్నది కానుపు’ అని రామదాసుల వారంటే అది చూడడం గురించే, ప్రసవం గురించి కానే కాదు! అందుకే కన్న మన్ను అంటే కనపించిన మన్ను అని.

మళ్లీ, మేము ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనిగెంకాయె తినము (ఈసారి అసలు సంగతే చెప్త!) మా బిల్డింగులో ఒక్కోసారి సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తరు. ఒక్కో ఇంటివారు ఒక వంటకం చేసి తెచ్చి, అందరూ ఒక చోట తినడం అదొక సరదా! మా ఇల్లుగలావిడ, మా యజమాని, మా ప్రొఫెసరు గారు (మాయావిడ, నా భార్య) సాంబారు వండమంటే సరేనని వండింది. అందులో ఆన్యన్‌ అనే ఉల్లిపాయల్లేవు. అయినా చాలా రుచిగ ఉందన్నరు అందరు! ఆనియన్‌ అదే ఆన్యాన్‌ లేకుండా సాంబారు ఎట్లా చేస్తరని అందరూ హాచ్చెర్య పడిపోయేశినరు. తరువాత ఒకటి రెండుసార్లు కూడా సాంబారు తయారీ బాధ్యత మా ఇంటికే వచ్చినట్టు గుర్తు! అన్య అంటే ఇతరము. తమిళంలో అన్యన్‌, అన్నియన్‌ అవుతుంది. అపరిచితుడు ఎందుకు మనకు మన సినిమాలో?

మూడు పైసల నాటకం: అంకుశ్‌ బోర్‌హాడే అనే పేరు మీరు విని ఉండరు. అతను మరాఠీ అయి వుంటడని కొందరికి తోచి ఉండవచ్చు. బెర్ట్‌హోల్ట్‌ బ్రెష్‌ట్‌, జెర్మనీలో ప్రసిద్ధ నాటక రచయిత. అతని పేరును బ్రెఖ్‌ట్‌, బ్రెహ్ట్‌ అని కూడ పలుకుతరు. అతని సాంఘిక నాటకాలు సంచలనం కలిగించినయి. అందులో ఒకదాని అనువాదం ‘ద త్రీ పెన్నీ ఆపెరా’ పోనీ ఓపెరా అనండి! నాకు అభ్యంతరం లేదు. జబ్బార్‌ పటేల్‌ అనే మరాఠీ నాటక కారుడు దానికి అనువాదం కాదు గానీ అనుసరణ చేశినడు. ‘తీన్‌ పైసాచా తమాషా’ అని దాని పేరు. తమాషా అనేది మరాఠీ జానపద నాటక పద్ధతులలో ఒకటి. అక్కడ మొదలయి, ఈ నాటకం సాగుతుంది. అందులో నాయకుని పేరు అంకుశ్‌ బోర్‌హాడే. అతను నాటకం మొదలయిన తరువాత చాలాసేపటి వరకు రంగం మీదకి రాడు. అతనొక రౌడీ, దాదా! పాత్ర వచ్చే ముందు ఆ పేరును ప్రతిధ్వనులతోపాటు హాలంతా కదిలిపోయిందేమో అనిపించే పద్ధతిలో వినిపింపచేసిన తీరు నాకు ఇంకా గుర్తుంది. మనసులో మనం ఒక ఎస్వీ రంగారావును ఊహించుకుంటే, అక్కడ అందమైన యువకుడు ఎదురయ్యినడు. నాటకం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో, అంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. పుణె (పూనా లేక పునహా) బాల గంధర్వ రంగమంచ్‌లో చూచిన నేను. అంకుశ్‌ పెళ్లవుతుంది. హాలంతా రంగు దీపాలు వెలిగినయి. ప్రేక్షకులందరు పెళ్లి వారయ్యినరు! ము! బావుంటుంది, మరాఠీ వారి నాటక విద్య! ఆ హాల్లో నిత్యమూ నాటకం ఉంటుంది. మిగతా చోట్ల సినిమా చూచినట్టే జనం టిక్కెట్లు కొని నాటకాలు చూస్తరు. ఈ అలవాటు మహారాష్ట్రలో ఇంకా కొనసాగు తున్నది. మన దగ్గర హైదరాబాదులో ప్రయత్నం జరిగింది కానీ, కొనసాగలేదు మరి.


 

Sunday, June 28, 2026

చెవిటి మనిషి : పొరుగు మనిషి Katha


చెవిటి మనిషి : పొరుగు మనిషి

రూమీ చెప్పిన కథలు

చెవిటి మనిషి - పొరుగు మనిషి

ఒక మనిషికి రాను రాను చెవులు వినిపించడం తగ్గిపోతున్నది. కానీ అతనికి తన లోపం గురించి అందరి ముందు అంగీకరించడానికి మనస్కరించడం లేదు. అతను మరి గర్విష్టి. ఏమీ జరగనట్టే నటిస్తూ బతుకుతున్నాడు. ఒకనాడు అనుకోకుండా, ఒక నేస్తం కలిశాడు. ఆ పక్కనే ఉన్న ఇంటిలో ముసలాయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అతని వద్దకు వెళ్లి పరామర్శిస్తే బాగుంటుంది కదా, అని అతను అన్నాడు. పక్కింటి పెద్ద మనిషిని పలకరించడానికి బంధువులు కూడా ఎవరూ లేరు, అంటూ పలకరించమని ప్రోత్సహించాడు. ఈ చెవిటి మనిషి, ఏదో రకంగా అతని మాటలు అర్థం చేసుకున్నాడు. పొరుగంటి మనిషిని తప్పకుండా వెళ్లి పలకరిస్తానని, నిజానికి ఆ రోజునే వెళతానని మాట ఇచ్చాడు కూడా.

ఇంతకు ఆ పొరుగింటి మనిషి దగ్గరకు వెళ్లడం ఎట్లాగా? అతను నిజంగా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే, మాట బలహీనం అయిపోయి ఉంటుంది. అతను చెప్పేదేదో తనకు వినిపించదు. అయినా వెళ్ళక తప్పేటట్టు లేదు. కనుక తప్పకుండా వెళ్లాలి. ఆరోగ్యం గురించి ఏదో అడగాలి. తప్పదు అని నిర్ణయించుకున్నాడు. ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు, అతని పెదవుల కదలికను బట్టి, ఏం మాట్లాడుతున్నది అర్థం చేసుకోవచ్చు కదా, అనుకున్నాడు. అయినా ఏదో జాగ్రత్తగా ఉండాలి కనుక, ఏం ప్రశ్నలు అడగాలి, వాటికి ఏమీ జవాబులు వస్తాయి, తర్వాత మరి ఏమి అడగాలి, అన్న విషయాలను అతను ముందే మనసులో మననం చేసుకున్నాడు.

తాను వెళతాడు. 'ఒంట్లో ఎలా ఉంది?' అని అడుగుతాడు. అనారోగ్యంగా ఉన్న మనిషి 'ఏదో దేవుడి దయవల్ల, లాగతీసుకు వస్తున్నాను,' అంటాడని ఊహించాడు. జవాబుగా 'చాలా గొప్ప విషయం,' అని తాను అంటాడు. వెంటనే తాను, 'ఈ పూట మరి ఏమి తిన్నావు' అని అడుగుతాడు. అతను ఏదో తిన్నాడని జవాబు చెబుతాడు. 'భలే భలే, బాగుంది మరి,' అని తాను అంటాడు. అప్పుడిక మూడవ ప్రశ్నగా, 'మందులు ఎవరి దగ్గర తీసుకుంటున్నావు?' అని అడగాలి. అతను ఊర్లో ఏదో ఒక వైద్యుడి పేరు చెబుతాడు. మళ్ళీ తను 'భలే భలే' అంటాడు. 'అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అని కూడా అంటాడు.

ఈ రకంగా ముందే పథకం వేసుకొని, చెవుడు పెరుగుతున్న ఆ మనిషి వెంటనే పక్క ఇంటికి వెళ్ళాడు. ముసలతని పక్కనే కూర్చున్నాడు. నిజానికి అక్కడ మంచం లేదు. ముసలతను నేల మీదనే ఏదో గుడ్డలు పరుచుకుని పడుకున్నాడు. వెళ్లిన ఈ మనిషి, 'పెద్దాయనా! ఎలా ఉన్నావు?' అని అడిగాడు.

'చస్తున్నాను!' అన్నాడు ఆ ముసలి మనిషి. ముందు అనుకున్నట్టే చెవిటి మనిషి 'చాలా గొప్ప విషయం,' అనేశాడు. పథకం ప్రకారం, 'ఇంతకు ఏం తిన్నావు' అని అడిగాడు. ఆరోగ్యం సరిగా లేని మనిషి విసిగిపోయి ఉన్నాడు. 'విషం,' అన్నాడు. 'భలే భలే, బాగుంది మరి,' అన్నాడు మన చెవిటి మనిషి. మరి పథకం అదే కదా.

ముసలి మనిషికి చికాకు తలకెక్కింది. కానీ తమాయించుకుని పెదవి కొరుక్కున్నాడు. వచ్చిన మనిషిని తిడితే గౌరవంగా ఉండదు అనుకున్నాడు. ఇక పథకం కొనసాగింది. 'ఏ వైద్యుడి దగ్గర మందులు తీసుకుంటున్నావు?' అన్న ప్రశ్న వచ్చేసింది.

చికాకుగా ఉన్న ముసలి మనిషి, 'మృత్యుదేవత దగ్గర!' అన్నాడు. మరి మన చెవిటి పెద్దమనిషి 'భలే భలే! అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అనేశాడు. 'అతని దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ ఇకపైన కష్టాలు అంటూ ఉండవు' అని కూడా చేర్చాడు.

అన్న మాటల ప్రభావం గురించి పట్టించుకోకుండా అతను పెద్దాయన చేయి పట్టుకుని, సెలవు అన్నట్టు ఒకసారి ఊపి, గట్టిగా నొక్కి, వచ్చేశాడు. తాను వచ్చి ముసలి ఆయనకు ఎంతో మంచి చేశాను అని మాత్రమే అతను మనసులో అనుకుంటున్నాడు. జరిగిన విషయం గురించి అతనికి ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత ఏమైంది మనకు తెలియదు.



 

Saturday, June 27, 2026

లోకాభిరామం : మాటాట On Words play



మాటాట

సంత్ తుక్కారామ్‌జీ మహరాజ్ అంటే ఎవరో తెలుసునా? మన ‘ఘనా ఘన సుందరా’ బ్రాండు భక్త తుకారామ్ ఆయనే. తుకారామ్ గొప్ప తాత్వికుడు. ఆ సంగతి మనకు అందలేదు. మనకు సినిమాలో చూచిన భారతము, రాహీ మాసూమ్ రజా గారి పుణ్యమా అని మరింత వివరంగా అందింది. అది ఎట్లనో గుర్తుకు వచ్చిందా? దూద అను దూరదర్శన్‌లో మహా భారత్ సీరియల్ కారణంగా. అంతేగానీ వ్యాసుని భారతములో, జైమిని భారతములోనున్న నూటొక్క సంగతులు మనకు అందలేదు. పుస్తకానికీ, పత్రికకు, కవర్‌పేజీ ఉన్నట్టే, ప్రతి విషయానికి ఒక ముఖం ఉంటుంది. మనకు ముఖ పరిచయ ము అని ఒక పద్ధతి ఉన్నది. ఈ వ్యాసమున్న పేజీలో నా బొమ్మ వేస్తరు. అది చూచినవారు, నేను బజారులో ఎదురుపడినా గుర్తించలేరు. ఎవరన్న గుర్తు పట్టినరే అనుకుందము. నేను లోకాభిరామము రాసే గోపాలమును అని తెలుస్తుంది తప్ప, నా గురించి మిగత సంగతులు తెలియవు. అట్లనే తుకారాం అనంగనే మనకు ముందు అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వస్తరు. సినిమా చూచి ఉంటే, ఆ భక్తుడు గుర్తుకు వస్తడు. ఆ సినిమాలో తుకారాముని కొండ, అద్దమందు పద్ధతిలో చూపి వదిలిపెట్టినరని నా నమ్మకము. నేనా బొమ్మ (అంటే సినిమా, అంటే ఫిలిం) చూడనేలేదు. అయినా ఆయన మహిమలు, మొదలైనవి అంత చూపి ఉంటరని నాకు తోస్తుంది. ఎట్ల తోస్తుంది, అంటే అటువంటి సినిమాలు, అనగా చలన చిత్రములు శాన చూచిన గద, అందుకు తోస్తుంది. ఆ తుకోబా ఇంకా ఏమి చెప్పెను, ఏమి పాడెను, ఎట్ల బతికెను అని మనము తెలుసుకునేందుకు అవసరము ఉండాలె. అవకాశము ఉండాలె. సినిమాలు అంటే, కదిలే బొమ్మలు, చూచి మరిచిపోవుట మంచిది గానీ, మరీ వాటిని గురించి తల పగులగొట్టుకొనడము అనవసరమని గద!

సోది, గదూ! ఇంతకు తుకారామ్‌జీ గురించి ఎందుకు ప్రస్తావించిన? నాకు గుర్తు ఉన్నది, కాని ఈలోపల మనసు పరిపరి విధములుగా పోయి ఎన్నో చెప్పవలెనని అనిపించినది. తుకారామ్ అన్ని పాటలు ‘పాండురంగ’ గురించి రాయలేదు. ఎన్నో ఆలోచింప దగిన లోతయిన చేదు నిజములను ఆయన తన అభంగములనే పాటలలో రాసినడు. రాయలేదు, చెప్పినడు. లేక పాడినడు. అందుట్లో ఒక దాంట్లో, మాటలే నాకు ఆభరణములు, మాటలే నాకు వస్త్రములు, అంటూ చెప్పి, ఈ మాటలనే నీకు పూజగా అందింతును అంటడు. ఈ మాటలను మొదట్లో చదివినపుడు, కొన్ని నాళ్లు ఆ పెద్ద మనిషి తలనిండ నిండి, పరుచుకుని మరొక ఆలోచన రాకుండ చేసినడు. వ్యవసాయ విశ్వవిద్యాలయము వారు నన్ను ఒక ఉపన్యాసం చేయమని పిలిచినరు. నేను ఆ ఉపన్యాసాన్ని ఈ కవితతో ప్రారంభించిన. నాకు వచ్చినది మాటలు ఒకటే, ఆ మాటలనే మీకు అందిస్త అనే భావము కలిగింది. మొదటి నిముషములోనే హాలు చప్పట్లతో మారుమోగింది. ఆ చప్పట్లు నాకు కాదుగద! అవి టోకున తుకోజీ మహరాజ్ గారికే.

ఇంతకు, ఇయాల, అంటే, ఈ పొద్దు, అంటే ఈ దినము, ఈనాడు (పాపము శమించుగాక) నేను చెప్పదలచిన విషయంబెట్టిదనిన, మాట లేకుంటే ఈ పొరుపంచికము, అనగా దునియా, అనగా లోకము, అనగా ప్రపంచము ఎట్లుండును? అని మా వన్ సెవెన్ నైన్ అనే పీఎస్‌జీ అన్నగారు ఉద్యోగములో ఉండంగ, తమ బల్లమీది అద్దము కింద, ఒక కాగితము, కాగితము, కాయిదము, లేకా కాకితము ముక్క, తుంపు, బిట్టు, మీద ‘మౌనేన కలహం నాస్తి’ అని రాసి పెట్టుకుని యుండిరి. మాట్లాడకుండ ఉంటే కొట్లాటలు రావని ముందు అనిపిస్తుంది, నా వంటి, లాంటి, మాదిరి, పోలిన, తుంటరికి. ఉంటే ఎందుకు మాట్లాడవు? అని పేచీ కొట్లాటకు దిగవచ్చును గద!

మాటలు లేకుండ ఈ ప్రపంచము నడుచునా? అయ్యా! అమ్మ! ఇది నాకున్న కొద్దిపాటి, బుర్ర, మెదడును తొలచుచున్న,  తొలుచుచున్న, కలచుచున్న, మలచుచున్న, కలియబెట్టుచునున్న ప్రశ్న! క్రోశ్న, క్రొశ్చన్, క్వశ్చన్, యశ్చన్, యథా, తథా’ ఈ చివరి నాలుగు మాట రాజములు, తోచినవి, గనుక రాసితిని. నిజముగా రాయవలెనని గాదు. రీజనింగ్ పరీక్ష గురించి తెలిసిన వారు ఎవరయినను తరువాత రాదగు మాట ప్రశ్చన్ అని గుర్తించి ఉందురు గాక.

నేను ఎక్కువ మాట్లాడుతనని నాకు తెలుసు. ‘నీవు చాలమటుకు మాట్లాడకుండ ఉంటవు కనుక అవకాశము వచ్చినపుడు, గలగలమని మాట్లాడుతవు’ అని ఒక మిత్రుడు, నేస్తము, చెలికాడు, ఉద్దిగాడు చెప్పెను, వాక్రుచ్చెను నిజంగనే! అంతేకాదు అవకాశము వస్తే చాలు చెట్టుతో, పుట్టతో, గుట్టతో నేను మాట్లాడే ప్రయత్నము చేస్త! మాటలు నన్ను చాలామందికి మిత్రునిగా మార్చినయి. ఒకనాడు నేను బస్సు కొరకు అందరి మాదిరి, లాగనే, వోలెనే, వలెనే, పోలికగనే, దారి, రోడ్ పక్కనే నిలబడి ఉన్న, ఉంటిని. పక్కన ఒకాయన నిలబడి ఉన్నడు. శానమంది ఉండి ఉంటరు. ఈయన చేతిలో ఒక పుస్తకము ఉన్నది. అది అరుదయిన రకము. నాకు నచ్చిన రకము. పట్టలేక ‘ఏమండీ మీ గురించి తెలుసుకోవచ్చునా?’ అని అడిగిన. నాలుగయిదు మాటల తరువాత మాకు పరోక్షముగ పరిచయము ఉన్నదని తేలిపోయినది. ఇంక మాట్లాడుకుంటూ ఎక్కవలసిన బస్ వచ్చినా, అక్కడ కొంతకాలము గడిపినట్టు నాకు గుర్తుంది. అది మాట బలము.

రామాయణములో రాముని మంచితనము గురించి చాలా చాల రాసుకున్నరు. కానీ ఒక మాట నాకు బాగా గుర్తుంటుంది. రాముడు ‘పూర్వభాషి’ యట. అంటే మనము పలకరిస్తమని ఎదురు చూడకుండ, తానే ముందు పలకరిస్తడట. దాన్ని ఈనాటి మేనేజ్‌మెంట్ పరిభాషలో ‘ప్రోయాక్టివ్’ అంటరు. మీరు పలకరిస్తారేమో అని నేను ఎదురు చూస్తున్న. ఈ ఊరికి, ఆ ఊరికి దూరాల లెక్కలో మీరు గూడ అట్లనే ఎదురు చూస్తుండవచ్చు గద! ఎవరూ ముందు మాట్లాడరు. ఈ లోపల పుణ్య కాలము మించిపోవును. లఖ్‌నవీ నవాబులు మీరు ముందు, మీరు ముందు అంటూ మర్యాద చేస్తుంటే బండి ఎళ్లిపోయినట్టు, ఇక్కడ కాలమనే బండి ఎళ్లిపోవును. తస్మాత్ స్పీక్ ఫస్ట్!

మాయావిడ కారు నడుపుతరు. నాకు ఆ పని చేతరాదు, చేతగాదు. ఆమె పక్కన కూచుని హాయిగ దేశమంత తిరుగుత. నేను కారులో ఎక్కినప్పుడు చాలామాట్లు, మేము మా ఇంటికి దగ్గరగ వున్న పెట్రోలు బంకులో ఆగుతము. పెట్రోలు పోయించు కుంటము. ‘మీకు ఇక్కడి వాండ్లు దోస్తులు కాలేదా?’ అని నేను మా శ్రీమతిని అడిగిన. ‘ఆ పిల్లగాండ్లతోటి నాకేమి దోస్తీ’ అన్నట్టు ఆమె నా దిక్కు ఒక చూపు చూచింది. ముందున్న కారు ఓనరునకు అక్కడి అబ్బాయి, బాబు, పిలగాడు ఒక పత్రికను ఉచితంగా ఇవ్వడము గమనించిన. తరువాత మా కారులో సహస్రం, అనగా వెయ్యి రూపాయల రాతినూనె వేయించుకున్నము. పోయించుకున్నము. ఆ యువకుడు పైసలు తీసుకుని ఊరుకున్నడు. ‘ఏం తమీ! నాకు పత్రిక ఇయ్యవా?’ అని అడిగిన. ‘ఎందుకియ్యను సార్!’ అని నవ్వుతూ అతను నాకు గూడ పత్రిక ఇచ్చినడు. ‘ఈసారి గనుక నేను ఆ బాబుకు కనిపిస్తినా, తప్పక చిరునవ్వు నవ్వుతడు’ అని తర్వాత మాయావిడ, మాయామె గారితో అన్న, అన్నాను. (అన్నగాదు భర్త) ఆమె మాత్రము నవ్వి ఊరుకోలేదు. ‘మీలాగ మాట్లాడడము నాకు రాదు’ అన్నది. ఎందుకురాదు? మాటలు రావా? మొగమాటమా? అడిగితే పత్రిక దొరికింది. కాదంటే, అది ఎటువంటి వారికి దొరుకుతుందన్న కిటుకు తెలుస్తుంది. మాట్లాడకుండ ఉంటే పోట్లాట రాదు నిజమే ఉచిత పత్రిక కూడ రాదు, అడగనిదే అమ్మకూడ అన్నము పెట్టదు, అని మాట ఉన్నది.

మనసు నిండ అనుమానాలు ఉంటే ఇట్లనే అయితది, అవుతది, అవుతుంది (మరోటి) ఔతుంది కరెక్టా, అవుతుంది కరెక్టా? మిగతా రెండు మాటలు తప్పా! వివరాలు మునుముందు వీలు వెంట చర్చించెదము గాక. నేను, ఇవాళ మాటలకు అర్థములు మారుట, కొత్త అర్థములు పుట్టుట గురించి రాయాలని అనుకున్నాను. మామూలుగా చేసే పద్ధతిలో గాక, రాసి చూతము అని మొదలుపెట్టితిని. ఇన్ని మాటలు వచ్చినవి. ఇవన్నీ గూడ ఎన్నడో ఒకనాడు చెప్పవలెననుకున్న మాటలే. మిగిలిన మాటలు చెప్పే టందుకు మరింత అవకాశము దొరకనే దొరకదా?

ఝలక్: టప్పాభై సత్తార్ మియా అనగానెవరో మీకు తెలుసునా? మనకు పట్టాభి సీతారామయ్య గారి గురించి గుర్తు ఉండి ఉంటే మంచిదే. ఆయన గొప్ప నాయకుడు. విజనరీ. ఆయన పేరును ఉరుదూలో రాసినరు. తెలుగులో అటువంటి పేరు ఉంటుందని తెలియని ఒక మనిషి చదవను ప్రయత్నిస్తే అది నేను రాసిన విధముగ పలికినదట. ఉరుదూలో అక్షరాలను కలుపుతరు. తెలుగు ఇంగ్లీషు లాగ విడివిడిగ రాయరు. అది చిక్కు. నా ఆలోచనలు కూడ అట్లనే సాగినట్లున్నయి. అయినా తప్పు జరగలేదనే అనుకుంటున్న!

 

Monday, June 15, 2026

పడుచుదనం Japanese Folk tale Retold in Telugu


పడుచుదనం 

Japanese Folk tale Retold in Telugu

అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కొండల మధ్యన ఒక కట్టెలు కొట్టే మనిషి తన భార్యతోపాటు ఉండేవాడు. వాళ్లు నిజానికి చాలా ముసలివాళ్లు. కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళతాడు. కట్టెలు కొట్టి తెస్తాడు. పెళ్లాం ఇంటిపట్టునే ఉంటుంది. నేతపని చేస్తుంది.
ఒకరోజున ముసలతను అడవిలో అలవాటు కన్నా ఎక్కువలోతుకు వెళ్లాడు. ఒక ప్రత్యేకమయిన కర్ర కోసం చూస్తూ అతను అలా వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా అనుకోకుండా ఒక చక్కని నీటిబుగ్గ కనిపించింది. దాన్ని అతను అంతకుముందెన్నడూ చూచి ఎరుగడు. బుగ్గలోనుండి చిమ్ముకువస్తున్న నీరు చిత్రంగా చాలా బాగుంది. చల్లగా కూడా ఉంది. అప్పటికే అతనికి బాగా దప్పిగా ఉంది. ఆనాడు ఎండ బాగా కాస్తున్నది. అతను కష్టించి పనిచేశాడు. కనుక వెంటనే ముసలాయన తన గడ్డిటోపీ పక్కన పెట్టాడు. మోకాళ్లమీద కూచుని ముందుకు వంగాడు. కావలసినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు చాలా బాగనిపించాయి. అవి మామూలుగా లేవు, అనిపించాయి. నీటిలో ముసలతనికి తన ముఖం కనిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. అది నిజంగా తన ముఖమే. కానీ పాత అద్దంలో ఇంటిదగ్గర ప్రతినిత్యం కనిపించే ముఖం మాత్రం కాదు. అందులో ఒక అందమయిన యువకుడు కనిపిస్తున్నాడు. ముసలాయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
అతను రెండు చేతులను ఎత్తి తలమీద పెట్టుకున్నాడు. ఒక క్షణం కిందవరకు అది బట్టతల. దానిమీద వెంట్రుకలు లేనేలేవు. ఇప్పుడు మాత్రం నల్లని, చిక్కని జుట్టు చేతికి తగిలింది. ముఖం కూడా చిన్నపిల్లవాని ముఖంవలె నునుపుగా తాకింది. ముదుసలి ముడతలన్నీ మాయమయ్యాయి.
అదే సమయంలో అతనికి ఒంట్లో గొప్ప శక్తికూడా వచ్చినట్టు తోచింది. ఆశ్చర్యంగా తన కాళ్లు, చేతులవేపు అతను చూచుకున్నాడు. అంతకుముందు వరకు అవి ముసలితనానికి గుర్తులుగా ఉండేవి. ఇప్పుడు మాత్రం నిండుగా కండరాలు తేలి కనబడుతున్నాయి. అనుకోకుండానే అతను పడుచుదనం బుగ్గ నుండి నీరు తాగాడు. పడుచువాడు అయ్యాడు. నీళ్లు అతనిని మార్చివేశాయి.
విషయం అర్థం అయింది. వెంటనే అతను సంతోషంతో ఒక కేక వేశాడు. గాలిలోకి ఎగిరాడు కూడా. వీలయినంత వేగంగా అంతకుముందు ఎన్నడూ లేనంత వేగంగా ముసలతను ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లోకి కాలుపెడితే ఎదురయిన పెళ్లాం భయంతో వెనుకకు తగ్గింది. ఎవరో కొత్త మనిషి వచ్చాడని ఆమె జడుసుకున్నది. కానీ జరిగిన ఆశ్చర్యాన్ని అతను వివరించాడు. ఆమె నిజానికి నమ్మలేకపోయింది.
కొంతసేపటికిగానీ అతను భార్యను తాను తానే అని నమ్మించలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన మొగుడేనని ఆమె నమ్మిన తరువాత పడుచుదనం నీటిబుగ్గ గురించి కూడా అతను చెప్పాడు. ఆమెను వెళ్లి ఆ నీరు తాగమన్నాడు.
‘‘నీవు పడుచువాడివి అయ్యావు. అందగానివి అయ్యావు. ఇక మరి నా వంటి ముసలి మనిషిని ప్రేమించలేవు. కనుక నేను కూడా ఆ నీటిని వెంటనే తాగక తప్పదు. అయితే ఇల్లు వదిలి ఇద్దరం ఒకేసారి వెళ్లడం అంత మంచిది కాదు. నేను వెళ్లివస్తాను. నీవు ఇక్కడే ఉండు’’ అన్నది ముసలామె. ఆమె పరుగు పెడుతూ అడవిలోకి వెళ్లిపోయింది.
ముసలమ్మకు నీటిబుగ్గ కనిపించింది. ఆమె కూడా దాని పక్కన మోకరిల్లి నీళ్లు తాగసాగింది. ఆహా!, నీళ్లు ఎంత చల్లగా, ఎంత కమ్మగా ఉన్నాయి! ఆమె అదే పనిగా తాగసాగింది. మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకున్నది. మళ్లీ నీళ్లు తాగ సాగింది.  
ఇక ఇంట్లో అటు ఆమె భర్త ఓపిక లేకుండా ఎదురు చూస్తున్నాడు. అందంగా పడుచు పిల్లగా మారి తన పెళ్లాం తిరిగి రావాలని చూస్తున్నాడు. ఎంతసేపయినా ఆమె రానేలేదు. అతనికి ఆత్రం పెరిగింది. ఇంటి తలుపు మూశాడు. పెళ్లాన్ని వెతుకుతూ బయలుదేరాడు. పడుచుదనం నీటిబుగ్గ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఆడమనిషి జాడ కనిపించలేదు. ఇక నిరాశగా అతను వెనుతిరిగాడు. అప్పుడే అతనికి గడ్డిలోనుండి సన్నని గొంతుక ఏడుస్తున్నట్టు వినిపించింది. అతను వెళ్లి వెతికాడు. అక్కడ తన భార్య దుస్తులయితే ఉన్నాయి గానీ, వాటిలో ఒక చిన్నపాప ఉంది. ఆ పాప నిజంగా చిన్నది. బహుశా ఆరు మాసాల వయసు ఉంటుందేమో!
ముసలమ్మ పడుచుదనం నీటిని మరీ ఎక్కువగా తాగింది. యవ్వనం కంటే ఎక్కువగా వయసు తగ్గేటట్టు తాగేసింది. కనుకనే మాటలు రాని పసిపాపగా మారిపోయింది.
చేసేది లేక పడుచు మనిషి తన పెళ్లాం పాపను చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతనివేపు ఆశ్చర్యంగానూ,
దు:ఖంగానూ చూచింది. ఏదో గొణుగుతూ అతను పాపను ఇంటికి తీసుకువచ్చాడు. హాయిగా పెంచుకున్నాడు.
 

Friday, June 12, 2026