Showing posts with label Interest. Show all posts
Showing posts with label Interest. Show all posts

Saturday, August 1, 2026

లోకాభిరామం - వానొచ్చె వరదొచ్చె : On rain and then Sambaru


వానొచ్చె వరదొచ్చె

పొటుకు - పొట్కు- టపక్‌

ఇల్లంత టపక్‌ పెడ్తున్నాది. పెద్దా పుస్కం తడ్సీ పోతుంది’ అని ఎర్రని గుడ్డలో చుట్టిన ఒక లావుపాటి పుస్తకాన్ని తెచ్చింది బువ్వమ్మ. ఆ పెద్ద పుస్కం పవిత్ర గ్రంథం ఖురాన్‌. తెచ్చిందేమో నిప్పులు కడిగే ఆచార్లవారి ఇంటికి. వాన కాలమంతా ఆ పుస్తకం ఆచార్లవారి ఇంట్లో గూట్లో సురక్షితంగా ఉంటుంది. అక్కడి మిగతా పుస్తకాలు అన్నింటితోబాటు! బువ్వమ్మ ఇల్లు పూరి గుడిసె అనుకుంటాను. ఆచార్ల వారిది మట్టిమిద్దె. అప్పటికి రాతిగోడలు వచ్చినయి కానీ, సిమెంటు కప్పులు రాలేదు.

మట్టిమిద్దె అంటే గోడలు కూడా మట్టివయి, ఆ మీద కప్పు ఉంటుంది. రాతిగోడల మీద కూడా మట్టిమిద్దె ఉంటుంది. దూలాలు లావుగ ఉంటయి. వాటిమీదనుంచి గోడల మీదకు కొంచెం సన్నటి వాట్లు ఉంటయి. (ఈ మాటంటే వేట్లు? అని అడిగాడు నా కొడుకు! మీకు అర్ధమయితే సరే, కాకుంటే వదిలేయండి.) ఆ వాట్లమీద చిలుక చెక్క పరిచి ఉంటుంది. కలిగిన వారయితే పలకలుగా తీర్చిన చిలుకు చెక్కలను, మధ్య ఖాళీలు లేకుండా పరిపిస్తరు. లేదంటే పొయ్యిలోకి కొట్టిన కట్టెలను పేర్చి, మీద గడ్డి పరిచి, ఆ మీద మట్టి వరస వేస్తరు. మట్టిమిద్దెలో ఎండలకు పగుళ్లు వస్తయి. గడ్డి, చిన్న మొక్కలు పెరుగుతయి. చుట్టు గోడలను మిద్దెకన్న కొంచెం ఎక్కువ ఎత్తు వరకు కడతరు. వాటిని కుంబిగోడలు అంటరు. వాటిమీద కూడా పగుళ్లు, గడ్డి మొక్కలు ఉంటయి. వానలు రాబోతున్నయంటే, మొక్క లన్నింటినీ పీకి, చవిటి మన్ను తెప్పించి మిద్దె నిండ పరిపించాలె. మొదటి వానలకే మట్టి తడిసి పరుచుకుంటుంది. దిమ్మిస పీటతో కొట్టి దాన్నంత చదును చేయాలె. వాలు సరిగ్గ వుండేట్లు సరిచేయాలె. ఇదంతా సక్రమంగ జరిగితే పడిన వాననీరు గూనలలోంచి కిందకు పడుతుంది. ఈ పనులు వీలవుతయి, కావు. కుదురుతయి, కుదరవు! ఇంక వాన వచ్చిందంటే చాలు పొటుకు మొదలవుతుంది.

వాతావరణం మారిపోతున్నదని చెప్పడానికి పరిశోధకుల దాక పోనవసరం లేదు. గతంలో వాన కాలమంటే  ప్రతినిత్యం ఉదయం, అస్తమానం వాన కురవవలసిందే. ముసుర్లు పట్టుకుంటే అయిదారు రోజులు ఏకాకారంగా వాన కొనసాగేది. గోనెసంచీ, గొంగడీ కప్పుకుని, అంత దూరం బడికిపోతే ‘సెలవు! వెళ్లిపొండి!’ అనేవారు. ఇంటి కంటే బడి మరింత అధ్వాన్నం. అందునా, మా బడి పక్కనే పెద్ద చెరువు కూడ ఉంది. నీళ్లు గదుల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతటి వానలో ఇల్లు, పూరి గుడిసె అయినా, మట్టిమిద్దె అయినా పొటుకు తప్పదు. పగుళ్లు, మొక్కల వేళ్లుంటే, ఎక్కువగ, లేదంటే, అక్కడా ఇక్కడా మిద్దెలోంచి నీరు ఇంకి చుక్కచుక్కగ పడుతుంది. అదే పొటుకు. మా ఇల్లు నిజంగ తాతల కాలం నాటిది. రకరకాల పాత్రలను ఆ పొటుకు పడుతున్న చోట పెట్టి, నేలన్న తడి కాకుండ జాగ్రత్తపడి, మిగిలిన చోట పండుకోవాలె. పొటుకు మరీ ఎక్కువగా ఉంటె, వానలోనే జాగ్రత్తగ మిద్దె ఎక్కి ఆ భాగంలో తొక్కాలె. చవిటి మన్ను జారుడుగ ఉంటుంది. కాలు జారితే ప్రమాదం! మట్టిమిద్దెలు పోయినయి! పొటుకు మాత్రం మిగిలింది. ఎవరన్నా ఒకేపని గురించి, సంగతి గురించి, తెరిపిలేకుండ అడుగుతూ (నస!) కష్టపెడుతున్నరనుకోండి. దాన్ని పొట్కు-పొటుకు పెడుతున్న రని వర్ణించేవారు. ఆర్‌సీసీ మిద్దెల్లో కూడా లీకులున్నయి. పొటుకుల ఉండే ఉంటయి. ఎండను తట్టుకోవాలని వేసే కూల్‌హోమ్‌ కారణంగ పగుళ్లు వస్తయని చెప్పినరు ఒకరు. మరేమి, అట్లాంటివి జరిగితే పొటుకు తప్పదు!

బల్లి సాంబారు: ఉల్లి సాంబారు అని వేరుగ ఏదయినా ఉంటుందా? సాంబారు వెంగాయం అని చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయని తెలుసు. వాటిని అట్లాగే వేసి సాంబారు వండుతారనుకుంటాను. ‘బిసి బేళె హుళి అన్న’ అంటే వేడి పప్పుపులుసు అన్నం అని అర్ధం. అందులో వెంగాయం అంటే ఉల్లి పాయలు పెద్ద ముక్కలు వేయడం చూచాను. (నిజమే, నాకు తిండి గురించిన చింత ఎక్కువ. ఎర్రోనికి ఏమి చింత? అంటే ఎప్పటికి తిండిమీదనే చింత’ అని ఒక మాట ఉంది. ఈ ఏర్రోడు వెర్రివాడా లేక ఎర్రని వాడా? శివరాజు సుబ్బారావు అనే బుచ్చిబాబుగారు, వరంగల్‌ నవీన్‌గారి పద్ధతిలో పోతున్నది రాత. నా పేరులోనూ ‘బుచ్చి’ ఉంది. వరంగల్లు మీద కావలసినంత ప్రేమ ఉన్నది! అక్కడికే పోవాలె మనం ఇప్పుడు. వరంగల్‌లో ఎమ్‌ఎస్‌సి చదువుతున్నము. మధ్యాహ్నం పూట మొదటి పంక్తి భోజనాలు అయిపోయినవి. అమ్మాయిల హాస్టలు చిన్నది. అక్కడికి కూడా తిండి ఈ హాస్టల్‌నుంచే పోతుంది. అక్కడ కూడ అందరూ తిన్నరు. ఆలస్యమయి రెండవ పంక్తికి వచ్చిన వారు తింటుంటే సాంబారులో బల్లి పడిందని తెలిసింది! అసహ్యం అన్న మాట పక్కనపెడితే తెలియకుండ తిన్నవారికి, రెండవ పంక్తిలోని వారికీ, ఎవరికీ ఏమి కాలేదు! అంతా ఆరోగ్యంగ ఉన్నరు. సంగతి తెలిసిన తరువాత ‘కడుపులో తిరుగుతున్నది!’ అని కొందరు హెల్త్‌ సెంటర్‌కు పరిగెత్తినరు. పరిగెత్తినరంటే ఆరోగ్యంగ ఉన్నరనే గదా అర్థం. డాక్టర్‌ రెడ్డిగారు వాండ్లను పరీక్షించి డైజీన్‌ లాంటి మాత్ర ఏదో ఇచ్చి పంపించినరు. బల్లిని ఉడికించి తింటేనే ఏం కాలేదు. అది మీద పడితే ఏమవుతుంది! ఆ బల్లి అనారోగ్యంగ ఉండి, దాన్ని ద్వారా క్రిములేమైన సోకితే ఏమన్న అవుతుందేమో?ఏమో?

ఉల్లి సాంబారు: మేము (ఇంట్లో) ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనపకాయ లాంటివి తినము. ఛాదస్తమే! అయినా తినము. ఎక్కడన్న ఉల్లిపాయల వంట తిన్నమంటే, తరువాత వాసన తెలుస్తుంది. మాకుండే ఛాదస్తం వెనక కొన్ని పద్ధతులున్నయని చెప్పంగ విన్న. కొన్ని పదార్థాలు చూడడానికి బాగుండవు. కొన్నింటి వాసన బాగుండదు. కొన్ని అర్ధం లేని చాదస్తం! క్యాబేజ్‌ కొత్తగ వచ్చినపుడు నాన్న అడ్వెంచరస్‌ గనుక కొని తెచ్చినడు. అది భయంకరమయిన వాసన.అప్పటి క్యాబేజీతో పోలిస్తే ఇప్పటిది ఎంత మేలో చెప్పలేము. అప్పట్లో పురుగుమందులు ఇంతగ లేవు కనుక ఆకుల మధ్యన పురుగులు కూడ ఉండేవి! ‘కన్న మన్ను తెచ్చి వండమంటరు!’ అని అమ్మ గులుగుడు (గొణుగుడు) నాకు గుర్తుంది. ‘మెప్పులకై కన్నతావు అప్పు వడక’ అన్నారు త్యాగయ్యవారు. కన్న అంటే కనిన అంటే చూచిన అని అర్ధం. అంతేగానీ ప్రసవంతో సంబంధం లేదు. బిడ్డను చూస్తము గనుక అది కానుపు! ‘నిను కన్నది కానుపు’ అని రామదాసుల వారంటే అది చూడడం గురించే, ప్రసవం గురించి కానే కాదు! అందుకే కన్న మన్ను అంటే కనపించిన మన్ను అని.

మళ్లీ, మేము ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనిగెంకాయె తినము (ఈసారి అసలు సంగతే చెప్త!) మా బిల్డింగులో ఒక్కోసారి సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తరు. ఒక్కో ఇంటివారు ఒక వంటకం చేసి తెచ్చి, అందరూ ఒక చోట తినడం అదొక సరదా! మా ఇల్లుగలావిడ, మా యజమాని, మా ప్రొఫెసరు గారు (మాయావిడ, నా భార్య) సాంబారు వండమంటే సరేనని వండింది. అందులో ఆన్యన్‌ అనే ఉల్లిపాయల్లేవు. అయినా చాలా రుచిగ ఉందన్నరు అందరు! ఆనియన్‌ అదే ఆన్యాన్‌ లేకుండా సాంబారు ఎట్లా చేస్తరని అందరూ హాచ్చెర్య పడిపోయేశినరు. తరువాత ఒకటి రెండుసార్లు కూడా సాంబారు తయారీ బాధ్యత మా ఇంటికే వచ్చినట్టు గుర్తు! అన్య అంటే ఇతరము. తమిళంలో అన్యన్‌, అన్నియన్‌ అవుతుంది. అపరిచితుడు ఎందుకు మనకు మన సినిమాలో?

మూడు పైసల నాటకం: అంకుశ్‌ బోర్‌హాడే అనే పేరు మీరు విని ఉండరు. అతను మరాఠీ అయి వుంటడని కొందరికి తోచి ఉండవచ్చు. బెర్ట్‌హోల్ట్‌ బ్రెష్‌ట్‌, జెర్మనీలో ప్రసిద్ధ నాటక రచయిత. అతని పేరును బ్రెఖ్‌ట్‌, బ్రెహ్ట్‌ అని కూడ పలుకుతరు. అతని సాంఘిక నాటకాలు సంచలనం కలిగించినయి. అందులో ఒకదాని అనువాదం ‘ద త్రీ పెన్నీ ఆపెరా’ పోనీ ఓపెరా అనండి! నాకు అభ్యంతరం లేదు. జబ్బార్‌ పటేల్‌ అనే మరాఠీ నాటక కారుడు దానికి అనువాదం కాదు గానీ అనుసరణ చేశినడు. ‘తీన్‌ పైసాచా తమాషా’ అని దాని పేరు. తమాషా అనేది మరాఠీ జానపద నాటక పద్ధతులలో ఒకటి. అక్కడ మొదలయి, ఈ నాటకం సాగుతుంది. అందులో నాయకుని పేరు అంకుశ్‌ బోర్‌హాడే. అతను నాటకం మొదలయిన తరువాత చాలాసేపటి వరకు రంగం మీదకి రాడు. అతనొక రౌడీ, దాదా! పాత్ర వచ్చే ముందు ఆ పేరును ప్రతిధ్వనులతోపాటు హాలంతా కదిలిపోయిందేమో అనిపించే పద్ధతిలో వినిపింపచేసిన తీరు నాకు ఇంకా గుర్తుంది. మనసులో మనం ఒక ఎస్వీ రంగారావును ఊహించుకుంటే, అక్కడ అందమైన యువకుడు ఎదురయ్యినడు. నాటకం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో, అంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. పుణె (పూనా లేక పునహా) బాల గంధర్వ రంగమంచ్‌లో చూచిన నేను. అంకుశ్‌ పెళ్లవుతుంది. హాలంతా రంగు దీపాలు వెలిగినయి. ప్రేక్షకులందరు పెళ్లి వారయ్యినరు! ము! బావుంటుంది, మరాఠీ వారి నాటక విద్య! ఆ హాల్లో నిత్యమూ నాటకం ఉంటుంది. మిగతా చోట్ల సినిమా చూచినట్టే జనం టిక్కెట్లు కొని నాటకాలు చూస్తరు. ఈ అలవాటు మహారాష్ట్రలో ఇంకా కొనసాగు తున్నది. మన దగ్గర హైదరాబాదులో ప్రయత్నం జరిగింది కానీ, కొనసాగలేదు మరి.


 

Monday, June 15, 2026

పడుచుదనం Japanese Folk tale Retold in Telugu


పడుచుదనం 

Japanese Folk tale Retold in Telugu

అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కొండల మధ్యన ఒక కట్టెలు కొట్టే మనిషి తన భార్యతోపాటు ఉండేవాడు. వాళ్లు నిజానికి చాలా ముసలివాళ్లు. కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళతాడు. కట్టెలు కొట్టి తెస్తాడు. పెళ్లాం ఇంటిపట్టునే ఉంటుంది. నేతపని చేస్తుంది.
ఒకరోజున ముసలతను అడవిలో అలవాటు కన్నా ఎక్కువలోతుకు వెళ్లాడు. ఒక ప్రత్యేకమయిన కర్ర కోసం చూస్తూ అతను అలా వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా అనుకోకుండా ఒక చక్కని నీటిబుగ్గ కనిపించింది. దాన్ని అతను అంతకుముందెన్నడూ చూచి ఎరుగడు. బుగ్గలోనుండి చిమ్ముకువస్తున్న నీరు చిత్రంగా చాలా బాగుంది. చల్లగా కూడా ఉంది. అప్పటికే అతనికి బాగా దప్పిగా ఉంది. ఆనాడు ఎండ బాగా కాస్తున్నది. అతను కష్టించి పనిచేశాడు. కనుక వెంటనే ముసలాయన తన గడ్డిటోపీ పక్కన పెట్టాడు. మోకాళ్లమీద కూచుని ముందుకు వంగాడు. కావలసినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు చాలా బాగనిపించాయి. అవి మామూలుగా లేవు, అనిపించాయి. నీటిలో ముసలతనికి తన ముఖం కనిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. అది నిజంగా తన ముఖమే. కానీ పాత అద్దంలో ఇంటిదగ్గర ప్రతినిత్యం కనిపించే ముఖం మాత్రం కాదు. అందులో ఒక అందమయిన యువకుడు కనిపిస్తున్నాడు. ముసలాయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
అతను రెండు చేతులను ఎత్తి తలమీద పెట్టుకున్నాడు. ఒక క్షణం కిందవరకు అది బట్టతల. దానిమీద వెంట్రుకలు లేనేలేవు. ఇప్పుడు మాత్రం నల్లని, చిక్కని జుట్టు చేతికి తగిలింది. ముఖం కూడా చిన్నపిల్లవాని ముఖంవలె నునుపుగా తాకింది. ముదుసలి ముడతలన్నీ మాయమయ్యాయి.
అదే సమయంలో అతనికి ఒంట్లో గొప్ప శక్తికూడా వచ్చినట్టు తోచింది. ఆశ్చర్యంగా తన కాళ్లు, చేతులవేపు అతను చూచుకున్నాడు. అంతకుముందు వరకు అవి ముసలితనానికి గుర్తులుగా ఉండేవి. ఇప్పుడు మాత్రం నిండుగా కండరాలు తేలి కనబడుతున్నాయి. అనుకోకుండానే అతను పడుచుదనం బుగ్గ నుండి నీరు తాగాడు. పడుచువాడు అయ్యాడు. నీళ్లు అతనిని మార్చివేశాయి.
విషయం అర్థం అయింది. వెంటనే అతను సంతోషంతో ఒక కేక వేశాడు. గాలిలోకి ఎగిరాడు కూడా. వీలయినంత వేగంగా అంతకుముందు ఎన్నడూ లేనంత వేగంగా ముసలతను ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లోకి కాలుపెడితే ఎదురయిన పెళ్లాం భయంతో వెనుకకు తగ్గింది. ఎవరో కొత్త మనిషి వచ్చాడని ఆమె జడుసుకున్నది. కానీ జరిగిన ఆశ్చర్యాన్ని అతను వివరించాడు. ఆమె నిజానికి నమ్మలేకపోయింది.
కొంతసేపటికిగానీ అతను భార్యను తాను తానే అని నమ్మించలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన మొగుడేనని ఆమె నమ్మిన తరువాత పడుచుదనం నీటిబుగ్గ గురించి కూడా అతను చెప్పాడు. ఆమెను వెళ్లి ఆ నీరు తాగమన్నాడు.
‘‘నీవు పడుచువాడివి అయ్యావు. అందగానివి అయ్యావు. ఇక మరి నా వంటి ముసలి మనిషిని ప్రేమించలేవు. కనుక నేను కూడా ఆ నీటిని వెంటనే తాగక తప్పదు. అయితే ఇల్లు వదిలి ఇద్దరం ఒకేసారి వెళ్లడం అంత మంచిది కాదు. నేను వెళ్లివస్తాను. నీవు ఇక్కడే ఉండు’’ అన్నది ముసలామె. ఆమె పరుగు పెడుతూ అడవిలోకి వెళ్లిపోయింది.
ముసలమ్మకు నీటిబుగ్గ కనిపించింది. ఆమె కూడా దాని పక్కన మోకరిల్లి నీళ్లు తాగసాగింది. ఆహా!, నీళ్లు ఎంత చల్లగా, ఎంత కమ్మగా ఉన్నాయి! ఆమె అదే పనిగా తాగసాగింది. మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకున్నది. మళ్లీ నీళ్లు తాగ సాగింది.  
ఇక ఇంట్లో అటు ఆమె భర్త ఓపిక లేకుండా ఎదురు చూస్తున్నాడు. అందంగా పడుచు పిల్లగా మారి తన పెళ్లాం తిరిగి రావాలని చూస్తున్నాడు. ఎంతసేపయినా ఆమె రానేలేదు. అతనికి ఆత్రం పెరిగింది. ఇంటి తలుపు మూశాడు. పెళ్లాన్ని వెతుకుతూ బయలుదేరాడు. పడుచుదనం నీటిబుగ్గ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఆడమనిషి జాడ కనిపించలేదు. ఇక నిరాశగా అతను వెనుతిరిగాడు. అప్పుడే అతనికి గడ్డిలోనుండి సన్నని గొంతుక ఏడుస్తున్నట్టు వినిపించింది. అతను వెళ్లి వెతికాడు. అక్కడ తన భార్య దుస్తులయితే ఉన్నాయి గానీ, వాటిలో ఒక చిన్నపాప ఉంది. ఆ పాప నిజంగా చిన్నది. బహుశా ఆరు మాసాల వయసు ఉంటుందేమో!
ముసలమ్మ పడుచుదనం నీటిని మరీ ఎక్కువగా తాగింది. యవ్వనం కంటే ఎక్కువగా వయసు తగ్గేటట్టు తాగేసింది. కనుకనే మాటలు రాని పసిపాపగా మారిపోయింది.
చేసేది లేక పడుచు మనిషి తన పెళ్లాం పాపను చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతనివేపు ఆశ్చర్యంగానూ,
దు:ఖంగానూ చూచింది. ఏదో గొణుగుతూ అతను పాపను ఇంటికి తీసుకువచ్చాడు. హాయిగా పెంచుకున్నాడు.
 

Tuesday, June 9, 2026

అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ


అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ


అక్షయ పాత్ర

డాంగ్ భూ థిక్ నాకి వెండా, డింగ్ బూ కిమథిక్ నాకి వెండా, అంటే అనగనగా ఒకప్పుడు అని అర్థం. అటువంటి ఒకప్పుడు ఒక లోయ ఉండేది. అందులో విశాలమైన ఒక నది ఉండేది. నది పక్కన మంచి పొలాలు ఉండేవి. అక్కడ కోయడానికి సిద్ధంగా పంటలు కనిపించేవి. కొండ చరియలమీద సాగుచేసి పంట నాటడానికి సిద్ధంచేసి ఉంటుంది. త్వరలోనే రైతులు వచ్చి నాట్లు మొదలు పెడతారు. కానీ వీధి చివరన పూరిగుడిసెలో ఉండే చిన్నపిల్లవాడికి మాత్రం అవకాశం లేదు. అతను విత్తనాలుగా నాటడానికి ధాన్యం మిగిలించుకోలేక పోయాడు. ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం తినేసాడు. దీనంగా ఉన్న అతని పరిస్థితి చూసి చుట్టుపక్కలవారు అతనికి ఒక పిడికెడు విత్తనాలు జమచేసి ఇచ్చారు. వాళ్లకు ధన్యవాదాలు చెపుతూ కొంచెం విత్తులను అతను తనకు ఉన్న కొద్దిపాటి నేలలో నాటుకున్నాడు. అతని పొలం పైన్ అడవుల పక్కన ఉంటుంది.
విత్తనాలు నాటిన కొద్దికాలానికే పిచ్చుకల గుంపు ఒకటి, పెద్దది వచ్చేసింది. కిచకిచలాడుతూ ఎగర సాగింది. చూస్తుండగానే నాటిన విత్తనాలు అన్నింటిని పొడిచి పొడిచి అవి తినేశాయి. బీద బాలుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతను బిత్తరపోయి ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. పిచ్చుకలను తరమ సాగాడు. పిచ్చుకల గూళ్ళు, ముళ్ళు నిండిన పొదలలో ఉన్నాయి. అక్కడ, ఆరు ఎగరడం చేతకాని చిన్న పక్షులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతున్న అబ్బాయి గూళ్ళను తగలబెట్టడానికి పూనుకున్నాడు. ఒక్కసారిగా పిచ్చుకలు అన్ని అతని ముందుకు వచ్చి తమను తమ పిల్లలను ప్రాణాలతో వదిలేయమని ప్రాధేయపడ్డాయి. నా గింజలు మీరు తినేశారు. నేను ఏం తిని బతకాలి? మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు, అన్నాడు అబ్బాయి. తండ్రి పిచ్చుక ముందుకు వచ్చింది. ఒక అక్షయపాత్ర గిన్నెను తెచ్చి అబ్బాయికి ఇచ్చింది. గిన్నె నీతో ఉంటే ఇక నీవు ఎన్నడు పని చేయవలసిన అవసరం ఉండదు. నీవు ఏమి అడిగితే వాటిని గిన్నె నీకు ఇచ్చేస్తుంది. ఇక మిమ్మల్ని వదిలిపెట్టు, అన్నది.
కుర్రవాడు గిన్నె తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నిజంగానే గిన్నె మహిమ గలది. అది ప్రతినిత్యం అబ్బాయికి అన్నిరకాల తిండి పదార్ధాలను అందజేస్తున్నది. పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నది. అడగడమే ఆలస్యం. బాబు మునుపటివలె ధనికుల ఇళ్లకు బిచ్చం ఎత్తడానికి వెళ్లడంలేదు. అట్లాంటి ఒక కలవారి ఇల్లు బాబు ఇంటి పక్కనే ఉన్నది. ఇంటి యజమానురాలికి అనుమానం మొదలయింది. దొంగచాటుగా వెళ్లి ఆమె రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేసింది. చూస్తుండగానే అబ్బాయి పాత గిన్నెను నడుముకు కట్టుకున్న గుడ్డలో నుంచి బయటకు తీసి ముందు పెట్టుకున్నాడు. ఇవాళ నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం, మంచి మాంసం కూర కావాలి. ఎర్ర బియ్యం అన్నం కావాలి. సింగ్ చాంగ్ కూడా కావాలి, అన్నాడు.
కళ్ళు మూసి తెరిచేలోగా అడిగినవన్నీ అబ్బాయి ముందు ఉన్నాయి. బాంగ్ చుంగ్  నిండా వేడివేడి ఎర్ర అన్నం ఉంది. అన్నం మెతుకులు మిలమిలలాడుతున్నాయి. ఆమె అటువంటి అన్నం అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇక డాపా కంచంలో రకరకాల మాంసం కూరలున్నాయి. పచ్చని, ఎర్రని మిరపకాయలు కూడా ఉన్నాయి. సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు కూడా ఉన్నాయి. మొత్తం వంట ఆవిర్లు కక్కుతున్నది. అంటే అప్పుడే వండినట్టు ఉన్నది. అబ్బాయి మాత్రం ఆశ్చర్యం కనపరచకుండా తిండి తింటున్నాడు. లొట్టలు వేస్తూ రుచిని అనుభవిస్తూ పట్టినంత తినేశాడు. అందమైన బామై రూచుంగ్ పాత్రలో సింగ్ చాంగ్ పోసుకున్నాడు. హాయిగా దాన్ని తాగేశాడు. పక్క ఇంటి యజమానురాలికి పట్టరాని అసూయ కలిగింది. ఎలాగైనా గిన్నెను తాను కాజేయాలని ఆమె పథకం వేసింది. బీద పిల్లవాడిని పిలిచి ఏదో పని చెప్పి పక్క ఊరికి పంపించింది. ఊరు పక్కలోయలో ఉంది. బాబుతో బాటు ఆమె తన కొడుకును కూడా పంపించింది. పక్క లోయకు వెళ్లాలంటే వాళ్లు ఎన్నో వాగులు, వంకలు దాటాలి. అలా ప్రయాణం కొన్ని రోజులపాటు సాగుతుంది. అంత కాలం పాటు అతని గిన్నెను తాను దాచి ఉంచుతానని ఆమె బాబుకు చెప్పింది. అతను అమాయకంగా నమ్మి గిన్నెను ఇచ్చాడు.
కొన్నిరోజుల తరువాత అబ్బాయిలు ఇద్దరు తిరిగివచ్చారు. యజమానురాలు ఒక గిన్నెను బాబుకు తిరిగి ఇచ్చింది. నిజంగా జరిగింది ఏమంటే, అక్షయపాత్రను ఆమె దాచుకుని అటువంటిదే మరొక గిన్నెను బాబుకు ఇచ్చింది. బీద అబ్బాయి తన ఇంటికి వెళ్ళాడు. తిండికోసం గిన్నెను అడిగాడు. ఒక్కసారి కాదు, పదేపదే అడిగాడు. గిన్నె తిండి పెట్టలేదు. బాబుకు కోపం వచ్చింది. గిన్నె తీసుకుని పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. గిన్నె పనిచేయడం లేదని కోపంగా చెప్పాడు. ఈసారి పిచ్చుకల తండ్రి, బాబుకు ఒక మేకపిల్లను ఇచ్చాడు. మేకపిల్లకు స్నానం పోసి తడితే చాలు, అది నీకు కావలసినంత డబ్బు ఇస్తుంది. దానితో నీవు తిండి కొనవచ్చు, అని చెప్పాడు.
కుర్రవాడు ఇంటికి వెళ్లగానే మేకపిల్లకు స్నానం పోసి తట్టాడు. దాని ఒంటినుండి బంగారం, వెండి నాణేలు రాలాయి. హాయిగా బతక సాగాడు. పక్కింటి యజమానురాలికి మళ్ళీ అనుమానం పుట్టింది. ఆమె మేకపిల్ల సంగతి గమనించింది. అది తనకు కావాలి, అనుకున్నది. పన్నాగం చేసి ఒక మామూలు మేకపిల్లను అంటగట్టింది. మేకపిల్ల డబ్బులు ఇవ్వడంలేదని గమనించిన బాబు, మళ్లీ పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. నేను ఇచ్చిన రెండు బహుమానాలను నీవు జాగ్రత్తగా ఉంచుకోలేక పోయావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకా ఏమీలేదు. ఒక దుడ్డుకర్ర మాత్రం ఉన్నది. అది కూడా, ఏదో రకంగా పనికి వస్తుంది. తీసుకువెళ్ళు. మళ్లీ మాత్రం నా వద్దకు రావద్దు. ఇప్పటికే నీకు చాలా ఇచ్చాను, అన్నది తండ్రి పిచ్చుక.
అబ్బాయి నిరాశలో మునిగి, ఇంతకూ కర్ర ఏం చేస్తుంది అని అడిగాడు. ఎవరినైనా కొట్టమంటే కొడుతుంది, అన్నాడు పిచ్చుకల తండ్రి.
దానికి నిత్యం పూజ చెయ్యి. మూడుసార్లు దండం పెట్టు. ఎవరిని కొట్టాలో చెప్పు. అప్పుడది వాళ్లను కొడుతుంది, పిచ్చుక మాటలు అవి.
బీద కుర్రవాడు ఇంటికి వచ్చాడు. ఈసారి ఏమి తెచ్చాడని చూడడానికి పక్కింటావిడ కూడా వచ్చింది. అప్పటికే కుర్రవానికి తన గిన్నె, మేక ఏమైంది అన్న సంగతి అర్థమయింది. కొంచెం ఆగితే అది ఏం చేస్తుందో చూపిస్తాను అని, దుడ్డు కర్రను చూపించాడు.
ముసలావిడకు మహా ఆత్రంగా ఉంది. ఈలోగా అబ్బాయి దుడ్డుకర్రకు పూజ చేశాడు. దానికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగా కర్ర ముసలామె వైపు వచ్చి అదేపనిగా కొట్టసాగింది. ఆమె తన ఇంట్లోకి పరుగు పెట్టింది. అయినా కర్ర వెంటబడి కొడుతూనే ఉన్నది. ఆవిడ పడుతూ లేస్తూ బాబోయ్, తప్పు తెలిసింది. నీ వస్తువులు నీకు ఇచ్చేస్తాను. కర్రను వెనుకకు పిలువు, అంటూ మొర పెట్టుకున్నది.
బాబు కర్రను వెనుకకు పిలిచాడు.
పక్కింటి యజమానురాలు దొంగిలించిన గిన్నెను, మేక పిల్లను తెచ్చింది. బాబుకు ఇచ్చింది. చేతులు జోడించి మళ్లీ దుడ్డుకర్రను మాత్రం నా మీదికి పంపకు అన్నది.
పిచ్చుకలు ఇచ్చిన మూడు బహుమానాలు మళ్ళీ పిల్లవాడికి దొరికాయి. తరువాత అతను హాయిగా బతికాడు.