Showing posts with label pleasure. Show all posts
Showing posts with label pleasure. Show all posts

Sunday, October 11, 2026

లోకాభిరామం - మళ్లీ మొదటికి (భాషల గురించి)


మళ్లీ మొదటికి

ఇంతకూ భాష అంటే ఏమిటి? మళ్ల మొదటికి వచ్చినము. భాష లేని కాలంలో మనిషి సైగలతో చెప్పదలచుకున్నదేదో చెప్పి ఉంటడు. దీన్ని శరీర భాష అంటము. భాషలు బాగ పరిణతి చెందిన తరువాత కూడా శరీర భాష అవసరం మాత్రం తగ్గలేదు. నోటితో పొగడుతూ, నొసటితో వెక్కిరిస్తున్నడు అని ఒక మాట ఉంది. నోటితో అంటున్నది ఒకటయితే, శరీరం మరొకటి అంటుందన్నమాట! ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మొత్తానికి మనిషి భాష నేర్చుకున్నడు. ఉన్నచోట ఉండక రకరకాల చోట్లకు వలస వెళ్లినడు. ఎక్కడికక్కడ భాషలు పుట్టినయి. వాటి మధ్యన పోలికలు ఉన్నయి. తేడాలు అంతకన్న ఎక్కువగ ఉన్నయి.

నోరు తెరిచి సులభంగా చేయగలిగిన శబ్దం అకారం. కొంచెం ముక్కును కూడా వాడితే, మ అన్న ధ్వని వీలవుతుంది. ప్రపంచంలోని అన్ని భాషలలోనూ అమ్మ అన్న మాటకు మ అనే అక్షరమే ఆధారంగ ఉంది. ఇదేరకంగ భాష పుడుతూ అభివృద్ధి చెంది బోలెడన్ని మార్పులకు గురయింది. అయినా భాష ప్రయోజనం ఒక్కటే. ఏమిటా ప్రయోజనం? అసలు భాష అంటే ఏమిటి? భావ వినిమయ మాధ్యమం అని కదా జవాబు? విషయం అర్థమయిందే? నేను ప్రశ్నకు జవాబు తెలుగులోనే చెప్పిననని గట్టిగా అనుకుంటున్న. చెప్పిన మూడు మాటలు సంస్కృతంలోనివి. వచ్చి తెలుగులో చేరిన మాటలు. ఈ రకమయిన మాటలను తొలగిస్తూ పోతే, తెలుగు చాల కొంచెమే మిగులుతుంది. మనసులో ఆలోచనను ఎదుటివారికి అందించడానికి వీలు కలిగించే దారిని భాష అనాలి. ఇది దారి కాదు. ఒక యానకం. ఈ యానకం మళ్లీ సంస్కృతం! యానకం అంటే మోసుకుపోయేది అని అర్ధము.

భావ వినిమయ మాధ్యమం అన్నా, మనసులో ఆలోచనను ఎదుటివారి వరకూ మోసుకుపోయేది అన్నా ఒకటే! ఈ రెండవ నిర్వచనం అసలయిన తెలుగు. కానీ అది మనకు తెలుగులాగ వినిపించదేమో! మన దగ్గర రక్షకభట నిలయాలు ఉంటయి. పోలీసులు ఉంటరు. తమిళనాడులో పోలీసువారి వాహనాల మీద “కావల్‌' అని రాసి ఉంటుంది. నిజానికి వాళ్లు చేస్తున్న పని “కాపలా కాయడమే'. అంటే వాళ్లు కావలివాళ్లే! ఈ మాట తెలుగు తెలిసిన ఒక పోలీసాయనకు చెప్పి చూడండి. నేను అట్ల కనిపిస్తున్ననా అంటడేమో! అది భాషలోని చిక్కు. మనకు మాట్లాడడం తరతరాలుగా సంక్రమించిన శక్తి. కనుక ఇవాళ, ఇలాగే ఎందుకు మాట్లాడుతున్నము అని ప్రశ్నించకుండ అనుకరించి నేర్చుకున్న భాషను నిర్లక్ష్యంగ వాడేస్తము. అందులోని మంచి చెడులను తర్కించే అవసరము, అవకాశమూ లేదు అనుకుంటము.

మన దేశంలో బోలెడు భాషలు ఉన్నయి. ఒక్కొక్క భాషలో బోలెడు యాసలు ఉన్నయి. యాసలు కాని రూపాలు కూడ ఎన్నో ఉన్నయి. కనుక ముఖ్యంగ మనదేశంలోవారికి భాషలతో పరిచయం, వాటి తీరుతెన్నుల గురించిన ఆలోచన చాలా ఎక్కువగ అవసరం. ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత సంజీవ్‌దేవ్‌గారు చెప్పిన ఒక విషయం నాకు గుర్తుకు వస్తున్నది. రాహుల్‌ సాంకృత్యాయన్‌గారు సంజీవదేవ్‌గారితో కబుర్లు చెపుతూ కాలం గడపడానికి తుమ్మపూడికి వచ్చినరట. ఈ రాహుల్‌ ఎవరు? అని అడిగేవారికి జవాబు చెప్పవలసిన బాధ్యత నామీద ఉందని నాకు తెలుసు. జయ యౌధేయ, సింహసేనాపతి లాంటి రచనలు చదివినవారికి సాంకృత్యాయన్‌గారి పాండిత్యము గురించి తెలిసి ఉంటుంది. ఆయన గొప్ప పండితుడు, రచయిత. ఆయన రచనలు తెలుగులో చదివే భాగ్యం నాలాంటివారికి కలిగింది. మొత్తానికి సాంకృత్యాయన్‌గారికి తెలుగు రాదు. సంజీవదేవ్‌గారితో ఆయన ఒక కామన్‌ భాషను ఎంచుకుని చర్చ సాగించి ఉంటరు. సంజీవదేవ్‌గారు కూడా గొప్ప పండితులు. ఆయనకు కూడా బోలెడు భాషలు వచ్చి ఉంటయి. కానీ ఇక్కడ విషయం అది కాదు. సాంకృత్యాయన్‌ తుమ్మపూడిలో ఉండగా, ఒక రోజు పొలాలకు వెళ్లి చూడాలన్న ఆలోచన కలిగిందట. నడిచి వెళ్లడం శ్రమ అనుకున్నరేమో, ఎద్దుల బండి కట్టించుకున్నరట. బండి నడుపుతున్నది ఒక లంబాడీ మనిషి. వీళ్లనే సుగాలీలు అని కూడా కొన్ని ప్రాంతాలలో అంటరు. మన దగ్గర వీళ్లు అనుసూచిత జాతులలో లెక్కింపబడుతున్నరు. మొత్తానికి పెద్దలిద్దరూ బండిలో ప్రయాణం చేస్తున్నరు. బండి నడుపుతున్న మనిషి తోడు వచ్చిన మరొక మనిషితో తన భాషలో సంభాషణ సాగిస్తున్నడు. రాహుల్‌ గొప్ప పండితుడు, ఒక వైపు సంజీవదేవ్‌ గారితో మాట్లాడుతూనే, మరొక వైపు బండి మనిషి మాటలను విన్నట్టున్నరు. చేరవలసిన చోటికి చేరిన తరువాత బండి దిగినరు. వెంటనే ఈయన బండి మనిషితో సంభాషణ మొదలుపెట్టినరు. ఆ మనిషి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నడు. సంభాషణ హాయిగ సాగింది. సంజీవదేవ్‌గారు సాంకృత్యాయన్‌ గారిని “నీకు లంబాడీభాష వచ్చునా?' అని అడిగినరు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ చెప్పిన జవాబును మనమందరమూ గమనించాలె. బండి మనిషి మాట్లాడుతున్నది గుజరాతీ భాష. అయితే అది కొంత మారింది. దారి వెంట మాటలను విన్న ఈ పండితుడు ఆ మార్పును అర్థం చేసుకున్నడు. ఆయనకు గుజరాతీ వచ్చు. తనకు తెలిసిన మాటలను గమనించిన మార్పులతో సహా బండి మనిషి మీద ప్రయోగించినరు. సంభాషణ సాగింది. ఇక ఎక్కువ చెప్పనవసరం లేదు.

భాషలకు దేనికవిగా, చక్కని రంగు,రుచీ వాసనలు ఉంటయని నాకు గట్టి నమ్మకం. రైల్లో కూచున్నాను. ఎదురుగ ఒక జంట, వారి ఇద్దరు పిల్లలు వచ్చి చేరినరు. గొడవగొడవగ మాట్లాడుతున్నరు. నాకు తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ, హిందీ, ఉర్దూ బెంగాలీలాంటి భాషలతో పరిచయం ఉంది. కనీసం విన్నమాట ఏ భాషలోది అన్నది సులభంగా తెలుసు కోగలను. ఈ కుటుంబం మాట్లాడుతున్నది దక్షిణాది భాష కాదు. ఉత్తరాది భాష అంతకన్నా కాదు. అందులో నాకెన్నో బాషలు వినపడుతున్నయి. మామూలుగానే కొంతకాలానికి అక్కడున్న మిగతా వాళ్లందరితోనూ మాటలు కలిసినయి. అప్పుడు నేను సందర్భం చూచి వీళ్లు మాట్లాడుతున్నది దక్షిణాది భాషలు, కొంచెం మరాఠీ కలిసిన ఒక భాష అన్నది సూచించిన. అది కొంకణి లేదా తుళు అయి ఉండాలి అని నా అనుమానం. ఏదో ఒక పేరు చెప్పి తప్పులో చిక్కడానికి నాకు భేషజం అడ్డువచ్చింది. వాళ్లు మాట్లాడుతున్నది కొంకణి అని చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉండడం కారణంగ అది కూడా ఎంతో మారిందని ఆ పెద్ద మనిషి హాయిగ నవ్వుతూ చెప్పినడు. భాషల రంగు, రుచి, వాసన రుజువయింది!

భాష గురించి పద్ధతిగా పరిశీలించేవాళ్లు సెమాంటిక్స్‌ అనే ఒక పద్ధతిని గురించి చెబుతారు. ఇది భాష నిర్మాణానికి సంబంధించిన విషయం.

ఇక సింటాక్స్‌ అనే వాక్యనిర్మాణ పద్ధతి మరొకటి ఉంటుంది. బాషల మధ్యన మాటలను ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఈ రూల్స్‌ను జవదాటుతుంది. పెన్‌ అన్న ఇంగ్లీషు మాట హలంతము. దాన్ని మనం పెన్ను అని అజంతంగ మార్చుకున్నము. పెన్నులు అని దానికి బహువచనం కూడా ఏర్పరచుకున్నము. పెన్‌లు అనడం ఇబ్బందిగ ఉంటుంది. తమిళంలో “పెణ్‌' అంటే అమ్మాయి అని అర్ధం! కనుక వాళ్లు పెన్నును పేనా అన్నరు. పెన్‌ మారలేదు. పేరు మాత్రమే మారింది!

తోడల్లుని గురించి చెప్పడానికి మనవాళ్లు కోబ్రదర్‌ అని ఒక మాట వాడుతుంటరు. ఇంగ్లీషువానికి తెలియని ఇంగ్లీషు మాట ఇది! జోక్‌ కాదు, ప్రపంచంలోని అన్ని డిక్షనరీలలో వెతికినా ఈ మాట మీకు కనిపించదు. మనతో కలిసి పనిచేసే మనిషి కోవర్కర్‌. మనతోబాటు ఒక మనిషికి అంటే మామగారికి అల్లుడయిన మరొక పెద్ద మనిషి, అయితే గీతే, కో సన్ ఇన్ లా కావాలి. ఈ కోబ్రదర్‌ ఎక్కడినుంచీ వచ్చిందో తెలియదు. గుండెలు గట్టిగ పట్టుకుని వినండి. ఇంగ్లీషు భాషలో తోడల్లుడుగారిని బ్రదర్‌ ఇన్‌ లా అంటరు. భార్య తోబుట్టువును కూడా ఈ మాటతోనే పిలుస్తరు. కజిన్‌ అంటే వాళ్లకు తేడా తెలియదు. మనకు మాత్రం బాబాయి కొడుకు వేరు, మామయ్య కొడుకు వేరు. భాషలలోని రంగులో, రుచిలో, వాసనలో ఛాయలు కూడా ఉంటయన్నమాట! మన భాష నేర్చుకోవాలంటేనే గగనం అవుతున్నది. ఇక మరో భాష నేర్చుకోవాలంటే, ఎంత కష్టమో ఆలోచించండి. కానీ, మనం చాలా భాషలు సులభంగానే నేర్చుకుంటున్నము.


 

Friday, October 2, 2026

లోకాభిరామం - ఓహ్ కలకత్తా! On my first trip to Calcutta


ఓహ్ కలకత్తా

 

చదువరీ! మీరీ లోకాభిరామమున క్రమముగ నాతోబాటు సంచరించుచుంటిరా? ధన్యవాదములు. కాని మిమ్ము కలకత్తా నగరపు బస్సులు, ట్రాములలో వదిలి నేను మరి ఎక్కడికో వెళ్లినట్లుంటిని. రండు, మరొకమారు కలకత్తాలో తిరుగుదము. తొలి విడత జ్ఞాపకములే తంపరలుగ తలలెత్తుచున్నవి!

బురద: కలకత్తాకు నేను మొదటిసారి వానల సీజన్‌లో పోయినట్లున్న. అక్కడ బోలెడంత బీదతనం, పాతదనం ఎదురయినయి. భవనాలన్నీ పాతవి. ప్రతి ఆవరణలోనూ నాలుగు మూలల నీటి మడుగు, అందులో చేపలుంటయట. మరీ సముద్రం తేమ వాతావరణం. స్నానం చేసి బయటకు వస్తుంటే ఒళ్లు మళ్లీ జిడ్డుగ ఉంటుంది. అక్కడి వారికది అలవాట వుతుందేమో. ముత్యాలలాగ ఉంటరందర. పరిశోధన సంస్థలో కూడా పొడగరి మగవారు, సిసలయిన బెంగాలీ పంచెకట్టులో రావడం గమనించిన. వారెంత శుభ్రంగా ఉంటరో నగరమంత మురికిగ ఉంది అప్పట్లో. నగరం నడిబొడ్డున వారాలపాటు చెత్తకుప్పలు ఉండడం చూచిన.

పులి మీద పుట్ర అన్నట్టు (అంటే ఏమిటని, నాకయితే తెలియదు) వాన మొదలయింది. కలకత్తాలో బురద నల్లగ ఉంది. బట్టలకు తగిలితే వదలదని చెప్పినరు. నగరంలోని కేంద్రంలో ఒకచోట డక్‌బ్యాక్‌ అని ఒక అంగడి ఉంది. ఆ బ్రాండ్‌ రెయిన్‌ కోట్లు ఉంటయని తెలుసు. గాలి ఊది నింపే దిండ్లు కూడ ఉన్నయి వారి దగ్గర. అన్నిటికీ మించి గనుల్లో వాడే గమ్‌బూట్లు, పిక్కల దాకా ఉండేవి అమ్ముతున్నరు! నమ్మండి. వాటిని కొనేందుకు అందరూ క్యూలో నిలబడి ఉన్నరు. ఆ ఊరంతా నల్లని బురద. కనుక బురద నుంచి రక్షణ! బీదవాళ్లుండే గుడిసెలు, కోడిగూళ్లలాగున్నయి. వానతో వాటి చుట్టు బురద చీదరయింది. పాపం ఎట్ల బతుకుతరో అనిపించింది.

కలకత్తాలో మనుషులు తొక్కేవికాక, లాగే రిక్షాలున్నాయి. ఆ రిక్షా వాళ్ల దగ్గర ఒక సత్తు కంచం ఉంటుంది. పేలపిండి లాంటి పిండి, కానీ పసుపు చాయలో ఉంది. కంచంలో కొలిపించుకుని, నీరు కలిపి పిసికి తింటున్నరు. కొంచెం ఉప్పు, లేదా బెల్లం ముక్క ఆధరువు! అదే తిండి. మరి ఇల్లంటూ ఉందా? ఏమో?

భీ భిల్‌ భెయిట్‌: బి.ఎన్‌.ముఖర్జీ అనే బిశ్వనాథ్‌ బాబూ గురించి చెప్పకుండా కలకత్తా యాత్ర పూర్తి కాకూడదు. సన్నిహితులకు ఆయన బిషన్‌దా! హ్యూమన్‌ జెనెటిక్స్‌, అందునా నేను ఎన్నుకున్న పాపులేషన్‌ జెనెటిక్స్‌ రంగంలో పేరెన్నికగన్న పరిశోధకుడు. ఆయనను చూస్తే, సంస్థలో ఏ క్లర్కుగానో పని చేస్తాడేమో అనిపించేంత సాదాసీదా మనిషి. సొంత తమ్ముళ్లలాగ మా ముగ్గురిని (నేను, పటియాలా పిల్లలిద్దరు) అక్కున చేర్చుకున్నడాయన. ఏ మాత్రం దాచకుండా, తాము వాడుతున్న సాంకేతిక పద్ధతులన్నీ మాకు నేర్పసాగినడు. అప్పట్లో కలకత్తాలో విద్యుత్తు కొరత బాగ ఉంది. కరెంటు గంటలపాటు పోతుంది. దాని పేరు లోడ్‌ షెడింగ్‌. వచ్చినప్పుడు వోల్టేజ్‌ సరిగా ఉండదు. మా ప్రయోగాలు, కరెంటు మీద ఆధారపడే రకం. కరెంటు రాగానే బిషన్‌దా ‘హౌ ఇజ్‌ ధ భోల్టేజ్‌’ అని అడిగేవాడు. ప్రయోగం పెట్టిన తరువాత ‘భి భిల్‌ హోప్‌’ అనేవాడు. కరెంటు పొయ్యిందనుకోండి. ‘భి భిల్‌ భెయిట్‌’ అనేవాడు. ఆశావాదం. మరీ మంచి వాడు బిషేన్‌దా. (దా, దాదా అన్నవి ‘అన్న’ను సంబోధించే మాటలు) ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్న. అందులో కొంత సైన్సు. మిగిలింది సెన్సు!

ల్యాబ్‌లో ఇద్దరు టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ ఉండేవారు. ఆశ్చర్యం ఏమిటంటే, లాబ్‌ నుంచి ప్రకటించిన పరిశోధన పత్రాలలో అన్నింటిలోనూ సైంటిస్టులతో బాటు వీళ్ల పేర్లు కూడా ఉండేవి. ఆ ఇద్దర్లో ఒకతను దోస్త్‌ అయ్యినడు. కలిసి ఊరు తిరగడానికి కూడా వచ్చినడు. ఒకచోట పెద్ద హోర్డింగ్‌ చూచి ‘సాధనా ఔషధాలయ్‌’ అని చదివిన. ఇంచుమించు హిందీ అక్షరాలే. కనుక చదవగలిగిన. మిత్రుడు ‘నీకు బెంగాలీ వచ్చా?’ అంటూ ఆశ్చర్యపోయినడు. ‘ఓ! వచ్చు!’ అని గొప్పలు పోయిన. ‘బ్రిష్టి పొరిచేన్‌’ అన్నడు. వాన కురుస్తున్నది అంటున్నావని ఇంగ్లీషులో చెప్పిన. సంస్కృతంలో వృష్టి అంటే వర్షం. చినుకులు పడుతున్నయి. కాస్తంత కామన్‌సెన్స్‌. ‘నీకు నిజంగా బంగ్లా తెలుసులాగుంద’ని అతను ఆశ్చర్యపోయినడు.

శరత్‌బాబు: బొన్‌హుగ్లీలో ఐఎస్‌ఐ హాస్టల్‌, సంస్థ ఆవరణలోనే ఉంది. ముందుండే రోడ్డు దాటితే చిన్నచిన్న దుకాణాలుండేవి. వాటిలో ఒక దాంట్లో బిస్కెట్లు, చిరుతిండి అమ్ముతరు. ఒక యువకుడు, చదువుకున్న మనిషి, ఆ అంగడిని నడుపుతున్నడు. బ్రిటానియా బిస్కెట్లకు కలకత్తా కేంద్రం. అన్ని రకాల బిస్కెట్ల పొట్లాలలో కాక, బరువు ప్రకారం అమ్ము తడతను. నాకు మొదటి నుంచీ బిస్కెట్లంటే ప్రాణం. కొందమని వెళ్లిన. అంగట్లో లోపట ఒక క్యాలెండర్‌ ఉంది. ఆశ్చర్యంగా దాని మీద నవలాకారుడు శరచ్చంద్ర ఛటర్జీ బొమ్మ ఉంది. ‘శరత్‌బాబు’ అన్న ఆశ్చర్యంగనే. మన దగ్గర రచయితల క్యాలెండర్‌ కలలోని మాట. అతనికి నేను స్థానికుడిని కానని తెలుసు. అతను అంతకన్న ఆశ్చర్యపోయినడు. ‘నీకెట్లా తెలుస’న్నడు. ‘తెలియడమేమిటి? ఆయన నవలలు, కథలు అన్నీ చదివిన’ అన్న నేను. నేను తీవ్రంగా అభిమానించే నలుగురయిదుగురు రచయితలలో శరత్‌ ఒకరు. నాటికీ, నేటికీ. ఇద్దరమూ, అనువాదాల గురించి బెంగాలీ రచయితల గురించి చర్చ సాగించినము. నేను రోడ్డు మీద కనిపిస్తే చాలు ‘పండిత్‌ మోషాయ్‌! (మహాశయ్‌!) నొమొష్కార్‌!’ అని పలకరించినడాయన నేనున్నన్ని నాళ్లూనూ!

పుస్తకాల ప్రసక్తి వచ్చింది గనుక, కలకత్తాలోని రొబీంద్ర సరణి ప్రాంతంలోని సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాల అంగళ్లను గురించి చెప్పుకోవాలె. అక్కడ వరుసబెట్టి దుకాణాలు. అరుదయిన పుస్తకాలు దొరుకుతయి. అది యూనివర్సిటీ దగ్గరి ప్రాంతం. అందరూ ముగియబడి పుస్తకాలు కొంటుంటరు. ఆ ప్రాంతంలోనే ఇండియా కాఫీ హౌస్‌ ఉంటుంది. ఉండేది అనాలె. దాన్ని ఎత్తివేశినరట. రబీంద్రనాథ్‌ టాగోర్‌ నిత్యమూ అక్కడ వచ్చి టీ తాగేవాడట. రెండు కప్పులూ టీ అడిగేవాడట. ఎందుకు అని అడిగితే ఒకటి నాకు, మరొకటి గడ్డానికి అనేవాడట.

ఆ పక్కనే మరొక వీధి ఉంటుంది. చైనా బజార్‌ అంటారేమో గుర్తు లేదు. అక్కడ అంగళ్లన్నీ చైనా వారు నడుపుతరు. అక్కడ అన్ని రకాల పాదరక్షలు అమ్ముతరు. ఒకనాడు వెళ్లి కొలత ఇస్తే, మనకు కావలసిన రకంగా షూస్‌, శాండల్స్‌ కుట్టి ఇస్తరు. వాళ్ల మెటీరియల్‌, డిజైన్లు బాగున్నాయి. నేను షూస్‌, శాండల్‌ (బెల్ట్‌ బూట్స్‌) రెండూ కుట్టించుకున్న. మూడవ నాడు డెలివరీ, ధర చాలా సరసమయింది. హైదరాబాద్‌లో యూనివర్సిటీలో ఎంతమంది అడిగినరో వాటి గురించి!

కలకత్తాలో తిండితోబాటు, అన్నీ చవకగ దొరుకుతాయనిపించింది. వంద రూపాయలకు మంచి సూట్‌కేస్‌ కొన్న. జ్యూట్‌ సంచులు, అందమయినవి కొన్ని తెచ్చిన. తిండి, మిఠాయిల సంగతి చెప్ప నవసరం లేదు. గ్రేట్‌ ఈస్టర్న్‌ హోటేల్‌ ప్రాంతంలో ఒక స్వీట్‌షాప్‌, రెస్టారెంట్‌ ఉంది. మనకు తెలియని రకాలెన్నో అక్కడ దొరికినయి. వీలయినన్ని సార్లు అక్కడికి వెళ్లి వీలయినన్ని రకాలు తిన్న. మొదలే స్వీట్లంటే ఇష్టం. అది బెంగాలీ వారి మూల లక్షణాలలో ఒకటని తెలిసిపోయింది. ఎన్ని స్వీట్లు తిన్ననో తెలియదు.

రసగుల్లా (ఛ, రొష్షగొల్లా అనాలి)లను కనుగొన్న కె.సీ.దాస్‌ వారి అంగడి ప్రపంచ ప్రసిద్ధమయినది. ఇరవయికి పైన రకాల రసగుల్లాలున్నయి అక్కడ. అప్పటికే సీల్‌ చేసిన టిన్నులు అమ్మడం మొదలయింది. రెండు టిన్నులు కొన్న. అక్కడే సూట్‌కేస్‌ కూడా కొన్న గనుక, దాన్ని నింపాలి. హాస్టల్లో మిత్రులకు ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో మరేవో స్వీట్లు అట్టపెట్టెలో కొన్న. అది నేను బయలుదేరే రోజు. చాలా ముందుగ బయలుదేరకపోతే ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుంటవని హెచ్చరించినరు. మధ్యాహ్నమే బయలు దేరాలె. నేను గదికి వచ్చేసరికి హాస్టల్లో ఎవరూ లేరు. ల్యాబ్‌కు వెళ్లే టైం లేదు. వీడ్కోలు కార్యక్రమం అయిపోయింది. అట్టపెట్టె స్వీట్లు, సూట్‌కేస్‌లో పెట్టడానికి లేదు. బెంగాలీ తడి రకం. కనుక మొత్తమన్నీ లంచ్‌గ తినేశిన.

పార్క్‌ స్ట్రీట్‌ అమ్మాయి: ఈ అమ్మాయిని గురించి చెప్పకుండా ముగించడం అన్యాయమే అవుతుంది. పార్క్‌ స్ట్రీట్‌ అంటే, కలకత్తాలోని మాడరన్‌ షాపింగ్‌ ప్రాంతం. అంగళ్ల మధ్యన విండో షాపింగ్‌ చేస్తూ తిరుగుతున్న. ఒక అందమయిన అమ్మాయి, చక్కని దుస్తుల్లో ఉంది. నన్ను చూచి చిరునవ్వింది. అర్థంగాక నా మానాన నేను పోతున్న. వెంట నడిచింది. కాసేపటికి నా చేయి పట్టుకున్నది. ‘మా ఇంటికి పోదాం పద!’ అన్నది. మట్టిబుర్ర నాది. అర్థం కాలేదు మొదట్లో. అర్థమయింతరువాత ‘రాను’ అన్న. నాలుగు రోజుల తరువాత మళ్లీ కనిపించింది. నవ్వింది. ‘నీవు పిరికివానివి’ అనేసి వెళ్లిపోయింది.


 

సామల సదాశివ స్వరలయలు : ప్రారంభ వ్యాసం

 


Swaralayalu

పండిత్‌ నెహ్రూ మనదేశ ప్రధానిగా ఉండగా బి.వి. కేస్కర్‌ ప్రసారశాఖ మంత్రి. అతడు శాస్త్రీయసంగీతం బాగా తెలిసినవాడు. ఆ సంగీతం పట్ల వల్లమాలిన అభిమానం గలవాడు. అది అభిమానం మాత్రమే అంటే సరిపోదు. అదొక చాదస్తం. ఆ చాదస్తం వలన తన ఆధీనంలోని ఆలిండియా రేడియో కార్యక్రమాల కోసం కొన్ని విడ్డూరమైన ఆదేశాలు జారీ చేసినాడు. అందులో ఒకటి, ఆలిండియా రేడియో ఎప్పుడైనా శాస్త్రీయ సంగీతాన్నే ప్రసారం చేయాలె, అది హిందుస్తానీ అయినా పర్వాలేదు.

కర్ణాటక అయినా పర్వాలేదు. కానీ శాస్త్రీయంకాని కార్యక్రమాలు ప్రసారం చేయకూడదు. ముఖ్యంగా సినీ గీతాలు ప్రసారం చేయకూడదు. ఈ ఆదేశం ఎంత అందంగా వుందో చూచినారా! ఏ కొందరో వినేది శాస్త్రీయ సంగీతం. అధిక సంఖ్యాకులు వినాలని కోరేది సినిమా సంగీతం. మాస్‌ మీడియాను క్లాస్‌ మీడియా చేసే ప్రయత్నమిది. ఈ ఆదేశం కారణంగా రేడియోస్టేషన్లలో భద్రపరచబడిన ఎన్నెన్ని సినిమా పాటల రికార్డులు నష్టమైనాయో!

ఇంకొక ఆదేశం. హార్మోనియం విదేశీవాద్యం కనుక అది రేడియోస్టేషన్లలో వుండగూడదు, ఎంతటి గాయికా గాయకులైనా హార్మోనియం పట్టుకొని  రేడియోస్టేషన్లలో ప్రవేశించకూడదు. ఆ కాలంలో ప్రఖ్యాత గాయికా గాయకులు హార్మోనియం సహకారంతోనే గాన కచ్చేరీ నిర్వహించేవాళ్ళు. బేగం అఖ్తర్‌ కారణంగా, పండిత్‌ నెహ్రూ కారణంగా కేస్కర్‌ రేడియో స్టేషన్లకు హార్మోనియంను అనుమతించినాడు. ఆ ముచ్చట్లు తరువాత చెప్తాను.

మరొక ఆదేశం. ఎంతగొప్ప గాయికా గాయకులైనా రేడియోస్టేషన్లో పాడటానికి ముందు “వాయిస్‌ టెస్ట్‌” జరిపించుకోవాలి. అప్పటివన్నీ “లైవ్‌ ప్రోగ్రాములు” కనుక స్వరపరీక్ష చేయించటం సబబే అనిపిస్తుంది. కానీ వేల సంఖ్యలో వుండే శ్రోతల మధ్య కూర్చుండి మైక్‌ సహకారమున్నా లేకున్నా గంటలు గంటలు తమ సంగీతాన్ని వినిపించే ఆనాటి గాయికా గాయకులకు స్వరపరీక్ష నిర్వహించటమంటే వాళ్ళను అవమానించటమే. వాయిస్‌ టెస్ట్‌ పేరు వినగానే స్వరశ్రీ” కేసర్‌బాయి కేర్కర్ రేడియోస్టేషన్‌ నుండి తన కారు తిప్పుకొని ఇంటికి వెళ్లిపోయిందట. ప్రఖ్యాత సితార్‌ వాదకులు పండిత్‌ రవిశంకర్‌, ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌లు రేడియో స్టేషన్లను “బాయ్‌కాట్‌” చేసినారట. కేస్కర్‌గారి చాదస్తం వలన ఆలిండియా రేడియో స్టేషన్లన్నీ కళ తప్పినప్పటికీ శాస్త్రీయ సంగీత రసికులకు రకరకాల (ప్రసార కార్యక్రమాలు వీనులవిందు కలిగించినవి. ఇప్పటికీ ఆ సంప్రదాయం నడుస్తున్నది. ఆదివారం రవివాసరీయ ఫంగీత కార్యక్రంలో, శనివారం జాతీయ సంగీత కార్యక్రమంలో, నవంబర్‌నెల నడిమి నుండి నెలరోజులకు పైగా జరిగే ఆకాశవాణి సంగీత సమ్మేళనంలో హిందూస్తానీ గాత్రం, వాద్యం, కర్ణాటక గాత్రం, వాద్యం వినిపిస్తూ సంగీత రసికులకు ఆనందం కలిగిస్తున్నారు.

ఆలిండియా రేడియోలోనే కాక కొన్ని టీ.వి. చానళ్లలోను హిందూస్తానీ శాస్త్రీయ సంగీత స్పర్శ గల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ ముచ్చట్లలో నేను చెప్పదలచుకున్నది టీ.వీ. చానళ్లలో వచ్చే శాస్త్రీయ సంగీత స్పర్శ గల కార్యక్రమాల గురించే,

ముచ్చట్ల సందర్భంలో, బేగం అఖ్తర్ కారణంగా, పండిత్‌ నెహ్రూ కారణంగా, హార్మోనియం గురించిన తన ఆదేశాన్ని కేస్కర్‌ రద్దు చేసుకున్నాడని రాసి వుంటిని. ఆ ముచ్చట వినదగిందే.

హైదరాబాదు నిజాంను తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ళు విమర్శిస్తుంటారు. అతని గురించి నాలుగు మంచి మాటలెవరైనా రాస్తే సహించలేరు. అట్లాగే పండిత్‌ నెహ్రూను, ఇందిరాగాంధీని గురించి నాలుగు మంచిమాటలు రాస్తే అప్రసన్నులయ్యే వాళ్లు కొందరున్నారు. నిజాంను గురించి ఇక్కడ రాయను. నెహ్రూ కుటుంబం సంగీతానికి రేడియో చేయూత గురించి నాలుగు మాటలు రాస్తాను. బాధపడేవాళ్లను ఇంకా బాధపెట్టాలనే ఉద్దేశం కాదు నాది. నాలుగు మంచి మాటలంటే రాయటం న్యాయమే అని భావిస్తాను.

బేగం అఖ్తర్ దిల్లీ వెళ్లినప్పుడు సంగీత రసికుడైన అక్కడి ఆలిండియా రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌ కొన్ని గజల్లు పాడవలసిందిగా ఆమెకు ఆహ్వానం పంపినాడట. ఆమె ఆమోదం తెలిపింది. ఆలిండియా రేడియో కార్యక్రమంలో ఆమె ప్రోగ్రాం ప్రకటించబడింది. ఆ ప్రకటన చదివిన ఇందిరాగాంధీ సాయంత్రం ఇల్లు చేరుకున్న పండిత్‌జీతో బేగం సాహెబా పాడుతుండగా రేడియోస్టేషన్లో కూర్చుండి వినాలని వున్నది అని చెప్పింది. పండిత్‌జీకి బేగం సాహెబా గజల్‌ వినటం సంతోషమేనాయె! వెంటనే ఫోనెత్తి కేస్కర్‌తో తాను ఇందిరాతో కలిసి ఆ రాత్రి బేగం సాహెబాను వినటానికి ఆలిండియా రేడియో స్టేషన్‌కు వెళ్తున్నట్లు చెప్పినాడు. కేస్కర్‌ రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌కు ఫోన్‌చేసి రాత్రి బేగం సాహెబా గజల్లు వినటానికి పండిత్‌జీ వెంట తానూ స్టేషన్‌కు వస్తున్నట్లు చెప్పి యేర్పాట్లు చక్కగా వుండాలని ఆదేశించినాడు. స్టేషన్‌ డైరెక్టర్‌ బేగం సాహెబా ప్రోగ్రాం రద్దయినట్లుగా తెలియపరచినాడు.

కారణమేమంటే రేడియో స్టేషన్‌కు హార్మోనియం తేవద్దన్నందున తన కార్యక్రమాన్నే రద్దు చేసుకున్నది బేగం సాహెబా,

మళ్లీ ఆమెను ఒప్పించటం ఎవరికైనా అంత తేలికకాదు. కేస్కర్‌ ఆదరాబాదరాగా స్టేషన్‌కు వెళ్ళి డైరెక్టర్‌తో మాట్లాడినాడు. బేగం సాహెబా దగ్గరికి వెళ్లి హార్మోనియంతో స్టేషన్‌కు రావలసిందిగా ఆహ్వానించినాడు.

అతని ఆహ్వానాన్ని గౌరవించవలసిన అవసరం ఆవిడకు లేదు. తన గజుల్లు వినాలని వండిత్‌జీ కోరుతున్నాడని వినగానే

ఆ కుటుంబం పట్ల గల గౌరవాన్ని పురస్కరించుకొని స్టేషన్‌కు వెళ్లటానికి సిద్ధపడింది. కేస్కర్‌ గారి గండం గడిచింది.

పండిత్‌ నెహ్రూ తండ్రి, పండిత్‌ మోతీలాల్‌ నెహ్రూ ఎక్కడికి వెళ్లినా బాయీజీల సంగీతం వినేవాడు. ప్రఖ్యాత సినిమానటి

నర్గిస్‌ తల్లి జద్దన్‌బాయి మోతీలాల్‌ నెహ్రూకు సన్నిహితురాలు. ఆమె పాడే గజల్లన్నా ఠుమ్రీలన్నా దాద్రాలన్నా మోతీలాల్‌ నెహ్రూకు చాలా ఇష్టం. ఇందిరాగాంధీ కూడా సంగీత సాహిత్యాల పట్ల ఆదరభావం కలది. చెప్పటానికెన్నో ముచ్చట్లున్నాయి. ఇక్కడొక ముచ్చట మాత్రం చెప్తాను.

ప్రదానమంత్రి ఇందిరాగాంధీ విరామసమయంలో టీ.వి. చూస్తూ కూర్చుంటే ఒక చానల్లో మధురమైన వీణాధ్వని వినిపించింది. మైసూర్‌బాణి, హంసధ్వనిరాగం. వాయిస్తున్న కళాకారుడు ఎస్‌.ఎన్‌. సూర్యనారాయణ. అతడు సుప్రసిద్ధ వైణికుడైన

వీణ నుబ్బన్న మనుమడు. ఆ వీణావాదనం ఇందిరాగాంధీకి ఎంతగా రుచించిందంటే అప్పటికప్పుడు ప్రసారశాఖమంత్రికి ఫోన్‌చేసి సూర్యనారాయణ వీణావాదనను అప్పుడున్న తొమ్మిది చానళ్లలో ప్రసారం చేయమని ఆదేశించింది.

ఒక టీ.వీ, ఇంటర్వ్యూలో ఎస్‌. ఎన్‌. సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందిరాగాంధీ కారణంగా సంగీత రసికులు దేశవిదేశాల్లో తన వీణావాదనం వినగలిగినారని, తన కార్యక్రమాలు దేశంలోని ప్రముఖనగరాల్లోనే కాక విదేశాల్లోను యేర్పాటవు తున్నాయని చెప్పినాడు.

సంగీత రసజ్ఞులకు రేడియోద్వారా శాస్త్రీయసంగీతం వినే సదుపాయం మొదటినుంచి వున్నదే. అయితే కేస్కర్‌ కారణంగా శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం వినే అవకాశం కలిగింది. ఇటీవలి కాలంలో దూరదర్శన్‌లోను, ఇతర టీ.వీ. చానళ్లలోను రకరకాల సంగీత కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. కొన్నాళ్ల క్రిందట ఏదో ఒక చానల్‌లో సోనూనిగం నిర్వహించే సరిగమ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా జరిగేది. చౌరసియా సతీమణి ఏదో చానల్‌లో ఒక సంగీతయాత్ర నిర్వహించింది. మొట్టమొదటి కార్యక్రమం బనారస్‌లో ఉస్తాద్‌ భిస్మిల్లాఖాన్‌ ఇంటర్వ్యూ, ప్రఖ్యాత నర్తకి ఉమాశర్మ జరిపిన ఇంటర్వ్యూ సాకల్యంగానూ మనోహరంగానూ వున్నది. స్వరసామ్రాజ్ణి గిరిజాదేవి ఇంటర్వూ కూడా అంతే మనోహరంగ జరిగింది. ఠుమ్రీలతో పాటు ఆ కార్యక్రమంలో ఆ విదుషి ఒక 'కప్పా” చక్కగా పాడి వినిపించింది. షోరీమియా అనే సంగీత శాస్త్రజ్ఞుడు రూపొందించిన గాయనశైలి “ఠప్పా”. ఠప్పాను పాడే కళాకారులంతగా లేరిప్పుడు. గిరిజాదేవి, సుమతీ ముటాట్‌కర్‌, మాలినీ రాజూర్‌కర్‌ లు పాడిన ఠప్పాలు విని ఆనందించగలిగినాము. ఏ కారణం వల్లనో చౌరాసియా సతీమణి ప్రారంభించిన కార్యక్రమాలు త్వరలోనే ముగిసినాయి.

ఈ మధ్య మూడురకాల కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అన్నీ జి-మరాఠీ చానల్‌లోనే. నిన్నటి గాయికా గాయకులను అనుకరిస్తూ కొందరు పాటలు పాడుతున్నారు. పాడే వాళ్లలో స్పర్థ యేర్పడుతున్నది. న్యాయనిత్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు.

నిన్నటి గాయికా గాయకులు పాడిన పాటలను తమ కంఠంతో పాడాలి కాని కాపీ చేయవద్దంటారు న్యాయనిర్దేతలు. అదంతా

ఆహ్లాదకరమైన గాయన వ్యాపారమే. సాధారణంగా నాలుగు స్వరాలుండే ఆ కార్యక్రమం “సరేగమప, మనం “సరిగమ” అంటే మహారాష్ర్రులు “సారేగమ” అంటారు. ఇంకో కార్యక్రమం పేరు సుర్‌తాళ్‌ మనం “స్వరము” అంటాము. అది తత్సమం. సూర్‌ అంటారు. మరాఠీభాష మహారాష్ర్ట ప్రాకృత జన్యం.

మరొక కార్యక్రమం ఆలాప్‌ తెల్లవారగట్ల 5.30 కు ప్రారంభమవుతుంది. అరగంటసేపు ప్రాతఃకాల రాగాలు వినవచ్చు. గాత్రంలో వినవచ్చు, వాద్యంలో వినవచ్చు. ఇంకొక కార్యక్రమం “ఏకాపేక్షాఏక్‌” అంటే ఒకరికంటే మరొకరు అని అర్ధం. ఈటీవి ఉర్దూ చానల్‌లో “గజల్‌సరా” అనే కార్యక్రమాన్ని మహమ్మద్‌ వకీల్‌ నిర్వహిస్తున్నాడు. న్యాయనిర్ణేతలుగా ఎవరెవరో వస్తున్నారు. ఇద్దరు మాత్రం స్థిరంగా వున్నారు. ఒకరు ప్రసిద్ధ గజల్‌ గాయిక దేవీ రమణమూర్తి. ఆమె సుప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్త్రి గారి కుమార్తె. ఇంకొక న్యాయ నిర్దేత హైదరాబాదు నగరానికి చెందిన సీనియర్‌ గజల్‌ గాయకుడు విఠ్ఠల్‌రావు.

నేను ప్రస్తావించిన కార్యక్రమాలన్నింటి గురించి వివరాలు రాయటానికి ముందు విఠ్ఠల్‌రావు గారిని గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలె. హైదరాబాదును పరిపాలించిన ఏడవ నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌ కడమ స్వదేశీ సంస్థానాలలోవలె తన దర్బారులో గాయకులను నియమించలేదు. చివరికి పండిత్‌ జస్‌రాజ్‌ తండ్రి పండిత్‌ మోతీరాంను దర్భారీ గాయకుడుగా నియమిస్తూ ఫర్మాన్‌ విడుదల చేసినాడు నిజాం. కానీ ఆ పీఠం మీద కూర్చుండక ముందే పండిత్‌జీ దివంగతుడైనాడు. ఆ పీఠం అలా ఖాళీగానే వుండిపోయింది. నిజాంకు సంగీతం బాగా తెలుసు. ఈ పత్రిక పుటల్లోనే రామ్మోహన్‌ నాయుడు రాసిన ఒక ముచ్చటను ఇక్కడ రాస్తాను.

ప్రతి శుక్రవారం నిజాం నవాబు సాధారణంగా పలబ్లిక్‌గార్డెన్‌లోని మసీదులో నమాజ్‌ చదివేవాడు. హైదరాబాదులో వున్నప్పుడు మేమాదృశ్యాన్ని చాలాసార్లు చూచినాము. ఒక శుక్రవారం నిజాం నవాబు తన పాత కారు దిగి మసీదువైపు నడుస్తుండగా ఫతేమైదాన్‌ లోంచి మధురమైన గజల్‌ గాయనం వినిపిస్తున్నది. ఆ సంగీతాన్ని క్షణకాలం విన్న నిజాం “అక్కడెవరో పాడుతున్నాడు. వెంటనే నాముందు ప్రవేశపెట్టండి” అని పోలీసులను ఆజ్ఞాపించినాడు. నిజాం కంఠంలోని అప్రసన్నతను గమనించిన అక్కడి అధికార్లు నమాజ్‌కు భంగం కలిగేటట్లు ఈ సమయంలో సంగీతం పాడుతున్న వాడెవడోగానీ, వానికెలాంటి శిక్షపడుతుందో అని లోలోపల భయపడుతున్నారు. ఆ గాయకుడు నిజాం సమక్షాన హాజరు పరచబడినాడు.

ఏమిరా! బేవఖ్త్ కీరాగీజీ అన్నట్లు భాగేశ్రీ రాగాన్ని పట్టపగలు పాడుతారా!” అని మందలించినాడు. తనకంటే చిన్నవాళ్లతో నిజాం మాట్లాడే పద్ధతే అది. హడలిపోయిన ఆ గాయకుడు చేతులు జోడించి “సర్కార్‌! నేను పాడుతున్నది భాగేశ్రీ

రాగమే కాని ఇప్పుడు పాడటం లేదు. రియాజ్‌ చేస్తున్నాను. రాత్రి ఒక నవాబు గారింట ఈ గజల్‌ పాడవలసి వున్నది” అని మనవి చేసుకున్నాడు. నిజాం నవాబు సంతుష్టి వ్యక్తం చేసి, సరే మంచిది. రియాజ్‌ సాగించు ఎప్పుడైనా కింగ్‌ కోఠీకి వచ్చి

మాకు వినిపించు” అని ఆజ్ఞాపించినాడు. వెంట వున్న అధికార్లు అతని పేరూ, అడ్రసు రాసుకున్నారు. అతనిపేరు విఠ్ఠల్‌రావు. ఈ ఘటనతో అతని కీర్తి నగరమంతా వ్యాపించింది.


Wednesday, July 1, 2026

సూర్యుని తరుముతూ పరుగు


సూర్యుని తరుముతూ పరుగు

ఛేజింగ్ ద సన్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని చూసినప్పుడల్లా ఒక అనుమానం ఎదురవుతుంది. డు ము వు లు ప్రథమ అనే సూత్రం ప్రకారం సూర్యుడు అంటే ఒక మగ మనిషి. రామః రాముడు అవుతాడు. కృష్ణః కృష్ణుడు అవుతాడు. అదే పద్ధతిలో సూర్యః పోయి సూర్యుడు అవుతాడు. వీళ్లంతా దేవుళ్ళు. మగవాళ్లు. అయినా రాముడు. కృష్ణులకు మీసాలు ఉండవు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి ఒక ఊరు. అక్కడ సూర్యుని గుడి ఉంటుంది. అందులోని దేవునికి మీసాలు ఉంటాయి. ఆ గుడిని చాలా కష్టపడి కట్టారు. సంవత్సరంలో ఒకనాడు ఆకాశంలోని సూర్యుని కిరణాలు (ఈ సూర్యుని గురించి రాయవలసిన చోట సూర్య గోళం అని రాయడం అలవాటయింది.) గుడిలోని సూర్యుని మీద నేరుగా పడే విధంగా దాన్ని కట్టారు. గాలిగోపురంలో అందుకు అనువుగా కిటికీల్లాంటివి ఉన్నాయి మరి. గుడిలో దేవుడు మగ దేవుడు. చిత్రంగా ఆడదేవతలు ఉంటారు. ఆలుమగలు ఉంటారు. ఆ సంగతులు ఇక్కడ అవసరంలేవు.. మరి దేవుడు అంటే సూర్యుడు మగవాడా అవునంటున్నారు మరి పెద్దలు. ఆయనకు రథం ఉంటుంది. దానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే తొడలు లేని సారథి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి సంగతులు మాకు చెప్పి చెప్పి తలకెక్కించారు. ఆకాశంలోని సూర్యుడు మండే వాయువుల ముద్ద అని కూడా చెప్పారు. బడిలో ఎక్కడ అటువంటి పాఠం చదివిన గుర్తు లేదు.. ఆ సంగతులు మరేదో మార్గంలో తెలిశాయి. ఆలోచన గల ఎవరికయినా తికమక మొదలవుతుంది. ఆకాశంలోని సూర్యునికి రథం ఉంటే కనిపించాలి కదా! అది ఎన్నడూ కనిపించలేదు మరి!

మండే వాయువుల ముద్దకు రథం ఎందుకు గుర్రాలు ఎందుకు

సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో 90 శాతం, ఇంకా ఎక్కువ మంది అవును అంటారు. ఈ మధ్యన కొంత మంది, పిల్లలు మాత్రమే ధైర్యంగా కాదు అనగలుగుతున్నారు. సూర్యుడు ఒకచోట ఉంటాడు. కదిలిన మనకు తెలిసే విధంగా కదలడు, అన్నారు ఆ పిల్లలు. భూమి సూర్య గోళ్లను చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంతో పాటు అది బొంగరం లాగా తన చుట్టూ తాను తిరుగుతుంది. కనుక మనకు సూర్యుడు ఉదయించిన భావం కలుగుతుంది, అని పిల్లలకు అర్థమైంది అన్నమాట.

సన్ (ఎస్ యు ఎన్) అంటే సూర్యుడు. సన్ (ఎస్ ఓ ఎన్) అంటే కొడుకు. ఎంత బాగుందీ పద్ధతి నా కొడుకు నాకు ఆకాశంలో సూర్యుని వలె వెలుగుతూ కనబడతాడు. అందరు పిల్లలు అలాగే కనబడతారు. సూర్యుడు, చంద్రుడు విరాట్ పురుషునికి రెండు కళ్ళు అన్నారు, వెనకటివారు. ఆరింటికి పోలికే లేదు. అని ఎంతమందికి అర్థమయింది

మనిషి దేవుళ్లను సృష్టించాడు. వారికి తనలాగే రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్టు ఊహించాడు. అంతకన్నా మరొకరకంగా ఊహించడం అమాయకం మనిషికి చేతకాలేదు. విరాట్ పురుషునికి 1000 కళ్ళు, 1000 కాళ్లు ఉన్నాయి అన్నారు. అది ఎట్లా వీలవుతుంది అని ఆలోచన కలిగినట్లు లేదు. ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు గనుక వదిలేద్దాం.

విజ్ఞాన సర్వస్వంలో చూస్తే ఆకాశంలో సూర్యుడు ఎల్లో డ్వార్ఫ్ రకం నక్షత్రం అని రాసి ఉంది. దాని ద్రవ్యరాశి 1,909 X 10 10 (అంటే ఒకటి పక్కన పది సున్నలు పెట్టాలన్నమాట) కిలో గ్రాములు. డయామీటర్ అంటే చుట్టుకొలత 1,392,000 కిలోమీటర్లు అని కూడా ఉంది అక్కడ. అది భూమి నుంచి తొమ్మిది కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. మరీ సరిగా చెబితే.92,955,887.6 మైళ్ళ దూరంలో ఉంది. అంత దూరాన్ని కుదించి 9 కోట్ల 30000 అంటే కొంపేమీ మునగదు. సూర్యుడు అంటే నక్షత్రం. అది చిన్న నక్షత్రం. అది పుట్టినప్పుడు కొంత పదార్థం దూరంగా చిమ్మింది. ఆ పదార్థం ముద్దలు కట్టి గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. భూమి పదార్థంలో కొంత భాగం దూరం పోయి చంద్రగోళం తయారయింది. అది భూమి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు, చంద్రుడు మధ్య పోలిక లేదని తెలిసిపోయింది. సూర్య గోళం మండుతుంది కనుక వెలుగునిస్తుంది. చంద్ర గోళానికి స్వంత కాంతి లేదు. ఈ అక్షరాలను మీరు పగలు చదువుతున్నారంటే, అందుకు అవసరమైన వెలుగు సూర్య గోళం మంట నుంచి వస్తున్నది.

ఆదిత్యాయ, సోమాయ అంటూ మనవాళ్లు గ్రహాలకు దండం పెడతారు. బడిలో మాత్రం సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతుంటాయి, అని చెప్పారు. ఇప్పుడు పాత లెక్క తప్పు, లుతో గ్రహం కాదు. ఉన్న గ్రహాలు ఎనిమిది మాత్రమే అంటున్నారు. మన సంప్రదాయంలో రాహుకేతువులను గ్రహాలు అన్నారు. వాళ్ళిద్దరూ సూర్యుని, చంద్రుని మింగితే గ్రహణం వస్తుంది అని మాకు చిన్నప్పుడు చెప్పారు. ఇప్పటి పిల్లలకు గ్రహణం గురించి బాగా తెలుసు.

ఒక విషయం గురించి రకరకాలుగా చెబితే ఎవరికైనా తికమక, అనుమానం తప్పదు. చంద్రుడు మగ (మనిషి కాదు సుమా!), నక్షత్రాలు ఆయన భార్యలు అన్నారు. సూర్యుడు, (సూర్య గోళం) ఒక నక్షత్రం. దాని చుట్టూ తిరిగే భూమి నక్షత్రం కాదు. సూర్యుని కన్నా చాలా చిన్నది అది. ఆ భూగోళం చుట్టూ తిరిగే బుజ్జి గోళం చంద్రుడు. లేదా చంద్రగోళం. ఆయనకు నక్షత్రాలు భార్యలు అంటే అది పొసగని సంగతి.

సంప్రదాయంలో చెప్పే సంగతులు వేరు. ప్రత్యక్షంగా మనం చూసేది వేరు అని ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. తికమక అవసరం లేదు. ఎవరినీ తప్పు అనడం అంతకన్నా అవసరం లేదు. పడమటి దేశాల వారు చంద్రుడిని స్త్రీగా భావిస్తారని ఎవరికైనా తెలుసునా కానీ అది నిజం.

ఋగ్వేదంలో ఒక మాట ఉంది. కాంతిగల, కాంతి కలిగించే కాంతి వెలిగితేనే, మొత్తం విశ్వమంతా వెలుగుతుంది, అని అక్కడ చెప్పారు. పాశ్చాత్య నాగరికతలో సూర్యునికి అపోలో అని పేరు. అపోలో అంతరిక్ష నౌకలు సూర్యుని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అవి చంద్రగోళ మీద దిగాయి కూడా.

అన్నింటికీ మించి గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. సూర్య గోళం నుంచి భూగోళం వరకు గల దూరం ఎంతో విచిత్రమయినది. అంతకన్నా దగ్గరగా, లేక దూరంగా ఉన్న గ్రహాల మీద జీవం లేదు. ఇన్నర్ ప్లానెట్స్ అనే దగ్గర గ్రహాలు మండిపోతుంటాయి. దూరం గ్రహాలు చెప్పరానంత చల్లగా ఉంటాయి. భూగోళం మీద మాత్రమే నీరు ఉంది. అది ఆవిరి, నీరు, మంచు అనే మూడు స్థితులలో ఉండగలుగుతుంది. కనుకనే ఇక్కడ జీవం ఉంది. నీటిని, సూర్యుని వెలుగును వాడి జీవం పిండి పదార్థం అనే తిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నది. జీవుల మనుగడకు సూర్యుడే ఆధారం. వానలు కురిసి అంతా బురద అయిన తర్వాత మళ్లీ ఎండకాస్తే, పరిస్థితి మామూలు అవుతుంది. భూమి మనకు తగిన విధంగా పొడిబారుతుంది. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదు. పగలు, రాత్రులు లేవు. రుతువులుండవు. వర్షాలు కురవవు!

ఇంతకూ సూర్యుడు అనాలా సూర్య గోళం అనాలా ఎవరైనా చెపితే బాగుంటుంది!