Showing posts with label column. Show all posts
Showing posts with label column. Show all posts

Tuesday, March 24, 2026

భాషలు - భవిష్యత్తు


భాషలు - భవిష్యత్తు

 

నాలుగవ తరగతి పాఠ్యపుస్తకాల్లో వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, జీవన విధానాల గురించి పాఠాలున్నాయి. వారివారి పండుగల గురించి ప్రత్యేకతల గురించి కూడా, వివరంగా కాకున్నా, చూచాయగా కొంత చెప్పారక్కడ. అందులో మన రాష్ట్రం గురించిన పాఠం చదువుకుని బయట రోడ్డు మీదకు వస్తే, పాపం పిల్లలకు ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి.

 

ఒకప్పుడు మనిషి వేషం, భాష, తీరు, తెన్ను చూచి ఏ ప్రాంతం వారో చెప్పడం వీలయేది. సినారె గారు చెప్పినట్లు, నాగరికత, మన గోచీలు పీకించి ఇరుకు పాంట్లు తొడిగించింది. ఇటీవల ఆడపిల్లలంతా పంజాబీ పద్ధతిలోకి మారిపోయారు. దేశం ఈ చివరనుంచి ఆ చివర వరకు ఏ ప్రాంతం వారయినా ఒక్కలాగే కనబడుతున్నారు. ఇంకొంచెం నాగరికత ముదిరితే, ఇక్కడవారు కారేమో అన్న అనుమానాలకు కారణమవుతున్నారు. నోరు తెరిచి మాటాడడం మొదలు పెడితే, అందరి నోటా ఒకేలాంటి మాట. మాతృభాషలో సంభాషణ అనాగరికతకు గుర్తు.

 

టెక్నాలజీ అందరినీ ఒకే గాట కట్టేస్తుందని అర్థం వచ్చే సూత్రం ఒకటి ఉంది. టెలిఫోను, ఒక కాలంలో, కలిగిన వాళ్ల ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడది పల్లెటూర్లో, గల్లీలో వాళ్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. రూపాయి జేబులో ఉన్నవారెవరయినా టెలిఫోను వాడుకోవచ్చు. అదొక పద్ధతి. టెక్నాలజీ మనకు అందించిన మరొక అద్భుతం టెలివిజన్. అందులో రకరకాల ఛానల్స్, రకరకాల ప్రోగ్రాములు. ఏ కార్యక్రమం ఏ భాషలో తయారయిందో అర్థం కాదు. అసలా మనుషులు మనవాళ్లేనా అని అనుమాన  పడుతుంటే, అచ్చమయిన తెలుగులో మాటలు వినపడడం మొదలవుతుంది. చాణక్యుడు ఒకనాడు హిందీలో మాట్లాడతాడు. మరోరోజు తెలుగులో మాట్లాడతాడు. మరీ కొన్ని ఛానల్స్ లోనయితే అందరూ కలిసి, ఎవరికీ అర్థం కాని భాషలో, కేకలు వేస్తుంటారు. అది సంగీతమని అనుకొమ్మంటారు. ఒక కార్యక్రమాన్ని అరడజను భాషల్లోకి డబ్ చేస్తే గిట్టుబాటు. అందులోని విషయానికీ, కట్టు బొట్టు వగైరా వివరాలకూ, వినబడే భాషకూ పొంతన ఉంటుందా, అన్న ప్రశ్న ఎవరికీ పట్టదు. ఏతావాతా, అందరమూ మనమన భాషలను మరిచిపోతున్నాం. ఇంకా మరిచిపోకుంటే ఇంకొన్ని రోజుల్లో తప్పనిసరిగా మరిచిపోతాం.

కంప్యూటర్ రంగంలో భారతీయులు ఎటుచూచినా జెండా ఎగరేసి, జై అంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇందుకు మనవారికి గల భాషాపాండిత్యం కారణమని గమనించాలా? మనం సులభంగా ఇంగ్లీషు నేర్చుకుని నాలుగు బొట్లేరు ముక్కల నుండి నవల్సు దాకా అప్పజెప్పగలుగుతాం. సల్మాన్ రుష్దీ, విక్రం చంద్రా, చిత్రా దివాకరుని వగైరాల్లాంటి ఆంగ్ల రచయితలను కోకొల్లలుగా ప్రపంచానికి పంచుతాం. మనకు అంటే చదువుకున్న భారతీయులకు, ఇంగ్లీషు చేతగావడం, కంప్యూటరు రంగంలో ఒక పెద్ద అనుకూలమయిన అంశం అయి కూచుంది. చైనా, జపాను వారికి చదువు రాదని కాదు. ఇంగ్లీషు మాత్రం మనకు వచ్చినంత బాగా రాదుగాక రాదు. అదీ సంగతి!

 

కొత్తశకాలు, సహస్రాబ్దాలు వస్తే రానివ్వండి. కొత్తదనాన్ని తెస్తే తేనివ్వండి. కానీ గుర్తించవలసిన సంగతులను మాత్రం కొన్నింటిని గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉంది. వెనకటి సంగతేమో గానీ, ప్రస్తుతం ప్రపంచంలో ఆరువేల భాషలు వాడుకలో ఉన్నాయి. అంటే, ఇంకా ఎవరి భాష వారికి, ఉందనే అనుకోవచ్చు. ప్రగతి గతి ఇలాగే సాగితే, 2100 నాటికి, మిగిలే భాషలు మూడువేలకు తక్కువేనని అంచనా. పండుగలకు ప్రతి దానికీ ప్రత్యేకతలు ఉండేవి. ఫలానా పండుగని ప్రత్యేకంగా పట్టింపులుండేవి. యూరోపు వాడి యంత్రాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అన్ని పండుగలకూ సేమ్యాలు మిగిలి పోయాయి. అవి కూడా మన పాత పద్ధతి సేమ్యాలు కానేకావు. అచ్చంగా అలాగే, ప్రపంచమంతటా ఇంటర్నేషనల్ భాష, అయిన ఇంగ్లీషు ఒక్కటే, మిగిలినా ఆశ్చర్యపడనసరం లేదు!

 

ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అన్ననాడు వారి ఉద్దేశ్యం ఒకటయితే, ఇవాళ నిజంగా ప్రపంచమంతా ఒకటే కుటుంబమయింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో, అయిదవ వంతు మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారట. అందరినీ ఒకేగాట కట్టే సంస్కృతీ విశేషానికి ఉదాహరణగా ముందు ఇంగ్లీషు భాషను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కొంత భాగంలో కొంతకాలం పాటు, సడకులుండేవి. సడకేమిటి? అసహ్యంగా!’ అన్నవాళ్లున్నారు. దాన్ని రోడ్డు అనాలి అని నచ్చజెప్పారు. ఇప్పుడా సడకులన్నీ ఇంచుమించు రోడ్డులయినయి. అదలా ఉంచితే మనం మాత్రం ఇంగిలీషు, కొంచెం తెలుగు శైలిగల టింగిలీషు భాష వంటబట్టించుకున్నాం. వాట్ యార్?’ అన్న మాటలో, యార్ (నేస్తం) అనేది ఉరుదూ మాటని మనకు తోచనే తోచదు. ఇది మన రాష్ట్రానికి, మన దేశానికి పరిమితమయిన పద్ధతి కానే కాదు. ప్రపంచమంతటా ఎవరికి వారు తమదయిన ఇంగ్లీషు మాటకారితనాన్ని తయారు చేసుకుంటున్నారు.

 

ఇంటర్నెట్, ఇతర మల్టిమీడియా మాధ్యమాలను గురించి తలుచుకుంటే, ఇంగ్లీషు తప్ప మరో భాష మిగిలేనా అన్న అనుమానం రాకమానదు. అందరికీ, కనీసం కొందరికయినా అర్థమయే ఇంగ్లీషు ఒకరకమయితే, స్థానిక భాషల పదజాలాన్ని ఇంగ్లీషుతో కలిపి, తయారు చేసే భాషలు మరింత విచిత్రం. ఉత్తర భారతంలో హింగ్లిష్, దక్షిణంలో టింగ్లిష్ అని మనం సరదాగా అనుకుంటాం. కానీ అవసరం వచ్చినప్పుడు, ఇంగ్లీషు వాడికి అర్థమయ్యేలా విషయం చెప్పగలం కూడా! సింగపూర్ లో సింగ్లీష్ ఉంది. అందులో మలయ్, చైనీస్ భాషలు ఇష్టంగా కలిసి ఉంటాయి. అది అక్కడివాళ్లకు తప్పతే మరొకరికి అర్థం కాదట!

 

గోపాలం కె.బి.

17 ఫిబ్రవరి 2001


 

Sunday, December 7, 2025

Lokabhiramam లోకాభిరామం - పోగాలము

లోకాభిరామం

పోగాలము

పోగాలము

వానికి గోపియను పేరుబెట్టిరి. వాడు వాస్తవముగనే ముక్కుమీద గోపము గలవాడాయెను. వాడు నాకు చాలా గొప్ప పేరున్నదనును. ఆ పేరెక్కడనున్నదని ప్రశ్న బుట్టును. కొందరికి వారి పేరు గోడమీద నుండును. గోడ మీదకన్నను, గోడకు తాపితము జేసిన నొక జెక్క మీద చెక్కబడి యుండుననిన కడు సమంజసముగా నుండును. వీనికట్టి పేరు లేదు. అట్లున్న పేరు గొప్ప పేరెట్లగును? అది చెక్క మీద పేరగును. ఒకనికి గొప్ప పేరున్నదన్న నేమి భావము? వాని ప్రతిష్ఠ ఘనముగా నున్నదని గదా! అందుకే పేరు ప్రతిష్ఠలను నొక సమాసమేర్పడినది. అందొకటి యున్న రెండవది గూడ తోడుగా నుండునని భావము.

వానికి తలిదండ్రులు బెట్టిన పేరు గోపాలము. తెనుగున పేరల జివరన డుమువులుండవలెనని గదా వ్యాకరణము. వాడు గోపాలుడు. తమిళమున గోపాలన్‌ అందురు. అది యేకవచనమే. గోపాలర్‌ అన్న గాని బహువచనము గాదు. తెనుగున డు అన్న నేకవచనము. అది యందరికి నచ్చదు. నీవొక్కరివే. కాని నిన్నెవరో ‘మీరు’ అని సంబోధించిన నొక గౌరవము, ఒక యానందము. ఒకప్పుడొకడు నా వద్దకు వచ్చి యేదో ఫిర్యాదు చేయనుండెను. వాడు మాటిమాటికి ‘మేము’ అనుచుండెను. నాకు కొంచెము తిక్క. అది కొంచెము గాదు, పుష్కలముగనున్నది. వానిని ‘ఏదీ, కొంచెము పక్కకు జరుగుమంటిని. వానికర్థము గాలేదు. యేలయని యడిగెను. ‘కొంచెము జరుగుమని మరల యంటిని. నేనధికారిని, అతడు సేవకుడు. కనుక జరిగెను. ఒక్కనివే యుంటివి. మాటిమాటికి మేమనుచుంటివి. నీవసలే స్థూలకాయుడవు, వెనుకనెవ్వరయిన యుండిరో చూడవలెనని, జరగమంటిని’ అని వారించితిని. వానికి కొంత అర్థమయినది. కొంత గాలేదు.

డుమువులలో రెండవది ము. రాముడను వాడు ‘రామము’గా మారును. అది యేకవచనమా? ఎన్ని పదములున్నవను యనుమానమేరికిని గలుగదు. అదియును ఒకనినే సూచించును. అయినను, అవగాహనము కొరవడినందుకు అందొక సౌలభ్యము దోచును. ఈ గోపియను కోపికి, గోపాలము అనిపేరు వడినది. పట్నము పాపమని యెవ్వరును వ్రాయుట లేదు. పట్నం అని వ్రాయుచున్నారు. ఎక్కడికి బదులుదేరితివని ప్రశ్న. పట్నమునకని ఉత్తరువు. అంత పట్టింపు లేనివారు ‘పట్నానికి’ అని బదులిత్తురు. ఈ మధ్యన పుస్తకములు, పత్రికలలో గూడ ‘పట్నంకు’ అను ప్రయోగము గనుపించుచున్నది. సంస్కృతమున విభక్తి ప్రత్యయములున్నవి. నగరం అన్న మాటలో నగరమునకు అను నర్థము గూడ నిమిడియున్నది. నగరమునందు, అనుటకు నగరే యనవలయును. మన వారు నగరంనందు యని నగుబాట్లగుదురేమో? భాషయననది ప్రవహించు నది వంటిది. మారుచుండ వలెను. నిజమే. కానీ మార్పు వలననెవరికో కొంత వెసులు బాటుండదగును. గోపాలము, తన పేరు గోపాలం అని వ్రాయును. నా పేరు, నా యిచ్చ యనుకొన్నాడేమో? డుమువులున్నంత కాలమది తెనుగు పేరు. అవి లేకున్ననది దెగులు పేరు.

ఒక గాయకుడు వచ్చెను. భజరే గోపాలం, అని పాటబాడెను. గోపాలుని భజింపుమని గదా పాట యర్థము? రామ శబ్దమకారాంతము. రామముగా వ్రాసిననది డుమువులు పద్ధతిలో పేరు. రామం అని వ్రాసినచో నది సంస్కృత శబ్దమగును. రామునికను నర్థమిచ్చును. ఈ గోపాలమను వాడు బ్రౌను దొర రాసిన తెనుగు నిఘంటువును అచ్చునకు తయారు జేయు కార్యక్రమమునందు పాలుగొనెను. యంత్రమునందు అక్షరముల పొందిక జేయునపుడు, పదముల యంతమందుండు ము వర్ణమును పూర్ణానుస్వారముగ మార్చవలెనని ప్రచురణకర్తలు ప్రస్తావన దెచ్చిరి. వీడు, ఎంతమాత్రము కుదరదనెను. మనము నిఘంటవును, పరిష్కరించుట లేదు. మన యిచ్చవచ్చినట్టు మార్పులు జేయుట తగదని వారికి నచ్చజెప్పెను. అంతటి యాలోచనము గలిగిన వానికి స్వకీయ నామధేయము గురించి మాత్రము సత్యము దోచియుండ లేదెందులకు?

ప్రథమ విభక్తి యందు మూడవ యక్షరము ‘వు’. ప్రభు శబ్దము దెనుంగన ప్రభువుగా మారును. వధూ శబ్దము వధువుగా పరివర్తనము జెందును. సేతువు తీతువు అను మాటలున్నవి తీతువనగా తీయుదువని గాదు. తీతువనునది యొకానొక పక్షివిశేషము. గోపాల శబ్దమునకు మాత్రము వ్యాకరణమున నియమము లుండవు. ఇప్పుడు సమాజమున గరణములు లేరు. ఉన్నను వారు గరణీకము జేయుటలేదు. భాషల యందు వ్యాకరణమును నట్లే మృగ్యమగుచున్నది. ఆంగ్లమును గూడ నడుము విరిచి, ఎవరి చేతయిన రీతిని వారు వ్రాయుచున్నారు.

భాషయనునది భావ వినిమయ మాధ్యమము. ఎదుటి వారికి నీవు జెప్పునట్టిదేదో తలకెక్కిన చాలునని యర్థము. బిచ్చగానిని కొందరు పైకి బొమ్మందురు. అనగా మరియొక యింటికని వారి లెక్క. పైకి బోవుట యన్న ప్రాణము బోవుట యనుట గూడనున్నది. జనుల భాష ఈ తీరున నానాటికి తీసికట్లగుచుండగా, పత్రికలు, టెలివిజనుల వారు మరింత కృతకమయిన భాషను వాడకలోకి దెచ్చియుండిరి. ‘లోతట్టు ప్రాంతములు జలమయమయినవి. జనము తీవ్ర ఇబ్బందులకు గురయి వాపోవుచున్నారం’దురు. వాపోవుటయనగా వానికి దెలియునా? నోరంతయు దెరిచి బొబ్బబెట్టుట. జనులు ‘వా’ యని యంగలార్చుచుండిరా? తీవ్ర యిబ్బందులనునది సరియగు సమాసము గాదు. అటువంటివే, నేపథ్యము, పరిస్థితి వంటి మాటలు లేక వారికి వాక్యము వీలుగాదు. తెలుగు నేర్పెడి గొప్ప పండితుడొకడు సమయలేమి, లేదా అటువంటి మాటయేదో వాడెను. ఆయనకు ఎవరు జెప్పవలెను? తప్పు దెలుసుకొనుట ఒక ఎత్తు. దానిని అంగీకరించుట మరియొక ఎత్తు. ఈ రెంటి తరువాత సరిదిద్దుటయను స్థాయి వచ్చును.

భాష పరిణామశీలము. ఇది సత్యము. పరిణామమనగా, ఏదియో యవసరము, వెసులుబాటు కొరకు కొన్ని మార్పులు రావచ్చును. కడుపుగోసినను మాటరాని వారి వలన భాష భ్రష్టువట్టిన యది పరిణామ మనబడదు!

గోపాలమునకు మద్రాసను, చెన్నపట్నమునుంచి ఉత్తరమొకటి వచ్చెను. దాని మీద వీని పేరు ‘కపాలమ’ని వ్రాసియున్నది. కొత్త పేరు దొరికినదని వాడెంతో సంతసించెను. అట్టి వానికి, వాని పేరు సరిగా లేదని జెప్పుట ఎట్లు?

ఇందొక విషయమున్నది. ఒకటి యనగా రెండు. మొదటిది గోపాలమనువాని పేరును గురించిన వాక్యార్థము. వాని పేరెట్లున్నను కడమ వారికి పట్టదు. కనుకనే పోగాలము అన్ననుగూడ వాడు బహుశా పలుకును. పేరు ఎవరికి వారు ఇష్టపూర్తిగా పెట్టుకొనునది కాదు. తల్లిదండ్రులు నిర్ణయింతురు, ఆ పేరుతో పిలుచుచుందురు. కొంతకాలము వరకు అది తన పేరని ఏరికిని ధ్యాసయే యుండదు. కొన్ని వందల సార్లు అందరును అదే పేరుతో పిలిచినందుకు, ఇది నా పేరను నిర్ధారణము కలుగును. ఈ గోపాలమను వాడు ఈ మధ్య వరకు తన పేరు గురించి అంతగా పట్టించుకోలేదనునది సర్వవిదితము. కానీ ఈ మధ్య వాడు తన పేరును ‘విజయగోపాలుడని’ వ్రాసుకొనుచున్నాడు. ఇందొక విషయమున్నది. వాని భార్యామణి పేరు విజయ. ఆపె వలన వీనికి కడు విజయములు చేతికందినవి. కనుక వాడట్లు పేరు పెట్టుకొనెను.

మరి రెండవ విషయముండవలెను గద! అది భాషకు సంబంధించినది. తెలుగనునది యిట్లు గూడ యుండెనని అందరు మరిచిరి. చిన్నయసూరి పద్ధతి తెలుగు మరొక రకము. అనవుడు, నావుడు అను మాటలకర్థము తెలియక బడి పంతుండ్లు కూడ తికమక పడిన సంగతి చెప్పుచుందురు. అది తెలుగు కాదనుటకు లేదు. అందులోని కమ్మదనము అందిన వారికి అది అమృతోపమానముగ దోచును. ఇక ప్రాంతములను బట్టి మాట తీరనునది గూడ మరియొక విశేషము. యాస, భాష అను రెండు మాటల మధ్యన అంతరము తెలుసుకొనవలెను. ఈ రెంటిలో ఏదయినను భాషలో మాధుర్యము, భావము  పలికినంత వరకు అది యంగీకార యోగ్యమే. కానీ మిడిమిడి జ్ఞానము వలన తప్పులు వ్రాయుటను మాత్రము సహించకూడదు,. ఈ మధ్యన ఎటుచూచినను జనము పోటెత్తుచుండిరట. నీరు కూడ పోటెత్తునట. ఏదో జరిగినది అని చెప్పుటకు జరిగిన పరిస్థితి అనుట ఒక యాచారమయినది. ఇట్లు చాల విషయములు మాట్లాడవచ్చును. వాటిని మరొకసారి చూతముగాక.

Sunday, November 30, 2025

Lokabhiramam Gauli anaga Balli లోకాభిరామం - గౌళి అనగా బల్లి

లోకాభిరామం

గౌళి అనగా బల్లి


పల్లి పసాదం
నగరేషు కాంచీ అన్నారట. నగరాలలోకి నగరం కాంచీపురమేనని భావం. కాంచీపురం, కాంచీ అయింది. మరింత కుంచించి కంచి అయింది. అది నిజానికి కొంచెం చిన్న నగరమే. కానీ, ఒకే ఊళ్లో అన్ని గుడులు. మళ్లీ కుంభకోణంలోనే అనుకుంటాను, ఉండడం. ఈ రెండు చోట్లా అడుగడుగున గుడి ఉంది. (అందరిలో గుడి ఉందా? ఉండే ఉంటుంది. ఈ మాటలతో ఒక సినిమా పాట ఉండేదని మనవి!) ఎన్ని గుళ్లున్నా కంచిలో అందరూ వెళ్లేది మాత్రం మీనాక్షి అమ్మవారి దగ్గరికి. అంతకన్నా ఎక్కువగా వరదరాజ స్వామి గుడికి.
గుడి - గుడులు - గుళ్లు ఒక మాట! గుండు - గుండ్లు - గుళ్లు మరో మాట. ఈ రెండు రకాల గుళ్లకు తేడా ఉంది. తిరుపతి - తిరుమలల్లో గుడులు, గుళ్లు ఉంటాయి. తిరిగి వచ్చేటప్పుడు గుండ్లు, గుళ్లు ఉంటాయి. కంచి గుడులలో గుండు కొట్టుకునే ఆచారమేమీ లేదు. కానీ అక్కడ యాత్రలలో గుండ్లు, గుళ్లు కనపడతాయి. తిరుపతి నుంచి కంచికి చాలా తక్కువే దూరం. యాత్రలకు బయలుదేరిన వారు సాధారణం తిరుపతి నుంచి కంచికి పోతారు. అక్కడ నుంచి శ్రీరంగం, మరో క్షేత్రం.
కాంచీపురంలో ఒక చివరన అమ్మవార్లు కామాక్షమ్మ కొలువుతీరి ఉంటే, మరో చివరన వరదులుంటారు. ఆయన నిజమయిన పేరు దేవాధిరాజ పెరుమాళ్‌. ఆయన ఉత్సవంలో తుపాకులు, వందిమాగదులు వంటి రాజోపచారాలు ఎక్కువగా ఉంటాయి. కంచిలో శివకంచి, విష్ణు కంచి అని విభాగాలుండేవట. అట్లాంటి పేర్లు నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ, వరదుల కోవెలకు దారి తీసే నగర భాగం పేరు చిన్నకంచి! ఆ గుడిలోకి వెళ్లిన తరువాత అడుగడుగునా తెలుగు. ఈ కాలం బోర్డుల సంగతి పక్కనబెట్టండి. మెట్టుమెట్టునా, గోడలలో తెలుగు పేర్లు మాటలు చెక్కి ఉన్నాయి.
వరదరాజ స్వామి గుడి మనం ఊహించిన గుడివలె ఉండదు. మరీ పెద్ద ఆవరణం. ఎన్నో మండపాలు. ఒక పెద్ద కోనేరు. మరీ పెద్ద తోట కూడా ఉంటాయక్కడ. దేవుడు కొన్ని రోజులపాటు వెళ్లి తోట లోని మండపంలో ఉంటాడు. అక్కడ తోట ఉత్సవం (తోటోత్సవం) జరుగుతుంది.
ప్రవేశించగానే ఉండే పెద్ద ఆవరణలో ఒక పక్కన ఒక చిన్న మండపం ఉంది. అక్కడ నుంచి ఒకాయన కొన్ని తినుబండారాల పేరు చెప్పి ‘పల్లి పసాదం దీస్కో!’ అంటూ అరుస్తున్నాడు. ఇక్కడ వేరుశనగ కాయలు, పల్లీ లేదా ఫల్లీలు ప్రసాదంగా పెడతారేమోనను కున్నాను. కానీ అట్లాగేమీ కనిపించలేదు. పులిహోర, చక్ర పొంగలితోబాటు, లడ్డు, చక్కిలాలు, అతిరసం లాంటివి ఉన్నాయి. కొందరికి అరిసెలుగా తెలిసిన అతిరసాలు ఇక్కడ ఉన్నంత రుచిగా మరెక్కడా ఉండవని అనుభవం మీద తెలుసుకున్నాను. అనుకోకుండా దొరికిన మైసూర్‌పాకు ప్రసాదం కూడా మహా రుచిగా ఉంది. అన్నింటికన్నా స్పెషల్‌ కొడల ఇడ్లీ. అరటి మానులాగ గుండ్రంగా, మూరెడంత పొడుగుంది ఒక ఇడ్లీ. ఒకరిద్దరే ఉంటే దాన్ని కొన్నా తినలేరు. అరడజను మందికి ఒక పూట అది ఆహారంగా సరిపోతుంది. ఈ రకం ఇడ్లీ కంచిలో మాత్రమే దొరుకుతుంది. అక్కడి హోటేళ్లలో కూడా, కొన్ని (చాలా తక్కువ, ఒకటి రెండు) చోట్ల మాత్రం దొరుకుతుందది. అక్కడయితే ఒకరికి సరిపడేంత యిస్తారు. నేనడిగిన చోటే, ‘బుధవారమయితే ఉంటుంది’ అన్నారు. గుళ్లో, నా వేషం కారణంగా దొరికిన చిన్న ముక్కతోనే సంతృప్తి పడవలసి వచ్చింది.
పల్లి అన్న మాట ముందు వచ్చింది. మధ్యలో వచ్చింది. సంగతి మాత్రం రాలేదు. గుర్తుంది. గుడిలోకి ప్రవేశించాము అనుకుని దూరితే అక్కడ నరసింహస్వామి ఎదురవుతాడు. బయటకు వచ్చి మరింత ముందుకు పోతే అందరూ ఒకపక్కన మెట్లెక్కుతుంటారు. బోర్డు ఉంది గానీ, చూడకుండా వెళ్లిన వారికి, అక్కడ పెరుందేవీ తాయారు అనే అమ్మవారు చిరునవ్వుతూ దర్శనమిస్తారు. మేము మొదటిసారి వెళ్లినపుడు, అమ్మవారి గోపురం మీద బంగారు తాపడం లాంటి ఏదో జరుగుతున్నదని ఉత్సవమూర్తిని మాత్రం మరో పక్కన ఉంచారు. అక్కడే దర్శనం. మరింతకూ అసలు స్వామి, వరదరాజు, లేదా దేవాధిరాజ పెరుమాళ్‌ ఏరీ? ఆయన వెతుక్కుంటూ వెళితేగాని దొరకడు. సరయిన తోవచూపే బోర్డులు కూడా లేవు. చుట్టూ తిరిగి ఆవరణలో పూర్తి వెనక్కు వెళ్లాలి. అక్కడ ఒక మూల మెట్లుంటాయి, తెలుగక్షరాలతో సహా. ఎక్కి, తొక్కి ముందుకు, పైకి చేరాలి. తలుపులో ప్రవేశిస్తే, మరో బోలెడన్ని మెట్లుంటాయి. కీళ్ల నొప్పులుగల వారికి ఈ స్వామి పరీక్ష పెడతాడు. ఇంకొంచెం లోపలికి వెళితే, అదిగో స్వామి అంటారు. అక్కడ మళ్లీ మెట్లు! ఆ మీద నిజంగా, నిలువెత్తుకన్నా పెద్ద స్వామి. గాలి సరిగా ఆడని ఆ గుడిలో మనం ఉండేది కొంచెం సేపే! అయినా దేవుడు కనిపిస్తాడు.
దేవాధిరాజ స్వామిని చూచిన తరువాత, అసలు సంగతి నాకు అర్థమయింది. అక్కడ పక్కనే బంగారు బల్లి ఉంటుంది. స్వామిని చూడటానికి టికెట్‌ లేదు. బల్లిని తాకడానికి రెండు రూపాయలు. మరింత ముందుకు వెళ్లి కుడికి తిరిగితే కర్ర మెట్లు ఎక్కాలి. కీళ్లనొప్పులా? ఆపైన పై కప్పులో బంగారు బల్లి, బారెడు పొడుగున తాపి ఉంటుంది. పైకి ఎక్కితేనే అందుతుంది. పిల్లలయితే ఎవరయినా ఎత్తుకోవాలి. బల్లిని ఆ చివర నుంచి ఈ చివర దాకా నిమరాలి. మెట్లు, మరోపక్క దిగి, మరిన్ని మెట్లు, మరికొన్ని మెట్లు దిగి బయటకు రావాలి. ఈ బల్లిని, బల్లిని తాకిన వారిని, తాకిన తర్వాత, బతికున్న బల్లిని ముట్టుకున్నా బాధ లేదని మనవారి నమ్మకం!
ఎన్నిసార్లు చూచినా ఈ గుడిలో నాకు తెలుగు వాళ్లే ఎక్కువగా కనిపించారు. మన వారికి వెంకన్న, ఎంకన్న తెలుసుగానీ, ఈ వరదయ్య గురించి అంతగా పట్టినట్లు లేదు. అందరూ ఈ గుడికి బల్లి కొరకే వస్తారు. దారిలో ‘బల్లి ఎక్కడ?’ అని అడిగిన తెలుగు వారికి, ‘ముందు దేవుడిని చూడాలి. అప్పుడు బల్లి కనిపిస్తుంది’ అని చెప్పాను. అసలు సంగతి వారికి తరువాత అర్థమయి ఉంటుంది. అందరూ వచ్చేది బల్లి కొరకయితే, అక్కడ ప్రసాదం కూడా బల్లి ప్రసాదమే కావాలి గదా? తమిళంలో బల్లిని పల్లి అంటారేమో? అనుమానం లేదు తమిళంలో పల్లి అంటే బల్లి. ఇక తీసుకోండి అనాలని అర్థంకాని ఆ అయ్యవారు ‘పల్లి పసాదం దీస్కో!’ అని అరుస్తున్నాడు. కానీ ఎవరూ ప్రసాదం తీసుకోవడం లేదు. పైసలు లేందే ప్రసాదం లేదు గద మరి!
బల్లిని ముట్టుకుంటే, అది పైన బడితే ఏదో జరుగుతుందని ఎవరన్నారో మరి? బల్లిపాటు ఫలితాల గురించి, అంటే శరీరంలో ఏయే భాగం మీద బల్లి పడితే ఏమవుతుందని చెప్పే పట్టిక ఒకటి ఉంటుంది. శిరస్సున పడితే కలహంతో మొదలయి, గుహ్యం - మరణం అని ఆ లిస్టు అంతమవుతుంది. వెతికి వెతికి బల్లి ముడ్డి మీద ఎప్పుడు, ఎట్లా పడేను? పడదు. వీలు లేదు. పడినా ఎవరూ చావరు!
మన వారికి ఇటువంటి నమ్మకాలు కావలసినన్ని తెలుసు. వాటి వెనుకనున్న సంగతి తెలుసుకోవాలని మాత్రం ఎవరూ ప్రయత్నించరు. కనుకనే వరదయ్య కన్నా ఆయన వెనుకనున్న బల్లికి గొప్ప పేరన్నమాట. వరదయ్య ప్రసాదం బల్లి ప్రసాదంగా మారింది. బల్లి కావాలే కాని దాని ప్రసాదం ఎవరికి కావాలి? పట్టదు గాక పట్టదు.
***
మంత్ర బియ్యం: చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో విన్న ఈ మాట ఈ మధ్యన గుర్తుకు వచ్చింది. దొంగతనం జరుగుతుంది. లేదంటే ఒక పొరపాటు పని జరిగినట్టు తెలుస్తుంది. అది ఎవరు చేసిందీ బయటపడదు. తెలిస్తే గద శిక్ష! అప్పుడు మంత్ర బియ్యం (సమాసం బాగుండలేదు. మంత్రం బియ్యం అనాలి) ప్రయోగిస్తారు. ఆ బియ్యాన్ని ఎవరు మంత్రించి ఇచ్చేవారో గుర్తులేదు. మొత్తానికి అక్షతల వంటి బియ్యం వస్తాయి. అందరికీ కొంచెం కొంచెంగా పెడతారు. ఏ తప్పూ చేయని వారు వాటిని శుభ్రంగా నమిలి తింటారు. తప్పు చేసిన వారు ఆ బియ్యం తింటే ఏదో అవుతుందని ఒక భయం. ఒక పిల్లవాడు బియ్యం తిని వాంతి చేసుకున్నాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు. బియ్యంలో మంత్రం లేదు గానీ, బోలెడు సైకాలజీ ఉందని తరువాత అర్థమయింది. భయం మనిషిని పట్టి ఇస్తుంది.
***
కోదండం: పిల్లవానికి తీవ్రమయిన శిక్ష అంటే ఆ కాలంలో కోదండం వేసేవారు. కోదండం అంటే నిజానికి రాముని బాణం. కానీ ఇక్కడ మాత్రం రెండు చేతులకు కలిపి తాడు పట్టించి, ఆ తాటి నుంచి వాడు పై కప్పులోని కొండి నుంచి వేలాడుతుంటాడు. కింద కంప (ముళ్లుండే కొమ్మలు) ఉంటే మరింత గట్టి శిక్ష! తాడు వదిలి కింద పడలేక, వేలాడలేక, వాడు పడే బాధ వర్ణనకు అందదు. పశ్చాత్తాపానికి దారి తీస్తుందేమో కూడా!

Tuesday, November 4, 2025

Loka 14 Katha cheputanu Ookodatava (కథ చెపుతాను ఊ కొడతావా?

Katha cheputanu Ookodatava
(కథ చెపుతాను ఊ కొడతావా?)


వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. ` ఎవరన్నారో తెలియదు.

---

చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకులకథ, బయిండ్లకథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనేలేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చెప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది.  హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. కథకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.
మా ఇంట్లో బుడ్డన్న పనిచేసే వాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజుకూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాల పాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచు కునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడిరచడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా చంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపే వాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించే వాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.
నేను కథలు రాయకూడదని నిర్ణయించుకున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్‌ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాతతీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంత మంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి. కథ అంటేనే చెప్పబడినది అని అర్థం కదా! 
కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్‌ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసర మయిన మాటలుగానీ, చెప్పిందే మళ్లీ చెప్పడం గానీ ఉండదు. మొదట్లో ఆయన పద్ధతి గొప్పగా ఉందని అనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకు పోయిన పద్ధతేమో అని అనిపించ సాగింది. ఇక మరికొందరు ఉప న్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నా ననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసుకెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉంది గానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూనే ఉంటాయి.
ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నానుగానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడం లోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్నమాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెరమీద లాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్య నారాయణగారిలా అందరూ రచనలు చేసి ఉండక పోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించింది అంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్‌ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్యవరకు నేను కూడా అదే పద్ధతి. అయినాసరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తా పత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించ కూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.
రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ బాగా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలు పెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించే వాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి. అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
aలక్‌ : చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.