Showing posts with label skills. Show all posts
Showing posts with label skills. Show all posts

Saturday, April 25, 2026

అవ్వ - నువ్వుగింజ - పాతకాలపు కథ


అవ్వ - నువ్వుగింజ  

పాతకాలపు కథ


 అవ్వ - నువ్వుగింజ

ఉండంగుండంగుండంగ ఒగ ఊరుండె.

ఆ ఊర్లె ఒగ అవ్వ ఉండె.

ఒగనాడు అవ్వకు నూలగింజ దొరికింది.

నూలగింజను సేతుల వట్టుకోని అవ్వ ఆలోచన జెయ్యసాగింది.

ఈనూలగింజను గొండవొయ్యి నాటువెట్టి నీల్లువోస్త.

చెట్టువెరిగి చారెడు నూలొస్తయి.

చారెడు నూలెల్ల నాటువెడితె సోలెడు నూలొస్తయి.

పొలం కౌలుకు దీస్కోని సోలెడు నూలు నాటువెడితె,

సంచులకొద్ది నూలు వండుతయి.

ఇగేమున్నది? నూలన్ని పట్నానికిగొండవొయ్యి అమ్ముకుంటెనా?

కావల్సినన్ని దుడ్లొస్తయి!

పెద్ద ఇల్లు గట్టుకోవొచ్చు.

ఇంటిచుట్టు చెట్లు వెట్టుకోవొచ్చు.

కావల్సినన్ని పసురాల వెంచుకోవొచ్చు.

పాలువిండుకోవొచ్చు. పండ్లుదెంపుకోవొచ్చు.

అట్లంటని తిని పండుకుంటె అయినట్లెనా

కరువుకాలం దీరిపాయె గనుక

మనుమనికి మంచి పిల్లను జూసి పెండ్లిజేయాలె.

వానికి పెండ్లమొస్తె ఆపిల్లకు తీర్లతీర్ల శీరలు దేవాలె.

సింగారాలు జెయ్యించాలె. రామసక్కటి రయికెలుగుట్టించాలె.

తోటలకెల్లి పూలు దెంపుకొచ్చి పిల్ల సిగెనిండ వెట్టుకుంటది.

అంతట్లనె పిల్లకు కడుపాయెనంటరు.

పూలు ముడిపియ్యాలెనంటరు.

సీమంతం జెయ్యాలె. పిల్ల సిగ్గువడుతది.

శీతమ్మకంటె సక్కగుంటది.

అట్లంటని పండుగజెయ్యకుండ ఉంటమా?

పదిమందికి జెప్పకుండ ఉంటమా?

తొమ్మిది నెలలయి కానుపయితది.

బుడుమకాయెలాగ బుడ్డటి మునిమనుమరాలు వుడ్తది.

ఆ పిల్లకు సక్కటి తొట్లె గట్టిపియ్యాలె.

దానిమీద అస్మానుగిరి వెట్టిపియ్యాలె.

మునిమనుమరాలు కిలకిల నవ్వుతది.

ఇల్లంత ఎన్నెల ఒంపినట్టే ఉంటది.

మునిమనుమరాలు దోగాడుతది.

శిన్న కిష్నుడు కదిలొచ్చినట్టే ఉంటది.

మునిమనుమరాలు అవ్వా అంటది.

పానం లేసొస్తది.

పిల్లకు తీర్ల తీర్ల సోకులుజెయ్యాలె.

ఉగ్గువెట్టాలె. ఎన్న వెట్టాలె. ఎన్నన్న సరే అడిగిందల్ల దెచ్చియ్యాలె.

అంతట్లనె పిల్ల పెద్దగవుతది.

సదువుకెయ్యాలంటరు.

సాలెకు వంపాలంటరు.

సాలెకువొయ్యొచ్చిన పిల్లకు దిష్టే దగిలెనో, గాలే దగిలెనో

ఇంటికి రాంగనే ఉప్పురాళ్లు దిప్పెయ్యాలె.

శిటపటమంటయి.

పిల్ల జరసేపు పండుకుంటది. నిద్రవడితె పెయ్యి నెమ్మదయితది.

మల్ల లేసి దెగ్గరికొస్తది. నెత్తిన శెయ్యివెట్టి గోకుతుంటది.

అవ్వా నొవ్వనే అంటది.

యాడబిడ్డా అంట

నెత్తిలనే అంటది.

ముందర గూసుండవెట్టి నెత్తిన సూతును గదా!

పిల్ల నెత్తి నిండ పేలు!

సాలెల సదువు సంగతేమొగాని పేలు మాత్రమొచ్చినయి!

శిటుక్కున ఒగ పేనును గుక్కుత.

అనుకుంటనే అవ్వ నిజంగనే ఏందో కుక్కింది.

ఆలోచన తెగింది.

సూస్తేమున్నది?

శేతులున్న నూలగింజ నుగ్గు నుగ్గు అయింది!

అంటేమన్నట్టు?

పగటి కలలు పనికిరావు అన్నట్లు!

అవ్వ - నువ్వుగింజ

ఉండంగుండంగుండంగ ఒగ ఊరుండె.

ఆ ఊర్లె ఒగ అవ్వ ఉండె.

ఒగనాడు అవ్వకు నూలగింజ దొరికింది.

నూలగింజను సేతుల వట్టుకోని అవ్వ ఆలోచన జెయ్యసాగింది.

ఈనూలగింజను గొండవొయ్యి నాటువెట్టి నీల్లువోస్త.

చెట్టువెరిగి చారెడు నూలొస్తయి.

చారెడు నూలెల్ల నాటువెడితె సోలెడు నూలొస్తయి.

పొలం కౌలుకు దీస్కోని సోలెడు నూలు నాటువెడితె,

సంచులకొద్ది నూలు వండుతయి.

ఇగేమున్నది? నూలన్ని పట్నానికిగొండవొయ్యి అమ్ముకుంటెనా?

కావల్సినన్ని దుడ్లొస్తయి!

పెద్ద ఇల్లు గట్టుకోవొచ్చు.

ఇంటిచుట్టు చెట్లు వెట్టుకోవొచ్చు.

కావల్సినన్ని పసురాల వెంచుకోవొచ్చు.

పాలువిండుకోవొచ్చు. పండ్లుదెంపుకోవొచ్చు.

అట్లంటని తిని పండుకుంటె అయినట్లెనా

కరువుకాలం దీరిపాయె గనుక

మనుమనికి మంచి పిల్లను జూసి పెండ్లిజేయాలె.

వానికి పెండ్లమొస్తె ఆపిల్లకు తీర్లతీర్ల శీరలు దేవాలె.

సింగారాలు జెయ్యించాలె. రామసక్కటి రయికెలుగుట్టించాలె.

తోటలకెల్లి పూలు దెంపుకొచ్చి పిల్ల సిగెనిండ వెట్టుకుంటది.

అంతట్లనె పిల్లకు కడుపాయెనంటరు.

పూలు ముడిపియ్యాలెనంటరు.

సీమంతం జెయ్యాలె. పిల్ల సిగ్గువడుతది.

శీతమ్మకంటె సక్కగుంటది.

అట్లంటని పండుగజెయ్యకుండ ఉంటమా?

పదిమందికి జెప్పకుండ ఉంటమా?

తొమ్మిది నెలలయి కానుపయితది.

బుడుమకాయెలాగ బుడ్డటి మునిమనుమరాలు వుడ్తది.

ఆ పిల్లకు సక్కటి తొట్లె గట్టిపియ్యాలె.

దానిమీద అస్మానుగిరి వెట్టిపియ్యాలె.

మునిమనుమరాలు కిలకిల నవ్వుతది.

ఇల్లంత ఎన్నెల ఒంపినట్టే ఉంటది.

మునిమనుమరాలు దోగాడుతది.

శిన్న కిష్నుడు కదిలొచ్చినట్టే ఉంటది.

మునిమనుమరాలు అవ్వా అంటది.

పానం లేసొస్తది.

పిల్లకు తీర్ల తీర్ల సోకులుజెయ్యాలె.

ఉగ్గువెట్టాలె. ఎన్న వెట్టాలె. ఎన్నన్న సరే అడిగిందల్ల దెచ్చియ్యాలె.

అంతట్లనె పిల్ల పెద్దగవుతది.

సదువుకెయ్యాలంటరు.

సాలెకు వంపాలంటరు.

సాలెకువొయ్యొచ్చిన పిల్లకు దిష్టే దగిలెనో, గాలే దగిలెనో

ఇంటికి రాంగనే ఉప్పురాళ్లు దిప్పెయ్యాలె.

శిటపటమంటయి.

పిల్ల జరసేపు పండుకుంటది. నిద్రవడితె పెయ్యి నెమ్మదయితది.

మల్ల లేసి దెగ్గరికొస్తది. నెత్తిన శెయ్యివెట్టి గోకుతుంటది.

అవ్వా నొవ్వనే అంటది.

యాడబిడ్డా అంట

నెత్తిలనే అంటది.

ముందర గూసుండవెట్టి నెత్తిన సూతును గదా!

పిల్ల నెత్తి నిండ పేలు!

సాలెల సదువు సంగతేమొగాని పేలు మాత్రమొచ్చినయి!

శిటుక్కున ఒగ పేనును గుక్కుత.

అనుకుంటనే అవ్వ నిజంగనే ఏందో కుక్కింది.

ఆలోచన తెగింది.

సూస్తేమున్నది?

శేతులున్న నూలగింజ నుగ్గు నుగ్గు అయింది!

అంటేమన్నట్టు?

పగటి కలలు పనికిరావు అన్నట్లు!

Tuesday, March 31, 2026

పగిలిన అద్దం - సాదిఖ్ హిదాయత్ (ఇరాన్) In Telugu now!


పగిలిన అద్దం - సాదిఖ్ హిదాయత్ (ఇరాన్)

వసంత రుతువు మొదట్లో పూసిన పువ్వులాగా ఓడెట్ ఫ్రెష్ గా ఉంది. ఆకాశం రంగు కళ్ళు ఆశ గొలుపుతుంటాయి. జుట్టు బుగ్గల మీదకు జారి దోబూచులాడుతూ ఉంటుంది. తెల్లని మృదువైన ముఖంతో ఆమె గంటల తరబడి ఆ కిటికీ ముందు కూర్చుని ఉంటుంది. కాళ్లు ఒకదానిమీద మరొకటి వేసుకుని నవల చదువుతూ ఉంటుంది. లేదంటే ఏ మేజోళ్లనో బాగు చేస్తుంది. అయితే ఆమె తన వయోలిన్ మీద గరిజారి నాట్యం వరుసలు వాయించినప్పుడు మాత్రం నా గుండె ఊగిసలాడుతుంది.
నా గది కిటికీ, ఓడెట్ గది కిటికీకి ఎదురుగా ఉంటుంది. నా కిటికీలో నుంచి ఎన్ని నిమిషాలు, గంటలు, బహుశా ఆదివారం మొత్తం రోజు, ఆమెను చూస్తూ ఉండిపోయానో! అందునా రాత్రి ఆమె తన స్టాకింగ్స్ తీసేసి మంచం మీద చేరే సమయంలో మరీనూ!
ఈ రకంగా మా మధ్యన ఒక చెప్పరాని అనుబంధం ఏర్పడింది. ఒక్కనాడు ఆమెను చూడకుంటే, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఒక్కనాడు ఆమె వైపు మరీ ఎక్కువసేపు చూస్తానేమో, ఆమె లేచి కిటికీ మూసేస్తుంది. ఇద్దరమూ రెండువారాలుగా ఒకరిని ఒకరు గమనిస్తూ ఉన్నాము. అయితే ఆమె పట్టనట్టు మ్లానంగా ఉండేది. ఆమె కనీసం చిరునవ్వలేదు. నాపట్ల తన భావాలు తెలిసే రకంగా ఏ కదలికా చేయలేదు. అయితే ఆమె చూపులు సీరియస్ గా ఉన్నాయి.
ఒక ఉదయాన ఆమెకు నేను నేరుగా ఎదురుపడవలసి వచ్చింది. అప్పుడు నేను తిండి తినడానికి వీధి చివరి కెఫేకు వెళుతున్నాను. బయటకు రాగానే ఓడెట్ కనిపించింది. చేతిలో వయోలిన్ పెట్టెతో ఆమె మెట్రోవేపు పోతున్నది. హలో, అన్నాను. ఆమె చిన్నగా నవ్వింది. ఆమె వయోలిన్ పెట్టె పట్టుకోవచ్చా, అని అడిగాను. అంగీకారంగా తల ఆడించింది. తాంక్స్, అన్నది. ఆ ఒక్క మాటతో మా పరిచయం మొదలయింది.
ఆనాటి తర్వాతే మేము కిటికీలు తెరిచినప్పుడుల్లా ఒకరితో ఒకరం మాట్లాడుకో సాగాము. దూరం నుంచే సైగలతో సంభాషణ సాగేది. ప్రతిసారి ప్రతిఫలంగా మేము లూగ్జెంబూర్గ్ గార్డెన్ కు చేరి కలుసుకునేవాళ్ళము. తరువాత ఏదో సినిమాకు, నాటకానికి గాని వెళ్ళాము. లేదంటే మరేదో పద్ధతిలో ఒకరితోబాటు మరొకరుగా, గంటల తరబడి గడిపాము. ఓడెట్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తల్లి, ఆమె గారి రెండో భర్త, ఎక్కడికో వెళ్లారు. ఉద్యోగం పేరున ఆమె మాత్రం పారిస్ లోనే ఉండిపోయింది.
ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది. అయితే చిన్న పిల్లల మనస్తత్వం గలది. కొంచెం మొండిరకం కూడా. ఒక్కోసారి నాకు కోపం తెప్పించేది. రెండు నెలలపాటు మేము దోస్తీ కొనసాగించాము. ఒకనాడు, ఆ సాయంత్రం న్యూలీలో జరిగే సంతకు పోవాలనుకున్నాము. ఆ రాత్రి ఓడెట్ తన కొత్త నీలిరంగు డ్రెస్ వేసుకున్నది. మామూలుకంటే ఎక్కువ సంతోషంగా కనిపించింది. మేము రెస్టొరాంట్ నుండి బయటకు వచ్చి మెట్రో దిక్కువగా నడుస్తుంటే, ఆమె దారి పొడుగునా తన బతుకు గురించి చెప్పింది.
జనం గుంపులుగా వస్తున్నారు, పోతున్నారు. వీధివెంట అన్నిరకాల సరదా వ్యాపారం సాగుతున్నది. ఎంటర్టేనర్స్ ప్రదర్శనలు చేస్తున్నారు. షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. లాటరీ టికెట్, మిఠాయిలు, సర్కస్, చిన్న ఎలక్ట్రిక్ కార్లు, గిరగిరా తిరిగే బెలూన్లు, మరేమో రైడ్స్, రకరకాల ప్రదర్శనలు, అన్నీ ఉన్నాయి. అమ్మాయిల అరుపులు, మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. గుసగుసలు కూడా. అవి మోటార్ల ధ్వనులు, సంగీతాలలో కలిసి పోతున్నాయి.
మేము కార్ రైడ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అది ఒక కారు కాదు. కొన్ని కార్లు, ట్రెయిన్ లాగా, ఒక దానికి ఒకటి తగిలించి ఉంటాయి. అవి ఒక గుండ్రని దారిలో తిరుగుతాయి. కదిలేటప్పుడు పైన ఒక గుడ్డతో కప్పు వేస్తారు. బయట నుంచి చూసే వారికి అవి ఒక పచ్చని పురుగులాగా కనిపిస్తాయి. ఎక్కుతూ ఉన్నప్పుడు, ఓడెట్ తన గ్లోవ్స్, పర్స్ నా చేతికి యిచ్చింది. రైడ్ సమయంలో పడిపోకుండా అది జాగ్రత్త. మేము పక్కపక్కనే దగ్గరగా కూచున్నాము. రైడ్ స్టార్టయింది. పచ్చని పైకప్పు వేసి, ఐదు నిమిషాల పాటు మమ్మల్ని ఎవరికీ కనబడకుండా దాచేశారు.
కవర్ తీసేశారు. మా పెదవులు మాత్రం కలిసే ఉన్నాయి. నేను ఓడెట్ ను ముద్దు పెట్టుకుంటే ఆమె అడ్డు చెప్పలేదు. మేము దిగి నడుస్తుంటే, శుక్రవారం మార్కెట్ కు రావడం తనకు ఇది మూడవసారి మాత్రమే అని ఆమె చెప్పింది. వాళ్ళ అమ్మ వద్దని ఆంక్ష పెట్టింది. ఇక మేము ఏవేవో ప్రాంతాలు చూస్తూ తిరిగాము. బాగా అలసిపోయి, తిరుగుదారి పట్టే సమయానికి నడిరాత్రి అయింది. అయినా ఓడెట్ వెళ్లడానికి యిష్టపడలేదు. ప్రతి షో దగ్గర ఆమె ఆగుతుంది. నేను ఆగక తప్పదు. రెండుమూడు మార్లు ఆమె చేయి పట్టుకుని లాక్కుపోవలసి వచ్చింది. ఆమె తప్పక నావెంట వచ్చింది. చివరకు ఆమె జిల్లెట్ రేజర్ బ్లేడ్ అమ్మే స్టాల్ ముందు ఆగింది. అంగడి మనిషి ప్రదర్శన చేస్తూ ఉపన్యసిస్తున్నాడు. ఈసారి నాకు బాగా కోపం వచ్చింది. చెయ్యి పట్టి గట్టిగా లాగాను. ఆడవాళ్లకు సంబంధం లేని సంగతి అన్నాను. ఆమె చెయ్యి లాగేసుకున్నది. తెలుసు, అయినా చూస్తాను, అన్నది.
జవాబు చెప్పకుండా మెట్రో వేపు నడిచాను. ఇల్లు చేరేసరికి వీధిలో మనుషులెవరూ లేరు. ఓడెట్ కిటికీ చీకటిగా ఉంది. నేను నా గదిలోకి వెళ్లి లైట్ వేసాను. కిటికీ తెరిచాను. నిద్ర రావడం లేదు. కొంతసేపు ఏదో చదివాను. ఒంటిగంట అవుతున్నది. కిటికీ మూసి పడుకుందామని లేచాను. ఓడెట్ తన కిటికీ కింద, వీధి దీపం వెలుతురులో నిలబడి ఉంది. నాకు ఆశ్చర్యం కలిగింది. గట్టిగా కిటికీ వేశాను. దుస్తులు మారుస్తుంటే ఓడెట్ పూసల పర్స్, గ్లోవ్స్, నా జేబులో ఉండడం గుర్తుకు వచ్చింది. డబ్బులు, ఇంటి తాళం చెవి, పర్సులో ఉన్నాయని తెలుసు. వాటిని గట్టిగా కట్టి కిటికీలో నుంచి పడేశాను.
మూడు వారాలు గడిచాయి. అంతకాలమూ నేను ఆమె గురించి పట్టించుకోలేదు. తన కిటికీ తెరిస్తే, నాకిటికి మూశాను. ఈ లోపల నేను లండన్ వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. బయలుదేరడానికి ఒక నాడు ముందు, ఒకసారి ఆమె, తన వయోలిన్ పెట్టెతోబాటు మెట్రో వేపు పోతూ వీధి చివరన ఎదురు పడింది. హలో, అని నాలుగు మాటలు మాట్లాడాను. నా ప్రయాణం గురించి ఆమెకు చెప్పాను. రాత్రి నా ప్రవర్తన గురించి క్షమాపణ కూడా చెప్పాను. ఓడెట్ తన పూసల పర్స్ తెరిచి, ఒక అద్దం తీసి, నా చేతికి యిచ్చింది. అది మధ్యలో పగిలి ఉంది. కిటికీలోనుంచి నీవు పర్స్ పడేసినప్పుడు అది పగిలింది. దాంతో దురదృష్టం వస్తుందని తెలుసా? అడిగింది.
నేను జవాబుగా నవ్వాను. ఛాదస్తం, అన్నాను. వెళ్లే లోగా మళ్ళీ కలుస్తానని మాట యిచ్చాను. అయితే అది కుదరలేదు.
లండన్ లో ఒక నెల గడిచిన తర్వాత ఓడెట్ నుంచి ఉత్తరం వచ్చింది.
ప్యారిస్, 21 సెప్టెంబర్ 1930
ప్రియాతి ప్రియ జెమ్ షీడ్,
ఎంత ఒంటరిగా ఉన్నాను నీకు తెలియదు. ఒంటరితనం నన్ను బాధిస్తున్నది. ఈ రాత్రి నేను నీకు కొన్ని సంగతులు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే, ఉత్తరం రాస్తుంటే, నీతో మాట్లాడుతున్నట్టే ఉంది. నేను ఇంత సులభంగా నీవు అంటున్నందుకు క్షమించు. నా బాధ ఏమిటో నీకు తెలిస్తే బాగుండును!
దినాలు ఎంత పొడుగయ్యాయి? గడియారం ముళ్ళు మరీ మెల్లగా కదులుతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. నీకు కూడా కాలం బరువుగానే సాగుతున్నదా? అక్కడ బహుశా మరో అమ్మాయిని కలిసి ఉంటావు. అయితే నీ తల ఎప్పుడూ పుస్తకంలోనే మునిగి ఉంటుందని తెలుసు! అయినా! ఇక్కడ ప్యారిస్ లో అట్లాగే ఉండే వాడివి కదా! నీ చిన్న గది ఎప్పుడూ నా కళ్ళ ముందు మెదులుతుంది. ఒక చైనీస్ విద్యార్థి అందులోకి వచ్చాడు. నేను నా కిటికీ మీద మందం కర్టన్ వేసి ఉంచాను. బయటకు ఇక కనిపించదు. నాకు ప్రియతముడు అక్కడ లేడు గదా! అదేదో పాటలో పల్లవి అలాగే ఉంటుంది. మరో దేశానికి వెళ్లిన పక్షి తిరిగి రాదు! అని.
నిన్న హెలెన్ తో లూగ్జెంబూర్గ్ పార్క్ లో తిరగబోయాను. ఆ రాతి బెంచ్ దగ్గరకు పోయే సమయానికి నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. అదే బెంచ్ మీద ఇద్దరమూ కూర్చున్నాము. నీవు మీ దేశం గురించి మాట్లాడావు. ఎన్నెన్నో ప్రమాణాలు చేశావు. నేను అన్నీ నమ్మాను. ఇప్పుడు నా స్నేహితులంతా నన్ను ఆటపట్టిస్తున్నారు. అందరూ నా గురించి ఏవో అంటున్నారు. నిన్ను గుర్తుంచుకోవడానికి గరిజారి వాల్ట్స్ వాయిస్తుంటాను. నీతో పాటు తీయించుకున్న ఫోటో బల్లమీద ఉంది. ఆ బొమ్మ చూచినప్పుడల్లా నమ్మకం పెరుగుతుంది. మోసం చేయదు, అనుకుంటాను. అయితే నీవు కూడా అట్లాగ అనుకుంటున్నావో లేదో తెలియదు. ఆ రాత్రి నా అద్దం పగిలిన తర్వాత, నీవే దాన్ని నాకు తిరిగి ఇచ్చావు మరి, నా గుండె నన్ను హెచ్చరిస్తున్నది. జరగకూడనిదేదో జరుగుతుంది, అంటున్నది. మనం చివరిసారిగా కలిసిననాడు, ఇంగ్లాండ్ వెళుతున్నాను, అన్నావు. నీవు చాలా దూరం వెళ్ళిపోతున్నావని నా హృదయం ఆనాడు చెప్పింది. మళ్ళీ కలువలేమన్న అనుమానం మొదలైంది. అనుకున్నంతా జరిగింది. ఎందుకంత దుఃఖంగా ఉన్నావు? అని మేడం బ్లోరే అడిగారు. ఆమె నన్ను తనతో బ్రిటనీ తీసుకు వెళతానన్నారు. అయితే నేను వెళ్లలేదు. అక్కడ పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుసు.
సరేలే, పట్టించుకోకు. జరిగిందేదో జరిగింది. నా మాటలు ఒక రకంగా ఉంటే, అందుకు కారణం ఉంది. నన్ను దయచేసి క్షమించు. నిన్ను కష్టపెట్టి ఉంటే, నన్ను మరిచిపోతావని అనుకుంటున్నాను. నా ఉత్తరాలన్నీ, కాల్చివేస్తావు. అంతేనా జిమ్మీ!
ఈ క్షణాన ఎంతటి బాధ, దుఃఖంలో ఉన్నానని నీకు తెలిస్తే మేలు. నేను అన్నింటితోను విసిగిపోయాను. పనిలో కూడా మనసు నిలవడం లేదు. ఇంతకు ముందు అట్లా ఉండేది కాదు. ఇంకా, ఇట్లా వేలాడబడి ఉండడం ఇష్టం లేదు. మిగతా వాళ్లకు నావల్ల దుఃఖం కలగవచ్చు. అందరి బాధ ఒక్కచోట చేర్చినా, నా బాధకు సరిరాదు. ఆదివారం నాడు పారిస్ వదిలి పోవాలని నిర్ణయించాను. ఆరున్నర ట్రెయిన్ లో కలేస్ పోతాను. అక్కడి నుంచే కద, నీవు వెళ్ళిపోయింది. ఇక సముద్రంలోని నీలి నీళ్లను చూస్తాను. అవి అన్ని దురదృష్టాలను కడిగేస్తాయి. ప్రతిక్షణం వాటి రంగు మారుతూ ఉంటుంది. అది దుఃఖమయ మంత్ర శక్తి గురగురతో తీరం ఇసుకను తాకుతుంది. నురగలు పుడతాయి. ఇసుక ఆ నురుగను కొరుకుతుంది. మింగేస్తుంది. ఇక ఆ అలలు నా చివరి ఆలోచనలను తమతో మోసుకుపోతాయి. మరణం ఒకరిని చూచి ముసిముసిగా నవ్విందంటే, ఆ నవ్వుతో వద్దకు లాక్కుంటుంది. అటువంటిది ఏదీ ఉండదని నీవు అనవచ్చు. నేను అబద్ధాలు చెప్పలేదని నీవు చూస్తావు.
దూరం నుంచి నా ముద్దులు అంగీకరించు,
ఓడెట్ లా సూర్
జవాబుగా నేను ఓడెట్ కు రెండు ఉత్తరాలు రాశాను. ఒక దానికి జవాబు రాలేదు. మరొకటి తిరిగి వచ్చింది. మరుసటి సంవత్సరం పారిస్ కు తిరిగి వెళ్ళాను. వీలైనంత త్వరగా సెయింట్ జాక్వెస్ వీధికి వెళ్లాను. అక్కడే నా పాత మకాం ఉండేది. నా గదిలో నుంచి ఒక చైనీస్ విద్యార్థి గరిజారీ నాట్యగీతం వరుసలు ఈల వేస్తున్నాడు. ఓడెట్ గది కిటికీ మాత్రం మూసి ఉంది. ఇంటి తలుపు మీద టు లెట్ అని కాగితం అతికించి ఉంది.

 


 

Thursday, March 19, 2026

నది నాతో మాట్లాడినది - దాశరథి కవిత 1


నది నాతో మాట్లాడినది

దాశరథి కవిత








 

Wednesday, March 18, 2026

గాలివాన - వ్యాసం : పాలగుమ్మి పద్మరాజు గారి గురించి


గాలివాన - వ్యాసం

పాలగుమ్మి పద్మరాజు గారి గురించి









 

మగునీ ఎద్దుల బండి ఒరియా మూలం - గోదావరీష్ మొహపాత్ర అనువాదం - కె. బి. గోపాలం


మగునీ ఎద్దుల బండి   

ఒరియా మూలం - గోదావరీష్ మొహపాత్ర   

అనువాదం - కె. బి. గోపాలం 

జననాలు, మరణాలు: రెండు లక్షల జనాభా ఉన్న ఖాలీకోట్ లో తప్పనిసరిగా ఈ రెండు ఉండనే ఉన్నాయి. అయితే వాటి సమాచారం మాత్రం కుటుంబాలు, పరిసరాల పరిధిని దాటి ఎన్నడూ ప్రయాణించింది లేదు. కానీ, మగునీ చనిపోయిననాడు మాత్రం వార్త ఊరంతా వ్యాపించింది, మరింత దూరం కూడా పోయింది. విన్న వారంతా, కాసేపు మ్లానంగా ఉండిపోయి, అయితే బీద వెధవ పోయాడన్నమాట! ఎంత అన్యాయం! అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు.

ఇంతకు ఎవరా మగునీ? ఖాలీకోట్ మహారాజా? లేక మరో పక్కరాజ్యం ప్రభువా? పరిపాలన యంత్రాంగంలో ప్రధాన అధికారియా? బాగా పన్నులు కట్టే ధనవంతుడా? లేక అప్పులు ఇచ్చే షావుకారా? స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న సత్యాగ్రహ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడా? వెర్రిగా వచ్చే జనాలను ప్రభావితం చేస్తూ గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చాడా? కాదంటే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అందరికన్నా ముందు ఉండేటట్టు ఎంపికయ్యే ప్రధాన పౌరుడా? ఎవరతను? టౌన్ లోని వాళ్లంతా, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల అడవికి దగ్గరగా ఉండేదూరం పల్లెలవారు కూడా అతగాడిని ఎరిగినవారే!

మగునీ అసలు ముఖ్యమైన మనిషి కానేకాడు. అతను చేసిందల్లా బతుకు గడవడం కోసం ఒక ఎద్దుల బండిని నడిపించడం మాత్రమే. బతుకంతా కష్టపడ్డాడు. అదేదో దేశంకోసం, దేశం జనాలకోసం మాత్రం కాదు. కేవలం తనకోసం తాను కష్టపడ్డాడు. తన బతుకుదెరువు కోసం కష్టపడ్డాడు. అయితే ఉన్న ఆ రెండు ఎద్దులతో అతను ఏర్పరచుకున్న బంధంమాత్రం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

ప్రతినిత్యం మగునీ తన బండితో రైల్వే స్టేషన్ కు వెళ్లి తీరుతాడు. అదేదో సూర్యుడు ఉదయించి సాయంత్రం టౌన్ కోటమీద అస్తమించినంత క్రమంగా వెళ్లి తీరుతాడు. గడియారంలాగా పని చేస్తాడు అని ప్రజలందరూ అనేవారు. వానకాలం నెలలలో, సూర్యుడు మబ్బుల చాటున దాగి ఉన్నప్పుడు, అతని రావడం పోవడంతో అందరికీ సమయం తెలిసేది. రుతువులు క్రమంగా రాకపోవచ్చు, వర్షాలు ఆలస్యం కావచ్చు, వేసవి మరీ వేడిగా లేకపోవచ్చు, మగునీ బండి గడగడలాడుతూ దారివెంట నడవకుండా ఒక రోజు కూడా గడవలేదు. శీతకాలపు మరీ చల్లని ఉదయాలలో కూడా అందరూ దుప్పట్లు చుట్టుకుని వరండాలలో కూర్చుని ఉంటే, మగునీ తన బండిని మాత్రం కొండల కింద పాములా మెలిదిరిగిన దారి వెంట, పెదాల మీద పాటతో సహా నడిపించడం తప్పదు.

ఖాలీకోట్ ప్రభువుగారి దగ్గర రెండు కార్లు ఉంటే మాత్రమే ఏమిటి? అంటూ, అతను ఒక్కొక్కసారి సరదాగా అనేవాడు. ఆయన దగ్గర తనవంటి డ్రైవర్ ఉన్నాడా? అని అడిగేవాడు. అతని ఎద్దులబండి కారులన్నింటికన్నా గొప్పది. కాలియా, కాసరాలను వాటి వెనుక భాగాన నెమ్మదిగా తట్టి ఇంజన్ ను హుషారు చేస్తే చాలు. బండి సాగుతుంది. దానితోపాటు ముక్కలు ముక్కలుగా పాట సాగుతుంది. అందరికీ తెలిసిన రామకథ అది. రాముడు, లక్ష్మణుడు మాయలేడి వెంటపడి మహ పరుగెత్తారు, అంటూ సాగుతుంది పాట. ఇక ఎద్దులు ఎగురుతున్నట్టే ముందుకు సాగుతాయి. పాట కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. పక్షులు జంతువులను మేలుకొలుపుతుంది. అడవి కోళ్ళు అరుస్తాయి. ఊర కుక్కలు మొరుగుతాయి. బండి అలా ముందుకు సాగుతుంది.

టౌన్ లో పైనుంచి కింద దాకా, ఇటుపక్క నుంచి అటుపక్కదాకా, ఇంకా వెలుపలి ప్రాంతాల్లో కూడా, తన నోటి నుండి అంతులేని ప్రవాహంలాగా బతుకు కథలతో మగునీ అందరినీ పట్టి వేస్తాడు. తల్లిదండ్రులు ఎంతో బుజ్జగించి ప్రేమగా పెంచారు. అతని చిన్నతనం హాయిగా సాగింది. పడుకునేందుకు పరుపు, కడుపునిండా తిండి, అసలు ఏ పని చేసే అవసరం లేకపోవడం, అది పద్ధతి. తల్లీ, తండ్రీ పోయిన తర్వాత కూడా అతని బతుకు బాగానే సాగింది. పెరిగి పెద్దవాడయ్యాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మాటలు ఆమె పెదవుల లాగే తీపి. ఆమె ఊపిరి అసలైన సుగంధం. ఆమె నడిచిన చోట పూలు పూసేవి. బ్రతుకు కలలాగా సాగింది. ఆనందం, సంతోషాలు వెల్లి విరిశాయి. అయితే అది చాలాకాలం కొనసాగలేదు. అతని భార్య చిన్న వయసులోనే మరో లోకానికి వెళ్లిపోయింది. తన రోజులు ముగిసిన తరువాత తాను కూడా వెళ్లి ఆమెను కలుస్తాను, అని అతను అనుకునేవాడు.

ఈ విషయాలన్నీ అతను గంభీరంగా పాడుతూ, చెపుతూ ఉంటే అందరి కళ్ళు చెమర్చేవి. అతని కళ్ళు కూడా చెమర్చేవి. ఎవరికంటా పడకుండా కన్నీళ్లు తుడుచుకుని, అతను మాటమార్చి మరో సంగతి ఎత్తుకుంటాడు. ప్రయాణం ముగుస్తుంది. కథలు మాత్రం ముగియవు. ఖాలీకోట్ మహారాజు ఒక్కరు తప్పితే అందరూ మగునీ బండి ఎక్కినవారే. దీవాన్ గారి నుంచి మేనేజర్ దాకా, లాయర్ గారు, మార్వాడీ సేఠ్  నుండి మరి మహాత్మా గాంధీ అనయాయుల దాకా, ఒకసారి కాకపోతే మరోసారి అతని బండి ఎక్కినవారే. ఆ బండి ఎన్నింటినో చూచింది. చిన్న వయసులోనే మొగుణ్ణి పోగొట్టుకున్న ఆడకూతుర్లు అత్తారింటి నుంచి తల్లి గారి ఇంటికి తిరిగి రావడం, సంతోషంగా, చక్కనైన పెళ్ళికూతుళ్లు పుట్టినింటినుంచి మొగుడి ఇంటికి వెళ్లడం, మండల్ గ్రామంలోని గదా రౌల్, పన్నులు కట్టనందుకు బందిఖానాలో పడడం, ప్రపంచంలో అతనికి మిగిలిన వస్తువులన్నీ, చివరికి చీపురుదాకా ఈ బండిలోనే ప్రభువుగారి దర్బారుకు తరలింపబడడం, బెండాలియా వాసి మధూ రథ్ చెరసాలకు పంపబడడం, వాదించిన లాయర్లు, చేతులకు బేడీలు వేసిన పల్లెకారు నాయకులు ముఖాల మీద చిరునవ్వుతో అరెస్టు కావడం. మగునీ బండి ఎన్నెన్నో చూచింది. దుఃఖాన్ని చూచింది, సంతోషాన్ని చూచింది. ధారలుగా కారిన కన్నీళ్లు, గడ్డిమెత్తలను తడిపాయి. ఆనందంగా కొట్టిన కేరింతలు అదే విధంగా, బండి మంచె కట్టిన గడకర్రలను దడదడలాడించాయి. కనుక మగునీ మాట్లాడుతున్నాడు, అంటే అదొక చరిత్ర. అందులో ఆ టౌను కథలన్నీ వినిపిస్తాయి. అతను కథలలో ఎంతో హుషారును కలగలుపుతాడు. చివరకు ఎద్దులు వింటూవింటూ నెమ్మది ఆగిపోతాయి. నా కథలను ఇవి ఎలా వింటున్నాయో చూడండి,  అంటాడతను. హాయిగా నవ్వుతాడు. ఆ ఎద్దుల మీద ఏనాడూ కర్రను ప్రయోగించింది లేదు.

అటుయిటు తిరగడానికి అందరికీ మరొక ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తున్నదని మగునీకి తెలిసేరోజు ఒకటి వచ్చింది. దారి మీదకు సింగ్ కుటుంబం వారు బస్సును ఒకదాన్ని తెస్తున్నారని తెలిసింది. అతను మాత్రం గలగలా నవ్వేశాడు. సుఖంగా తిని పెరుగుతున్న తన ఎద్దుల జంటకు పోటీగా ఒక బస్సు వస్తుందా? ఆ దిక్కుమాలిన బస్సు పేరున అందరూ తన బండిని వదిలిపెడతారా?

అందరూ అతగాడిని చూసి నవ్వారు. అతను మాత్రం అలాగే ఉండిపోయాడు.

నాలుగు నాళ్ళు పోయిన తర్వాత రాక్షసిలాంటి ఒక బస్సు రోడ్డు మీదకు రానే వచ్చింది. మగునీ పని ముగిసింది, అన్నారు ఊరివాళ్లు. వాడి వ్యాపారం మడత పడుతుంది. ఇరవయి మందిని గంటకు నలభయి మైళ్ళ వేగంతో తీసుకువెళ్లే బస్సుతో ఒక ఎద్దులబండి ఎట్లా సమానంగా పోటీ పడుతుంది? అన్నారు.

మగునీ గుండె దిగజారింది. వాడికి భయం పట్టుకుంది. వాడు కిందపడి ఏడవడం మాత్రం  మొదలు పెట్టలేదు, నిజమే.  కానీ కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. కొడోలాలో పెద్ద సభ జరుగుతుండగా తాను పక్కగా వెళ్లడం గుర్తుకు వచ్చింది. మనిషి చేతులకు మరయంత్రాలు సాటిరావని అక్కడ ఒక పెద్దమనిషి గట్టిగా చెబుతున్నాడు. అదే గనుక నిజమైతే, తన ఎద్దుల బండి మోటార్ బస్సు కంటే గొప్పది కాదా? ఆ మీటింగుకు హాజరయి ఆ మాటలు విన్న వాళ్ళ అందరి దగ్గరకు వెళ్లి అభ్యర్థిస్తాను అనుకున్నాడు. వాళ్లంతా తనను పట్టించుకోకుండా ఉంటారా? వాళ్లుగానీ, ఆ పని చేస్తే, తాను నేరుగా వాళ్ళ నాయకుడు మహాత్మా గాంధీ దగ్గరకు వెళ్లాలి అనుకున్నాడు. అతను బీదవారికి, భూమిమీది బడుగువారికి మహా మిత్రుడు అని అందరూ అనగా విన్నాడు. ఆయన కూడా మగునీని పంపించి వేస్తాడా? మగునీ నాశనమైతే, సింగ్ లు బాగుపడితే చూస్తూ ఊరుకుంటాడా?

మగునీ బండి నడిచే దారిమీదనే బస్ కూడా నడవసాగింది. ఒకరోజు తరువాత ఒక రోజు తరువాత ఒకరోజు బస్సు నిండుతున్నది. బండి ఖాళీగా ఉంటున్నది.

మగుని మధ్యరాత్రి లేచి, తన బండిని రైల్వే స్టేషన్ ముందర తెల్లవారక ముందే ఆపి ఉంచడానికి,  బయలుదేరాడు. అయినా ప్యాసింజర్లు అందరూ బస్ కోసం కాచుకుని ఉన్నారు. అది తెల్లారిన తర్వాత ఎప్పుడో గాని రాలేదు.

బండిలోని గడ్డి పరుపులను తీసేసి, మగునీ జనపనార సీట్లను ఏర్పాటు చేశాడు. అయినా ప్రజలు బస్సు వేపే వెళ్లారు.

ఒక్కొక్కరిని చేతులు పట్టుకుని, బండి వద్దకు తెచ్చే ప్రయత్నం చేశాడు. అయినా అందరూ బస్సు వైపు వెళ్లారు.

రోజులు గడిచాయి, మరిన్ని రోజులు గడిచాయి.

మగునీకి సంగతి తెలిసిపోయింది. దినానికి రెండుసార్లు బదులు ఒకేసారి తినడం మొదలుపెట్టాడు.

మరి కొన్ని నాళ్ళు గడిచిన తర్వాత అతను భోజనం నుంచి గంజికి మారాడు.

ఇంకా కొన్ని నాలుగు గడిచాయి, గంజి రోజుకు ఒకసారి నుంచి  రెండు రోజులకు ఒకసారికి మారింది.

మరెన్నో రోజులు గడిచాయి. చాలా రోజులపాటు అతని ఇంట్లో పొయ్యి వెలగలేదు. అసలు వండడానికి ఏమీ లేదు.

ఎద్దులు బక్క చిక్కిపోయాయి. వాటి ఎముకలు పొడుచుకు వచ్చాయి. మగునీ వాటి మెడలు వాటేసుకున్నాడు. ముగ్గురు కలిసి నిశ్శబ్దంగా కన్నీరు పెట్టుకున్నారు.

వాడి పని ముగిసింది, అన్నారు ఊరివారు. ఆకలి, దుఃఖంతో వాడు వెర్రెత్తిపోయాడు, అన్నారు.

మరికొంత కాలం గడిచింది.

ఒకానొక ఉదయాన జనం కలిసి మగునీ ఇంటి తలుపు పగలగొట్టవలసి వచ్చింది. అతని శరీరాన్ని బయటకు తెచ్చారు. చింకిచాపమీద అతని దేహం పడి ఉంది. చేతి కర్ర దానికిందే ఉంది.

అతని కోసం చితి పేర్చారు. నల్లని పొగ దట్టంగా ఆకాశంలోకి ఎగిసింది. ఆత్రంతో రెక్కలు తపతపలాడిస్తూ లెక్కలేనని పక్షులు అందులో ఎగిరాయి. వార్త ఊరంతా పాకింది. అక్కడి రెండులక్షల జనాభా వాపోయారు. పాపం బీద మగునీ పోయాడన్నమాట! ఎంతటి అన్యాయం? అన్నారు.

గోదావరీష్ మహాపాత్ర - ఒరియా(1899 – 1965) పద్నాలుగేళ్ల వయసులో మొదలైన సాహిత్యచరిత్రలో ఇతను 70 పుస్తకాలు వెలువరించాడు. కవిత, చిన్న కథ, నవల, హాస్య రచనలు, నాటికలు, బాల సాహిత్యం ఎన్నో రాశాడు. ము పాత్రికేయ రచనలు కూడా చేశాడు. ఒక సెటైరికల్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. మగునీ ఎద్దుల బండి అనే కథను చలనచిత్రంగా కూడా తీశారు. ఆ చిత్రానికి అవార్డు వచ్చింది.



 

Monday, March 16, 2026

లోకాభిరామం - అలుకు పూతలు


లోకాభిరామం - అలుకు పూతలు


Published Saturday, 8 June 2019

 

ఎండలు ఎన్నడూ లేనంతగా బాధ పెట్టినయి ఈసారి. ఎండలు ఎన్నడూ లేనంతగా ఉన్నవి అని నేను అనడం లేదు. హైదరాబాద్ నగరంలో 44 డిగ్రీల ఎండలు రావడం నాకు గుర్తుంది. ఐదవ అంతస్తు పైన ఆకాశం కింద, చాప పరచుకొని పండుకోవడం మనసులో తాజాగా ఉంది. తెల్లవారుజామున చలిపెట్టి దుప్పటి కప్పుకొనవలసిన అవసరం వచ్చేది. గాలి మరీ ఎక్కువగా ఉండటంతో పైన పడుకోవడం అంత సుఖంగా లేకుండా మారింది. నిజానికి నాన్న ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి రానే లేదు. అంతకు ముందున్న మూడవ అంతస్తు ఇంటికి వచ్చాడు. ఇంట్లో నాకు ఉక్కిరిబిక్కిరిగా ఉన్నది, కింద పడుకుంటాను అన్నాడు. అది కుదరదు అని ఆయనకు నచ్చజెప్పడానికి నాకు తలప్రాణం తోకకు వచ్చింది. జన్మలో ఎప్పుడన్న ఇట్ల మనము తలుపులన్నీ మూసుకొని పండుకున్నమా?  చెప్పు, అని ఆయన నన్ను ప్రశ్నించడం నాకు మెదడులో ఇంకా పైపొరలలోనే గుర్తున్నది.

అది మూడవ అంతస్తులో ఇల్లు. అక్కడికి నాన్నను లిఫ్టులో ఎక్కించి తీసుకు వచ్చినరు. మా గోపయ్య ఇంటికి పోయేటందుకు తొట్లెలో ఎక్కించి తీసుక పోయినరు, అన్నడు నాన్న. ఆయనకు మరి దేశం తిరిగిన అనుభవం ఉంది కానీ, లిఫ్ట్ ఎక్కిన అనుభవం ఉన్నట్లు లేదు. ఇక ఇంట్లో రెండు బాత్రూమ్లు ఉన్నవి. మూడవది కూడ ఉండేది. దాన్ని నేను ముందు స్టోర్ రూమ్గా, తరువాత దేవుని గదిగా మార్చిన కనుక రెండే బాత్రూమ్లు మిగిలినవి. వాటిలో పాలరాతి నేల ఉన్నది. అంతకన్నా మించి స్నానానికి షవర్లు ఉన్నయి. నాన్నను అవి చాలా ఆకర్షించినయి. పెరుమాండ్లకు నిత్యపూజా కార్యక్రమంలో భాగంగా స్నానాసనం ఉంటుంది. సాలగ్రామలను చిల్లుల పళ్లెంలో పెట్టి, గౌరవంగా తీర్థం ఉంచుతూ స్నానం చేయిస్తారు. ఇక విగ్రహాలకు అభిషేకం అనే స్నానం చేయించిన తరువాత, నీళ్లు గుమ్మరించుకుండా ఒక చిల్లుల పళ్లెం పట్టుకుని, అందులో నెమ్మదిగా పోస్తే, నీరు విగ్రహాల మీద ఒక పద్ధతిగా, సన్నని ధారలుగా పడేటట్లు స్నానం చేయిస్తారు. కార్యక్రమానికి, చిల్లుల పళ్లానికి శతధార, లేదా సహస్రధార అని పేరు. షవర్ చూచిన తరువాత నాన్నకు వెంటనే తతంగం గుర్తుకు వచ్చినట్టు ఉన్నది. గోపయ్య ఇంట్లో స్నానానికి సహస్రధార ఉంది, అని అందరికీ చెప్పి మురిసిపోయినడు.

ఇప్పటి ఇంటికి వచ్చి ఉంటే ఇంకా ఆయన ఏమి అనేవాడు నాకు అర్థం కాలేదు. పాత ఇంట్లో గోడలకు లప్పం లేదు. అవి ఇంకా కొంచెం పాత పద్ధతిలోనే మొరటుగానే ఉన్నాయి. లప్పం గోడలు నాకు కూడ కొత్తగనే కనిపించినయి. పిల్లలకు మరింత నచ్చినయి. ముందు కొన్ని దినాలపాటు అందరిని గోడలు ముట్టుకోవద్దని వాండ్లు వారించడము, వచ్చిన వాండ్లకు చిత్రంగ తోచింది కూడా. అక్కడి నేల మొత్తం పాలరాయి కాదు. అదేదో మొజాయిక్ పద్ధతి ఉంది. మధ్యన ఇంటిని రినొవేట్ చేసినప్పుడు అంటే మెరుగు పరిచినప్పుడు ఖరీదయిన టైల్స్ వేయించినము. ఇక్కడ ఇల్లంతా పాలరాయి ఉన్నది. రాతిని పాలరాయి అని ఎవరు అన్నారో నాకు తెలియదు గానీ, ఇందులో పాల లక్షణం ఎక్కడా కనిపించదు. కొంతపాటి తెలుపు కనిపిస్తుంది కనుక అట్ల అంటరేమో నాకు తెలియదు. వీటిని చూస్తే నాన్న ఏమి అనేవాడు అని నేను ఆలోచిస్తూ ఉంటాను.

చిన్ననాటి మా ఇంట్లో, పాత ఇంట్లో అయితే మట్టినేల ఉండేది. అది ఎవరో మేస్ర్తీలు వేసిన నేల కూడా కాదు. ఎప్పటికప్పుడు పాడైపోతుంది కనుక దాన్ని ఎప్పటికప్పుడు మేమే బాగు చేసుకుంటాము. మట్టినేల వేయాలంటే ఏదో ఒక మట్టి పనికిరాదు. పుట్టమన్ను తేవాలి. పుట్ట అనగానే అందరికీ పాము గుర్తుకు వస్తుంది. కానీ పాము పుట్టను కట్టలేదు. దానికి విద్య చేతకాదు. నిజం ప్రపంచంలోలాగే బడుగుజీవులు అయిన చీమలు పుట్టలను కడతాయి. అందులోకి దాష్టీకంగా పాములు చేరుకుంటయి. మానవుల ప్రవృత్తికి ప్రకృతిలోనే ఉదాహరణలు ఉన్నాయి అనడానికి ఇది మంచి సూచన. చీమలు చిన్న జీవులు. అవి గడ్డలను, పెడ్డలను తీసుకురాలేవు. కష్టపడి అసలు సిసలైన మట్టి కణాలను మాత్రమే అవి పోగేసుకుంటాయి. అందులో ఇసుక, రాళ్లు మొదలైన వాటికి చోటు లేదు. నిర్మాణం కార్యక్రమంలో భాగంగా చీమలు తమ శరీరంలో నుంచి కొన్ని స్రావాలను వెలికి తెచ్చి మట్టిలో కలుపుతాయి. మొత్తానికి మట్టికి ఒక జిగి అంటే అంటుకునే లక్షణం ఏర్పడుతుంది. కనుకనే ఇంట్లో నేలకు మట్టి బాగా పనికి వస్తుంది. అది ఎంతో నాణ్యమైన మట్టి. పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి, అన్న పాట ఎవరికన్న గుర్తు ఉందేమో ఆలోచించండి. అటువంటి మట్టిని తెచ్చి పొక్కిలి పోయిన చోట, అంటే నేలలో గుంతలు పడినచోట చక్కగా పూయాలి. దాన్ని చేమన్ను పద్ధతి అంటరు. ఓపిక ఉంటే ఎక్కువ భాగాలను రకంగా కొత్త మట్టితో నింపాలి. తరువాత అది ఆరే లోపలనే బింగరాయితో నునుపు వచ్చేటట్లు చేతనైనంతగా రుద్దాలి. బింగరాయి అంటే ప్రవాహం లేదా మరేదో కారణంగా నునుపు తేలిన రాయి అని ఎవరికైనా గుర్తుందా? ఇంటి నేలను మనమే వేసుకుంటము అంటే పిల్లలు నవ్వుతరేమో.

నాకు శాఖాచంక్రమణం బాగా అలవాటు. ఒక విషయంతో మొదలుపెట్టి, తెలుసునుకదా అని మరేదో విషయం చెప్పడం. అందులో నాకు కొంత సుఖం ఉంటుందేమో కానీ, కొంతసేపటికయినా, అసలు కథకు తిరిగి వస్తే ఎత్తుకున్న అంశానికి న్యాయం జరుగుతుంది. మట్టినేల ఇంట్లో వారానికి కనీసం రెండుసార్లు అందరూ పేడ అనే పెండతో అలకవలసిన అవసరం వస్తుంది. పని కొన్ని పరిస్థితులలో నేను కూడా చేసిన అంటే ఎవరన్న నమ్మగలరా? ఇంటిని చక్కగా నిర్వహించాలంటే ఇటువంటి పనులు అన్నీ వచ్చి ఉండాలి. ఇల్లు అలకడం అంటే ముందు పెండ కలిపిన నీళ్లను ఇల్లంతా చక్కగా పూయాలి. అది కొంత ఆరిన తరువాత పొడిబట్ట పెట్టి ఇల్లంతా మళ్లీ తుడవాలి. అప్పుడు పెండలోని గడ్డి మొదలైన భాగాలు పొడిగా వచ్చి చేరుకుంటాయి. వాటిని ఊడ్చి తీసేయాలి. ఇల్లు అలికినంత మాత్రాన సరిపోదు. ముగ్గులు వేయాలి. ముగ్గు ఒక రంగు అయితే సరిపోదు. మిగతా రంగులు కూడా చేర్చాలి. పాలరాతి ఇంట్లో పనిమనిషి పొద్దున్నే తడిగుడ్డ పెట్టి తుడిచిపోతుంది తప్ప ఇటువంటి అలంకారాలు, ఆర్భాటాలు ఏమీ లేవు. పాలరాతిలోనే రకరకాల గీతలు, డిజైన్లు ఉంటాయి. నేను వాటిలో తెలిసిన ఆకారాల కొరకు, మనుషుల ముఖాల కొరకు వెతుకుతూ ఉంటాను.

పల్లెలో పాత ఇంటిగోడలు కూడ మట్టివే. అలికిపూసిన చోట గువ్వ గుడ్డు పెట్టింది అని ఒక మాట ఉన్నది. ఇప్పటి వరకు నేలతోటి పడిన బాధ అలుకుడు. ఇక అదే తంతు గోడలతోటి జరిగితే అది పూసుడు. ఇల్లంత అలికి శుభ్రము చేసి ముగ్గులు వేసిన తరువాత అక్కడ గువ్వ గుడ్డు పెట్టింది అంటే గూడు కూడ కట్టింది అని అర్థం కదా! చేసిన కష్టము పాడయింది అని మాటకు సారాంశము. ఇంక గోడల సంగతికి వస్తే పూత అది ఒక వేరే కార్యక్రమం. సామాన్యంగా ఇది దసరా, దీపావళి ముందు జరుగుతుంది. వాన కాలం ముగుస్తుంది. తాకిడికి గోడలు కొంత పాడవుతయి. కనుక వాటిని పుట్టమన్ను తోటి బాగ చేసి, మంటితో మరింత ఎర్రమన్ను కలిపి, అందుట్లో కొంత పెండ కూడా కలిపి ఒక మిశ్రమం తయారుచేయాలి. అందులో కలిపిన మిశ్రమాన్ని ఒకటి రెండు రోజులు మగ్గనివ్వాలి. అంతకు ముందు మనుషులు దాంట్లోకి దిగి కాళ్లతోటి కసపిసా తొక్కాలి. చివరకు మంచి జిగిగల ఒక పూత పదార్థం తయారవుతుంది. జిగి అంటే అతుక్కునే లక్షణం అని ఇది వరకే చెప్పినట్లు ఉన్న. మిద్దెమీద ఎక్కి గోడపొడుత పూతను పోస్తుంటే నిచ్చెన వేసుకున్న మనుషులు దాన్ని గోడమీద చక్కగ పులుముతరు. మొత్తం అయిన తరువాత, నేల మీద ముగ్గులు పెట్టినట్లే, గోడ మీద సున్నం, జాజు పట్టెలు పోస్తరు. నామాల వాండ్లము కనుక ఇంటిని చూడంగనే ఇంట్లో ఉండే వారి సంగతి తెలుస్తుంది. ఇంటికి ఇంత అలంకారము అవసరమని ఎవరికైనా ఇప్పుడు చెప్పగలిగేమా?

పల్లెలో పాత ఇల్లు పోయి, కొత్త ఇల్లు వచ్చే సమయానికి నేను అక్కడ ఉండే అవకాశం లేకపోయింది. కనుక ఇంటి నిర్మాణం మీద నాకు అవగాహన తక్కువగా ఉంది. అంతకుముందు పాలమూరులో అన్నగారు ఇల్లు కట్టినప్పుడు ఉన్నాను. డంగు సున్నం, పలాస్ర్తి లాంటివి వాడడం చూచాను. తరువాత సిమెంటు వాడకం కూడా చూచాను. నావి కాకున్నా మరొక నలుగురు ఇల్లు కట్టుకోవడం చూశాను. పద్మారావునగర్లోని పాత ఇల్లు అంటున్న తొట్లె, సహస్రధార గల ఇల్లు నిర్మాణం సమయంలో చూడడం కుదరలేదు. ఇప్పుడు ఉంటున్న ఇంటిని మాత్రం అడుగడుగున పక్కన ఉండి పని చేయిస్తున్న భావంతో, ప్రతి నిత్యం నిర్మాణాన్ని చూచాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చిన్నతనంలో ఒక మాట విన్నట్టు గుర్తు ఉంది. అంటే పనులు అలవిమాలిన తెలివి అవసరమైనవి, కష్టపెడతాయి అని భావం కావచ్చు. నాకు రెండు అనుభవాలు ఉన్నాయి. నిజానికి రెండు కూడా నన్ను కష్టపెట్టలేదు. ఇల్లు కడుతుంటే, అందులో ఒక్కొక్క అంచె ముగుస్తుంటే చెప్పలేని ఆనందం కలిగింది. పెళ్లిలో అంతకన్నా ఆనందం కలిగింది. పెళ్లి చేసినప్పుడు కూడా చాలా పొరపాట్లు జరుగుతాయి. ఒకసారి పెళ్లి చేయవలసి వస్తే, ఎక్కువమంది పిల్లలు ఉండి అదృష్టం కలిగితే, ఈసారి మొదటిసారి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. నాకు ఉండేది ఒక్కడే అబ్బాయి. వాడి పెళ్లి జరిగింది. నేను మళ్లీ ఎవరికి పెళ్లి చేయాలి? ఒకటి కాదు రెండు ఇళ్లు ఉన్నాయి. ఇంకా నేను మళ్లీ ఇల్లు ఎందుకు కట్టాలి? ఇల్లు కట్టాను. పెళ్లి చేశాను. అనుభవం వచ్చింది. ఎన్నో సంగతులు తెలిశాయి. నా చాదస్తం మీ ముందు వెళ్లబోసుకున్నాను. మీకు ఎవరికి సంగతులు తెలియవని కాదు. తెలిసిన సంగతులు కల పోసుకోవడానికి కదా లోకాభిరామం ఉన్నది. కనుక నాకు తోచింది చెప్పాను. అవును అనిపిస్తే తల ఆడించండి. కాదనిపిస్తే అడ్డంగా ఆడించండి. నేను చూడ రాలేను కాబట్టి, మీ రియాక్షన్ నాకు తెలియదు. తెలిస్తే చాలా బాగుంటుంది.