Showing posts with label Information. Show all posts
Showing posts with label Information. Show all posts

Tuesday, September 1, 2026

చింపిరిజుట్టు పరిశోధన On Anthropology!

 


ఆదివారం 11 ఫిబ్రవరి 2001 ఆంధ్రభూమి దినపత్రిక

చింపిరి జుట్టు పరిశోధన

పరిశోధన, సైంటిస్టు అనగానే మనకంతా చింపిరి జుట్టు, గడ్డం, పాతకాలం తరహా దుస్తులు వేసుకున్న ఒక పిచ్చి మారాజు మనసులో మెదులుతాడు. పరీక్షనాళికలో రంగురంగుల ద్రవాలను కలిపి సక్సెస్ అని కేకలేస్తాడతను. సినిమాలు, నవలల పుణ్యమా అని మనకు ఇలాంటి ఆలోచనలు స్థిరపడతాయి. అటు సైన్స్ అంచులను తాకుతూ, ఇటు సాంఘికశాస్త్రం గురించి కూడా పట్టించుకుంటూ ఆంత్రపాలజీ అనే శాస్త్రం ఒకటి ఉంది. దాన్ని అచ్చంగా అనువదించాలంటే మానవశాస్త్రం అనాల్సి ఉంటుంది. మానవుల తీరుతెన్నులు, జీవన విధానాలను వర్ణించే శాస్త్రం అది. అందులో ముక్కులు కొలవడం మొదలు, మునుపటి వారి విశేషాలను సేకరించడం దాకా ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. అసాధారణంగా జీవిస్తున్న జాతులను పట్టించుకోవడం ఈ రంగం వారి ప్రస్తుత ప్రత్యేక కార్యక్రమం.

ఆదిలాబాద్ లోని గోండులను గురించి పరిశోధించడానికి జర్మనీ నుంచి హేమిండార్ఫ్ దంపతులు వచ్చి మర్లవాయి అనే ఊళ్లో గోండ్లతోనే కలిసి జీవించారు. శ్రీమతి హేమిండార్ఫ్ సమాధి అక్కడే ఉంది ఇంకా. ఈ దంపతులు గోండులు అయిపోయారన్నా అతిశయోక్తి లేదు. పరిశోధన శాలలు, పరికరాలు, సమావేశాలు, అందుకు తగిన ఆధునిక కాలం హంగులు ఏవి అవసరం లేకుండా ఈ రకం పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. మిచిగన్ యూనివర్సిటీ మానవశాస్త్ర పరిశోధకుడు టామ్ ఫ్రిక్ రెండు సంవత్సరాలకు పైగా కాల్ ఆఫ్ అనే మధ్యతరగతి కుటుంబీకుడితో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్లు ఉండేది ఒక నిజమైన పల్లె. అక్కడ సౌకర్యాలు అంతగా లేవు. అటువంటి ప్రాంతాల్లో బతుకుతున్న వారి జీవితాలను పరిశోధించడమే ఫ్రిక్ పెట్టుకున్న పని. అందుకు వారి మధ్య వారిలో, ఒకడుగా బతకడం కన్నా మంచి మార్గం లేదు. తాను పరిశోధకుడనే విషయాన్ని పక్కనపెట్టి ఫ్రిక్ తన యజమానితో కలిసి వారి పొలాల్లో పని చేస్తుంటాడు. పశువులను కాస్తుంటాడు. ఈ పేరుతో బీద రైతుల పనితీరును, పరిశోధకుడు స్వయంగా నేర్చుకుంటున్నాడు. ఆయా విషయాలను గురించి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుంటున్నాడు. అతను మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఆగి, అప్పుడు విరామం దొరికినప్పుడు ఆ రోజు సేకరించిన వివరాలు అన్నింటిని ఒక పుస్తకంలో రాసుకుంటాడు. మారుతున్న మధ్యతరగతి జీవితాలు, వారి పనితీరులన్నీ త్వరలోనే ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నంలో ఇదొక భాగం!

కాలువ గట్టు మీద నిలబడి, కర్రతో గుచ్చి, రాయి వేసి, లోతు గురించి, ప్రవాహం గురించి తెలుసుకోవచ్చు. నేరుగా అందులోకి దిగి సంగతులను మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రిక్ పాటిస్తున్నది ఈ రెండవ మార్గం. దీన్ని పనిలోనే పరిశీలన అనవచ్చు. పరిశోధనకు వస్తువైన వారికి అనవసరంగా కాలయాపన జరుగుతున్నది అన్న భావం ఉండదు. పరిశోధకులకు వివరాలు అనుమానం లేకుండా అర్థమవుతాయి. ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగింది. ఏ విషయాలయితే, ఈ మధ్య తరగతి రైతు కుటుంబాలు, సమస్యలుగా గుర్తించి చర్చిస్తున్నారు అన్నది గమనించి ఈ పరిశోధకుడు వాటిని పట్టించుకుంటున్నాడు. మారిపోతున్న ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడికక్కడ ఉండిపోయే వీలు లేదు. రైతులకు సమాచారం కావాలి. వారి ఫలసాయం పైచోట్లకు అందాలి. కొత్త కొత్త పద్ధతులు అన్ని రంగాల్లోనూ వస్తుంటే పట్టించుకోకుండా ఉండలేరు. అవి కాక మానవ సంబంధాల విషయంగా వచ్చే మార్పులు మరోవైపు ఉన్నాయి.

మన పరిస్థితులు మారుతున్నాయని మనకి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ దేశమంతా మారుతున్న పరిస్థితులలో తేడాలు, పోలికలు, అందుకు కారణాలు కూడా తెలిస్తే కొన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. జనజీవనం గురించి పట్టించుకోవడం పరిశోధన. అదే చింపిరి జుట్టు పరిశోధన!


Monday, August 3, 2026

తిండి పిండి ఎన్నో సంగతులు 2 On Food and Starch


తిండి - పిండి

అందరమూ మూడు పూటల బుద్ధిగా కూర్చుని తింటాము.  మరి ఆ తిండి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అదేమన్నమాట? కష్టపడి సంపాదించుకుంటున్నాము. తింటున్నాము అనుకోవచ్చు. ఆలోచన మరింత ముందుకు పోతే తినడానికి పంటలు, జంతువులు ఉన్నాయి కదా అనుకోవచ్చు! పంటలు, జంతువులు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎందుకు అంతగా దొరుకుతున్నాయి? ఎట్లా ఆ విధంగా అవి పెరుగుతున్నాయి? అన్నవి ఆ తరువాత రావాల్సిన ప్రశ్నలు!

ఈ భూమిమీదికి మనకన్నా ముందు మొక్కలు వచ్చాయి. అవి పెరిగి చెట్లు అయ్యాయి. ఒక చెట్టును గమనిస్తే దాని నిండా రక రకాల ఆకులు ఉంటాయి. అరటి చెట్టు ఆకులు వెడల్పుగా ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవైనా చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం కలిసి ఒక పెద్ద విస్తీర్ణాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి. ఈ ఆకులు మనకు తిండి పెట్టే కర్మాగారాలు అన్న సంగతి చాలామందికి అర్థం అయి ఉండదు. అందుకే మనం సైన్స్‌ గురించి తెలుసుకోవాలి. తినే తిండి గురించి తెలియని వాళ్లకు ఇంకా మిగతా విషయాలు ఏం తెలిసినట్టు లెక్క?

ఆకులలో ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా పిండి పదార్థం తయారవుతుంది. ఇది అటువంటి ఇటువంటి అద్భుతం కాదు! అద్భుతాల కే అద్భుతం! ఆ పిండి కారణంగానే మొక్కలు, పొదలు, చెట్లు, మహా వ ృక్షాలు అన్ని అంతలేసి గా పెరుగుతాయి. ఆ మొక్కలను తిని కొన్ని రకాల జంతువులు పెరుగుతాయి. ఆ జంతువులను మరి కొన్ని జంతువులు తింటాయి. కొన్ని జంతువులు మొక్కలను, జంతువులను అన్నింటినీ తింటాయి. ఇక మనిషి అనే మన జాతి మాత్రం దొరికిన ప్రతి చెత్తా తినే రకం. చాలా రకాల జంతువులు కూడా తినని కొన్ని పదార్థాలను మనం తింటాము. ఈ మాట అంటున్నప్పుడు అసలు సిసలైన సర్వ మానవ సౌభ్రాత ృత్వం కనబడుతున్నది. మనుషులలో కూడా కొంతమంది శాకాహారులు ఉంటారు. శాకము అంటే కూర. ఈ సంగతి వ్యాసం టైప్‌ చేస్తున్న కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ కూడా తెలిసినట్టు లేదు. అది నన్ను కష్టపెట్టి ఏవేవో మాటలు చూపిస్తున్నది. వాళ్ళు కూర సంగతి మరిచిపోయి, కొమ్మలు తింటున్నాము అనుకుని శాఖాహారము అని రాసుకుంటారు. అది తప్పు.

 

మొత్తానికి ప్రపంచంలోని మొక్కల నుండి మహావ ృక్షాలు వరకు, చీమల నుండి మహా మ ృగాల వరకు అన్నింటికీ తిండి పెట్టేది ఆకులు అన్న సంగతి మనం మొట్టమొదట గుర్తించాలి. ప్రాణదాతలు గా గుర్తించి అన్ని రకాల చెట్లకు వినయ విధేయతలను ప్రదర్శించాలి.

ఆకులలో పచ్చని రంగు ఉండడం మరొక అద్భుతం. ఆ పచ్చని రంగును ఆకుపచ్చ రంగు అనే వరకు అది వ్యాపించింది. ఆ రంగు కారణంగానే మనకు పిండి పదార్థం, అంటి తిండి పదార్థం దొరుకుతున్నది అన్నది మరొక అద్భుతం. ఇది కూడా మామూలు అద్భుతం కాదు. మొత్తం జీవ ప్రపంచానికి ఆధారం గా నిలిచిన అద్భుతం. ఆకుపచ్చ రంగుకు కారణం క్లోరోఫిల్‌ అనే పదార్థం. మొదట ఆకులు సూర్యుని వెలుతురును గ్రహిస్తాయి. ఈ విషయాన్ని మనం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నీడలో వేసిన మొక్కలు చక్కగా పెరగవు. గోడ పక్కన వేసిన మొక్కలు ఎండ ఎటువైపు ఉంటే అటు పెరుగుతాయి. గోడ వైపు కొమ్మలు కూడా ఎండ వైపు తిరుగుతాయి. ఈ సంగతి ఇంతకుముందు గమనించకుంటే ఇక మీద అయినా గమనించి చూడండి. ఈ ప్రపంచమంతా, కనీసం ఆకు పచ్చని చెట్ల ప్రపంచమంతా సూర్యుని వైపు చూచి పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఎండ మరీ వేడిగా ఉంటుంది. అది నేలను చేరే వరకు కొంత చల్లబడుతుంది. అట్లా చల్లబడిన ఎండ ఆకులకు ఉపకరిస్తుంది. అక్కడ జరిగే కార్యక్రమం వివరాలు ఈరోజు వరకు కూడా పూర్తిగా అర్థం కాలేదు.

1866లో ఆస్ట్రియా దేశంలో ఒక పరిశోధకుడు మొక్కలకు వేడికి గల సంబంధాన్ని మొట్టమొదటిసారి గుర్తించాడు. ఎండా, వేడి ఉంటే కానీ, మొక్కలు పెరగవు అని చెప్పాడు. సముద్రంలో పరచుకొని ఉన్నడెస్మిడ్స్‌, డయటమ్స్‌ వంటి  కొన్ని రకాల చిన్న మొక్కలు మొదలు, మహావ ృక్షాలు దాకా ఈ ఆకు పచ్చని ఆకులు, వెలుగు సహాయంతో పనిచేసే రసాయన కర్మాగారాలు, అంటే కొత్త పదార్థం తయారయ్యే చోట్లు, అని అతను తేల్చి చెప్పాడు. అందరికీ అది వింతగా వినిపించింది. ముందు ఎవరికీ నమ్మకం కలగలేదు.

ఇంటి మీద ఫోటో వోల్టాయిక్‌ సెల్స్‌ పెట్టి సోలార్‌ ఎనర్జీని  గ్రహించి కరెంట్‌ గా వాడుకోవడం కొంతమంది చూసి ఉంటారు. ఇందుకు అసలుసిసలైన నమూనా ఆకులు. వాటిలో కరెంటు పుట్టదు. పిండి పదార్థం పుడుతుంది. ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు కూడా ఆశ్చర్య పడని వారికి ఈ ప్రపంచంలో మరే విషయము ఆశ్చర్యకరంగా కనిపించదు. వారి బతుకులు చాలా పొడిపొడిగా నడుస్తాయి. సైన్స్‌ రుచి తెలియని చీకటి బతుకులను గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే! చీకట్లో కూడా కనిపిస్తున్న భావంతో మనకు తిండి గురించి తెలుసు అనుకుని తింటున్నాము. కానీ పత్రహరితం అనే క్లోరోఫిల్‌ గురించి తెలుసుకుని, ఆకులలో జరుగుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకుని అప్పుడు తిన్నది అన్నం అయినా, లేక మరొకటి అయినా అందులో కొత్త రుచి కనబడుతుంది. దాని పేరే సైన్స్‌ రుచి!

వృక్ష శాస్త్రం అని ఒక ప్రత్యేక విజ్ఞాన శాఖ ఉంది. అది నిన్నమొన్న పుట్టలేదు. కలకాలం గా ఉంది. కానీ అందులోని వారికి చాలా రోజుల వరకు మొక్కలు పెరగడానికి వెలుగు అవసరం, అన్న విషయం అర్థం కాలేదు. ఇంతకన్నా విచిత్రమైన విషయం ఇంకొకటి ఉండదు. సైన్స్‌ తీరు అలాగే ఉంటుంది. ఒక విషయాన్ని ముందుగా ఊహించి, ఆ తరువాత అందుకు సంబంధించిన వివరాలను సేకరించి, ఆ వివరాలలోని సంబంధాలను, వాటికి గల పూర్వాపరాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. ఆహా! అనిపిస్తుంది. ఒక కొత్త సూత్రం పుడుతుంది. ఒక కొత్త అవగాహన కలుగుతుంది. అది సైన్స్‌ రుచి!


 

Monday, June 29, 2026

పెరుగు - సైన్స్ : Science in curds.


పెరుగు - సైన్స్


పెరుగు - సైన్స్‌

ఈ మధ్యన నాలుగైదు రోజులుగా పెరుగు సరిగా తోడు కోవడం లేదు. అవును మరి! నాలుగైదు రోజులుగా వాతావరణం మళ్ళీ కొంచెం చల్లబడింది. చలికాలం అంటూ లేకుండానే ఎండకాలం మారుతున్న తరుణంలో మళ్ళీ కొంచెం చలి మొదలయింది. చలి దుస్తులు తెచ్చుకున్న వాళ్లకు సంతోషం కలిగింది. వాటిని ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

ఉన్నట్టుండి మళ్లీ చలి మొదలు కావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాతావరణ శాస్త్రం అని చెబుతారు. సముద్రంలో మార్పులు, అక్కడి నుండి వచ్చే గాలిలో మార్పులు, ఆ గాలికి కొండలు అడ్డు రావడం, ఈలోగా మబ్బులు తయారుకావడం, మొత్తానికి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, ఇవన్నీ కలిస్తే వాతావరణ శాస్త్రం అవుతాయి. తత్వం చెప్పినట్టు ఇక పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొందము గాక అని మొదలు పెడితే, చాలామంది చెవులు మూసుకుంటారు. వాతావరణ శాస్త్రం చెబుతాను అని మొదలు పెడితే ఎవరు వినరు. ఎవరూ చదవరు.

ఎక్కడ మొదలు పెట్టాము? పెరుగు దగ్గర మొదలు పెట్టాము! మొదటి మాటల్లోనే వాతావరణ శాస్త్రంలోకి వెళ్ళిపోయాము. అందులో బోలెడంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం కలగలిసి ఉంటాయని చెబితే, ఆశ్చర్య పడని వాళ్ళు, ఇంకేం చెప్పినా ఆశ్చర్యపడరు. మళ్లీ పెరుగు దగ్గరికి వెళ్లి పోతాము. పాలలో, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేస్తే మరునాటికి అది పెరుగుగా మారుతుంది. ఏం పెరిగిందని, పాలు, పెరుగుగా మారినవి? జవాబు వినడానికి కొంతమందికి ధైర్యం అవసరం. పెరుగు లేదా మజ్జిగలో లాక్టోబాసిల్లస్‌ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగానే పెరుగు పెరుగు అవుతుంది. కొంచెం పెరుగును పాలలో వేస్తే, అక్కడ సూక్ష్మజీవులు పెరుగుతాయి. సంఖ్యలో విపరీతంగా పెరుగుతాయి. కనుక దాని పేరు పెరుగు అవుతుంది. పప్పు తినేవాళ్ళకు తాము సూక్ష్మజీవులను మహా ఇష్టంగా తింటున్నాము అని తెలిస్తే బహుశా కడుపులో తిప్పవచ్చు. అందుకని పాలు పెరుగు లేని, వేగన్ తిండి అని ఒకటి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనకు అవసరం లేదు. మొత్తానికి పెరుగు తయారీలో జీవశాస్త్రం, అందులో సూక్ష్మజీవశాస్త్రం ప్రత్యక్షంగా మన ముందు పని చేస్తున్నదని అర్థం చేసుకోవాలి. అందుబాటులో సూక్ష్మదర్శిని అనే మైక్రోస్కోప్‌ ఉన్నవాళ్లు ఒక పెరుగు చుక్కను స్లైడ్‌ మీద వేసి దాని కింద పెట్టి చూడాలి. లుకలుకలాడుతూ కావలసినన్ని సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పప్పు తినే వాళ్ళు ఇక ఆ తరువాత పెరుగు తినడానికి అనుమానం రావచ్చు. ఇది కూడా ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు.

పెరుగులో, కనీసం పెరుగు తయారీలో, కావలసినంత రసాయన శాస్త్రం, మరింత భౌతిక శాస్త్రం కూడా ఉన్నాయి. పాలలో ఉండే ప్రోటీనులు, వాటిని కలిపి ఉంచే నీళ్లు, మిగతా అంశాలు ఒక రకంగా ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చి పెరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడాలు వస్తాయి. ఆమ్లాలు పుడతాయి. కనుక పాలలోని తీపి పోయి, పెరుగులోని పులుపు మొదలవుతుంది.

ఇక భౌతిక శాస్త్రం సంగతి! సూక్ష్మజీవులు పెరగడానికి, ఒక రకమైన ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే అవి నిజంగా పెరుగుతాయి. అప్పుడు పాలు పెరుగుగా మారతాయి. చలికాలం వస్తే, అవసరమైన వేడిమి ఉండదు. కనుక పాలు తోడుకోవు. ఉత్తర భారతదేశంలో తోడు పెట్టిన పాల గిన్నెకు, స్వెటర్లు, దుప్పటి ముక్కలు చుట్టి ఇంటి బయట పెట్టడం చాలామందికి అలవాటు. కొంచెం వెచ్చదనం కలిగి పెరుగు తొందరగా తయారవుతుందని వారి ప్రయత్నం. మన దగ్గర ఉండే ఈ కొంచెం చలికి మాత్రమే, పాలు తోడుకోవడం కష్టం అయితే, ఉత్తర భారతదేశంలోని వణికించే చలిలో, సూక్ష్మజీవులు పెరగడం, పాలు పెరుగుగా మారడం, ఇంచుమించు అసాధ్యం అవుతుంది. అలవాటుగా తరతరాలుగా, లేదంటే యుగాలుగా జరుగుతున్న ఈ పెరుగు కార్యక్రమంలో పెరుగుతున్నవి సూక్ష్మజీవులు అని తెలిస్తే, అద్భుతం అనిపించడం లేదా? అది సైన్స్‌ లోని ఆనందం! అడుగడుగున, చూడగల ప్రతి అంశంలోనూ, సైన్స్‌ దాగి ఉంటుంది. అది అర్థం అయినప్పుడు సైన్స్‌ రుచి మొదలవుతుంది. అందులో ఒక ఆనందం కలుగుతుంది. మనవాళ్లు పాత కాలంలోనే, విజ్ఞానం కన్నా అది అర్థం అయినప్పుడు కలిగే ఆనందము అసలైన పరబ్రహ్మము అని చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన పద్ధతి మరొక రకంగా ఉండి మనకు అర్థం కాలేదు.

సైన్స్‌ రుచి తెలిసిన వాళ్ళు, చిన్న పెద్ద, ప్రతి అంశం వెనుక ఉన్న సైన్స్‌ గురించి వెతుకుతారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు రుచి మరింత పెరుగుతుంది. ప్రపంచం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రకృతి చేస్తున్న మహిమలు తెలుస్తాయి. బ్రతుకు మరింత ఆశాజనకంగా కనబడుతుంది. బ్రతుకు అర్థం తెలిస్తే, పెరుగు తయారయ్యే పద్ధతి తెలిస్తే గొప్పగా ఉంటుంది అన్న విషయంలో అనుమానం లేనేలేదు!