Showing posts with label informative. Show all posts
Showing posts with label informative. Show all posts

Wednesday, July 1, 2026

సూర్యుని తరుముతూ పరుగు


సూర్యుని తరుముతూ పరుగు

ఛేజింగ్ ద సన్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని చూసినప్పుడల్లా ఒక అనుమానం ఎదురవుతుంది. డు ము వు లు ప్రథమ అనే సూత్రం ప్రకారం సూర్యుడు అంటే ఒక మగ మనిషి. రామః రాముడు అవుతాడు. కృష్ణః కృష్ణుడు అవుతాడు. అదే పద్ధతిలో సూర్యః పోయి సూర్యుడు అవుతాడు. వీళ్లంతా దేవుళ్ళు. మగవాళ్లు. అయినా రాముడు. కృష్ణులకు మీసాలు ఉండవు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి ఒక ఊరు. అక్కడ సూర్యుని గుడి ఉంటుంది. అందులోని దేవునికి మీసాలు ఉంటాయి. ఆ గుడిని చాలా కష్టపడి కట్టారు. సంవత్సరంలో ఒకనాడు ఆకాశంలోని సూర్యుని కిరణాలు (ఈ సూర్యుని గురించి రాయవలసిన చోట సూర్య గోళం అని రాయడం అలవాటయింది.) గుడిలోని సూర్యుని మీద నేరుగా పడే విధంగా దాన్ని కట్టారు. గాలిగోపురంలో అందుకు అనువుగా కిటికీల్లాంటివి ఉన్నాయి మరి. గుడిలో దేవుడు మగ దేవుడు. చిత్రంగా ఆడదేవతలు ఉంటారు. ఆలుమగలు ఉంటారు. ఆ సంగతులు ఇక్కడ అవసరంలేవు.. మరి దేవుడు అంటే సూర్యుడు మగవాడా అవునంటున్నారు మరి పెద్దలు. ఆయనకు రథం ఉంటుంది. దానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే తొడలు లేని సారథి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి సంగతులు మాకు చెప్పి చెప్పి తలకెక్కించారు. ఆకాశంలోని సూర్యుడు మండే వాయువుల ముద్ద అని కూడా చెప్పారు. బడిలో ఎక్కడ అటువంటి పాఠం చదివిన గుర్తు లేదు.. ఆ సంగతులు మరేదో మార్గంలో తెలిశాయి. ఆలోచన గల ఎవరికయినా తికమక మొదలవుతుంది. ఆకాశంలోని సూర్యునికి రథం ఉంటే కనిపించాలి కదా! అది ఎన్నడూ కనిపించలేదు మరి!

మండే వాయువుల ముద్దకు రథం ఎందుకు గుర్రాలు ఎందుకు

సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో 90 శాతం, ఇంకా ఎక్కువ మంది అవును అంటారు. ఈ మధ్యన కొంత మంది, పిల్లలు మాత్రమే ధైర్యంగా కాదు అనగలుగుతున్నారు. సూర్యుడు ఒకచోట ఉంటాడు. కదిలిన మనకు తెలిసే విధంగా కదలడు, అన్నారు ఆ పిల్లలు. భూమి సూర్య గోళ్లను చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంతో పాటు అది బొంగరం లాగా తన చుట్టూ తాను తిరుగుతుంది. కనుక మనకు సూర్యుడు ఉదయించిన భావం కలుగుతుంది, అని పిల్లలకు అర్థమైంది అన్నమాట.

సన్ (ఎస్ యు ఎన్) అంటే సూర్యుడు. సన్ (ఎస్ ఓ ఎన్) అంటే కొడుకు. ఎంత బాగుందీ పద్ధతి నా కొడుకు నాకు ఆకాశంలో సూర్యుని వలె వెలుగుతూ కనబడతాడు. అందరు పిల్లలు అలాగే కనబడతారు. సూర్యుడు, చంద్రుడు విరాట్ పురుషునికి రెండు కళ్ళు అన్నారు, వెనకటివారు. ఆరింటికి పోలికే లేదు. అని ఎంతమందికి అర్థమయింది

మనిషి దేవుళ్లను సృష్టించాడు. వారికి తనలాగే రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్టు ఊహించాడు. అంతకన్నా మరొకరకంగా ఊహించడం అమాయకం మనిషికి చేతకాలేదు. విరాట్ పురుషునికి 1000 కళ్ళు, 1000 కాళ్లు ఉన్నాయి అన్నారు. అది ఎట్లా వీలవుతుంది అని ఆలోచన కలిగినట్లు లేదు. ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు గనుక వదిలేద్దాం.

విజ్ఞాన సర్వస్వంలో చూస్తే ఆకాశంలో సూర్యుడు ఎల్లో డ్వార్ఫ్ రకం నక్షత్రం అని రాసి ఉంది. దాని ద్రవ్యరాశి 1,909 X 10 10 (అంటే ఒకటి పక్కన పది సున్నలు పెట్టాలన్నమాట) కిలో గ్రాములు. డయామీటర్ అంటే చుట్టుకొలత 1,392,000 కిలోమీటర్లు అని కూడా ఉంది అక్కడ. అది భూమి నుంచి తొమ్మిది కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. మరీ సరిగా చెబితే.92,955,887.6 మైళ్ళ దూరంలో ఉంది. అంత దూరాన్ని కుదించి 9 కోట్ల 30000 అంటే కొంపేమీ మునగదు. సూర్యుడు అంటే నక్షత్రం. అది చిన్న నక్షత్రం. అది పుట్టినప్పుడు కొంత పదార్థం దూరంగా చిమ్మింది. ఆ పదార్థం ముద్దలు కట్టి గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. భూమి పదార్థంలో కొంత భాగం దూరం పోయి చంద్రగోళం తయారయింది. అది భూమి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు, చంద్రుడు మధ్య పోలిక లేదని తెలిసిపోయింది. సూర్య గోళం మండుతుంది కనుక వెలుగునిస్తుంది. చంద్ర గోళానికి స్వంత కాంతి లేదు. ఈ అక్షరాలను మీరు పగలు చదువుతున్నారంటే, అందుకు అవసరమైన వెలుగు సూర్య గోళం మంట నుంచి వస్తున్నది.

ఆదిత్యాయ, సోమాయ అంటూ మనవాళ్లు గ్రహాలకు దండం పెడతారు. బడిలో మాత్రం సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతుంటాయి, అని చెప్పారు. ఇప్పుడు పాత లెక్క తప్పు, లుతో గ్రహం కాదు. ఉన్న గ్రహాలు ఎనిమిది మాత్రమే అంటున్నారు. మన సంప్రదాయంలో రాహుకేతువులను గ్రహాలు అన్నారు. వాళ్ళిద్దరూ సూర్యుని, చంద్రుని మింగితే గ్రహణం వస్తుంది అని మాకు చిన్నప్పుడు చెప్పారు. ఇప్పటి పిల్లలకు గ్రహణం గురించి బాగా తెలుసు.

ఒక విషయం గురించి రకరకాలుగా చెబితే ఎవరికైనా తికమక, అనుమానం తప్పదు. చంద్రుడు మగ (మనిషి కాదు సుమా!), నక్షత్రాలు ఆయన భార్యలు అన్నారు. సూర్యుడు, (సూర్య గోళం) ఒక నక్షత్రం. దాని చుట్టూ తిరిగే భూమి నక్షత్రం కాదు. సూర్యుని కన్నా చాలా చిన్నది అది. ఆ భూగోళం చుట్టూ తిరిగే బుజ్జి గోళం చంద్రుడు. లేదా చంద్రగోళం. ఆయనకు నక్షత్రాలు భార్యలు అంటే అది పొసగని సంగతి.

సంప్రదాయంలో చెప్పే సంగతులు వేరు. ప్రత్యక్షంగా మనం చూసేది వేరు అని ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. తికమక అవసరం లేదు. ఎవరినీ తప్పు అనడం అంతకన్నా అవసరం లేదు. పడమటి దేశాల వారు చంద్రుడిని స్త్రీగా భావిస్తారని ఎవరికైనా తెలుసునా కానీ అది నిజం.

ఋగ్వేదంలో ఒక మాట ఉంది. కాంతిగల, కాంతి కలిగించే కాంతి వెలిగితేనే, మొత్తం విశ్వమంతా వెలుగుతుంది, అని అక్కడ చెప్పారు. పాశ్చాత్య నాగరికతలో సూర్యునికి అపోలో అని పేరు. అపోలో అంతరిక్ష నౌకలు సూర్యుని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అవి చంద్రగోళ మీద దిగాయి కూడా.

అన్నింటికీ మించి గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. సూర్య గోళం నుంచి భూగోళం వరకు గల దూరం ఎంతో విచిత్రమయినది. అంతకన్నా దగ్గరగా, లేక దూరంగా ఉన్న గ్రహాల మీద జీవం లేదు. ఇన్నర్ ప్లానెట్స్ అనే దగ్గర గ్రహాలు మండిపోతుంటాయి. దూరం గ్రహాలు చెప్పరానంత చల్లగా ఉంటాయి. భూగోళం మీద మాత్రమే నీరు ఉంది. అది ఆవిరి, నీరు, మంచు అనే మూడు స్థితులలో ఉండగలుగుతుంది. కనుకనే ఇక్కడ జీవం ఉంది. నీటిని, సూర్యుని వెలుగును వాడి జీవం పిండి పదార్థం అనే తిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నది. జీవుల మనుగడకు సూర్యుడే ఆధారం. వానలు కురిసి అంతా బురద అయిన తర్వాత మళ్లీ ఎండకాస్తే, పరిస్థితి మామూలు అవుతుంది. భూమి మనకు తగిన విధంగా పొడిబారుతుంది. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదు. పగలు, రాత్రులు లేవు. రుతువులుండవు. వర్షాలు కురవవు!

ఇంతకూ సూర్యుడు అనాలా సూర్య గోళం అనాలా ఎవరైనా చెపితే బాగుంటుంది!


 

Monday, June 29, 2026

పెరుగు - సైన్స్ : Science in curds.


పెరుగు - సైన్స్


పెరుగు - సైన్స్‌

ఈ మధ్యన నాలుగైదు రోజులుగా పెరుగు సరిగా తోడు కోవడం లేదు. అవును మరి! నాలుగైదు రోజులుగా వాతావరణం మళ్ళీ కొంచెం చల్లబడింది. చలికాలం అంటూ లేకుండానే ఎండకాలం మారుతున్న తరుణంలో మళ్ళీ కొంచెం చలి మొదలయింది. చలి దుస్తులు తెచ్చుకున్న వాళ్లకు సంతోషం కలిగింది. వాటిని ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

ఉన్నట్టుండి మళ్లీ చలి మొదలు కావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాతావరణ శాస్త్రం అని చెబుతారు. సముద్రంలో మార్పులు, అక్కడి నుండి వచ్చే గాలిలో మార్పులు, ఆ గాలికి కొండలు అడ్డు రావడం, ఈలోగా మబ్బులు తయారుకావడం, మొత్తానికి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, ఇవన్నీ కలిస్తే వాతావరణ శాస్త్రం అవుతాయి. తత్వం చెప్పినట్టు ఇక పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొందము గాక అని మొదలు పెడితే, చాలామంది చెవులు మూసుకుంటారు. వాతావరణ శాస్త్రం చెబుతాను అని మొదలు పెడితే ఎవరు వినరు. ఎవరూ చదవరు.

ఎక్కడ మొదలు పెట్టాము? పెరుగు దగ్గర మొదలు పెట్టాము! మొదటి మాటల్లోనే వాతావరణ శాస్త్రంలోకి వెళ్ళిపోయాము. అందులో బోలెడంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం కలగలిసి ఉంటాయని చెబితే, ఆశ్చర్య పడని వాళ్ళు, ఇంకేం చెప్పినా ఆశ్చర్యపడరు. మళ్లీ పెరుగు దగ్గరికి వెళ్లి పోతాము. పాలలో, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేస్తే మరునాటికి అది పెరుగుగా మారుతుంది. ఏం పెరిగిందని, పాలు, పెరుగుగా మారినవి? జవాబు వినడానికి కొంతమందికి ధైర్యం అవసరం. పెరుగు లేదా మజ్జిగలో లాక్టోబాసిల్లస్‌ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగానే పెరుగు పెరుగు అవుతుంది. కొంచెం పెరుగును పాలలో వేస్తే, అక్కడ సూక్ష్మజీవులు పెరుగుతాయి. సంఖ్యలో విపరీతంగా పెరుగుతాయి. కనుక దాని పేరు పెరుగు అవుతుంది. పప్పు తినేవాళ్ళకు తాము సూక్ష్మజీవులను మహా ఇష్టంగా తింటున్నాము అని తెలిస్తే బహుశా కడుపులో తిప్పవచ్చు. అందుకని పాలు పెరుగు లేని, వేగన్ తిండి అని ఒకటి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనకు అవసరం లేదు. మొత్తానికి పెరుగు తయారీలో జీవశాస్త్రం, అందులో సూక్ష్మజీవశాస్త్రం ప్రత్యక్షంగా మన ముందు పని చేస్తున్నదని అర్థం చేసుకోవాలి. అందుబాటులో సూక్ష్మదర్శిని అనే మైక్రోస్కోప్‌ ఉన్నవాళ్లు ఒక పెరుగు చుక్కను స్లైడ్‌ మీద వేసి దాని కింద పెట్టి చూడాలి. లుకలుకలాడుతూ కావలసినన్ని సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పప్పు తినే వాళ్ళు ఇక ఆ తరువాత పెరుగు తినడానికి అనుమానం రావచ్చు. ఇది కూడా ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు.

పెరుగులో, కనీసం పెరుగు తయారీలో, కావలసినంత రసాయన శాస్త్రం, మరింత భౌతిక శాస్త్రం కూడా ఉన్నాయి. పాలలో ఉండే ప్రోటీనులు, వాటిని కలిపి ఉంచే నీళ్లు, మిగతా అంశాలు ఒక రకంగా ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చి పెరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడాలు వస్తాయి. ఆమ్లాలు పుడతాయి. కనుక పాలలోని తీపి పోయి, పెరుగులోని పులుపు మొదలవుతుంది.

ఇక భౌతిక శాస్త్రం సంగతి! సూక్ష్మజీవులు పెరగడానికి, ఒక రకమైన ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే అవి నిజంగా పెరుగుతాయి. అప్పుడు పాలు పెరుగుగా మారతాయి. చలికాలం వస్తే, అవసరమైన వేడిమి ఉండదు. కనుక పాలు తోడుకోవు. ఉత్తర భారతదేశంలో తోడు పెట్టిన పాల గిన్నెకు, స్వెటర్లు, దుప్పటి ముక్కలు చుట్టి ఇంటి బయట పెట్టడం చాలామందికి అలవాటు. కొంచెం వెచ్చదనం కలిగి పెరుగు తొందరగా తయారవుతుందని వారి ప్రయత్నం. మన దగ్గర ఉండే ఈ కొంచెం చలికి మాత్రమే, పాలు తోడుకోవడం కష్టం అయితే, ఉత్తర భారతదేశంలోని వణికించే చలిలో, సూక్ష్మజీవులు పెరగడం, పాలు పెరుగుగా మారడం, ఇంచుమించు అసాధ్యం అవుతుంది. అలవాటుగా తరతరాలుగా, లేదంటే యుగాలుగా జరుగుతున్న ఈ పెరుగు కార్యక్రమంలో పెరుగుతున్నవి సూక్ష్మజీవులు అని తెలిస్తే, అద్భుతం అనిపించడం లేదా? అది సైన్స్‌ లోని ఆనందం! అడుగడుగున, చూడగల ప్రతి అంశంలోనూ, సైన్స్‌ దాగి ఉంటుంది. అది అర్థం అయినప్పుడు సైన్స్‌ రుచి మొదలవుతుంది. అందులో ఒక ఆనందం కలుగుతుంది. మనవాళ్లు పాత కాలంలోనే, విజ్ఞానం కన్నా అది అర్థం అయినప్పుడు కలిగే ఆనందము అసలైన పరబ్రహ్మము అని చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన పద్ధతి మరొక రకంగా ఉండి మనకు అర్థం కాలేదు.

సైన్స్‌ రుచి తెలిసిన వాళ్ళు, చిన్న పెద్ద, ప్రతి అంశం వెనుక ఉన్న సైన్స్‌ గురించి వెతుకుతారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు రుచి మరింత పెరుగుతుంది. ప్రపంచం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రకృతి చేస్తున్న మహిమలు తెలుస్తాయి. బ్రతుకు మరింత ఆశాజనకంగా కనబడుతుంది. బ్రతుకు అర్థం తెలిస్తే, పెరుగు తయారయ్యే పద్ధతి తెలిస్తే గొప్పగా ఉంటుంది అన్న విషయంలో అనుమానం లేనేలేదు!


 

Thursday, June 11, 2026

తెలివి ఎవరి సొమ్ము On knowledge and Gender


తెలివి ఎవరి సొమ్ము?

తెలివి ఎవరి సొమ్ము?

నవల్సు రాయడంలోనూ, నాట్యమాడడంలోనూ కావలసినంత మంది అమ్మాయిలున్నారు గానీ, సైంటిస్టులుగా మాత్రం లేడీసు ఎక్కువగా లేకపోవడానికి కారణం ఏమిటని చాలా కాలంగా ప్రశ్న ఉండనే ఉన్నది. ఈ పద్ధతి ఇవాళ కొత్త గాదు. లేచింది మహిళా లోకం!’ అన్న పాట పుట్టక ముందునుంచీ ఇలాగే ఉంది. పురుషాహంకారం అంతగా లేదనుకుంటున్న సమాజాలలోనూ ఇలాగే ఉంది.

ఉండగా, ఉండగా 2005 జనవరిలోని ఒకానొక శుభోదయాన లారెన్స్ సమ్మర్స్ అనే ఒకానొక పరిశోధకుడు పేరుకు తగినట్టుగానే వాతావరణం ఎంచుకుని, ఎండలాగే మండించే సిద్ధాంతాన్ని ఒకదాన్ని ప్రపంచం ముందు పెట్టాడు. అతనేదో లాకాయి లూకాయి అయితే ఎవరూ పట్టించుకునే వారు గాదేమో. తెలివికి రాజధాని లాంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధిపతి అతను.

ఆడా మగా మెదడుల్లోపల, అంతరాంతరాల్లో ఉన్న అంతరం – అదే తేడా, కారణంగానే అమ్మాయిలు అంతగా సైన్సులోకి రావడం లేదని సమ్మర్స్ గారి నమ్మకం. ఆడవాళ్లకు తెలివి కొంచెం తక్కువ అన్న వాదం ఒకప్పుడు  మొదలయి, రకరకాల కారణాలుగా మరుగున పడిపోయింది. సమ్మర్స్ గారి పుణ్యమా అని అదిప్పుడు మళ్లీ రగులుకుంది. ఆడా మగా మెదడు నిర్మాణంలో తేడాలున్నాయని ఎప్పటినుంచో తెలుసు. పనితీరులో కూడా తేడా ఉందని ఆ మధ్యన అన్నారు. కానీ ఆ కారణంగానే, వారికి సైన్సు, లెక్కలు, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగు లాంటి విషయాలు తలకు ఎక్కడంలేదని మాత్రం ఎవరూ తేల్చి చెప్పలేక పోయారు.

తేడాలున్నమాట మాత్రం నిజమేనంటున్నారు అందరూ. ఆ తేడాల వల్ల తెలివి మీద ప్రభావం లేదు, కానీ చిత్రంగా ఒక ఆలోచన బయట పడింది. రకరకాల చికిత్సల విషయంలో అందరికీ ఒకే మందు కాకుండా, తేడాను బట్టి ఆడ మందులు, మగ మందులు వాడితే బాగుంటుందని పరిశోధకులు అంటున్నారు. మానసిక రుగ్మతలయిన డిప్రెషన్, అడిక్షన్, షిజోఫ్రీనియా, స్ట్రెస్ సంబంధ సమస్యల్లో ఈ పద్ధతి మరింత బాగా పని చేసే వీలుందంటున్నారు. ఇక మీద మెదడు, మందుల గురించి వరిశోధన చేసే వారంతా, ఆడా మగ తేడాలను కూడా తమతమ పరిశోధనలకు జత చేసి చూస్తే, మంచి ఫలితాలుంటాయని అంటున్నారు.

మెదడు నిర్మాణం, పనితీరుల్లో తేడా ఉందని తెలుసు. ఆ తేడా ప్రభావం లైంగిక విషయాల మీదే ఉంటుందని అనుకున్నారు. చివరకు చుంచులలో కూడా, హైపొతలామస్ అనే భాగం, ఆడా మగా తేడాను బట్టి వేరువేరు ప్రవర్తనలకు కారణమవుతుందని గమనించారు.

హైపొతలామస్ సెక్స్ హార్మోన్ల విడుదలకు కేంద్రం. అందుకే న్యూరో సైంటిస్టులంతా, తేడా సెక్స్ వరకే పరిమితం అన్న అభిప్రాయానికి చేరుకున్నారు. ఈ భావాలకు ఈ మధ్య గట్టి కుదుపులు తగులుతున్నాయి. లింగభేదం ప్రభావం కేవలం లైంగికత మీద మాత్రమే గాక, జ్ఞాపక శక్తి, భావాలు, దృష్టి, వినికిడి, ఒత్తిడిని తట్టుకునే తీరు మొదలయిన వాటి మీద కూడా ఉంటుందని పరిశీలకులు సూచించారు. మెదడులోకి తొంగి చూడడానికి పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లాంటి పద్ధతులు రావడంతో, గత అయిదు పదేళ్లలో ఈ రకం పరిశోధనలు ఎక్కువయ్యాయి. ఫలితాలు ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. నిక్షేపంగా బతికి ఆలోచిస్తున్న వారి మెదళ్ల మీదకూడా పరీక్షలు చేయగల అవకాశం ఉండడం గమనించదగిన సంగతి.

మెదడు నిర్మాణంలో, స్త్రీ పురుషుల మధ్య తేడాలు చాలా భాగాల్లో ఉన్నట్లు గమనించారు. పై స్థాయికి కేంద్రమయిన ఫ్రాంటల్ కార్టెక్స్ ఇందులో ఒకటి. నుదురు ఎంత విశాలంగా ఉంటే తెలివి అంత ఎక్కువగా ఉంటుందని, అనుభవం మీద మనవాళ్లు చెప్పడం తెలిసిందే. నుదురులో ఉండే ఈ ఫ్రాంటల్ కార్టెక్స్ తెలివికి కేంద్రం అన్నమాట పరిశోధకులు అంగీకరించిందే. అయితే పోల్చి చూస్తే ఈ భాగం మగవారికన్నా ఆడవారిలో ఎక్కువగా ఉంటుందని మాత్రం ఈ మధ్యన అర్థమయింది. భావాలను అదుపు చేసే లింబిక్ కార్టెక్స్ కూడా స్త్రీలలోనే ఎక్కువగా ఉందంటున్నారు.

తేడాలో పెద్దది, చిన్నది అంటే, దేనికంటే అన్న ప్రశ్న పుడుతుంది. మొత్తం మెదడుతో పోలిస్తే, అందులో ఒక భాగం ఎంత ఉందన్న నిష్పత్తి ప్రకారం ఈ కొలతలను తీస్తారు.

భాషను అర్థం చేసుకోవడం, మొత్తం మీద అవగాహన లాంటి లక్షణాలకు కేంద్రమయిన భాగాలలో, చివరకు కణాల స్థాయిలో కూడా తేడా ఉందని తెలిసింది. కడుపులో శిశువు ఆడా మగా తేడా, ఊపిరికన్నా ముందే మొదలవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

సమ్మర్స్ గారి వాదం సంగతి తర్వాత తేలుతుంది గానీ, మొత్తానికి మెదడు స్థాయిలో ఆడా మగా మధ్య తేడా ఉందని తేలిపోయింది. అన్నట్లు రాజకీయాలలో రాణించే రాణులు తక్కువ. ఉన్నవాళ్లలో చాలా మంది ఇల్లుగలాయన తరఫున వచ్చినవారు. ఈ సంగతి ఆలోచించాలి!


 





 

Sunday, June 7, 2026

లోకాభిరామం : తోలుబొమ్మలాట

 


లోకాభిరామం : తోలుబొమ్మలాట


తోలుబొమ్మలాట
మా ఊరు పాలమూరు అనే మహబూబ్‌ నగరానికి దగ్గరగ ఉన్నది. కనుక మా దగ్గర పోరగాండ్లకంత సీన్మ చూడడం బాగ అలవాటు. సీన్మకు వోదమా అన్నది ప్రశ్న అయితే నాతానైతే దుడ్లులేవు. ఇయాల నీవు వెట్టు. మల్ల వొయినప్పుడు నేను వెడుత, అంటూ సాగేవి. అయినా ఆ సినిమాలు అందరికీ అర్ధ్థమవుతయి కనుకనా. లవకుశ లేదంటే ఓ మైరావణ వంటి సినిమా వస్తే అందరికీ అర్థమవుతుంది. రాము అని ఒక సీన్మ వచ్చింది. అందులో ఒక తండ్రి, తల్లిలేని పిల్లగాణ్ణి పెంచునేందుకు నానా యాతన వడతడు. ఎద్దులబండ్లు కట్టుకుని వల్లెలనుంచి కూడ మనుషులు వచ్చి ఆ సినిమాను చూసి చేతనైనంత ఏడ్చి ఎళ్లిపొయినరు. అంతేగాని మరేవో పిచ్చి సీన్మలు వస్తే అవి అర్ధం అయి చావవు గద!
కనుకనే వల్లెలో చిరుతల రామాయణం అంటాని ప్రతిరాత్రి కాలక్షేపం కొంతకాలం గడిచింది. బైండ్ల కథలు, జముకుల కథలు లాంటి వినోద కార్యక్రమాలు గూడ పల్లెలో వుష్కలంగ ఉండేటివి. ఇక ఏనుగొండ అనే మా వల్లెకు మరింత ప్రత్యేకత ఉంది. బోగమాట అనే వీధినాటకం మాపల్లెలో బాగ పెరిగింది. కేశవయ్యగారు అనే ఒక పెద్దమనిషి వీధి నాటకాలు రాసేవాడు. వాటికి వరుసలు కట్టేవాడు. అవసరమైన దుస్తులు కుట్టేవాడు. కిరీటాలు, భుజకీర్తులు తయారు చేసేవాడు. ఈ రకంగా ఆయన ఒకే మనిషి అన్ని కళలకు కేంద్రంగా ఉండి, ఊళ్లో పిల్లలను, పిల్లలేనేమి పెద్దలను గూడ చేరదీసి బోగమాట నేర్పించెటోడు. మూడున్నర వజ్రం అని ఒగ ఆట ఉండేది. దాని అస్సలు పేరు కృష్ణగారడీ. అటువంటి ఆట నుంచి మొదలు మా ఊర్లె గూడ లవకుశ ఆడేవాండ్లు. బబ్రువాహన ఆడేవాండ్లు. ఎన్నెన్నో కథలు ఆడేవాండ్లు. పండుగ లేక ఎవరన్న పెద్దఇంట్లో పెండ్లిగాని వచ్చిందంటే ఊళ్లో కేంద్రంలో బోగమాట ఏర్పాటు అవుతుంది. దానికి కావలసిన ఖర్చును ఎవరో ఒకరు భరిస్తరు. ఫలానివాండ్లు ఆట చెప్పినరు అని ఊరంతా పాకి పోయేది. ఇక రాత్రంతా కూసోని ఆట చూచేందుకు అందరు సిద్ధం.
ఇది ఇట్లుండంగ చిన్నప్పుడు నేను అప్పుడో ఇప్పుడో తోలుబొమ్మలాట చూసిన గుర్తు. ఈ తోలుబొమ్మలాట వాండ్లు
స్థానికులు కాదు. రాయలసీమ నుంచి వస్తరని తరువాత తరువాత తెలిసింది. ఈ ఆటకు పెద్ద గుడారం అవసరం లేదు.
ఆడేవాళ్లు మాత్రం గుడ్డలతోటి తడుకలతోటి ఒక గది వంటిది కడతరు. దానికి ఒక వైపున బట్టతో తెర ఏర్పాటు చేస్తరు.
ఆ లోపల కళాకారులు ఉంటరు. వాళ్ల దగ్గర ఇంచుమించు మనిషి ఉండేటంత ఆకారంలో ఉండే బొమ్మలుంటయి. ఆ బొమ్మలను కర్రల సాయంతోని తెరమీద అదిమివట్టుకుని వెనకనుంచి పడే ఎలుతురులో ఆ బొమ్మలు తెర మీద కనిపించేటు చేసి ఆట సాగించేవాండ్లు. చక్కగ పాటలు డైలాగులు గూడ ఉంటయి. తోలుబొమ్మలాటలో భారతం కన్న రామాయణం ఎక్కువ చూసినట్లు గుర్తు ఉంది. హనుమంతుడు వస్తడు. దశకంఠుడు వస్తడు. అతని ముందు ఆంజనేయుడు తోక చుట్టుకోని అల్లంత ఎత్తున ఎక్కి కూర్చుంటాడు. రావణునికి పది తలలు ఉంటయి. తెరమీద సగం వెడల్పు అతనే కనిపిస్తడు. అంత ఎత్తు కూడా ఉంటడు. వెనుక వాండ్లు పాటలు పాడుకుంటు కింద పెట్టిన సానరాళ్ళ మీద కాలితోటి దరువులు ఏసుకుంటు చక్కగ కథను రక్తి కట్టించేవాండ్లు. హనుమంతుడు ఏసిన కుప్పిగంతులు వాళ్లు తెర మీద చూపించిన తీరు ఏంతో ప్రత్యేకంగ ఉండేది. నాకు నిజానికి వాళ్లు పాడిన పాటలు జ్ఞాపకం లేవు. అయితే తోలుబొమ్మలాట లోని ఒక అంశం మాత్రం గట్టిగ గుర్తు ఉన్నది.
హాస్యం పేరిట తోలుబొమ్మలాటలో మధ్యన అత్త, పిల్లోడు అని రెండు పాత్రలు వస్తయి. పిల్లోడు అనే అల్లుని చేత అత్త పని
చేయించాలంటని ప్రయత్నిస్తుంది. గడ్డి తీసుకు రమ్మంటది. తిండి ఆశ పెడుతది. తాటి బెల్లం, తమిద రొట్టెలు పెడత
అయ్య పోరా గడ్డికి, మా అయ్య పోరా గడ్డికి అంటుంది. వాడు ఆమెకు అయ్య కాదు. వాని ద్వారా నాటకంలో బండ బూతులు
పలికించేవాండ్లు. ఆ కాలంలో హాస్యం అంటే బూతు లేకుండ గడిచేది కాదేమో. మూడు రొట్టెలు ముడ్డికి, నా మొ.... పోత
గడ్డికి, అంటూ వాడు పాడతడు. ఇక చూడవచ్చిన వాళ్ళ ఆనందానికి అంతు ఉండదు. నాకు కూడా ఈ ఒక్క పాట జ్ఞాపకం. అంతటితో ఆగకుండా పిల్లోని పాత్రకు పొడుగాటి బెల్లకాయ కూడ ఉన్నట్టు చూపించేవారు. అప్పట్లో అది బూతుగా
అనిపించలేదేమో? నాకు ఇవ్వాళటికి ఆ నంగతి అర్థం గాదు.
ఈ మధ్యన ఎక్కడ తోలుబొమ్మలాట వాండ్లు కనిపిస్తున్న జాడ లేదు. సురభి వాండ్ల నాటకం కంపని హైదరాబాద్‌ కు చేరింది గాని రాయలసీమలోనే ఉన్న తోలుబొమ్మల వాండ్లు మాత్రం పట్నం చేరినట్టు లేదు. అక్కడనో ఇక్కడనో తోలుబొమ్మలాట పద్ధతిలోనే మరేమో వస్తువులను తయారు చేసి అమ్ముతున్నట్టు కనిపించింది. చిన్న చిన్న బొమ్మలు కూడా అమ్మకానికి కనిపించినయి. మొత్తం నాటకం జరగాలంటే పెద్ద జట్టు ఉండాలె గద? అది బహుశా వీలవుతున్నట్టు లేదు.
నిజానికి తోలు బొమ్మలు తయారు చేయాలంటే, అదొక పెద్ద తతంగం. దాని గురించి ఎక్కడనో చదివే అవకాశం కూడా దొరికింది. చాలాకాలంపాటు బొమ్మల కోస్రం జింక చర్చం వాడేవాండ్లట. జింకలను వేటాడడం ఇప్పుడు కుదరదు. అసలు అవి ఉన్నాయో లేదో గూడ తెలువదు. కనుక ఆ మధ్యన బొమ్మల కోస్రం మేక చర్మాన్ని వాడడం మొదలయిందట.
పెద్ద సైజు బొమ్మలను తయారు చేయాలంటే ఒక మేక చర్మం సరిపోదు. రావణానురుని బొమ్మకు మూడు మేకల చర్మం అవుసరం అవుతుందట. అందుట్లో ఒక మేక పది తలకాయలకు పోతే, ఒకటి కాళ్లకు పోతే, మరొకటి శరీరానికి సరిపోతుంది. ముందు ఆ చర్చాన్ని పారదర్శకంగ వచ్చేట్టు తయారు చేయాలె. ఆ తరువాత దానిమీద బొమ్మ ఆకారం కత్తిరించాలె. దుస్తుల ప్రకారం బొమ్మ గీసి అందుట్లోనుంచి వెలుగు బయటకు కనిపించేటట్టు రంధ్రాలు వేయాలె. ఆ రంధ్రాల వెంట గీతలు గీసి రంగులు వూయాలె. నిజంగనే పాత కాలంలో రంగులు కూడా వాండ్లే తయారు చేసుకునేవారు. ఉదాహరణకు మోదుగు వువ్వులనుంచి అవసరమైన పనువు, ఎరుపు రంగును తయారు చేసే వాండ్లట. ఇప్పుడు అదంతా కుదిరే పరిస్థితి కాదు. కనుక రసాయనం రంగులను వాడక తప్పదు.
అసలు ముందు చర్మాన్ని బొమ్మలకు అనుగుణంగ పారదర్శకంగ తయారు చేయడమే పెద్ద కళ. దాన్ని బొమ్మలు ఆడించే వాండ్లే చేసుకుంటరు అంటే అంతకంటే ఆశ్చర్యం లేదు. కనుకనే ఈ కళ రానురాను మరుగున వడుతున్నది. కొన్ని బొమ్మలు కేవలం నలుపు తెలుపు రంగులో ఉండడం కూడా నేను చూసిన. అటువంటి బొమ్మలు ఆడించినవుడు అంత ఆకర్షణీయంగా ౦డవేమో.
నేను ఆ మధ్యన కాకిపడిగెలు అనే ఇంకో రకం బొమ్మలాట చూసిన. ఇందులో తెర, దీవం నీడలు మరో రకంగా ఉంటయి.
కథ పటాల వలే చిత్రించి ఉంటుంది. దీవం వట్టుకొని పటాలముందు బొమ్మలు చూపిస్తూ కథలు చెబుతంటరు.
జానపద కళలు మరుగున పడుతున్నయి. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాస్త్రీయ సంగీతం లాంటివి కూడ కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నయి. అందరికీ అందుబాటులో ఉన్నయి అనుకున్న పనులు కూడా లేకుండ పోతే ఇక చివరికి మిగిలేది ఏమిలేదు. ఆ సినిమా ఎవరికి కావాలె? చాలామందికే గావాలె. వాండ్లుకు మరి పాతకాలపు కళల
గురించి తెలియదు.
బైండ్ల కథలు, జముకుల కథలు, బుర్రకథ మొదలైనవి ఆయా పద్ధతులను వృత్తిగా చెప్పేవాండ్లు మాత్రమే నేర్చుకుని మిగతా
వారికి అందిస్తారు. ఔత్సాహికులు వీటిని నేర్చుకోని అందరిముందు ప్రదర్శించడం కుదిరేదికాదు. చుక్క సత్తయ్య లాంటివారు
ఒకతను అందరికీ నేర్పించే ప్రయత్నం చేసినట్టు ఉన్నరు. మిగతావాటి గురించి ఈ రకమైన ప్రయత్నాలు కనిపించవు.
కానీ మా చిన్నతనంలో మా ఊరికి ఒక పంతులు వచ్చి ఉండిపోయినడు. అతను పల్లెలోని యువకులందరినీ ఒక చోటచేర్చి చిరుతల రామాయణం అనే ఒక పద్ధతి జానపద ప్రదర్శనను నేర్పించినడు. అందులో సుమారు 50 మంది పాత్రధారులు. రామాయణం కథ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాడినట్టు గుర్తుంది. ప్రదర్శన వారం రోజులపాటు సాగినట్టు గుర్తుంది. యువకులందరూ ఒకటికి రెండు పాత్రలు నేర్చుకుని రోజు రోజుంతా ఆ పాటలను కూనిరాగాలుగా తీయడము నాకు ఇవ్వాళటికి గుర్తుంది. మొత్తానికి చిరుతల రామాయణం ప్రదర్శన చాలా బాగ జరిగింది. దీనికి ఒక వేదిక అంటని లేదు. కళాకారులు చుట్టూ గుండ్రంగా నిలబడతరు. చేతులలో చిరుతలు అనే వాయిద్యాన్ని వట్టుకోని దానితో లయబద్ధంగా వాయిస్తూ పాటలు పాడుతుంటరు. ఆ సందర్భంలో కథ జరుగుతున్న పాత్రలు మధ్యలోకి వచ్చి తమతమ సంభాషణలను వినిపించినట్టు గుర్తున్నది.
కళాప్రదర్శనలలో ఈ రకంగా పాల్గొన్న యువత నిజంగ గొప్ప ప్రేరణ పొందిన భావం నాకు మిగిలి ఉంది. ఇప్పుడు పల్లెల్లో
ఎవరికైనా ఇటువంటి పనులు గుర్తున్నయా? అడగడానికి నేనెవరిని? నేను కనీసం చూడడానికి కూడా పల్లెకు పోవడం లేదు. పల్లె పట్టణానికి వచ్చే అవకాశం లేనే లేదు. ఆ మధ్యన ఆయనెవరో ఒక 12 తీగల వాయిద్యం వాయిస్తడని పాలమూరు నుంచి వచ్చినడు. అతని గురించి ఫేస్బుక్ లో ట్విట్టర్‌ లో దుమారం రేగింది. అంతేగాని అతని ప్రదర్శన వలుచోట్ల పెట్టి చూసినవాళ్లు ఎంత మందో నాకు తెలియదు.
కథలు మారిపోతున్నయి. కళలు మారిపోతున్నయి. కాలాలు మారిపోతున్నయి. పాత పద్ధతులు ఎవరికి వట్టవు. అవి పరిశోధన పుస్తకాలలో మాత్రమే మిగిలి పోతయేమో. జానపద నంగీతం పరిస్థితి కూడ ఇంచుమించు అట్లగే ఉంది. ఈ మధ్యన జానపద శైలిలో వచ్చే సంగీతాన్ని జానపదం అనుకుని అందరూ ఆనందంగ వింటున్నరు. అసలు జానపదుల పాటలు ఏమయ్యినయి అర్ధం గాదు. ఆ సంగతి చెప్పినా ఎవరికీ వట్టదు. నేనిక్కడ ఒక విషయం గురించి ఏడవాలని ప్రయత్నించడం లేదు. గుర్తుకు వచ్చిన కొన్ని అంశాలు ఎక్కడైనా మిగిలి ఉన్నయేమో తెలుసుకుందం అని ఒకటే నా ఆశ.




Wednesday, June 3, 2026

Tuesday, May 26, 2026

లోకాభిరామం : అహమదాబాద్ లో On my Ahmedabad visit


లోకాభిరామం : అహమదాబాద్ లో 

లోకాభిరామం - అహమదాబాద్ లో

పార్లమెంట్ ఎన్నికలకన్నా చాలా ముందు అంటే మార్చి నెల చివర్లో నేను ఒక వారంపాటు ఉత్తర భారతదేశంలో తిరిగాను. అది నిజానికి విహారయాత్రగా పథకం ప్రకారం చేసిన ప్రయాణం కాదు. మరొక అవసరం మీద ఒక పెద్దమనిషి బయలుదేరితే అతనితోపాటు నేను కూడా వెళ్లి తిరిగాను. మొదట అహమదాబాదు వెళ్లాము. అక్కడి నుంచి రిషికేశ్, కురుక్షేత్ర, షిమ్లా, ఆ తర్వాత దిల్లీ. అంటే ప్రయాణం కనీసం ఐదారు రాష్ట్రాలలో సాగింది అని అర్థం. వెళ్లిన ప్రతిచోట అనుభవాలు గొప్పగానే ఉన్నాయి. వాటన్నిటిని గురించి చెప్పుకోవాలంటే సరైన సందర్భం, సమయం ఉండాలి. ఎంతదూరం తిరిగినా నాకు ఎక్కడా ఎన్నికల సూచనలు కనిపించలేదు. అహమదాబాదులో అంతకన్నా ఆశ్చర్యాలు ఎదురయ్యాయి. నేను నిజానికి ఆ నగరాన్ని చూసి చాలా కాలమైంది. అప్పట్లో నాకు అది ఒక పాత నగరంగా కనిపించింది. ఇప్పటి నగరాన్ని నేను గుర్తించలేక పోయాను. స్థానిక మిత్రుడు ఒకాయన మమ్మల్ని పాత కొత్త నగరాలతోపాటు పక్కనే కట్టిన గాంధీనగర్‌కు కూడా తీసుకువెళ్లాడు. మొట్టమొదట ఆ నగరంలోని రోడ్ల గురించి చెప్పుకోవాలి. నగరం మధ్యలో నడుస్తున్న దారులు ఆరు లేన్లు కలిగి ఉన్నాయి అంటే ఆశ్చర్యం. వాటిలో ఒక లేన్ కేవలం ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకించబడింది. ఆ బస్సులకు ఇంచుమించు రైల్ స్టేషన్ లాగా అందమైన స్టాప్‌లు ఉన్నాయి. బస్సులో ఎక్కే అవకాశం నాకు దొరకలేదు. మన దగ్గర రోడ్లలో ఆర్టీసీ బస్సులు చేసే విన్యాసాలు గుర్తుకు వచ్చిన తరువాత మనవాళ్లకు ఈ తరహా ఆలోచనలు ఎందుకు రాలేదు, అన్న ప్రశ్న మెదడులో గట్టిగా కదిలింది. ఇక అక్కడ కడుతున్న భవనాలను చూస్తే అయిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. చిన్నది అనుకున్న భవనంలో పన్నెండు అంతస్తులు కనిపించాయి. ఇరవై ఐదు అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. అవి లెక్కలేనన్ని ఉన్నాయి. అన్నిటిలోనూ నిర్మాణం చురుకుగా సాగుతున్నది. కొన్నింటిలో జనం కాపురాలు ఉంటున్నారు. దారి వెంట వెళుతున్న నాకు కొన్ని హోటేళ్ల పేర్లు ఆకర్షణగా కనిపించాయి. అవన్నీ అసలు సిసలైన దక్షిణ భారతం పద్ధతిలో ఉన్నాయి. పట్టలేక ఏమిటి పరిస్థితి? అని అడిగాను. ఆ ఊళ్లో ఉద్యోగాల పేరుమీద వచ్చిన దాక్షిణాత్యులు లెక్కలేనంత మంది ఉన్నారట.
ఆరోగ్యం కారణంగానో, మరే రకంగానో పని మానుకున్న వారికి తప్ప అక్కడ పనికి కొదవలేదు. తిండికి అంతకన్నా కొదువ లేదు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకనే మిగతా ప్రాంతాల వాళ్లు అంతా అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారట. ఈ సంగతి చెప్పిన యువకుడు నాకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు. అతని పేరు రరుూస్. అంటే ధనవంతుడు అని అర్థం. ధనవంతుడు అవునో కాదో తెలియదు గానీ అతను గుణవంతుడు. టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంచి మాటకారి. అతని కారులో ముందు పక్కన కమలం గుర్తు గల పవిత్ర వస్త్రం కనిపించింది. మొహమాటం లేకుండా అదేమిటి? అని అడిగాను. ఇక కమలం పార్టీ గురించి గొప్పగా పొగడుతూ చెప్పిన సంగతులు నాకు ఇంకా గుర్తున్నాయి. సరిగ్గా మాటకు మాట జ్ఞాపకం లేదు కానీ, మంచి జరుగుతుంటే దాన్ని చేస్తున్నది ఎవరు? అన్న ప్రశ్న రాకూడదు. 2002 సంవత్సరం తరువాత మా దగ్గర హిందూ ముస్లిం భేదభావాలు అందరూ మరిచిపోయారు. ఎన్నికలు వస్తే కళ్లు మూసుకుని అందరూ కమలం గుర్తుకే ఓటు వేస్తారు అని అతను తెగేసి చెప్పాడు.
అహమదాబాదులో అసలు సిసలైన గుజరాతి భోజనం అంటూ ఒకచోటికి తీసుకువెళ్లారు. ఢోక్లా, సమోసాలతో మొదలైన ఆ భోజనం అడిగినప్పుడల్లా అందిస్తున్న మామిడి పళ్లరసంతో ముగిసింది. నిజానికి ఆ మామిడి పళ్లు కూడా మనకు తెలిసిన రకం కానే కాదు. అటువంటి భోజనం రాజస్థాన్‌లో కూడా ఉంటుంది. వాళ్ల హోటేళ్లు హైదరాబాదులో ఉన్నాయి కనుక ఇక్కడ కూడా ఆ రకం భోజనం దొరుకుతుంది. ఇక నాకు ఎప్పటినుండో ఉన్న కోరిక ప్రకారం ఫాలూదా కావాలి అన్నాను. స్థానిక మిత్రుడు జోషీ, మమ్మల్ని ఊరంతా తిప్పి ఒకచోటికి తీసుకువెళ్లాడు. అక్కడ అనుకున్న ప్రకారం ఆశ్చర్యకరమైన ఫాలూదా దొరికింది. మరునాటి సాయంత్రం మరొక ఆశ్చర్యం ఎదురయింది. తీన్ దర్వాజా అన్న ప్రాంతం గురించి నాకు ముందు కూడా తెలుసు. అక్కడికి దగ్గరలోనే మనీష్ చౌక్ అనే ప్రాంతం ఒకటి ఉంది. అక్కడ అన్నీ నగల దుకాణాలు ఉంటాయి. కానీ రాత్రి పడిందంటే ఆ అంగళ్లనీ మూసేస్తారు. దారులన్నీ ఒక ఈట్ స్ట్రీట్‌గా మారుతాయి. జిలేబీ నుంచి మొదలు దోసెల దాకా అక్కడ దొరికే తిండి రకాలను గురించి చెప్పడానికి వీలు ఉండదు. దారి నిండా బల్లలు పరిచి కుర్చీలు వేసి ఉంచారు. మధ్యలో, పక్కలకు బళ్ల మీద వంటలు జరుగుతూంటాయి. తిండి సంత ఆ రకంగా రాత్రి రెండు, మూడు గంటల దాకా సాగుతుందట. జోషి ధైర్యంగా ఆ ప్రాంతంలోకి కారు పోనిచ్చాడు. పార్కింగ్ చేయడానికి స్థలం సంపాదించాడు. ఇక తిండి మీద పడ్డాము. నాకు రాత్రి పూట తిండి తినడం అంతగా అలవాటు లేదు. జున్ను తురుము వేసిన సాండ్విచ్ తిన్నాను. ఆ తరువాత అక్కడి స్పెషల్ అంటూ నన్ను మళ్లీ ఒక ఫాలూదా అంగడికి తీసుకువెళ్లారు. స్వంతదారు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు. తన అంగడికి ప్రపంచమంతటా పేరు ఉంది అన్నాడు. యూ ట్యూబ్‌లో తమ అంగడి వీడియో చూడమన్నాడు. నిజంగానే సరుకు కూడా చాలా బాగుంది. అక్కడ తినడం అది నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం.

మరుసటి నాడు మేము సర్దార్ సరోవర్ దగ్గర ప్రపంచ రికార్డ్ గల వల్లభభాయి పటేల్ విగ్రహాన్ని చూడడానికి బయలుదేరాము. అది అహమదాబాద్ నుండి చాలా దూరంలోనే ఉంది. హైవే మాత్రం అద్దంలాగా ఉంది. గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి పేరు ఏదో చెప్పారు. మధ్యలో అందరికీ అమూల్ పేరు మీద తెలిసిన ఆనంద్ అనే నగరం వస్తుంది. అది నిజానికి రోడ్డు పక్కన ఉండదు. ఎడమకు తిరిగి బాగా లోపలికి వెళ్లాలి. వెళ్లినా అంత సులభంగా అక్కడి కర్మాగారాలను చూడనివ్వరు. అందుకు ముందే అనుమతి తీసుకోవాలి. కనుక మేము అమూల్ పాల ఉత్పత్తుల కేంద్రాలను చూడలేక పోయాము. దేశమంతా పేరున్న అమూల్ తిండి పదార్థాల తీరు అక్కడ అంటే అహమదాబాదులో మరో రకంగా ఉంది. మేమున్న హోటేల్‌కు దగ్గరలోనే ఉన్న ఒకానొక అమూల్ కాంటీన్‌కు వెళ్లాము. అక్కడ ఐస్ క్రీమ్, పాల ఉత్పత్తులు మాత్రమే గాక రకరకాల తిండి పదార్థాలు అమ్ముతున్నారు. అన్నింటిలోనూ అమూల్ ఉత్పత్తుల ప్రమేయం ఉంది. గుజరాత్ వాళ్లు సైన్యంలో తప్ప మిగతా ఏ రంగంలోనయినా బాగా పని చేస్తారు అనిపించింది. గిరీష్ కర్నాడ్ తీసిన సినిమా మంథన్ గుర్తుకు వచ్చింది. అది అమూల్ వెనుకనున్న వేలాది మంది రైతుల కథ. వర్గీస్ కురియన్ అనే మలయాళీ వ్యక్తి వాళ్లకు నాయకుడుగా నిలిచి చరిత్ర సృష్టించాడు.
చివరకు సర్దార్ సరోవర్ చేరుకున్నాము. అందులో నీళ్లు లేవు. డామ్ మీది నుంచి చుక్క కూడా కిందకు రావటం లేదు. ఇటుపక్కకు మళ్లితే మాత్రం, నిజంగానే లోహపురుషుడిగా నిలబడిన సర్దార్ పటేల్ విగ్రహం అద్భుతంగా కనిపించింది. అందరూ గొప్పగా చెప్పుకునే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 93 మీటర్ల ఎత్తు మాత్రమే. అంతకన్నా ఎత్తయిన విగ్రహాలు చైనాలో ఒకటి, జపాన్‌లో ఒకటి ఉన్నాయి. అవి రెండు బుద్ధ విగ్రహాలు. చైనా విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అయితే సర్దార్ సరోవర్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం ఏకంగా 82 మీటర్ల ఎత్తు. ప్రత్యేకంగా టికెట్ తీసుకుంటే విగ్రహం కాళ్ల దగ్గరికి లిఫ్ట్‌లో వెళ్లవచ్చు. అక్కడినుండి దృశ్యాన్ని అన్ని వేపులా చూడవచ్చు. అంతకన్నా ఎత్తుకు వెళ్లడానికి అవకాశం లేదు. ఆయన కాళ్లకు మామూలు చెప్పులు ఉన్నాయి. మామూలు చెప్పులలాగే వాటిని కుట్టిన దారాలు కూడా ఉన్నాయి. చెప్పుల అడుగులు, నిలబడ్డ నాకు తలకన్నా ఎత్తులో ఉన్నాయి. ఆ ధారాలు మోకుతాళ్లకన్నా లావుగా ఉన్నాయి. అక్కడ నిలబడి తల పైకి ఎత్తినా విగ్రహం పై భాగం కనిపించదు. కిందకు దిగి రావాలి. కొంత దూరం పోవాలి. అక్కడి నుండి చూడాలి. అప్పుడు గానీ విగ్రహం పూర్తిగా కనిపిస్తుంది. విగ్రహం ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనుకుంటే మనం కనిపిస్తే విగ్రహం కనిపిచదు. కాళ్లు మాత్రమే కనిపిస్తాయి. మొత్తం విగ్రహం కనిపించేటట్టు ఫ్రేమ్ చేస్తే మనం కనిపించము. మరీ చిన్న రూపాలము అవుతాము. స్వాతంత్య్రం తరువాత దేశంలోని సంస్థానాలను విలీనం చేయించి ఐక్యత సాధించిన మహానుభావుడు సర్దార్ పటేల్. అందుకే ఆ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. హైదరాబాద్ వారికి ఆయన చేయించిన పోలీస్ యాక్షన్ ఒకటే జ్ఞాపకం ఉంటుంది. నిజానికి దేశంలో ఇటువంటి విగ్రహం ఒకటి ఉందని మనవాళ్లకు చాలామందికి తెలియకపోవచ్చు. దాన్ని గురించి మన ప్రాంతాలలో పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. మొత్తానికి అది చూడవలసిన చోటు.

-కె.బి. గోపాలం