Friday, October 23, 2026

వేటగాడు - దుప్పి పెళ్లాం : ఆఫ్రికన్ జానపద కథ


వేటగాడు - దుప్పి పెళ్ళాం

 అనగనగా ఒకప్పుడు ఒక వేటగాడు ఉండేవాడు. అతనికి జంతువుల గురించి చాలా తెలుసు. కానీ తన దుప్పి పెళ్ళాన్ని పట్టి ఉంచడం గురించి కొంత కూడా తెలియదు.

ఒకనాడు అతను వేటాడుతూ అడవిలో తిరుగుతున్నాడు. అక్కడ ఒక మడుగు కనిపించింది. జంతువులన్నీ ఆ మడుగులోకి నీళ్లు తాగడానికి వస్తుంటాయి. వేటగాడు కనిపించకుండా దాగి ఉండి ఎదురు చూస్తున్నాడు. అంతలో దుప్పుల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. అతను తన విల్లు అమ్ములను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే అనుకున్నట్టు దుప్పులు తలవంచి నీళ్లు తాగడం లేదు. పైగా అవి తమ చర్మాలను వదిలేశాయి. మనుషులుగా మారిపోయాయి. అవన్నీ చక్కని దుష్టులు వేసుకుని ఉన్నాయి. దగ్గరలో ఉండే సంతకు పోవాలని అవి తమలో తాము మాట్లాడుకోవడం వేటగానికి వినిపించింది.

దుప్పులు వెళ్లిపోయిన తర్వాత వేటగాడు బయటకు వచ్చాడు. అవి తమ చర్మాలను దాచిన చోటికి చేరుకున్నాడు.

ఈ చర్మాలలో నుంచి ఒకదాన్ని తీసుకుంటాను. ఇక వింత దుప్పులు తిరిగివచ్చేదాకా ఇక్కడే వేచి ఉండి ఏమవుతుందో చూస్తాను, అనుకున్నాడతను తనలో తాను.

వేటగాడు అన్నింటికన్నా అందమయిన చర్మాన్ని ఎంచుకున్నాడు. ఆ తరువాత ఒక పొడుగాటి చెట్టెక్కి కూచున్నాడు. నీటిమడుగును ధ్యాసగా చూస్తున్నాడు.

సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు అస్తమించసాగాడు. ఆ జీవులు తిరిగి వచ్చాయి. అవి తమ తమ చర్మాలను మళ్లీ తీసుకుని మనిషి రూపం మీదనుంచి తొడుక్కున్నాయి. అన్ని మళ్లీ దుప్పులుగా మారిపోయాయి. కానీ ఒక్క అందమయిన యువతికి మాత్రం తన చర్మం దొరకనే లేదు.

మిగతా దుప్పులు చర్మం వెతకడంలో ఆమెకు సాయం చేశాయి. కానీ అది ఎక్కడా దొరకలేదు. చర్మం వేటగాని దగ్గర ఉన్నదాయె. చివరకు దుప్పులన్నీ తమ దారిన తాము వెళ్ళిపోయాయి. చర్మం దొరకని ఆడమనిషిని అక్కడే వదిలేశాయి, అన్నమాట.

దుప్పి ఆడమనిషి ఏడవ సాగింది. మిగతా దుప్పులన్నీ వెళ్ళిపోయాయి, అని చూచిన తర్వాత వేటగాడు చెట్టు దిగి కిందకు వచ్చాడు.

అమ్మాయీ, ఎందుకు ఏడుస్తున్నావు? అడిగాడు అతను.

మొదట్లో దుప్పి ఆడమనిషి ఏమి చెప్పలేదు.

నీ సంగతి రహస్యం అయితే నేను దాన్ని కాపాడుతాను, అని వేటగాడు మాట ఇచ్చి నమ్మ పలికాడు.

చివరికి దుప్పి అమ్మాయి తన చర్మం కనిపించడం లేదని ఒప్పుకున్నది.ఆ చర్మం దొరికితే తప్ప తాను దుప్పిగా మారడం వీలుకాదని చెప్పింది.

ఇప్పుడు నాకు ఇంకా ఇల్లంటూ లేదు. ఏం చేయాలో తోచడం లేదు, ఆమె ఏడవ సాగింది.

నీవు నన్ను పెళ్లి చేసుకోవాలి, అన్నాడు వేటగాడు. అతను తన కుటుంబం గురించి ఆమెకు చెప్పాడు. కాంపౌండ్ లో వాళ్లు ఆమెను ఆదరంగా ఆహ్వానిస్తారని కూడా చెప్పాడు.

నీ మొదటి పెళ్ళాం నీ నుంచి నా రహస్యాన్ని తెలుసు కుంటుంది, అన్నది దుప్పి ఆడమనిషి.

రహస్యాన్ని తన మరో భార్యకు చెప్పను గాక చెప్పనని వేటగాడు హామీ ఇచ్చాడు. చివరికి దుప్పి ఆడ మనిషి వేటగాడిని పెళ్లాడడానికి ఒప్పుకున్నది. ఆమె చర్మాన్ని తానే దాచి ఉంచానని అతను అప్పుడు ఒప్పుకున్నాడు. అయినా సరే వేటగాడిని పెళ్లాడుతానని ఆమె చెప్పింది. ఆ రకంగా ఆమె అతని వెంట నడుస్తూ అడవి నుంచి అతని కాంపౌండ్ వైపు వచ్చేసింది.

ఈ కొత్త పెళ్ళాం ఎక్కడి నుంచి వచ్చింది? వేటగాని మొదటి భార్య అడగనే అడిగింది.

కానీ అతను మాత్రం అసలు నిజం చెప్పనేలేదు.

ఒక్కొక్కసారి ఆమె మరొక వేటగాని కూతురు అని చెప్పేవాడు. మరోసారి ఆమె అడవికి అటువైపు దూరాన ఉన్న మరొక పల్లె మనిషి అనే వాడు.

వేటగాడు, అతని కొత్త పెళ్ళాం సంతోషంగా కొన్ని సంవత్సరాలు పాటు కలిసి బతికారు. వాళ్లకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయినా వేటగాని మొదటి పెళ్ళానికి మాత్రం కొత్త పెళ్ళాం గురించి తెలుసుకోవాలని గట్టి కోరికగా ఉండేది. అడవిలో నుంచి పెళ్ళాలు ఎలా వస్తారు?

మీ నాన్నగారి ఇల్లు ఎక్కడ? ఆమె దుప్పి ఆడ మనిషిని చాలాసార్లు అడిగింది.

చాలా దూరం, అని దుప్పి ఆడమనిషి జవాబు చెప్పింది. అంతకుమించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

ఒకనాడు వేటగాని మొదటి పెళ్ళాం ఒక మనిషి అమ్మిన తాటిరసం కొని చాలా రుచిగల తాటి సారాయం తయారు చేసింది. అది మరీ రుచిగా ఉన్నందుకు వేటగాడు ఆ పూట తెగతాగేశాడు. అదే అవకాశం అనుకొని మొదటి పెళ్ళాం ప్రశ్నలు మొదలుపెట్టింది.

మొగుడా, చెప్పక తప్పదు. నీ రెండవ పెళ్ళాం నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె అడిగింది.

వేటగానికి తన మీద తనకే ధ్యాస లేదు. మరీ మరీ అడిగిన తర్వాత అతను దుప్పి పెళ్ళాం రహస్యాన్ని బయటపెట్టేశాడు.

ఇద్దరు పెళ్ళాలు కీచులాడుకున్నారు. వండిన మాంసం పులుసును, అన్నాన్ని, దుప్పిఆడమనిషి పిల్లలకు ఎంత ఇవ్వాలి, పెద్దపెళ్ళాం పిల్లలు వయసులో పెద్దవాళ్లు, భారీగా ఉన్నవాళ్లు, మరి వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అని తగవు పడ్డారు. పెద్దపెళ్ళానికి చాలా కోపం వచ్చింది.

మరీ అంత మిడిసి పడకు, నీవు దుప్పివి, నీ చర్మం మొగుడు గారి గదిలో ఉంది చూడు. అంటూ ఆమె అరిచింది.

ఇక తన రహస్యం బయటపడిపోయిందని తెలుసుకున్న దుప్పి ఆడమనిషి వెంటనే అడవికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నది. ఆమె వేగంగా మొగుడిగదికి  వెళ్ళింది. దాచి ఉంచిన చర్మాన్ని తీసుకున్నది. దాన్ని నీటిలో కొంతసేపు నానబెట్టింది. ఆ తర్వాత తన శరీరానికి సరిపడుతుందా అని కొలత చూచింది. తనకు అది సరిగా వచ్చేదాకా ఆమె చర్మాన్ని నీటిలో నానబెట్టింది. చివరికి ఆమె దాన్ని తొడుక్కున్నది, దుప్పిగా మారిపోయింది. అంతసేపు ఆమె భర్త, ముగ్గురు పిల్లలు వేరుశనగ పొలంలో పనిచేస్తూ అక్కడే ఉండిపోయారు.

వేగంగా పరిగెడుతూ దుప్పి ఆడమనిషి కాంపౌండ్ నుంచి పరిగెత్తసాగింది. ఎత్తుగా పెరిగిన గడ్డిలో నుంచి దారి వెతుక్కుంటూ పొలానికి చేరుకున్నది.

పొలం కనిపించింది. ఆమె తన తోకతో తన ముగ్గురు పిల్లలను తట్టింది. వాళ్ళు ముగ్గురు చూస్తుంటే గానే అందమైన దుప్పి పిల్లలుగా మారిపోయారు.

ఇక సెలవు మరి, మీరు నన్ను, నా పిల్లలను బాగా చూచారు. కానీ నా రహస్యం మీ మొదటి భార్యకు తెలిసిపోయింది, అంటూ ఆమె ఏడుస్తూ భర్తతో చెప్పింది.

వెళ్ళకు, వదిలి వెళ్ళకు, మొగుడు అడుక్కున్నాడు.

మేము వెళ్లక తప్పదు, ఆమె ఏడుస్తూనే జవాబు చెప్పింది. పిల్లలతో పాటు పరుగు తీస్తూ ఆమె అడవిలోకి మాయమయింది.

మొగుడు చాలా కోపంగా తన కాంపౌండ్ కు తిరిగి వచ్చాడు. అతను మొదటి భార్యను కూడా ఇంట్లో నుంచి తరిమేశాడు.

 


 

No comments: