Wednesday, October 21, 2026

లోకాభిరామం : అంతరంగం


అంతరంగం

ఒక తరంగం

మానవునకూరకయే సంతోషము గలుగుటయను నొక లక్షణమున్నది. ఏదియో యిష్టమయిన విషయము జరుగును. అది నిజముగ నంత సంతోష కారకము గానవసరము లేకున్నను మానసిక పరిస్థితినిబట్టి గొప్ప సంతోషము పుట్టును. ఆ భావము తెలియుచుండును. అయినను సంతోషము సంతోషమే. ఎవరికోనొక పని నప్పగింతుము. వారికది నిజమునకు గొప్ప పనిగాదు. చాల సులభముగ వీలగు సంగతి. వారు దూర దేశమున నుండువారు. అయినను నిన్ను గుర్తుంచుకొని నీ పని జేసిరి. అప్పుడు గలుగుయానందము అంతము లేనిది. ‘ఎవరును నిన్ను గోరకున్నచో నీ బ్రతుకు దండుగ’యని యొకరెవరో అనియున్నారు. ఎవరో కొందరి యందు, నీ పట్ల గొప్ప భావములుండుట గూడ నందరికి వీలుగాని విషయము. నీవొకరి ఇంటికి పోనే పోవు. వారు రమ్మనుచుందురు. నీవు మాత్రము పోవు. ఏదోనాడు పోదువు. వారు పండుగ జేసినంత పనిజేతురు. నీవుక్కిరిబిక్కిరిగాక తప్పదు. నీలోని ఏ లక్షణము వారి నాకర్షించినదో తెలిసినచో నట్టి బంధము మరింత ఆనందదాయకముగ నుండును. ప్రతి మానవునకును ఇట్టి నేస్తములు ఒకరిద్దరయిన నుండవలయును.

ఇక మరియొక తీరున్నది. పదునేను దినముల తరువాత మొగము జూచుకొనుట. నిజమున కిరువురును నిత్యము కలిసియుండవలసిన వారు. మధ్యనెందుకో యెడము వచ్చినది. ఎట్లుంటివని వారడుగరు. వీరును అడుగరు. ఒకరు లేక మరియొకరికి గుదురదు. అది ప్రేమము గాదు. కేవల ప్రాపంచిక బంధము. అందు వ్యక్తిగతమగు భావములకు, బంధములకు తావు లేనే లేదు. ఇక ప్రాపంచిక కార్యములన్న నట్లే పొడి పొడిగ నుండును గదా!

ఒకడు గొప్పవాడు. అయినను, అందరిని హాయిగా పలుకరించును. వానినందరును గుర్తుంచు కొందురు. పొడిపొడి బ్రతుకులనెందుకు గుర్తుంచు కొనవలె? నిజమునకు వాటిని తొలగించుకోవలె!

----

నమ్మండి, రెండు వేల సంవత్సరంలో మార్చ్ యిరవయి, సోమవారము నాడు నా డయరీలో రాసుకున్న మాటలివి. నాకు డయరీ రాయడం అలవాటుంది. లేదు. అంటే అప్పుడో ఇప్పుడో రాస్తనని అర్థము. రాసిన నాడు ఇట్లగుంటుంది. భాష ఎప్పటికీ ఈ తీరుగనే ఉండకపోవచ్చు!

చిన్నప్పుడు బడిలో ‘దినచర్య’ అని రాయించే వారు. ‘నేను ఉదయముననే ఆరుగంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానము చేసి, దేవుని ప్రార్థించితిని’ అదో! అక్కడనే అబద్ధాలు మొదల యినయి. బడికి బయలుదేరే లోపల చేసిన సంగతులన్ని రాస్తే, అందరు ఆశ్చర్యపోతరు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పకుంటే, తప్పు పడతరు. నీతులు చెప్పుతరు. ఎందుకో తెలియదు గాని, నాకు మొదటి నుంచి అబద్ధాలు చెప్పేది అలవాటు లేదు. నేనేమీ గాంధీని గాదు, గాంధేయవాదిని అంతకన్నా కాదు. అబద్ధాలు చెప్పేందుకు చేతగాలేదు. ఆ కారణంగ, బడి దినచర్యలో ఒకనాడు, మూడవ పీరియడులో ఫలాని సారు వచ్చిరిగాని, పాఠము చెప్పలేదు, అని రాసినట్లున్న. సరిగ్గా, ఇవే మాటలా, గుర్తులేదు గానీ, ఇటువంటిదే ఒక నిజం రాసిన. ఆ సారు, అనగా పంతులు, అనగా టీచరు (టీచర్ అంటే ఆడమనిషి మాత్రమే అని ఒక అవగాహన ఉండేది. ఇప్పటికీ ఉందేమో? అయ్యా! నా నౌకరి పోగొట్టాలని ప్రయత్నమా, అని హాయిగ నవ్వినట్లు గుర్తుంది. అప్పటి దినచర్య నిత్యం ఒకే రకంగ ఉండేది. ఈ సంగతి అప్పట్లో తోచినట్టు లేదు. తరువాత అర్థమయింది. నిజానికి తరువాత, దినచర్యలన్ని ఎప్పటికి ఒకటే తీరుగ ఉంటయని గూడ అర్థమయింది!

హైస్కూల్‌లో ఉండంగ, ప్రొఫెసర్ వేదాంతాచార్యులు అనే దూరపు తాతగారు, ఏ స్కూల్‌డే కార్యక్రమానికో ముఖ్య అతిథిగా వచ్చి, డయరీ రాయడము గురించి, అందువలన కలుగు మంచి చెడులను గురించి చక్కగ వివరించినరు. అప్పుడు నిజంగ డయరీ రాయాలని కోరిక మొదలయింది. మనకు ఒక డయరీ రాజమును ఎవరివ్వవలె? ఎవరో ఇచ్చిన సంవత్సరము,  నేను ఉదయముననే లేచి’ అని కాకున్నా చేసిన, చూచిన సంగతులను రాసే ప్రయత్నం మొదలయింది. ‘మనమేమన్నా ప్రెసిడెంటాఫ్ ఇండియానా, పెద్ద మనుషులమా? ఏముంటయి రాసుకునేందుకు, అని అప్పట్లో తోచలేదేమో? తరువాత తోచింది. ప్రతి సంవత్సరము డయరీ ఒకటి గాదు, ఎక్కువ సంఖ్యలో ఇచ్చేవారు చుట్టు చేరిన తరువాత, రోజులు ఒకదానికి ఒకటి ట్రూ కాపీలు’ అన్న ఆరుద్రగారి వాక్యం అర్థమయింది. దినచర్యగాదు, దినసరి ఆలోచనలు రాసుకుంటే తరువాత చదువుకుంటే కనీసం నవ్వు రావొచ్చు గద, అని ఆలోచనల డయిరీ కొంత కాలం సాగింది. ఆలోచనలు కూడ, నిత్యం కొత్తగ రావాలంటే, అంత సులభంగాదు! కనుక డయరీ రాత మీద, గురించి, అంత పట్టింపు లేదు.

డయరీ చాల వ్యక్తిగతం గనుక, అది రహస్యమని, కొందరనుకుంటరట. నాకట్లాగ ఎన్నడు తోచలేదు. నా బతుకులాగనే, డయరీలు కూడ ఓపన్ బుక్! బట్టబయలు! మిత్రులొకరు డయరీలో కొన్ని పేజీలు చదివి, బాగుంది! అందరూ చదివితే బాగుంటుంది’ అన్నరు. ఈ మాటలో మొదటి భాగం ఆయన ఇష్టం. రెండవది మాత్రం కష్టం!

మరో తరంగం:

 కల వంటి బతుకు. బతుకు వంటి కల. ఏది నిజం? ఏది కల? ఎక్కడుంది తేడా? కలా, నిజమా తేల్చుకునేందుకు గిల్లుకోని చూచినట్లు చెప్పతరు. గిల్లుకోని లాభం లేదు. నిద్ర నిజం. కల నిజం. కలలో సంగతి మాత్రం కల. అంటే కల్ల. అంటే అబద్ధం. బతుకు నిజం. ఇవాళ నిజం. అన్నం నిజం. పోనీ ఇడ్లీ నిజం. తిండీ, నిద్రకన్న నిజమయిన సంగతులు ఉండవు గద! వాటిని మనం ఎన్నడు మరిచిపోము. అవి మరి బతుకుకు ఎంతో ముఖ్యం! అవే బతుకు అనేటంత ముఖ్యం. ఆలోచించండి. పని జరగనీ జరగకపోనీ, సాపాటు మాత్రం జరగవలసిందే. వద్దన్నా నిద్ర ముంచుకు వస్తుంది. ఇంట్లో, వంట్లో సుఖంగా ఉండనీ, ఉండకపోనీ, సాపాటు జరగవల సిందే. అంత మామÖలుగ ఉంటే అన్నం తినవచ్చు. ఏ కొంచెం అనారోగ్యమయినా అన్నం పనికిరాదు. రొట్టె కావాలె. డబల్ రొట్టె కావాలె. (కొంతమంది మామూలుగనే రొట్టె, డబల్ రొట్టె తిని బతుకుతరని మనకు తెలియదు) జ్వరమొస్తే పండ్లు గావాలె. పాలు గావాలె. నాకు పాలు అంతగ యిష్టం ఉండవు. కనుక జ్వరం వస్తే రుచిగ ఏదన్న తాగవచ్చని ఎదురు చూపులు. పండ్ల రసం కావాలె. ఇష్టమయిన పండ్లరసం తాగాలంటే జెరం రావాలె. (కొంతమంది మామÖలు గనే, పండ్లు, పాలు, రసాలు తాగి బతుకుతరని మనకు తెలియదు) పక్కన శవం ఉన్నా సరే, మనం శవం పక్కన ఉన్నా సరే, కాఫీ కావాలె. ప్రాణం పోతున్నా సరే పాలు కావాలె. శవం పక్కన ఉండగా, హాయిగ పండుకోని, రావలసిన వారెవరో వచ్చిన తరువాత, జరగవలసిందేమో, తగిన ఏర్పాట్లు చూడడం కొత్తగాదు గద! తగిన ఏర్పాట్లలో తిండి, నిద్ర ముందుంటయి. నిత్యమూ నిద్ర తప్పదు. నిత్యమూ తిండి తప్పదు. అవి మన బతుకులకు పునాదులని మనం గట్టిగ నమ్ముతున్నము మరి!

తిండి, నిద్రలలాగే, నిత్యం, ఆలోచన, సమీక్ష అవసరమని, అనుకోగలమేమో గమనించండి. ఏమి చేసినము? ఏమి చేయవలసి ఉన్నది? ఏమనుకుంటున్నము? ఏమి జరుగుతున్నది? తేడా ఎక్కడున్నది? నిత్యం కనీసం నాలుగు నిమిషాలు ఆలోచించే ఓపిక తీరిక ఉన్నయా?

అవి మన బతుకులకు అవసరం గాదా? ఆలోచన లేకుండ బతకవచ్చునా? బతికితే ఎంత కాలం? తిండి, నిద్ర కొరకు ఎన్ని ప్రయాసలు పడి ఏర్పాట్లు చేసుకుంటున్నము? బతుకంత మంచి తిండి, సుఖంగ నిద్ర అందాలని గద, మిగతా ప్రయత్నాలన్నీ! అదే పద్ధతిలో, ఆలోచన, అవగాహన కూడా, అవసర మనుకుంటే ఎంత బాగుంటుంది? బతుకు ప్రయాణంలో గమ్యం ముఖ్యమా, తతంగం ముఖ్యమా, ఆలోచన అవసరం గద! కల నిజమా? నిజం కలవలె ఉన్నదా, అర్థం చేసుకోవాలె గద! ఇదంతా ఆలోచన లేకుండ వీలవుతుందా?

ఈ ఆలోచన కలిగిన తరువాత నమ్మండి. తిండి సయించదు. నిద్ర పట్టదు. వాటి ప్రాముఖ్యం తెలుస్తుంది. కనీసం తగ్గుతుంది. వాటిని వదలాలని ఎక్కడ లేదు. వాటిని పట్టుకోని వేలాడాలని కూడ లేదు. అది సంగతి. నిత్యం చేసే పనులే చేస్తే, నిత్యం లాగనే ఇవాళా ఉంటుంది. ఆలోచించాలె గదా!

ఆలోచించకుండ బతుకుతున్నంత సేపు అంత  బాగనే ఉన్నదన్న భావము ఉంటుంది. అసలు ఆ భావము కూడా ఒక ఆలోచన కనుక అదికూడ ఉండదు. బతుకు బండి గతుకులున్నా సరే ముందుకు సాగుతుంటుంది. ఆలోచన మొదలయితేనే అంత కష్టము. కనుకనే శానమంది ఆలోచించకుండనే బతుకుతరు. వెళ్లిపోతరు కూడా. కానీ బతుకులో స్వారస్యము మిగులదు.

ఆలోచించే వారు కష్టపడతరు. కష్టము బాగుంటుంది. కనుక ఆలోచించాలె.


 

No comments: