ఇస్మత్ చుగ్తాయి
మహానటుడు శశికపూర్ సొంత ఖర్చుతో, సొంత ఆలోచనతో తీసిన సినిమా ఒకటి ఉంది. అది అర్థంలేని ప్రేమ గురించిన సినిమా.
అందులో నాయకుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ కూతురిని మరీ మరీ ప్రేమించేస్తాడు. మనకికక్కడ
ఆ సినిమా ముఖ్యం కాదు. హీరోయిన్ తల్లి పాత్రలో శశికపూర్ భార్య జెనిఫర్
కనిపిస్తుంది. ఆమెకు తల్లిగా ముగ్గుబుట్టలాంటి తల ఉన్న ఒక ముసలావిడ కనిపిస్తుంది.
ఆమె సినిమా మొత్తంలోనూ మాట్లాడదు. కానీ, కథలో బలమయిన భాగంగా
మిగులుతుంది. నిజానికి ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి సినీ నటి కాదు! ఆమె ప్రసిద్ధ
రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి! సాహిత్య
రంగంలో అందరూ ఆమెను ఇస్మత్ ఆపా అంటారు. ఉర్దూలో ఆపా అంటే అక్కయ్య. సినిమాలో
చూచినవాళ్లకు ఆ వ్యక్తి గురించి అభిప్రాయాలు ఏర్పడే వీలే లేదు. మహా కలిగితే,
జాలి కలుగుతుంది. కానీ, ఇస్మత్ ఫయర్ బ్రాండ్ రచయిత్రి. ఆమె క్రూరులకే క్రూరుడయిన చంగేజ్ ఖాన్
వంశంలో పుట్టిందని ఎక్కడో చదివినట్టు గుర్తు.
ఇస్మత్ ఛుగ్తాయి పుట్టుకతోనే తిరుగుబాటు స్వభావం గల మనిషి.
మగరాయుడులాగ బతికింది. తన యిష్టం వచ్చినట్టు బతికింది. ఆవిడ కథలు, నవలలు, వ్యాసాలలో కూడా అదే
పద్ధతి బలంగా కనిపించింది. సమకాలీనుడు సాదత్ హసన్ మంటో కూడా ఈ రకం మనిషే. అతను
బతుకంతా కష్టపడ్డాడు. ఇస్మత్ మాత్రం బతుకంతా పోరాడుతూనే ఉన్నది.
ఇస్మత్ చుగ్తాయి 1915లో పుట్టిందన్నారు. ఈ మధ్యన మాత్రం 1911లో అంటున్నారు. ముస్లిం కుటుంబాలలో ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అవసరం లేదని
గట్టి కట్టుబాట్లు ఉన్న ఆ కాలంలోనే, ఇస్మత్ ఎదురు తిరిగింది. బడికి వెళ్లింది. అక్కడితో ఆపకుండా
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. సుమారు మూడు సంవత్సరాల పాటు వేరు వేరు చోట్ల
పంతులమ్మగా పనిచేసింది. ఇంకా పైకి చదువుకున్నది. ఏకంగా ఇన్‌స్పెక్టర్
ఆప్ స్కూల్స్ ఉద్యోగానికి ఎక్కింది. ఆ కారణంగా ఆమె బొంబాయి వెళ్లవలసి వచ్చింది.
అక్కడ ఇస్మత్ పెళ్లి కూడా చేసుకున్నది. ఇద్దరు అమ్మాయిలను కన్నది. ఉద్యోగం మానేసి రచనలతోనే కాలం గడుపుతూ, చివరి దాకా అక్కడే
బతికింది.
ఇస్మత్ చుగ్తాయి రచనారంగంలోకి రావడానికి బొంబాయిలోని
వామపక్ష అభ్యుదయ రచయితల బృందం కారణం అంటారు. నిజానికి ఆ బృందంలో సభ్యురాలయిన రషీద్
జహా అనే గైనకాలజిస్ట్ ఇస్మత్ మీద నిజమయిన ప్రభావం కనబరచిన వ్యక్తి. ఆ డాక్టరమ్మ
ఆదర్శభావాలన్నింటినీ పొందుపరుస్తూ కథలు రాసేది. ఆ ప్రభావంతోనే ఇస్మత్ కూడా
నాటకాలు, కథలు, వ్యాసాలు రాయడం
మొదలుపెట్టింది. 1945లో ఆమె రాసిన నవల ఉర్దూ సాహిత్యంలోనే గొప్ప
రచనల్లో ఒకటిగా పేరు పొందింది. నవల పేరును తెలుగులో ‘వంకర గీత’ అని చెప్పుకోవచ్చు.
ఆ నవల నిజానికి రాసిన తరువాత యాభయి సంవత్సరాలకు అచ్చయింది. అందులో ఆమె ఆడవారి
లైంగికతను, ఆ విషయంగా వచ్చే సమస్యలను జంకు లేకుండా
చర్చించింది. అయితే, అది అసలు సిసలయిన నవల. వ్యాసాల పోగు కాదు.
చెప్పదలచుకున్న విషయాలన్నీ బలంగా చిత్రించిన ఒక పాత్రలోనుంచే వస్తాయి. ఆ పాత్ర
బహుశా స్వయంగా ఇస్మత్ అన్నారు పరిశీలకులు.
పాత్రలో ఇస్మత్ వ్యక్తిత్వంలోని మిగతా అంశాలు లేకపోవచ్చు. ఈమె రచయిత్రి,
నవలలోని కథా నాయిక మాత్రం పుస్తకాలు పట్టని మనిషి. అసలు
కళలంటేనే ఆసక్తి లేని మామూలు అమ్మాయి. కనుకనే ఆ పాత్ర, ఆమె చుట్టూ అల్లిన కథ, చివరికి నవల,
చాలా సహజంగానే కనిపిస్తాయి. కథానాయిక షంషాద్ పెళ్లి, చర్చకు అసలు ఆధారం. ఆమెకు దొరికిన మొగుడు ఇంగ్లీషు మనిషి.
అప్పట్లో అదొక పద్ధతి. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా ఆ మొగుడు షంషాద్‌ను వదిలి
వెళిపోతాడు. ఆమెకు మొత్తం కంపెనీ మీద, బ్రిటీష్‌వారి
మీదా కోపం వస్తుంది. మొగుణ్ణి ఆమె చీదరించుకుంటుంది. వదిలేస్తుంది కూడా!
ఈ నవల రాసేనాటికి చుగ్తాయికి పెళ్లయింది. భర్త షాహిద్ కూడా
కలం బలం మనిషి. ‘నేను మామూలు ఆడమనిషిని కాదు. నా
వల్ల కష్టాలు కలగవచ్చు. నేను బతుకులో బంధనాలన్నీ తెంపుకున్నాను. మళ్లీ ఒకసారి
కట్టుబాట్లకు లొంగేది లేదు. బుద్ధిగా భార్యగా, జీవించడం, నటించడం నావల్ల కాదు’ అని ఆమె భర్తతో
చెప్పిందట. చుగ్తాయి పెళ్లి తరువాత కూడా రచనలు కొనసాగించింది. దుప్పటి అనే కథలో, అప్పటికి ఎవరూ నోరు విప్పి మాట్లాడని లైంగిక సమస్యలను
గురించి రాసింది. ఆడమనిషి మరో ఆడమనిషితో సెక్స్ అనుభవించడాన్ని చర్చించింది. కనుక
ఇస్మత్ కోర్టు పాలయింది. కన్నబిడ్డను
చంకనెత్తుకుని ఆమె కోర్టు చుట్టూ తిరగవలసి వచ్చింది. ఆ తరువాత జీవితంలో ఇటువంటి
అపభ్రంశపు సంఘటనలు ఎదురు కాలేదుగానీ, కుటుంబ జీవితం
సాఫీగా సాగింది లేదు. రచనల కారణంగా ఆమెకు గొప్ప పేరు వచ్చింది. ఆమె తీరు అలాగే
కొనసాగింది. భయం లేకుండా ఆమె కలం ముందుకు సాగింది. బతుకు కూడా భయం లేకుండానే
ముందుకు సాగింది. అయినా, గొప్ప ఒడిదుడుకులు
మాత్రం ఎదురు కాలేదు.
కుటుంబ జీవితం గుంభనంగా సాగింది. అయినా భార్య ఖ్యాతి,
ఏ భర్తకు నచ్చదు. ఇస్మత్ పేరు పెరుగుతున్నకొద్దీ, భర్త ఆమె నుంచి దూరం కాసాగాడు. ఈమె మాత్రం ఎక్కడా భర్త
గురించి ఒక్క ముక్క రాయలేదు. అవసరం వచ్చిన చోట
ఆయన తన నేస్తము, సహచరుడు, సముడు, అని మాత్రమే అంటూ వచ్చింది. మామూలుగా రచనల్లో
కల్పన పేరుతో నిజాలు కనపడతాయి. అనుభవాలు కనపడతాయి. ఆలోచనలకన్నా, ఈ అనుభవాలే బలంగా కనపడతాయి. అయినా, ఇస్మత్ చుగ్తాయి తన రచనల్లో ఎక్కడా తన వైవాహిక జీవితం గురించి, భర్త గురించి లోతుగా రాసిన సందర్భాలు కనిపించలేదు.
ఈ దేశంలో నాటికీ నేటికీ ముస్లిం స్త్రీల జీవితాలు తెర వెనుక
వరకే పరిమితమయి ఉన్నాయి. ఇస్మత్ మాత్రం ఆ తెరలను చింపేసింది. అది తొలగించడం కాదు.
కథలన్నింటిలోనూ ఆడవాళ్ల కష్టాలను గురించి అలవిమాలిన ధైర్యంతో గొప్ప సత్యాలను చెప్పింది. ముఖ్యంగా
సినీపరిశ్రమలోని అమ్మాయిల కష్టాలను వర్ణించిన తీరు దేశాన్ని కుదిపింది. చెప్పకుండా
జరిగే వ్యభిచారం ఆమె కథల్లో చాలా చోట్ల వస్తువుగా మారింది. అయినాసరే, ఆ కథలేవీ సంచలనాత్మకంగా మాత్రం లేవు. లైంగిక పరంగా
మనుషులను కిత కితలు పెట్టేవి కూడా కావు. భయంకర సత్యాలను అంత భయంకరంగానూ బయటపెట్టి భయపెట్టే రచనలవి!
No comments:
Post a Comment