మాటాట
సంత్ తుక్కారామ్‌జీ మహరాజ్ అంటే ఎవరో తెలుసునా? మన ‘ఘనా ఘన సుందరా’ బ్రాండు భక్త తుకారామ్ ఆయనే. తుకారామ్
గొప్ప తాత్వికుడు. ఆ సంగతి మనకు అందలేదు. మనకు సినిమాలో చూచిన భారతము, రాహీ మాసూమ్ రజా గారి పుణ్యమా అని మరింత వివరంగా అందింది.
అది ఎట్లనో గుర్తుకు వచ్చిందా? దూద
అను దూరదర్శన్‌లో మహా భారత్ సీరియల్ కారణంగా. అంతేగానీ వ్యాసుని భారతములో, జైమిని భారతములోనున్న నూటొక్క సంగతులు మనకు అందలేదు. పుస్తకానికీ, పత్రికకు, కవర్‌పేజీ ఉన్నట్టే, ప్రతి విషయానికి ఒక ముఖం
ఉంటుంది. మనకు ముఖ పరిచయ ము అని ఒక పద్ధతి ఉన్నది. ఈ వ్యాసమున్న పేజీలో నా బొమ్మ
వేస్తరు. అది చూచినవారు, నేను
బజారులో ఎదురుపడినా గుర్తించలేరు. ఎవరన్న గుర్తు పట్టినరే అనుకుందము. నేను
లోకాభిరామము రాసే గోపాలమును అని తెలుస్తుంది తప్ప, నా గురించి మిగత సంగతులు
తెలియవు. అట్లనే తుకారాం అనంగనే మనకు ముందు అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు
వస్తరు. సినిమా చూచి ఉంటే, ఆ
భక్తుడు గుర్తుకు వస్తడు. ఆ సినిమాలో తుకారాముని కొండ, అద్దమందు పద్ధతిలో చూపి వదిలిపెట్టినరని నా నమ్మకము. నేనా
బొమ్మ (అంటే సినిమా, అంటే
ఫిలిం) చూడనేలేదు. అయినా ఆయన మహిమలు, మొదలైనవి
అంత చూపి ఉంటరని నాకు తోస్తుంది. ఎట్ల తోస్తుంది, అంటే
అటువంటి సినిమాలు, అనగా
చలన చిత్రములు శాన చూచిన గద, అందుకు
తోస్తుంది. ఆ తుకోబా ఇంకా ఏమి చెప్పెను, ఏమి
పాడెను, ఎట్ల బతికెను అని మనము
తెలుసుకునేందుకు అవసరము ఉండాలె. అవకాశము ఉండాలె. సినిమాలు అంటే, కదిలే బొమ్మలు, చూచి మరిచిపోవుట మంచిది గానీ, మరీ వాటిని గురించి తల పగులగొట్టుకొనడము అనవసరమని గద!
సోది, గదూ!
ఇంతకు తుకారామ్‌జీ గురించి ఎందుకు ప్రస్తావించిన? నాకు
గుర్తు ఉన్నది, కాని ఈలోపల మనసు పరిపరి విధములుగా పోయి ఎన్నో చెప్పవలెనని
అనిపించినది. తుకారామ్ అన్ని పాటలు ‘పాండురంగ’ గురించి రాయలేదు. ఎన్నో ఆలోచింప
దగిన లోతయిన చేదు నిజములను ఆయన తన అభంగములనే పాటలలో రాసినడు. రాయలేదు, చెప్పినడు. లేక పాడినడు. అందుట్లో ఒక దాంట్లో, మాటలే నాకు ఆభరణములు, మాటలే నాకు వస్త్రములు, అంటూ చెప్పి, ఈ మాటలనే నీకు పూజగా అందింతును అంటడు. ఈ మాటలను మొదట్లో
చదివినపుడు, కొన్ని నాళ్లు ఆ పెద్ద మనిషి
తలనిండ నిండి, పరుచుకుని మరొక ఆలోచన రాకుండ
చేసినడు. వ్యవసాయ విశ్వవిద్యాలయము వారు నన్ను ఒక ఉపన్యాసం చేయమని పిలిచినరు. నేను
ఆ ఉపన్యాసాన్ని ఈ కవితతో ప్రారంభించిన. నాకు
వచ్చినది మాటలు ఒకటే, ఆ
మాటలనే మీకు అందిస్త అనే భావము కలిగింది. మొదటి నిముషములోనే హాలు చప్పట్లతో
మారుమోగింది. ఆ చప్పట్లు నాకు కాదుగద! అవి టోకున తుకోజీ మహరాజ్ గారికే.
ఇంతకు, ఇయాల, అంటే, ఈ
పొద్దు, అంటే ఈ దినము, ఈనాడు (పాపము శమించుగాక) నేను చెప్పదలచిన విషయంబెట్టిదనిన, మాట లేకుంటే ఈ పొరుపంచికము, అనగా
దునియా, అనగా లోకము, అనగా ప్రపంచము ఎట్లుండును? అని
మా వన్ సెవెన్ నైన్ అనే పీఎస్‌జీ అన్నగారు ఉద్యోగములో ఉండంగ, తమ బల్లమీది అద్దము కింద, ఒక
కాగితము, కాగితము, కాయిదము, లేకా
కాకితము ముక్క, తుంపు, బిట్టు, మీద
‘మౌనేన కలహం నాస్తి’ అని రాసి పెట్టుకుని యుండిరి. మాట్లాడకుండ ఉంటే కొట్లాటలు
రావని ముందు అనిపిస్తుంది, నా వంటి, లాంటి, మాదిరి, పోలిన, తుంటరికి. ఉంటే ఎందుకు మాట్లాడవు? అని పేచీ కొట్లాటకు దిగవచ్చును గద!
మాటలు లేకుండ ఈ ప్రపంచము నడుచునా? అయ్యా! అమ్మ! ఇది నాకున్న కొద్దిపాటి, బుర్ర, మెదడును
తొలచుచున్న, తొలుచుచున్న, కలచుచున్న, మలచుచున్న, కలియబెట్టుచునున్న ప్రశ్న! క్రోశ్న, క్రొశ్చన్, క్వశ్చన్, యశ్చన్, యథా, తథా’ ఈ చివరి నాలుగు మాట రాజములు, తోచినవి, గనుక
రాసితిని. నిజముగా రాయవలెనని గాదు. రీజనింగ్ పరీక్ష గురించి తెలిసిన వారు ఎవరయినను
తరువాత రాదగు మాట ప్రశ్చన్ అని గుర్తించి ఉందురు గాక.
నేను ఎక్కువ మాట్లాడుతనని నాకు తెలుసు. ‘నీవు చాలమటుకు
మాట్లాడకుండ ఉంటవు కనుక అవకాశము వచ్చినపుడు, గలగలమని
మాట్లాడుతవు’ అని ఒక మిత్రుడు, నేస్తము, చెలికాడు, ఉద్దిగాడు
చెప్పెను, వాక్రుచ్చెను నిజంగనే! అంతేకాదు
అవకాశము వస్తే చాలు చెట్టుతో, పుట్టతో, గుట్టతో నేను మాట్లాడే ప్రయత్నము చేస్త! మాటలు నన్ను
చాలామందికి మిత్రునిగా మార్చినయి. ఒకనాడు నేను బస్సు కొరకు అందరి మాదిరి, లాగనే,
వోలెనే, వలెనే, పోలికగనే, దారి, రోడ్ పక్కనే నిలబడి ఉన్న, ఉంటిని.
పక్కన ఒకాయన నిలబడి ఉన్నడు. శానమంది ఉండి ఉంటరు. ఈయన చేతిలో ఒక పుస్తకము ఉన్నది.
అది అరుదయిన రకము. నాకు నచ్చిన రకము. పట్టలేక ‘ఏమండీ మీ గురించి తెలుసుకోవచ్చునా?’ అని అడిగిన. నాలుగయిదు మాటల తరువాత మాకు పరోక్షముగ పరిచయము
ఉన్నదని తేలిపోయినది. ఇంక మాట్లాడుకుంటూ ఎక్కవలసిన బస్ వచ్చినా, అక్కడ కొంతకాలము గడిపినట్టు నాకు గుర్తుంది. అది మాట బలము.
రామాయణములో రాముని మంచితనము గురించి చాలా చాల
రాసుకున్నరు. కానీ ఒక మాట నాకు బాగా గుర్తుంటుంది. రాముడు ‘పూర్వభాషి’ యట. అంటే
మనము పలకరిస్తమని ఎదురు చూడకుండ, తానే
ముందు పలకరిస్తడట. దాన్ని ఈనాటి మేనేజ్‌మెంట్ పరిభాషలో ‘ప్రోయాక్టివ్’ అంటరు. మీరు
పలకరిస్తారేమో అని నేను ఎదురు చూస్తున్న. ఈ ఊరికి, ఆ
ఊరికి దూరాల లెక్కలో మీరు గూడ అట్లనే ఎదురు చూస్తుండవచ్చు గద! ఎవరూ ముందు
మాట్లాడరు. ఈ లోపల పుణ్య కాలము మించిపోవును. లఖ్‌నవీ నవాబులు మీరు ముందు, మీరు
ముందు అంటూ మర్యాద చేస్తుంటే బండి ఎళ్లిపోయినట్టు, ఇక్కడ
కాలమనే బండి ఎళ్లిపోవును. తస్మాత్ స్పీక్ ఫస్ట్!
మాయావిడ కారు నడుపుతరు. నాకు ఆ పని చేతరాదు, చేతగాదు. ఆమె పక్కన కూచుని హాయిగ దేశమంత తిరుగుత. నేను
కారులో ఎక్కినప్పుడు చాలామాట్లు, మేము
మా ఇంటికి దగ్గరగ వున్న పెట్రోలు బంకులో ఆగుతము. పెట్రోలు పోయించు కుంటము. ‘మీకు
ఇక్కడి వాండ్లు దోస్తులు కాలేదా?’ అని
నేను మా శ్రీమతిని అడిగిన. ‘ఆ పిల్లగాండ్లతోటి నాకేమి దోస్తీ’ అన్నట్టు ఆమె నా
దిక్కు ఒక చూపు చూచింది. ముందున్న కారు ఓనరునకు అక్కడి అబ్బాయి, బాబు, పిలగాడు
ఒక పత్రికను ఉచితంగా ఇవ్వడము గమనించిన. తరువాత మా కారులో సహస్రం, అనగా వెయ్యి రూపాయల రాతినూనె వేయించుకున్నము. పోయించుకున్నము.
ఆ యువకుడు పైసలు తీసుకుని ఊరుకున్నడు. ‘ఏం తమీ! నాకు పత్రిక ఇయ్యవా?’ అని అడిగిన. ‘ఎందుకియ్యను సార్!’ అని నవ్వుతూ అతను నాకు గూడ
పత్రిక ఇచ్చినడు. ‘ఈసారి గనుక నేను ఆ బాబుకు కనిపిస్తినా, తప్పక చిరునవ్వు నవ్వుతడు’ అని తర్వాత మాయావిడ, మాయామె గారితో అన్న, అన్నాను.
(అన్నగాదు భర్త) ఆమె మాత్రము నవ్వి ఊరుకోలేదు. ‘మీలాగ మాట్లాడడము నాకు రాదు’
అన్నది. ఎందుకురాదు? మాటలు
రావా? మొగమాటమా? అడిగితే పత్రిక దొరికింది. కాదంటే, అది ఎటువంటి వారికి దొరుకుతుందన్న కిటుకు తెలుస్తుంది.
మాట్లాడకుండ ఉంటే పోట్లాట రాదు నిజమే ఉచిత పత్రిక కూడ రాదు, అడగనిదే అమ్మకూడ అన్నము పెట్టదు, అని మాట ఉన్నది.
మనసు నిండ అనుమానాలు ఉంటే ఇట్లనే అయితది, అవుతది, అవుతుంది
(మరోటి) ఔతుంది కరెక్టా, అవుతుంది
కరెక్టా? మిగతా రెండు మాటలు తప్పా! వివరాలు
మునుముందు వీలు వెంట చర్చించెదము గాక. నేను, ఇవాళ
మాటలకు అర్థములు మారుట, కొత్త
అర్థములు పుట్టుట గురించి రాయాలని అనుకున్నాను. మామూలుగా చేసే పద్ధతిలో గాక, రాసి చూతము అని మొదలుపెట్టితిని. ఇన్ని మాటలు వచ్చినవి.
ఇవన్నీ గూడ ఎన్నడో ఒకనాడు చెప్పవలెననుకున్న మాటలే. మిగిలిన మాటలు చెప్పే టందుకు
మరింత అవకాశము దొరకనే దొరకదా?
ఝలక్: టప్పాభై సత్తార్ మియా అనగానెవరో మీకు తెలుసునా? మనకు పట్టాభి సీతారామయ్య గారి గురించి గుర్తు ఉండి ఉంటే
మంచిదే. ఆయన గొప్ప నాయకుడు. విజనరీ. ఆయన పేరును ఉరుదూలో రాసినరు. తెలుగులో అటువంటి
పేరు ఉంటుందని తెలియని ఒక మనిషి చదవను ప్రయత్నిస్తే అది నేను రాసిన విధముగ
పలికినదట. ఉరుదూలో అక్షరాలను కలుపుతరు. తెలుగు ఇంగ్లీషు లాగ విడివిడిగ రాయరు. అది
చిక్కు. నా ఆలోచనలు కూడ అట్లనే సాగినట్లున్నయి. అయినా తప్పు జరగలేదనే అనుకుంటున్న!
No comments:
Post a Comment