లోకాభిరామం : కథా కమామిషూ
కథా కమామిషూ
ఆశ్చర్యపడదలుచుకుంటే
మనలను ఆశ్చర్యపరిచేందుకు ఈ ప్రపంచంలో అడుగడుగున కావలసినన్ని సంగతులు న్నయనేది మా
కుటుంబంలో ఒక తకియా కలామ్. అంటే తరచుగ వినిపించే మాట అని అర్ధం. అటువంటి సంగతు లను
వింటూ, చూస్తూ, చదువుతూ, సేకరిస్తూ మా కాలం గడుస్తుంటుంది.
వాటిని పంచుకోవడంలో, పెంచుకోవడంలో ఉన్న
ఆనందం అంతా ఇంతా కాదు! ‘నీవు చెప్పేది మంచి మాట అయ్యుంటే, దాన్ని ఇదివరకే ఎవరో చెప్పి ఉంటారు’
అనేది నేను స్వయంగా నమ్మి తయారుచేసుకున్న కొటేషన్. మంచి మాటలను, భావాలను బయటపెట్టే పద్ధతి మాత్రం
ఎక్కడికక్కడ ఆశ్చర్యకరంగ ఉంటుంది.
అచ్చరబల్ల-హాస్యకథ: హాస్యకథ అని రాయడంలోని అర్ధమేమి? కథలో నిజంగా హాస్యం పండి ఉంటే
చదవరులకు అర్ధమవుతుంది గదా? ముందే ఇది ‘హాస్యకథ’
జాగ్రత్త! అని చెపితే అందులోని హాస్యమే తప్ప మిగత సంగతులు కనిపించవేమో? నాకే అనుమానం. ఇంతకూ కథ!
ఒకాయన అత్తగారింటికి పోయినడు. అల్లునికి పండుగ జెయ్యాలె
మరి! ఏమున్నది చేసేందుకు? అత్తగారికి మంచి
ఆలోచన వచ్చింది. అల్లునికి తీపి ఇష్టమని ఆమెకు తెలిసినట్లున్నది. ఆమె నెయ్యి, బెల్లము వేసి సంకటి వండి పెట్టింది.
అల్లునికది బాగ నచ్చింది. ‘రుచి బాగున్నది. ఇదేమిడిది’ అని అడిగినడు. ‘తమిదె సంకటి’ అని
వాండ్లు చెప్పినరు. ‘తమిదె సంకటి, తమిదె సంకటి’
అనుకుంటూ తమ ఊరి తోవన వస్తున్నడు. నడుమ ఒక కాలువ వచ్చింది. దాని మీదనుంచి ఎగిరి
దుంకాలె. దుంకేటప్పడు ఊపు కొద్దీ, ‘అచ్చరబల్ల’ అన్నడు.
సంకటి సంగతి మరిచి, ‘అచ్చరబల్ల, అచ్చరబల్ల’ అనుకుంట ఇల్లు జేరినడు.
‘అచ్చరబల్ల’ చేసి పెట్టమని పెండ్లామును అడిగినడు. ‘అటువంటిది నాకు రాదు’ అన్నదామె.
‘మీ అమ్మవాండ్ల ఇంట్లో తిన్న నేను. నీవు కావాలంటని రాదంటున్నవు’ అని కోపం కొద్ది
పెండ్లామును బాగా కొట్టినడు. ఆ పుణ్యాత్మురాలు ‘నిజంగ నాకు దెలువదు’ అని మాత్రము
అన్నది. ఇంకా బాగా కొట్టినడు ఆమెను. ఆమె అంగలార్చింది. ఇరుగింటమ్మ, పొరుగింటమ్మ చేరినరు. పక్కింటి
ముసలామె ‘పిల్లను సంకటి సంకటిగ కొట్టినవు గదయా? ఏమొచ్చింది నీకు?’ అన్నది. ‘అగో! సంకటి! దాని కొరకే!’ అని అప్పుడు యాదికొచ్చి
అన్నడు!
కథ అయిపొయ్యింది. కాని కంచికి మాత్రం పోలేదు. ఇంతకు మీరు
నవ్వుతరా? ఆలోచన చేస్తరా? ఈ కథ మా చిన్నప్పుడు ఇన్నము (అనగా
వినియుంటిమి, వింటిమి, విన్నాము వగైరా వగైరాలన్నమాట!)
తయిదలు, తమిదెలు అన్నా రాగులన్నా ఒకటే! అమ్మ
నెయ్యిపోసి తమిదె సంకటి వండి పెట్టేది. మేము దాన్ని సంకటి అని ఒక్కనాడు గూడ అనలేదు.
దానికి, మాకు తెలిసిన పేరు ‘అచ్చరబల్ల’
మాత్రమే. సంకటి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా అచ్చరబల్ల అని మాత్రమే అన్నము
(అనగా అనియుంటిమి, అంటి, అన్నాము వగైరా వగైరాలన్న మాట).
రాగిముద్ద, అనే ఆహార విశేషం ఒకటి
ఉంది. దాన్ని మేమయితే తయిద (తమిదె, తమిద) సంకటి అంటము. అది అచ్చరబల్ల కాదు. బెల్లము, నెయ్యివేసి వండినది మాత్రమే
అచ్చరబల్ల!
అచ్చరబల్ల వంటి పల్లెటూరి కథలు అరుదయి పోయినయి. తెలిసిన
వాండ్లు చెప్పకపోతే, అందరు మరిచిపోతరు.
మీకు మీ పల్లెలో విన్న కథలు తెలిసి ఉంటయి. వాటిని పంచుకుందము గద!
ఆశ్చర్యం, టావో-టె-చింగ్:
పిల్లలు పుట్టిన వెంటనే చైనావారు ఒక గిన్నె లేదా మరో వస్తువును కింద పడేస్తారని
అది చేసిన చప్పుడును, ఆ శిశువుకు పేరుగా
స్థిరం చేస్తారని ఒకరెవరో చమత్కరించడం ఎరుగుదును. అది కేవలం చమత్కారం మాత్రమే. అది
వేరే విషయం.
తెలివి:
/గతి తెలిసిన పథికుడు తన అడుగు జాడలను వదలడు
/మతి గలిగిన మాటగాడు వేలెత్తే నిందకు తావివ్వడు
/ మితి తెలిసిన గణకుడు లెక్క తప్పనీయడు
/ఇక ఇతనేమో, మేకులు మాకులు లేకనే పెట్టెను మూస్తాడు
/దాన్ని తెరవడం అసాధ్యమవుతుంది
/వేరొకతను ముడులు, వడులు లేకనే కట్లు కడతాడు
/విడదీయను అసాధ్యమవుతుంది
/ఇదే దారిలో జ్ఞాని మనుషులను కాపాడడంలో నిపుణుడు
/ఎవరినీ వదలడు
/వస్తువులనూ కాపాడుతడు
/దేన్నీ వదలడు
/దీన్నే మన పద్ధతుల వెలుగును దాచడం అంటరు
/చెయ్యి తిరిగిన వారినే గురువులు అంటము
/ కళ తెలియని వారు వారిని ఆశ్రయిస్తరు
/ఈ తెలియనివారు గురువులకు గుర్తింపునిస్తరు
/గురువును శిష్యుడు గుర్తించకున్నా
/గురువితడిపట్ల హర్షించకున్నా
/వారిని చూచే
/పరిశీలకుడు, తాను తెలివిగల వాడయినా తప్పుదారి పడతడు/
ఇది రహస్యాలకే రహస్యం/
(చదువరీ ఇది కవిత మాత్రము కాదని సవినయముగ మనవి చేయుదును)
టావో-టే-చింగ్లోని ఒకానొక పేరాగ్రాఫ్కు ఇది నేను చేసిన
భాషాంతరీకరణం మాత్రమే. ఇందులో మీకేమన్న అర్థం తోచిందా? నేనింకా వెతుకుతునే ఉన్న. మరింత
బుర్ర చించుకుంటునే ఉన్న!
మరింత తెలివి: ఒకప్పుడు చైనా రాజధానిని పీకింగ్, లేదా పెకింగ్ అనేవారు. ఆ మధ్యన
బెయిజింగ్ అనాలన్నరు. (పరుషములు సరళములాయెను-ఇతి వ్యాకరణం. అర్ధంకాని వారికి రణం!)
అచ్చం అదే పద్ధతిలో టావ్-టె-చింగ్ను (వ్-వో తేడా లేదను కుందాం) డావ్-డే-జింగ్
అనాలన్నారు. మూడు మాటలనూ కలిపి పలికినా తప్పు లేదట. టావ్ లేక డావ్ అంటే మార్గం. (ఈ
మధ్యన సక్సెస్ సాధించిన కంపెనీలన్నీ ‘మైక్రోసాఫ్ట్ వే’ అనీ మరో కంపెనీ వే, అనీ, ఆయా కంపెనీల పని తీరు గురించి పుస్తకాలు
వేసుకుంటున్నరు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో
కంపెనీగానీ, మనిషిగానీ, ఏదో ఒక మార్గం- వే వల్లనే బాగుపడతరు, పాడవుతరు కూడా. కానీ, బాగుపడిన వారు మాత్రమే ఈ సంగతిని
అవునంటరు.
డావ్ డే జింగ్ను చైనాలో క్రీపూ ఆరవ శతాబ్దిలో లావో త్సు
అనే తాత్వికుడు రాసినడంటరు. (అంటే కొంచెం అనుమానమని అర్ధం!) లావో త్సు అనే మాటకు
ఓల్డ్ మాస్టర్ (వృద్ధ గురువు, పండితుడు) అని
అర్ధమట. పుస్తకం పేరు గురించి మస్తకం-తల పగిలేటంత చర్చ ఉంది. ‘మార్గం, శక్తి గురించిన నిజమయిన ప్రాచీన
గ్రంథం’ అనే అర్ధాన్ని ఇంచు మించు అందరూ అవునంటరు. నాటినుండి నేటి వరకు ఈ పుస్తకం
చైనాలో వెలుపల, అందరికీ దారి చూపుతనే
ఉన్నది.
పైన చదివిన ముక్కను తెలుగులో రాసింది, యువర్స్ ట్రూలీ, అనగా భవదీయుడు అని మనవి. మరో ముక్క
‘ముప్పయి ఆకులను ఒకచోట చేర్చి చక్రం అంటము/
వాటి మధ్యగల ఖాళీ మీద చక్రం ఉపయోగం ఆధారపడి ఉంది/
మట్టిని కుండగ మారుస్తము/
లోపల ఏమీలేని ఖాళీమీద కుండ ఉపయోగం ఆధారపడి ఉంది/
తలుపులు, కిటికీలు గుచ్చి
ఇల్లు అంటము/
లోపల ఏమీలేని ఖాళీ మీద ఇంటి ఉపయోగం ఆధారపడి ఉంది/
అందుకే ఉన్నదాన్ని ఎంతగా ఉపయోగించుకుంటమో/
లేనిదాని ఉపయోగాన్నీ అంతగానూ గుర్తించగలగాలె!’ (చక్రంలోని
నడిమి కుండను, వెలుపలి పూటీలను
కలిపేవి ఆకులు!)
హాశ్చర్యం టు ద పవరాఫ్ మీ ఇష్టం: మిత్రులూ! ఇంతవరకు విన్న, చదివిన
తరువాత మీకు ఆశ్చర్యం కలిగిందా, ఆనందం కలిగిందా, అదేదీ కాక బోర్ కొట్టిందా? మీకు అంతో కొంతో ఆలోచన కలిగియుంటే
మాత్రం నాకు రొంబరొంబ, నిండ సంతోషం గద! వీలు
దొరికింది గదా అని నేను ఊదర గొడుతున్న.. మీరంతా భరిస్తున్నరు. కోపగించుకోకండి కానీ, ఒక పెద్దాయన ఒక మాట చెప్పినడు.
ఆయనంటడూ, ‘మన పరస్పర సంబంధాలలో, అవగాహనలో, అంచనాలలో జరిగే పొరపాట్లకు
కారణాలున్నయి. ఏమిటంటే, మనం చదవవలసిన దాంట్లో
నాలుగింట మూడువంతులు మాత్రమే చదువు తము. సగం వరకు మాత్రమే వింటము (వినవలసిన దాంట్లోనన్నమాట).
అర్థం చేసుకునేది అవకాశంలో పావు వంతు మాత్రమే. ఆలోచన అసలే ఉండదు. మనుషుల మీద మన
పనులు, ప్రతి చర్యలు, ఆలోచనలు, మాటలు చూపగల ప్రభావం గురించి మనకు
పట్టదూ- అని. (ఈ మనంలో భవదీయుడు, అనగా యువర్స్ ట్రూలీ, ముందు వరసలోనే ఉన్నడు మరి!)
No comments:
Post a Comment