Monday, March 30, 2026

లోకాభిరామం - ఓటి రొండు ఒనరంగ మూడు (On numerals and alphabet)


లోకాభిరామం

ఓటి రొండు ఒనరంగ మూడు


ఒంట్లు - ఓనుమాలు

అసలు ఓనమాలు అంటే ఏమో ఇప్పుడు ఎవరికయిన గుర్తున్నదా? ఒకప్పుడు తెలుగు అక్షరాలు నేర్పించాలంటే, ముందు వాటిని పలకడం నేర్పి తరువాతనే రాత మొదలు పెట్టేవారు. అక్షరమాల పాఠం, ఓం నమశ్శివాయ, సిద్ధం నమ: అన్న ప్రార్థనతో మొదలవుతుంది. కనుక అక్షరాలు నేర్వడమంటే ఓనమాలతోనే మొదలవుతుంది. చదువురాని వారిని పల్లె మనుషులు ‘ఓనుమాలు’ కూడ రానివాడు, అనేవారు. అక్షరాలు దిద్ది నేర్చుకోవాలి. అంటే గురువు రాసిన అక్షరాల్ని అదే దారిలో రాసి, రాసి నేర్చుకోవాలి. ఈ పని ఇసుకలో జరిగేదంటే నమ్మగలరా? కలిగినవారు బియ్యం వాడేవారు. ఇవాళటికీ అక్షరాభ్యాసమన్నా, నామకరణమన్నా బియ్యంలో రాస్తరు. ఎందుకో అడగకుండ, అదే దారిని పోతే, అది సంప్రదాయ మవుతుంది. తరువాత మట్టి పలక వచ్చింది. మార్కాపురం మట్టిరేకు మీద కర్ర ఫ్రేము ఉంటే అది పలక. రాతి పొరలాంటి ఈ పలక పగులుతుంది. మళ్లీ మళ్లీ పలక పగిలితే వీపు పగిలే ప్రమాదం ఉంది. పలక మీద రాయడానికి బలపం కావాలి. అది కూడా పలక లాంటి పదార్థంతో తయారయిందే. చదువు తక్కువ, హంగులు ఎక్కువయితే, ‘చదువు చారెడు, బలపాలు దోశెడు’ అనేవారు మా చిన్నతనంలో. నేనింకా పలక స్థాయిలో ఉండగానే రేకు పలకలు వచ్చినయి. కానీ, వాటి మీద రాత అంత బాగ కుదిరేది కాదు. నాకు పలక మీద దిద్ది అక్షరాలు నేర్చుకున్నట్టు గుర్తులేదు. నేనంతే, నా కొడుకూ అంతే. పుస్తకాల్లో చూచి అక్షరాలు నేర్చుకున్నము. పెద్దయిన తరువాత నేను ఉర్దూ, తమిళం కూడ ఈ పద్ధతిలోనే నేర్చుకున్న. తమిళం అక్షరాలు కనిపిస్తే చాలు చదవాలని కోరిక. మట్ట పొగాకు, (అరటి మట్టలో చుట్టిన వండిన పొగాకు) ప్యాకెట్‌ మీద స్టిక్కరుంది. కూడ బలుక్కుని అందులోని అక్షరాలు ‘పకవకి వికరల్‌’ అనుకున్న. తరువాత అది భగవతీ విలాస్‌ అని అర్థమ యింది. ఉర్దూ పత్రిక షమాలోని ఫొటో కార్టూన్‌ నాకు ‘జోడో కా టౌన్‌’గా కనిపించింది.

బడిలో చేరేనాటికే అఆలు (అనే ఓనమాలు) వచ్చు. బడిలో నాన్ననే సారు. ఏదో పనిలో ఉండి పిల్లలందరినీ పలక నిండ, అఆలు రాయమన్నరు. నాకది నచ్చినట్లు లేదు. రాయమన్నది అ, ఆలు. పలక నిండ రాయాలె. ఒకవేపున అ, రెండో వేపున ఆ మాత్రం, నిజంగ పలక నిండేంత పెద్దవిగ క్షణంలో రాసి చూపించిన. నాన్న మంచి హాస్యప్రియులు. కొడుకు తెలివితనం చూచి ఎంత మురిసిపోయినడో! ఆయన నవ్వు నాకు ఇంకా గుర్తుంది! నాకు అఆలు వచ్చునన్న సంగతి ఆయనకు తెలుసు గద!

తెలుగులో అచ్చులన్నీ ముందు నేర్పి, తరువాత హల్లులకు పోతము. హిందీ అయినా అంతే. పడమటి ఇంగ్లీషులో ఎ, తరువాత బి ఎందుకు వస్తుందో, నాకర్థం కాలేదు. ఆల్ఫా, బీటా అన్న ప్రాచీన భాషలోనే ఆ పద్ధతి ఉంది. ఇంతకూ వాండ్లకు అన్ని అచ్చులు లేనే లేవాయె! ఇంగ్లీషులో అక్షరమాలను ఆల్ఫబెట్‌ అంటరు. మన వాళ్లు తెలియక ఆల్ఫబెట్స్‌ అంటుంటరు. ఇక్కడి మొదటి మాటకే మొత్తం అక్షరాలు అని అర్థం. దానికి ఇంకొక బహువచనం లేదు. చిత్రంగా ఉర్దూలో కూడా అలిఫ్‌ (అకారం) తరువాత బే (బ) వస్తుంది. పడమటి పద్ధతిలో!

ఒంట్లు: ఒంటి అంటే ఒంటరి అంటే ఒకటి అని అర్థం. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్‌, సప్త, అష్ట, నవ, దశ వరకు ఒకటి తప్ప అన్ని రెండక్షరాలకు మించని పేర్లు. మరీ చైనీసులోనయితే, పై, సై, కై అని ఒకే అక్షరం పేర్లుంటయట. అంటే వాటిని పలకడం, గుర్తుంచుకోవడం సులభం. ఇంగ్లీషులో వన్‌, టూ, త్రీ వరకు ఒక అక్షరం, ఫోర్‌, ఫైవ్‌, సిక్స్‌ ఒకటిన్నర అక్షరాలు. ఆ తరువాత క్రమం చెడుతుంది. ఈ రకమయిన అపక్రమం ఉన్నందుకు అంకెలను గుర్తుంచుకునే వీలు తగ్గుతుందట. రెండు సెకండ్లలో పలుకగలిగినన్ని అంకెలు బాగ గుర్తుంటయట. చైనా పిల్లలు, పెద్దలు, పది, పదకొండు అంకెలను రెండు మూడు మార్లు చదివి అప్పజెప్ప గలుగుతరట. తెలుగు, ఇంగ్లీషులో ఎనిమిది అంకెలు దాటితే గుర్తుండవని లెక్క. ఒక్కసారి విని ఫోన్‌ నెంబర్‌ రాసుకోగలిగిన వారు చాలా తెలివిగలవారి కింద లెక్క. మన ఫోన్‌ నంబర్లు ఎనిమిది అంకెలకు మించేవి కావు. సులభంగానే గుర్తుండేవి. మొబైల్‌ విప్లవంతో పల్లె, పట్నం తేడా లేకుండ ప్రతి నంబర్లో పది అంకెలుంటున్నయి. అయితే నంబర్లు గుర్తు పెట్టుకోవలసిన అవసరం కూడా తగ్గుతున్నది!

పది దాటి ముందుకు పోతే, అంకెల తీరు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. పది ఒకండు పదకొండు. పది, రెండు పన్నెండు. పదమూడు, పది నాలుగు వరుస బాగానే కదులుతుంది. అంటే పది స్థానం చెప్పి, తరువాత ఏదో తీరుగ ఒకట్ల స్థానం చెపుతున్నమని గద. ఇరవై, మూడు పదుల ముప్పయి, నలుబయి తరువాత కూడా అదే తీరు సాగుతుంది. కానీ హిందీలో గ్యారహ్, బారా, తేరా అంటూ పూర్తి కొత్త మాటలు వచ్చినయి. వీటిలో ఎక్కడా దస్‌ కనిపించదు. ఇంగ్లీషులో పదకొండు, పన్నెండులకు మాత్రం ఎలెవన్‌ (లెవన్‌ అనగూడదండీ), ట్వల్వ్‌ అని కొత్త రూపాలు వచ్చినయి. ఆ తరువాత టెన్‌ పోయి టీన్‌ అవుతుంది. తర్టీన్‌, ఫోర్‌టీన్‌, ఫిఫ్‌టీన్‌ అట్లా వరుస పోతుంది. ఇక్కడ తీరు తిరగబడి, ఒకట్ల స్థానం ముందు, ఆ తరువాత పది వస్తున్నయి. ఆ తర్వాత కూడా అదే తీరు ఉంటుందా, అంటే, ట్వంటీ వన్‌, సెవెంటీ వన్‌ అని దశమాలు ముందు వస్తయి. జెర్మన్‌లోనయితే, ‘ఒకటి మరియు ముప్పయి’ పద్ధతిలో అయిన్‌ ఉండ్‌ డ్రైషిష్‌ అంటారు. వాళ్లకూ పదకొండు, పన్నెండు నచ్చక కొత్త పేర్లు పెట్టినరు. ఆ తరువాత, డ్రైత్సేన్‌ అంటే డ్రై మూడు, త్సేన్‌  పది. ఇరుపదులు, ఇరువయి. బాగుంది. ట్వెంటీ అంటే గూడా బాగానే ఉంది. త్స్యాన్‌త్సిష్‌ (జెర్మన్‌) ఎట్లుంది. ఆఖ్‌ట్‌ అంటే ఎనిమిది. పదునెనిమిదిని మనమే పదెనిమిది బదులు, వైదికం పిల్లిలాగ వత్తి పలుకుతున్నము.

బ్లింక్‌: మాల్‌కమ్‌ గ్లాడ్‌వెల్‌ అని ఒక పెద్దాయన (వయసుకు చిన్నవాడే!) ఉన్నాడు. బ్లింక్‌ అని ఒక పుస్తకం రాశాడు. ఆ మాటకు కన్నురెప్పపాటు అని అర్థం. మనం ఒక సంగతి గురించి ఎన్నిరోజులు, ఎంతసేపు చర్చించినా, నిర్ణయం మాత్రం ఒక కన్ను రెప్పపాటులోనే చేస్తున్నమంటరాయన. ఆయన బ్లింక్‌లో రాసిన సంగతులు ముందు నాకయితే అర్థంగాలేదు. తరువాత బోలెడంత ఆలోచనలో పడేసినయి. మంచి పుస్తకం చేయవలసింది అదే గద! అందుకే ఈ పుస్తకాన్ని పైరేట్‌ (దొంగ) అచ్చు వేసి మన వాళ్లు ఫుట్‌పాత్‌ల మీద కూడా అమ్ముతున్నరు. మంచి పుస్తకాలు విలువ తగ్గించి కాలిబాట మీదకు చేర్చడం, మనం గౌరవం ఇచ్చే పద్ధతి.

ఈ గ్లాడ్‌వెల్‌ ఈ మధ్యన ఇంకో పుస్తకం రాసినడు. పేరు ఔట్‌లయ్యర్స్‌. అంటే మామూలుగా కాకుండా మరో రకంగా ఉండేవి, ఉండేవారని అర్థం. ఆ పుస్తకంలో తెలివి, చదువులాంటి ఎన్నో సంగతుల గురించి చర్చ ఉంది. అందులో భాగంగ ‘ఆసియా వారు అంకెలకు పేర్లు పెట్టిన పద్ధతి పారదర్శకంగ, అర్థమయే రకంగ ఉంది. పడమటి భాషల్లో అట్లా లేదు!’ అని ఒక పరిశోధకుడు, తరచి, తరచి తెలుసుకున్న సంగతి కూడ రాసినరు. ఆసియా పిల్లలు అందుకని, కూడిక, గుణకారం లాంటి లెక్కలు సులభంగ చేస్తరట. పడమటి పిల్లలకు నాలుగో తరగతి నుంచి లెక్కలంటే ఏవగింపు మొదలవుతుందని కూడా ఒక పరిశోధనా ఫలితం ఇచ్చినరు. మరి నాకు అంకెలు, లెక్కలంటే, అంత ఇష్టం లేదు! ఎందుకనో?

అపశకునం అంకెలు: తెలుగులో ఆరు తరువాత వచ్చే అంకె పేరు ‘ఏడుపు’ అన్నట్లుంది కదూ! అందుకే అది చాలమందికి ఇష్టం లేదు. ధాన్యం కొలిచేప్పుడు, ఆరు తరువాత ‘ఆరున్నొకటి, ఆరొకటి, అప్పుడు ఎనిమిది’ అనడం నేను విన్న. మా ఇంట్లో ఒక దుప్పటి ఉండేది. దానిపేరు పదిగోడు. అదేమిటిదని ఇప్పుడు నాకే అనుమానం వస్తుంది. ఆ దుప్పటి ధర పదిన్నిఏడు రూపాయలు. అమ్మినతను ఆ అంకెను పదిగోడు అని పలికినడు. ఇదీ చాదస్తంలో ఒక భాగమే.

ఏడున్నర అన్న అంకెను కూడా ఇష్టపడని వారు కొందరున్నరు. అందుకు కారణమేమో నాకు అంతు పట్టలేదు. సాఢేసాత్‌ ముహూర్తం అన్నమాట మెదడులో నిలబడి ఉంది. ఈ ముహూర్తం పనికిరానిది అని మాత్రం గుర్తుంది. సాఢేసాత్‌ గురించి కొంచెం బూతుగ ఉండే వివరణను విన్న కానీ, ఇక్కడ చెప్పను.

మన వాళ్లు ఛాదస్తులనుకుంటే, అమెరికాలో హొటేల్‌లో 13వ అంతస్తు ఉండదట. అపోలో 13 అన్యాయంగ ప్రమాదానికి గురయిందట. (మరెన్నో కూడా అదే దారిన పోయినయి) మొత్తానికి వారికి పదమూడు నచ్చదు. హిందీలో పదమూడు అని అర్థం వచ్చే ‘తేరా’ అన్న మాటకు ‘నీది’ అని అర్థం ఉంది. నానక్‌, ధాన్యం కొలిచి పోస్తున్నడు. బారా తరువాత తేరా వచ్చింది. ‘తేరా’ అంటే నీది, అంటే భగవంతుడిదని, మొత్తం ధాన్యం ఆ అంకెతోనే కొలిచినడంటరు! పనికిరాని అంకెలో గురునానక్‌ గురువు కాకముందే భగవంతుడిని చూడగలిగినడని కథగ చెప్పడం విన్న.


 

No comments: