I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Saturday, March 14, 2026
ఈ గాలి ఈ నేల : వాతావరణం - మేఘాలు మరెన్నో సంగతులు
ఈ గాలి - ఈ నేల
వాతావరణం - మేఘాలు మరెన్నో సంగతులు
మనమంతా గాలి మనుషులం. నేల మీద ఉంటున్నాం!
నిజమే. నీటిని వాడుకుంటున్నాం. అంతకన్నా నిజమే. కానీ, గాలి మీద ఆధారపడినంతగా మన బతుకులు ఈ రెంటి మీదగానీ, వెలుగు మీదగానీ ఆధారపడ లేదనిపిస్తుంది. ఎక్కడ ఉన్నాసరే, గాలి మనలను అంటిపెట్టుకుని ఉంటుంది. మనం వాతావరణంలో, అంటే గాలిలో మునిగి ఉంటాము. బతుకు కొనసాగడ మంటే, అనుక్షణం ఊపిరి కొనసాగడమే. గాలి చేసే గమ్మత్తుల ప్రభావం అనుక్షణం మనమీద ఉంటూనే
ఉంది. అయినా, గాలి గురించి, వాతావరణం గురించి మనకు అర్థమయింది మాత్రం చాలా తక్కువే. గాలిలో వింతలెన్నో
దాగి ఉన్నాయి. అందులో వెలుగులున్నాయి. నీరుంది. అల్లంత ఎత్తున మబ్బుల్లో కూడా జీవం
ఉంది. ఆ జీవం ప్రభావం మన మీద కూడా ఉంటుంది. మబ్బుల్లో మంచు ముక్కలు, నీటి చుక్కలు ఉన్నాయి. వాటికి ఒక రూపం ఏర్పడి మేఘం పుట్టాలంటే, సీడ్స్ అనే ఆధారాలు కావాలి. ఖనిజ లవణాలు గానీ, సూక్ష్మజీవులు గానీ ఈ ‘విత్తనాలు’గా అందుతుంటాయి. మేఘాలు
ఏర్పడడంలో కాస్మిక్ కిరణాలకు కూడా పాత్ర ఉందని పరిశోధకులు అంటున్నారు.
అంతరిక్షంలో నిండి ఉండే ఈ కిరణాలు, ఎంత ఎక్కువగా భూమి
వాతావరణంలోకి వచ్చి తాకితే, అంతగా మబ్బులు
తయారవుతాయంటున్నారు. మేఘాలు ఏర్పడడానికి అవసరమయిన ఆ మరీ సన్నటి దుమ్ము కణాలు అక్కడ
పుట్టడానికి కారణం ఈ కిరణాలేనని గత సంవత్సరంలోనే వీరు గమనించారు. అంత సన్నటి
దుమ్ముతో మబ్బులు పుడుతున్నాయా అని అనుమానం తెలియజేసిన వారు కూడా ఉన్నారు. మొత్తానికి మబ్బుల ఉనికి, కదలికలకు గాలి కారణమవుతుంది. విమానాలు ఎగురుతూ వాటిలోనుంచి
దూసుకు పోయి నందుకు మబ్బులలో యాభయి కిలోమీటర్ల వెడల్పు రంధ్రాలు పడుతున్నాయట.
దీనికి కూడా గాలే కారణం! కానీ, విమానం
మబ్బులోనుంచి ఉరికిన తాకిడితో మరిన్ని మంచుకణాలు తయారవుతాయట. విమానం వెచ్చదనం
కారణంగా, మేఘంలో, గారెలో లాంటి చిల్లు పడినందుకు, బహుశః లాభమేగానీ,
నష్టం లేదని చెపుతున్నారు. తీర ప్రాంతాలలో అప్పుడప్పుడు, తేనెపట్టులాంటి మేఘాలు కనబడుతుంటాయి. వీటిని ‘ఓపెన్ సెల్
మబ్బులు’ అంటారు. వాన తాకిడి కారణంగా, ఎత్తున ఉండే గాలి,
సముద్రం మీదకు నెట్టుకు వస్తుంది. దానివల్ల ఈ రకం మబ్బులు
పుడతాయి. గాలి ఒక జెట్‌లాగ వస్తుంది. ఈ ధారలు విస్తరించి పక్కధార వరకూ
వ్యాపిస్తాయి. తాకిడితో ఆ గాలి ధారలు తిరిగి చివ్వున పైకి ఎగసిపోతాయి. మొత్తం మీద
అక్కడ ఒక వింత నిర్మాణంగల మబ్బులు పుడతాయి. గాలి, అందులోని మబ్బుల
విషయంగా మరెంతో పరిశోధన జరుగుతున్నది. వాతావరణంలోని మధ్య భాగాన్ని మిసోస్ఫియర్
అంటారు. సుమారు ఎనభయ కిలోమీటర్ల ఎత్తున ఉండే ఈ మధ్యావరణంలో, ఒక ప్రత్యేక రకమయిన మబ్బులు ఉంటాయి. అవి మనకు మామూలుగానే తెలిసిన మబ్బుల కన్నా,
చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఈ రకం పలచగా విస్తరించిన
మబ్బులలో సన్నని మంచు శకలాలు పరుచుకుని ఉంటాయి. కనుకనే ఇవి ఉదయం సూర్యుని వెలుగులో,
తిరిగి అస్తమాన సమయంలో, ఆ వాలు కారణంగా వెలుగుతూ కనబడతాయి. ఈ రకం కిరణాలు భూమధ్య రేఖ ప్రాంతంలో కూడా
కనబడుతున్నాయని ఈ మధ్య గమనించారు. భూమికి దగ్గరగా ఉండే వాతావరణం ఈ మధ్యన
మార్పులకు గురవుతున్నది. ఈ కారణంగా, ఆ పైన ఉండే
మధ్యావరణం చల్లబడుతున్నది. కనుక, అక్కడ మంచు మరింత
సులభంగా తయారవుతుంది. భూమి మీద నుండే పశువులు, పరిశ్రమల కార ణంగా మీతేన్ వాయువు పుడుతున్నదని అందరికీ తెలుసు. తేలికయిన ఈ
వాయువు, మధ్యావరణంలోకి చేరి మంచు తయారీకి మరింత
సాయపడుతున్నదని కూడా పరిశోధకుల అభిప్రాయం. సూర్యుని కాంతిలో తేడా కూడా, ఇక్కడ ప్రభావం చూపుతున్నాయేమో! కానీ, ఈ చివరి మాట కేవలం అభిప్రాయం మాత్రమే. ఈ అంశం గురించి పరిశోధనలు అంతగా
జరగలేదు. గాలిలో తేలుతూ సూక్ష్మజీవులు, ఎన్నడూ లేనంత ఎత్తులకు చేరుతున్నాయని గమనించారు.
సూక్ష్మజీవులు, బూజు అంటే ఫంజీ జాతి జీవులు ఇలా ఎత్తులకు
వెళుతున్నాయి. వీటిలో కొన్ని, అదే పనిగా ఎప్పుడూ
గాలి వెంటబడి ప్రపంచమంతా తిరుగుతాయి. మిగతావి మబ్బులలోని రసాయనాలను మింగవచ్చునన్న
ఆశతో పోతాయి. అసలు జీవం పుట్టిందే, వాతావరణంలోని పై
పొరల్లో అన్న సిద్ధాంతం కూడా ఉంది. అక్కడి నుంచి జీవం, వర్షం ద్వారా సముద్రంలోకి చేరిందని అంటారు. గాలిలో సూక్ష్మజీవులు ఉంటాయని తెలుసు. అయితే,
అవి అనుకోకుండా ఆ ఎత్తులకు చేరాయని, అక్కడ అవి చేయగలిగింది ఏమీ ఉండదని అభిప్రాయం ఉండేది. కానీ గతంలో మూడు వేల
అడుగుల ఎత్తునుంచి సేకరించిన గాలి నమూనాలో, సూక్ష్మజీవులు చలాకీగా బతుకు సాగిస్తుండడం కనిపించింది. సూక్ష్మజీవులు అక్కడ
దొరికిన ఆ కొద్ది నీటిలోనే, సంఖ్యలో పెరిగి
బతుకుతున్నట్లు గమనించారు. వాటికి ఆహారంగా ఉపకరించే ఆర్గానిక్ ఆమ్లాలు, ఆల్కహాల్ రకం రసాయనాలను కూడా గుర్తించారు. ఆ ఎత్తులలో ఉండే
సూక్ష్మజీవులు ప్రతి సంవత్సరం ఒకటి నుంచి పది మిలియన్ టన్నుల కార్బన్‌ను వాడుకుంటున్నాయని
అంచనా వేశారు. సూక్ష్మజీవులు ఆకాశంలో ఉంటే మనకేమీ ఫరవాలేదు.
కానీ, అవి భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
మేఘాలు ఏర్పడడానికి విత్తనాలుగా, మంచుకణాలకన్నా ఈ
ప్రపంచమంతటా విస్తరించాయని గమనించారు. ఎండకూ, నీటి ఎద్దడికీ బాగాతట్టుకునే శక్తిగల ఈ జీవులు, భూమి, గాలి, మధ్య ప్రయాణాలు
సాగిస్తున్నాయి. వీటి వల్ల కొన్ని రకాల వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయని సైన్స్
పత్రికలో ఈ మధ్య ప్రకటించారు. ఆకాశంలో, అక్కడి గాలిలో ఎన్ని రకాల జీవులున్నాయని ఇంకా ఎవరూ లెక్క వేసింది లేదు. అవి
ఎంత ఎత్తు వరకు ఉన్నాయన్నది కూడా తెలియదు. ఇలాంటి అంశాలతో జీవం, గాలిలో పుట్టి నేలకు చేరిందన్న వాదానికి బలం సమకూరుతున్నది
No comments:
Post a Comment