I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Monday, March 2, 2026
Saturday, February 28, 2026
కలలు - వాటి తీరుతెన్నులు
కలలు - వాటి తీరుతెన్నులు
కలలు
కలలు కనండి. అప్పుడే అవి నిజమవుతాయి." అన్నారట ఆవుల్ పకీర్
జైనులాబుదీన్ అబ్దుల్
కలాం గారు.
ఆయనెవరని ఎవరికయినా అనుమానం వచ్చిన పక్షంలో పూచీ మొత్తం ఆ అనుమానం వచ్చిన వాళ్లదే. భారత రత్న బిరుదం పొందిన ఒకానొక శాస్తవేత్త గురించి తెలియక పోవడం గురించి ఏమనడానికీ లేదు.
ఇంతకూ విషయం కలల గురించి. కలాం గురించి కాదు.
కానీ కలల గురించి ఆయనగారన్న మాటలు కలకాలం మననం చేసుకోదగినవి. వాస్తవం గురించి అంతగా
ఆలోచించడానికి ఉండదు. అది మన ఎదుటనే ఉంటుంది. లేని దాన్ని గురించీ, వాస్తవం కన్నా మరింత గొప్పగా ఉండే
దాన్ని గురించీ ఆలోచించాలి. ఊహిం౦చాలి. కలలుగనాలి. అప్పుడవి నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచన
లేకుంటే ప్రయత్నం దాకా పరిస్థితి పోనే పోదు. కలాం గారు అందుకే కలలు కనమన్నారు. కానీ ఆయన చెప్పింది పగటి
కలల గురించి మాత్రం కాదు.
పగటి కలలు గాలిమేడలు ఒకటేనని వెనకటనే పెద్దలు చెప్పారు. మౌలుకువగా ఉన్నప్పుడు
రావలసినవి ఆలోచనలు.
కలలు కానే కాదు. పగలే కలలు కంటున్నారంటే పని చేయవలసిన సమయంలో పడుకుని నిద్ర పోతున్నారనయినా
అనుకోవాలి. లేదంటే అలవిమాలిన ఆలోచనలు చేస్తున్నారనయినా అనుకోవాలి. ఈ రెంటి వలనా (ప్రయోజనం ఉండదని వేరే చెప్పాలా? అలా కాకుండా గుండె నిండా ఒక
విషయాన్ని నింపుకుని తెలిసీ తెలియకుండా కూడా దాన్ని గురించే ఆలోచనలు సాగితే ఏదో ఒకనాడు ఆ
సంగతి కలలోకి కూడా వచ్చేస్తుంది. అది కలలోకి వచ్చిందంటే దాన్ని గురించి అంతగా
ఆలోచన జరుగుతు న్నదని అర్థం. కొన్ని సంగతులను గురించి ఆలోచనలు మనకు తెలియకుండానే మనసు
లోతుల్లో జరుగుతుంటాయని చాలా మందికి తెలియక పోవచ్చు. నిజానికి ఇటువంటి విషయాలే నిద్రలో కూడా
మనసులోకి వచ్చి కలలవుతాయి. కలాం గారు కలలు కనమన్నారంటే గట్టి ఆలోచన ఏదో చెయ్యమ న్నారని అర్థం. జాయిగా నిద్రపోయి
కలలు కనమని మాత్రం కాదు. ఆయన చెప్పిన దాంట్లో మరొక చిత్రం ఉంది. ఊరికే కలగని వదిలేస్తే
చాలదు. అది నిజమయ్యే దాకా కష్టపడి పని చేయాలి. అలాగంటే నిద్ర పోకూడదని కూడా అర్థమేమో.
చెప్పినమాట, వినడానికి ఒక అర్థాన్ని
సూచిస్తే బాగా ఆలోచించిన మీదట మరో అర్థాన్ని సూచించింది. అదే పెద్దల మాటల్లో
ఉండే గొప్పదనం.
ఒక రాజు ఉండే వాడు. ఆయన దగ్గర మామూలుగానే మంది మార్బలమూ ఉన్నారు. వారిలో ఒక
పహరాదారు కూడా ఉన్నాడు. అతనొక రోజు రాజుతో అయ్యా! మీరివాళ తోటలోకి పోకండి. అక్కడ
మీ కోసం ఆపద ఎదురు చూస్తూ ఉన్నది" అని చెప్పాడు. రాజు చూద్దామనుకుని తగు
జాగ్రత్తలతో తోటలోకి వెల్లాడు. అక్కడ నిజంగానే ఆపద ఎదురయింది. జాగ్రత్తగా
ఉన్నాడుగనుక రాజు తప్పించుకు వచ్చాడు. మరుసటిరోజు కూడా పహరాదారు అటువంటిదే మరో
హెచ్చరిక చేశాడు. అదీ నిజమయింది. ఇంతకూ నీకీ ఆపదల గురించి ముందే ఎట్లా తెలిసిందని
రాజు పహరా మనిషిని అడిగాడు. నాకా సంగతులు కలలో తెలిశాయని చెప్పి రాజును
రక్షించినందుకు తనకేదో గొప్ప బహుమానం దొరుకుతుందని ఆశగా చూచాడతను. రాజు మాత్రం కోపగించుకుని
రాత్రిపూట కాపలా కాయమంటే హాయిగా నిద్రపోయి కలలు
గంటున్నావా నాయనా? అసలు నీ వల్ల నాకు ఎక్కువ
ఆపద ఉండేట్టుంది!” అంటూ అతడిని ఉద్యోగంలోంచి తీసేశాడట.
ఇది వినడానికి ఏదో చిన్న పిల్లల కథలాగున్నా ఇందులో గొప్ప కిటుకుంది. మెలుకువగా
ఉండవలసిన వాళ్లు నిద్రపోతే కుదరదు. అందరికీ నిద్రపోయి హాయిగా కలలు గనే అవకాశమే
ఉండదు. జీవితంలో కష్టాలూ కడగండ్లూ మొదలయితే నిద్ర రాదు. ఇక కలల గురించి ఆలోచనే అవసరం లేదు. ఖర్మ గాలి
నిద్ర వచ్చినా కలలో కూడా కష్టాలే ఎదురయ్యి భయ పెడతాయి. పీడకలలంటే అవే మరి!
కల వస్తుంది. భయమయినా మెలుకువవుతుంది. బాగున్నా మెలుకువవుతు౦ది. సాధారణంగా కల సాంతంగా జ్ఞాపకముండదు. ఏదో కొంత మాత్రమే చూచాయగా గుర్తొస్తుంది. మెలుకువయిన వెంటనే కల
గురించి బాగా ఆలోచిస్తే బాగా గుర్తొస్తుందట. ఈలోపల మరే సంగతిమీదికి ధ్యాస పోయినా ఇక అక్కడికి కల
అయిపోయినట్టే, కుక్కలగురించి ఒక విచిత్రమయిన సంగతి చెపుతారు. అదెంతవరకు నిజమో అసలు నిజమవునో కాదో కూడా
తెలియదు. కుక్కకు ఫలానా ఇంట్లో లేదా ఫలానా చోట తినడానికేదో ఉందని కల వస్తుందట. అది లేచి చెవులు ఝాడించకుండా బయలుదేరిందంటే ఆ పూటకు కడుపు నిండినట్లే లెక్క. లేచిన తర్వాత చెవులు ఝాడిస్తే
మాత్రం కలలో కనబడిన సంగతులన్నీ కడిగేసినట్లు మెదడులోంచి మాయమవుతాయంటారు. "వింటాడు. వెంటనే
చెవులు ఝాడిస్తాడు" అనే మాట ఈ ధారణలోంచే పుట్టిందట. సైన్సులో కలల గురించి చాలా చాలా పరిశోధనలు జరిగాయి. కానీ
ఈ చెవులు ఝాడించడం
గురించి మాత్రం ఎక్కడా చదివిన గుర్తు లేదు. ఎలకలు కలలు గంటాయని వాటికి కలల
కారణంగా తెలివి పెరుగుతుందని ఈ మధ్యన ఒక పరిశోధకుడు వెల్లడించాడు. కొత్తగా
నేర్చుకున్న సంగతులు కలలద్వారా మనసులో మననమయ్యి గట్టిగా గుర్తుండిపోతాయని మరొక
సిద్ధాంతం వచ్చింది.
డిఎన్‌ఏ నిర్మాణాన్ని కనుగొన్న ప్రొఫెసర్ వాట్సన్ ఆ తర్వాత తన పరిశోధనలను కలల
వేపు మళ్లించాడంటే మనిషి జీవితంలో కలలకు౦డే ప్రాముఖ్యం అర్థమవుతుంది. కల ఎంత కాలం
కొనసాగు తుందన్నది మరో చిక్కుప్రశ్న. అది చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటుంది. ఆ కొద్దీ
సేపట్లోనే చాలా కాలం గడిచిన భావాన్ని కలిగిస్తుందని చెపుతారు. కల కాలగమనంలో మనలను
వెనుకకు తీసుకు పోతుంది. అప్పుడప్పుడు ముందుకు కూడా తీసుకు పోతుంది. ఆ పోయినచోట కథ
ఎంతకాలం నడుస్తుందో ఎప్పుడయినా గమనించారా? నా మటుకు నాకు ఒకే రోజు కలలో కొన్ని సంవత్సరాలు
గడిచిన అనుభవం కలుగలేదు.
ఒకరోజు ఒక సంఘటన మాత్రమే కలగా రావడం అలవాటు. లవణరాజు కల గురించి కథలు వచ్చాయి.
ఆయన పేరుకే గాదు. నిజంగానే రాజు. భోగభాగ్యాలతో బతుకుతుంటాడు. ఒకనాడు ఆయన సభకు ఒక ఐంద్రజాలికుడు
వస్తాడు. అతను
రాజుమీద మచ్చు జల్లుతాడు. ఆ దెబ్బతో రాజు కలగంటాడు. ఆ కలలో డెబ్బయి ఏళ్లు
గడుస్తాయి. రాజుకు పిల్లలు పుడతారు. అతను బీదవాడవుతాడు. పిల్లలు తమకు వేడి మాంసం
కావాలంటారు. రాజు అగ్ని ప్రవేశం చేస్తాడు. అప్పుడు కల ముగుస్తుంది. మెలుకువయిన తర్వాత తనకు క్షణాలలో అంతటి అనుభవమూ,
ఆత్మవివేచనమూ కలిగించిన కలగురించి ఆలోచిస్తాడు.
జీవితం ముందుకే సాగుతుంది. కల మాత్రం అటూ ఇటూ ఎటయినా పోతుంది. కానీ ఈ నిడివి గురించిన
సంగతి మాత్రం అంత సులభంగా తలకెక్కదు. ఒకే రకమయిన సంఘటన పదేపదే కలగా రావడమూ ఉంది. ఈ
రకంగా మళ్లీ మళ్లీ వచ్చే కలల గురించి శాస్త్రవేత్తలు భాష్యాలు చెపుతుంటారు. అవి
మనసులోతులలో నిలిచి భావాలకు ప్రతీకలుగా ఉంటాయంటారు. అసలు ఏ ఇబ్బందీ లేని కలలు
కొన్ని ఉన్నాయి. అవి సినిమాలో హీరో హీరోయిన్‌లకు వచ్చేస్తుంటాయి. వాళ్లకు కల
వచ్చిందంటే చాలు. అదంతా అచ్చమయిన సినిమా ఇంద్రలోకంలా ఉంటుంది. సినిమా జంటలకు
మరోపని ఉండదు. ఘాటుగా ప్రేమించడం పాటలు పాడడంతప్ప. ఆ పాటలు మరీ అందంగా ఉండాలంటే
వారు కలలు కనేస్తారు.
ఆ కలలలోకంలో కిందనుంచి పొగలొస్తుంటాయి. మిగతా లోకంలో పొగ గాలితో మీదకు కదిలితే
ఈ సినిమా కల పొగ మాత్రం నేలబారుగానే పోతుంది. ఆ లోకంలో గాల్లో చెమ్కీలు ఎగురుతుంటాయి.
బాల్కనీలో అట్ట చంద్రుడుంటాడు. వాళ్లు పున్నమి అని పాడుతున్నాసరే చందుడు మాత్రం పూర్తిగా ఉండడు.
ఇటువంటి కలలు కనడం మేలా? కలాం గారు చెప్పిన కలలు కనడం మేలా?
కె.బి.గోపాలం
Friday, February 27, 2026
కుక్క - పిల్లి చైనా జానపద కథ
కుక్క - పిల్లి
చైనా జానపద కథ
కుక్క - పిల్లి
అనగనగా ఒకప్ప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక భార్య కూడా ఉండేది. భార్యకు ఒక ఉంగరం ఉండేది. అది అదృష్టం ఉంగరం. అది ఎవరి దగ్గర ఉంటే వారికి కావలసినవి అన్నీ దొరుకుతాయి. అయితే ఆయనకు, ఆయన భార్యకు ఆ సంగతి తెలియదు. కనుక వాళ్లు ఆ ఉంగరాన్ని ఏదో అవసరానికి తక్కువ ధరకే అమ్మేశారు. ఉంగరం పోయింది. ఇక వాళ్లు రానురాను బీదవాళ్లు అయ్యారు. చివరకు పూటగడిచేది ఎలాగో తెలియని పరిస్థితి వచ్చింది.
ఆయన, ఆవిడల దగ్గర ఒక కుక్క, ఒక పిల్లి ఉండేవి. ఆయనకు, ఆవిడకే తిండిలేదు గనుక కుక్కకు, పిల్లికి కూడా ఆకలి తప్పలేదు.
వాటికి ఉంగరం సంగతి తెలుసు. యజమానులకు అదృష్టాన్ని తిరిగి కలిగించడం గురించి అవి చాలాకాలం
ఆలోచించాయి. అంత కాలము వాటి కడుపులు మండుతూనే ఉన్నాయి. కనుక మెదడు మాత్రం పదునెక్కింది.
చివరకు కుక్క ఒక ఆలోచన చెప్పింది. “ఏదో రకంగా ఉంగరాన్ని
తిరిగి తేవాలి” అన్నది. పిల్లి సరేనన్నది. “ఆ ఉంగరంలో మహత్తు ఉందని నాకు నమ్మకం కలిగింది”
అన్నది కుక్క. “నిజమేనేమో! అయితే ఆ ఉంగరాన్ని లీ ఫాన్‌కు అమ్మారు. దాన్ని ఆయన జాగ్రత్తగా
పెట్టేలో పెట్టి తాళం వేశాడు. లీ ఫాన్ ఇల్లు పూలతోటకు ఆవల ఉంటుంది. అది బాగా పెద్దగా
ఉంటుంది. గోడలు ఎత్తుగా ఉంటాయి. పెద్ద ఇనుపగేటు కూడా ఉంటుంది. లోపలికి వెళ్లడం ఎవరికీ
కుదరదు” అన్నది పిల్లి.
అయితే ఒక ఉపాయం చెపుతాను. నీవు ఒక చుంచును పట్టాలి. దాన్ని ఇద్దరము
కలిసి లీ ఫాన్ ఇంటికి తీసుకుపోదాము. అది గేటు కిందనుంచి దూరుతుంది. పెట్టెకు రంధ్రం
వేస్తుంది. ఉంగరాన్ని వెతికి తెస్తుంది. చుంచు ఒప్ప్పుకోలేదనుకో, దాన్ని తినేస్తాను అని నీవు
భయపెట్టాలి. చుంచుచేత ఈ పని చేయించాలి” అన్నది కుక్క.
పిల్లికి ఆలోచన నచ్చింది. అది త్వరలోనే ఒక చుంచును పట్టుకున్నది.
అంతా కలిసి ఉంగరం ఉన్న పెట్టె ఉన్న ఇంటికి బయలుదేరారు. మధ్యలో ఒక నది ఉంది. మరి పిల్లికి
ఈదడం చేతకాదు. కనుక అది కుక్క వీపుమీద ఎక్కింది. చుంచు దానితోబాటే ఉంది. కుక్క నది
ఈది అందరినీ అవతలికి చేర్చింది. అప్పుడు పిల్లి చుంచుతోబాటు లీ ఫాన్ ఇంటికి చేరింది.
అక్కడే ఉంగరంగల పెట్టె ఉంది మరి. చుంచు పెట్టెదాకా చేరింది. కొరికి కొరికి దానిలో రంధ్రం
వేసింది. ఉంగరాన్ని వెతికి తెచ్చింది.
పిల్లి ఉంగరాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నది. నది
వద్దకు వచ్చింది. అక్కడ కుక్క ఎదురు చూస్తున్నది. పిల్లి దానిమీద ఎక్కింది. కుక్క నది
ఈదింది. అవతలి గట్టుకు అంతా చేరుకున్నారు. ఇంటికి బయలుదేరారు. అదృష్టం ఉంగరాన్ని యజమానులయిన
ఆయన, ఆవిడగారలకు ఇవ్వాలి.
కుక్కకు వీధుల వెంట తిరగడం మాత్రమే తెలుసు. కనుక నగరంలోని
వీధులన్నీ దాటుతూ అది ఇంటికి నడక ప్రారంభించింది. పిల్లి మాత్రం ఇళ్ల పై కప్ప్పుల మీదకు
ఎక్కుతుంది. పక్క ఇంటి మీదకు దూకుతుంది. అది నిజంగానే ఇళ్ల మీద దూకుతూ తొందరగా యజమానుల
వద్దకు చేరింది. ఉంగరాన్ని ఆయన, ఆవిడగారలకు ఇచ్చింది.
అప్ప్పుడు ఆయన తన ఆవిడతో “మన పిల్లి మహామంచిది. మనకు మంచి
చేసింది. కనుక మనం దానికి మంచి తిండి పెడదాము. స్వంత బిడ్డలాగ చూచుకుందాము” అన్నాడు.
కుక్క కొంతసేపటికి ఇల్లు చేరగలిగింది. వాళ్లు దాన్ని కొట్టారు.
అరిచి తిట్టారు. ఉంగరం తేవడంలో అది సాయం చేయలేదని యజమానుల కోపం. పిల్లి మాత్రం చప్ప్పుడు
చేయకుండా వెచ్చని పొయ్యిలో పడుకున్నది. అక్కడినుండే గుర్రుగుర్రు మన్నది. నిజం మాత్రం
చెప్పలేదు. చెపితే తనకు అందే బహుమానం కుక్కకు కూడా అందుతుందని అనుమానం. ఇక తనకు నిజంగా
రావలసిన బహుమానాన్ని పిల్లి దోచుకున్నది, కనుక కుక్కకు తెగ కోపం వచ్చింది. పిల్లి కనబడితే
చాలు అది వెంటపడి తరమడం మొదలుపెట్టింది.
ఇవాళటికీ కుక్కలు, పిల్లులను తరుముతూనే ఉన్నాయి.
Thursday, February 26, 2026
ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో గురించి నా వ్యాసం 2వ భాగం
ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో
గురించి నా వ్యాసం 2వ భాగం
2
ఇస్మత్ చుగ్తాయి
లాగే మంటో కూడా సంచలనాలకు కారణమయి కోర్టు దాకా వెళ్లాడు. అయినా, ఇద్దరిదీ ఒకటే పద్ధతి. నిజాన్ని ఉన్నది ఉన్నట్టు
ఎత్తి చూపడం మా ధర్మం అంటారు ఇద్దరు.
మంటో బతుకుకూడా అదుపులేకుండానే జరిగింది. అతను తెగ
తాగేవాడంటారు. ఒక వ్యాసంలో అతనే రోజుకు ఒక
సీసా మాత్రమే తాగానని రాసుకున్నాడు. ఒక కథలో మాత్రం ఒకేనాడు పదిహేను కాయలు
లాగించినట్టు కూడా రాస్తాడు. బతుకు, రచనలు అతడిని భయపెట్టిన జాడలు కనిపించవు. ‘అవలక్షణాలు, అనారోగ్యాలు, అపభ్రంశాలు అన్నీ కలగలసి ఉన్న నా
పాత్రలను నేను నావిగా అంగీకరిస్తున్నాను’ అంటాడు మంటో. అతను 42 సంవత్సరాల వయసులోనే వెళిపోయాడు. అయినా, ఇవాళటి వరకూ అందరినీ తన గురించి ఆలోచించే రకంగా రచనలను
వదిలి వెళ్లాడు. చదువుకున్నది అంతంతే అయినా, ఇంగ్లీష్ మీద వల్లమాలిన అభిమానం చూపించాడు. ఫ్రెంచ్,
రష్యన్ సాహిత్యాన్ని కూడా
అంత అభిమానంగానూ చదివాడు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే, రైల్వే స్టేషన్‌లో బుక్‌స్టాల్ నుంచి పుస్తకాలను
దొంగిలించాడు కూడా! విక్టర్ హ్యూగో, ఆస్కార్ వైల్డ్, ఆంటన్ చెహోవ్
రచనలను అనువదించాడు కూడా. ఆ తరువాత అతనికి వాళ్లలాగ తాను కూడా రాయవచ్చును
అనిపించినట్టు ఉంది. ఇక ఆగకుండా 24 సంవత్సరాలపాటు 22 కథా సంకలనాలు,
5 రేడియో నాటకాల సంకలనాలు,
3 వ్యాస సంకలనాలు
ప్రచురించాడు. బొమ్మలు కూడా గీశాడు. ఒక నవల రాశాడు. ఏడు, ఎనిమిది సినిమాలకు కథ, మాటలు రాశాడు. అంత తక్కువ కాలంలో అన్ని రచనలు చేశాడంటే,
అతనికి అడుగడుగునా కథావస్తువు కనిపించి ఉంటుంది. సమాజంలో అంతటా కుళ్లు ఉండనే
ఉన్నది. దాన్ని గురించి అంత విస్తృతంగానూ, వివరంగానూ రాయగలగడం అసలు గొప్ప! ఆ పని చేశాడు గనుకనే, మంటో రచనలను వదలకుండా
చదువుతున్నారు. వాటి గురించి చర్చిస్తున్నారు.
ఉర్దూ కథా సాహిత్యంలో సాదత్ హసన్ మంటో స్థానం
గురించి వర్ణించడం సులభం కాదు. మంటోతో సమానంగా ప్రభావం చూపిన రచయితలు మరెవరూ
కనిపించరు. సాహిత్యంలో అతని తిరుగుబాటు పద్ధతి మరెవరికీ చేతకాలేదు. అతను రాసిన భాష, అతని పేరు తప్ప అతడిని ఒక మతానికి పరిమితం చేయడానికి
ఆధారాలు కనిపించవు. నిజానికి ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదు. అది సైనికుల
అవసరాలకోసం పుట్టిన ఆధునిక భాష. అందులో అభివ్యక్తి అందుకే సులభంగా వీలయింది! ఆ
భాషను వాడుకుని మంటో అన్ని మతాలలోని నమ్మకాలను కడిగే ప్రయత్నం చేశాడు. అతనికి మతమంటూ ఉంటే అది మానవత్వం మాత్రమే.
బడుగు మనుషులు అతనికి దగ్గరివాళ్లు. బాధలు అతను ఎత్తి చూపిన సత్యాలు. మంటో దేశ
విభజనను ఒక మతం దృష్టి నుంచి చూడలేదు. ఒక భాష దృష్టి నుంచి అంతకన్నా చూడ లేదు. కేవలం విభజనను ఒక బాధాకర సంఘటనగా మాత్రమే చిత్రించాడు. అప్పుడు జరిగిన దుండగాలు, రక్తపాతాలు, మానభంగాలు, నగరాల నాశనాలు, అతడిని భూకంపంలా
కదిలించాయి. అదే కాలంలో అప్పటి పరిస్థితులను గురించి కిషన్ చందర్, రాజిందర్ సింగ్ బేదీ, అహ్మద్ నదీమ్ ఖాస్మీ, ఇస్మత్ చుగ్తాయి లాంటివాళ్లు చాలా రచనలు చేశారు. అయినా,
అప్పటి పరిస్థితులు మంటో
రచనలలో కనిపించినంత స్ఫుటంగా మరెవరి రచనల్లోనూ రాలేదు. మతం పేరిట మనుషులను విడదీయడం మంటోకు నచ్చలేదు. సంస్కృతిని, నాగరికతను, కళలను, మాట, ఆట, పాటలను పంచుకోవడం కుదరదన్నది అతని వాదన. ఆ విషయాలనే తన
పద్ధతిలో చెప్పాడు. ‘టోబా టేక్‌సింగ్’ అన్న కథను ఇవాళటి వరకు ప్రపంచం
మరవలేకపోతున్నది.
మంటో కథలన్నీ ఇంటర్‌నెట్‌లో దొరకుతున్నాయంటే,
అతని ప్రభావం గురించి,
అది నేటి వరకూ కొనసాగుతున్న
తీరు గురించి అర్థమవుతుంది. మంటో మాత్రం ఈ ప్రభావాలను గురించి ఆలోచించనే లేదు.
తాను నమ్మిన విషయం గురించి దేవునితోనయినా తలపడేందుకు సిద్ధమేనన్నాడు. ‘లక్షమంది
ముస్లింలు, లక్షమంది
హిందువులు ఆ సమయంలో హతులయ్యారు అనకండి. రెండు లక్షలమంది మానవులు పోయారు అనండి’
అంటాడు అతను ఒకచోట. దేశం విడిపోయి నప్పుడు అంతమంది చావవలసిన అవసరం ఏమిటో అర్థం
కాదు. అందునా, ఏ సంబంధమూ లేని
అమాయకులు చావడం అంతకన్నా అర్థంకాదు. ఒక మతం వారిని చంపిన మరొక మతం వారు, ఆ మతాన్నే
చంపిన భావంతో సంబరం చేసుకున్నారేమో! కానీ, మతాన్ని తుపాకులతో చంపడం వీలయ్యే పనికాదు అని కూడా మంటో అంటాడు.
మంటో మాటలు సూటిగా ఉంటాయి. అక్కడ తెరలు, పొరలకు చోటు లేదు. చెప్పవలసిన మాట చెప్పవలసిన
బలంతో చెప్పడమే అతని రచనలలోని బలం! ఉదాహరణగా చెప్పడానికి లెక్కలేనని కథలు ఉన్నాయి.
ఆ కథల గురించి ఎంత చర్చ జరిగినా తక్కువే.
‘దేఖ్ కబీరా రోయా’ (చూచి, కబీర్ ఏడ్చాడు) అన్న కథ నభూతో నభవిష్యతి. కథలో కబీర్ లక్ష్మి విగ్రహాన్ని చూచి
ఏడుస్తాడు. కాలే కడుపులతో కూడా సైనికులు ఆజ్ఞలను పాటించవలసి వచ్చింది, అని కూడా
ఏడుస్తాడు.
అతని కథలు అప్పట్లో చాలామందికి అర్థం కాలేదన్న
అనుమానం పుడుతుంది. ప్రభుత్వంవారు మాత్రం బూతులు అంటూ ప్రతిబంధకాలు వేశారు. అటు
రచయితకు, ఇటు పాఠకునికి అనవసరంగా
కాలయాపన అన్నారు. కోర్టు కేసులు చాలాకాలం
నడిచాయి. ఇస్మత్ కూడా లాహోర్ వెళ్లి మంటోతోబాటు అక్కడే తన కేసు గెలిచింది. మంటోకు
పెద్ద జుర్మానా వేశారు. జుర్మ్ అంటే నేరం. నేను నేరం చేయలేదంటూ మంటో మళ్లీ
కోర్టుకెక్కాడు. ఆ కేసు నిర్ణయించవలసిన
జడ్జ్ మంటో మతానికి చెందినవాడే. సముద్రంగా చేరిన రక్తంలో నుంచి పశ్చాత్తాపం
అనే ముత్యాలు కనీసం బయటికి రావాలన్నాడు మంటో. ఆ మాట ప్రజలకు పట్టలేదు. మొత్తానికి
జడ్జ్ కేసును కొట్టివేశాడు. లేకుంటే, ఒక గడ్డం వాడు నాకు శిక్ష వేశాడని
మంటో ఒక కథ రాస్తాడు అంటూ, ఆ జడ్జ్ చమత్కరించాడు.
1955లో మంటో మరణించాడు. అంతకు కొంతకాలం ముందే అతను
‘పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లు తనను మెచ్చి
తన శవపేటిక మీద ఒక మెడల్ పెడతారంటూ, అది తనకు అవమానంగా నిలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు.
నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం అంతపనీ చేసింది! మంటో శతజయంతి సంవత్సరంలో అతనికి
‘నిషాన్`ఎ`ఇమ్‌తియాజ్’ అనే
బిరుదుతో పతకాన్ని ఇవ్వనే ఇచ్చింది. మంటో భారతీయుడు కాడంటే అన్యాయం. అతను పాకిస్తానీ
అన్నా అన్యాయమే. మంటోకు ఒక దేశం లేదు. ఒక మతం లేదు. మానవత్వమే అతని మతం. మంచి
అన్నదే అతని తీరు.
ఈ ప్రపంచంనిండా సమస్యలు మాత్రమే కాదు, కుళ్లు నిండుకుని ఉన్నది. దాన్ని ఎత్తి
చూపించకుంటే, అది ఎవరికి
పట్టకుండా కొనసాగుతుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా, ఎవరూ దాన్ని గురించి మాట్లాడరు. రచనలు అంతకన్నా చేయరు. ఏవో
మంచి మాటలతో కాలక్షేపం చేస్తారు. వివాదాలను సృష్టించి, సమాజాన్ని నిద్ర నుంచి మేల్కొల్పాలి, అనుకునే రచయితలు
అరుదుగా మాత్రమే కనపడతారు. అక్కడక్కడ కొందరు రచయితలు ధైర్యం చేసినా, విషయాన్ని
కొన్ని సమస్యలకే పరిమితం చేస్తారు. సమాజంలో అట్టడుగువర్గాలుగా ఉన్న
పనివాళ్లు, సానివాళ్లు,
దురలవాట్లకు లోనయి
కుళ్లుతున్నవాళ్లు కథా వస్తువులుగా కనిపించడం అరుదే! యమకూపం అనే పేరుతో తెలుగులో
వచ్చిన రష్యన్ నవల ‘యామా`ద పిట్’ వంటి రచనలకు మన సాహిత్యంలో చోటు ఉందా? సాదత్ హసన్ మంటో కథలలో కొన్నింటిని గురించి చర్చించే ధైర్యం
మనకు మిగలి ఉందా? మంటో రచనలలో
అందమయిన మనుషులకు చోటు లేదు. కథ ఎంత అందంగా నడిచినా, అందులో విషయం ఆనందకరంగా మాత్రం ఉండదు. మంటో రచనలలో సెక్స్
మరీ బాహాటంగా కనిపిస్తుంది. ఆడవాళ్ల వర్ణనలు కూడా కనిపిస్తాయి. కానీ, చదవరికి అవి గిలిగింతలు పెట్టవుకాక పెట్టవు. పైగా,
అసహ్యం కలిగిస్తాయి!
ఆలోచనలేని పాఠకునికి మంటో వెకిలి రచయితగా కనిపించవచ్చు. కానీ, మంటో మనసులోని బాధ అందితే మాత్రం, ఆ తరువాత కొంత
కాలం అది దెయ్యంలా వెంటాడుతుంది. మంటో గొప్ప కథలు తెలుగులో సంకలనాలుగా
వచ్చినట్టున్నాయి. రాకుంటే మాత్రం ఆ దిశగా ప్రయత్నం జరగాలి. ఆయన రచనల్లో అందరూ
చదివి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి మీద గట్టి చర్చలు జరగాలి. ఆ లోగా మంటో తీరు
గురించి పరిచయం చేసుకోవడం సాహిత్యాభిమానుల, మానవతావాదుల కనీస కర్తవ్యం.
Wednesday, February 25, 2026
అత్తగారు - లుయిజీ పిరాండెల్లో ఇటాలియన్ కథ
అత్తగారు
లుయిజీ పిరాండెల్లో ఇటాలియన్ కథ
అత్తగారు
లుయిజీ పిరాండెలో
నిజం చెప్పాలంటే వాళ్లగురించి ఎక్కువగా
ఆలోచించిన కొద్దీ అంటే మిస్టర్ పోన్‌జా, ఆయన అత్తగారి
గురించి ఆలోచిస్తే వాళ్లిద్దరిలో ఎవరు వెర్రివాళ్లన్న సంగతి అంత తక్కువగా అర్థమవుతున్నది.
వాళ్ల ఇద్దరిలో ఒకరికి తప్పకుండా పిచ్చి. వల్‌డానాలో
అందరూ ఈ సంగతి ఒప్పుకుంటారు. అయితే ఇద్దరిలో ఎవరికి? అసలు సంగతేమిటంటే...
కానీ నేను ముందుగా ఒక విషయం చెప్పాలి. వల్‌డానా
మనుషులలో నేను పూర్తిగా కొత్తవాడిని. కొత్తగా ఆ మనుషులిద్దరూ ప్రశాంతంగా సాధారణంగా
ఆనందంగా ఉన్న ఈ చిన్న పట్టణంలోకి వచ్చినప్పుడు వీళ్లు పడ్డ చికాకు గురించి నాకు
సానుభూతి తప్ప మరో భావం కలగలేదు. నేను వాళ్ల పట్ల సానుభూతి కలిగి ఉంటాను. ఎందుకో
చెపుతాను. వాళ్లిద్దరిలో ఒకరినొకరు బుర్రలేనివారుగా మారిపోయే తీరుగురించి నాకు
సంబంధం లేదు. కానీ వాళ్లిద్దరూ ఒక మొత్తం నగరాన్ని సస్పెన్స్‌లోను బాధలోను పెట్టి
అలా ప్రవర్తించడం సరైంది కాదని నేను అనుకుంటాను. వాళ్లిద్దరిలో ఎవరు నిజం చెపుతున్నారు?
ఎవరు భ్రమల ప్రభావంలో ఉన్నారు అన్నది అంతు పట్టకుండా
చేస్తున్నారు. మేము వాళ్లను ప్రతినిత్యం వీధిలో కలుస్తామంటే మీరు నమ్మగలరా?
(వల్‌డానాలో ఉండేది ఒకటే ప్రధాన వీధి. అక్కడే అందరమూ
కలుస్తాం) వాళ్లిద్దరిలో ఒకరికి పిచ్చి అని తెలుసు. వాళ్ల ముఖాలను పరీక్షించి
స్థూలంగా ఎవరికి పిచ్చి పట్టిందని తేల్చడం కుదరడంలేదు. ఒక్కోసారి ఎవరికి వారే `
అదిగో ఆవిడకు ` అనుకుంటారు. కానీ ఆ
తరువాత వెంటనే అందుకు వ్యతిరేకం ఏమో అనుకుంటారు. నాకు పోలీసులతో ఏ కొంచెం ప్రమేయం
ఉన్నా ఆ ఇద్దరినీ ఊరు వదిలి వెళ్లిపొమ్మని ఆర్డర్ జారీ చేస్తాను.
కానీ నేను పోలీసును కాను. ఇక జరిగింది ఇది.
మూడు మాసాల క్రితం సిన్యోర్ పోంజా అనే గవర్నమెంట్ ఉద్యోగంగల ఆయన రోమ్‌నుంచి
పంపబడి వల్‌డానాలో దిగాడు. వెంటనే ‘తేనెపట్టు (ద బీహైవ్)’ అనే సరికొత్త
పెద్దభవంతి అయిదవ ఫ్లోర్‌లో చిన్న ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. భవంతి నగరం
అంచుల్లో ఉంటుంది. పెద్ద బాల్కనీ నుంచి చూస్తే పొలాలు కనిపిస్తాయి. ఇక మిగతా మూడు
చిన్న కిటికీలు పెరట్లోకి తెరుచుకుంటాయి. ఈ కిటికీల్లో ఒకానొక దానిముందు ఒక పలుచని
తాటికి కట్టిన ఒక బుట్ట వేలాడుతూ ఉంటుంది. ఆ బుట్టను కిందకు దించి వ్యాపారులు
అందించే చిన్న పొట్లాలు, మిగతా సరుకులను
పైకి చేదుకోవచ్చు. ఇక అన్ని మెట్లు ఎక్కడమనే శ్రమ తగ్గుతుంది.
కానీ సిన్యోర్ పోంజా మరొక ఫ్లాట్‌ను కూడా
అద్దెకు తీసుకున్నాడు. ఈసారి అది పట్నం మధ్యభాగానికి దగ్గరగా ఉంది. అందులో
సిన్యోరా ఫ్రోలా అనే తన అత్తగారు ఉంటారని ఆయన అన్నాడు.
దీంతో వల్‌డానా ప్రజలు ఆశ్చర్యంలో పడిపోయారు.
రెండు ఫ్లాట్‌లు ఎందుకు? ఒక తల్లి తన
పెళ్లయిన కూతురితో ఉండలేకపోతే వెళ్లి తన అల్లుడితో ఉంటుంది. కానీ ప్రస్తుత కేసులో
వలె ఆమె తన కూతురి వెంటపడి అదే నగరానికి వచ్చింది. అయినా వేరే ఫ్లాట్‌లో ఉండాలని
నిర్ణయించింది. ఆ కుటుంబంలో ఏదో ఉందన్న సంగతి శుభ్రంగా బయటపడుతున్నది. ‘ఆ మనిషి
మొరటురకం అయి ఉంటాడు’ వల్‌డానాలోని అందరూ అలాగే అనుకున్నారు. ఇక అందరూ ఆ ఆడమనిషి
పట్ల అనుకోకుండానే సానుభూతి చూపించసాగారు. కానీ, ఆమెలో కూడా ఏవో లోపాలు ఉండవచ్చు, అని వారన్నారు.
అయినప్పటికీ గౌరవంగల పెద్దమనిషి ఎవరయినా అత్తగారు తన ఫ్లాట్‌లో ఉండకూడదని అంటాడా?
పోతే సిన్యోర్ పోంజా కనిపించే తీరు అదోరకంగా ఉంటుంది.
పొట్టి, కొంచెం లావు ఇంచుమించు ఆఫ్రికన్‌ల వంటి నల్లని
చాయ, ఉంగరాల జుట్టు, దళసరి కనుబొమ్మలు, భయ పెడుతున్నట్టు బుర్రమీసాలు, మొత్తానికి
మొట్టమొదటిసారి చూచినవారికి వెంటనే అతనిపట్ల సానుభూతి కలగదన్నది మాత్రం తప్పనిసరి
వాస్తవం. ఇక అందుకు వ్యతిరేకంగా ఆ చిన్న మధ్యవయస్సు తెల్లజుట్టు ఆడమనిషి మరీ పీలగా
ఉంది. దు:ఖంగా కనబడుతోంది. ఆమెను చూస్తే దయాదాక్షిణ్యాలకు రూపం అనిపిస్తుంది.
అటువంటి మనిషితో ఆమె భయంకరమయిన అసంతోషానికి గురయి ఉంటుందని అందరూ అనుకుంటారు. అతడు
ఆమెను కూతురు ఫ్లాట్‌లోకి రానివ్వడని కూడా అందరూ కనుగొన్నారు.
అయితే వ్యవహారం మరింత విచిత్రంగా మారేటట్టు ఆ
ముసలావిడ ఒక్కసారి కూడా అల్లునికి వ్యతిరేకంగా ఒక్కమాట అనడం ఎవరూ వినలేదు. పైగా
ఆయన గురించి ఎవరయినా తప్పుగా అనుకుంటారన్న ఆలోచనతోనే ఆమెకు బాధ కలుగుతుంది.
అల్లుడు తన కూతురికి చాలా మంచి భర్త, తనకు అతను,
అంకితమయిన కుమారుడు లాంటివాడు, అని చెప్పడానికి ఆమె ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. అవును,
అతను అంకితమయిన అబ్బాయే. విపరీతమయిన మంచి మనసుగల కొడుకు.
ఉన్న లోపం అంతా ` అది లోపమయితే ` ఒకే ఒక్కటి. అతనికి తన భార్యపట్ల గల ప్రేమ బహుశా మరీ విపరీతం. కానీ ఆమె వెంటనే
అంటుంది, ఒక భర్త తన భార్య తనకే సొంతం కావాలనుకుంటే, ఆ
విషయంలో భార్య తల్లిపట్ల అసూయ కలిగి ఉంటే అందులో తప్పేముంది, అని. అసూయా కాదు, అది అలాంటి ఇలాంటి
మామూలు అసూయ కాదు. అది పూర్తిగా వేరొకభావం. అది తీవ్రమయిన ప్రేమభావం. దాన్ని లోపం
అనడానికే లేదు. అయితే అది మరి స్వార్థమా, అసలు కాదు. ఒక
మనిషి తన భార్యకు సంపూర్తిగా అంకితమయి ఉంటే దాన్ని స్వార్థమనవచ్చా? లేదు అతను ఆ స్త్రీ చుట్టూ ఒక ప్రపంచాన్ని
సృష్టించుకున్నాడు. అందులోకి ఆమె తల్లిని కూడా దూసుకుని రానివ్వడు. అందుకే మరి ఆమె
కూతురి నుంచి దూరంగా ఉండాలని తేల్చేసుకున్నది. ప్రతిరోజు ఒకసారి వాళ్ల పెరట్లోకి
వచ్చి అక్కడి నుంచే కాసేపు మాట్లాడితే చాలు అనుకున్నది.
‘ఇవాళ ఎలాగున్నావు, టిల్డీనా?’
‘బాగున్నాను, అమ్మా, మరి నీవు?’
‘ఎక్స్‌లెంట్ డార్లింగ్. ఇక మరి బుట్ట కిందకు
దింపు.’
ఇక ఆ చిన్నబుట్ట ఆనాటి వార్తగల నోట్‌ను మోస్తూ
కిందకు వస్తుంది. వాళ్ల మీటింగ్ అంతటితో ముగుస్తుంది. నాలుగు సంవత్సరాలు ఇలాగే
కొనసాగింది. ప్రతినిత్యం ఆ ముసలావిడ రావడం, బుట్టలో అందిన కాగితాన్ని తీసుకుపోవడం, కూతురుకు గుడ్‌బై చెప్పడం, వీధి చివరలో మాయం
కావడం, సంతృప్తిగా అంగీకరించడం.
అయితే వల్‌డానాలో ఎవరూ ఈ వింత కథను
నమ్మలేకపోతున్నారు. నగరంలోని మహిళలు (ముఖ్యంగా ఆమె అల్లుని తోటి ఉద్యోగుల భార్యలు)
సిన్యోరా ఫ్రోలా ఇంటికి వెళ్లారు. కబుర్లు మొదలు పెట్టారు. చివరకు మాటల సంగతి
సిన్యోర్ పోంజా దాకా వెళ్లింది. అతని గురించి ఒక ముఖ్యమయిన వెల్లడింపు
బయటపడుతుందని వాళ్లంతా భయపడ్డారు. తన అత్తగారితో మరీ నేస్తంగా ఉన్నట్టు తెలిసిన
మహిళలకు ఆయన కబురు పంపించాడు. వాళ్లను కలుస్తానన్నాడు. అతను భావావేశంలో ఉక్కిరి
బిక్కిరి అవుతున్నాడు. అతని కళ్లు మరింత లోతుగా మరింత బాధతో కనిపించాయి. పట్టిన
చెమటను తుడుచుకోవడానికి అతని చేతిలో ఒక తెల్లని కర్చీఫ్‌ను పట్టుకున్నాడు. ఒక
రహస్యాన్ని కాపాడాలి అంటూ ఆడవాళ్లను వేడుకున్నాడు. అది ఎంతో ముఖ్యమయిన రహస్యం
అన్నాడు. వీలయితే దాన్ని తనలోనే దాచుకోవాలని అనుకున్నాడు గానీ, ఇప్పుడు బయట పెట్టవలసిన పరిస్థితి బలవంతం చేస్తున్నది. తన
అత్తగారికి, పిచ్చిపట్టిందని ఆయన చెప్పాడు. ఆమె నాలుగు
సంవత్సరాల క్రితం పిచ్చిదిగా మారింది. తన కూతురు పోయిందన్న వార్త తెలిసిన తరువాత
అది జరిగింది. ఆమెకు కలిగిన షాక్ చాలా గొప్పది. ఆనాటినుంచి తన కూతురు శాశ్వతంగా
పోయిందన్న విషయాన్ని నమ్మడానికి ఆమె ఒప్పుకోదు. కూతురు బతికే ఉందని గట్టిగా
అంటుంది. ఆమెకు నచ్చచెప్పడం అసలు కుదరడం లేదు. బాధలో ఉన్న ఒక తల్లికి సాయం
చేయాలన్న మంచి ఉద్దేశ్యంతో ఆమె భ్రమలను అలాగే కొనసాగించడమే తెలివిగల పని అతను
అనుకున్నాడు. తన మొదటి భార్య ఇంకా బతికే ఉందని ఆ తల్లి అనుకున్నా ఫరవాలేదన్నాడు.
ఇప్పుడు తనతో ఉంటున్న రెండవ భార్య ఆమె కూతురు కానేకాదని అతను వివరించాడు. ఈ రెండవ
భార్య ముసలావిడ మీద జాలికొద్దీ ప్రతినిత్యం కిటికీ దగ్గర కనిపించడానికి, చిన్న నోటు రాయడానికి అంగీకరించింది. విషయం బయటపడకుండా తనను
తాను ఫ్లాట్‌లోనే బంధించుకోవడానికి కూడా సిద్ధమయింది. ‘ఇది అసలు నిజం’ కళ్లలో
నీళ్లు తిరుగుతుండగా అతను ముగించాడు.
నగరంలోని మహిళలంతా విస్తుపోయారు. వారిలో
చాలామంది తమ ఆవేశాన్ని దాచుకోలేకపోయారు. అందరూ సిన్యోర్ పోంజా పట్ల సానుభూతి
చూపించారు. రహస్యాన్ని తమలోనే దాచుకుంటామని మరీమరీ మాట ఇచ్చారు. వాళ్ల మంచి మాటలతో
కొంత ఉపశమనం కలిగి సిన్యోర్ పోంజా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అతనలా
వెళ్లాడో లేదో సిన్యోరా ఫ్రోలా ప్రవేశించింది.
ఆమె దగ్గరా ఒక రహస్యం ఉంది, ఒక గొప్ప రహస్యం. వాళ్లు తమ పెదవులను కట్టి ఉంచుతామని ఒట్టు
పెట్టుకోవాలి. లేకుంటే, ప్రపంచంలో తనకు అందరికన్నా ఇష్టమయిన మనిషి నాశనమయిపోతాడు.
అతను తన అల్లుడే. ‘సంగతి బయట తెలిస్తే అతని బ్రతుకు బహుశా సర్వనాశనం అవుతుంది’
అన్నది ఆమె బాధగా. ఇక ఆ రహస్యం ఏమిటంటే, సిన్యోర్ పోంజా `
కష్టపడి పనిచేసే, ప్రశాంత స్వభావంగల
ప్రభుత్వ అధికారి ` పిచ్చివాడు. నాలుగు సంవత్సరాల క్రితం అతని
మెదడులోకి తన భార్య చనిపోయిందన్న ఆలోచన దూరింది. అప్పటినుంచి అతను
పిచ్చివాడయ్యాడు. అతనికి కలిగిన బాధ చాలా గొప్పది. ఆనాటి నుంచి అతను అందరికీ తన
భార్య పోయిందని, ఆమె మరణం కారణంగా అత్తగారు పిచ్చిదయిందని
చెపుతూ ఉంటారు. ‘పాపం తన భార్య నర్సింగ్‌హోమ్‌కు పోయింది, అక్కడి నుంచి తిరిగి రానేలేద’ని అతనికి గట్టి నమ్మకం. ఆమె ఏడుస్తూ ఈ మాట
చెప్పింది. ‘ఆ మాట అతని మనసులో నాటుకుపోయింది. ఆమె నిజానికి తిరిగి ఇంటికి
వచ్చినప్పుడు బంధువులు, మిత్రులను పిలిచి మరో పెళ్లి చేయవలసి వచ్చింది.
తాను ఈ మధ్యనే మరొక అమ్మాయిని నిజంగా పెళ్లి చేసుకున్నాడని అతనికి నమ్మకం
కలిగింద’ని అంటూ సిన్యోరా ఫ్లోరా కథ ముగించింది. పట్టలేక ఆమె మరింత చెప్పసాగింది.
‘పరిస్థితి మరీ దిగజారింది. అతను మళ్లీ తేరుకున్నాడని, తన భార్య అంటే మొదటి భార్యే అని అనుకుంటున్నాడని నేను నమ్మాను. కానీ అతని అసూయ
మరీ దూరం పోయింది. ఎవరిని భార్య దగ్గరికి రానివ్వడు. చివరకు వాళ్ల అమ్మను కూడా. ఆ
అమ్మాయిని ఫ్లాట్‌లో ఒంటరిగా బంధించాడు. లేకుంటే ప్రస్తుతం తన భార్యకు తల్లి కాని
ఒక అత్తగారి మీద అతను చూపే దయకు అర్థం లేదు. అయితే ఈలోగా మరో దురదృష్టకరమయిన విషయం
జరిగింది’ నిట్టూరుస్తూ కొనసాగించింది ఆమె. ‘నా కూతురు తను తానే కాదంటూ అందరినీ
ఒప్పించాలి. ఇక నేను పిచ్చిదాన్నని అందరినీ ఒప్పించాలి. నా కూతురు బతికి ఉంది
అన్నందుకు నేను పిచ్చిదాన్ని. ఒక తల్లిగా తన కూతురిని కిటికీలోంచి మాత్రమే చూచి
సంతృప్తిపడే ఒక తల్లి దుర్భర పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలరా? నేనిక నా అల్లుడితో ఉన్నది మరెవరో ఆడమనిషి అని ఆయనకు నమ్మకం
కలిగించాలి. అయినా నాకు ఇంకో మార్గం తోచలేదు. ఇక మీరు నన్ను చూస్తూనే ఉన్నారు.
నాకు పిచ్చిదని పేరు పెట్టారు. నిజంగా పిచ్చిపట్టిన వారి కొరకు నేను పిచ్చిదానిగా
బతకాలి. అర్థమయిందా మీకంతా?’
అవును మరి, ఆ మహిళలకు ఏమీ అర్థం కాలేదు. ఎవరికీ ఏమీ అర్థంకాలేదు. ఈ సమస్యను విడదీయాలని
ఎంత ప్రయత్నించినాగానీ నాకు కూడా అర్థం కాలేదు. వెళ్లి ఆ అమ్మాయిని అడగవచ్చుగదా
అని మీరు అంటారేమో. నిజమే, కానీ ఆమె తాను
రెండవ భార్యనని అందరికీ చెపుతుండగా ఆమె మాటలను నమ్మడమెలాగ? ఆమె కూడా భర్తలాగే భ్రమలో పడిపోయిందేమో? అయినా ఆమె ఇంటి తలుపు తెరవనని భీష్మించుకు కూచుంటే ఎవరు మాత్రం ఆమె దగ్గరకు
వెళ్లగలుగుతారు. ఆ మనిషి సిన్యోరా ఫ్రోలా అంటే తనకు భయమంటున్నదాయె!
ఈలోగా సిన్యోర్ పోన్‌జా కూడా తన భావాలను
వెల్లడించసాగాడు. ‘త్యాగం, కేవలం త్యాగం’
అంటున్నాడాయన. కానీ ఆయనకు నిజంగా పిచ్చేమో. పట్నంలోని వారందరికీ పరిస్థితి గురించి
తెలుసుకోవాలని పట్టుదల. వాళ్లిద్దరూ ఒకరిమీద ఒకరు అంత మంచితనం కనబరుస్తూ అంత
సఖ్యంగా ఉంటున్నారు. ఇక వారిలో ఒకరికి పిచ్చి ఉందని ఎవరూ అనుకోవడానికి లేదు. లేక
ఇద్దరికీ పిచ్చిపట్టిందా ఏమి?
సిన్యోరా ఫ్రోలా తరచుగా సిన్యోర్ పోన్‌జా
ఆఫీస్‌కు వెళుతుంది. ఇద్దరూ కలిసి షాపింగ్‌కు లేదా వాక్‌కు వెళ్లిపోతారు.
వాళ్లిద్దరూ చాలా హాయిగా కలిసి ఉన్నారు. ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్నారు. ఒకరిమీద
ఒకరికి సానుభూతి ఉన్నప్పుడు మాత్రమే వీలయ్యే పద్ధతిలో చక్కని మర్యాదలు
పాటిస్తున్నారు. నడుస్తూ ఆమె అలిసిపోతే, ఆయన చేతిని పట్టుకుంటుంది. అతనిమీద
వాలుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు. వందల కళ్లు తికమకగా, ఆశ్చర్యంగా వాళ్లను చూస్తూ ఉంటారు. వీరిలో పిచ్చి ఎవరికి?
ఇందులో నిజం ఎక్కడుంది? నీడ ఎక్కడుంది? లేక ఇందులో ఒకటికాక ఎక్కువ నిజాలున్నాయా?
జవాబు చెప్పాలంటే ముందుగా మరో జవాబు వెతకాలి. పిచ్చి
పట్టింది పోంజాగారికా, వాళ్ల అత్తగారికా? సాధారణంగా ప్రశాంతంగాను, సంతోషంగాను ఉండే
వల్డానా పట్టణంలో ఈ సమస్య అందరినీ ఇంకా తికమక పెడుతూనే ఉన్నది.
Tuesday, February 24, 2026
లోకాభిరామం : మాటా - మంతీ On languages and speaking.
లోకాభిరామం : మాటా - మంతీ
On languages and speaking.
మాటా - మంతి


