I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Friday, April 3, 2026
Tuesday, March 31, 2026
పగిలిన అద్దం - సాదిఖ్ హిదాయత్ (ఇరాన్) In Telugu now!
పగిలిన అద్దం - సాదిఖ్ హిదాయత్ (ఇరాన్)
వసంత
రుతువు మొదట్లో పూసిన పువ్వులాగా ఓడెట్ ఫ్రెష్ గా ఉంది. ఆకాశం రంగు కళ్ళు ఆశ
గొలుపుతుంటాయి. జుట్టు బుగ్గల మీదకు జారి దోబూచులాడుతూ ఉంటుంది. తెల్లని మృదువైన
ముఖంతో ఆమె గంటల తరబడి ఆ కిటికీ ముందు కూర్చుని ఉంటుంది. కాళ్లు ఒకదానిమీద మరొకటి
వేసుకుని నవల చదువుతూ ఉంటుంది. లేదంటే ఏ మేజోళ్లనో బాగు చేస్తుంది. అయితే ఆమె తన
వయోలిన్ మీద గరిజారి నాట్యం వరుసలు వాయించినప్పుడు మాత్రం నా గుండె ఊగిసలాడుతుంది.
నా
గది కిటికీ, ఓడెట్ గది
కిటికీకి ఎదురుగా ఉంటుంది. నా కిటికీలో నుంచి ఎన్ని నిమిషాలు, గంటలు, బహుశా ఆదివారం
మొత్తం రోజు, ఆమెను చూస్తూ
ఉండిపోయానో! అందునా రాత్రి ఆమె తన స్టాకింగ్స్ తీసేసి మంచం మీద చేరే సమయంలో మరీనూ!
ఈ
రకంగా మా మధ్యన ఒక చెప్పరాని అనుబంధం ఏర్పడింది. ఒక్కనాడు ఆమెను చూడకుంటే, ఏదో
పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఒక్కనాడు ఆమె వైపు మరీ ఎక్కువసేపు చూస్తానేమో, ఆమె లేచి కిటికీ
మూసేస్తుంది. ఇద్దరమూ రెండువారాలుగా ఒకరిని ఒకరు గమనిస్తూ ఉన్నాము. అయితే ఆమె
పట్టనట్టు మ్లానంగా ఉండేది. ఆమె కనీసం చిరునవ్వలేదు. నాపట్ల తన భావాలు తెలిసే
రకంగా ఏ కదలికా చేయలేదు. అయితే ఆమె చూపులు సీరియస్ గా ఉన్నాయి.
ఒక
ఉదయాన ఆమెకు నేను నేరుగా ఎదురుపడవలసి వచ్చింది. అప్పుడు నేను తిండి తినడానికి వీధి
చివరి కెఫేకు వెళుతున్నాను. బయటకు రాగానే ఓడెట్ కనిపించింది. చేతిలో వయోలిన్
పెట్టెతో ఆమె మెట్రోవేపు పోతున్నది. హలో, అన్నాను. ఆమె చిన్నగా నవ్వింది. ఆమె వయోలిన్ పెట్టె
పట్టుకోవచ్చా, అని అడిగాను.
అంగీకారంగా తల ఆడించింది. తాంక్స్, అన్నది. ఆ ఒక్క మాటతో మా పరిచయం మొదలయింది.
ఆనాటి
తర్వాతే మేము కిటికీలు తెరిచినప్పుడుల్లా ఒకరితో ఒకరం మాట్లాడుకో సాగాము. దూరం
నుంచే సైగలతో సంభాషణ సాగేది. ప్రతిసారి ప్రతిఫలంగా మేము లూగ్జెంబూర్గ్ గార్డెన్ కు
చేరి కలుసుకునేవాళ్ళము. తరువాత ఏదో సినిమాకు, నాటకానికి గాని వెళ్ళాము. లేదంటే మరేదో పద్ధతిలో ఒకరితోబాటు
మరొకరుగా, గంటల తరబడి
గడిపాము. ఓడెట్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తల్లి, ఆమె గారి రెండో భర్త, ఎక్కడికో వెళ్లారు. ఉద్యోగం పేరున ఆమె
మాత్రం పారిస్ లోనే ఉండిపోయింది.
ఆమె
చాలా తక్కువ మాట్లాడుతుంది. అయితే చిన్న పిల్లల మనస్తత్వం గలది. కొంచెం మొండిరకం
కూడా. ఒక్కోసారి నాకు కోపం తెప్పించేది. రెండు నెలలపాటు మేము దోస్తీ కొనసాగించాము.
ఒకనాడు, ఆ సాయంత్రం
న్యూలీలో జరిగే సంతకు పోవాలనుకున్నాము. ఆ రాత్రి ఓడెట్ తన కొత్త నీలిరంగు డ్రెస్
వేసుకున్నది. మామూలుకంటే ఎక్కువ సంతోషంగా కనిపించింది. మేము రెస్టొరాంట్ నుండి
బయటకు వచ్చి మెట్రో దిక్కువగా నడుస్తుంటే, ఆమె దారి పొడుగునా తన బతుకు గురించి చెప్పింది.
జనం
గుంపులుగా వస్తున్నారు, పోతున్నారు.
వీధివెంట అన్నిరకాల సరదా వ్యాపారం సాగుతున్నది. ఎంటర్టేనర్స్ ప్రదర్శనలు
చేస్తున్నారు. షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. లాటరీ టికెట్, మిఠాయిలు, సర్కస్, చిన్న
ఎలక్ట్రిక్ కార్లు, గిరగిరా తిరిగే
బెలూన్లు, మరేమో రైడ్స్, రకరకాల
ప్రదర్శనలు, అన్నీ ఉన్నాయి.
అమ్మాయిల అరుపులు, మాటలు, నవ్వులు
వినిపిస్తున్నాయి. గుసగుసలు కూడా. అవి మోటార్ల ధ్వనులు, సంగీతాలలో కలిసి
పోతున్నాయి.
మేము
కార్ రైడ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అది ఒక కారు కాదు. కొన్ని కార్లు, ట్రెయిన్ లాగా, ఒక దానికి ఒకటి
తగిలించి ఉంటాయి. అవి ఒక గుండ్రని దారిలో తిరుగుతాయి. కదిలేటప్పుడు పైన ఒక గుడ్డతో
కప్పు వేస్తారు. బయట నుంచి చూసే వారికి అవి ఒక పచ్చని పురుగులాగా కనిపిస్తాయి.
ఎక్కుతూ ఉన్నప్పుడు, ఓడెట్ తన
గ్లోవ్స్, పర్స్ నా చేతికి
యిచ్చింది. రైడ్ సమయంలో పడిపోకుండా అది జాగ్రత్త. మేము పక్కపక్కనే దగ్గరగా
కూచున్నాము. రైడ్ స్టార్టయింది. పచ్చని పైకప్పు వేసి, ఐదు నిమిషాల
పాటు మమ్మల్ని ఎవరికీ కనబడకుండా దాచేశారు.
కవర్
తీసేశారు. మా పెదవులు మాత్రం కలిసే ఉన్నాయి. నేను ఓడెట్ ను ముద్దు పెట్టుకుంటే ఆమె
అడ్డు చెప్పలేదు. మేము దిగి నడుస్తుంటే, శుక్రవారం మార్కెట్ కు రావడం తనకు ఇది మూడవసారి మాత్రమే అని
ఆమె చెప్పింది. వాళ్ళ అమ్మ వద్దని ఆంక్ష పెట్టింది. ఇక మేము ఏవేవో ప్రాంతాలు
చూస్తూ తిరిగాము. బాగా అలసిపోయి,
తిరుగుదారి
పట్టే సమయానికి నడిరాత్రి అయింది. అయినా ఓడెట్ వెళ్లడానికి యిష్టపడలేదు. ప్రతి షో
దగ్గర ఆమె ఆగుతుంది. నేను ఆగక తప్పదు. రెండుమూడు మార్లు ఆమె చేయి పట్టుకుని
లాక్కుపోవలసి వచ్చింది. ఆమె తప్పక నావెంట వచ్చింది. చివరకు ఆమె జిల్లెట్ రేజర్
బ్లేడ్ అమ్మే స్టాల్ ముందు ఆగింది. అంగడి మనిషి ప్రదర్శన చేస్తూ
ఉపన్యసిస్తున్నాడు. ఈసారి నాకు బాగా కోపం వచ్చింది. చెయ్యి పట్టి గట్టిగా లాగాను.
ఆడవాళ్లకు సంబంధం లేని సంగతి అన్నాను. ఆమె చెయ్యి లాగేసుకున్నది. తెలుసు, అయినా చూస్తాను, అన్నది.
జవాబు
చెప్పకుండా మెట్రో వేపు నడిచాను. ఇల్లు చేరేసరికి వీధిలో మనుషులెవరూ లేరు. ఓడెట్
కిటికీ చీకటిగా ఉంది. నేను నా గదిలోకి వెళ్లి లైట్ వేసాను. కిటికీ తెరిచాను. నిద్ర
రావడం లేదు. కొంతసేపు ఏదో చదివాను. ఒంటిగంట అవుతున్నది. కిటికీ మూసి పడుకుందామని
లేచాను. ఓడెట్ తన కిటికీ కింద, వీధి దీపం వెలుతురులో నిలబడి ఉంది. నాకు ఆశ్చర్యం
కలిగింది. గట్టిగా కిటికీ వేశాను. దుస్తులు మారుస్తుంటే ఓడెట్ పూసల పర్స్, గ్లోవ్స్, నా జేబులో ఉండడం
గుర్తుకు వచ్చింది. డబ్బులు,
ఇంటి
తాళం చెవి, పర్సులో ఉన్నాయని తెలుసు. వాటిని గట్టిగా కట్టి కిటికీలో నుంచి
పడేశాను.
మూడు
వారాలు గడిచాయి. అంతకాలమూ నేను ఆమె గురించి పట్టించుకోలేదు. తన కిటికీ తెరిస్తే, నాకిటికి
మూశాను. ఈ లోపల నేను లండన్ వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. బయలుదేరడానికి ఒక నాడు ముందు, ఒకసారి ఆమె, తన వయోలిన్
పెట్టెతోబాటు మెట్రో వేపు పోతూ వీధి చివరన ఎదురు పడింది. హలో, అని నాలుగు
మాటలు మాట్లాడాను. నా ప్రయాణం గురించి ఆమెకు చెప్పాను. రాత్రి నా ప్రవర్తన గురించి
క్షమాపణ కూడా చెప్పాను. ఓడెట్ తన పూసల పర్స్ తెరిచి, ఒక అద్దం తీసి, నా చేతికి యిచ్చింది. అది మధ్యలో పగిలి ఉంది. కిటికీలోనుంచి
నీవు పర్స్ పడేసినప్పుడు అది పగిలింది. దాంతో దురదృష్టం వస్తుందని తెలుసా? అడిగింది.
నేను
జవాబుగా నవ్వాను. ఛాదస్తం, అన్నాను. వెళ్లే
లోగా మళ్ళీ కలుస్తానని మాట యిచ్చాను. అయితే అది కుదరలేదు.
లండన్
లో ఒక నెల గడిచిన తర్వాత ఓడెట్ నుంచి ఉత్తరం వచ్చింది.
ప్యారిస్, 21 సెప్టెంబర్
1930
ప్రియాతి
ప్రియ జెమ్ షీడ్,
ఎంత
ఒంటరిగా ఉన్నాను నీకు తెలియదు. ఒంటరితనం నన్ను బాధిస్తున్నది. ఈ రాత్రి నేను నీకు
కొన్ని సంగతులు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే, ఉత్తరం రాస్తుంటే, నీతో మాట్లాడుతున్నట్టే ఉంది. నేను ఇంత సులభంగా నీవు
అంటున్నందుకు క్షమించు. నా బాధ ఏమిటో నీకు తెలిస్తే బాగుండును!
దినాలు
ఎంత పొడుగయ్యాయి? గడియారం ముళ్ళు
మరీ మెల్లగా కదులుతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. నీకు కూడా కాలం బరువుగానే
సాగుతున్నదా? అక్కడ బహుశా మరో
అమ్మాయిని కలిసి ఉంటావు. అయితే నీ తల ఎప్పుడూ పుస్తకంలోనే మునిగి ఉంటుందని తెలుసు!
అయినా! ఇక్కడ ప్యారిస్ లో అట్లాగే ఉండే వాడివి కదా! నీ చిన్న గది ఎప్పుడూ నా కళ్ళ
ముందు మెదులుతుంది. ఒక చైనీస్ విద్యార్థి అందులోకి వచ్చాడు. నేను నా కిటికీ మీద
మందం కర్టన్ వేసి ఉంచాను. బయటకు ఇక కనిపించదు. నాకు ప్రియతముడు అక్కడ లేడు గదా!
అదేదో పాటలో పల్లవి అలాగే ఉంటుంది. మరో దేశానికి వెళ్లిన పక్షి తిరిగి రాదు! అని.
నిన్న
హెలెన్ తో లూగ్జెంబూర్గ్ పార్క్ లో తిరగబోయాను. ఆ రాతి బెంచ్ దగ్గరకు పోయే
సమయానికి నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. అదే బెంచ్ మీద ఇద్దరమూ కూర్చున్నాము.
నీవు మీ దేశం గురించి మాట్లాడావు. ఎన్నెన్నో ప్రమాణాలు చేశావు. నేను అన్నీ
నమ్మాను. ఇప్పుడు నా స్నేహితులంతా నన్ను ఆటపట్టిస్తున్నారు. అందరూ నా గురించి ఏవో
అంటున్నారు. నిన్ను గుర్తుంచుకోవడానికి గరిజారి వాల్ట్స్ వాయిస్తుంటాను. నీతో పాటు
తీయించుకున్న ఫోటో బల్లమీద ఉంది. ఆ బొమ్మ చూచినప్పుడల్లా నమ్మకం పెరుగుతుంది. మోసం
చేయదు, అనుకుంటాను.
అయితే నీవు కూడా అట్లాగ అనుకుంటున్నావో లేదో తెలియదు. ఆ రాత్రి నా అద్దం పగిలిన
తర్వాత, నీవే దాన్ని
నాకు తిరిగి ఇచ్చావు మరి, నా గుండె నన్ను
హెచ్చరిస్తున్నది. జరగకూడనిదేదో జరుగుతుంది, అంటున్నది. మనం చివరిసారిగా కలిసిననాడు, ఇంగ్లాండ్
వెళుతున్నాను, అన్నావు. నీవు
చాలా దూరం వెళ్ళిపోతున్నావని నా హృదయం ఆనాడు చెప్పింది. మళ్ళీ కలువలేమన్న అనుమానం
మొదలైంది. అనుకున్నంతా జరిగింది. ఎందుకంత దుఃఖంగా ఉన్నావు? అని మేడం బ్లోరే
అడిగారు. ఆమె నన్ను తనతో బ్రిటనీ తీసుకు వెళతానన్నారు. అయితే నేను వెళ్లలేదు.
అక్కడ పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుసు.
సరేలే, పట్టించుకోకు.
జరిగిందేదో జరిగింది. నా మాటలు ఒక రకంగా ఉంటే, అందుకు కారణం ఉంది. నన్ను దయచేసి క్షమించు. నిన్ను
కష్టపెట్టి ఉంటే, నన్ను
మరిచిపోతావని అనుకుంటున్నాను. నా ఉత్తరాలన్నీ, కాల్చివేస్తావు. అంతేనా
జిమ్మీ!
ఈ
క్షణాన ఎంతటి బాధ, దుఃఖంలో
ఉన్నానని నీకు తెలిస్తే మేలు. నేను అన్నింటితోను విసిగిపోయాను. పనిలో కూడా మనసు
నిలవడం లేదు. ఇంతకు ముందు అట్లా ఉండేది కాదు. ఇంకా, ఇట్లా వేలాడబడి ఉండడం ఇష్టం లేదు. మిగతా వాళ్లకు నావల్ల
దుఃఖం కలగవచ్చు. అందరి బాధ ఒక్కచోట చేర్చినా, నా బాధకు సరిరాదు. ఆదివారం నాడు పారిస్ వదిలి పోవాలని
నిర్ణయించాను. ఆరున్నర ట్రెయిన్ లో కలేస్ పోతాను. అక్కడి నుంచే కద, నీవు
వెళ్ళిపోయింది. ఇక సముద్రంలోని నీలి నీళ్లను చూస్తాను. అవి అన్ని దురదృష్టాలను
కడిగేస్తాయి. ప్రతిక్షణం వాటి రంగు మారుతూ ఉంటుంది. అది దుఃఖమయ మంత్ర శక్తి
గురగురతో తీరం ఇసుకను తాకుతుంది. నురగలు పుడతాయి. ఇసుక ఆ నురుగను కొరుకుతుంది.
మింగేస్తుంది. ఇక ఆ అలలు నా చివరి ఆలోచనలను తమతో మోసుకుపోతాయి. మరణం ఒకరిని చూచి
ముసిముసిగా నవ్విందంటే, ఆ నవ్వుతో
వద్దకు లాక్కుంటుంది. అటువంటిది ఏదీ ఉండదని నీవు అనవచ్చు. నేను అబద్ధాలు
చెప్పలేదని నీవు చూస్తావు.
దూరం
నుంచి నా ముద్దులు అంగీకరించు,
ఓడెట్
లా సూర్
జవాబుగా
నేను ఓడెట్ కు రెండు ఉత్తరాలు రాశాను. ఒక దానికి జవాబు రాలేదు. మరొకటి తిరిగి
వచ్చింది. మరుసటి సంవత్సరం పారిస్ కు తిరిగి వెళ్ళాను. వీలైనంత త్వరగా సెయింట్
జాక్వెస్ వీధికి వెళ్లాను. అక్కడే నా పాత మకాం ఉండేది. నా గదిలో నుంచి ఒక చైనీస్
విద్యార్థి గరిజారీ నాట్యగీతం వరుసలు ఈల వేస్తున్నాడు. ఓడెట్ గది కిటికీ మాత్రం
మూసి ఉంది. ఇంటి తలుపు మీద టు లెట్ అని కాగితం అతికించి ఉంది.
Monday, March 23, 2026
లోకాభిరామం : భాష - బహాసా
లోకాభిరామం : భాష - బహాసా
భాష - బహాసా
అనవసరంగారు :
రేడియోలో ఎవ్-సాయదార్లకు వాతావర్ణ సూచనలుంటయి, ఎప్పుడన్న విన్నరా? మేమయితే ఇదే ప్రశ్నను
ఇన్నరా? అని అడిగినా
అర్ధం చేసుకుంటము. వ్యవసాయము మా దగ్గర ‘ఎగుసము’ అవుతుంది. వేసవి, వేసంగి, యాసంగి అంటే ఒకటే
మాటనా? మాటల
మూలాలను వెతుకుతూ పోతే చిత్రమయిన సంగతులు ఎదురవుతయి. ఈ ఎదురయ్యేవి వెదుర్లు, వెదుళ్లు మాత్రం
కాదు. వేంకటేశ్వరుని అందరు వెంకటేశ్వరుడు అంటరు. ఆయనకు పట్టింపు లేదు. ఎంకటేశ్వర
అన్నా కోపం రాదాయనకు. యంగటేస్పరా అన్నాసరే ఏమీ అనుకోడు. మరాఠీవారి సంగతి మరీ
విచిత్రం. వ్యంకట్రావ్,
వ్యంకటేశ్ అని రాస్తరు. సంస్కృతంతో సంబంధం లేదని అర్ధం. చాలా గొప్పవారు కూడా సంబంధం అన్నమాటను సమ్మంధం, సమంధం, సమ్మందం అని
పలకగా విన్నాను. గౌతులచ్చన్నగారని ఒక నాయకుడు, ఇప్పటివారికి తెలియదు.
బెమ్మానందంరెడ్డి అనేవారు. అదేమిటని అడిగిన వారిని ‘ఆయనకు లేని అనుమానం నీకెందుకు’
అని కూడా అన్నరు. తిరిగి మరోసారి రేడియోలోకి వస్తే (ప్రసారంలో కాదు గానీ) ఒకాయన
‘అనవసరంగారు వెధవ రిపోర్టు తెమ్మన్నారండీ!’ అన్నరట. విషయమేమిటో ఎవరికయినా తోచినదా? రేడియోలో
అనౌన్సరుగారలు ఉందురు. ప్రజలకు వారు మాత్రమే తెలియుదురు. రేడియో స్టేషన్ చూడబోయే
వారంత, తమ అభిమాన
అనౌన్సర్లని చూడాలని ప్రయత్నింతురు. ఇంతయినా, ఆయన కెవరికో గౌరవంగానే అనౌన్సరుగారు, అనవసరంగా కనిపించారు.
వారి పేరు అనవసరం. వారు అవసరమే! ఇంతకూ వెధవ రిపోర్టేమిటి. అది వెదర్ (వాతావరణ)
రిపోర్టుకు పట్టిన గతి లెండి!
వెంఢాకాలం: వేంకటేశ్వరులంత వారని పట్టుకుని ఎంగటేసనో, వ్యంకటేశనో అంటే
తప్పుగదా! అట్లాంటివారు మరి, అనాడీల కింద లెక్కవుతరు గదా! (అనాడీలనగా ఏమీ తెలియని
అమాయకులు అంతే గానీ, నాడిలేని
వారు మాత్రం కారు) కనుక ఒక పెద్దాయన ఎస్టర్ (యెస్టర్)డేని మార్చి వెస్టర్‌డే
అన్నారు. మరొకాయన ఇస్త్రీని విస్త్రీ అన్నారు. (అవునండీ, ఇంతకు తెలుంగులో ఈ
ఇస్త్రీని ఏమంటరు. చలవమడతలని ఒక మాట వినిపించేది. కానీ, ఇది వేడి (ఏడి)కాదు
మడత గదా! ఉర్దూలో ఒత్తుల సమస్య చిత్రంగ ఉంటుంది. సికిందర్ అని రాయాలంటే ఆ మాటకు
ముందు ఒక ‘అ’కారాన్ని రాస్తరు. ఎందుకు రాసిందీ, తెలియని వారు ఇస్కందర్ అని
పలుకుతరు. స్కూల్ అన్న మాటను, స్టేషన్ అన్న పదాన్నీ (అనిన, అన్న) రాసి సకూల్, సటేషన్ అనరు.
ఇస్టేషన్, ఇస్కూల్
అంటరు.
బాగా మాట్లాడుతున్నమనుకుని మనవాళ్లు కొందరు శవం అన్న మాటను
‘శ్రవం’ అంటారు. అట్లాగే ఎండకాలం పోయి వెంఢాకాలమవుతుంది.
రెండు, రొండవుతుందని తెలుసా మీకు. కన్యా శుల్కంలో అప్పారావుగారు, ఒక పాత్రచేత
ప్రయత్నంగ ‘రొండు’ అని పలికించినరు. ఆ రకంగా వారు పాత్రల మధ్య తేడా చూపించినరు.
మనమేమో తేడా తెలియక రెండు,
రొండు ఒకటే ననుకుంటున్నాము. ఒకాయన ఏకంగా ‘రొండు చింతలు’ అన్నడు.అది రెంటచింతల
అనే ఊరి పేరని నాకు తరువాత అర్థమయింది.
పెద్దగా ఉరిమితే మనవాండ్లు అర్జునుని పేర్లు తలుచుకునేవారు.
మా ఊళ్లో, ఊరిలో ఒక
ముసలమ్మ ‘అర్జున, బీమ, ఆకేశవేని, భూతల్లి, దడదడ, గుడగుడ’ అని ఏదో
చదివేది.
పట్టమహిషి: ‘మిరపకాయ కొరికి చూస్తే చుర్రే చుర్రే, దున్నపోతును గన్న
తల్లి, బర్రే
బర్రే’ అని పల్లెపాట ఒగటి,
ఒకటి ఉన్నదట. బర్రె అనే మాట, అందరికీ తెలిసినది కాకుంటే ఆశ్చర్యం లేదు. కొందరు దానిని
గేదె అంటరు. మరికొందరు ఎనుము అంటరు. ఈ ఎనుమలలో కొన్ని ఆ నలుపులోనే తెలుపుచాయలో
ఉంటయి. వాటి వెంట్రుకలు కూడ తెల్లగ ఉండడం చూచిన గుర్తు నాకుంది. తెల్లని ఆవు, అసలు సిసలు తెలుపు రంగు
ఉంటుంది. తెల్లబర్రె మాత్రం ఆ నలుపులోననే ఒక తెలుపు. దాన్ని మా ప్రాంతంలో
‘పల్లబర్రె’ అనేవారు. ఇప్పటికీ అంటనే ఉంటరు. బర్రెలకు, ఆవులకు దూడలు ఉంటయి.
‘దూడమ్మా, దూడా’ అని
కూడా జానపద గీతం ఉంది. స్త్రీల పాటలలో ఆవుదూడ, పులి గురించినది చాలా ఆర్తిని
కలిగించే పాట. ‘కాటుక కన్నులా గంగ్యావు కోడె, మీయమ్మను మేము పొడగాన లేదు’ అని
మావాళ్లు పాడడం నాకింకా గుర్తుంది. తెల్లని ఆవుదూడకు కళ్లు నల్లగ ఉంటే, నిజంగా కాటుక
పెట్టినట్టు ఉంటుంది. మా ఇంట్లో పుట్టిన ఇటువంటి దూడ, కోడె దూడయి, ఎద్దయి మా మధ్యన, ఇంట్లో మనిషిగ పెరిగి,
పోయింది. దాని పేరు గుమ్మడి. నాన్నగారుంటే, వాని పేరు అని సరిదిద్ది ఉండేవారు!
అంత ప్రేమ ఆయనకు గుమ్మడి మీద. గుమ్మడి సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత మేమెవరము
కనిపించకపోతే నేరుగ వంటింట్లోదాక వచ్చేది.
విషయం మరెక్కడికో వెళ్లిపోయింది గానీ, దూడను కొంతమంది
‘దుడ్డె’ అని అంటరు. బిడ్డను బిడ్డె అని పలికిన వారిని చూచిన, విన్న. బిడ్డలు అనే
మాటను ‘బిడ్లు’ అంటరని పుట్టపర్తివారు వ్యాసంలో రాసినరు.
ఇంతకూ నేను అడగదలచుకున్న ప్రశ్న అట్లనే ఉండిపోయింది. యముని
మహిషపు లోహ ఘంటలు అంటరు సిరిసిరి అనగా శ్రీశ్రీగారు. అంత ఎమ్ ధర్మరాజు వారి వాహనం
గదా? బంగారపు
గంటలెందుకు లేవో? మహిషమనగా
బర్రె, గేదె, ఎనుము (తప్పు!)
పుంలింగమయితే దున్న, దున్నపోతు
గద! మహిషియనగా బర్రె, గేదె, ఎనుము. రాజుగారి
భార్యను పట్టమహిషి అంటరెందుకని(?)
ఇంద్రునికి వృషభముతో పోలిక చెప్పిన సందర్భాలున్నయి. వేదంలో కూడా ఈ రకమయిన పోలికలు చెప్పినరు. గొప్ప కవులను కవివృషభులు అనడము విన్నము. కనీసం చదివినము. రాజుగారిని సింహంతోనో, ఎద్దుతోనో పోల్చి చూపిస్తరు.
అందుకే పట్టమహిషి అనడం వెనక మరేదో సంస్కృతం కిటుకు ఉండి ఉంటుందని నాకు తీవ్రమైన అనుమానం! అంతేగానీ అర్ధంలేని జోక్ వేసి, అనర్థం చేయడం నా ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని మనవి!
సింహము, సింగమవుతుంది. టామిల్ అనగా తమిళంలో చింగం కూడా అవుతుంది.
(జానీ లీవర్ అనే హాస్యనటుడు చ్యూయింగ్ గమ్‌ను చింగం అన్నాడు. హాస్యానికని అన్నాసరే, అది అంటుకుంటుంది!)
యశోదై యిలైచ్చింగం అని బాలకృష్ణుని వర్ణించింది గోదామాత. సింహి, అనే మాట ఉందా? సింగానికి మాత్రం
సింగి ఉంది. సింగమ్మ అన్నది తెలిసిన పేరు. శివంగి అనే మాట ఎట్లా వచ్చింది? మరి శివాంగి అంటే
ఎవరు. శివునియందు సగమయిన పార్వతి, శివాంగియయి ఉండవలె. శివాన్విత అన్న పేరు ఒకటి గుర్తుంది.
శివంగి సంగతి మీకంతా తెలుసా? మగసింహం వేటకు పోదు. శివంగి మాత్రమే
పోతుంది. ఆయమ్మ కొట్టుక తెచ్చిన తిండిని సింహరాజు తిని పడుకుంటడు. ఆ రాజుకు ఒకే
శివంగి కాక కావలసినన్ని శివంగులు ఉంటాయి. అదొక దర్జా. అందులో తిండి వెసులుబాటు
కూడా ఉందన్నమాట.
భాష,
బాస (బహాసా) విచిత్రమయినది. ఆసక్తి కరమయినది కూడ!
నల్లని దున్నను కారెనుము, కారుదున్న అనడం ఉంది. ఇంకా దూడను
వేయని బర్రెను ‘పడ్డ’ అంటము మా ప్రాంతంలో. లేత బర్రెపాలు అంటే ఈని, అనగా దూడను కని
ఎక్కువ కాలం కాని బర్రెపాలు. ఆ పాలలో దూడ కొరకు రకరకాల ప్రత్యేక రసాయనాలు ఉంటయి.
కనుక అవి కాచితే గడ్డ కడతయి. జున్నుపాలు అను పేరుతో దానిని తింటము. ఆ పాలు తాగినా, తిన్నా వాతం
చేస్తుందనే వారు. అంటే ఆ పాలలో మనకు పడని ప్రొటీన్లు ఏవో వుండి, శరీరంలో మార్పులకు
కారణ మవుతాయని నాకు అర్ధమయింది. ఈ పరిస్థితి నాలుగు దినాలు సాగుతుంది. ఆ తరువాత
పాలు కాచినా గడ్డ కట్టవు. కానీ వాటిలో జిగురు మాత్రం ఎక్కువ ఉంటుంది. వాటి రుచి
కూడా వేరుగ ఉంటుంది. రెండు మూడు నెలల తరువాత పాలు మామూలవుతయి.
బర్రె తిన్న తిండి, తాగిన కుడితి కారణంగా పాల రుచి
మారుతుందంటే కొంతమందికి అర్ధం కాకపోవచ్చు. కుడితి, తవుడు తిన్న బర్రె పాలు, పెరుగులో కొంత పులుపు
ఉంటుంది. పత్తి గింజలు తిన్న బర్రె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డితో కూడ
పాలలో తేడా వస్తుంది. ఆ పాలతో చేసిన పెరుగులో కూడా రుచి తేడా తెలుస్తుంది.
ఇదం,
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని లేకుండ, రైతుల ఇండ్లలో అందరికీ తెలిసిన
విజ్ఞానం. పాలు పాకెట్లనుంచి, మెషీన్‌నుంచి వస్తయనుకునే వారికి ఇవేం అర్ధమవుతయి?
Wednesday, March 18, 2026
మగునీ ఎద్దుల బండి ఒరియా మూలం - గోదావరీష్ మొహపాత్ర అనువాదం - కె. బి. గోపాలం
మగునీ ఎద్దుల బండి
ఒరియా మూలం - గోదావరీష్ మొహపాత్ర
అనువాదం - కె. బి. గోపాలం
జననాలు, మరణాలు: రెండు లక్షల జనాభా
ఉన్న ఖాలీకోట్ లో తప్పనిసరిగా ఈ రెండు ఉండనే ఉన్నాయి. అయితే వాటి సమాచారం మాత్రం
కుటుంబాలు, పరిసరాల పరిధిని దాటి ఎన్నడూ ప్రయాణించింది లేదు. కానీ, మగునీ చనిపోయిననాడు
మాత్రం వార్త ఊరంతా వ్యాపించింది, మరింత దూరం కూడా పోయింది. విన్న వారంతా, కాసేపు మ్లానంగా
ఉండిపోయి, అయితే బీద వెధవ పోయాడన్నమాట! ఎంత అన్యాయం! అంటూ ఆశ్చర్యం
వెలిబుచ్చారు.
ఇంతకు ఎవరా మగునీ? ఖాలీకోట్ మహారాజా? లేక మరో పక్కరాజ్యం ప్రభువా? పరిపాలన యంత్రాంగంలో ప్రధాన అధికారియా? బాగా పన్నులు కట్టే ధనవంతుడా? లేక అప్పులు ఇచ్చే షావుకారా? స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న సత్యాగ్రహ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడా? వెర్రిగా వచ్చే జనాలను ప్రభావితం చేస్తూ గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చాడా? కాదంటే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అందరికన్నా ముందు ఉండేటట్టు ఎంపికయ్యే ప్రధాన పౌరుడా? ఎవరతను? టౌన్ లోని వాళ్లంతా, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల అడవికి దగ్గరగా ఉండేదూరం పల్లెలవారు కూడా అతగాడిని ఎరిగినవారే!
మగునీ అసలు ముఖ్యమైన మనిషి కానేకాడు. అతను చేసిందల్లా బతుకు గడవడం కోసం ఒక ఎద్దుల బండిని నడిపించడం మాత్రమే. బతుకంతా కష్టపడ్డాడు. అదేదో దేశంకోసం, దేశం జనాలకోసం మాత్రం కాదు. కేవలం తనకోసం తాను కష్టపడ్డాడు. తన బతుకుదెరువు కోసం కష్టపడ్డాడు. అయితే ఉన్న ఆ రెండు ఎద్దులతో అతను ఏర్పరచుకున్న బంధంమాత్రం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
ప్రతినిత్యం మగునీ తన బండితో రైల్వే స్టేషన్ కు వెళ్లి తీరుతాడు. అదేదో సూర్యుడు ఉదయించి సాయంత్రం టౌన్ కోటమీద అస్తమించినంత క్రమంగా వెళ్లి తీరుతాడు. గడియారంలాగా పని చేస్తాడు అని ప్రజలందరూ అనేవారు. వానకాలం నెలలలో, సూర్యుడు మబ్బుల చాటున దాగి ఉన్నప్పుడు, అతని రావడం పోవడంతో అందరికీ సమయం తెలిసేది. రుతువులు క్రమంగా రాకపోవచ్చు, వర్షాలు ఆలస్యం కావచ్చు, వేసవి మరీ వేడిగా లేకపోవచ్చు, మగునీ బండి గడగడలాడుతూ దారివెంట నడవకుండా ఒక రోజు కూడా గడవలేదు. శీతకాలపు మరీ చల్లని ఉదయాలలో కూడా అందరూ దుప్పట్లు చుట్టుకుని వరండాలలో కూర్చుని ఉంటే, మగునీ తన బండిని మాత్రం కొండల కింద పాములా మెలిదిరిగిన దారి వెంట, పెదాల మీద పాటతో సహా నడిపించడం తప్పదు.
ఖాలీకోట్ ప్రభువుగారి దగ్గర రెండు కార్లు ఉంటే మాత్రమే ఏమిటి? అంటూ, అతను ఒక్కొక్కసారి సరదాగా అనేవాడు. ఆయన దగ్గర తనవంటి డ్రైవర్ ఉన్నాడా? అని అడిగేవాడు. అతని ఎద్దులబండి కారులన్నింటికన్నా గొప్పది. కాలియా, కాసరాలను వాటి వెనుక భాగాన నెమ్మదిగా తట్టి ఇంజన్ ను హుషారు చేస్తే చాలు. బండి సాగుతుంది. దానితోపాటు ముక్కలు ముక్కలుగా పాట సాగుతుంది. అందరికీ తెలిసిన రామకథ అది. రాముడు, లక్ష్మణుడు మాయలేడి వెంటపడి మహ పరుగెత్తారు, అంటూ సాగుతుంది పాట. ఇక ఎద్దులు ఎగురుతున్నట్టే ముందుకు సాగుతాయి. పాట కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. పక్షులు జంతువులను మేలుకొలుపుతుంది. అడవి కోళ్ళు అరుస్తాయి. ఊర కుక్కలు మొరుగుతాయి. బండి అలా ముందుకు సాగుతుంది.
టౌన్ లో పైనుంచి కింద దాకా, ఇటుపక్క నుంచి అటుపక్కదాకా, ఇంకా వెలుపలి ప్రాంతాల్లో కూడా, తన నోటి నుండి అంతులేని ప్రవాహంలాగా బతుకు కథలతో మగునీ అందరినీ పట్టి వేస్తాడు. తల్లిదండ్రులు ఎంతో బుజ్జగించి ప్రేమగా పెంచారు. అతని చిన్నతనం హాయిగా సాగింది. పడుకునేందుకు పరుపు, కడుపునిండా తిండి, అసలు ఏ పని చేసే అవసరం లేకపోవడం, అది పద్ధతి. తల్లీ, తండ్రీ పోయిన తర్వాత కూడా అతని బతుకు బాగానే సాగింది. పెరిగి పెద్దవాడయ్యాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మాటలు ఆమె పెదవుల లాగే తీపి. ఆమె ఊపిరి అసలైన సుగంధం. ఆమె నడిచిన చోట పూలు పూసేవి. బ్రతుకు కలలాగా సాగింది. ఆనందం, సంతోషాలు వెల్లి విరిశాయి. అయితే అది చాలాకాలం కొనసాగలేదు. అతని భార్య చిన్న వయసులోనే మరో లోకానికి వెళ్లిపోయింది. తన రోజులు ముగిసిన తరువాత తాను కూడా వెళ్లి ఆమెను కలుస్తాను, అని అతను అనుకునేవాడు.
ఈ విషయాలన్నీ అతను గంభీరంగా పాడుతూ, చెపుతూ ఉంటే అందరి కళ్ళు చెమర్చేవి. అతని కళ్ళు కూడా చెమర్చేవి. ఎవరికంటా పడకుండా కన్నీళ్లు తుడుచుకుని, అతను మాటమార్చి మరో సంగతి ఎత్తుకుంటాడు. ప్రయాణం ముగుస్తుంది. కథలు మాత్రం ముగియవు. ఖాలీకోట్ మహారాజు ఒక్కరు తప్పితే అందరూ మగునీ బండి ఎక్కినవారే. దీవాన్ గారి నుంచి మేనేజర్ దాకా, లాయర్ గారు, మార్వాడీ సేఠ్ నుండి మరి మహాత్మా గాంధీ అనయాయుల దాకా, ఒకసారి కాకపోతే మరోసారి అతని బండి ఎక్కినవారే. ఆ బండి ఎన్నింటినో చూచింది. చిన్న వయసులోనే మొగుణ్ణి పోగొట్టుకున్న ఆడకూతుర్లు అత్తారింటి నుంచి తల్లి గారి ఇంటికి తిరిగి రావడం, సంతోషంగా, చక్కనైన పెళ్ళికూతుళ్లు పుట్టినింటినుంచి మొగుడి ఇంటికి వెళ్లడం, మండల్ గ్రామంలోని గదా రౌల్, పన్నులు కట్టనందుకు బందిఖానాలో పడడం, ప్రపంచంలో అతనికి మిగిలిన వస్తువులన్నీ, చివరికి చీపురుదాకా ఈ బండిలోనే ప్రభువుగారి దర్బారుకు తరలింపబడడం, బెండాలియా వాసి మధూ రథ్ చెరసాలకు పంపబడడం, వాదించిన లాయర్లు, చేతులకు బేడీలు వేసిన పల్లెకారు నాయకులు ముఖాల మీద చిరునవ్వుతో అరెస్టు కావడం. మగునీ బండి ఎన్నెన్నో చూచింది. దుఃఖాన్ని చూచింది, సంతోషాన్ని చూచింది. ధారలుగా కారిన కన్నీళ్లు, గడ్డిమెత్తలను తడిపాయి. ఆనందంగా కొట్టిన కేరింతలు అదే విధంగా, బండి మంచె కట్టిన గడకర్రలను దడదడలాడించాయి. కనుక మగునీ మాట్లాడుతున్నాడు, అంటే అదొక చరిత్ర. అందులో ఆ టౌను కథలన్నీ వినిపిస్తాయి. అతను కథలలో ఎంతో హుషారును కలగలుపుతాడు. చివరకు ఎద్దులు వింటూవింటూ నెమ్మది ఆగిపోతాయి. నా కథలను ఇవి ఎలా వింటున్నాయో చూడండి, అంటాడతను. హాయిగా నవ్వుతాడు. ఆ ఎద్దుల మీద ఏనాడూ కర్రను ప్రయోగించింది లేదు.
అటుయిటు తిరగడానికి అందరికీ మరొక ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తున్నదని మగునీకి తెలిసేరోజు ఒకటి వచ్చింది. దారి మీదకు సింగ్ కుటుంబం వారు బస్సును ఒకదాన్ని తెస్తున్నారని తెలిసింది. అతను మాత్రం గలగలా నవ్వేశాడు. సుఖంగా తిని పెరుగుతున్న తన ఎద్దుల జంటకు పోటీగా ఒక బస్సు వస్తుందా? ఆ దిక్కుమాలిన బస్సు పేరున అందరూ తన బండిని వదిలిపెడతారా?
అందరూ అతగాడిని చూసి నవ్వారు. అతను మాత్రం అలాగే ఉండిపోయాడు.
నాలుగు నాళ్ళు పోయిన తర్వాత రాక్షసిలాంటి ఒక బస్సు రోడ్డు
మీదకు రానే వచ్చింది. మగునీ పని ముగిసింది, అన్నారు ఊరివాళ్లు. వాడి వ్యాపారం మడత
పడుతుంది. ఇరవయి మందిని గంటకు నలభయి మైళ్ళ వేగంతో తీసుకువెళ్లే బస్సుతో ఒక
ఎద్దులబండి ఎట్లా సమానంగా పోటీ పడుతుంది? అన్నారు.
మగునీ గుండె దిగజారింది. వాడికి భయం పట్టుకుంది. వాడు కిందపడి ఏడవడం మాత్రం మొదలు పెట్టలేదు, నిజమే. కానీ కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. కొడోలాలో పెద్ద సభ జరుగుతుండగా తాను పక్కగా వెళ్లడం గుర్తుకు వచ్చింది. మనిషి చేతులకు మరయంత్రాలు సాటిరావని అక్కడ ఒక పెద్దమనిషి గట్టిగా చెబుతున్నాడు. అదే గనుక నిజమైతే, తన ఎద్దుల బండి మోటార్ బస్సు కంటే గొప్పది కాదా? ఆ మీటింగుకు హాజరయి ఆ మాటలు విన్న వాళ్ళ అందరి దగ్గరకు వెళ్లి అభ్యర్థిస్తాను అనుకున్నాడు. వాళ్లంతా తనను పట్టించుకోకుండా ఉంటారా? వాళ్లుగానీ, ఆ పని చేస్తే, తాను నేరుగా వాళ్ళ నాయకుడు మహాత్మా గాంధీ దగ్గరకు వెళ్లాలి అనుకున్నాడు. అతను బీదవారికి, భూమిమీది బడుగువారికి మహా మిత్రుడు అని అందరూ అనగా విన్నాడు. ఆయన కూడా మగునీని పంపించి వేస్తాడా? మగునీ నాశనమైతే, సింగ్ లు బాగుపడితే చూస్తూ ఊరుకుంటాడా?
మగునీ బండి నడిచే దారిమీదనే బస్ కూడా నడవసాగింది. ఒకరోజు తరువాత ఒక రోజు తరువాత ఒకరోజు బస్సు నిండుతున్నది. బండి ఖాళీగా ఉంటున్నది.
మగుని మధ్యరాత్రి లేచి, తన బండిని రైల్వే స్టేషన్ ముందర తెల్లవారక ముందే ఆపి ఉంచడానికి, బయలుదేరాడు. అయినా ప్యాసింజర్లు అందరూ బస్ కోసం కాచుకుని ఉన్నారు. అది తెల్లారిన తర్వాత ఎప్పుడో గాని రాలేదు.
బండిలోని గడ్డి పరుపులను తీసేసి, మగునీ జనపనార సీట్లను ఏర్పాటు చేశాడు. అయినా ప్రజలు బస్సు వేపే వెళ్లారు.
ఒక్కొక్కరిని చేతులు పట్టుకుని, బండి వద్దకు తెచ్చే ప్రయత్నం చేశాడు. అయినా అందరూ బస్సు వైపు వెళ్లారు.
రోజులు గడిచాయి, మరిన్ని రోజులు గడిచాయి.
మగునీకి సంగతి తెలిసిపోయింది. దినానికి రెండుసార్లు బదులు ఒకేసారి తినడం మొదలుపెట్టాడు.
మరి కొన్ని నాళ్ళు గడిచిన తర్వాత అతను భోజనం నుంచి గంజికి మారాడు.
ఇంకా కొన్ని నాలుగు గడిచాయి, గంజి రోజుకు ఒకసారి నుంచి రెండు రోజులకు ఒకసారికి మారింది.
మరెన్నో రోజులు గడిచాయి. చాలా రోజులపాటు అతని ఇంట్లో పొయ్యి వెలగలేదు. అసలు వండడానికి ఏమీ లేదు.
ఎద్దులు బక్క చిక్కిపోయాయి. వాటి ఎముకలు పొడుచుకు వచ్చాయి. మగునీ వాటి మెడలు వాటేసుకున్నాడు. ముగ్గురు కలిసి నిశ్శబ్దంగా కన్నీరు పెట్టుకున్నారు.
వాడి పని ముగిసింది, అన్నారు ఊరివారు. ఆకలి, దుఃఖంతో వాడు వెర్రెత్తిపోయాడు, అన్నారు.
మరికొంత కాలం గడిచింది.
ఒకానొక ఉదయాన జనం కలిసి మగునీ ఇంటి తలుపు పగలగొట్టవలసి వచ్చింది. అతని శరీరాన్ని బయటకు తెచ్చారు. చింకిచాపమీద అతని దేహం పడి ఉంది. చేతి కర్ర దానికిందే ఉంది.
అతని కోసం చితి పేర్చారు. నల్లని పొగ దట్టంగా ఆకాశంలోకి ఎగిసింది. ఆత్రంతో రెక్కలు తపతపలాడిస్తూ లెక్కలేనని పక్షులు అందులో ఎగిరాయి. వార్త ఊరంతా పాకింది. అక్కడి రెండులక్షల జనాభా వాపోయారు. పాపం బీద మగునీ పోయాడన్నమాట! ఎంతటి అన్యాయం? అన్నారు.
గోదావరీష్ మహాపాత్ర - ఒరియా(1899 – 1965) పద్నాలుగేళ్ల వయసులో మొదలైన సాహిత్యచరిత్రలో ఇతను 70 పుస్తకాలు వెలువరించాడు. కవిత, చిన్న కథ, నవల, హాస్య రచనలు, నాటికలు, బాల సాహిత్యం ఎన్నో రాశాడు. ము పాత్రికేయ రచనలు కూడా చేశాడు. ఒక సెటైరికల్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. మగునీ ఎద్దుల బండి అనే కథను చలనచిత్రంగా కూడా తీశారు. ఆ చిత్రానికి అవార్డు వచ్చింది.
Sunday, March 15, 2026
కాకి - సవర కథ
కాకి - సవర కథ
కాకి
ఒక కాకి నెమలి (పిట్టల) చక్కని ఒళ్ళు చూచి, నేను “ఈ-లాగు అవుతాను” అని, రాలిపోయిన వెండ్రుకలు ఏరి, తన తోకలో తగిలించు-కొన్నది. “ఓహో! ఇప్పుడు నెమలిని
అయినాను చక్కని-దానను అయినాను.” అని,
ఆలోచించు-కొని, నెమలి-పిట్టలతో (కలిసి ఉండ-వలెను అని)
నెమలి-పిట్టల-వద్దకు వెళ్ళినది.
నెమళ్లు కాకిని చూచి, దానిని పోల్చి, “ఛీ! ఆ కాకి మన-లాగు వేషము వేసు-కొని, ఆడుతూ వస్తున్నది! మనలను
వెక్కిరిస్తున్నది కాబోలు! సోమరి-పోతు!” అని తోలి-వేసి వెంట-బెట్టినవి.
కాకి చింతించి, “ఏమి చేతును! నా బంధువులతో
కలుసుకొంటాను” అని, వెళ్ళినది గాని, కాకులు ఒప్పు-కొన్నవి కావు. అవి
కోపము-పడి వెంట-పెట్టినవి. “నీవు మా కులము-దానవు కావు;” అన్నవి.
తరువాత కాకి విచారించి,
ఒంటిగా
ఒక మూల కూర్చుండి నెమలి-వెండ్రుకలు తీసి-వేసినది. అయినా దాని బంధువులు
ఒప్పు-కొన్నవి కావు. అందు-చేత ఈ కాకి (జాతి చెడ్డది) అయినది.
ఏమిటి దీని భావము? గొప్ప-వాడి-లాగున బట్టలు
కట్టు-కొంటే గొప్ప-వాడు అవుతాడా?
అందరూ
మనుషులు ఛీ! అంటారు. నెమలి-కుచ్చు తగిలించు-కొంటే కాకి నెమలి అవుతుందా?
Friday, March 13, 2026
గ్లాస్ - యసునారి కవాబాటా జపనీస్ కథకు నా తెలుగు అనువాదం
గ్లాస్ - యసునారి కవాబాటా
జపనీస్ కథకు
నా తెలుగు అనువాదం
I
అతని
పదిహేనేళ్ల భార్య యోకో బుగ్గలు పాలిపోయి ఇంటికి వచ్చింది. తల నొప్పిగా ఉంది, ఒక ఘోరం చూచాను’ అన్నది.
సాకే
సీసాలు తయారుచేసే గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్ రక్తం కక్కుకున్నాడు. ఒళ్లు
కాల్చుకున్నాడు. ఆమె అదంతా జరుగు తుండగా చూచింది.
వాళ్లాయనకు
గ్లాస్ ఫ్యాక్టరీ గురించి తెలుసు. అక్కడంతా వేడితో పని. సంవత్సరమంతా కిటికీలు
తీసే ఉంటాయి. కిటికీ దగ్గర ఇద్దరు ముగ్గురు బయటవాళ్లు నిలబడి చూస్తూ ఉంటారు. ఆ
పక్కన ఉండే కాలువలో ప్రవాహముండదు. దానిమీద నూనె మెరుస్తూ ఉంటుంది. అది మురుగుకాలువ
లాంటిది.
ఫ్యాక్టరీలో
తేమగా ఉంటుంది. లోపలికి ఎండ తగలదు. పనివాళ్లు పొడుగాటి పోల్స్ చివరన అగ్గి
బంతులతో ఆడుతుంటారు. వాళ్ల చొక్కాలనుంచి, ముఖాలనుంచి మాదిరే, చెమట ఓడుతూ ఉంటుంది.
వాళ్ల చొక్కాలు కూడా ముఖాలలాగే మకిలిగా ఉంటాయి. పోల్ చివరన ఉన్న అగ్గి ముద్ద,
చూస్తుండగానే సీసా ఆకారానికి మారుతుంది. వాళ్లు దాన్ని నీళ్లలో పెడతారు. కాసేపు
తరువాత బయటకు తీస్తారు. ఒక్క ఊపుతో విరిచి పక్కన పెడతారు. గూనిగా ఉన్న ఒక
కుర్రవెధవ పటకారుతో వాటిని పట్టుకుంటాడు. ఫినిషింగ్ ఫర్నేస్‌కు చేరుస్తాడు. పది
నిమిషాలలోగా కిటికీ పక్కన నిలబడి చూచే వాళ్లకు తల బరువెక్కు తుంది. గాజు
ముక్కమాదిరే గట్టి పడుతుంది.
యోకో
చూస్తూ ఉండగానే సీసాలు మోస్తున్న కుర్రవాడు రక్తం కక్కి అలసటతో పడిపోయాడు. అప్పుడే
ఎగురుతున్న ఒక
అగ్గిముద్ద
వాడి భుజానికి తగిలింది. రక్తం కారుతున్న నోటిని తెరిచి వాడు అరిచాడు. ఎగిరి లేచి
చుట్టూ పరిగెత్తి మళ్లీ పడి పోయాడు.
‘జాగ్రత్త, మొద్దు భడవా!’
వాడి
భుజంమీద కొంచెం నీళ్లు పోశారు. కుర్రవాడు మూర్ఛపోయాడు.
II
‘ఆసుపత్రికి వెళ్లడానికి వాడి
దగ్గర డబ్బుల్లేవు. నేను వెళ్లి చూస్తాను’ అన్నది భార్య.
‘తప్పకుండా వెళ్లాలి, కానీ అలాంటి వాళ్లు ఎంతమందో’
‘బాగానే ఉంది, అయినా నాకు సంతోషమే.’
ఇరవయి
రోజులు గడిచాయి. కుర్రపనివాడు ఆమెకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడు. ‘చిన్న
అమ్మాయిగారి’తో మాట్లాడాల న్నాడు. యోకో బయటకు వచ్చింది. కుర్రవాడు తోటలో నిలబడి
ఉన్నాడు. ఆమె కనిపించగానే, ద్వారం పట్టుకుని తలవంచి
నమస్కరించాడు.
‘ఇప్పుడు కాస్త బాగుందా?’
‘ఏమిటి?’ కుర్రవాడు ఉలిక్కిపడ్డాడు. యోకో ఏడుస్తుందేమో అనిపించింది.
‘నీ గాయాలు నయమయ్యాయా?’
‘అవును’ కుర్రవాడు చొక్కా
గుండీలు తీయడం మొదలుపెట్టాడు.
‘అదేమీ అవసరం లేదు...’
యోకో
లోపలికి పరుగుగా వచ్చింది. భర్తతో ఏదో అనబోయింది. ఆయన కొంత డబ్బు ఇచ్చాడు. ‘ఇది
వాడికివ్వు’ అన్నాడు.
‘నేను వెళ్లను, పనమ్మాయిని పంపించండి’
III
పది
సంవత్సరాల తరువాత ...
అతను
ఒక సాహిత్య పత్రికలో ‘గ్లాస్’ అనే కథ చదివాడు. అందులో తమ పరిసరాల వర్ణన ఉంది.
ప్రవహించని ఒక నది ఉంది. దానిమీద మెరిసే నూనె ఉంది. ఇక అగ్గిగోళాలు ఎగిరే నరకం
ఉంది. కక్కిన రక్తం ఉంది, కాలడం ఉంది. మధ్యతరగతి అమ్మాయి
మన్నన కూడా ఉంది.
‘హే, యోకో, యోకో!’
‘ఏమిటది’
‘గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక
కుర్రవాడు మూర్ఛపోవడం చూచావ్. వాడికి డబ్బులిచ్చావు, కదూ? అది చాలాకాలం నాటి మాట’
‘అవునవును, అదే జరిగింది’
‘ఆ అబ్బాయి రచయిత అయ్యాడు. సంఘటన గురించి
రాశాడు’
‘ఏమిటి? నన్ను చూడనీ. ’
యోకో
పత్రికను లాక్కున్నది. కానీ అతను కూడా పైనుంచి చదువుతూ, కథను ఆమెకు చూపించడం తప్పుగా భావించసాగాడు.
అందులో
ఆ అబ్బాయి ఆ తరువాత ఒక ఫ్లవర్
వేజ్
ఫ్యాక్టరీకి మారినట్టు రాసి ఉంది. అక్కడ అతను రకరకాల రంగులు, నమూనాలలో డిజైన్‌లు తయారు చేసి గొప్ప పనితనం చూపించాడు.
అతని శరీరానికి, అంతకు ముందులాగ కష్టాలు లేవు.
తాను తయారు చేసిన అన్నిటికన్నా అందమయిన వేజ్‌ను ఆ అమ్మాయికి పంపించానని కూడా అక్కడ
ఉంది.
‘లేదు, నాలుగయిదు సంవత్సరాల పాటు ఆగకుండా నేను వేజ్‌లు తయారు
చేశాను. దానికంతా ఆ అమ్మాయే ప్రేరణ’ `
అక్కడ రాసిన
సంగతుల సారాంశం ఇది ` ‘నాలో సామాజిక వర్గాల గురించిన
జాగరూకత కలగడానికి కూలీగా నా అనుభవం కారణమా లేక మధ్యతరగతి అమ్మాయి పట్ల ప్రేమ
కారణమా? రక్తం కక్కుకోవడం అప్పట్లో చాలా
సాధారణం ` మొత్తం రక్తంకక్కి చచ్చినా
సాధారణమే. అది తరుముతున్న ఒక శత్రువు దీవెన. ఒక అవమానం. చాలాకాలం క్రితం ఒక యోధుని
కూతురు, పోయిన అతని కోటను, శత్రువు దయతో
సంపాదించింది. అయితే చివరికి ఆ కూతురు తన తండ్రిని చంపిన మనిషికి ఉంపుడుగత్తెగా
మారవలసి వచ్చింది. ఆమె నా బతుకును కాపాడడం ఆ అమ్మాయి అందించిన మొదటి దీవెన. కొత్త
ఉద్యోగం వెతకడానికి అవకాశం కల్పించడం రెండవ దీవెన. కానీ నా కొత్త ఉద్యోగం గురించి
ఆలోచించండి ` నేను ఏ వర్గం కొరకు వేజ్‌లు
తయారు చేస్తున్నానో, నేను నా శత్రువుకు
ఉంపుడుగత్తెనయ్యాను. ఆమె అంత అందంగా ఎందుకుందో తెలిసింది. నాకు దీవెనలు ఎందుకు
తెలిసింది. ఒకమనిషి సింహంలాగ నాలుగు కాళ్లమీద నడవలేనట్టే, నేను కూడా ఆ అమ్మాయి గురించిన కలను కడిగివేయలేను. ఆ అమ్మాయి
అందం నాశనమయినట్టు భావించాను. వర్గపోరాటంలో ముందు నిలిచినా, నేను ఒక గాజు పలకను
మాత్రమే. ఒకేఒక్క గాజు ముద్దను. అయినా ఈ కొత్తకాలంలో గాజును మోయనివారెవరు? ముందు మన శత్రువులు ఆ బరువును మోసేలా చూడాలి’ అలా సాగుతుంది
కథ.
కథ
చదివిన తరువాత యోకో ఏదో ఆలోచిస్తూ దూరాలకు చూడసాగింది. ‘వేజ్ ఏమయిందో’ అన్నది.
భార్య
ముఖంలో అటువంటి భావన అతను ఎప్పుడూ చూడలేదు. ‘అయినా అప్పటికి నేను చిన్నపాపను’
అతని
రంగు మారింది. ‘నిజమే, నీవు మరొక వర్గంతో పోరాడుతున్నా,
లేదా ఆ మరొక వర్గం స్థానంలోకి మారి నీతో నీవు పోరాడుతున్నా, అన్నిటికన్నా ముందు,
ఒక వ్యక్తిగా
త్వరలోనే నీవు నాశనం చేయబడతావని గుర్తించి తీరాలి.’
అది
సాధారణం. కథలోని అమ్మాయిలో అతనికి కనిపించిన అందం, తాజాతనం
ఇన్ని సంవత్సరాలలో ఒకసారి కూడా అతనికి తోచలేదు. మరి ఆ గూని, పాలిపోయిన ఆరోగ్యంలేని కుర్రవాడికి ఆ శక్తి ఎక్కడినుంచి
వచ్చింది?




